లింగం - విశేష విషయాలు
సాహితీమిత్రులారా!
లింగం అంటే ఏమిటి అంటే దీనికి విభిన్నమైన
అర్థాలున్నాయి. అవి-
1. పరమశివుని అర్చామూర్తి - శివునికి జటాజూటంతో
ఫాలనేత్రంతో డమరుకం, కపాలం, త్రిశూలం మొదలైనవి
ధరించి రూపాన్ని ఎక్కడా పూజించరు. దీనిగల కారణం
భృగువు శివునికిచ్చిన శాపమంటారు. అందువల్ల లింగాన్ని
శివునికి ప్రతిరూపంగా పూజిస్తారు.
2. లింగ్యతే జ్ఞాయతే అనేనేతి లింగం - అని అమరకోశం
చెబుతున్నది. అంటే చిహ్నం అని అర్థం.
3. శిశ్నము అని సాధారణార్థం
4. బసవేశ్వరగీతామృతం - ప్రకారం
లీయతే గమ్యతే యత్రయేన సర్వచరాచరం తదేతత్
లింగతత్వ పరాయణైః - అంటున్నది అంటే ప్రళయ
కాలంలో సకల చరాచర ప్రపంచం ఎక్కడి ఉండి,
సృష్టికాలంలో ఎక్కడి నుంచి తిరిగి వస్తుందో అది లింగం.
5. భూమి పీఠంగా, వేదాలే ఆలయంగా,
కలిగిన ఆకాశమే లింగం.
ఇలా అనేక నిర్వచనాలున్నాయి.
ఏది ఏమైనా శైవులు అంటే హిందువులు
శివునిగా లింగాన్ని పూజిస్తారు.
లింగ భేదాలు - వైవిధ్యాలు
లింగాలన్నీ ఒకే రూపంలో ఉండవు. సాధారణంగా శివాలయంలో
కనిపించేది నల్లరాతితో చేసిన శివలింగం. కళ్లు, ముక్కు, చెవులు,
కలిగి ముఖాలు ఉండవు. స్పటికంతో చేసిన లింగాలు, పాదరసంతో
చేసిన లింగాలు, కూడ ఉన్నాయి. లింగప్రమాణనేదీ లేదు.
శ్రీశైలంలోని శివలింగం చాల చిన్నది.
అలాగే వేములవాడలోని
శివలింగం ఎక్కువ కైవారాలను కలిగి ఉంది.
ద్రాక్షారామంలోని
శివలింగం రెండవ అంతస్తులోకి వెళ్ళి చూడాలి.
ఇది ఇలా ఉంటే
తంజావూరులోని బృహదీశ్వరాలయంలోని శివలింగం ఆకారంలోను
ఎత్తులోనూ చాల పెద్దది.
గుడిమల్లాంలోని శివలింగం మరోవిధంగా ఉంది.
కొన్ని లింగాలకు ఒకటి నుంచి ఐదు ముఖాలవరకు ఉంటాయి
ఖాట్మండు(నేపాల్ రాజధాని)లోని పశుపతినాథ్ ఆలయంలోని
శివలింగానికి 5 ముఖాలున్నాయి. అందులో ఒకటి ఊర్ధ్వముఖంగా ఉంది.
పరమ శివుడి పంచముఖాలు ఈశాన, తత్పురుష, అఘోర, వామదేవ, సద్యోజాతాలు. ఒకే శివలింగంలో అనేక చిన్నచిన్న లింగాకృతులు వెయ్యి వరకు ఉన్నాయి. వెయ్యిన్నొక్క ముఖాలుండే శివలింగాన్ని ఆట్యలింగం అంటారు. 108 ముఖాలుండే శివలింగాన్ని
అష్టోత్తర లింగమని, సారోడ్య లింగమని అంటారు. ఏ ముఖంలేకుండా
మనకు సాధారణంగా శివాలయాల్లో కనిపించే లింగాన్ని అకాట్య లింగం అని అంటారు.
లింగ భేదాలను గురించి పూర్వనుంచి ఉన్న ఆచారాలు
కృతయుగంలో రత్నలింగాన్ని, త్రేతాయుగంలో స్వర్ణలింగాన్ని, ద్వాపరయుగంలో రస(పాదరస)లింగాన్ని, కలియుగంలో పార్థివ(మట్టి)లింగం పూజనీయాలని చెబుతారు. అలాగే
క్ష్తత్రియులు బాణలింగాన్ని, వైశ్యులు స్వర్ణలింగాన్ని,
శూద్రులు శిలాలింగాన్ని, స్త్రీలు పార్థివలింగాన్ని
పూజనీయాలుగా చెబుతారు. కొందరు స్పటిక లింగాన్ని
పూజిస్తారు. ఇది కఠినమైన నియమంకాదు ఎవరైనా
అందుబాటులో ఉండటాన్ని బట్టి ఏలింగాన్నైనా పూజించవచ్చని
పెద్దలు చెబుతారు.
లింగం రూపం మీద కొన్ని అపోహలున్నాయి-
శివలింగాన్ని పురుషుని జననాంగంతోను, పానవట్టాన్ని
స్త్రీ జననాంగంతోను పోల్చడం. ఇది సరైనదికాదని
వివేకానందుడు ఖండించారు. శివలింగం యజ్ఞశాలలో
యూప స్థంభ పరిణామమేనని ఆయన వాదించారు.
బౌద్ధులు నిర్మించిన స్థూపాలు కూడా శివలింగార్చనకు
స్ఫూర్తిని కలిగించి ఉండవచ్చని వాదించారు.
"శివదర్శనమ్" అనే పుస్తకంలో శ్రీ చందూరి సుబ్రహ్మణ్యం గారు
లింగార్చన బహుపురాతనమైందని, ఇతర ఖండాలలోనూ ఉన్నదని
ఆధారసైతంగావ్రాసివున్నారు.
No comments:
Post a Comment