Tuesday, June 19, 2018

శిరోముండనం(కథ)


శిరోముండనం(కథ)సాహితీమిత్రులారా!అమ్మకి సీరియస్‌గా ఉందని ఫోన్ రావడంతో హుటాహుటిన ఇండియాకి బయల్దేరాను. అమ్మ నన్ను కలవరిస్తోందని మా చెల్లెలు కాచి చెప్పింది. మూణ్ణెల్ల క్రితమే కుటుంబసమేతంగా అనాతవరం వెళ్ళి రావడంతో ఒక్కణ్ణే బయల్దేరాను.

“ఏజ్ కదా! డాక్టర్లు వారం కంటే బ్రతకడం కష్టం అంటున్నారు. నువ్వు వస్తే పొలాల పేపర్లమీద సంతకాలు పెట్టే పని కూడా వుంది,” అని అన్నయ్య చెప్పాడు.

క్రితం సారి వెళ్ళినప్పుడు పొలాల లావాదేవీల మధ్య మా ఇంట్లో పెద్ద గొడవే జరిగింది. మా అమ్మ పేరునున్న పొలం మా చెల్లెలు కాచి పేరున రాయిద్దామని అమ్మ కోరిక. అన్నయ్యకి మాత్రం సుతరామూ ఇష్టం లేదు. డబ్బు అవసరం నాకు అంతగా లేదు కాబట్టి అమ్మ ఇష్టం అని చెప్పాను. కాచి పేరునున్న ఆ అయిదెకరాలూ తనకే చెందాలన్నది అన్నయ్య వాదన.

నిజానికి అది అమ్మ పుట్టింటి ఆస్తి. మా అమ్మమ్మ పేర ఆ పొలాలున్నాయి. ఆవిడ పోతూ పోతూ ఎవరికీ తెలియకుండా అమ్మ పేర రాయించింది. అప్పట్లో మా నాన్నకది కంటగింపుగా ఉండేది. బ్రతికున్నన్నాళ్ళూ ఆ పొలం అమ్మేయాలని నాన్న చాలా ప్రయత్నాలు చేశాడు. అమ్మ మొండిగా ఇవ్వలేదు. హఠాత్తుగా నాన్న పోవడంతో ఆ పొలాల గురించి గొడవలు పోయాయి. ఏటా వచ్చే శిస్తుతో రోజులు సాఫీగానే పోతున్నాయి.

అన్నయ్య పేరున అనాతవరంలో పెద్దిల్లు, నాన్న సంపాదించిన ఏడెకరాల కొబ్బరితోట రాస్తానంది. నాకయితే చిల్లి గవ్వ కూడా అవసరం లేదన్నాను. అమ్మమ్మ పేరింటిదని ఆ పొలం కాచికే చెందాలని అమ్మకి బలంగా వుంది. మా అమ్మమ్మ పేరు కామేశ్వరి. అదే పేరు మా చెల్లెలికి పెట్టారు. ఇంట్లో అందరమూ కాచి అనే పిలుస్తాం. అమ్మమ్మ పోయి పాతికేళ్ళు దాటినా మా ఇంట్లో ఆవిడ పేరు నిత్యమూ ఏదో రకంగా మాటల్లో వస్తూనే ఉంటుంది. మా అమ్మమ్మకి అతి శుభ్రం. దానికితోడు చచ్చేటంత చాదస్తం. ఈ రెంటితో ఆవిడ అందర్నీ చంపుకుతినేది.

మా చెల్లెలు కాచికయితే అమ్మమ్మ పేరంటనే చికాకు. అది ఏం చేసినా, మాట్లాడినా – ‘పేరు పెట్టినందుకు అమ్మమ్మ పోలికలు బానే వచ్చాయని,’ అందరూ వేళాకోళం చెయ్యడంతో మరింత ఉడుక్కునేది. మా అమ్మమ్మకి కొడుకులు లేరు. ఇద్దరు కూతుళ్ళలో మా అమ్మ చిన్నది. అమ్మ పెళ్ళవగానే మా తాత పోవడంతో మా పంచన చేరింది. పెద్ద కూతురు ఢిల్లీలో ఉండేది. ఆవిడ అంతగా పట్టించుకోలేదు. మా అమ్మమ్మ పేరున్న పొలం మా అమ్మ పేరున రాయడంతో వాళ్ళకి కోపాలొచ్చి రాకపోకలు పూర్తిగా పోయాయి.

విమానం బొంబాయిలో దిగింది.

కస్టమ్స్ నుండి బయటకొస్తూండగా — “ఏయ్! రామం!” అంటూ ఎవరో పిలవడంతో వెనక్కి తిరిగి చూశాను. ఒకావిడ నాదగ్గరకొచ్చి, “నువ్వు కామేశ్వరిగారి మనవడు రామానివి కదూ? మీది అనాతవరం…” అంటూ ఆవిడ నా మొహంలోకి చూస్తూ అంటే చప్పున ఆవిణ్ణి గుర్తుపట్టాను. “మీరు చంద్రమతి కదూ?”

ఆవిడ నవ్వుతూ – “ఎన్నాళ్ళయ్యిందో మిమ్మల్ని చూసి. నువ్వు రామానివా, కాదా అన్న అనుమానం వచ్చింది. సరేలే కనుక్కుంటే పోలా అని కేకేశాను. నా ఊహ కరక్టే అయ్యింది. నువ్వు చిన్నప్పుడెలా వున్నావో అచ్చం అలాగే ఉన్నావు. ఏ మాత్రం మార్పు లేదు…” అంటూ నన్నొక్క మాటా మాట్లడనివ్వకుండా చెప్పుకుపోతోంది.

చంద్రమతిని చూసి పాతికేళ్ళు పైనే అయ్యింది. నాకంటే పదేళ్ళు పెద్ద. అప్పట్లో వాళ్ళు అనాతవరంలో మా ఇంట్లో అద్దెకుండేవారు. చంద్రమతి నాన్న అమలాపురం కోర్టులో ప్లీడరు గుమాస్తాగా పని చేసేవాడు. అప్పట్లో మా వూరు చుట్టుపక్కల చంద్రమతి గురించి తెలియని వాళ్ళు లేరు. ఎందుకంటే అమలాపురంలో ఉండే ఒక మెడికల్ రిప్రజెంటేటివుతో లేచిపోయింది. చిన్న చిన్న పల్లెటూళ్ళల్లో ఇలాంటి సంఘటనలు అరుదుగా జరిగేవి. ఎంతో నెమ్మదిగా నోరు మెదపలేని చంద్రమతి అలా చేసిందన్నది అందరికీ ఆశ్చర్యమే! కొంతమంది ఆత్మహత్య చేసుకు చచ్చిపోయిందనీ, అది పైకి చెప్పడం ఇష్టంలేక లేచిపోయిందనే పుకారు లేవదీశారని అనుకునే వారు. చంద్రమతి ఇన్నాళ్ళూ ఏమయ్యిందని అడుగుదామనుకొని ఆగిపోయాను.

చంద్రమతి మా కుటుంబం గురించి పేరుపేరునా అడిగింది. చెప్పాను. అమ్మకి బావోలేదన్న విషయం కూడా చెప్పాను.

“ఇప్పుడెక్కడుంటున్నావు? ఎంతమంది పిల్లలు?” అని అడిగింది.

“నేనా, బెహ్రైన్ ఆయిల్ కంపెనీలో ప్రోజెక్ట్ మేనేజర్ని. ఇద్దరబ్బాయిలు. గత పదేళ్ళుగా అక్కడే ఉంటున్నాం. ఏటా వచ్చి పోతూంటాం,” అని చెప్పి, తన గురించీ అడిగాను. చంద్రమతి ప్రస్తుతం బొంబాయిలో ఉంటున్నానని చెప్పి, అడ్రసిచ్చింది.

“చంద్రా, నువ్వు ఈ మధ్యలో అనాతవరం వెళ్ళేవా?” ఉండబట్టలేక అడిగాను. లేదన్నట్లు తలూపింది. అమ్మా నాన్నా పోయి చాలా కాలమయ్యిందని మాత్రం చెప్పింది. నేను వివరాల కోసం రెట్టించలేదు.

“అవును. మీ చెల్లెలు కాచి ఎక్కడుంది? చిన్నప్పుడు భలే ముద్దుగా ఉండేది!”

“పెళ్ళయిన అయిదేళ్ళకే భర్త పోవడంతో అనాతవరంలోనే ప్రస్తుతం అమ్మ దగ్గర ఉంటోంది, చిన్న బిడ్డతో,” అని కాచి గురించి చెప్పాను.

“అయ్యో! అంత చిన్న వయసులో భర్త పోవడం అన్యాయం. మళ్ళీ పెళ్ళి చేసుకోవచ్చు కదా?”

“మా అమ్మకీ దాని గురించే బెంగ. పెళ్ళి చేసుకోమని అందరమూ పదే పదే పోరుతున్నాం. నాకు తెలుసున్న ఒకాయన చేసుకోవడానికి రెడీ. మా చెల్లెలొక మూర్ఖురాలు. మాట వినదు. పేరు పెట్టినందుకు అంతా మా అమ్మమ్మ పోలికలే!”

“తప్పు రామం. పోయినవాళ్ళని నిందించడం మంచిది కాదు. నువ్వే మీ చెల్లికి నచ్చ చెప్పి చూడు,” అన్నది చంద్రమతి. మేము గత పదేళ్ళుగా కాచిని రెండో పెళ్ళి విషయమై ఎంత పోరుతున్నామో చెప్పాను.

నా హైదరాబాదు ఫ్లయిటుకి ఇంకా రెండు గంటలుంది. ఇద్దరం పాత జ్ఞాపకాలు బాగానే నెమరువేసుకున్నాం. చంద్రమతికి ఇద్దరు పిల్లలనీ, భర్త ఒక చిన్న ఫార్మాసూటికల్ కంపెనీ నడుపుతున్నాడనీ చెప్పింది. నేను చంద్రమతి గతం గురించి తెలుసుకోవాలన్న ఉత్సాహం ఉన్నా, ప్రశ్నించలేదు. నా ఫోన్ నంబరూ, అడ్రసూ తీసుకుంది. తిరిగెళ్ళేటప్పుడు వాళ్ళింటికి రమ్మనమని పిలిచింది. తప్పకుండా వస్తానని చెప్పాను. చంద్రమతి మద్రాసు ఫ్లయిటుకి టయిమవ్వడంతో బయల్దేరడానికి లేచింది.

“వస్తా రామం. నిన్ను కలవడం ఎంతో ఆనందంగా ఉంది. మీ వాళ్లని అడిగానని చెప్పు,” అంటూండగా ఆమె కళ్ళల్లో సన్నటి నీటిపొర స్పష్టంగా కనిపించింది. వెళుతూ వెళుతూ వెనక్కి తిరిగి వచ్చింది.

“రామం! నిన్నొకటి అడగచ్చా?” తటపటాయిస్తూ అంది.

“ఏవిటి? చెప్పు చంద్రమతీ!”

“నాకు మీ అమ్మమ్మగారి ఫోటో ఉంటే ఇవ్వగలవా? ప్రతీరోజూ సంగీత సాధన చేసేటప్పుడు ఆవిణ్ణే తలచుకుంటాను,” అంటూంటే ఆమె కళ్ళనుండి నీళ్ళు జలజలా రాలాయి.

“తప్పకుండా!” అని చెప్పి శలవు తీసుకున్నాను.

చంద్రమతి మా అమ్మమ్మ దగ్గర సంగీతం నేర్చుకోవడానికి వచ్చేది. మా అమ్మమ్మకి సంగీతం బాగా వచ్చు. చాలా బాగా పాడేది. కాచికి అంతా అమ్మమ్మ పోలికలే, రూపం, తీరూ, మాటతో సహా. ఈ ఒక్క సంగీతం తప్ప.

చంద్రమతిని కలిశాక హైదరాబాదు ఫ్లయిటులో అనాలోచితంగా నా ఆలోచనలన్నీ మా అమ్మమ్మ చుట్టూనే తిరిగాయి. నేను తొమ్మిదో తరగతిలో ఉండగా అమ్మమ్మ పోయింది. మా అమ్మమ్మకీ, నాకు అంతగా పడేది కాదు. మా ఇంట్లో ఒక చెక్క బీరువా ఉండేది. అందులో పైన రెండు అరలూ అమ్మమ్మవి. క్రింద రెండరల్లో నా బట్టలుండేవి. ఆవిడ అరలో తెల్ల బట్టలూ, కాసిని సామాన్లూ ఉండేవి. నేనేదో ఆవిడ వస్తువులు కెలికేస్తానని ఆవిడకి చచ్చేటంత అనుమానం. చిన్న గుడ్డసంచీలో డబ్బు దాచుకునేది. అది ఎప్పుడూ నడుం దగ్గర దోపుకునేది. ఆవిడకి అతి శుభ్రం. నేనొక ఎడ్డి మనిషిలా ఉండేవాణ్ణి. ఇద్దరం చచ్చేట్టు కొట్టుకునేవాళ్ళం. ఆవిణ్ణి తిట్టాల్సి వస్తే కాచి పేరు వంకపెట్టి చెల్లెల్ని తిట్టేవాణ్ణి. ఎన్ని విసుక్కున్నా ఎంతైనా మనవణ్ణి కదా, ఆవిడే సద్దుకునేది. మిగతా విషయాల్లో ఎలా వున్నా రెణ్ణెల్లకోసారి మంగలాడ్ని పిలిచే సమయానికి మాత్రం బాగానే కాకా పట్టేది.

అమ్మమ్మకి మొగుడు పోయాక శిరోముండనం చేయించారు. అందువల్ల నెత్తి మీద ముసుగేసుకొనేది. చూడ్డానికి పచ్చగా దబ్బపండులా ఉన్న అమ్మమ్మ మొహమ్మీద తెల్ల ముసుగు మాత్రం ఆవిడ జీవితంలో నల్లమచ్చే! మొగుడు పోయాక ఆడపడుచూ, అత్తగారూ దగ్గరుండి శిరోముండనం చేయించారని వాళ్ళని రోజూ తెగ తిట్టుకునేది. మగపిల్లలు లేకపోవడం వల్ల కూతురు పంచన చేరానన్న అసంతృప్తి ఆవిడ మాటల్లో కనిపించేది. దానికి తోడు మా నాన్నకి అమ్మమ్మంటే గిట్టేది కాదు. మొగుడు పోయాక ఆవిడ ఆస్తిని తన పేర రాయమని నాన్న అడిగితే రాయను పొమ్మంది. నాన్న గయ్యిమని లేచాడు. అమ్మ మాట కాదనలేక ఆవిణ్ణి చూడక తప్పలేదు. నాన్న మాత్రం ఆవిణ్ణి చాలా విసుక్కునేవాడు. లోపల ఏం బాధపడిందో తెలీదు, ఎప్పుడూ నాన్నని ఒక్క మాటనేది కాదు.

మా బాబయ్యకి పిల్లలు లేకపోతే నన్ను దత్తత తీసుకుందామని మాటలొచ్చాయి. మా నాన్న సరేనన్నాడు. అమ్మకిష్టం లేదు. ఆ విషయమై అమ్మని ఒప్పించడానికి మా ఇంటికొచ్చినప్పుడు మా బాబయ్యని దులిప్పడేసింది మా అమ్మమ్మ.

“నిజంగా పిల్లలంటే మమకారం ఉంటే బీదవాళ్ళ పిల్లల్ని పెంచుకో! అయినా రామం గాడే కావాలా? కాచిని ఎందుకు దత్తు తీసుకోవు? ఏం? ఆడపిల్ల పనికిరాదా?” అంటూ బాబయ్యని చీల్చి చండాడేసరికి బాబయ్య మరలా మా గుమ్మం తొక్కితే ఓట్టు.

చిన్నప్పటి సంఘటన నాకింకా గుర్తు. ప్రతీసారి మంగలాడ్ని పిలిచినప్పుడు మాత్రం అమ్మమ్మ ఆ రోజంతా ఏడుస్తూనే ఉండేది. మంగలాడు పెరటి సందు వైపు వచ్చేవాడు. దూరం నుండి గుండు గీయించడం చూస్తూండేవాణ్ణి. చేస్తున్నంత సేపూ ఆవిడ కళ్ళల్లో నీళ్ళు జల జలా రాలేవి.

ఓ సారి ఎందుకేడుస్తోందోనని తెలుసుకోవాలని అడిగాను.

“ఎందుకమ్మమ్మా ఏడుస్తావు? మంగలాడు గుండు గీస్తే నొప్పి పెడుతోందా?”

“లేదురా! నొప్పి గుండుక్కాదు!” అంటూ ఏడుస్తూ గుండె మీద చెయ్యేసుకుని జవాబిచ్చింది.

“జుట్టు పోయిందనా? మళ్ళీ వచ్చేస్తుంది కదా?” ఆవిడ జవాబు అర్థంకాక అమాయకంగా అడిగేవాణ్ణి. ఎంత తిట్టుకున్నా అమ్మమ్మ ఏడవడం మాత్రం నేను తట్టుకోలేకపోయేవాణ్ణి. చిన్నతనంలో బాధ అంటే తెలిసేది కాదు.

నాకప్పుడు ఆవిడేం చెబుతోందో అర్థం కాలేదు. ఇప్పుడవన్నీ తలచుకుంటే బాధ కలుగుతుంది. అమ్మమ్మ శిరోముండనం సంఘటన తలుచుకున్నప్పుడల్లా బాధేస్తుంది. దారీ, గతీ లేక మా పంచన చేరిన ఆవిడ ఎంత నరకం అనుభవించుంటుందో కదా అనిపిస్తుంది. ఒక పక్క నాన్న చికాకు, మరో పక్క అన్నయ్యా నేనూ విసుగులు, తిట్లూ. వీటికి తోడు పక్కింటి వాళ్ళ వెటకారాలు, పనిమనుషుల ఈసడింపులూ. పైకి మాత్రం ఏమీ అనేది కాదు. ఏ త్యాగరాజ కృతో, రామదాసు భజనో పాడుకుంటూ కూర్చునేది. ఒక్కోసారి అది కూడా చేసుకోనిచ్చే వాళ్ళం కాదు.

“అబ్బా! ఆపవే ఆ కాకి సంగీతం. కావాలంటే పెరట్లో బాదం చెట్టుక్రింద కూర్చుని పాడుకో!” అని అందరూ విసుక్కునేవాళ్ళు. అలాగే చేసేదావిడ.

చంద్రమతికి అమ్మమ్మ సంగీతం నేర్పేది. చంద్రమతికి పదహారో ఏటే పెళ్ళి చేసి అత్తారింటికి పంపారు. ఒకమ్మాయి పుట్టింది కానీ అనారోగ్యంతో ఏడాదికే పోయింది. పెళ్ళయిన అయిదేళ్ళకే మొగుడు పోతే అత్తగారి వాళ్ళ బాధలు పడలేక పుట్టింటికొచ్చేసింది. కుట్ట్లూ, అల్లికలూ వచ్చు. ఊళ్ళో వాళ్ళకి బట్టలు కుట్టేది. వాళ్ళ పిన్ని వాళ్ళింటికి తరచు అమలాపురం వెళ్ళొచ్చేది. వెళ్ళినప్పుడల్లా అమ్మమ్మకి పటిక బెల్లం, ఆల్బకరా పళ్ళూ పట్టుకొచ్చేది.

అమ్మమ్మ పోయే రోజు నాకింకా గుర్తుంది. బీపీ పెరగడంతో ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ లాభంలేదంటే ఇంటికి తీసుకొచ్చేశారు. ఇహ చివరి దశలో పెరట్లో బాదంచెట్టు క్రింద ఒక చిన్న పందిరి వేసి పడుకోపెట్టారు. శీతాకాలం చలి తట్టుకోలేక మేం లోపలకి వచ్చేసేవాళ్ళం. అమ్మ మాత్రం రాత్రి చాలా సేపటివరకూ అక్కడే ఉండేది. వెచ్చదనం కోసం కుంపట్లో బొగ్గులు వేసి అమ్మ మంచం క్రింద పెట్టేది. బాదంచెట్టు క్రింద పెట్టిన రోజు బీరువాలో ఉన్న చిన్న సంచీ తెచ్చిచ్చే వరకూ అమ్మని పోరుతూనే ఉంది. అమ్మ ఆవిడ మీద జాలిపడి తెచ్చిచ్చింది. పోయేటప్పుడు కూడా ఇంకా ఈ మమకారమేనా అని అందరూ విసుక్కున్నారు. ఓ నాలుగు రోజుల తరువాత అమ్మమ్మ పోయింది.

ఆవిడ పోయాక తలగడ క్రింద చిన్న చేతి సంచీ. నాన్న విప్పి చూశాడు. అందులో ఒక చిన్న పొట్లం ఉంది. డబ్బేమోననుకొని చూస్తే ఒక చిన్న పిన్నీసుకు చుట్టి పొడవాటి వెంట్రుకలున్నాయి. అమ్మమ్మ అందంగా ఉండేదనీ, పొడవాటి జుట్టుండేదనీ అమ్మ తరచు చెప్పే మాటలు గుర్తొకొచ్చాయి నాకు. అప్పుడర్థమయ్యింది అమ్మమ్మ శిరోముండన సమయంలో ఎందుకు ఏడ్చేదో? అప్పట్లో అర్థం కాకపోయినా ఆవిడ మాటలు ఇప్పటికీ నా చెవిలో మారు మ్రోగుతూనే ఉంటాయి.

“పోయింది జుట్టు కాదురా! స్వేచ్ఛ!”

ఇప్పుడీ మాటలకి అర్థం తెలుసు. దాని వెనుక బాధ కూడా తెలుసు.

అనాతవరం వెళ్ళకుండా సరాసరి అమలాపురం హాస్పటల్కి వెళ్ళాను. నేను వెళ్ళిన రోజు అమ్మ నన్ను చూసింది. అతి కష్టమ్మీద మాట్లాడింది. కాచి పెళ్ళి అంటూ మగతగా ముద్దగా మాట్లాడింది. చూడు అంటే కాచిని అందేమోననుకొని అలాగేనని చేతిలో చెయ్యి వేశాను. ఆ మర్నాడు అమ్మ కోమాలోకి వెళ్ళిపోయింది. రెండ్రోజుల తరువాత పోయింది.

పదోరోజు కార్యక్రమాలు పూర్తయ్యాక అన్నయ్య అమ్మ పేరు మీదున్న బ్యాంక్ లాకరు తెరిపించాడు. అమ్మ పేరు మీదున్న నాలుగెకరాల పొలమూ కాచి పేర రాసిన పత్రాలు చూసి అన్నయ్య అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. నేనూ దెబ్బలాడేను. కాచికి బ్రతకడానికి ఆసరా కావాలని. అమ్మ బంగారం మనవరాళ్ళకివ్వాలనీ, వంశపారంపర్యంగా వచ్చిన అమ్మమ్మ గాజు మాత్రం కాచికి చెందాలని రాసింది.

అసలు అమ్మమ్మతో నాకు మాటలు పోవడానికి కారణం కూడా ఈ గాజే. ఆవిడ పోయేవరకూ మాట్లాడనంత ద్వేషం నాలో పెరిగిపోయింది. నేను తొమ్మిదో తరగతిలో ఉండగా మా ఇంట్లో అమ్మమ్మ మీద యుద్ధమే జరిగింది. ఎందుకంటే అమ్మమ్మ చేతికి కంకణాల్లాంటి నాలుగు గాజులుండేవి. ఎవరికీ ఇచ్చేది కాదు, మా అమ్మక్కూడా. అలాంటిది ఆ రెండుజతల గాజుల్లో మూడు పోయాయి. ఒకటే ఉంది. శిరోముండనం సమయంలో చేతి గాజులు తీసేసి బీరువాలో పెట్టేది. వచ్చి చూస్తే అందులో ఒకటే ఉంది. మిగతా మూడూ మాయమయ్యాయి. ఆవిణ్ణి ఆట పట్టించడానికి నేనూ, అన్నయ్య దాచామని అనుకున్నారు. అందరూ నన్నూ, అన్నయ్యనే అనుమానించారు. మాకేం తెలియదు మొర్రో అన్నా నాన్న వినిపించుకోలేదు. మామూలు దెబ్బలు కాదు. నాన్న చచ్చేట్లా కొట్టారు. మేం తీయలేదని తెలిశాక నాన్న అమ్మమ్మని గట్టిగా తిట్టాడు. ఆ గాజులు తనకిస్తే బ్యాంకులో పెట్టేవాణ్ణి కదాని కసురుకున్నాడు. అమ్మ కూడా అమ్మమ్మ మీద ఎగిరింది. ఉత్తప్పుడయితే మాటకి మాట చెప్పే అమ్మమ్మ ఆ క్షణంలో నోరు విప్పితే ఒట్టు. ఎవరు తీశారో తెలీదు. ఆవిడ గాజులు మాత్రం పోయాయి. ఆ తరువాత ఆవిడ పోయేవరకూ నేను మాట్లాడితే ఒట్టు. ఆవిడంటే నాకు విపరీతమైన కోపం. ఇప్పటికీ నాన్న కొట్టిన దెబ్బలు నేను మర్చిపోలేదు. ఆవిడ పోయింది. కానీ ఇంకా ఆవిడ మా మధ్య తగాదాలకి కారణం అవుతూనే ఉంది.

కాచి పేరునే ఎక్కువ వాటా వెళ్ళడం అన్నయ్యకీ, వదినకీ మింగుడు పడలేదు. ముఖ్యంగా అమ్మమ్మ గాజు మీద వదిన కన్నుపడింది. మంచి నగిషీతో ఉన్న కంకణం లాంటి గాజు కనీసం నాలుగైదు తులాలుంటుంది. ఈ విషయంలో కాచికీ, వదినకీ మధ్య గొడవ జరిగింది. అత్తగారి గుర్తంటూ వదిన ఏడుస్తూ చాలా ఓవరాక్షన్ చేసింది. సెంటిమెట్లకిచ్చే విలువ మనుషులకుండదనుకొని వెనక్కి వచ్చేశాను. ఈ గొడవంతా చూసి కాచి తనపేర రాసింది కాబట్టి తనకే చెందాలని పట్టు పట్టింది. అన్నయ్యా వదినా కొంత గొడవ చేశారు. కాచిని ఎదిరించలేక ఊరుకున్నారు. అన్నయ్య మాత్రం కాచి మీద గుర్రుగానే ఉన్నాడు. ఇదంతా అమ్మమ్మ వల్లే వచ్చిందనుకుంటూ గట్టిగా పైకి తిట్టాను.

“మధ్యలో అమ్మమ్మేం చేసిందట? వీళ్ళని అనలేక ఆవిణ్ణెందుకు తిట్టుకోవడం? అయినా ఆవిడంటే నీకెప్పుడూ పడదు. పోయినవాళ్ళని తిట్టుకోకూడదని…” కాచి అలా అనేసరికి కాస్త వెనక్కి తగ్గాను.

అన్నయ్యా వదినల తీరు చూస్తే కాచికి ఆసరాగా ఉంటారన్న నమ్మకం పోయింది. వాళ్ళ ప్రవర్తన చూసి చికాకేసింది. ఈ రాద్ధాంతం చూసాక కాచితో ఒంటరిగా మాట్లాడలని అమలాపురం వెళ్ళే వంకన బయటకి వచ్చాం.

“కాచీ, ఇప్పటికయినా నా మాట విను. నువ్వు పెళ్ళి చేసుకో! ఇలా అన్నయ్య పంచన ఎన్నాళ్ళుంటావు? నీ కోసం కాకపోయినా ఆ పిల్లాడి కోసమయినా…” అని మరోసారి అమ్మ మాటగా చెప్పాను.

“నువ్వు చెప్పినంత ఈజీ కాదురా అన్నాయ్యా! నాక్కొంచెం టైమియ్యి,” అంది.

బయల్దేరుతుండగా చంద్రమతి అమ్మమ్మ ఫొటో అడిగిన సంగతి గుర్తుకొచ్చింది. పాత ఫొటో ఆల్బమ్స్ అన్నీ తిరగేశాను. చిత్రం అమ్మమ్మది విడిగా ఒక్క ఫొటో లేదు. తాతయ్యా, అమ్మమ్మా ఉన్న ఒక్క ఫోటో ఉంది. గబగబా తీసి బ్యాగులో పెట్టుకుని తిరుగు ప్రయాణం కట్టాను.

“నీకేం కావాలన్నా నేనున్నాను, మర్చిపోకు!” అని కాచి చెయ్యి పట్టుకొని చెప్పాను.

హైదరాబాదు వచ్చాక చంద్రమతికి ఫోను చేసి అమ్మ పోయిన సంగతి చెప్పాను. వాళ్ళింటికి వస్తానని చెబితే తనే కారు తీసుకొస్తానని చెప్పింది. బొంబాయి చేరగానే ఎయిర్పోర్టుకొచ్చింది. కారులో వాళ్ళింటికి బయల్దేరాము. అనాతవరం విశేషాలు చెప్పాను. అమ్మమ్మ ఫోటో సంగతి గుర్తొచ్చి బ్యాగులోంచి తీసి చంద్రమతికిచ్చాను. దానికేసి చూస్తూ కంట నీరు పెట్టుకుంది.

“ఈ ఫోటో మీ అమ్మమ్మగారిదే? నా వరకూ ఆవిడ నెత్తిమీద ముసుగేసుకున్న రూపమే గుర్తుంది. వయసులో ఎంత అందంగా ఉందో ఆవిడ. ముఖ్యంగా ఆ పొడవాటి జడ!”

“ప్రయాణం హడావిడిలో ఆల్బంలో చేతికందిన ఫొటో తీసుకొచ్చాను. ముసుగుతో ఆవిడ ఫొటో ఉంటే పంపమని కాచికి చెబుతాను.”

అమ్మమ్మ పోయిన సంగతీ పోయినప్పుడు సంచీలో ఉన్న జుట్టు గురించీ చెప్పాను. వింటూ ఏడ్చింది.

“రామం! నిన్ను కలుస్తానని కల్లో కూడా ఊహించలేదు. మీ అమ్మమ్మ ఫొటో చూస్తే ఏడుపొచ్చేస్తోంది. ఇన్నాళ్ళూ నాలో దాచుకున్న నిప్పు నీతో చెప్పుకుంటే కానీ చల్లారదు,” అంటూ బిగ్గరగా ఏడ్చింది. ఏం మాట్లాడాలో తెలీలేదు. మౌనంగా ఉండిపోయాను.

“…మీ అందరికీ తెలుసు. నేను ఒక మెడికల్ రిప్రజెంటేటివుతో లేచిపోయానని. నిజానికి నాకంత ధైర్యమూ, తెగువా లేవు. పిన్నీ వాళ్ళింటికి అమలాపురం వెళ్ళేదాన్ని. వాళ్ళ పక్కవాటాలో ఆయన ఉండేవారు. నన్ను చూసి పెళ్ళి చేసుకుంటానని చెప్పారు. అమ్మా, నాన్నా ఒప్పుకోలేదు. పైగా ఆయనది కాపు కులం. ఆయన ఒప్పించడానికి ప్రయత్నించారు. ఈ పెళ్ళి జరిగితే నాన్న చస్తానని బెదిరించారు. సరిగ్గా ఆ సమయంలో ఈ విషయం మీ అమ్మమ్మ గారికి చెప్పాను. ఆవిడ ప్రేరణ వల్లే…” అంటూ ఆగిపోయింది.

“పారిపో! ఇంతకంటే మంచి అవకాశం నీకు జన్మలో రాదు. నిర్భయంగా వెళ్ళి పెళ్ళి చేసుకో! ఏ కులమయితేనేంటి? మగాడేగా? మనిషేగా? అమ్మా నాన్న ఎల్లకాలం ఉండరు. ఈ కూపస్థమండూకాల మధ్య నీకు స్వేచ్ఛ ఉండదు – అంటూ నాకు లేని తెగువా, ధైర్యమూ నూరిపోసింది మీ అమ్మమ్మగారే!”

ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను. మెల్లగా లేచి బీరువాలోంచి ఒక చిన్న పేకట్టు తీసుకొచ్చి విప్పింది. వాటిని క్షణంలో గుర్తుపట్టాను.

“ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి చూడొద్దని నాకు అవసరానికుంటుందని నాకిచ్చారు. ఇన్నేళ్ళూ పదిలంగా దాచుకున్నాను. నువ్వు కనిపించావు. నా భారం తీరింది. ఇవి మీకు చెందాల్సినివి. తీసుకో!” అంటూ నా చేతిలో పెట్టింది.

ఈసారి నాకళ్ళ నీళ్ళొచ్చాయి. శిరోముండన సమయంలో అన్న అమ్మమ్మ మాటలు గుర్తుకొచ్చాయి.

“పోయింది జుట్టు కాదురా! స్వేచ్ఛ!”
----------------------------------------------------------
రచన: సాయి బ్రహ్మానందం గొర్తి, 
కోనసీమకథలు, ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment