Wednesday, June 6, 2018

కృష్ణానందుడు


కృష్ణానందుడు



సాహితీమిత్రులారా!



సంస్కృత సాహిత్యంలో విద్వదౌషధం అని చేరు పొందిన మహాకావ్యం
శ్రీహర్షుని నైషధీయకావ్యం. దీనికి అనుపాన మధువుగా చేరు పొందిన
మహాకావ్యం సహృదయానందం. ఇది 15 సర్గలలో కూర్చబడింది.
దీన్ని కూర్చినవాడు కృష్షానందుడు. ఈయన కపింజల వంశానికి చెందినవాడు.
ఇతనికి సాంధి విగ్రహిక మహాపాత్ర అనే బిరుదు కూడావుంది. ఇతడు
హర్షనైషధీయచరిత్రకు వ్యాఖ్యానాన్ని వ్రాశాడని జనశ్రుతి. కానీ ఇది
ఇప్పటికి లభించలేదు. విశ్వనాథుని సాహిత్య దర్పణం లో
సహృదయానందం లోని -

సూచీముఖేన సకృ గేవ కృత ప్రణస్త్వం 
ముక్తా కలాప లగఠసి స్తనయోః ప్రియాయాః

లాంటి శ్లోకాలు ఉదాహరణగా కనబడ్డంవల్ల కృష్ణానందకవి సాహిత్య దర్పణకారుని కన్నా ప్రాచీనుడని స్పష్టంగా చెప్పవచ్చు. నైషధీయ చరిత్రను పఠించి భావించిన వాడవడం వల్ల ఇతడు శ్రీహర్షుని తర్వాతి వాడని నిస్సందేహంగా చెప్పవచ్చు. నలచరితాన్ని మహాకావ్యంగా
తీర్చిదిద్ది సహృదయానందం అనే మారుపేరు పెట్టి కృష్ణానందుడు
ఒక నూతనత్వాన్ని పరిమళింపచేశాడు. శ్లేషాద్యలంకార సహితమైన
శిల్పంలో భాషాక్లిష్టమైన శ్రీహర్షుని కవితారచన ముందు కృష్ణానందుని
మార్గం శిరీషమృదులం. ప్రతిశ్లోకం సులభంగా సుందరాన్వయబంధం
కలిగి ఉంది. ద్రాక్షాపాకానికి, వైదర్భోక్తికి ఈ కావ్యం జన్మభూమి అన్నట్లు
తోస్తుంది. ఈ కావ్యం ఆరంభంలో కృష్ణానందుడు వాగ్దేవతను
ఇలా స్తుతించాడు.

య దింద్రియాణాం విషయత్వ మేతి లోకేషు యత్తత్త్వ మతీంద్రి చ,
కృత్స్నయంస్య ప్రతిపత్తి హేతు ర్వాగ్దేవతా సా మయి సన్నిధత్తామ్

ఈ కాంక్షకు అనుగుణంగానే అతీంద్రియానంద సంధాయకం అయిన
కవితాతత్త్వం కృష్ణానందునకు వశవర్తి అయింది. విసుగు పుట్టించని వర్ణనలు, సుందరమైన కల్పనలు, అప్రసక్తాలు కాని సంభాషణలు, కలిగి కావ్యమంతా సహృదయుని చేతిలో లీలాసరోజం వలె ఒప్పింది.

No comments:

Post a Comment