Friday, June 22, 2018

” ప్రభావతీ ప్రద్యుమ్నం” - 1


” ప్రభావతీ ప్రద్యుమ్నం” - 1




సాహితీమిత్రులారా!


 ప్రభావతీ ప్రద్యుమ్నం  కథను ఆస్వాదించండి-

(“కతరాజు” గా పేరుపడ్డ పింగళి సూరన సంప్రదాయ తెలుగు సాహితీకారుల్లో ఎంతో విశిష్టుడు. అతను రాసిన “కళాపూర్ణోదయం”, “ప్రభావతీ ప్రద్యుమ్నం” తెలుగు సాహిత్యంలో అపూర్వ కథా రచనలు. కథాకల్పనలో ఇతనికున్న ప్రతిభ ఇంకెవర్లోనూ కనిపించదు. పురాణపాత్రల్ని వాడుకుంటూనే పూర్తిగా స్వయంకల్పిత కథల్ని అల్లటంలోనూ ఉత్కంఠత పెంచుకుంటూ చెప్పటం లోనూ ఇతనికితనే సాటి. ఇవి రెండూ కాక చిన్నతనంలోనే “రాఘవపాండవీయం” అనే రెండర్థాల కావ్యం కూడ రాసిన ప్రతిభామూర్తి పింగళి సూరన. ఈ “ప్రభావతీప్రద్యుమ్న” కావ్యాన్ని అతను 1590 ప్రాంతాల్లో రాసి వుంటాడని పరిశోధకుల అభిప్రాయం. “సంప్రదాయ కథా లహరి” లో తొలి ప్రయత్నంగా దీన్ని అందిస్తున్నాం. )
విష్ణువు కృష్ణుడుగా ద్వారకలో ఉన్న కాలాన ఒక నాడు
ఆయనతో ఓ ముఖ్యమైన పని కలిగి అక్కడికొచ్చేడు స్వర్గాన్నుంచి ఇంద్రుడు.
వస్తూ ఆ నగరం అందాన్ని చూసేసరికి అతనికి ఎక్కడలేని ఆశ్చర్యం వేసింది.
అతనూ, అతని సారథి మాతలీ అక్కడి వింతల గురించి చెప్పుకుని ఆనందిస్తూ భూమికి దిగేరు.
వాళ్ళ రాక విన్న కృష్ణుడు సాత్యకిని ఎదురు పంపేడు. ఉగ్రసేనుడు, వసుదేవుడు మొదలైన పెద్దల్తో వచ్చి ఆహ్వానించి వాళ్లని లోపలికి తీసుకెళ్ళేడు.
“అంతా క్షేమమే కదా!” అడిగేడు కృష్ణుడు.
“కృష్ణా! నీకు తెలియందేవుంది? ఐనా నా నోటి మీదగా వినాలంటే విను, చెప్తా.
ఆ మధ్య వజ్రనాభుడనే రాక్షసుడు తన తపస్సుతో బ్రహ్మని మెప్పించేడు. దాంతో ఆ బ్రహ్మ వాడికి మేరుపర్వతం దగ్గర వజ్రపురి అనే అద్భుతమైన నగరం తయారుచేసి ఇచ్చేడు.అదెలాటి నగరమో తెలుసుగా! ఆ వజ్రనాభుడి అనుమతి లేకుండా చివరికి గాలీ వెలుతురూ కూడా దాన్లో ప్రవేశించటానికి వీల్లేదు!
వాడు మొన్న స్వర్గం మీద దాడికొచ్చి ఏకంగా వెళ్ళి నందన వనాన్నే తన సేనలకి విడిది చేసేడు. ఆ మోటు రాక్షసులెక్కడ, అందమైన నందన వనం ఎక్కడ? అక్కడ వాళ్ళు చేసిన రోతపన్లు చెప్పటానికి నాకు నోర్రావటం లేదు. అది తలుచుకుంటుంటే ఇప్పటికీ నా గుండె గతుక్కుమంటోంది!
ఈ గొడవతో యీ మధ్య నా బుర్ర సరిగా పనిచెయ్యక నీకిందాకే చెప్పలేదు గాని బ్రహ్మ వరంలో ఒక భాగం వాడిని దేవతలెవరూ ఎదిరించలేరనేది కూడా! దాంతో మేం ఎవరం వాడివైపు కన్నెత్తి చూట్టానికైనా కుదర్లేదు!
ఇక ఇలా లాభం లేదని బృహస్పతితో ఆలోచించుకుని, “మనం మనం దాయాదులం. ఈ గొడవలెందుకు? ప్రశాంతంగా అన్ని విషయాలూ మాట్లాడుకుందాం రా” అని నెమ్మదిగా చెప్పి వాడ్ని పట్నంలోకి రప్పించి విడుదులేర్పాటు చేయించా. అప్పుడు చూడాలి వాళ్ళ ఆగడాలు!
“నాకు తేరగా యిచ్చే వస్తువులు యివేనా?” అని కోప్పడే అనామకపు రాక్షసుడొకడు!
“నా విడిదికి రంభని పంపలేదేం?” అని బూతులు తిట్టే అణాకానీ రాక్షసుడొకడు!
“నాకు తగ్గ మర్యాదలు జరగటం లేద”ని మండిపడే నిర్భాగ్యపు రాక్షసుడొకడు!
“నాకు అమృతం పోసి పంపలేదే” అని అదిలించే రక్కస పీనుగొకడు!
వాళ్ళందరికీ సర్ది చెప్పలేక నేను పడ్డ పాట్లు ఎన్నని చెప్పమంటావ్‌! “ఎంత పాపం చేసుకున్న జంతువో కదా నాలా ఇంద్రుడయ్యేది!” అని లెంపలేసుకున్నా.

సరే, అలా కొద్దిరోజులు గడిచాయి.
ఇంతలో నేను భయపడ్ద రోజు రానే వచ్చింది!
ఆ రోజు వాడు ఏకంగా నా మందిరం మీదికే దొమ్మీకొచ్చేడు.
మెరికల్లాంటి రాక్షసులు ద్వారపాలకుల్ని చితగ్గొట్టేరు! సభలో కూర్చుని ఉన్న వాళ్ళని యీడ్చి పారేసి వాళ్ళ ఆసనాల్లో కూర్చున్నారు!
దేవతలూ, మునులూ కిక్కురుమనకుండా మూలమూలల్లో బిక్కుబిక్కుమని దాక్కున్నారు!
నా గుండె గుభేల్‌ మంది. “ఇప్పుడు వీడు నన్ను బంధిస్తే దిక్కెవర్రా దేవుడా!” అనుకుంటూ ఆ భయం కప్పిపుచ్చుకోటానికి వాడికి మర్యాదలు చెయ్యమని సేవకుల్ని పురమాయించి కొంత హడావుడి చేశా.ఐతే వాడి ముందు ఆ పప్పులుడికితేనా! “చేసిన మర్యాదలు చాలు. ఐనా నాకు రావాల్సిందాన్ని యింకేవరో నాకిచ్చేదేవిటి నే తీసుకోలేకనా? జాగ్రత్తగా విను. ఒక తండ్రి బిడ్డలం మనం. కనక నువ్వెన్నాళ్ళు స్వర్గాన్ని పాలించేవో నేనూ ఇకనుంచి అన్నాళ్ళు దాన్నిపాలించబోతున్నా. కాదన్నావా, నిన్ను బంధించటం నాకో పని కాదు” అని కర్కశంగా గర్జించేడు వాడు.
నేను మాత్రం నవ్వు నటిస్తూ, “నువ్వన్నట్టు మనం ఒక తండ్రి బిడ్డలం. కనక ఆయన దగ్గరికే వెళ్ళి ఈ విషయం అంతా చెప్పి ఆయన ఎలా చెయ్యమంటే అలా చేద్దాం” అని వాడికి సర్ది చెప్పి మా తండ్రి కశ్యప మహాముని దగ్గరికి తీసుకెళ్ళా. నా అదృష్టం బాగుండి ఆ సమయాన ఆయనో యాగం చేస్తున్నాడు. అదయాక మా తగువు తీరుస్తానని చెప్పి అప్పటిదాకా వజ్రపురంలోనే వుండమని వాణ్ణి ఆజ్ఞాపించేడాయన. ఏ కళనున్నాడో గాని వాడూ దానికి కిక్కురుమనకుండా ఒప్పుకుని తిరిగెళ్తే మేం పులి నోట్లోంచి బయటపడ్డట్టు పడి చావుదప్పి కన్ను లొట్టబోయి స్వర్గానికి చేరుకున్నాం.

కృష్ణా, ఇదీ ఇప్పటికి జరిగింది! ఐతే, వాడి మనసు ఎప్పుడు మారుతుందో, ఎప్పుడు మళ్ళీ మా మీదికొస్తాడో ఎవరు చూడొచ్చారు? ఇక నా ఎత్తు బంగారం పోసినా నేను స్వర్గానికి తిరిగిపోయేది లేదు. ఇక్కడే ఉండి నీ కొలువు చేసుకుంటా” అని తన బాధంతా వెళ్ళగక్కేడు ఇంద్రుడు.
కృష్ణుడు చెవులు మూసుకున్నాడా మాటలకి!
“ఏం మాటలివి, నీలాటి వాళ్ళు అనొచ్చునా? ఓడలు బళ్ళౌతాయి, బళ్ళు ఓడలౌతాయి. ఇదివరకు ఎంతమంది వీడి తలదన్నిన రాక్షసులు గర్వంతోటి కన్నూమిన్నూ కానకుండా విర్రవీగలేదు? చివరికి వాళ్ళంతా నాశనం అయ్యారా లేదా? వీడి పనీ అంతే.
ఐతే ప్రస్తుతం వసుదేవుడో యజ్ఞం చెయ్యబోతున్నాడు. అది కావటం తోటే ఏకాగ్రతగా ఈ పని మీదే కూర్చుందాం.ఈలోగా నువు కూడా ఆ వజ్రపురం లోకి ఎలా వెళ్ళొచ్చో, అలా వెళ్ళి వాణ్ణి చంపేవాళ్ళెవరో కాస్త ఆలోచిస్తూ ఉండు” అని ఇంద్రుణ్ణి ఓదార్చి పంపేడు కృష్ణుడు.

ముందు వసుదేవుడి యాగాన్ని విజయవంతంగా చేయించటానికి పూనుకున్నాడు.
కృష్ణుడే స్వయంగా పూనుకున్నాక ఇక చెప్పాలా! ఎలాటి లోటూ లేకుండా పూర్తయ్యింది యాగం.
దేశదేశాల్నుంచీ వచ్చిన బంధుమిత్రులకి రకరకాల బహుమతులిచ్చి ఆనందపరుస్తున్నాడు కృష్ణుడు.
అప్పుడక్కడికొచ్చేడు
భద్రుడనే మహానటుడొకడు!
తన అద్భుతమైన నటనతో, వేషాల్తో అందర్నీ ముగ్ధుల్ని చేసేడు.
ఆ ఆనందంలో వాడికి రకరకాల వరాలిచ్చేరు అక్కడున్న మునులు!
ఎన్నో బహుమానాలిచ్చేరు మిగిలిన వాళ్ళు!
అవి తీసుకుని అతను దాతలందర్నీ ఘనంగా పొగుడ్తూ ఉండగా
కొందరు కోతిమూక బ్రహ్మచారులు వచ్చేరక్కడికి!
దగ్గరున్న మారుగోచులు తీసి వాడి మీద పడేసి, “ఇదుగో, ఈ గోచులు మా బహుమానం! వీటిని తీసుకుని మమ్మల్నీ పొగుడు!” అని నవ్వేరు వాళ్ళు హేళనగా.
భద్రుడు ఆ గోచుల్ని పైకెగరేస్తూ పట్టుకుంటూ వాటితో ఆడుతూ వాళ్ళనీ పొగడ్డం మొదలెట్టేడు. ఐతే వాళ్ళు వచ్చింది అందుకా?
“నీ పొగడ్తలు ఏడిచినట్టే ఉన్నయ్‌. వీటికోసమా నీకు మా గోచుల్నిచ్చుకుంది? నువ్వు ముట్టుకున్న గోచుల్ని తిరిగి తీసుకోలేం గనక యిక్కడే యింకేదన్నా వస్తువు తీసుకుంటాం” అని వాళ్ళు అటూ ఇటూ చూస్తుంటే
“ఈ కుర్రాళ్ళ వాలకం చూస్తుంటే మన సొమ్ములేవన్నా కొట్టేసేట్టున్నారు. జాగ్రత్తగా కనిపెట్టి చూస్తుండం”డని తన మేళగాళ్ళని హెచ్చరించేడు భద్రుడు.
దాంతో ఆ వానరజాతి వాళ్ళు నిప్పులు తొక్కినట్టు గెంతేరు!
“ఎవర్రా దొంగలు? మేమా మీరా? ఏదో నాటకాలాడుతారు గదా అని మిమ్మల్ని అన్ని ఊళ్ళకీ రానిస్తారా, మీరేమో పగలు ఆటల పేరు పెట్టుకుని సందులు గొందులు తిరిగిచూట్టం, రాత్రులు ఇళ్ళకి కన్నాలేసి దొంగతనాలు చెయ్యటం! ఎవరన్నా అడ్దం వస్తే వాళ్ళని చంపటం! మీ సంగతి మాకు తెలీదనుకున్నారా?” అంటూ చిందులేసేరు.

ఆ తమాషా చూస్తున్న కృష్ణుడికి వజ్రపురంలోకి ఎలా వెళ్ళాలా అనే సమస్యకి సమాధానం దొరికింది!
ఇక మిగిలిన సమస్య ఎవర్ని పంపాలా అనేది!

ఈ లోగా ఇంద్రుడు కూడా అదే పన్లో ఉన్నాడు.
ఆకాశగంగలో విహరించే రాజహంసల్ని తన దగ్గరికి పిలిపించాడో రోజు.
“మీతో ఓ ముఖ్యమైన పని వచ్చి పిలిపించా. నేను చెప్పబోయేది అతి రహస్యం సుమా!
కొన్నాళ్ళ నాడు వజ్రనాభుడనే రాక్షసుడు మమ్మల్ని పెట్టిన పాట్లు మీకు తెలుసు. ఇప్పుడు వాణ్ణి చంపటానికి ప్రయత్నాలు జరుగుతున్నయ్‌. ఐతే ఈలోగా వాడేదన్నా అఘాయిత్యం చేస్తే కొంపలు మునుగుతయ్‌. వాడి కొలన్లకి మీవల్ల అలంకారం అని మీరంటే ఆ రాక్షసుడికి ఎంతో ఇష్టం కనక మీరు వజ్రపురంలో తిరుగుతూ అక్కడి సంగతులు కనిపెట్టి నాకు తెలియపర్చాలి.ఈ పని మీవల్లనే కావాలి” అని వాళ్ళకి చెప్పేడు ఇంద్రుడు.
అప్పుడో మగహంస “దేవరా! ఆ వజ్రనాభుడి వాలకం చూస్తే యిక ఎప్పటికీ యీవైపు కన్నెత్తి చూసేట్టు లేడు. అంతే కాకుండా అతని రాజ్యం కూడ ఎక్కువ కాలం ఉండేట్టు లేదని ఏదో విన్నట్టుగా నా భార్య నాతో అంది. తనే ఆ విషయం చెప్తుంది వినండి” అని తన భార్యని పిలిచి “ఇందాక నువ్వు నాతో చెప్పిన విషయం ఆయంతో కూడా చెప్పు” అన్నదా హంస.
శుచిముఖి అనే హంసిక ముందుకొచ్చింది.
“మహారాజా! కడుపు కక్కుర్తి కోసం మేం మీ శత్రువైన ఆ వజ్రనాభుడి నగరానికి వెళ్తుంటాం. మమ్మల్నిక్షమించు. పోనీ మానేద్దామా అంటే ఆకాశగంగలో మేలైన బంగారు తామరలన్నీ అతనే కోసుకుపోయె! మానస సరోవరంలో రుచికరమైన తామరతూళ్ళే లేకుండా చేశాడాయె! బిందుసరంలో బంగారు తామరనేది మిగల్చలేదాయె! సౌగంధికా సరస్సులో నీళ్ళు తప్ప మరేం లేవాయె! అన్ని దివ్యసరసుల్లోంచి బంగారుతామర జాతులన్నిట్నీ తన కొలన్లలో నాటుకున్నాడాయె! మరి మాకు పొట్ట గడిచేదెలాగ? అంచేత తన కొలన్లలో తిరగటానికి అతన్ని అనుమతి అడిగేం. అతను కూడ మేం తిరుగుతుంటే ఆ కొలన్లు కన్నుల పండగ్గా ఉంటాయని ఆ నగరంలో ఏ కొలన్లోకైనా వెళ్ళొచ్చని మాకు సెలవిచ్చేడు!

నిన్న మేం కన్యాంతఃపురంలో ఓ కొలన్లో ఉన్నప్పుడు ఓ విచిత్రం జరిగింది.
సామ్రాజ్యలక్ష్మిలా ఉన్న ఓ కన్య తన చెలికత్తెతో వచ్చి ఆ కొలను పక్కనే గురివింద పొదరింట్లో కూర్చుంది!కూర్చుని, చెలికత్తెతో, “వేకువజామున నాకో అద్భుతమైన కలొచ్చింది. ఇలాటి సంఘటన ఎప్పుడూ ఎక్కడా విన్నదీ కన్నదీ కాదు. నిజానికి సగం కల, సగం నిజం..” అంటూ సిగ్గు పడి ఆపేసింది. ఐతే ఆ చెలికత్తె వదలకుండా “మన్లో మనకి ఎలాటి రహస్యాలు ఉండవని ఒట్టేసుకున్నాం కదా! చెప్పాల్సిందే” అని పట్టు పట్టింది. దానికా కన్య, “హిమగిరిరాజ కన్యక ఆ పరమేశ్వరి నా కల్లో కనిపించి చిరునవ్వుతో దగ్గరికి పిల్చింది. ఓ చేత్తో నా ఒళ్ళు నిముర్తూ, “నీకొక భర్తని చూసేను, తెలుసా!” అంటూ ఒక్క క్షణంలో సంకల్పమాత్రంగా ఓ బొమ్మని గీసి నాకిస్తూ, “ఇతనే నీ భర్త. ప్రద్యుమ్నుడనే రాకుమారుడు. మీ యిద్దరికీ పుట్టే బిడ్డ యీ రాజ్యానికి రాజౌతాడు” అని చెప్పింది. గమ్మత్తేమిటంటే, ఆ బొమ్మ ఇంకా నా దగ్గరే ఉంది” అని వివరించిందా కన్య తన కలని!
ఆ దగ్గర్లో ఉండి అంతా విన్నాన్నేను!
ఆ అమ్మాయి పేరు ప్రభావతని, ఆమె వజ్రనాభుడి కూతురని వాళ్ళ మాటల బట్టి నాకు తెలిసింది.
దాన్ని బట్టి నాకు అర్థమైంది ఆ వజ్రనాభుడికి ఇంక ఎక్కువ కాలం లేదని!
అంతే కదా మరి ఆ అమ్మాయి భర్త ప్రద్యుమ్నుడన్న పార్వతి మాట అబద్ధం కాబోదు.
కృష్ణుడి కొడుకైన ప్రద్యుమ్నుడికి ఆ రాక్షసుడు తనంత తను పిల్లనివ్వడు.
ప్రద్యుమ్నుడు ఆ ప్రభావతికి భర్త కావాలంటే అతనికీ వజ్రనాభుడికీ యుద్ధం తప్పదు.
ప్రద్యుమ్నుడి కొడుకు రాజు కావాలంటే మరి ఆ వజ్రనాభుడికి యుద్ధంలో అపజయం కలగాల్సిందే.
ప్రద్యుమ్నుడి చిత్రం ప్రభావతి దగ్గర ఉండటం నిజం కాబట్టి ఆమె కల కూడా నిజమే అయుండాలి! అదీ తెల్లవారుజామున వచ్చిన కల గనక ఈ విశేషాలు తొందర్లోనే జరగబోతూ ఉండాలి.
దేవేంద్రా! నువ్వే ఆలోచించి చూడు!

ఆ అమ్మాయి వజ్రనాభుడి కూతురని ఎలా తెలిసిందో చెప్తాను నీకేమైనా పనికొస్తుందేమో!” అంటూ ఆ విషయం ఇలా చెప్పింది శుచిముఖి.

ఆ అమ్మాయి అలా తన కల గురించి చెప్తే, చెలికత్తె, “నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి. అసలే పార్వతి వరాన పుట్టేవు. నీమీద ఆమెకి ఎంత అనుగ్రహం లేకపోతే యిలా నీ భర్త చిత్రాన్ని స్వయంగా వేసి మరీ ఇస్తుంది చెప్పు! కాకపోతే ఓ మాట. పోతుటీగ కూడా దూరటానికి వీల్లేని ఈ అంతఃపురంలో ఇలాటి బొమ్మ కనిపిస్తే నీ తండ్రి వజ్రనాభుడు అగ్గిబుగ్గౌతాడు.పార్వతి పేరు చెప్పి ఎవరో యిక్కడున్న వాళ్ళే యీ బొమ్మ వేసేరని చెప్పి ముందు మా అంతు చూస్తాడు. కనక దీన్నిమనిద్దరం తప్ప యింకెవరూ చూట్టానికి వీల్లేదు. ఎక్కడ పెట్టేవో తీసుకొచ్చి ఒక్కసారి నాకు చూపించు. నీ అందానికి తగ్గవాడు అసలీ సృష్టిలో ఉన్నాడా అని నా అనుమానం. మరి ఆ దేవి గీసిన వ్యక్తి ఎలా ఉంటాడో చూసేదాకా నేనాగలేను” అంది. అప్పుడా ప్రభావతి వెళ్ళి ఒక్కక్షణంలో ఆ చిత్రాన్ని తెచ్చి చూపించింది.
ఎంత గొప్పగా ఉందో అది!
జీవకళ ఉట్టిపడుతూ నిజంగా అతనే వచ్చి ఎదురుగా ఉన్నట్టనిపించింది!
“సరిగ్గా మీ ఇద్దర్నీ ఒకరికొకరికి యీడూ జోడుగా సృష్టించాడు బ్రహ్మ! ఏమాత్రం సందేహం లేదు!” అన్నదా చెలికత్తె ఆ చిత్రాన్ని కళ్ళార్పకుండా చూస్తూ.
“నీ మాటలకేం గాని, నిజంగా ఈ చిత్రంలో వున్నలాటి వ్యక్తే గనక ఉంటే నా అందం అతని కాలిగోటికైనా సరిపోతుందా?” అంది ప్రభావతి ఆశ్చర్యం తోనూ ఆనందంతోనూ!
అప్పుడామె మాట్టాడిన రకరకాల మాటల బట్టి నాకర్థమైంది ప్రద్యుమ్నుణ్ణి త్వరలో కలుసుకోవటానికి ప్రభావతి తన చేతనైన ప్రయత్నాలన్నీ చెయ్యబోతోందని! ఈ వర్తమానం మీ పనికి ఉపయోగిస్తుందనే అనుకుంటా” అని ముగించింది శుచిముఖి.

శుచిముఖి మాటలు విన్న ఇంద్రుడికి మహానందమైంది తన పని జరిగే అవకాశం కనిపిస్తున్నందుకే కాదు,శుఖిముఖి మాటల చాతుర్యానికి కూడ! “నీలా మాట్టాడ గలగటానికి ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకుని ఉండాలి!ఎంత ముచ్చటగా ఉన్నయ్‌ నీ మాటలు! అసలు నువ్వో హంసవు కావు, సాక్షాత్తూ ఆ సరస్వతీ దేవివో లేక ఆమె స్వయంగా తయారుచేసిన కవివో!” అని ఆశ్చర్యపోయేడతను.
“నీ మాటల్లో ఏమీ అబద్ధం లేదు. బ్రహ్మ రథాన్ని తిప్పే హంస సారంగధరుడి బిడ్డని నేను. ఆ శారదాదేవే నన్ను పెంచి అన్ని విద్యలూ నేర్పింది” అంది శుచిముఖి వినయంగా.
“అందుకే నువ్వింత గొప్పదానివయ్యేవ్‌. ఇక ఈ పని పూర్తి చేసే బాధ్యత నీకే అప్పగిస్తున్నా. ఎలాగైనా సరే ప్రభావతికీ ప్రద్యుమ్నుడికీ ప్రేమ కలిగించి వాళ్ళిద్దరూ త్వరలోనే కలుసుకునే మార్గం నువ్వే చూడాలి .. కనక వెంటనే నేను పంపేనని చెప్పి కృష్ణుడి ఆలోచన కూడ తీసుకుని వజ్రపురానికి వెళ్ళు” అని శుచిముఖిని కోరి మిగతా హంసల్తో, “యిక నుంచి మీరు శుచిముఖి మాట ప్రకారం నడుచుకుని దేవకార్యం అయ్యేట్టు చూడండి” అని ఆజ్ఞాపించేడు ఇంద్రుడు.

హంసలన్నీ ద్వారకానగరానికి దారి తీసేయి.
-----------------------------------------------------------
రచన: కె. వి. ఎస్. రామారావు, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment