Monday, June 11, 2018

గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-4


గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-4
సాహితీమిత్రులారా!

గణపతి: అంతు చిక్కని వింత దేవుడు నాలుగవ భాగం
ఆస్వాదించండి-

సంస్కృత కావ్యాల్లో గణపతి ప్రస్తావన సాధారణ శకం 6వ శతాబ్దం తరువాతే ప్రముఖంగా కనిపిస్తుందని ఇంతకుముందు చర్చల్లో చెప్పుకొన్నాం కదా. ఇప్పుడు శిలాశాసనాల్లోనూ, విదేశాల్లోనూ గణపతి ప్రస్తావన గురించి చర్చించుకొందాం.

శిలాశాసనాలు, నాణేలపై గణపతి
కావ్యాలలో లాగే శాసనాలలో మనకు 6వ శతాబ్దం దాకా గణపతి ప్రస్తావన అంతగా కనిపించదు. అయితే, కనిష్కుని కుమారుడైన హువిష్కుని కాలంలో (సా. శ. 111-138) ప్రచురించిన నాణేలపై పలు దేవతల బొమ్మలు కన్పిస్తాయి. ఇందులో మిత్రుడు, శివుడు, మహాసేన, స్కందుడు, శాక్యముని (బుద్ధుడు) మొదలైన వారి బొమ్మలతో పాటు ‘గణేశ’ అని బ్రహ్మీ లిపిలో రాసి ఉన్న ఒక నాణెం దొరికింది. కానీ, ఈ బొమ్మలో ఏనుగు తలగాని, లంబోదరంకానీ కనిపించదు. ఈ బొమ్మలో ఒక ధనస్సు, బాణము చేత ధరించిన విలుకాడు కనిపిస్తాడు. కుషాణుల పాలనలో రుద్రుని రూపమైన శివుడు ప్రముఖంగా ఇదే రూపంలో కనిపిస్తాడు కాబట్టి ఈ నాణెం శివునికి సంబంధించినదేనని పండితుల అభిప్రాయం. మహాభారతంలో ప్రమథ గణాలకు అధిపతిగా శివుణ్ణి గణేశునిగా ప్రస్తుతించిన పలు శ్లోకాలలాగే కుషాణులు కూడా శివుడినే గణేశుడని పరిగణించేవారని మనం ఊహించవచ్చు. హువిష్కుని తరువాత పాలించిన కిపుణదుని కాలంలోని నాణేలలో దాదాపుగా ఇటువంటి బొమ్మపైనే ‘మహేశ్వర’ అని రాసి ఉండటం గమనార్హం.

క్రీ.పూ. రెండవ శతాబ్దపు శాసనమైన నానాఘాట్ శాసనంలో పేర్కొన్న దేవతల పేర్లలో ధర్మ, ఇంద్ర, సంకర్షణ, చంద్ర, సూర్య, యమ, వరుణ, కుబేరాది దేవతల పేర్లు కనిపిస్తాయి కానీ గణపతి పేరు కనిపించదు. గుప్తుల కాలంలోని (సా. శ. 315-550) నాణేలపై లక్ష్మి, విష్ణు, గరుడ, దుర్గ, కుమార/స్కంద/కార్తికేయ మొదలైన దేవతల రూపాలు కనిపిస్తాయి కానీ గజరూపమైన గణపతి ఎక్కడా కనిపించడు. గుప్తుల శాసనాలలో కూడా ఎక్కడ గణేశుడు, గణపతి, వినాయకుడు అన్న పేర్లు కనిపించవు. నిజానికి ఆంధ్రప్రదేశ్ లోని వేల్పూరులో దొరికిన శాసనంలోనే మొదటిసారి గణపతి ప్రస్తావన కన్పిస్తుంది. ఇది 6వ శతాబ్దంలో విష్ణుకుండినుల ప్రభువైన మాధవవర్మ వేయించిన శాసనం. గుంటూరు జిల్లా, సత్తెనపల్లి తాలూకా, వేల్పూరు లోని రామలింగస్వామి దేవాలయ ప్రవేశము దగ్గర ఉన్న ఒక తెల్లని పాలరాతి స్థంభము మీద ‘దంతిముఖ స్వామి ప్రతిష్ఠః’ అంటూ స్పష్టంగా ఉన్న ఈ శాసనంలో చిట్టచివర ‘వినాయకం నమస్యంతి’ అంటూ వినాయకుని ప్రార్థనతో ముగుస్తుంది. అంటే గణపతి గురించి ప్రత్యేకంగా వేయించిన శాసనం మనకు మొట్టమొదటి సారిగా ఆంధ్రదేశంలోనే కనిపిస్తుంది. ఆ తరువాత కాలంలో జైపూర్ దగ్గరి సక్రాయిలో దొరికిన శాసనంలో చండికా, కుబేరులతో పాటు గణేశుని స్తుతించే శాసనం దొరికింది.

ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న శ్రీహట్ట (సిలేట్) అన్న గ్రామంలో 8వ శతాబ్దానికి చెందిన ఒక శాసనంలో గణపతిని స్తుతించే శ్లోకాలు కనిపిస్తాయి. ఇందులో గణేశుడిని ‘అగణిత గుణ’ అని, ‘కలి హనయే’ అని, ‘దానవర్షణం అజస్రం’ అంటూ స్తుతించడం కనిపిస్తుంది. ఈ శాసనం హర్షుని సమకాలికుడైన భాస్కరవర్మ కాలానికి చెందినది.

అయితే 6వ శతాబ్దం వరకూ శాసనాలలో గణపతి పేరు కనిపించకపోయినా, దేవాలయాలలో గణపతి విగ్రహాలు అంతకు ముందునుండే కనిపిస్తున్నాయి. అయితే మొదట్లో గణపతి విగ్రహం ద్వారపాలకుడిగా దేవాలయ ముఖద్వారం మీద కుబేర, భైరవ మొదలైన గణాలతో పాటు కనిపిస్తాడు. 2వ శతాబ్దానికి చెందిన మధురలోని సప్తమాతృక శిల్పాలలో కూడా గజముఖ రూపం కనిపిస్తుంది కానీ, మిగిలిన మాతృకలతో పాటు వివిధ జంతువుల తలలు కలిగిన విగ్రహ రూపాలతో పోల్చుకుంటే ఈ గజముఖ రూపానికి ఇంకా వినాయకుడిగా ప్రత్యేక స్థానం ఏర్పడలేదని చెప్పుకోవచ్చు. అలాగే, శ్రీలంకలో 3వ శతాబ్దానికి చెందిన కంటక స్తూపం మీద కూడా సింహం, జింక, గుర్రం, ఏనుగు మొదలైన వివిధ జంతువుల తలలతో తాలవాద్యాలు వాయించే గణాలుగా విగ్రహాలు కనిపిస్తాయి. శాతవాహనుల కాలంనాటి అమరావతి స్తూపంలో కూడా అనేక జంతువుల తలలు కలిగిన వాద్యకారుల దృశ్యాలు కనిపిస్తాయి.

తొలి రోజుల్లో గణపతి విగ్రహాలు నిరాడంబరంగా రెండు చేతులు కలిగిన విగ్రహాలు గానే కనిపిస్తాయి. 6వ శతాబ్దానికి చెందిన బృహత్ సంహితలో కూడా గణపతి రెండు చేతులు కలిగి ఒక చేతిలో మూలకము, మరో చేతిలో కుటారము ధరిస్తాడని వివరిస్తుంది. అయితే తరువాతి రోజుల్లో పౌరాణిక దేవతగా అమిత ప్రాముఖ్యాన్ని పొందిన తరువాత నాలుగు చేతులతో మోదకము/లడ్డు, కపోచము, అంకుశము, పాశము, ఏనుగు దంతము, నాగము, రుద్రాక్షమాల ఇవన్నీ ధరించే గణపతి విగ్రహాలు మనకు కనిపిస్తాయి.

తొలి రోజుల్లోని గణపతి విగ్రహాలు ఏ రకమైన ఆభరణాలు, కిరీటాలు లేకుండా ఉండేవి. కొన్ని దిగంబరంగా కూడా ఉండేవి. వాహనం కూడా తొలినాటి విగ్రహాల్లో కనిపించదు.

తొలినాళ్లలో ద్వారదేవతగా కనిపించే గణేశుడు తరువాతి రోజుల్లో దేవకోష్ఠాలలో సూర్యుడు, దుర్గా, కుబేరుడు మొదలైన దేవతలతో సమానంగా ప్రత్యేక విగ్రహాలుగా కనిపిస్తాడు. కొన్ని దేవాలయాల్లో సప్త మాతృకలతో పాటు వినాయకుడు కనిపించడం, మరి కొన్ని చోట్ల నవగ్రహాల సహితంగా కనిపించడం చూడవచ్చు. కొన్ని దేవాలయాల్లో ఇంద్ర, వరుణ, అగ్ని, కుబేరులతో పాటు దిక్పాలకుల్లో ఒకడుగా గణేశుడు కనిపించడం విశేషం. 6వ శతాబ్దకాలం నాటికి శివుని దేవాలయాల్లో గణపతి పార్శ్వదేవతగా శివుని గణాల్లో ప్రముఖుడిగా మనకు కనిపిస్తాడు. తరువాతి శతాబ్దాల్లో గణపతియే ప్రధాన దేవతగా పలుదేవాలయాల నిర్మాణం దక్షిణ భారతంలోనూ, ఉత్తర భారతంలోనూ కనిపిస్తుంది. కొన్ని శివదేవాలయాలో గణపతి పార్వతి, స్కందులతో పాటు శివుని కుటుంబంలో సభ్యునిగా చూపించే విగ్రహాలు కూడా కనిపిస్తాయి. అయితే, ఇవి చాలా వరకు అర్వాచీనం.


ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దక్షిణ భారతంలో గణపతి చాలావరకు బ్రహ్మచారిగా కనిపిస్తే, ఉత్తర భారతంలో ఒక భార్యతో గానీ ఇద్దరు భార్యలతో కానీ కనిపించడం కద్దు. ఒక భార్యతో కనిపించే విగ్రహాలలో కనిపించే సతిని లక్ష్మీదేవిగా, శక్తిగా పరిగణించడం ఉత్తర భారతదేశంలో సర్వసాధారణంగా కనిపిస్తుంది. వారణాసిలో ఉన్న పలు వినాయక విగ్రహాలలో వినాయకునితో పాటు ఉన్న స్త్రీ రూపాన్ని లక్ష్మీ గానే పరిగణిస్తారు. మథురలో దాసబోధ గణేశ ఆలయంలో గణపతి తొడపై కూర్చున్న స్త్రీరూపాన్ని లక్ష్మీదేవిగానే వర్ణిస్తారు. మధ్యప్రదేశ్ లోని భూమరలో దొరికిన 6వ శతాబ్దానికి చెందిన మహాగణపతి విగ్రహాన్ని లక్ష్మీ-గణపతి విగ్రహమనే భావిస్తారు. దీపావళినాడు లక్ష్మీగణపతులను కలిపి పూజ చేయడం ఉత్తర భారతంలో ఇప్పటికీ కనిపిస్తుంది. దక్షిణ భారతదేశమంతటా కూడా కొన్ని లక్ష్మీగణపతి దేవాలయాలు మనకు కనిపిస్తాయి. ఇక ఇద్దరు భార్యలతో ఉన్న విగ్రహాలలో స్త్రీరూపాలను సిద్ధి-బుద్ధి గాను లేదా లక్ష్మీ-సరస్వతి గానూ వ్యవహరించడం కద్దు. మహారాష్ట్రలో నాందేడ్ ప్రాంతంలో పెళ్ళికి ముందు గణపతి, సరస్వతులను జంటగా ప్రార్థన చేసే సంప్రదాయం ఉందట. అయితే, ఈ శక్తి రూపాల గురించి, లక్ష్మీ, సరస్వతి మొదలైన స్త్రీ దేవతల పుట్టుపూర్వోత్తరాల గురించి, గణపతితో వారి సంబంధం గురించి మళ్ళీ ఎప్పుడైనా విడిగా చర్చించుకుందాం.

దక్షిణ భారతదేశంలో గణపతి విగ్రహాల ప్రతిష్ఠ 7వ శతాబ్దంలో పల్లవుల కాలంలో అమిత ప్రాముఖ్యాన్ని సంతరించుకొన్నట్టు ఆధారాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలోని విదర్భ దేశంలో మాత్రం 5వ శతాబ్దం నుండే గణపతి విగ్రహాలు, మట్టిబొమ్మలు దొరుకుతున్నాయి. గాణపత్యుల తెగ ప్రాబల్యం కూడా తూర్పు మహారాష్ట్ర ప్రాంతలోనే ఎక్కువగా ఉండేదని మనం ఊహించుకోవచ్చు. గణపతి ప్రధాన దేవతగా దేవాలయాల నిర్మాణం కూడా వాకాటక రాజుల పాలనలో ఈ ప్రాంతంలోనే ఎక్కువగా చేపట్టినట్టు తెలుస్తోంది. 8వ శతాబ్దం నుండి గణపతి విగ్రహాలు, దేవాలయాలు భారతదేశమంతటా విస్తారంగా కనిపించడం మొదలుపెట్టాయి. విష్ణు, శివ, సూర్య, శక్తి దేవాలయాలకు సాటిగా గణపతి ప్రధాన దేవునిగా దేవాలయాలు భారతదేశంలోనే కాక భారతీయ సంస్కృతి ప్రభావం అధికంగా ఉన్న ఆగ్నేయాసియాలో కూడా కనిపించడం విశేషం.

విదేశీ యాత్రికుల రచనల్లో గణేశుడు
7వ శతాబ్దానికి చెందిన చైనా బౌద్ధభిక్షువు హువాన్‌ చాంగ్ (Hsüan-tsang) రచనల్లో పలు భారతీయ దేవతల పేర్లు కనిపించినా గణపతి పేరు కనిపించదు. అలాగే, అదే శతాబ్దానికి చెందిన మరో చైనీస్ యాత్రికుడు యీజింగ్ (Yijing) రచనల్లో కూడా గణపతి గురించిన ప్రస్తావన కనిపించదు. అయితే, 11వ శతాబ్దానికి చెందిన అల్-బెరూని రాసిన తారీఖ్ అల్-హింద్ (Tarikh Al-Hind హిందూదేశ చరిత్ర) అన్న పుస్తకంలో నెమలి వాహనుడైన స్కందునితో పాటు గజముఖుడైన వినాయకుని వివరాలు కనిపిస్తాయి. అయితే స్కందుడిని శివుని కుమారుడుగా వర్ణించిన ఈ పుస్తకం, వినాయకుణ్ణి మాత్రం బ్రహ్మకు కుమారుడిగా శివుని అనుచరునిగా వర్ణించడం విశేషం.

ఇతర దేశాల్లో గణపతి
ఎనిమిదవ శతాబ్దం నాటికి భారతదేశమంతటా ప్రధాన దేవునిగా గుర్తింపు సాధించిన గణేశుడు, భారతీయ వర్తకులు, (బౌద్ధ) మతప్రచారకులు, రాజులతో పాటు ప్రయాణించి ఆగ్నేయాసియా, చైనా, జపాన్ల దాకా తన ప్రభావాన్ని విస్తరించుకొన్నాడు. వివిధ దేశాల్లో గణపతి ప్రభావాన్ని స్థూలంగా చర్చిద్దాం.

నేపాల్లో గణపతి: నేపాల్ లోని హిందువులు గణపతిని శివుని కుమారునిగా పూజిస్తే, బౌద్ధులు సప్తమాతృకలతో పాటు పూజిస్తారు. బుద్ధ దేవాలయాల్లో ద్వారపాలకుడిగా, ధర్మపాలకుడిగా గణేశుడు దర్శనమిస్తాడు. అయితే, నేపాల్లో గణేశుణ్ణి పౌరాణిక గణపతిగా కంటే, తాంత్రిక గణపతిగా, హేరంబ గణపతిగా పరిగణించడం ఎక్కువగా కనిపిస్తుంది.

శ్రీలంకలో గణపతి: తమిళనాడులో గణపతిని పిళ్లైయార్ అని పూజించునట్టుగానే శ్రీలంకలోని తమిళులు గణేశుణ్ణి పూజిస్తారు. అయితే, బౌద్ధ సింహళీయులు కూడా గణేశుడిని కార్తికేయుని (కతరగమ దేవుడు) సహోదరునిగా పరిగణించడంతో బౌద్ధ దేవాలయాల్లో కూడా ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు.

బర్మాలో గణపతి: బర్మాలోకి బౌద్ధ మతంతో పాటు గణేశుడు 11వ శతాబ్దంలో ప్రవేశించాడు. బౌద్ధమతం కంటే ముందు బర్మాలో ‘నాథు’లను పూజించేవారు. సా.శ. 1044 సంవత్సరంలో అనౌరథ (Anawrahta) అనే రాజు మొదటిసారి బర్మాదేశాన్నంతా ఒక్క తాటిపై తీసుకువచ్చి ఆ దేశంలో థేరవాద బౌద్ధాన్ని ప్రవేశపెట్టాడు. అయితే, 37 నాథులలో ఒకడుగా చేరిపోయిన మహావినాయకుడు (మహాపియెన్నె) బర్మాలోని బౌద్ధమతంలో విఘ్నాలను పొగొట్టే విఘ్నరాజుగా, ద్వారపాలకుడిగా, ధర్మపాలనకు రక్షకుడిగా పూజలు అందుకొంటున్నాడు.

జావా, బాలిలలో గణపతి:ముస్లిం ప్రభావం రాకముందు జవాదేశంలో నిర్మించిన అనేక దేవాలయాలలో గణపతి కనిపిస్తాడు. శివుని దేవాలయాల గోడలపైనా, శివుని పరివారంలో ఒకడుగా ప్రముఖంగా కనిపిస్తాడు. ఇక్కడ గణేశుడు కొన్ని సార్లు కిరీటంతో ఎముకల ఆసనం మీద కూర్చున్నట్టు చూపించడం విశేషం. బాలిలో ఇతర హిందూ దేవతల లాగే గణేశుడు రెండు చేతులతో నిరాడంబరంగా కనిపిస్తాడు. ఈ దేశంలో ఒక్క శివునికి మాత్రమే అనేక ముఖాలు, అనేక హస్తాలు కనిపిస్తాయి. జావాలోనూ, బాలిలోనూ గణేశునికి భారతదేశంలోని తాంత్రిక గణేశునితో పోలికలు కనిపిస్తాయి.

థాయిలాండులో గణపతి: థాయిలాండులో దాదాపు 1400 సంవత్సరాల క్రితమే స్థిరపడిపోయిన బ్రాహ్మణులకు గణేశుడు ఒక ప్రధాన దేవత. థాయిలాండులో గణపతి ప్రత్యేకత ఏమిటంటే భారతదేశంలో లాగా ఈ గణేశుడు ఏకదంతుడు కాదు. థాయిలాండులోని విగ్రహాలలో గణపతి రెండు దంతాలతో కనిపించడం విశేషం.

టిబెట్టులో గణపతి: 8వ శతాబ్దంలో టిబెట్టును రాజుగా పాలించిన త్రిసోంగ్ దేతసేన్ అనే రాజు పద్మ సంభవుడు, శాంతరక్షిత, విమలమిత్ర మొదలైన బౌద్ధిక మతాచార్యులను భారతదేశం నుండి రావించి బౌద్ధ మతగ్రంథాలను సంస్కృతం, పాళీ భాషలనుండి టెబెటన్ భాషలోకి అనువాదం చేయించాడు. ఆపై బ్సామ-యాస బౌద్ధ విహారాలను స్థాపించి బౌద్ధ మతాన్ని దేశమంతటా వ్యాపింపచేశాడు. మహాయాన బౌద్ధంతో పాటు తాంత్రిక బౌద్ధం టిబెట్టులో ప్రవేశించినప్పుడు గణేశుడు కూడా విఘ్నకర్తగా, విఘ్నహర్తగా టిబెట్టులో ఆరాధించే దేవతల సమూహంలో చేరిపోయాడు.

చైనాలో గణపతి:


చైనావరకు విస్తరించిన కుషాణుల సామ్రాజ్యం ద్వారానే బుద్ధుడు చైనాకు పరిచయం అయ్యాడని మనం ఊహించవచ్చు. అయితే ఆరవ శతాబ్దం నాటికి చైనా చేరిన తాంత్రిక బౌద్ధంతో పాటు గణేశుడు చైనా ప్రవేశించాడు. చైనా సాహిత్యంలో గణేశుడు విఘ్నాలను కలిగించే విఘ్నకర్తయే. అభిధర్మకు అనువాదంగా రాసిన చీనా పుస్తకంలో పాపాలు చేస్తే నరకానికి వెళ్తారని, నరకంలో అందరూ ఏనుగు తలలు కలిగిన వినాయకులే ఉంటారని వారు అనేక రకాలుగా చెడ్డకర్మలను చేసిన వారిని శిక్షిస్తారని ఉంది. 7వ శతాబ్దపు చీనా పుస్తకాలలో మారునితోపాటు వినాయకుడు నిర్యాణం పొందడానికి అనేక అడ్డంకులను ఏర్పరుస్తాడని, వినాయకుడిని శాంతింపజేయడానికి 108 సార్లు వినాయక జపం చేయాలని ఈ గ్రంథంలో ఉంటుంది. చైనాలో ఏనుగు తల ఉన్న ఇంకో స్త్రీ రూపాన్ని కౌగిలిస్తూ గణేశుడు కనిపించడం విశేషం. ఈ రూపాన్ని కువాన్-షి-తియేన్ అని అంటారు. అయితే 11వ శతాబ్దపు చక్రవర్తి గణేశుడిని తన దేశంలో నిషేధించడంతో గణేశుడు మెల్లిగా ఆదేశంలో కనబడకుండా కనుమరుగయ్యాడు.

జపానులో గణపతి: చైనా ద్వారా గణేశుడు 9వ శతాబ్దంలో జపానుకు ఎగుమతి అయ్యాడు. జపానులో కనిపించే మంత్రయాన బౌద్ధంలో గణేశుడు ఒక ప్రధాన దేవుడు. ఆడ-మగ గజరూపాలు కౌగిలించుకొనే రూపాన్ని జపనీస్ లో కంగి-తేన్ అని అంటారు. ఇక్కడ కూడా గణేశుడు నిరాడంబరంగా రెండు చేతులతో కనిపిస్తాడు. ఎక్కడా వాహనం కూడా కనిపించదు. తాంత్రిక గణేశునిగా నిలబడి కౌగిలించుకొనే ఆడ-మగ గజరూపాలు చైనా, జపానులలో మాత్రమే కనిపిస్తాయి.

ఈ రకంగా గణేశుడు ఆసియాలో ప్రాబల్యం ఉన్న హిందూ, బౌద్ధ, జైన మతాలలో స్థానం సంపాదించుకొని అనేక దేశాలలో ప్రముఖ దేవునిగా ఆరాధింపబడుతున్నాడు. ఒక రకంగా చూస్తే మతాలమధ్య ఎన్ని బేధాలున్నా, పలుమతాల్లో కనిపించే దేవునిగా, గణేశుడు ఈ మతాలు, దేశాల మధ్య సాంస్కృతిక వారధిగా కూడా కనిపిస్తాడు.
----------------------------------------------------------------------------------------------------------------------
రచన: సురేశ్ కొలిచాల - ఈమాట అంతర్జాల మాసపచ్రిక సౌజన్యంతో 

No comments:

Post a Comment