Friday, June 29, 2018

” ప్రభావతీ ప్రద్యుమ్నం” - 2


” ప్రభావతీ ప్రద్యుమ్నం”  - 2




సాహితీమిత్రులారా!


ప్రభావతీ ప్రద్యమ్నం రెండవ భాగం ఆస్వాదించండి-

తలగడగా రుక్మిణి తొడలు. కాళ్ళొత్తుతూ సత్యభామ. సురటి (గుండ్రటి విసనకర్ర)తో భద్ర. వింజామర వీస్తూ మిత్రవింద. కాళంజి (తాంబూలం వూసే పాత్ర) ధరించి కాళింది. తమలపాకులిస్తూ జాంబవతి. గొడుగు, పాంకోళ్ళు పట్టుకుని నాగ్నజితి. నీళ్ళ గిన్నెతో లక్షణ మెరుపుతీగల పక్క నల్లమబ్బులాగా అష్టభార్యల్తో కృష్ణుడుంటే నిండు నెలవంకలా అక్కడికొచ్చింది శుచిముఖి!
ఆడవాళ్ళంతా ముక్కున వేలేసుకున్నారు అలా నదురు బెదురూ లేకుండా వస్తున్న రాజహంసిని చూసి.
కృష్ణుడి దగ్గరగా వెళ్ళి “ఇంద్రుడు పంపగా వచ్చేను ఓ మాట చెప్పి వెళ్దామని ఏకాంతంగా!” అంది శుచిముఖి తన కొడుకుని రాక్షసుడి మీదికి పంపటం రుక్మిణికి నచ్చకపోవచ్చని అనుమానిస్తూ.
దాని ఆలోచనకి ముచ్చట పడి లేచి కూర్చున్నాడు కృష్ణుడు.
అతని భార్యలంతా దూరంగా వెళ్ళేరు.
ఇంద్రుడు తనని పిలిపించిందగ్గర్నుంచి జరిగిందంతా వినిపించింది శుచిముఖి.
చిరునవ్వుతో కృష్ణుడు, “ఔను. ఇది మంచి ఆలోచన. ప్రభావతికి భర్తయ్యే వాడు నిశ్చయంగా ప్రద్యుమ్నుడే! అందగాడు,వీరుడు, రాక్షసుల కన్న ఎక్కువగా మాయలు నేర్చిన వాడు! తప్పకుండా ఆ వజ్రనాభుణ్ణి చంపుతాడు! .. ఇక ఆ వజ్రపురానికి వెళ్ళటానికి దారి కూడ సిద్ధం చేసేన్నేను. భద్రుడనే నటుడు నా తండ్రి యాగానికి వచ్చి తన ఆటల్తో మునుల్ని మెప్పించి ఎన్నో వరాలు పొందేడు. వాటి వల్ల ఇప్పుడు ప్రపంచమంతా తిరుగుతూ ప్రదర్శన లిస్తున్నాడు. నువ్వు వజ్రనాభుడికి అతని గురించి చెప్పి అతన్ని వజ్రపురానికి ఆహ్వానించేట్టు చెయ్యి. ప్రద్యుమ్నుడు భద్రుడిగా అక్కడికొస్తాడు… ఇక నువ్వు వెళ్ళి ఆ పని జరిగేట్టు చూడు” అని ఆదేశించేడు.

వజ్రపురం వైపుకు బయల్దేరేయి హంసలన్నీ.

ద్వారకానగరం బయట
ఆటలాడుతున్నాడు ప్రద్యుమ్నుడు
తనెక్కిన గుర్రం తన మనసు తెలుసుకుని పరిగిడుతుంటే బంతిని కింద పడకుండా బంగారు కోలతో కొడుతూ!
బంతిని నేలకి కొట్టి అది పైకి లేస్తే దాన్ని కొట్టటం ఎవరైనా చేస్తారు. అతనలా కాకుండా బంతిని వేగంగా పైకెగరేసి అది కింద పడకుండా కొడుతూ ఆకాశంలోనే ఉంచి అడుతున్నాడు వాయువేగంతో గుర్రం మీద అటూ ఇటూ తిరుగుతూ! చూసేవాళ్ళు అతని వేగానికి, చాతుర్యానికి ముగ్ధులౌతున్నారు.
కాసేపలా ఆడి తృప్తిగా ఆపి గుర్రం దిగేడు.

పైనుంచి ఇదంతా చూసింది శుచిముఖి.
“మనం అనుకుంటున్నతను ఇతనేననుకుంటా. ఇతంతో రెండు మాటలు మాట్టాడి వెళ్దాం” అంది పెద్దగా, అతనికి వినపడేటట్టుగా.
అంటూండగనే హంసలన్నీ కిందికి దిగేయి, అతనికి దగ్గర్లో!
కుతూహలంగా వాళ్ళని చూస్తూ, “ఇక్కడెవర్తోనో మాట్టాడాలన్నారు కదా! ఎవరతను? ఏ పని మీద వెళ్తున్నారు మీరు?” అనడిగాడతను.
మనోహరమైన స్వరంతో శుచిముఖి చెప్పింది “ఇంకెవర్తోనో కాదు, నీతోనే మా పని! ఇంద్రుడు పంపితే నీ తండ్రి దగ్గరికొచ్చి వాళ్ళిద్దరి ఆజ్ఞలు తీసుకుని ఓ చోటికి వెళ్ళబోతున్నాం. కృష్ణుడికి కుడిభుజం లాంటి వాడివి నువ్వు. కనక ఓ సారి నిన్నూ పలకరించి వెళ్దామని దిగేం. వస్తాం మరి”
“మీ పని గురించి అడగను గాని, ఇందాక “మనం అనుకుంటున్నతను ఇతనేననుకుంటా” అన్నారు కదా! నా విషయం ఎందుకొచ్చిందో ఎక్కడొచ్చిందో ఐనా నాకు చెప్పకూడదా?”
“అది రహస్యం. పైగా ఒక్క క్షణం కూడ ఆలస్యం చెయ్‌ కూడదు మేం. కాని నీకూ కృష్ణుడికీ తేడా లేదు గనక యిదివరకు నీ విషయం ఎక్కడొచ్చిందో చెప్తా” అంటూ అనుమానంగా చుట్టూ చూసింది శుచిముఖి. దాని చూపు వెంటనే తిరిగిందతని చూపు కూడ. ఆ చూపు తోటే దూరంగా తప్పుకున్నారు చుట్టుపక్కల వాళ్ళంతా.
“వజ్రనాభుడనే రాక్షసుణ్ణి చంపటానికి ఇంద్రుడూ, నీ తండ్రీ కలిసి చాలా రోజులుగా ఆలోచిస్తున్నారు. ఐతే వీళ్ళ కన్నా ముందు వాడే ఏదైనా అఘాయిత్యం చేస్తాడేమో కనిపెట్టమని పంపితే మేం యిప్పుడా వజ్రనాభుడి పురానికి పోతున్నాం” అంది శుచిముఖి గుట్టుగా.
“ఇంత చిన్న పనికి వాళ్ళిద్దరూ ఇన్నాళ్ళు ఆలోచించాలా? నన్నొకణ్ణి పంపితే ఎప్పుడో పూర్తిచేసేవాణ్ణే!” అన్నాడు ప్రద్యుమ్నుడు బాధ పడుతూ.
“నిజంగా వీరుడివంటే నువ్వు. ఇంద్రుడూ, కృష్ణుడూ కూడ చాలా రోజులుగా ఆలోచిస్తున్నారంటే ఆ రాక్షసుడెలాటి వాడో అన్న ఆలోచనైనా లేకుండా ఒక్కడివే వెళ్ళి వాణ్ణి చంపుతానంటున్నావ్‌!.. సరే, యిదివరకు నీ విషయం ఎందుకొచ్చిందో చెప్తా. ఆ మధ్య ఓ సారి వజ్రపురానికి వెళ్ళినప్పుడు ఆ వజ్రనాభుడి కూతుర్ని చూసేన్నేను. ఆమె అందం గురించి చెప్పాలంటే లోకాలన్నీ చూసిన నాకే మాటలు దొరకటం లేదు! ఏవైనా ఉపమానాలు వాడి వర్ణిద్దామంటే సిగ్గేస్తోంది! ఎంత చెప్పినా ఆ అందం దానికి కోటి రెట్లుంటుంది! .. నాకు భాషలో పాండిత్యం లేక్కాదు చెప్పలేంది సరస్వతీ దేవి స్వయంగా తనంత దానిగా చేసింది నన్ను… అసలు, గొప్ప శబ్దసంస్కారం ఉంది గనకే నాకు “శుచిముఖి” అని పేరు పెట్టిందా దేవి. ఓ రోజు తన పెంపుడు చిలక్కీ నాకూ కవిత్వంలో పోటీపెట్టి నన్ను మెచ్చుకుని “ఉపమాతిశయోక్తి కామధేను” అనే బిరుదు కూడ స్వయంగా తన చేత్తో రాసి నా కాలికి తొడిగింది. కావాలంటే ఇదుగో చూడు” అంటూ తన బిరుదు నూపురం అతనికి చూపించింది శుచిముఖి. “అలాటి నాకే ఆ కన్య రూపం వర్ణించటం అలివి కాని పని. పోనీ బొమ్మ గీద్దామా అంటే బ్రహ్మకే అలాటి దాన్ని మరొకర్ని సృష్టించటం చేతకాలేదంటే ఇక గియ్యటం నా వల్లనౌతుందా? .. అసలు బ్రహ్మే ఓ సారి అంటుంటే విన్నా, ఆమెని తను సృష్టించ లేదని, పార్వతీదేవే సృష్టించిందని! అన్నట్టు నీకు చెప్పలేదు గదూ, ఆమె పేరు ప్రభావతి. ఆ ప్రభావతి తన కల్లో ఆ పరమేశ్వరి రాసిచ్చిందని తన చెలికత్తెకి ఓ చిత్రపటం చూపిస్తుంటే చూసేన్నేను. ఆ బొమ్మలో ఉన్నతను అచ్చం నీ పోలికల్తోనే ఉన్నాడు. దాని గురించే “మనం అనుకుంటున్నతను ఇతనేననుకుంటా” అన్నదిందాక… సరే,ఇప్పటికే చాలా ఆలస్యం ఐంది. ఇంక వస్తాం” అంటూ ఆకాశాని కెగిరింది శుచిముఖి మిగిలిన హంసల్తో.

వజ్రపురానికి చేరి కన్యాంతఃపురంలో కొలన్లలో తిరగసాగేయవి!

ఇక్కడ ప్రద్యుమ్నుడు ప్రభావతి గురించి శుచిముఖి చెప్పిందంతా మళ్ళీ మళ్ళీ తల్చుకుంటూ ఉంటే, ఆమెని చూడకపోయినా ఆశ్చర్యంగా ఆమె రూపం అతని మనసులో హత్తుకుంది! చుట్టూ ఉన్నవాళ్ళని, పరిసరాల్ని మర్చిపోయి ప్రభావతినే తల్చుకుంటూ బాధపడసాగేడతను “అయ్యో, ఆ శుచిముఖి నాలాటి వాణ్ణే చిత్రంలో చూశానంటే ఆ విషయం ఏదో ఖచ్చితంగా కనుక్కుని ఉండొచ్చు కదా! ఆ హంస ఏమనుకుందో గాని ఆ తర్వాత ఒక్క క్షణం నిలబడకుండా ఎగిరిపోయింది! ఆలోచించి చూస్తే అది ప్రభావతి అందాన్ని నా దగ్గర అంతగా వర్ణించటానికి కారణం నా స్పందన ఎలా వుంటుందో చూడ్డానికిలా ఉంది. అది తనంత తనే ఇక్కడ దిగి నా తండ్రీ, ఇంద్రుడూ కలిసి వజ్రనాభుణ్ణి చంపే ఆలోచనలో ఉన్నట్టు చెప్పటం, నేను నా తండ్రికి కుడిభుజం లాంటి వాణ్ణని అనటం వీటిని బట్టి ఆ వజ్రపురానికి వాళ్ళు నన్ను పంపాలని అనుకుంటున్నట్టు కూడా అనిపిస్తోంది. ఆ విషయం తెలిసిన హంస నాకా కన్య చక్కదనాన్ని గురించి అంతగా చెప్పిందంటే ఆ చిత్రం నాదేనని నమ్మకం కలుగుతోంది! ఐనా, ఆ హంస ప్రభావతి తన సృష్టి కాదని బ్రహ్మ అంటుంటే విన్నానంది కదా! అప్పుడతను ఆమెక్కాబోయే భర్త ఎవరో కూడా చెప్పాడేమో ఆ హంసని అడిగుండొచ్చు కదా, నా బుద్ధి ఏమైపోయింది? ఇక ఇప్పుడా హంస మళ్ళీ ప్రభావతి దగ్గరికి వెళ్తుందో లేదో!”

ఉద్యానవనంలో తిరుగుతున్నాడతను. పూలలో, లతల్లో, కొమ్మల్లో, ప్రకృతి అంతట్లో ప్రభావతే కన్పిస్తోంది! ఇలా లాభం లేదని తన విషయం అంతా ఆ హంసకి ఓ లేఖ రాసి పంపుదామనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం రాసేశేడు.ఐతే దాన్ని శుచిముఖికి తీసుకెళ్ళి ఇచ్చేదెవరు?

విరహంతో అతని వివేకం నశించిపోతోంది. లేఖని తీసుకెళ్ళగలరా లేదా అన్న ఆలోచన లేకుండా ఉత్తర దిక్కుగా వెళ్ళే వాళ్ళందర్నీ పిల్చి వజ్రపురానికి వెళ్తున్నారా అంటూ అడగసాగేడతను చిలకల్ని, తుమ్మెదల్ని,కోయిలల్ని, గాలుల్ని, మేఘాల్ని, హంసల్ని!

హఠాత్తుగా ఓ చిలక ఆకాశాన ఎగుర్తూ అతని పరిస్థితి చూసి ఆగింది. “నేను వజ్రపురానికే వెళ్తున్నా. నీ పనేవిటో రెండు మూడు ముక్కల్లో టక్కున చెప్పెయ్‌.” అన్నదది హడావుడిగా. “ఈ లేఖని అక్కడున్న శుచిముఖి అనే హంసకివ్వాలి, అంతే” అన్నాడతను ఆనందంగా. “సరే ఐతే. ఎవరికీ కనపడకుండా నా రెక్కల మధ్య ఉండేట్టు దాన్నిచకచక కట్టెయ్‌” అంటూ అతని దగ్గర వాలిందది. అతను అలా చెయ్యటం, అది ఎగిరి పోవటం క్షణంలో జరిగేయి.

ఈలోగా శుచిముఖి ప్రభావతితో పరిచయం కలిగించుకోటానికి సరైన అవకాశం కోసం చూస్తోంది. ప్రభావతి మళ్ళీ అదివరకు వచ్చిన సరస్సు దగ్గరికే వచ్చిందో రోజు.

ఆమె కూడ ప్రద్యుమ్నుడి గురించిన కలవరింతల్లోనే ఉంది!
మళ్ళీ ఓ సారి అతని చిత్రాన్ని చూస్తేనన్నా తాపం కొంత తగ్గుతుందని దాన్ని తెప్పించి చూసుకుంది, ఇంకా విరహంలో మునిగిపోయింది!
ఇదే సరైన సమయం అని వాళ్ళ దగ్గరగా వెళ్ళింది శుచిముఖి!
రకరకాలుగా అనేక చోట్ల నుంచి ఆ చిత్రం వంక చూస్తూ ఏదో ఆలోచనలో వున్నట్టు నటిస్తూ అటూ ఇటూ నడవసాగింది.
అది గమనించింది ప్రభావతి!
“ఈ పక్షికి ఏం తెలుసో, పదేపదే ఈ చిత్రాన్నిలా చూస్తోంది!” అంది తన చెలికత్తెతో.
వెంటనే అందుకుంది శుచిముఖి!
“ఆ చిత్రాన్ని నేనింతగా చూట్టానికి కారణం ఉంది! ఇదివరకు నేనొక అందగాణ్ణి చూశా. అంత అందం ఉన్న మనిషి నాకు మళ్ళీ కనిపించనే లేదు! ఇప్పుడీ చిత్రం అతందిలా అనిపిస్తే, అతని బొమ్మేనా, లేక యింకెవరైనా అలాటి వాళ్ళున్నారా అని ఆలోచిస్తున్నా, అంతే” అని చెప్పీచెప్పనట్టుగా చెప్పింది.
ప్రభావతికి ఎక్కడలేని కుతూహలం కలిగిందా మాటల్తో.
“ఏమిటేమిటీ, మళ్ళీ చెప్పు! ఇలా వచ్చి జాగ్రత్తగా దగ్గరగా గమనించి చూడు అతనో కాదో! మా దగ్గరికి రావొచ్చు,నీకేం భయం అక్కర్లేదు” అంది కంగారుగా.
“మనుషుల్ని చూట్టంతోనే వాళ్ళకి భయపడాలో లేదో చెప్పగలన్నేను. కాకపోతే మీరిద్దరూ ఏకాంతంగా మాట్టాడుకుంటుంటే మీరు పిలవకుండా మీ మధ్య కొచ్చేంత అమర్యాదస్తురాల్ని కాను గనక యిప్పటి దాకా ఆగా” అంది శుచిముఖి ఖచ్చితంగా.
ఆ మాటలకి ఆశ్చర్యపడిపోయారు వాళ్ళిద్దరూ!
“నువ్వు నిజంగా బుద్ధిమంతురాలివి. ఇలాటి వ్యక్తి ఉన్నాడా లేడా అని మేం పందెం వేసుకున్నాం. ఒక్కసారి చూసి చెప్పు” అని బతిమాలింది చెలికత్తె రాగవల్లరి.
“పందెం కోసమో మరోదాని కోసమో నాకెందుకు? బొమ్మని చూడమని కోరేరు, చూస్తా” అంటూ దగ్గరగా చూసి,
“సందేహం లేదు, అతనే ఇతను” అని తీర్పిచ్చింది శుచిముఖి.
పొంగిపోయింది రాగవల్లరి. జాగ్రత్తగా ఆ హంసనెత్తుకుని ప్రభావతి దగ్గరి కెళ్ళింది, “నిజంగా నువ్వు నాపాలిటి దేవతవి, నా పందెం గెలిపించావ్‌” అని దాన్ని ముద్దు చేస్తూ.
“ఉండుండు, ఈ చిత్రంలో అతని గుర్తులేవైనా కనిపిస్తున్నాయేమోకనుక్కుందాం” అంది ప్రభావతి అసహనంగా.
“ఇంకా అనుమానం ఎందుకు? అవిగో అతని వక్షాన ఉన్నవి శంకరుడితో యుద్ధం నాటి దెబ్బల గుర్తులు! మెడమీద రతీదేవి కంకణాల ముద్రలు కూడ కన్పిస్తున్నాయి! ఈ బొమ్మ వేసిందెవరో అతన్ని బాగా ఎరిగిన వాళ్ళే!” అంటూ,”ఏదేమైనా మీ పందెం తేలటానికి యిప్పటికి నేనిచ్చిన సమాచారం చాలు. మిగిలిన విషయాలు మీకక్కర్లేదులే” అని పైకెగరబోయింది శుచిముఖి. సున్నితంగా పట్టి ఆపింది ప్రభావతి. “దయచేసి మమ్మల్నొదిలి వెళ్ళకు. మాతో స్నేహం చెయ్యవా?” అనడిగిందా హంసని జాలిగా. “మీరిద్దరూ రహస్యాలు మాట్టాడుకుంటుంటే మధ్యలో నేనెందుకు? ఇంక వెళ్ళొస్తా” అని బయల్దేరబోయింది శుచిముఖి మళ్ళీ. “మాట్టాడితే పోతాపోతానంటావ్‌! నువ్వుండటం మా ఏకాంతానికి అడ్డం కాదు. నిజానికి మంచిది కూడా. ఈ చిత్రంలో ఉన్నతని మీద మా ప్రభావతి ఆశలన్నీ పెట్టుకుని ఉంది. అతని విషయాలన్నీ మాకు చెప్పాలి నువ్వు. అప్పుడు గాని ఆమె ప్రాణాలు నిలబడవు. ఆ తర్వాత మా రహస్యం అంతా నీకు చెప్తాం” అని ప్రాధేయపడింది రాగవల్లరి.

ఇక తన వంకరమాటలు ఆపొచ్చని గ్రహించింది శుచిముఖి.
“సరే చెప్తా వినండి. ద్వారకానగరం అనే అద్భుత పట్టణానికి రాజు కృష్ణుడి రూపంలో ఉన్న విష్ణువు. అతనికి ఎనిమిది మంది భార్యలు. వాళ్ళలో పెద్ద భార్య రుక్మిణీ దేవి. ఆమె కొడుకే ఈ చిత్రంలో ఉన్న ప్రద్యుమ్నుడు. సౌందర్యానికి సరిపడే మంచి గుణాలున్నవాడు” అంటూండగా ప్రభావతి పట్టరాని ఆనందంతో ఉక్కిరిబిక్కిరయింది.
“ఇంకేం, పార్వతీదేవి చెప్పిన పేరు కూడా సరిపోయింది! ఈ హంస వాలకం చూస్తుంటే ఇక మిగిలిన పని కూడా సాధించే చాతుర్యం వున్న దాన్లానే ఉంది” అంది రాగవల్లరి కూడా సంతోషంగా. ఇంతలో శుచిముఖి కాలికున్న పెండెరం కనిపించిందామెకి. గబగబ దాన్ని చదివి ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ “ప్రభావతీ! మన పని చేసిపెట్టటానికి ఇంతకు మించిన వాళ్ళు దొరకరు” అని చెప్తూ శుచిముఖికి ప్రభావతి కల విషయం, ఆ తర్వాత జరిగిన విషయాలూ అన్నీ చెప్పేసింది.శుచిముఖి కూడా తను ఆమె విషయం అంతకు ముందే ప్రద్యుమ్నుడికి చెప్పినట్టు, ఐతే అతను దానికి ఏమీ స్పందించనట్టూ చెప్పేసరికి
ప్రభావతి తెల్లబోయింది.
శుచిముఖి వెంటనే, “రాకుమారీ, నీకేం భయం అక్కర్లేదు. అతను కాకపోతేయేం? ఏ లోకంలో ఉన్నవాణ్ణైనా ఎవర్నైనా మరొకర్ని కోరుకో. అతన్ని తీసుకొచ్చే బాధ్యత నాది. పార్వతీదేవి అందుకు ఒప్పుకోదేమో అని సందేహం వద్దు నీకు. నీ ఇష్టమే ఆమె ఇష్టం … నీ అందాన్ని అంతగా వర్ణించినా కిక్కురుమనకుండా ప్రద్యుమ్నుడున్నాడంటే అదతని సౌందర్య గర్వం. నీ సంగతి నీకు తెలీకపోవచ్చు గాని నిన్ను గురించి నేను వర్ణిస్తే విని నీ కాళ్ళ మీద వచ్చి వాలని వాడు ఏలోకంలోనూ ఇంకెవడూ ఉండడు. నువ్వు కావాలంటే నా ప్రయాణాల్లో చూసిన చక్కటి యువకుల చిత్రాలు రాయించి తెస్తా. నువ్వు ఊఁ అను చాలు” అని హుషారుచేసింది.
ప్రభావతికి నచ్చలేదా మాటలు.
“అంతా విని మళ్ళీ యిలా అడ్డంగా మాట్టాడతావేం? ఐనా నువ్వు తెచ్చేదేమిటి నా తండ్రే యింతకు ముందు అన్ని లోకాల్లోనూ ఉన్న యువకుల చిత్రాలు రాయించి చూపించేడు నాకు. వాళ్ళెవర్నీ ఒక్క చూపు మించి చూడలేదు నేను.తనకి శత్రువని ఈ ప్రద్యుమ్నుడి చిత్రం మాత్రం చూపించలేదతను. ఏదేమైనా నా ప్రతిజ్ఞ విను ఎన్ని జన్మలకైనా ఆ ప్రద్యుమ్నుడే నా భర్త!” అని నిశ్చయంగా తెగేసి చెప్పింది ప్రభావతి.

కొంచెం సేపు ఆలోచించి, “శుచిముఖీ! నాకొక్క ఉపకారం చేసి పెట్టు. ఇంకో సారి నువ్వు ద్వారకకి వెళ్ళి ప్రద్యుమ్నుడితో నా విషయం చెప్పి చూడు. ఆ తర్వాత ఎలా జరగాలో అలా జరుగుతుంది” అంది ఆఖరిప్రయత్నంగా.
ఆమెకి ప్రద్యుమ్నుడి మీద ఎంత ప్రేమ కలిగిందో స్పష్టంగా అర్థమైంది శుచిముఖికి.
“ప్రభావతీ! నీ ప్రేమ ఎంత లోతైందో చూట్టానికి నీకిష్టం లేని కొన్ని మాటలన్నా, క్షమించు. ప్రద్యుమ్నుడిని నీ దగ్గరికి తెచ్చే బాధ్యత నాకొదిలిపెట్టు. అప్పుడేదో పరాకున ఉండి అతను మాట్టాడలేదు గాని అతను నీ భర్త కాక తప్పదు. ఎందుకంటే, ఒకసారి బ్రహ్మకీ సరస్వతికీ ప్రణయకలహం వచ్చి ఆమె అలిగితే అమెకి సర్దిచెప్పటానికి అతను నన్ను పిలిచేడు. ఆ మాటల సందర్భంలో మన్మథుణ్ణి తిడుతూ, “ఒరేయ్‌ మన్మథా! నన్నింత బాధిస్తున్నావిప్పుడు. నీక్కూడా తొందర్లో ప్రభావతి విరహంతో వేగే రోజులొస్తున్నాయిలే చూసుకో!” అన్నాడు. ఆ మన్మథుడే ఈ జన్మలో ప్రద్యుమ్నుడు. కనక, అతనిప్పుడు నీ విరహంతో బాధ పడుతుంటాడని తెలుస్తోంది కదా! ఇక నే త్వరగా వెళ్ళి ఆ విషయం చూస్తా” అంది శుచిముఖి ఆమెని ఓదారుస్తూ.

ఐతే ప్రభావతికి నమ్మకం కలగలేదు. “ఈ హంస అక్కడికి వెళ్ళేదెప్పటికి? వెళ్ళి అతన్ని చూడాలి. అతనికి నామీద కోరిక కలగాలి. ఇక్కడికి రావటానికి అతని తండ్రి ఒప్పుకోవాలి. ఇక్కడ నా తండ్రి అతను రావటానికి ఒప్పుకోవాలి. ఇవన్నీ జరిగేదెప్పుడు? నాకోరిక తీరేదెప్పుడు?” అంటూ దిగాలుపడిపోయింది.
అంతలో
ఓ చిలక రెక్కలు టపటప కొట్టుకుంటూ కేకలు పెట్టింది ఎదురుగా ఉన్న ఓ చెట్టు మీద వల్లో తగులుకుని!
అంత దిగుల్లోనూ దాని అవస్థకి మనసు కరిగి దాన్ని విడిపిద్దామని పరిగెత్తింది ప్రభావతి. దాన్ని వల్లోంచి తప్పించింది.
ఐతే హడావుడిగా ఆమె చేతులు విడిపించుకుని వేగంగా ఎగిరిపోయిందా చిలక, ఆమెకి తన ముఖం చూపించకూడదన్నట్టుగా!
ఆ గడబిడలో జారిపడిందో లేఖ, దాని రెక్కల్లోంచి!
“శుచిముఖీ, ఇదేదో విచిత్రంగా ఉందే! నువ్వెళ్ళి ఆ చిలకని పట్టుకురాగలవా?” అనడిగింది ప్రభావతి. “అదెంత పని? ఇప్పుడే తెస్తా” అని చిలక వెంట పడిందా రాజహంసి.
“ఇంతకీ యీ చెట్టు మీద వలెవరు పెట్టారో, దుష్టులు!” అని ప్రభావతి కోపగించుకుంటే,
“కోయిల్లొచ్చి కూసి నీ విరహాన్ని పెంచుతున్నాయని వాటిని పట్టటానికి నేనే పెట్టా .. సరేగాని, యీ లేఖలో ఏవుందో చూద్దామా?” అని దాన్ని లాక్కుంది రాగవల్లరి.
ఇలా ఉంది దాన్లో
“సరస్వతీదేవి చేత ఉపమాతిశయోక్తి కామధేను బిరుదు పొందిన శుచిముఖికి ప్రద్యుమ్నుడు స్నేహపురస్సరంగా పంపిన రహస్యలేఖ. ప్రప్రభాభావతి గురించి నువ్వు చెప్పిన విషయాలన్నీ ..” అని చదువుతూనే ఆనందంగా గెంతుతూ,
“నిన్ను గురించి నీ ప్రియుడు పంపిందే యీ ఉత్తరం. నీ అదృష్టం పండింది” అనరిచింది రాగవల్లరి.
“నువ్వు చదివింది నిజంగా దాన్లో ఉందేనా?”
“దేవుడి మీద ఒట్టు, నిజం”
“ఐతే ఆ ప్రప్రభాభావతి ఎవరో! ఇంకా ఏముందో చూడు” అని ప్రభావతి అంటే, “నీ వెర్రి గాని అది నీపేరే. కంగారులో అలా రాశాడంతే. చదువుతా విను. ప్రప్రభాభావతి గురించి నువ్వు చెప్పిన విషయాలన్నీ తలుచుకునే కొద్దీ నా మనసంతా ఆమే నిండిపోయి విరహంతో కాగిపోతున్నా. ఆమె అధరామృతం కావాలని చెప్పు ..” అంతవరకు రాగవల్లరి చదివేసరికి ఆమె చేతిలోంచి లేఖని లాగేసుకుంది ప్రభావతి. “ఔన్లెమ్మా. తరవాత్తరవాత యింకెంత పచ్చిగా రాశాడో! నువ్వే చదువుకో!” అంది రాగవల్లరి గడుసుగా. దానికి సిగ్గు పడుతూ కోపం నటిస్తూ ప్రభావతి ఆ ఉత్తరం చించబోతే, “భలే దానివే. అది శుచిముఖికి రాసిన ఉత్తరం. నువ్వు చించేస్తే ఎలా? పైగా ప్రియుడు నీ గురించి రాసిన తొలి ఉత్తరం చించటం అమంగళం కూడా” అంటూ లాలించి, బుజ్జగించి, బెదిరించి ఆపింది రాగవల్లరి.

ఈలోగా శుచిముఖి చిలకని చిక్కించుకుంది!
“ఓసి దొంగచిలకా! నీ రెక్కల్లో ఉత్తరం తీసుకుని ఎక్కడికెళ్తున్నావ్‌? రాక్షసరాజు కూతురు నిన్ను పట్టుకురమ్మంది పద!” అని గద్దించింది దాన్ని తన కాళ్ళ సందున ఇరికించుకుని.
“చంపితే చంపు గాని నన్నక్కడికి మాత్రం తీసుకుపోవద్దు. ఇక్కడ చస్తే నేనొక్కదాన్నే. అక్కడికి తీసుకుపోతే ఇంకెంతమందో!” అని గింజుకుంది చిలక.
“ఎంత గింజుకున్నా ఏవీ ఉపయోగం లేదు. ఎలాగూ ఆ ఉత్తరం మాకు దొరికింది. నువ్వు గనక బుద్ధిగా నాతో వస్తే ప్రభావత్తో చెప్పి నిన్ను విడిపిస్తా” అని ఆశ చూపించింది శుచిముఖి.
“అలా కాదు. దయచేసి నా మాట విను. ఎక్కడన్నా ఆగుదాం. నా పరిస్థితి నీకు చెప్తా. విన్నాక నీకే తెలుస్తుంది నేనెందుకింత పట్టు పడుతున్నానో” అంది చిలక.
సరేనని ఆ చిలకని తీసుకుని ఓ కొండ శిఖరం మీద దిగి దాన్ని తన రెక్కల్తో పట్టుకుని “ఇక నీ విషయం మొత్తం చెప్పు నాకు” అంది శుచిముఖి.
“నేనో పని మీద ద్వారకకి వెళ్ళి తిరిగొస్తుంటే ఆ వూరి బయట ఒకతను ఉత్తరానికి వెళ్తున్న పక్షుల్నీ, మేఘాల్నీ,గాలుల్నీ కూడ మీరు వజ్రపురానికి వెళ్తున్నారా అని అడుగుతుంటే నేను జాలిపడి ఆగా. అతను నాకో ఉత్తరం ఇచ్చి దాన్ని శుచిముఖి అనే హంస కిమ్మంటే నేనిక్కడ కన్యాంతఃపురంలో హంసల్ని చూసి వాళ్ళలో శుచిముఖి ఉందేమో కనుక్కుందామని చెట్టు మీద దిగి వల్లో చిక్కా. దాంతో ఈ పాట్లన్నీ వచ్చి పడినయ్‌” అన్నదా చిలక.
“దీనికి తెలిసింది ఇంతేలా ఉంది. కనక ఇంకెక్కడా యిది ఈ విషయం చెప్పకుండా చూడాలి” అనుకుంది శుచిముఖి.
“పక్షికి పత్రిక పంపేవాడు వెర్రివాడై వుంటాడు. అలాటి ఉత్తరంలో ఏముంటుంది ప్రేలాపన తప్ప! కనక దాని సంగతి మర్చిపో నువ్వు… అది సరే గాని .. అసలు నువ్వు ద్వారకకి ఎందుకు వెళ్ళాల్సొచ్చిందో చెప్పు ముందు” అంది శుచిముఖి తీవ్రంగా.
-----------------------------------------------------------
రచన: కె. వి. ఎస్. రామారావు, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment