గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-3
సాహితీమిత్రులారా!
గణచతి - అంతు చిక్కని వింత దేవుడు మూడవ భాగం
ఆస్వాదించండి-
ఇంతకు పూర్వం చర్చలలో గజముఖుడైన వినాయకుడు వేద సాహిత్యంలో కనిపించడని, ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాల్లో కూడా ఎక్కడా గజాననుని ప్రస్తావన లేదని నిర్ధారించాం కదా! ఇక ఇప్పుడు సంస్కృత కావ్య సాహిత్యంలో, లౌకిక సాహిత్యంలో, బౌద్ధ, జైన సాహిత్యాలలో గణేశుని ప్రస్తావన గురించి చర్చిద్దాం.
సంస్కృత లౌకిక సాహిత్యంలో లేని గణపతి
పాణిని అష్టాధ్యాయి అనే పేర రాసిన సంస్కృత వ్యాకరణ గ్రంథం లౌకికసాహిత్యంలో మనకు దొరుకుతున్న ప్రాచీనమైన గ్రంథాల్లో ఒకటి. పాణిని క్రీ.పూ. 4-5వ శతాబ్దాలకి చెందిన వాడని పండితుల ప్రస్తుత అభిప్రాయం. దాదాపు నాలుగు వేల సూత్రాలున్న ఈ గ్రంథంలోని వ్యాకరణ సూత్రాలతో పాటు ఆయా సూత్రాలను వివరించే వృత్తి శ్లోకాల్లోను, ఉదాహరణల్లోనూ ఆనాటి సమాజం గురించిన వివరాలు కొంత తెలుసుకోవచ్చు. పాణిని ఉదాహరించిన దేవతల పేర్లలో మనకు వైదిక దేవతలైన అగ్ని, ఇంద్ర, వరుణ, భవ, శర్వ, రుద్ర, మృడ, వృషాకపి (4.1.37), పూషా, ఆర్యమ (6.4.12), త్వష్టా (6.4.11), సూర్య (3.1.114), నాసత్య (6.3.75) మొదలైన పేర్లు కన్పిస్తాయి. ద్వంద్వ సమాసాల పేర్లు చెప్పేటప్పుడు అగ్ని-వరుణ (6.3.27), అగ్ని-సోమ (4.2.32, 6.3.27), ద్యౌ-పృథ్వీ (4.2.32, 6.3.29-30), ఉషా-సూర్యా (6.3.31), రుద్ర-పూషా (6.2.142) అన్న ఉదాహరణలు కనిపిస్తాయి. అయితే, గణపతి గాని, స్కందుడు గాని పాణిని అష్టాధ్యాయిలో ఎక్కడా కనిపించరు.
కౌటిల్యుని అర్థశాస్త్రంలోను (క్రీ.పూ. 300- క్రీ.శ. 200), పతంజలి మహాభాష్యంలోను (క్రీ. పూ. 150) కూడా ఎక్కడా గణేశుని ప్రస్తావన కనిపించదు. అయితే, ఆసక్తికరమైన విషయమేమిటంటే తరువాతి పురాణాల్లో గణపతికి తమ్ముడిగా వ్యవహరించబడే స్కందుడు అర్థశాస్త్రంలోను (2.14.19) మహాభాష్యంలోను (5.3.11, 6.3.26, 8.1.15) పలుమార్లు కనిపిస్తాడు. మనం ఇంతకు ముందు చెప్పుకొన్నట్టు స్కందుడు గణపతి కంటే చాలాకాలం ముందే వైదిక దేవతల క్రమంలో చేరిపోయాడు అని చెప్పడానికి ఇది మరో తార్కాణం.
భరతుని (క్రీ. శ. 4వ శతాబ్ది) నాట్యశాస్త్రంలో మొదటి అధ్యాయంలో రాక్షసులపై విజయం సాధించిన తరువాత ఇంద్రుడు జరిపిన ధ్వజ-మఖ (యజ్ఞం) వేడుకల్లో బ్రహ్మ, వరుణ, సూర్య, శివ, వాయు, విష్ణు, కుబేర, సరస్వతి మొదలైన దేవతలు పాల్గొనట్టుగా రాసి వుంది. మండప పూజను వివరించే మూడవ అధ్యాయంలో వివిధ దేవతలను మంటపంలోని వివిధ దిక్కులలో ప్రతిష్టించే శ్లోకాలు కనిపిస్తాయి కాని ఇక్కడ కూడా వినాయకుని ప్రస్తావన కనిపించదు. ఈ శ్లోకాలలో స్కంద, సూర్య, అశ్విన్, శశి, సరస్వతి, రుద్ర, యమ, విశ్వదేవ, అగ్ని మొదలైన దేవతల పేర్లు కనిపిస్తాయి (3.23-30). అయితే ఈ శ్లోకాలలో ఈశాన్య దిశలో గణేశ్వరులైన నంది మొదలైన వారిని ప్రతిష్టించాలని నిర్దేశించడం ఆసక్తికరమైన అంశం. అంటే, భరతుని కాలానికి కూడా గజముఖుడైన వినాయకుడిని కాకుండా, నందిదేవుడిని గణాలకు (బహుశా, ప్రమథ గణాలకు) అధిపతిగా పరిగణించారని మనం అనుకోవచ్చు. అలాగే, దేవతలకు నైవేద్యం అర్పించే శ్లోకాల్లో శివుణ్ణి ‘దేవదేవ మహాదేవ గణేశ త్రిపురాంతక’ అంటూ సంబోధించడం కనిపిస్తుంది (3.48). అంటే త్రిపురాంతకుడైన శివుడినే గణేశునిగా భావించారని, గజముఖుడైన గణేశుడు ఈ కాలానికి అంతగా ప్రాచుర్యం చెందలేదని చెప్పుకోవచ్చు. ఇదే అధ్యాయంలో 50వ శ్లోకంలో స్కందునికి దేవసేనాధిపతి, షణ్ముఖుడు, శంకరప్రియ అన్న విశేషణాలు వాడడం కనిపిస్తాయి. అంటే అప్పటికే స్కందుడు దేవగణాలలో ఒకడిగా స్థానం సంపాదించాడు కాని, వినాయకునికింకా ఆ స్థానం దక్కలేదని భావించాలి.
సంస్కృత కావ్యసాహిత్యంలో గణపతి
సంస్కృత కావ్యసాహిత్యం అనగానే మనకు ముందుగా కాళిదాసు (క్రీ. శ. 4వ శతాబ్ది) గుర్తుకు వస్తాడు. శివ పార్వతుల పుత్రుడైన కుమారస్వామి జననాన్ని వర్ణించే కాళిదాసు రచన కుమారసంభవమ్ అతి ప్రసిద్ధమైనది. ఈ కావ్యంలో ప్రధానాంశాలు: వరగర్వంతో లోకాలను పీడిస్తున్న తారకాసురుని శివపార్వతుల కుమారుడే సంహరించగలడని దేవతలు నిశ్చయించడం, శివపార్వతుల వివాహము జరిపించడం, ఆపై కుమారస్వామి జననం, తారకాసుర వధ మొదలైన విషయాలు. అయితే, కథ అంతా శివ పార్వతుల గురించే అయినా ఎక్కడా గణేశుని గురించి గాని, వినాయకుని గురించి గాని ఈ కావ్యంలో ప్రస్తావన కనిపించదు. నిజానికి కుమారస్వామి జన్మించినప్పుడు ఏకాదశ సర్గలో చేసిన వర్ణన ద్వారా కుమారస్వామి జననం ద్వారానే పార్వతి తల్లి అయ్యిందని కవి మనకు విస్పష్టంగా తెలియజేస్తాడు.
అశేషవిశ్వప్రియదర్శనేన ధుర్యా
త్వ మేతేన సుపత్రిణీనామ్ !
అలం విలంబ్యాచలరాజపుత్రి!
స్వపుత్ర మత్సంగతలే నిధేహి (కుమారసంభవమ్ 11.14)
ఓ పర్వతరాజనందినీ! సమస్త జగతునకు ప్రీతికారణమయిన దర్శనముగల ఈ పుత్రునితో నీవు సత్పుత్రులను కన్నతల్లులలో శ్రేష్ఠురాలివి అయితివి. ఇక ఆలస్యము చేయవలదు. నీ కుమారుని ఒడిలోనికి తీసుకొనుము.
ప్రమోదబాష్పాకులలోచనా
సా న తం దదర్శ క్షణ మగ్రతోలిపి
పరిస్పృశంతి కరకుడ్మలేన
సుఖాంతరం ప్రాప కి మప్యపూర్వమ్ (కుమారసంభవమ్ 11.18)
ఆ పార్వతి, తన కుమారు డెదురుగా ఉన్నప్పటికిని కళ్ళు ఆనంద బాష్పములతో నిండియుండుట వలన చూడలేకపోయినది. తరువాత తన మొగ్గలవంటి సుకుమారమయిన చేతులతో ఆ బాలుని స్పృశించి లోకోత్తరమయిన సుఖము ననుభవించెను.
పై శ్లోకాలే కాక, అంతకు ముందు అయిదవ సర్గలోనే పార్వతి తన ఆశ్రమంలో మొక్కలను ప్రేమగా పెంచుతున్న విషయాన్ని వర్ణిస్తూ, రాబోయే కుమార సంభవాన్ని కూడా ఇలా సూచిస్తాడు కాళిదాసు:
అతంద్రితా సా స్వయం ఏవ వృక్షకాన్
ఘటస్తన ప్రస్రవణైర్ వ్యవర్ధయత్
గుహో ఽపి యేషాం ప్రథమాప్తజన్మనాం
న పుత్రవాత్సల్యం అపాకరిష్యతి (కుమారసంభవమ్ 5. 14)
ఆ పార్వతీదేవి మిక్కిలి శ్రద్ధగా తనంతటతానే స్తనములవంటి ఘటములనుండి స్రవించిన నీటితో ఆశ్రమములోని చిన్ని చెట్లను పోషించి పెద్ద చేసెను. తనకు పుట్టబోయే ప్రథమ సంతానమైన గుహుడు (కుమారస్వామి)మీది సహజమైన పుత్రవాత్సల్యం కూడా ఈ చెట్ల మీద ఆమె చూపించే ప్రేమకు దీటు రాదేమో.
ఈ శ్లోకంలో గుహుడు పార్వతికి ప్రథమజన్ముడు అవుతాడని కవి స్పష్టంగా సూచిస్తున్నాడు. అదీకాక గణపతి కుమారస్వామి కన్నా పెద్దవాడు అయితే ఈ శివపార్వతుల కథలో అతని ప్రస్తావన ఎక్కడో ఒకచోట రావాలి కదా. కానీ, కావ్యం మొత్తంలో ఎక్కడా గణేశుని ప్రస్తావన కనిపించదు. అంటే కాళిదాసు కాలానికి కూడా గణపతి శివుని కుటుంబంలో సభ్యుడిగా లేడని, మలితరం పురాణాల్లో కనిపించే గణపతి కథలు కాళిదాసు తరువాతి కాలంలోనే పురాణాలలో చేర్చబడినవని మనం ఊహించవచ్చు.
విష్ణుశర్మ (క్రీ. శ. 5-6శతాబ్ది) రాసిన పంచతంత్రంలో మొదటి రెండు శ్లోకాలలో చేసిన ఇష్టదేవతా ప్రార్థనలో కూడా ఎక్కడా వినాయకుడు కనిపించడు:
బ్రహ్మా రుద్రః కుమారో హరి-వరుణ-యమా వహ్నిర్ ఇంద్రః కుబేరశ్
చంద్రాదిత్యౌ సరస్వత్య్-ఉదధి-యుగ-నగా వాయుర్ ఉర్వీ-భుజంగాః |
సిద్ధా నద్యో ఽశ్వినౌ శ్రీర్ దితిర్ అదితి-సుతా మాతరశ్ చండికాద్యా
ఈ మొదటిశ్లోకాలలో ప్రస్తావించిన దేవతలు వరుసగా బ్రహ్మ, రుద్ర, కుమార, హరి, వరుణ, యమ, అగ్ని, ఇంద్ర, కుబేర, చంద్ర, ఆదిత్య (సూర్య), సరస్వతి, అశ్వినీ దేవతలు, లక్ష్మి, దితి పుత్రులు, అదితి పుత్రులు, చండిక మొదలైన మాతృకలు – వీరందరికీ నమస్కరిస్తూ విష్ణుశర్మ తన పంచతంత్ర కావ్యాన్ని ఆరంభిస్తాడు. అయితే, ఊహించినట్టుగానే ఈ జాబితాలో కుమారస్వామి (కుమారో) ఉన్నాడు కానీ వినాయకుడు లేడని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను.
అయితే, వరాహమిహిరుడు (క్రీ. శ. 6వ శతాబ్దం) రాసిన బృహత్సంహితలో గణేశ, గణపతి అన్న పదాలు కనిపించకపోయినా, పిశాచ, రాక్షస, నాగ, అసుర గణాల వరుసలో వినాయకుల ప్రస్తావన కనిపించడం విశేషం:
… పిశాచ రాక్షస భుజగ అసురగణ వినాయకాద్యానం (బృహత్సంహిత 59.9)
వరాహమిహిరుని బృహత్సంహితలోనే ఆనాటి దైవరూపాలను వివరిస్తూ విష్ణు, సూర్య (సవితృ), శంభు, మాతృగణాలు, బ్రహ్మ, బుద్ధ, జిన (జైన) దేవతల పేర్లను వరుసగా పేర్కొంటాడు (బృహత్సంహిత 59.19). ఈ వరుసలో కూడా గణేశుని పేరు కానీ, వినాయకుని పేరు కానీ ప్రస్తావించక పోవడం గమనార్హం.
హాలుని రచనగా చెప్పుకోబడ్డ గాథాసప్తశతి (సత్తసఈ)లో సామాన్య ప్రజలు గణపతిని దేవునిగా ఆరాధించే వారని చెప్పడానికి ఆధారాలు కనిపిస్తున్నాయి.
జో సీసమ్మి విఇణ్ణో మజ్ఝ జుఆణేహి గణవఈ ఆసీ
తం వ్విఅ ఏహ్ణిం పణమామి హఅజరే హోహి సంతుట్ఠా – 4.72
యం శీర్షే వితీర్ణో మమ యువభిర్గణపతి రాసీత్
తమే వేదానీం ప్రణమామి హతజరే భవ సంతుష్టా
తరుణులు గణపతి శిల నుం-
చిరి నా తలగడగ నాఁడు శృంగారములో
హరిహరి నేఁడా శిల కీ
జరలోన నమింతు నాదు సౌభాగ్యముగా
(తెలుగు అనువాదం: జెజ్జాల కృష్ణ మోహన రావు)
యౌవనములో యువకులు తలదిండుగా అమర్చిన ఈ గణపతి శిలకే ఇప్పుడు ముసలితనంలో తలవంచి ప్రణామం చేయవలసి వస్తోంది. వార్ధక్యమా, సంతసించు!
హేలాకరగ్గఅట్ఠీజలరిక్కం సాఅరం పఆసంతో
జఅఇ అణిగ్గఅవడవగ్గి భరిఅగగణో గణాహివఈ – 5.03
హేలాకారాగ్రాకృష్టజలరిక్తం సాగరం ప్రకాశయన్
జయత్యనిగ్రహవడవాగ్నిభృత గగనో గణాధిపతిః
సులభముగాఁ దొండముతో
జలనిధిఁ దా పీల్చివేసి †సలిలేంధన కాం-
తుల గగనపు నలుదెసలన్
నెలకొల్పిన గణపతి కగు నిండుగ జయముల్
(తెలుగు అనువాదం: జెజ్జాల కృష్ణ మోహన రావు. †సలిలేంధనము = బడబాగ్ని)
తన తొండముతో సముద్రములోని నీటినంతా త్రాగి అందులోని బడబాగ్ని కాంతులను ఆకాశములో ప్రకాశింప జేసిన గణపతికి జయమగు గాక.
అయితే, హాలుడు 1వ శతాబ్దానికి చెందిన శాతవాహన రాజైనా, ఎన్నో వందలాది రచయితలు ఉన్న గాథాసప్తశతి రచనలోని పద్యాలన్నీ క్రీ. శ.6వ శతాబ్దాంతానికి పూర్తిగా సంకలనం అయ్యి ఉండవచ్చునని కొంతమంది పండితుల ఊహ. ఏది ఏమైనా, సంస్కృత సాహిత్యం కంటే ముందుగా ప్రాకృత సాహిత్యంలోనే గణపతి ప్రస్తావించబడడం ఇక్కడ గమనించాల్సిన విశేషం. అంటే అప్పటికే గణేశుడు ప్రజాబాహుళ్యంలో ప్రసిద్ధి చెందిన దేవుడిగా ఉండేవాడని, ఆ తరువాతి రోజుల్లో సంస్కృత సాహిత్యంలోనూ పురాణాల్లోనూ స్థానం సంపాదించుకొన్నాడని మనం ఊహించవచ్చు.
దక్షిణ భారతానికి చెందినవాడుగా పరిగణింపబడే దండి మహాకవి రాసిన దశకుమారచరిత్ర (సా.శ. 650-750) లో మొదటిసారి మనకు సంస్కృత కావ్య సాహిత్యంలో గజాననుని భగవంతుని రూపంగా ‘హస్తివక్త్రో భగవాన్’ అని వర్ణించడం కనిపిస్తుంది. దక్షిణాదికే చెందిన వాడైన బాణుని హర్షచరిత్రలో (7వ శతాబ్దం) మాత్రం ఇంకా ‘అయమశివ సహచరో వినాయకః’ అన్నదాన్ని వినాయకుడు అయం-అశివ-సహచర, అంటే అశుభకారకుడైన సహచరునిగానే వివరిస్తారు. బాణుని కుమారుడైన భూషణుడు కాదంబరికి ఉత్తరభాగం రాస్తూ అందులో వినాయకుని ‘ఆశివమూర్త్యో మహావినాయకః’ అంటూ ప్రస్తావిస్తాడు.
7వ శతాబ్దానికి చెందిన భవభూతి నాంది శ్లోకంలోనే గణపతిని స్తుతించే శ్లోకం కనిపిస్తుంది (మాలతీమాధవం 1.2). 8వ శతాబ్దానికి చెందిన మాఘుడు రాసిన శిశుపాలవధంలో కూడా గజముఖుడైన వినాయకుని స్తుతి కనిపిస్తుంది. వాక్పతిరాజుడనే కవి రచించిన గౌడవహ అన్న ప్రాకృత కావ్యంలో గణపతిని గజముఖుడిగా వర్ణించడం కనిపిస్తుంది. పదవ శతాబ్దానికి చెందిన రాజశేఖరుడు రాసిన బాలభారతంలో (సా.శ. 909) వినాయకుడు వ్యాసునికి వ్రాయసకాడుగా మహాభారతం రాశాడన్న కథనం సంస్కృత కావ్యాలలో మొదటిసారిగా కనిపిస్తుంది.
కర్ణాటకకు చెందిన సోమేశ్వర మల్లుడు రాసిన మానసోల్లాసః (12వ శతాబ్దం) కావ్యప్రారంభమే ఈ గణేశ స్తుతితో ప్రారంభమౌతుంది:
అభీష్టఫలదం సిద్ధిసిద్ధమంత్రం గణేశ్వరం
కర్ణతాలానిలోద్ధతవిఘ్నతూలలవం నమః
అభీష్టఫలాలను ఇచ్చేవాడు, విజయాలను కూర్చేవాడు, తన ఘనమైన చెవులను అటూ-ఇటూ ఆడించుతూ విఘ్నములను దూదిపింజలుగా మార్చి దూరం చేసే గణేశ్వరునికి నమస్సులు!
అంటే దాదాపు 9వ శతాబ్దం వచ్చేసరికి గణపతి వైదిక దేవతలలో ప్రముఖ స్థానాన్ని స్థిరపరచుకొన్నాడని మనం ఊహించవచ్చు. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే సాహిత్యంలో గణపతి ప్రాచుర్యం పెరగడంతో పాటు అంతకు ముందు ప్రముఖంగా కనిపించే స్కందుడి (కుమారస్వామి, సుబ్రహ్మణ్యస్వామి) ప్రస్తావన కావ్యసాహిత్యంలో పూర్తిగా మృగ్యమైపోవడం. ఒక్క తమిళ దేశంలో, తమిళ సాహిత్యంలో మురుగన్ అన్న పేరుతో తప్ప, స్కందుడు ప్రముఖ దేవతల క్రమం నుండి దాదాపు పూర్తిగా తొలగిపోవడం గత 1000 సంవత్సరాల్లోనే జరిగిందని చెప్పుకోవచ్చు.
బౌద్ధ సాహిత్యంలో గణపతి
బౌద్ధ సాహిత్యంలో బుద్ధుని బోధనలను పలుగాథలలో వర్ణించే అనేక గ్రంథాలలో మనకు లభిస్తున్న అతి ప్రాచీన గ్రంథం దివ్యావదానము (క్రీ. పూ. 1శ). ఈ గ్రంథంలో ఒకచోట ఆనాటి దేవతలను పేర్కొంటూ శివ, వరుణ, కుబేర, శక్ర, బ్రహ్మ మొదలగు దేవతానామాల క్రమం కనిపిస్తుంది (దివ్యా 1.1, 30.440). ఈ పేర్లలో వినాయకుని ప్రస్తావన లేదు. అలాగే అశ్వఘోషుడు (క్రీ. శ. 1శ) రాసిన బుద్ధచరిత్రలో స్కందుడు షణ్ముఖుడని, భవునికి (శివునికి) జన్మించాడన్న వివరం కనిపిస్తోంది. అయితే ఈ కావ్యంలో కూడా గణపతి ఊసే లేదు. లలితావిస్తారం (క్రీ. శ. 2శ) లోని 8వ అధ్యాయంలో సిద్ధార్థుని బాల్యం గురించి వివరిస్తూ శివ, స్కంద, నారాయణ, కుబేర, చంద్ర, సూర్య, వైశ్రవణ, శక్ర, బ్రహ్మ మొదలైన దేవతామూర్తులను దర్శించాడన్న వర్ణన కనిపిస్తోంది.
3-4వ శతాబ్దాలకి చెందిన మహాయాన గ్రంథం ధర్మసంగ్రహలో 14 లోకపాలకుల పేర్లు కనిపిస్తాయి. అవి వరుసగా: ధృతరాష్ట్ర, విరూపాక్ష, విరూధక, కువేర, ఇంద్ర, యమ, వరుణ, ఈశాన, అగ్ని, నిరృతి, వాయు, బ్రహ్మ, చంద్ర, సూర్య, పృథ్వి, అసుర. గణేశుడు కానీ వినాయకుడు కానీ ఈ గ్రంథంలో కనిపించరు. 6వ శతాబ్దానికి చెందిన కల్పద్రుమావదానమాలలో బుద్ధుడిని ఇతర దేవతలతో పోల్చి వర్ణించే శ్లోకాలలో బ్రహ్మ, విష్ణు, శివ, శక్ర, అగ్ని, యమ, నాగ, వాయు, కుబేర, మార, పంచశిఖ, గరుడ, సూర్య, చంద్రుడు మొదలైన దేవతలతో సామ్యం చూపించడం కనిపిస్తుంది.
6వ శతాబ్దానికి చెందినదిగానే భావించే మంజుశ్రీమూలకల్పం లోని 2వ అధ్యాయంలో స్కందుడిని ‘మహాక్రోధ’గా వివరిస్తూ ‘ఏష సః పరమగుహాధిపతి పరమగుహః మహావీర్యః షణ్ముఖో నామ మహాక్రోధరాజా సర్వ విఘ్న వినాశకః’ అంటూ పరమ రహస్యాలకు అధిపతి అయిన గుహుడు, మహావీరుడు, షణ్ముఖుడనే పేరు కలవాడు, మహాక్రోధుడైన రాజు, సర్వ విఘ్నాలను వినాశనం చేసే వాడు అని వర్ణిస్తుంది. వినాయకుని ఊసే లేని ఈ గ్రంథంలో ఇక్కడ స్కందునికి ‘విఘ్న వినాశకు’డన్న విశేషణం వాడడం విశేషం.
దక్షిణ భారత దేశానికి చెందిన దిఙ్నాగుడు (5-6వ శతాబ్ది) రాసిన కుందమాలలో మాత్రం తొలి ప్రార్థనా శ్లోకాలలో హేరంబ స్తుతి కనిపిస్తుంది: పిబేయుర్ అంతరాయాబ్ధిమ్… అంటూ అంతరాయాలనే సముద్రాన్ని పీల్చివేయగల హేరంబునికి వందనాలర్పిస్తూ ప్రారంభిస్తాడు. అయితే, ఇక్కడ ఆ రోజుల్లో హేరంబుడు అంటే గణపతి అని అనుకోవడానికి వీలులేదు. నిజానికి ‘హేరంబ’ అన్న పదానికి దున్నపోతు అన్న అర్థమే ప్రాచీనమైనది. తమిళంలో ఎద్దుకు సమానార్థకమైన ‘ఎరుమై’ అన్న పదంతో దీనికి సంబంధం ఉండవచ్చునని కొంతమంది భాషావేత్తల ఊహ. తెలుగులో ఎనుము, ఎనుంబోతు అన్నవి ఈ పదానికి సోదరపదాలు (cognates). స్కాంద పురాణంలో దుర్గాదేవి సంహరించిన రాక్షసులలో దున్నపోతు తలతో ఉన్న హేరంబుడి ప్రస్తావన కూడా కనిపిస్తుంది. అలాగే బెంగాలీలోని పంచోపాసనలో ‘హేరుక’ అన్నవాడు మహాకాలుడైన శివుని గణాలలో ఒకడు. బహుశా ఈ దున్నపోతు తలవాడైన హేరంబుడు కొంత కాలం (కొన్ని ప్రాంతాల్లో) శివుని గణాలకు అధిపతిగా పరిగణించబడి, ఆ తరువాత గజాననుడైన వినాయకుడు గణాధిపతిగా ప్రాచుర్యం పొందిన రోజుల్లో ఆ స్థానాన్ని, ఆ విశేషణాలను గణేశునికి ధారాదత్తం చేసి ఉండవచ్చేమో.
గయాలో దొరికిన 9వ శతాబ్దపు విగ్రహం.
ప్రస్తుతం పాట్నా మ్యూజియంలో ఉంది.
8వ శతాబ్దం తరువాతి కాలపు బౌద్ధ సాహిత్యంలో గణేశుని ప్రస్తావన విరివిగా కనిపిస్తుంది. అయితే, వజ్రయాన బౌద్ధంలో గణేశుడు అశుభకారకుడు, విఘ్నకర్త. బౌద్ధదేవత అయిన అపరాజిత గజముఖుడైన వినాయకుడిని తన కాళ్లతో అణగద్రొక్కే బౌద్ధ చిత్రపటాలు, శిల్పాలు మనకు నేపాల్, టిబెట్, తూర్పు భారతంలో పలుచోట్ల కనిపిస్తాయి. అందుకే అపరాజితకు విఘ్నాంతక అనికూడా పేరు. నేపాలీ బౌద్ధులలో అమిత ప్రాచుర్యమైన స్వయంభూపురాణంలో బౌద్ధాచార్యుడైన ఒడియాచార్యుడు అష్టసిద్ధుల కోసం తపస్సు చేస్తుంటే గజముఖుడైన గణేశుడు పూతన, కటపూతన వంటి స్త్రీగణాలతో పదేపదే వచ్చి విఘ్నాలను కల్పిస్తాడు. అప్పుడు ఒడియాచార్యుడు షడక్షరి మంత్రం పఠించి మహావిద్య అనే దేవతను ప్రత్యక్ష్యం చేసుకొని గణేశుని విఘ్నాలనుండి తనకు రక్షణ కోరుకొంటాడు. అప్పుడు ఆమె దశక్రోధులను సృష్టించి గణేశుని పీచమణచుతుంది.
11వ శతాబ్దానికి చెందిన నేపాలీ బౌద్ధగ్రంథం ధర్మకోశసంగ్రహంలో పైకథకు కొంత మార్పులు కనిపిస్తాయి. దశక్రోధులలో ఒకరైన విఘ్నాంతకుడిని చూసి వినాయకుడు పారిపోవడానికి ప్రయత్నిస్తే, విఘ్నాంతకుడు గణేశుని దంతాలలో ఒక దంతాన్ని పెరికివేస్తాడు. అప్పుడు మదమణిగిన వినాయకుడు బుద్ధి తెచ్చుకొని సిద్ధిదాతగా, శుభప్రదాతగా బౌద్ధదేవతలలో ఒకడుగా మారిపోతాడు.
జైనసాహిత్యంలో గణపతి
ఇక జైన సాహిత్యంలో మనకు లభ్యమౌతున్న అతి ప్రాచీనమైన గ్రంథం ఆచారాంగసూత్ర. ఇది దాదాపు క్రీ. పూ. 5వ శతాబ్దం నుండి 3వ శతాబ్దపు మధ్యకాలానికి చెందిందని పండితుల అభిప్రాయం. ఈ గ్రంథంలో ఇంద్ర, రుద్ర, స్కంద, యక్ష, నాగ దేవతల పేర్లు కనిపిస్తాయి కాని, గణేశుడు కానీ వినాయకుడు కానీ కనిపించరు. అర్ధమాగధిలో రాసిన నాయాధమ్మకహాలో స్కందునికి సంబంధించిన పండుగ గురించి ప్రస్తావన కనిపిస్తోంది, కానీ గణేశుని ఊసు లేదు. క్రీ. శ. 3వ శతాబ్దానికి చెందిన అంగవిజ్జా అన్న ప్రాకృత గ్రంథంలో కూడా ఇచ్చిన పేర్లలో స్కందుని పేరు రెండు మార్లు కనిపిస్తుంది (విశాఖ, కుమార) కానీ వినాయకుని పేరు ఎక్కడా కనిపించదు.
అయితే, 9వ శతాబ్దం నుండి జైన సాహిత్యంలో వినాయకుడు ప్రధాన దేవతగా కనిపిస్తాడు. గణేశుని గురించి బౌద్ధంలో విఘ్నకారకుడిగా కనిపించే చెడ్డ వర్ణనలు జైన సాహిత్యంలో కనిపించవు. 12వ శతాబ్దానికి చెందిన హేమచంద్రుడు రాసిన అభిదాన చింతామణిలో గణేశుని ప్రార్థన కనిపిస్తుంది.
హేరంబో గణవిఘ్నేశః పరశుపాణిర్ వినాయకః
ద్వైమాతురో గజస్యైక దంతౌ లంబోదరాఖుగౌ (అ. చిం. దేవకాండ- 2)
శ్వేతాంబర జైనుడైన వర్ధమానసూరి రాసిన ఆచారదినకర (14వ శ) పుస్తకంలో వినాయకుడు విఘ్ననివారకుడని, అందుకే అతనిని ప్రతి శుభకార్యానికి ముందుగా పూజించాలని చెబుతుంది.
ఇప్పుడు మనకు లభ్యమౌతున్న జైనకావ్యాలకన్నా ముందుగానే జైనశిల్పాలలో 9వ శతాబ్దం నుండే గణేశుడు మనకు ప్రముఖంగా కనిపిస్తాడు. మథురలో దొరికిన ఒక శిల్పంలో అంబికకు ఒకవైపు గజముఖుడైన గణేశుడు, మరోవైపు వైశ్రవణుడు కనిపిస్తారు. 10వ శతాబ్దపు అనేక జైన మందిరాల ముందు వినాయకుడు ద్వారపాలకుడిగా కనిపిస్తాడు.
ఇక శాసనాలలోనూ, నాణెములమీద, శిల్పాలలో గణేశుని గురించిన ఆధారాలతో పాటు భారతదేశానికి వెలుపల చైనా, జపాన్, ఆగ్నేయేసియాలలో గణేశుని ప్రాచుర్యాన్ని తెలిపే వివరాల గురించి మళ్ళీ ఇంకోసారి చర్చించుకొందాం.
(సశేషం)
ఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃః
రచన: సురేశ్ కొలిచాల, ఈ మాట అంతర్జాల మాసపత్రిక సౌజన్యంతో
No comments:
Post a Comment