Saturday, June 9, 2018

చిత్రచిత్ర ప్రభావ దాక్షిణ్యభావ


చిత్రచిత్ర ప్రభావ దాక్షిణ్యభావ




సాహితీమిత్రులారా!


దూషణమే భూషణం అనే పేరున సాగిన
కాసుల పురుషోత్తమకవి
పరిచయం వివరణ ఇక్కడ చూడండి-

సీ.
ధర్మవిఘాత మిద్ధర నీ వొనర్చిన
మూడులోకంబులు మ్రోసె నపుడె
జనకుని కూతు నిచ్చను బెండ్లి యాడంగ
నరనాథకోటులు నవ్వి రపుడె
పుణ్యజనంబుల బోరి బాధింపంగ
సుర లద్భుతము నొంది చూచి రపుడె
సంతతాశ్రిత విభీషణు రాజు జేయంగ
నల రవీందులు సాక్షి నిలిచి రపుడె
తే.
మంచి నడవడి నడిచినా వెంచి చూడ
గీర్తి గల మూర్తివే యిట్టి వార్త లరయ
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ
హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!

శతకాలలో ఆంధ్రనాయక శతకానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీనిని రచించినది కాసుల పురుషోత్తమ కవి. ఇతను పద్ధెనిమదో శతాబ్దం చివరి కాలానికి చెందిన కవి. శతకాలలో భక్తి శతకాలది అగ్రస్థానం. ఆ శతకాలలో భక్తకవులు తమ ఇష్టదైవాన్ని కీర్తిస్తూ, భక్తి పారవశ్యాన్ని ప్రకటించే పద్యాలు కొన్నయితే, తమ గోడును వెళ్లబోసుకొనే పద్యాలు కొన్ని; పనిలో పనిగా సమాజంలో ఉన్న దుర్మార్గాన్ని ఈసడించే పద్యాలు మరికొన్ని. భక్తులకు భగవంతుడు చాలా దగ్గరివాడు, చెలిమికాడు. అతనితో పరాచకాలాడే పద్యాలు కూడా అక్కడక్కడా శతకాలలో కనిపిస్తాయి. అయితే, ‘కీర్తి నిందగ వర్ణించి గేలిపఱతు’ అని శపథం పూని, శతకం మొత్తాన్ని నిందాస్తుతితో నడిపించిన అరుదైన శతకం ఆంధ్రనాయక శతకం. దీనికి నాయకుడు శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు. రాయలవారికి కలలో కనిపించి ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని చెప్పి ఆముక్తమాల్యద కావ్యాన్ని తెలుగులో రచించమని కోరిన దేవుడు ఈయనే. ఈ శ్రీకాకుళం, కృష్ణాజిల్లా దివిసీమలో ఉన్న క్షేత్రం. సాతవాహనులకు పూర్వమే ఆ ప్రాంతాన్ని పాలించిన ఆంధ్ర వల్లభుడు అనే రాజు సాక్షాత్ విష్ణుమూర్తి అవతారంగా ఈ క్షేత్రంలో వెలిసాడు. ఇతనికే ఆంధ్ర నాయకుడు, ఆంధ్ర దేవుడు అని పేర్లు. విజయనగర రాజుల పాలన ముగిసిన తర్వాత కొంత కాలానికి ఈ క్షేత్రం తన ప్రాభవాన్ని కోల్పోయిందని, దాన్ని పునరుద్ధరించడానికి పురుషోత్తమ కవి ఈ శతకాన్ని రచించాడని, దాని ఫలితంగా ఆ ప్రాంతపు జమీందారు తిరిగి ఈ గుడిని పునరుద్ధరించారని అక్కడివారు చెప్పుకుంటారు. చిత్ర విచిత్రమైన ప్రభావం కలిగిన దేవుడని, దయగలవాడని, శత్రువులను (విమత జీవులు) సంహరించే వాడని ఆ ఆంధ్రదేవుని కీర్తించాడు పురుషోత్తమ కవి. ఒక వంక దయాస్వరూపుడై ఉండి, ఇంకొక వంక శత్రువులను సంహరించడమే అతని చిత్ర ప్రభావం!

నిందాస్తుతి అంటే పైకి తిడుతున్నట్టు, గేలి చేస్తున్నట్టు, కనిపిస్తూనే స్తుతి చేయడం. నిందాస్తుతిని సమర్థంగా నిర్వహించాలంటే కవికి మంచి చమత్కారం ఉండాలి, భాషపై గొప్ప పట్టు ఉండాలి. భాషపై పట్టు అంటే కేవలం పాండిత్యం కాదు, సజీవమైన వాడుక. మాట్లాడే భాషలో ఉండే కాకువు దీనికి ప్రధానమైన సాధనం. కోపం, వెటకారం, భయం మొదలైన భావాలు స్వరం ద్వారా ధ్వనించే శక్తిని కాకువు అంటారు. వెటకారం చేసినప్పుడు, మాటలో ఉన్న అర్థానికి వ్యతిరేకమైన అర్థం స్ఫురిస్తుంది. ఉదాహరణకి, ‘అబ్బో! అతను మహా గొప్ప దాత సుమీ’ అంటే, అతను పిల్లికి బిచ్చం కూడా వెయ్యని పిసినారి అని! నిందాస్తుతిలో అలా ఒక పక్క నింద, వెటకారమూ ధ్వనిస్తూనే, వాక్యానికున్న అసలు అర్థమే ప్రధానం అయి, అది స్తుతిగా మారుతుంది. ఉదాహరణకి, ‘వేఱె గతి లేక నిన్నుసేవింప వలసె!’ అన్న వాక్యంలో -ఇంకొక గతిలేక నిన్ను సేవిస్తున్నా కానీ నిజానికి నువ్వు దానికి తగిన వాడవు కావు- అనే నింద ధ్వనిస్తోంది. వాక్యానికున్న అర్థాన్ని యథాతథంగా గ్రహిస్తే, నువ్వు తప్ప భక్తులకి వేరే దిక్కులేదు. అందుకే నేను నిన్ను సేవించవలసి వచ్చింది అని కూడా భావించవచ్చు. అప్పుడది స్తుతి అవుతుంది. అలాగే, ఈ శతకంలోదే మరొక వాక్యం- ‘ఒకరికంటె గుణాధికు లొకరు మీరు! ఇంత చక్కన దెలిసె మీ యింటి వరుస.’ ఇందులోని అధిక్షేపం తెలుగువాళ్ళకు సుపరిచితమే. తెలుగునాట, ఒక కుటుంబంలోని వారినో, బంధువులనో, సరదాగా ఎత్తిపొడవడానికి ఇది ఒక జాతీయంగా ఏర్పడిపోయింది! కానీ శతకంలో ఇది కవి, విష్ణుమూర్తి కుటుంబం గురించి చెప్పిన మాట. నిజంగానే విష్ణుమూర్తి కుటుంబంలో ఒకరికన్నా ఒకరు గుణాధికులని కవి అంతరార్థం. అది నిందాస్తుతి.

నిందాస్తుతికి ఉపయోగపడే మరొక సాధనం శ్లేష. ఒకే పదానికి లేదా వాక్యానికి ఒకటికన్నా ఎక్కువ అర్థాలు ఉండడం శ్లేష. పై పద్యంలో నిందాస్తుతి కోసం శ్లేషని చక్కగా ఉపయోగించుకున్నాడు కవి. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఇది రాముని గురించి చెప్పిన పద్యం.

ధర్మవిఘాత మిద్ధర నీ వొనర్చిన మూడులోకంబులు మ్రోసె నపుడె

ఈ ధర – ఈ భూమ్మీద, ధర్మవిఘాతము – అంటే ధర్మానికి హాని కలిగించడం, నీవు ఒనర్చిన – నువ్వు చేస్తే, మూడు లోకంబులు మ్రోసె నపుడె – ముల్లోకాలూ గోల పెట్టాయి. రాముడు ధర్మానికి హాని చేస్తే ముల్లోకాలు గోల పెట్టాయని అర్థం! అది నింద. ధర్మం అంటే విల్లు అని కూడా అర్థం ఉంది. ధర్మవిఘాతం అంటే విల్లు విరవడం. రాముడు శివధనుస్సు విరిచినప్పుడు ఆ మ్రోత ముల్లోకాలలో వినిపించింది అని ఇంకో అర్థం. ఇది స్తుతి.

జనకుని కూతు నిచ్చను బెండ్లి యాడంగ నరనాథకోటులు నవ్వి రపుడె

జనకుడు అంటే తండ్రి. జనకుని కూతురు అక్కచెల్లెలు అవుతుంది. అలాంటి సోదరిని కోరికతో పెళ్లి చేసుకున్నావు. అది చూసి రాజులందరూ నవ్విపోయారు! ఇది నింద. జనకుని కూతురు అంటే జనక మహారాజు కూతురు. సీతను ప్రేమతో పెళ్లి చేసుకున్నావు. అది చూసి రాజులందరూ ఆనందించారు అని ఇంకొక అర్థం. ఇది స్తుతి.

పుణ్యజనంబుల బోరి బాధింపంగ సుర లద్భుతము నొంది చూచి రపుడె

పుణ్యాత్ములైన ప్రజలతో కలహించి వాళ్ళను బాధపెట్టావు. ఏమిటలా చేసావని దేవతలు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. ఇది నింద. రాముడేమిటి పుణ్యాత్ములను బాధించడం ఏమిటి? ఒక రకమైన రాక్షసజాతికి పుణ్యజనం అని పేరు. అలా పుణ్యజనం అంటే రాక్షసులు అనే అర్థం కూడా ఏర్పడింది. ఆ అర్థంలో, రాక్షసులను యుద్ధంలో బాధిస్తూ ఉంటే దాన్ని పైనుండి దేవతలు అద్భుతంగా తిలకించారు అని. ఇది స్తుతి.

సంతతాశ్రిత విభీషణు రాజు జేయంగ నల రవీందులు సాక్షి నిలిచి రపుడె

ఆశ్రితుడు అంటే సేవకుడు. విభీషణుడు అంటే భయంకరమైన వాడు. ఒక భయంకరమైన వాడిని, పైగా నిత్య సేవకుడిని నువ్వు రాజుని చేసావు. ఈ దుర్మార్గపు పనికి రవి చంద్రులిద్దరూ సాక్షి! ఇది నింద. నిరంతరం తనను ఆశ్రయించిన విభీషణుని రవిచంద్రుల సాక్షిగా లంకకు రాజుని చేసాడు రాముడు. ఇది స్తుతి.

మంచి నడవడి నడిచినా వెంచి చూడ
గీర్తి గల మూర్తివే యిట్టి వార్త లరయ

మంచి నడవడి నడిచావు నువ్వు! ఇల్లాంటి వార్తలు వింటే నువ్వు ఎంత కీర్తిగల మూర్తివో తెలుస్తూనే ఉంది! ఇది పూర్తిగా కాకువు. మామూలుగా వెటకారం ధ్వనించే ఈ మాటలు రాముని విషయంలో (కవి దృష్టిలో) యథార్థాలు.

ద్వంద్వార్థాలు లేకుండా సూటిగా అధిక్షేపిస్తూ, ఆ తిట్లనే పొగడ్తలుగా భావించమని దబాయించడం కూడా నిందాస్తుతిలో భాగమే! ఇదిగో ఈ పద్యం దానికి మంచి ఉదాహరణ:

ఒక పినతల్లి మే లోర్వలే కనిచిన
విపినంబులకు బోవు వెఱ్ఱి గలడె?
తండ్రి మృతుండైన దనరాజ్య మత్తఱి
నేల రాకుండిన బేల గలడె?
యనుజుండు వల దన నాలిమాటలు విని
చెడుగిఱ్ఱి బట్ట బో వెడఁగు గలడె?
పరదేశమున నుండి బలవద్విరోధంబు
బలిపించుకొన్న వెంగలియు గలఁడె?
నీవు సేసిన పను లిట్టి నేరుపరివె
జగదుపద్రవ మెట్లు పో జఱచినావొ?
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ
హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!

తన మంచిని ఓర్వలేక పినతల్లి ఏదో కోరుకున్నంత మాత్రాన తగుదునమ్మా అని అడవులకు వెళ్లిన వెఱ్ఱివాడు. తండ్రి పోయాక తనకు సొంతమయిన రాజ్యాన్ని ఏలుకోని బేల. తమ్ముడు వద్దంటున్నా వినక, పెళ్ళాం మాటలు విని, మాయలేడిని (చెడుగు + ఇఱ్ఱి) పట్టుకోడానికి పోయిన మూర్ఖుడు (వెడగు). దేశం కానీ దేశంలో శత్రుత్వాన్ని కోరి తెచ్చుకున్న వెంగలివాడు. ఇవీ రామునికి కవి ఇచ్చిన బిరుదులు!

విష్ణుమూర్తికి ఇలాంటి బిరుదులు శతకమంతటా ఎన్నో సత్కరించాడు కవి. ఇంతలా నిందిస్తూనే- ‘కోరి దాసులు నిన్నెంత దూరుచున్న, పంత మున్నదె నీ కిసుమంత యైన?’ అని కూడా అంటాడు. భక్తులైన దాసులు ఎంత నిందించినా ఆ దేవునికి ఏమాత్రం పౌరుషం లేదట! ఈ కవికి ఆ తెలుగు దేవునితో ఉన్న చనువు అలాంటిది! ఒకప్పుడు తెలుగువాళ్ళ ఇళ్లలో నోళ్ళలో బాగా నానిన పద్యాలివి. అచ్చమైన తెలుగు పద్యాలలో అధిక్షేపాన్ని, వ్యంగ్యాన్ని ఎలా పండించాలో తెలుసుకోవాలంటే ఈ శతకాన్ని తప్పక చదవాలి.

అసలీ ఎదుటివారిలో తప్పులు వెదకడం అనేది ఎలా ఎందుకు ఏర్పడిందో కాని, అది మనిషికి ఒక సహజ లక్షణం అయి కూర్చుంది. పైగా, గొప్పవారిగా ప్రసిద్ధి చెందిన వాళ్లలోనే తప్పులు వెదకబుద్ధి వెయ్యడం, చెడ్డవారిగా ముద్రపడ్డ వారిని గొప్పగా ఊహించడం, ఇంకా విచిత్రమైన విపరీతమైన లక్షణం. అది మనకీ కాలంలో ప్రత్యక్షంగా కనిపిస్తున్న విషయమే. అలాంటి వైచిత్రి కవులలో కలిగినప్పుడు, ఇలాంటి వక్రోక్తిగా ప్రతిఫలిస్తుంది. అది ఒక చమత్కారం! ఈ చమత్కృతికి ఆదిశంకరులే అతీతులు కారంటే, ఇక సామాన్యుల మాట చెప్పాలా! శివానందలహరిలో శివునితో అతను చేసే పరాచికం ఇలా ఉంటుంది- ‘ఓ ఈశ్వరా! నీకు నమస్కార స్తోత్రాదులకన్నా వింటి దెబ్బలు, రోకటి పోట్లు, రాళ్ళ దెబ్బలే ఇష్టం కాబోలు. అదేదో చెప్పు, నేను కూడా అలాగే నిన్ను సేవించుకుంటాను.’

తమాషా ఏమిటంటే, ఈ నిందాస్తుతి ఎప్పుడూ దేవుని గురించే. రాజులను స్తుతించడంలో కవులెవరూ, ఎక్కడో తప్ప, దీన్ని ప్రయోగించినట్టు లేదు. రాజులతో అలాంటి పరిహాసాలు చేస్తే తమ తలలెగిరిపోవూ. అందరికీ తేరగా దొరికేది ఆ పరమాత్ముడొక్కడే!
-------------------------------------------------------
రచన: భైరవభట్ల కామేశ్వరరావు,
ఈమాట అంతర్జాల మాసపత్రిక సౌజన్యంతో

No comments:

Post a Comment