మహారాజుగారి రయిలుబండి(అనువాదకథ)
సాహితీమిత్రులారా!
అనుకోకుండా జరిగిందది.
సెల్వనాయగం సర్ ఇంట్లో ఉండాల్సిన నేను కొన్ని ఇబ్బందుల వల్ల జార్జ్ సర్ ఇంట్లో ఉండవలసి వచ్చింది. నాకు ఆయనతో పరిచయం లేదు. ఆ రెండు రాత్రులు, ఒక పగలూ నా జీవితంలో ముఖ్యమైనవిగా మారబోతున్నాయి. అప్పటికి నా పద్నాలుగేళ్ళ జీవితంలో నేను కనీవినీ ఎరగని కొన్ని విషయాలు నాకు తెలియబోతున్నాయి. ఇంకొన్ని ఆశ్చర్యాలకూ నేను సిద్ధం కావలసి ఉండింది.
జార్జ్ సర్ మలయాళీలు. ఆయన మూడు పెద్ద గుండీలున్న పొడవు చేతుల జుబ్బా ఒకటి వేసుకునున్నారు. ముఖం బడిపంతులుకు ఉండాల్సినట్టు లేదు. నోరు పైకి వంగి ఎప్పుడూ నవ్వుతున్నట్టే కనిపిస్తారు.
మిసెస్ జార్జ్‌ని చూడగానే కాస్త పొంకంగా అనిపించారు. బొట్టులేని తెల్లని నుదురు. ఆమె నడత చూస్తే వయసులో ఉండే అహం ఇంకా తగ్గినట్టులేదు. నల్లంచున్న తెల్లచీర కట్టుకునున్నారు. చీర కుచ్చిళ్ళు బహు చక్కగా కాగితపు మడతల్లా చెదరకుండా ఉన్నాయి. నేను అక్కడికెళ్ళినప్పుడు ఇద్దరూ కూతురి రాకకోసం చూస్తూ గుమ్మంలో నిల్చోనున్నారు. నేనూ వారితో గుమ్మం దగ్గరే నిలబడ్డాను.
దూరంగా ముగ్గురమ్మాయిలు వస్తూ కనిపించారు. అందరూ ఒకేలాంటి బట్టలు వేసుకునున్నప్పటికీ ఒకమ్మాయి పొడవుగా ఉండటం వల్ల దూరం నుండే తెలిసిపోతోంది. నడిచే వైనంలో మధ్యమధ్యన తన నడుము కనబడుతోంది. దగ్గరికి వచ్చినాక మెరుస్తున్న ఆ అమ్మాయి కళ్ళు చూశాను. ఒలిచిన ఇప్పగింజల్లా రెండు వైపులా వాడిగల కన్నులు. మెడలో చైన్ గాని, చెవులకు కమ్మలు గాని, ఒంటిమీద ఇంకేమీ ఆభరణాల్లాంటివి లేవు. అయితే పైపెదవి మీద ఒక పుట్టుమచ్చ ఉంది. అది తన పెదవులు కదిలినప్పుడల్లా కదిలి నా చూపుని అటే తిప్పుకుంటోంది. చూడకుండా ఉందామన్నా ఉండలేకపోయాను. ఇదొక పన్నాగమేమో అబ్బాయిలను ఆకట్టుకోటానికి అనుకున్నాను.
జార్జ్ సర్ తనను రోసలిన్ అని నాకు పరిచయం చేశారు. తను నన్ను కళ్ళెత్తి ఓమాదిరిగా చూసింది. ఆ ముఖం చూస్తే పదమూడేళ్ళుండచ్చు అనిపించింది. కాని ఆ అమ్మాయి శరీరం ఇంకా ఎక్కువ వయసునే చెప్తున్నట్టుండింది.
ఎన్నో ఆశ్చర్యాలు కలగబోతున్నాయని చెప్పాను కదూ. మొదటి ఆశ్చర్యం వారి ఇల్లు. నేను అంతవరకు ఎక్కడా చూడనన్ని సౌకర్యాలున్నాయి ఆ ఇంట్లో. నాకంటే పొడవైన నిలువెత్తు గడియారం గంటగంటకీ మోగుతుంటుంది, నేనిక్కడున్నాను అని గుర్తు చేస్తూ. హాల్‌లో రిఫ్రిజిరేటర్ ఉంది. అది ఉండుండి గుయ్యని శబ్దం చేస్తుంటుంది. ఎప్పుడూ తాకలేదు నేను అప్పటిదాకా, ఎలా ఉంటుందో ఆ ఫ్రిజ్ తలుపు ఒక్కసారి తీసి చూద్దామనిపించింది. వేలాడే గొలుసుని లాగితే పెద్దగా చప్పుడు చేస్తూ ఫ్లష్ చేసే కమోడ్. ఎన్నో మొక్కలను కుండీల్లో పెట్టి పెంచుతున్నారు. అవేవీ జీవితంలో ఒక్క పూవు కూడా పూసేవిలాగా లేవు.
నాకు కేటాయించిన గది అప్పటికప్పుడు సర్దించినట్టున్నారు. అలమర, టేబులు ఒక పక్క అంతా ఆక్రమించుకున్నాయి. తాళం వేసి వున్న ఆ గాజు తలుపుల అలమరాలో చాలా పుస్తకాలున్నాయి. పక్కన ఒకదానిపై ఒకటి సర్దిపెట్టిన ఖాళీ పెట్టెలు. అలమరలో చోటు లేకో, అవసరం లేకో బైటే పడేసి వున్న ఇంకాసిని పుస్తకాలు, ఇంకేవో వస్తువులూ. పరుపుపై అప్పుడే ఉతికిన వాసనతో తెల్లటి బెడ్‌షీట్. తేలికైన రెండు మెత్తటి దిండ్లు. అటాచ్డ్ బాత్రూమ్. అయితే దీనికి మూడు తలుపులున్నాయి, మూడు గదులనుండీ వాడుకోడానికి వీలుగా. లోపలికి వెళ్ళగానే మూడిటికీ లోగడియలు పెట్టుకోవాలి, తర్వాత మరిచిపోకుండా లోపలి గడియలన్నీ తీసి రావాలి. బాత్‌టబ్ తెల్లటి రంగునుండి గోధుమరంగులోకి మారుతోందా లేక గోధుమరంగునుండి తెల్లగా అవుతుందా అని చెప్పలేనట్టుంది. దాని గోడకంటుకుని పాములా ఒంపులు తిరిగిపోయున్న ఒక పొడవైన వెంట్రుక. ఇంకా ఆడవాళ్ళున్నారని చెప్పే కొన్ని వస్తువులు. లోదుస్తులు దాపరికం లేకుండా దండెం పైన వేలాడుతున్నాయి.
రెండో ఆశ్చర్యం, ముద్దులు పెట్టడం! ఆ అమ్మాయి పద్దాక ముద్దులు పెడుతోంది. ఊరకనే అటు వెళ్ళే తల్లిని వాటేసుకుని బుగ్గమీద ముద్దిచ్చింది. ఒక్కోసారి వెనకనుండి వచ్చి ఆమెను హత్తుకుని ఆశ్చర్యం కలిగించింది. ఒక్కోసారి బుగ్గమీద, ఒక్కోసారి నుదుట. తల్లికూడా అలానే చేసింది. కొన్నిసార్లు అలా ముద్దుపెట్టేప్పుడు వాలుకళ్ళతో నన్ను చూస్తోంది. అలాంటప్పుడు నేను ఏం చెయ్యాలన్నది నాకు తెలియలేదు. జీవితంలో మొట్టమొదటిసారి పరాయివాళ్ళింట్లో ఉంటున్నాను. అందునా వాళ్ళు కేథలిక్స్. వాళ్ళ అలవాట్లు అలా ఉంటాయేమో అనుకున్నాను. అయినా ఏదో మొహమాటంగానే ఉంది. ఇది వీళ్ళకి సహజమైన చర్య అని మనసులో అనుకున్నాను.
భోజనాల బల్ల దగ్గర వడ్డించగానే నేను తొందరపడి కంచంలో చేయి పెట్టబోయాను. ప్రార్థన మొదలవ్వగానే చేయి వెనక్కి లాక్కున్నాను. చివర్లో ఆమెన్ చెప్పినప్పుడు నేను శ్రుతి కలపాలని నాకు తెలియలేదు. అలా చెయ్యనందుకే అనుకుంటా ఆ అమ్మాయి నన్నదోలా చూసింది.
ఆ రాత్రి జరిగినదీ ఒక వింత సంఘటనే! అలవాటు లేని గది, అలవాటు లేని మంచం, మునుపెన్నడూ వినని శబ్దాలు. అసలు నిద్ర పట్టలేదు.
చిన్నగా నా గది తలుపు తెరిచిన అలికిడి. కొవ్వొత్తిని పట్టుకుని రోసలిన్ మెల్లగా నడిచి వచ్చింది. నావైపైనా చూడకుండా నేరుగా పెట్టెలు పేర్చిన వైపుకెళ్ళి నిల్చుని అమెరికాలో ఉండే లిబర్టీ స్టాచ్యూలా కొవ్వొత్తిని పైకెత్తింది. నేను అదాటున లేచి కూర్చున్నాను.
“భయపడ్డావా?” ఇదే తను నాతో మాట్లాడిన మొదటి మాట. నేను లేచెళ్ళి తన పక్కన నిలబడి ఏంటా అని చూశాను. ఆ కర్రపెట్టెలో ఐదు పిల్లి పిల్లలు ఒకదానినొకటి ఒరుసుకుని మెత్తగా కళ్ళు మూసుకుని ఉన్నాయి. పూలగుత్తిని తీసుకున్నట్టు ఒక్కొక్కదాన్నీ చేతిలోకి తీసుకుని చూసింది. తన చేతి వెచ్చదనం ఆరిపోయేలోపు నేనూ ఆ పిల్లిపిల్లలను తాకి చూశాను. కొత్త అనుభవంలా ఉంది.
“మూడు రోజులే అయింది ఈని. రెండు చోట్లకి మార్చింది. తల్లి పిల్లి ఈ కిటికీ గుండానే వస్తుంది, పోతుంది. చూసుకో,” అంది.
నేనేం మాట్లాడలేదు. కారణం, నేనింకా అప్పటికి ఆ అమ్మాయి మొదటి ప్రశ్నకే జవాబు వెతుక్కుంటున్నాను అక్షరాలు కూడబలుక్కుంటూ. కాసేపు నాకేసి చూసింది. నాకు బాగా పరిచయమున్న వ్యక్తిలాగా రహస్యం చెప్పే గొంతుతో, “ఈ తల్లి పిల్లిపిల్లగా ఉన్నప్పుడు మగపిల్లిగా ఉండేది. ఉన్నట్టుండి ఒకరోజు ఆడపిల్లయ్యి పిల్లలు పెట్టేసింది!” అంది. గొంతు ఇంకా సన్నగా చేసుకుని, “ఈ నల్లపిల్లికి మాత్రం నేను పేరు పెట్టేశాను. అరిస్టాటిల్!” అంది.
ఇప్పుడు మాత్రం “అరిస్టాటిల్ ఎందుకు?” అని అడగాలనుకున్నాను.
నా మనసు చదివినదానిలా, “చూడటానికి అచ్చం అరిస్టాటిల్‌లా ఉంది కదా?” అంది.
ఇంతసేపూ నా పక్కన తను నన్ను ఆనుకునే ఉంది. తన నైట్‌డ్రెస్ ఆ చిన్న వెలుతురులో మరింత పలచగా ఉన్నట్టు కనిపించింది. విరబోసుకున్న తన జుట్టు నుండి వెచ్చదనం, వొంటి నుండి వస్తున్న వాసన నాకు కొత్తగా ఉండింది. నా వేళ్ళు తనలోని ఏదో ఒక భాగాన్ని తాకగలిగేంత దగ్గరగా నిల్చునుండింది. తననే చూస్తున్న నన్ను చూసి చూపుడు వేలు పెదవులపై శిలువలా పెట్టి సైగ చేస్తూ మెల్లగా నడిచి తలుపు తీసుకుని వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వెళ్ళిన దిక్కుకి మెడ తిప్పి పడుకుని కాసేపు చూస్తూ ఉండిపోయాను. అది ఒక కొత్త అనుభవం.
ఉదయం అల్పాహారం తొందరగానే ఐపోయింది. వాళ్ళందరూ మంచి ఖరీదయిన బట్టలు కట్టుకునున్నారు. మిసెస్ జార్జ్ దగ్గరనుండి లీలగా హాయిగా పర్ఫ్యూమ్ వాసన వస్తోంది. రాత్రి అసలేమీ జరగనట్టే పిల్లిపిల్లలా కూర్చుని ఉంది రోసలిన్. నెమలి పింఛంలాంటి డ్రెస్సు, నల్లటి షూస్, పొడవైన తెల్లటి సాక్స్ వేసుకునుంది. తను కావాలనే మెల్లగా తింటున్నట్టనిపించింది. భోజనాల బల్ల దగ్గర మేమిద్దరమే మిగిలాం. ఎవరూలేని ఆ సమయం కోసమే చూస్తున్నట్టు నా వైపుకి తిరిగి, గొంతు సవరించుకొని రహస్యం చెప్తున్నట్టుగా “మా నాన్నదగ్గరొక రయిలు బండి ఉంది.” అంది లోగొంతుకతో.
“రయిలా?” అన్నాను.
“అవును రయిలే. పద్నాలుగు పెట్టెలు!”
“పద్నాలుగు పెట్టెలా!”
“ఆ బండే తిరువనంతపురానికీ కన్యాకుమారికీ మధ్య తిరిగే రయిలు బండి. పొద్దున ఆరుగంటలకు బయల్దేరి మళ్ళీ రాత్రికి వచ్చేస్తుంది.”
“రయిలు బండిని మీ నాన్నెందుకు కొన్నారు?”
“కొనలేదు, స్టుపిడ్. తిరువనంతపురం మహారాజా ఈ లైనుని మా తాతయ్యకు అతని సేవకు మెచ్చుకుని కానుకగా ఇచ్చారట. ఆయన తర్వాత అది మా నాన్నకు వచ్చింది. ఆయన తర్వాత అది నాకే!”
తన తర్వాత అది ఎవరికి సొంతమవుతుందని తేలేలోపు మిసెస్ జార్జ్ వచ్చేశారు. గబగబమని వాళ్ళందరూ మేరీమాత గుడికి బయల్దేరడంతో ఆ సంభాషణ అర్ధాంతరంగా ఆగిపోయింది.
పద్నాలుగేళ్ళ పిల్లాడిని ఎంతసేపని నాకిచ్చిన గదిలో ముడుక్కుని, చదవడానికేమీ లేకుండా ఎవడో బ్రిటీష్‌వాడు, జో డేవిస్ అట, రాసిన Heat అన్న పుస్తకాన్ని ఎంతసేపని తిరగేయను? కానీ ఏంచేయను. వాళ్ళు తిరిగొచ్చిన అలికిడి వినిపించి చాలాసేపైంది. ఇక తప్పక నా గది తలుపు కొంచం తీసి బయటకి తొంగి చూశాను. ఎవరూ కనిపించలేదు.
వరండాలోకి వచ్చాను. అడుగున నూనె మరకలున్న పొడవైన పేపర్ బేగులో చేయిపెట్టి ఏదో తీసి నోట్లో వేసుకొని నములుతూ ఉండింది తను. ఆ చేయి బేగులోకి పోయిరావడం పుట్టలోకి పాము వెళ్ళడం, రావడంలా కనిపించింది నాకు. పేరు తెలీని ఉండలాంటిదాన్ని అందులోనుండి తీసి నోట్లో వేసుకుంటోండింది. ఆ కవర్ నాకేసి చాపింది. తన మణికట్టు గెణుపు నా ముఖానికి దగ్గరగా నున్నగా కనిపించింది. పేరు తెలియని పదార్థాలు నేను తినను. వద్దని తలూపాను.
“ఐస్ ముక్కలు కావాలా?” అని అడిగింది.
నా జవాబు కోసం చూడకుండనే వెళ్ళి ఫ్రిడ్జ్ తీసి నీలం రంగు ప్లాస్టిక్ ట్రే పట్టుకొచ్చింది. రెండంచులూ పట్టుకొని దాన్ని విల్లులా వంచి ఐసు ముక్కలు పైకెగురుతుంటే పట్టుకుని నోట్లో వేసుకుంది. మరొక ముక్కని పట్టి నీటిబొట్లు కారుతుండగా నాకందించింది. తను ఒకటి తీసుకుని పటుక్కుమని కొరికి తింది.
అటూ ఇటూ తిరిగి చూసి, ఫ్రిడ్జ్‌కి వినపడనంత దూరంలో ఉన్నట్టు నిశ్చయించుకుని, రహస్యంగా చెప్పింది, “ఈ నీళ్ళు కేరళనుండి తెచ్చినవి. అర్ధగంటలో గడ్డకట్టి ఐస్ ఐపోతుంది. ఇక్కడి నీళ్ళు చాలా స్లో! రెండు రోజులు పడుతుంది గడ్డకట్టడానికి!” అంది.
నేనూ ఆమెలా పటుక్కుమని కొరికాను. పళ్ళు జివ్వుమన్నాయి. తలలో ఏదో జరిగినట్టనిపించింది. కొరికిన వేగానికి ఐసుముక్క నీళ్ళయి నా నోటి చివరలనుంచి కారాయి. రోసలిన్ నన్ను చూసి గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. “నీకు ఐసు ముక్కలు తినడం చేతకాదు” అంది.
తనను పరీక్షగా చూశాను. హాఫ్ స్కర్ట్, కాలర్‌బోన్‌నీ భుజాలనీ దాచని షర్టు వేసుకునుంది.
అప్పుడే రయ్యిమని ఒక జోరీగ తన చుట్టు ఎగరడం మొదలుపెట్టింది. అది తన భుజంమీద వాలబోతుంటే విదిలించింది. నేను కంగారుగా తోలబోతే నా చేయి ఆ అమ్మాయి భుజానికి తగిలి, త్రాసు ఒక వైపు కిందకు వాలినట్టు పక్కకు వంగింది.
ఇప్పుడు రోసలిన్ కాళ్ళ దగ్గర ఎగురుతోంది ఆ జోరీగ. మళ్ళీ నేను తోలే ప్రయత్నంగా చేయి విసిరాను. తను నవ్వడం మొదలుపెట్టింది. ఈ ఆట ఆగకుండా సాగింది కాసేపు. ఆ ఆట ఆపేస్తాడేమో అనే భయంతో నేను మనసులో దేవుడికి దణ్ణం పెట్టుకున్నాను. కాని, అదే అయింది. పనిమనిషి వచ్చి రోసలిన్‌తో అమ్మ పిలుస్తున్నారని చెప్పింది.
ఆ ఆదివారం సాయంత్రపు టీ కార్యక్రమం కూడా మరిచిపోలేనిదే. ఇంటి బయట తోటలో మొదలైందది. పసుప్పచ్చగా పండి మెరుస్తున్న పెద్దపెద్ద పళ్ళున్న బొప్పాయి చెట్టు కింద ఇది జరిగింది. దూరంగా రెండు తాడిచెట్లకు కట్టిన పొడవైన వెదురు కర్రలననుండి కిందకి దిగిన వైరొకటి జార్జ్ సర్ మ్యూజిక్ రూమ్‌లో ఉన్న రేడియో ఆంటెనాకి వెళ్తోంది. ఆ రేడియోనుంచి ఒక ఆలాపన వినిపిస్తూ ఉండింది.
మిసెస్ జార్జ్ అందరికీ కప్పులో టీ పోసి ఇచ్చారు. పింగాణీ ప్లేట్‌లో బిస్కట్స్ పెట్టి ఇచ్చారు. నలుపలకలుగా ఉండి పైన సన్నని చక్కర పలుకులు చల్లి ఉన్నాయవి. ప్రతీ బిస్కట్‌కీ తొమ్మిది బెజ్జాలున్నాయి. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయాయవి. అంత రుచికరమైన తొమ్మిది బెజ్జాల బిస్కట్లు తినడం అదే మొదటిసారి!
ఉన్నట్టుండి జార్జ్ సర్ తన కూతురిని గిటార్ వాయించమని ఆజ్ఞాపించారు. ‘ఓ డాడీ…’ అని అయిష్టంగా, వెళ్ళి గిటార్ పట్టుకొచ్చింది. కాలిమీద కాలేసుకుని, ఒత్తుకునే పేము కుర్చీలో ఇబ్బందిపడుతూ కూర్చుని వాయించుతూ పాడటం మొదలుపెట్టింది. ఆమె స్కర్ట్ పైకి జరిగి ఎండపొడ తగలని తెల్లని తొడలు కనిపించాయి. Don’t let the stars get in your eyes అని మొదలైంది ఆ పొడవైన పాట. Love blooms at night, in daylight it dies అన్న లైను నాకోసమే రాయబడినట్టు అనిపించింది. శ్రుతి లేకుండా, స్వరం కలవకుండా పావురపు గొంతేసుకుని పాడినప్పటికీ ఆ పాట నాకు చాలా బాగా నచ్చేసింది.
ఇలాంటొక అన్యోన్యమైన కుటుంబాన్ని నేనెప్పుడూ అప్పటిదాకా చూసెరగను. మిసెస్ జార్జ్ భుజంపైకి వేసుకున్న పైటలో మడతలు విచ్చుకున్న విసనకర్రలా క్రమంగా ఉన్నాయి. వాటిని జాకెట్‌లోకి వెండి పిన్నుతో బిగించారు. రోసలిన్ కళ్ళు మునుపటి కంటే ఇంకా పొడవుగా చెవులను తాకుతున్నాయా అన్నట్టు అనిపించాయి. ముఖంలో మెరుగు. జార్జ్ సర్ చేతులు రుద్దుకుంటూ భోజనాల బల్ల దగ్గర కూర్చుని ఉత్సాహంగా మాట్లాడుతున్నారు. వాళ్ళతోబాటు నేనూ కూర్చున్నాను. ‘జపం చేద్దాం!’ అని ఆయన ప్రారంభించారు.
‘మా దేవుడవయిన యేసు ప్రభువా! ఎల్లలులేని నీ కృపచేత నిన్నటిలాగే ఈ రోజూ మాకు లభించిన ఈ రొట్టె కోసం ఇక్కడ కూడివున్న మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ రొట్టె కూడా దొరకనివారికి దారి చూపించుము. భారం మోసేవారికి ఉపశమనం కలిగించే రక్షకుడా! మా భారములను తేలిక పరుచుము. మాతో కొత్తగా చేరిన ఈ స్నేహితుడిని రక్షించుము. ఆతని ఆశయాలన్నిటినీ నెరవేర్చుము. నీ మహిమను చాటిచెప్పేందుకు మమ్ములను ఆశీర్వదించు ప్రభువా! ఆమెన్.’
ఈ సారి సరైన చోట సరైన సమయానికి ఆమెన్ చెప్పేశాను. నన్నుకూడా వారి ప్రార్థనలో కలుపుకున్నందుకు సంతోషం కలిగింది. నేను ఆమెన్ అన్నప్పుడు నావైపు కొంటెగా చూసి, తన కళ్ళను పక్కకు తిప్పుకోకుండా అలానే చూస్తూ ఉండిపోయింది.
అయితే ఇంత ఆహ్లాదకరంగా మొదలైన రాత్రి చివరికొచ్చేసరికి చెత్తగా ముగిసింది.
భోజనాల బల్ల దగ్గర వున్నంతసేపు సంభాషణ చాలా ముఖ్యం. అది శుభ్రంగా ఇంగ్లీషులోనే సాగింది. ఒక తమిళ మాటో, మలయాళమో మచ్చుక్కూడా లేదు. ఆ అమ్మాయి నదికంటే వేగంగా మాట్లాడగలుగుతోంది. నా ఇంగ్లీషు చీకట్లో నడిచినట్టు ఉంటుంది. కాబట్టి మాటల పొదుపు పాటింపు చాలా అవసరం అనిపించింది. ఆ పొదుపు మాటలక్కూడా సగం సమయం గాలే వదిలాను.
తినే పింగాణీ ప్లేట్‌ని చూస్తూ తినడం నిషేధించినట్టు, బల్లపై పరచివున్న పదార్థాలను ‘దయచేసి ఇది అటివ్వండి…’. ‘ఆ రొట్టెలను ఇటు జరపండి…’ అని ఒకరిని ఒకరు అడుగుతూ అందించుకుంటూ తింటారు. ఇది కూడా నాకు కొత్తే.
అవియల్ అనే కొత్త వంటకం రుచిలో నేను ముణిగిపోయి వున్నాను. అప్పుడు జార్జ్ సర్ ఇంగ్లీషులో ఏదో అడిగారు. ఏమడిగారో నాకు తెలియదు గనుక వినిపించుకోలేదు. రోసలిన్ సన్నని స్వరంతో జావాబిచ్చింది. హఠాత్తుగా పైకప్పు అదిరిపోయేలా జార్జ్ సర్ అరిచారు. నేను వణికిపోయాను. గ్లాసులో నీళ్ళమీద వలయాలు కనిపించాయి. ఆ అమ్మాయి అంతవరకూ చూస్తున్న కొంటె చూపును నా మీదినుండి లాక్కుని ప్లేటుని చూస్తూ తినసాగింది. తన కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
మిసెస్ జార్జ్ వాతావరణాన్ని తేలికపరచాలని కళ్ళతో సైగలు చేశారు. అప్పటికీ జార్జ్ సర్ ముఖంలో కోపం తగ్గలేదు. ఆయన శాంతించడానికి చాలా సమయం పట్టింది.
ఆ రాత్రి చాలాసేపు నిద్రపట్టక అటూ ఇటూ పొర్లుతున్నాను. గాలి సవ్వడి చేసినప్పుడెల్లా తలుపు తెరచుకుంటుందా అని దీక్షగా చూస్తూ ఉన్నాను. అసలు తెరుచుకోనేలేదు.
ఎలానో ఒకలా నిద్రపోయాను. నడిజాము దాటాకేమో ఏదో చప్పుడుకి మెలుకువ వచ్చింది. చీకటి తప్ప మరేం కనిపించలేదు గానీ ఏవో మాటల్లాంటివి వినిపించాయి. గుసుగుసగా ఆడ గొంతు, ‘కాస్త ట్రై చెయ్యండి, ప్లీజ్!’ అని. మగ గొంతులో ఏవో మూలుగులు. మళ్ళీ నిశ్శబ్దం. కాసేపటికీ మళ్ళీ అదే ఆడగొంతు, ‘సరే, పోన్లెండి.’ అని చిరాగ్గా. తర్వాత చాలా సేపు మేలుకునే ఉన్నాగానీ ఏమీ వినిపించలేదు.
చెప్పినట్టే సెల్వనాయగం సర్ తెల్లవారుజామునే వచ్చేశారు. రిజిస్ట్రేషన్ పనులన్నీ పూర్తిచేసి నాకు సెబరపట్నం హాస్టల్‌లో సీటు ఇప్పించేశారు. అందరూ అది చాలా మంచి హాస్టల్ అని సర్టిఫికేట్ ఇచ్చారు. నాకిచ్చిన గదికి మరో ఇద్దరు స్టూడెంట్లొస్తారనగానే శత్రుదేశపు సైన్యం వస్తుందన్నంత ఆత్రంగా నా సరిహద్దులను ఆక్రమించుకున్నాను.
నేను నా పెట్టె, సామాన్లు తీసుకోడానికి వచ్చినప్పుడు ఇల్లు తెరచే ఉంది. పనిమనిషి ఒక చేపని బండమీద కడుగుతూ ఉంది. ఆ చేప కళ్ళు పెద్దగా ఒక వైపుకు తెరచుకుని నన్నే చూస్తోంది. అయితే ఆమె మాత్రం నా వైపుకి తిరిగి చూడలేదు.
గది తలుపు జారుగా తెరిచివుంది. అయినా అక్కడి అలవాటుని ఆచరిస్తూ తలుపుని రెండు సార్లు కొట్టాకే లోపలికెళ్ళాను. నా పెట్టె, సంచీ పెట్టినచోటే ఉన్నాయి. అవి అందుకున్నాక గదంతా ఓసారి చూశాను. నా జీవితంలో మరోసారి ఇక్కడ ఉండే అవకాశం రాదని తెలిసిపోయింది.
ఏదో గుర్తొచ్చిన వాడిలా కర్రపెట్టె దగ్గరకెళ్ళి తొంగి చూశాను. నాలుగు పిల్లలే ఉన్నాయి. తల్లి పిల్లి మళ్ళీ పిల్లల్ని చోటు మారుస్తున్నట్టుంది. నల్ల పిల్లిపిల్ల లేదు. మిగిలిన నాలుగు పిల్లలూ తమ వంతు కోసం చూస్తున్నట్టున్నాయి. అవి మెత్తగా, వెచ్చగా ఉన్నాయి. రో-స-లి-న్ అని చెప్పుకుంటూ ఒక్కో అక్షరానికీ ఒక్కో పిల్లని తాకాను.
తిరిగొచ్చే దారిలో తను మాట్లాడిన మొదటి మాట గుర్తొచ్చింది. ‘భయపడ్డావా?’ ఎంత ఆలోచించినా చివరి మాట ఏంటో గుర్తుకు రాలేదు.
బ్రహ్మాండమైన పిల్లర్లతో కట్టబడిన ఆ బడి, కేంపస్‌లో ఉన్న చెట్లూ నన్ను ఆకట్టుకున్నాయి. ఇంత పెద్ద స్కూల్లోనూ ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోనూ దానికవతలున్న నగరాల్లోనూ జీవించే ఏ ఒక్కరికీ తెలీని ఒక విషయం నాకు మాత్రమే తెలుసు. ఆ నల్ల పిల్లిపిల్ల పేరు అరిస్టాటిల్. ఆ ఆలోచనే ఎంతో సంతోషాన్నిచ్చింది.
తన గురించి తెలుసుకోవాలని ఉన్నా, ఎలా తెలుసుకోవాలో అర్థంకాక ఏ ప్రయత్నమూ చెయ్యలేదు. ఎవరిని అడగాలో కూడా తెలియదు. నేను ఎంతో శ్రమపడి సీటు సంపాయించుకున్న ఈ అమెరికన్ మిషన్ స్కూల్లో ఆ అమ్మాయి చదవటం లేదని కొన్నాళ్ళకే తెలిసిపోయింది. రోసలిన్ అన్న ఆమె అందమైన పేరుని Rosalin అని రాయాలా లేక Rosalyn అని రాయాలా అన్న ఈ చిన్న విషయంకూడా కనుక్కోలేదే అని చాలా బాధపడ్డాను.
చాలా కాలం తర్వాత తను కేరళనుండి వేసవి సెలవులకి వచ్చుంటుందనీ మళ్ళీ చదువులు కొనసాగించడానికి వెళ్ళిపోయుంటుందనీ ఊహించుకున్నాను. ఎప్పట్లాగే ఆ ఊహకి కూడా చాలా ఆలస్యంగానే వచ్చాను.
ఈ కొత్త బళ్ళో కెమిస్ట్రీ సర్ విలియమ్స్ ఒకటే కర్రపెత్తనం చలాయించేవాడు. మెండలీవ్ అన్న రష్యా శాస్త్రవేత్త చేసిన కుట్ర కారణంగా మేము పీరియాడిక్ టేబిల్స్‌ని కంఠస్థం చెయ్యాలని అజ్ఞాపించాడు. అప్పుడు 112 ఎలిమెంట్స్ లేవు; తొంబైరెండే ఉన్నాయి. ఎంత చదివినా వాటిని కంఠతా పట్టలేకపోయాను. బరువు తక్కువైనది హైడ్రోజన్ అనో, బరువైనది యురేనియం అనో ఆ వివరాలు నా జ్ఞాపకాల బండల మీదనుంచి జారిపోతూనే ఉన్నాయి. ముందు పేరు పెట్టాక తర్వాత కనుక్కున్న ఎలిమెంట్ జెర్మేనియం అన్నది నాకెప్పుడూ గుర్తుండేది కాదు అప్పట్లో. కాబట్టి ఆ రెండేళ్ళు విలియమ్స్ సర్ నా పట్ల అసంతృప్తితోనే ఉన్నాడు కానీ జాలిపడో పెద్దరికంతోనో పొరపాటునకూడా నాకు E కంటే ఒక గ్రేడు ఎక్కువివ్వాలని ప్రయత్నించలేదు. ఇతని హింసకు గురై నేను నిద్రపోయే ముందు రోసలిన్‌ని తలచుకోలేకపోవడం అన్న దారుణం కూడా రెండుమూడు సార్లు జరిగింది!
ఇది జరిగి ఇప్పటికి చాలా ఏళ్ళు దాటింది. ఎన్నో దేశాలు తిరిగాను. ఎన్నో దేశాల వీధులూ రహదార్లూ గుర్తుండిపోయాయి. ఎందరి ముఖాలనో ఆకర్షించాను. ఎన్నో గాలుల్ని పీల్చాను… ఎన్నో తలుపులనూ తెరిచాను. ఎన్నో మంచాలలో నిద్రపోయాను. ఇంకెన్నో రకరకాల ఆహారాలు తిన్నాను.
అయితే కొరకగానే కరిగిపోయే సన్నని చక్కెర పలుకులు చల్లిన తొమ్మిది బెజ్జాల బిస్కట్లు తిన్న ప్రతిసారీ రోసలిన్ వాసన, ఒక గిటార్ నోటూ నా మనసులోకి రావడం మాత్రం ఇప్పటికీ ఆగలేదు!
----------------------------------------------------------
(మూలం: మహారాజావిన్ రయిల్ వండి (2001)
(మహారాజుగారి రయిలుబండి) కథల సంపుటినుండి.)
రచన: అవినేని భాస్కర్ (మూలం: ఎ. ముత్తులింగం)
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment