Tuesday, December 13, 2016

ఈ సమయాల్లో తాంబూలం సేవిస్తే సుఖమట


ఈ సమయాల్లో తాంబూలం సేవిస్తే సుఖమట



సాహితీమిత్రులారా!


కవి చౌడప్ప అంటూనే బూతులే
చెప్పే కవి అని కొందరి అభిప్రాయం-
అది కొంతవరకు నిజమే కాని
ఈ పద్యం చూడండి-

పరగడుపున సభలలోపల
తరుణులయెడ భుక్తమైన తరి యొక విడెమున్
దొరకని వరునకు సౌఖ్యము 
కరవప్పా కుందవరపు కవి చౌడప్పా!

ఇది తాంబూల సేవనం ఎప్పుడు
చేయాలనేవిషయం సూచించే పద్యం

ఆహారం తీసుకోకముందు ఒకసారి,
ఎక్కడికైనా సభలకు వెళ్ళినపుడు,
స్త్రీలతో సల్లాపాలలో ఉన్నపుడు,
భోజనం చేసిన తరువాత -
ఈ సమయాల్లో ఒక్కవిడియము
దొరకక పోతే ఆ పురుషునికి
లోకంలో సుఖమనేది  కరువే అవుతుందట.

దీన్ని బట్టి ఆసమయాల్లో
తాంబూలం వేసుకోవాలని కవి భావం.

స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలట


స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలట



సాహితీమిత్రులారా!


సంస్కృతంలోని కామందకనీతిశాస్త్రాన్ని
తెలుగులో జక్కరాజు వెంకటరాజు
ఆంధ్రకామందకమనే పేరున తెనిగించాడు.

అందులోని ఈ పద్యం చూడండి-

వలపుల సొంపు కెంపు జిగి వన్నియ వాల్జడ కన్నులం గనం
గలకల మంచు మించు మృదు గద్గద భాషలు నేకతంపు చ
ర్యలు వెలలేని మెచ్చుల యొయారి తుటారి మిటారి యొప్పులుం
గల కలవాణి టేనగునిగాకల బెట్టుదు గుట్టు ముట్టగన్

కమ్మని కంఠధ్వనిఉన్న పడతి ప్రేమానురాగాల విలాసాలు,
ఎరుపెక్కిన కడగంటి చూపులు, కలకల ధ్వనితో కూడిన
సుకుమారమైన సల్లాపాలు, ఏకాంతంలో చూపే మన్మథ
వికారచేష్టలు, వెలకట్టరాని పొగడ్తలతో కూడిన ఒయారాల
అందాలు అనే ఆయుధలతో, ధైర్యంతో, మాయలతో
ఏ పురుషుణ్ణి విరహతాపానికి గురిచేయదు? - అని భావం

అందమైన యువతి పురుషుణ్ణి ఆకర్షించి, తన వయ్యారాలతో,
సరససల్లాపాలతో తనకు అధీనుణ్ణిగా చేసుకుంటుంది. తనకు
లోబడేంత వరకు అతణ్ణి తాపానికి గురి చేస్తుంది. అందువలన
స్త్రీల విషయంలో చాల జాగ్రత్తగా ఉండాలని గ్రంథకర్త సూచన
ఇది.

Monday, December 12, 2016

వయసు మళ్ళినవాని ఆవేదన


వయసు మళ్ళినవాని ఆవేదన



సాహితీమిత్రులారా!



వయసు మళ్ళినవాని ఆవేదన తెలిపే
ఈ శ్లోకం చూడండి-

ఆ పాండురా శ్శిరసిజాస్త్రివళీ కపోలే
దంతావళీ విగతా వచ మే విషాదః
ఏణీదృశో యువతయః పధి మాం విలోక్య
తాతేతి భాషణపరాః ఖలు వజ్రపాతః

తల వెంట్రుకలు తెల్లబడ్డాయి.
చెంపల మీద ముడుతలు ఏర్పడ్డాయి.
నోట్లో దంతాలు ఊడిపోయాయి. అయినా
అందుకోసం నాకు విచారంగాలేదు.
కాని నేను వచ్చే దారిలో లేడి కన్నుల
యువతులు నన్ను చూచి తాత
అని తమలో తాము మాట్లాడుకోవడం
నాకు పిడుపాటువలె తగిలినది - అని భావం.

ఇందులో తాత - అంటే సంస్కృతభాషలో
తండ్రి అని, మన తెలుగులో తాత అంటే
ఇంకెంత బాధపడేవాడో కదా!

వీరి విషయంలో అమర్యాద తగదు


వీరి విషయంలో అమర్యాద తగదు




సాహితీమిత్రులారా!



అవమానించడం తగదు ఎవరినైనా
కానీ వీరిని అవమానించడం
అసలు చేయకూడదట -
ఈ శ్లోకం చూడండి -

క్షత్రియం చైవ సర్పంచ
బ్రాహ్మణంచ బహుశ్రుతమ్
నావమన్యేత వై భూష్ణుః
కృశా నపి క దాచన

పరాక్రమం గల రాజు(క్షాత్రంగలవాడు)నీ,
పామునూ, బాగా పాండిత్యం
గల బ్రాహ్మణునీ, బాగా బ్రతికి -
చెడినందువల్ల అవస్థలుపడేవాడినీ,
ఎన్నడూ అవమానించరాదు.
ఎందుకంటే - వీరు తాత్కాలితంగా
ఏమీ చేయకలేకున్నా, తమ శక్తి సామర్థ్యాలకు
పదునుపెట్టి అవతలివారి అంతు చూడగలరు.
కావున వీరి విషయంలో  అమర్యాద కూడదు.

Sunday, December 11, 2016

అప్పుడు అన్నీ నిష్ప్రయోజనాలే


అప్పుడు అన్నీ నిష్ప్రయోజనాలే




సాహితీమిత్రులారా!


ఈ శ్లోకం చూడండి -
ఇది నీతిశాస్త్రంలోనిది.

అధర్మేణై తతేతావ
త్తతో భద్రాణి పశ్యతి,
అతత్స పత్యాన్ జయతి
నమూలస్తు వినస్యతి

అన్నాయం - అక్రమాల ద్వారా ఎంతగా
సంపాదించి భాగ్యవంతుడైనా
బాగా సుఖాలు అనుభవించినా,
విరోధులపై విజయం సాధించినా,
ఏదో నాటికి పాపం పండడం ఖాయం.
అప్పుడు సంపాదన, సుఖం, ధనం,
శత్రుజయం అన్నీ నిష్ప్రయోజనాలే.

కాబట్టి న్యాయాన్యాయాలను పరిగణించి
ఉండటం అన్నివిధాలా శ్రేయమని భావం.

నాస్వామి ఈ రాత్రి వచ్చి పరవశింపచేయగలడు


నాస్వామి ఈ రాత్రి వచ్చి పరవశింపచేయగలడు




సాహితీమిత్రులారా!



చైనా జాతిలో మొలకెత్తి
జపానుసాహితీలతను లతాంతాలను
విరియించిన ఒక కథ-

ఆకాశరాజుకు తంబతా సుమే అనే చక్కని చుక్క
ఒకే ఒక కూతురు. ఆ పిల్లకు బట్టలునేయడం
అంటే ఇంత అంత అనరాని సరదా.
నాన్నకు కావలసిన బట్టల్ని నేసి యిచ్చేది.
ఒకరోజు మగ్గం ముందు కూర్చొని పోగులు
సారించుతూ దోవెంట పోయే మాంచి ఏపైన
కోడెను తోలుకు వెళుతున్న ఓ కోడెకానిమీద
కన్నేసింది తండ్రికి ఆమె మనసు తెలిసి
అతని పొత్తుకు ఇష్టపడి అతన్ని అల్లునిగా
చేసుకున్నాడు. పెళ్ళైంది వారిద్దరు ఒకర్నొకరు
ఎడబాయక చేయవలసిన పనులు చేయక
పనంతా ఆకాశరాజుపై బడింది. చివరికి
ఆకాశరాజు వారిని విడదీశాడు. ఒకరు
ఏటికి అవతల ఒకరు ఇవతల ఉండేలా చేశాడు.
ఏడాదికి ఒకసారిమాత్రమే కలుసుకునే దానికి
ఒప్పుకున్నాడు.
అది ఆశ్వయుజ శుద్ధ సప్తమినాడు మాత్రమే
అనుమతించబడింది.
దీనిమీద జపానులో పౌరాణిక గాథ అల్లబడింది.
అనేకానేకులు వారి కథను మహాకవులనేకులు వారి
స్వగత ఛందాల్లో పురివిప్పి ఆడాయి.
ఇక్కడ కొన్నిటిని చూద్దాం-

ఆమొనో గో వా 
అయి ముకీ తాషితే
  వాగా కోయీ షీ-
కిమి కిమాసు నారీ
హిమో తోకీ మాకేనా....

(ఆకాశగంగకు ఈ దరిని ....
కొంతకాలం నుంచీ కన్నులుకాయలుకాచి
కనిపెట్టుకొని----
వెంపర్లాడుతున్నానో ----
నా నాథుడు ఈ రేయి దక్కకపోడు.
నానీవి సడలే తరుణం ఆసన్నమైంది .)

హిసా కతా నో 
ఆమొ నోకా వాశె నీ
     ఫూనే ఊకెతె
కోయోయ్  కా-కీమీగా
ఆగరి కిమాసఁ ..

(నురగలై పరవళ్ళుపోయే
అమరాకాశవాహినిని తరించి...
తేలియాడుతూ నాస్వామి ఈ రాత్రి
వచ్చి పరవశింపచేయగలడు)

కాజే కూమో వా
ఫూతా - త్సూ నో కిషీ నీ
    కాయోయ్ దోమో 
వాగా తూహో త్సూమా నో
కోతో జో కాయో వానూ....

సుబూతే నీ మో
నాగే కోషీసు బేకీ
   ఆమోనొ గోవా 
హేదా తేరేబా  కామో
ఆమత సుబే నాకీ...

(వాయుదేవుడూ పర్జన్యుడూ
ఈవల ఆవల రాకపోకలు సలుపుతున్నా
మాయిరువురికీ ఒకపలుకైనా నడవదుగదా
అద్దరి కూతవేటు దూరంలో ఉన్నా...
హతవిధి ... ఆశ్వయుజం వచ్చేదాకా,
ఒకరికొకరం కాకుండా చేసింది.)

ఆమొనొ గోవా
ఈతోకావా నామీ వా
   తాతేనో దోమో
సమోరై గాతాషీ
చికాకీ కోనో సే వో...

(ఆకాశగంగ పొంగకపోయినా
అంతగా గడవరాని అడ్డంకులు లేకపోయినా
ఆ రవంత ప్రవాహాన్నీ అతిక్రమించి
అతని సరసన చేరనీయని ... దురుల్లంఘ్య -
అనుశాసనం ... అప్రతిహత ప్రతిబంధకమౌతూ ఉంది)

(జపాను పద్యవళీ,  అనువాదమూ
The Romance of the Milky way and the other  Studies
అనే లే హరెన్ సంగ్రహాన్ననుసరించి)





Saturday, December 10, 2016

కృష్ణుని సేవింప వచ్చిన శివుడా!


కృష్ణుని సేవింప వచ్చిన శివుడా!




సాహితీమిత్రులారా!


పింగళి సూరన కృత
ప్రభావతీ ప్రద్యుమ్నము నందలి
ఈ ఉత్ప్రేక్ష చూడండి-

ఇంద్రునికి ఆయన రథసారథి మాతలి ద్వారకా
పట్టణంలోని ఉద్యానవనం చూచి
తనఱేనికి ఈ విధంగా చెప్పుచున్నాడు-

కలధౌతకేళినగంబుగాఁ బోలును
         దనరుచున్నది శంభుతనువులీల
ఘనపుష్పచాంపేయ వనరాజి గాబోలు
         నేలుచున్నది పులితోలు సిరుల
హరినీల సోపానసరణి గాఁబోలును 
         బగటుచున్నది నల్లపాఁపపేరుఁ
బవడంపుటలవ సౌభాగ్యంబుగాఁబోలుఁ
         జాటుచున్నది జటాజూటరుచిని
సరసిగాఁబోలుఁ గ్రాలెడు సురనదిగతి
నోడగాఁబోలుఁ బోలెడునుడుపతికళ
ననిమిషాధిప చూచితే యల్లపసిడి
కోటనడిమి శృంగారపుఁదోఁటలోన
                                       (ప్రభావతీప్రద్యుమ్నము - 1- 63)

ఓ దేవతలరాజా! ఇంద్రా!
వెండి క్రీడా పర్వతము శివుని శరీరంగాను,
పచ్చని సంపెగ చెట్లచాలు పులితోలుగను,
నీలంపు మెట్లవరుస నల్లత్రాచుల హారంగాను,
పగడాల కంచె జటాజూటంగాను,
నడుమనున్న కొలను ఆకాశగంగగను,
ఆ కొలనిలోని నావ చంద్రకళగాను,
చెప్పి, ఉద్యానవనరూపమున శ్రీకృష్ణుని
సేవింపవచ్చియున్న శివుడు కాబోలు - అని
ఉత్ప్రేక్షించినాడు కవి.