సన్యాసము - మరిన్ని విశేషాలు
సాహితీమిత్రులారా!
మన హిందూసమాజంలో సన్యాసి అనే పదం సుపరిచితమైనదే.
దీన్ని గురించి ఇంకెందుకు తెలుకోవడం అనే అనుమానం రావచ్చు.
కానీ మనకు తెలిసిన విషయం స్వల్పం. అందుకే మరికొంత
తెలుసుకుందాని ఇక్కడ చర్చించడం జరుగుతోంది.
ఆశ్రమ ధర్మాల్లో సన్యాసం నాలుగవది. మొదటిది బ్రహ్మచర్యం,
రెండవది గృహస్థాశ్రమం, మూడవది వానప్రస్థం.
సన్యాస మనే ఈ పదాన్ని ఇంతకుపూర్వం సన్న్యాసం అని,
సంన్యాసం అని వాడేవాళ్ళు.
సన్యాసం అంటే వైరాగ్య భావనతోనో, అదే లక్ష్యంగానో
సంసారిక జీవితాన్ని త్యజించివేయడం. వైరాగ్య తీవ్రతను బట్టి మంద వైరాగ్యం,
తీవ్ర వైరాగ్యం, తీవ్రతర వైరాగ్యం అని మూడు విధాలుగా చెబుతారు.
1. గృహసంబంధమైన సమస్యలను తట్టుకోలేక
సన్యసించటాన్ని మందవైరాగ్యం అంటారు.
2. దారేషణ, పుత్రేషణ, ధనేషణ అనే ఈషణత్రయాన్ని వదలిన
సన్యాసాన్ని తీవ్రవైరాగ్యం అంటారు.
3. కర్మకాండలలో చెప్పిన విధివిధానాలు ప్రయోజనరహితమని
విడిచి పెట్టిన సన్యాసాన్ని తీవ్రతర వైరాగ్యమని అంటారు.
ఈ విభజన కాకుండా సన్యాస తీవ్రతను బట్టి మరి
రెండు రకాల విభజన వుంది. అందులో నాలుగు విధాలని,
ఆరు విధాలని చెప్పబడుతున్నవి.
మొదట నాలుగు విధాలైన వాటిని గమనిస్తే-
1. కుటీచకం, 2. బహూదకం,
3. హంస సన్యాసం, 4. పరమహంస సన్యాసం
తీవ్ర వైరాగ్యం వల్ల తీసుకునే సన్యాసాలు మొదటి రెండు సన్యాసాలు.
వాటిలో మొదటిది 1. కుటీచకం- 2. బహూదకం.
తీవ్రతర వైరాగ్యం కలిగిన సన్యాసులు హంసలు, పరమహంసలు
సంచారం చేసే శక్తిలేని సన్యాసి ఊరివెలుపలో, ఏదైనా ఒక నదీతీరంలోనో మఠం ఏర్పరచుకొని, కాషాయవస్త్రాలు దండ కమండలలాలు ధరించి స్వయంగా ఆహారాన్ని సంపాదించుకునే
సన్యాసి కుటీచకుడు.
పుణ్యతీర్థాలను, పవిత్ర క్షేత్రాలను దర్శిస్తూ ఎక్కడా ఆరు రోజులకు
ఎక్కువ కాకుండా గడుపుతూ సంచారం చేస్తుండే సన్యాసి బహూదకుడు.
హంసలు ఆచార విహితమైన మార్గంలో సన్యాస వ్రతం కొనసాగిస్తారు.
పరమహంసలు బ్రహ్మజ్ఞానం సంపాదించాలనే జిజ్ఞాసతో తీవ్ర సాధన చేస్తుంటారు. ఒక జీవిత కాలం సాధనలో కృతకృత్యులు కాలేని
పరమహంసలు తిరిగి జన్మలు ఎత్తి సాధన కొనసాగించి గమ్యం చేరుతుంటారని ప్రతీతి.
రెండవ విధానంలో పైన చెప్పిన నాలుగు విధాలే కాకుండా మరో రెండు విధాలున్నాయి. తురీయాతీత, అవధూత అనే వ్యవస్థలు.
మరో విభజనప్రకారం 6 విధాలు ఇవే-
1. కర్మఫల సన్యాసం / కర్మసన్యాసం
2. వైరాగ్య సన్యాసం / జ్ఞాన సన్యాసం
3. ఆతుర సన్యాసం / క్రమ సన్యాసం
4. వివిదిషా సన్యాసం / విద్వత్సన్యాసం
5. కర్మైక దేశ సన్యాసం / పరమార్థ సన్యాసం
6. గౌణ సన్యాసం
గౌణ సన్యాసంలో బ్రహ్మణేతరులు స్త్రీలు కూడ
సన్యాసం తీసుకోవచ్చు. పురాణ కాలంలో
బ్రహ్మణేతరులు సన్యాసం తీసుకోవడం ఉంది.
ఉదాహరణకు విదురుడు ఇలా సన్యాసం తీసుకొన్నవాడే.
No comments:
Post a Comment