Tuesday, October 1, 2019

మార్పు


మార్పు
సాహితీమిత్రులారా!

“You are fair”  అన్నాడు పెదనాన్న. మరణించేవాడి కృతజ్ఞతాభావం నాకు అవసరమా? ఆస్తి తగాదాల్లో విడిపోయాం.తర్వాత నేను పెదనాన్న మొహం చూడలేదు. చావు బ్రతుకుల్లో వున్నాడన్నా నాలో చలనం లేదు. “కఠినం” అని దెప్పిపొడిచేది అమ్మ నా స్వభావాణ్ణి చూసి. దూరపుబంధువు ఒకడు నన్ను లోనికి తీసుకువెళ్ళాడు. intensive care  లో వుంచారు. చుట్టూ చాలా మంది రోగులు. వింత వింత సమస్యలు. జూనియర్‌ డాక్టర్‌, నా వైపు నడుచుకొంటూ వచ్చి “మీరేమవుతారు ఈయనకు? రెండురోజులుగా మాట పడిపోయింది. మీరు కొంచెంసేపు ఆయనకు శ్రమ కలిగించకుండా ఇక్కడే వుండండి” అని చెప్పింది. చీర మీద తెల్లకోటు వేసుకొని విచిత్రంగా వుంది. మంచినీళ్ళు తాగించాను. పెదనాన్న మాట్లాడే విషయాలు కొణ్ణి అర్థం కాలేదు నాకు, అయినా ఓపిగ్గా విన్నాను. అసలు నన్ను గుర్తు పట్టాడా లేదా అన్నది అనుమానం. నేను అనునయంగా అదే విషయం వెల్లడిస్తే, రాతి మీద పూవు పూసినట్టు నవ్వి నా చేయి పట్టుకొన్నాడు. పాత స్పర్శే. నా చిన్నప్పుడు ఎంతో దయగా వ్యవహరించేవాడు. చేయి చేసుకొనే వాడుకాదు. నా సమక్షంలో ఎంతో సాంత్వన పొందు తున్నాడన్న విషయం, తన హావభావాలు చెప్పక చెబుతున్నాయి. నా మనసంతా జాలితో నిండి పోయింది. గురకతో కూడిన నిద్ర ఆవహించింది. నేను జాగ్రత్తగా నా చేయి విడిపించుకొని, నిద్రాభంగం కలుగకుండా బయటపడ్డాను. లోపల ప్రాణం కొట్టుమిట్టాడుతుంటే, బయట ICU లో వుంచినందుకు జమాపద్దులు. చాలా చిన్నవయసులోనే నాకు మనుషులంటే ఒక రకమైన జుగుప్స, అసహ్యం. ఒక్కోసారి విపరీతమైన జాలి, వారి అశక్తత, నిస్సహాయతలను చూస్తుంటే; పెదనాన్న మరునాడే మరణించాడు. లోలోపల అందరికీ ఆనందమే “you are fair”  అని నన్ను  చూడగానే వెలిగిపోయిన పెదనాన్న మొహం గుర్తుకొచ్చి సిగ్గుతో కుంచించుకుపోయాను, ఏమీ చేయలేనందుకు. పెదనాన్నని మరణం ఏరులా ఎగరేసుకుపోతుందని అనుకోలేదు. ఆలోచనల్లో కొట్టుకుపోయాను.

2
నా స్వభావం అందరికీ వింత గొలిపేది. అందరిలా ఉండే వాణ్ణి కాదు. నా శరీరం అంత బలమైంది కాదు.చిన్నప్పుడు నా ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉండేది. ఎన్నోసార్లు మృత్యుముఖం అవగతమైంది. ఒక రోజు నా వేలు తెగిపోయింది . రక్తస్రావం ఆగలేదు. డాక్టరు కుస్తీ పడుతున్నాడు, కలిపి కుట్టడానికి. నాన్నలో ఆక్రోశం, ఆందోళన. రక్తాన్నిచూసి స్పృహతప్పి పడిపోతుంటే,”డాక్టర్‌” అని బలహీన స్వరంతో నేనే హెచ్చరించాను. నాన్నకు ఏదో ఇంజక్షన్‌ వేసి పడు కోబెట్టారు. ఎంత నొప్పి కలిగినా కిమ్మనే వాణ్ణి కాదు. జ్వరం వచ్చినప్పుడు ఎంత కఠిన పథ్యమైనా పాటించే వాణ్ణి. నా స్వభావం నాకు మామూలుగానే అనిపించేది. పిల్లలు సూదిమందు వేసుకోవడానికి లబలబ లాడుతుంటే నా మట్టుకు నాకు చాలా వింతగా ఉండేది. ఎందుకీ హైరానా అనిపించేది. నేను మాత్రం కిక్కురుమనకుండా జబ్బచాచే వాణ్ణి. డాక్టర్‌ కళ్ళలో మెచ్చుకోలు.. శభాష్‌ అన్న భావం. సూదిలో నుండి ఎర్రని ద్రవం నాలోకి ఎలా ప్రవేశిస్తుందో గమనిస్తూ ఉండే వాడిని. సూదిని లాగేసి, దూదితో రుద్ది కళ్ళజోడు లోంచి దయగా తొంగిచూసేవాడు నా మొహంలోకి. ఎప్పుడూ కుతూహలంతో మెరిసిపోయే కళ్ళు!

ఇప్పటికీ తలచుకొంటే వింత గొలుపుతుంది. క్లాసు లో ఎప్పుడూ నేనే లీడర్‌ ని. నా కంటే బలమైన వాళ్ళు ఉండే వారు క్లాసులో. మాస్టారు “మీలో ఎవరు లీడర్‌ గా వుంటారు?” అనగానే నేను లేచి నిలబడే వాణ్ణి. ఒకరిద్దరు పోటీ గా నిలబడేవారు. “వీడు లీడర్‌ కావాలనుకొనే వారు చేతులెత్తండి” అన్నదే తడవుగా, ఒకరిద్దరు మినహా అందరూ చేతులెత్తే వారు. నాకు పోటీగా నిలబడిన వారి మొహాలు తెలవెల బోయేవి. నాకు అర్థమయ్యేది కాదు, దాదాపు ఏకగ్రీవంగా నన్నే అందరూ ఎందుకు ఎన్నుకొనే వారు? అని. నేను చాలా సక్రమంగా నెరవేర్చే వాణ్ణి అన్నిపనులు. ఎవరూ వేలెత్తి చూపలేక పోయేవారు.

3.
చదివే పిల్లలు ఇంకా బాగా చదివే వారితో జట్టుకట్టే వారు. నేను దానికి పూర్తిగా వ్యతిరేకం! బడికి వెళ్లేముందు, బడి వదిలిన తర్వాత కూడా ఆటలే ఆటలు.. నాన్న ఎప్పుడూ అడ్డు చెప్పలేదు సరికదా ఇంకా ప్రోత్సహించేవాడు. నా మీద ఎవరికీ గురి వుండేది కాదు. కారణం నేను వారి మూసలో ఇమడక పోవడమే. ఎప్పుడూ ఆటల్లో పడి మునిగితేలే వాళ్లు చదువులో రాణించలేరని వారి నమ్మకం! నేను దాన్నెప్పుడూ వమ్ముచేసే వాణ్ణి.

అసలు నేను స్కూల్లో చేరడమే తమాషాగా జరిగింది. “వాడికై బుద్ధి కలిగి బడికి వెళతాను అన్నరోజే పంపుతాను” అని నాన్న పట్టుదల. నా ఈడు వాళ్లందరూ బడిలో చేరారు.ఆడుకొనే తోడు లేదు. నేను పిల్లిలా అడుగులో అడుగు వేసుకొంటూ బడికి వెళ్ళాను. ఒక ముసలి టీచరు చెక్క కుర్చీ మీద కూర్చుని వుంది. ఏవో కథలు చెబుతోంది. చాలా తమాషాగా వున్నట్టనిపించింది. నాన్నను అడగటం, బడిలో చేరడం అన్నీ వెంటవెంటనే జరిగిపోయాయి. తర్వాత బడే నా లోకం !

రెండో తరగతిలోనే  నాకో బుల్లి ప్రియురాలు వుండేది! నన్ను చూడగానే సిగ్గు పడేది. కానీ ఐదవతరగతి వచ్చాక నాతో పోట్లాడేది. ఆ మార్పు నాకు అర్థమయ్యేది కాదు. సంగీతం క్లాసంటే నాకు భయం. గొంతు పెగిలేది కాదు. పాడటం అసలు వచ్చేది కాదు.ఎంతసేపు జంతువులు, పక్షుల అరుపులు వినడం, అనుకరించడం తోనే సరిపోయేది. మా సంగీతం టీచరు ఎంత అందంగా ఉండేదో! చాలా శ్రావ్యంగా పాడేది. కానీ చాలా క్రూరంగా వ్యవహరించేది. బాగా పాడేవారితో పాడని వారందరికీ ముక్కు చెంపలు వేయించేది. తనొకసారి నన్ను కోపంగా చాచి లెంపకాయ కొట్టింది. సంగీతం మీద మిణుకుమిణుకు మంటోన్న అనురక్తి కాస్తా, అలా మరుగున పడిపోయింది. తర్వాత కూడా జంతువులను, పక్షులను అనుకరించే వాణ్ణి. అవేమీ అనవు. నిరంతరం మేస్తో, తింటో ప్రేమగా దయగా వుంటాయి. అన్నట్టు బుజ్జిమేక పాఠం నాకు చాలా ఇష్టం.

4
తర్వాత్తర్వాత నేను పూర్తి శాకాహారి గా మారిపోయాను. మనం బ్రతకడానికి సాటి జీవులను చంపాల్సి రావడం నాకేమాత్రం నచ్చలేదు. అంతే ఉన్నపళాన మాంసాహరం మానేశాను. ప్రతీ విషయాన్నీ పుస్తకాలద్వారా తెలుసుకోవలసి రావడం ఎంత అజ్ఞానం అనిపించేది నా మట్టుకు. ప్రేమ లాంటి విషయాలు ఎక్కడో తాకుతాయి. మన కళ్ళు తెరిపిస్తాయి. నాకైతే నేను ప్రేమించలేనేమో అనిపించేది. నాకు మనుషుల అశక్తత మీద జాలి. ఇది ఆత్మాధిక్య భావం నుండి పుట్టు కొచ్చిందేమో నని నా ఊహ.

నేను పై చదువులకు ఇల్లు వదిలి వెళ్ళాను. అక్కడ చాలా మంది, personality development పుస్తకాలు చదువుతూ నాకు వినోదం, ఒక్కోసారి అసహ్యం కలిగించే వారు. ఏ విషయాలు ఎవరి నుండీ, ఎలా తెలుసుకోవాలి అని తోచక పోతే ఎలా? ఎంత మూఢత్వం అనిపించేది. వాళ్లలో ఎక్కువ మంది సంపన్నుల పిల్లలు. నన్ను గేళి చేసే వారు. రెండు, మూడు సంవత్సరాలు గడిచాక గాని వారికి నా అలోచనలు సవ్యంగా వున్నాయనిపించలేదు. కొంత మందికి మరీ ఎక్కువ కాలం పట్టింది.

చాలా మంది అమ్మాయిలు నన్ను ప్రత్యేకంగా మన్నించేవారు. చూస్తుండగానే వారు దానికి ప్రేమ అని ముసుగు తొడిగే వారు. నేను దూరంగా వైదొలగి పరిశీలిస్తుండేవాణ్ణి. నిజంగా వారికి కావలసినది ఏమిటి? నా దృష్టిలో అన్నిటి కన్నా గొప్ప ఆనందం మన మీద మనం అదుపు కోల్పోక పోవడం లోనే వుంది. అందుకని నేనెప్పుడూ నా లక్ష్మణరేఖను దాటే వాణ్ణి కాను. ఆకారణంగానే చాలా మంది అంచనాలకు భిన్నంగా అగుపించే వాణ్ణి. అది బెట్టుగా భావించి ప్రయత్నాలు తీవ్రతరం చేసేవారు. జలజ ఒకడుగు ముందుకు వేసి నాన్నను కూడా కదిలించినట్టుంది. అప్పుడు ఆడపిల్లల పెళ్ళి ప్రయత్నాల్లో నాన్న తలమునకలుగా వున్నాడు. ఏది ఏమైనా, నాన్న నా దగ్గర జలజ విషయం తీసుకు రానందుకు చాలా సంతోషించాను. ప్రేమలో అహంకారం వుంది. అది నాకిష్టం లేదు.

5.
ఉద్యోగరీత్యా నేను బాగా తిరిగాను. అందరికంటే ఆలస్యంగా స్థిర పడ్డాను. ఐతే ఇవేవీ నన్ను పెద్దగా బాధించలేదు. ఈ లోపు ఇంట్లో ఆడపిల్లల పెళ్ళిల్లు అయిపోయాయి. నాన్న కొంచెం తెరపి పడ్డారు.నేను దేశాంతరం వెళ్ళాను. సింగపూర్‌ ప్రధాన కేంద్రంగా ఆగ్నేయాసియా దేశాల్లో కంపెనీ లావాదేవీలు చూసుకోవాలి. పెద్ద బాధ్యతే. థాయ్‌ లాండ్‌, కాంబోడియా, మలేసియా, ఇండోనేసియా తరచూ వెళ్ళేవాణ్ణి. బౌద్ధ భిక్షువులు నన్ను విశేషంగా ఆకట్టుకొనే వారు.సింగపూర్‌ లో ఉన్నప్పుడూ ఒక భిక్షువు MRT (రైల్వే స్టేషన్‌) దగ్గర రోజూ భిక్ష స్వీకరించేవాడు. కాషాయదుస్తులు.. కాళ్లకు జోళ్లు లేవు. ఉరుకుల పరుగుల దేశంలో ఇతనొక్కడు నిమ్మళంగా అగుపించే వాడు. అప్పుడప్పుడు ఒక డాలర్‌ వేసే వాడిని అతని పాత్రలో. ప్రతిగా అతనొక పూసల పేరు లాంటిది చేతిలో పెట్టి తల పంకించేవాడు.

సింగపూర్‌ లో సెరంగూన్‌ ను లిటిల్‌ ఇండియా అని పిలుస్తారు. సెలవు రోజుల్లో సెరంగూన్‌ వెళ్లేవాడిని. తమిళులు,బంగారు అంగళ్లు, ఆలయాలు,నైవేద్యం ప్రసాదం జనాలు తొక్కిడి.. నాకు విచిత్రంగా వుండేది. ఒక రోజు తోచక నడుస్తూ ఉన్నా.పెద్ద గుంపు కొంచెం వెకిలిగా వుంది. బాంగ్లాదేశీ వర్కర్లు పలుదేశాల పనివాళ్లు.. మూగి వున్నారు. విటులను ఆకట్టుకొనే ప్రయత్నంలో వేశ్యలు. నా కళ్లను నేను నమ్మలేక పోయాను, కానీ నిజమే! ఆ రోడ్డు కొంచెం చీకటిగా వుంది. చీకటిలో ఎంత తబ్బిబ్బవుతారు మనుషులు అనిపించింది.

ఒకసారి అనుకోని సంఘటన. చీకటి గల్లీల్లో తిరుగుతున్నాను. విసురుగా చేయి పట్టి లాగిందో శాల్తీ. నేను తేరుకొనేలోగా వేడి కౌగలింత ఊపిరాడనివ్వని శరీర స్పర్శ. నేను అడ్డు చెప్పలేదు, ఆమె ప్రయత్నాలకు పెనుగులాడి అలసిపోయింది. నేను ఆమె కౌగిలి నుండి విడివడ్డాను. నల్లని జుట్టు, కాటుక కళ్లు అమాయకంగా జాలి గొలుపుతోంది. నేను దగ్గరిగా లాక్కొని చుంబించాను లాలనగా. నా ఆంతర్యాన్నిపసి గట్టినట్లే వుంది. ఆమె కనుల వెంట నీరు. పర్సులో ఉన్నదంతా ఆమె చేతిలో పెట్టి బయట పడ్డాను. బయట వెకిలిగా విటులు. జాలి కనులు, తొందర స్పర్శ నన్ను వెంటాడినా మరెప్పుడూ నేను ఆ చీకటి సందుల్లో అడుగు పెట్టలేదు.

6.
తర్వాత నేను థాయ్‌ లాండ్‌ వెళ్లిపోయాను కొంత కాలం. అక్కడ బౌద్ధం అధికార మతం. పురాతన ఆలయాలతో, బుద్ధప్రతిమలతో నన్ను ఇట్టే ఆకట్టుకొంది. వంటల్లో మనలాగే మసాలాలు దట్టిస్తారు. సాయంత్రం విసుగనిపిస్తే దగ్గరలో ఉన్న ఆలయాలకు వెళ్లే వాణ్ణి. వాళ్ల పూజాదికాలు గమనించే వాణ్ణి. ఇవేమి పట్టని సిద్ధార్థుడు చిద్విలాసంగా నవ్వుతూ ఉండేవాడు. ఒకరోజు బిజినెస్‌ స్క్వేర్‌ లో టీ లాంటి ద్రవాన్ని సిప్‌ చేస్తున్నా. డబ్బులు చెల్లించడానికి కౌంటర్‌ దగ్గరకు పోయి బిత్తరపోవడం నా వంతయింది. సెరంగూన్‌ అమ్మాయి. రక్తం వడి వడిగా ప్రవహించింది ఒక్క క్షణం. నేను వెళ్లిపోతుంటే ఆగమన్నట్లు సైగ చేసింది. నాకు తోసుకుపోవాలి అనిపించలేదు. బయట కొయ్య కుర్చీలు వేసుకొని కూచున్నాం జన సమ్మర్దం తగ్గింది. దూరంగా బుద్ధాలయంలో నుండి శ్రమణకుల మంత్రాలు వినిపిస్తున్నాయి. బద్దకంగా చెట్లూగుతున్నాయి. థాయ్‌ ఆకాశం మెరిసిపోతుంది. బాంకాక్‌ ను చుట్టే చావో నదిమీదుగా చల్లగాలి తోసుకొస్తోంది.

వాళ్ల దూరపు చుట్టం.. సెరంగూన్‌ లో ఉందట. ఆమె ప్రోద్బలంతో అలా చేయవలసి వచ్చిందట. నేను కలిసిన రోజే థాయ్‌ లాండ్‌ తిరిగి వచ్చిందట. హోటెల్‌ వాళ్లదేనట. తండ్రి చిన్నప్పుడే మరణించాడు.అమ్మ హోటెల్‌ నడుపుతుంది. పెంపుడుకోతి ఉందట. నా ఉత్సాహాన్ని గమనించి .. వారింటికి ఆహ్వానించింది. ఆదివారం వస్తానని అడ్రస్‌ తీసుకొని బయట పడ్డాను. ఆమె పేరు ఉచ్చరించలేక పోయాను.. సుయ్‌ మెయ్‌  ..! ఆదివారం ఎప్పుడొస్తుందా అనిపించింది. సుయ్‌ మెయ్‌ కు ఫోన్‌ చేస్తే లేదు. మళ్ళీ గంటాగి చేస్తే రమ్మంది. ఇల్లు పెద్దదే. కలప బాగా వాడారు.

చెట్లు అవీ బాగానే వున్నాయి. పెంపుడుకోతిని చూపించింది. పేరు టుక్‌ టుక్‌. అది బాగా చిన్నప్పుడు దాని కాలికి దెబ్బ తగిలి మూడు కాళ్లతో నడిచేదట. మూడు కాళ్లతో నడిచే రిక్షా లాంటి వాహనాన్ని టుక్‌ టుక్‌ అంటారు థాయ్‌ లాండ్‌ లో. అలా దానికి ఆ పేరు ఖరారైపోయిందట. టుక్‌ టుక్‌ అమాయకంగా కళ్ళార్పుతోంది. దానికి కొబ్బరి కాయలు కోయడం చేతవును! నేను దాని వంక అబ్బురంగా చూస్తుంటే సుయ్‌ మెయ్‌ నిర్మలంగా నవ్వుతోంది. కొంచెం భయం కలిసిన ఉత్సుకతతో టుక్‌ టుక్‌ అర చేతిని స్పర్శించాను!!

ఇంట్లో ఎవరూ లేరు. నిశ్శబ్దం నాకు వింత గొలుపుతుంది. సుయ్‌ మెయ్‌ మాట్లాడే ఆంగ్లం అర్థం చేసుకోవడం కష్టంగా వుంది. డాబా మీదికి వెళ్లాం. చిన్న గది. సుయ్‌ మెయ్‌ కు కుట్టు పని బాగా వచ్చినట్టుంది. లతలు.. పూవులు కుట్టింది సిల్క్‌ వస్త్రం మీద. పరిశీలిస్తున్నా. కొంచెం ముందుకు వంగింది. వేడి ఊపిరి తెలుస్తూనే వుంది. అదే కౌగిలి అదే స్పర్శ.. అభ్యర్థన తన కళ్లలో .. విడిపించుకోలేదు. బరువైన ఉచ్చ్వాస నిశ్వాసాల మధ్య చాలా సేపు ఉండిపోయాము.శరీర పరిమళం దట్టంగా మనసును ఆవరిస్తోంది. సిల్కు దుస్తులతో పోటీ పడే మృదుత్వం !

తర్వాత రోజూ వెళ్లేవాణ్ణి. సుయ్‌ మెయ్‌ మెరిసే పలువరుసతో ఎదురు చూస్తూ ఉండేది.చల్లని కొబ్బరి బోండాం నీరు.. వెచ్చగా గడిచిపోయేవి సాయంత్రాలు.

7.
అర్జంటు మీటింగుకు మళ్ళీ సింగపూర్‌ వచ్చాను. Compass Rose  లో informal meet . నేను మామూలుగా Drinks తీసుకోను. ఎందుకో మొదటిసారి గొంతు మండించాను.తలను ఊపింది, కాక్‌ టైలు. ప్రపంచంలో ఎ్తౖతెన హోటెల్‌. Compass Rose . దాని కంటే ఎత్తులో తేలుతున్నట్లనిపించింది. కొలీగ్స్‌ ఆశ్చర్యంగా చూస్తున్నారు. సంభాళించుకొన్నాను. “let us go” అంటూ విడిపోయాము. ఎవరు వాడిన గ్లాసులు వారికే పాక్‌ చేసి ఇస్తారు. అదీ ఆ హోటెల్‌ ప్రత్యేకత. సింహం తల ఉన్న పింగాణీ గ్లాసు పట్టుకొచ్చాను నేను.

ఒక రోజు వర్షం ఉధృతంగా పడుతోంది. అది మామూలే, సింగపూర్‌ లో గొడుగులేకుండా కదలడం తప్పు. వెంటనే తెరపి ఇచ్చి, ఎండ కాస్తోంది. రైల్లోంచి చూస్తుంటే దూరంగా దేవగన్నేరు పూలు ఊగుతున్నాయి . బస చేరడానికి ఒక గంట సమయం పడుతుంది. ఖాళీ లేదు రైల్లో. అందరూ చైనీస్‌ లో గట్టిగా మాట్లాడుకొంటున్నారు. నేను బార్‌ ను పట్టుకొని బయటికి చూస్తున్నా. కొన్ని క్షణాలు పూవులు తప్ప ఏమీ కనిపించడం లేదు.చైనీస్‌ మాటలు నా చెవిన పడటం లేదు. బాహ్య స్పృహ పూర్తిగా పోయింది. అలాగే నిలబడి ఉన్నా. గంటసేపు. దిగవలసిన స్టేషన్‌ బయటికి నడిచాను. అలవాటైన భిక్షువు. అతనికేదో అవగతమైంది. నన్ను ఆగమని సైగ చేశాడు. ఇవేవీ వినిపించుకొనే స్థితి లో లేదు అంతరంగం. నాకు తెలుస్తూనే వుంది. ఆయన దగ్గరలో ఉన్న బుద్ధుని ఆలయానికి తీసుకు వెళ్ళాడు. రాత్రంతా నేనలాగే మౌనంగా కూచుండి పోయా. ఆయన ఏవో పాళీ మంత్రాలు ఉచ్చరిస్తూ ఉన్నాడు మధ్య మధ్యలో తెల్ల వారింది. సూర్య కిరణ సంచలనం తో నాలో బాహ్యస్పృహ మొదలయింది. భిక్షువు గురువు మహాథేర మలేసియా లో ఉన్నాడట. నేను సెలవు మీద వెళ్ళాను రెండు వారాలు. తరచు బాహ్య స్పృహ పోయేది. ఒక శూన్యం అలా అని శూన్యం కాదు. మహాథేర చాలా కరుణగా చూశాడు. మా మధ్య మాటలు లేవు. ఆయనది చాలా పెద్ద వయసు. కానీ పైకి అలా కనిపించడు. వచ్చేస్తుంటే ధమ్మపదం బహూకరించాడు. ఏమీ మాటలు లేవు. ఏదో పిటకం గానం చేస్తున్నారు. గాలి తేలిక పడింది.

మళ్ళీ థాయ్‌ లాండ్‌ వెళ్ళవలసి వచ్చింది. టుక్‌ టుక్‌ కిచ కిచ మంది. దాని మెడకు ఎర్రని వస్త్రం కట్టారు. Compass Rose  లో తెచ్చిన సింహం గ్లాసు దానికి అందించాను. సుయ్‌ మెయ్‌ నా రాక గమనించలేదు. కళ్ళలో విభ్రమం! తను కుడుతున్న ఎంబ్రాయిడరీ తోటి వళ్ళోకి వచ్చి వాలిపోయింది. ఆ వాతావరణంలో తనని కలవడం నాకు తెలియని సంతృప్తినిచ్చింది. గట్టిగా పొదివి పట్టుకొని మరి వదలలేదు. తారకల్లేని ఆ రాత్రెందుకో చాలా దీర్ఘంగా వుందనిపించింది.

మరుసటి రోజే పెదనాన్న కు సీరియస్‌ అన్న కాల్‌! ఆఘమేఘాల మీద హైదరాబాద్‌ చేరుకొన్నా…
8.
లేక లేక కలిగిన కొడుకని వాడిని అప్పుడప్పుడు ముద్దు చేసినా చాలా క్రమశిక్షణలోనే పెంచాను. నేను అధ్యాపక వృత్తి లో వుండటం చాలా మంచిదయింది. వాడి స్వభావం చాలా వింత గొలిపేది. అందరిలా కాదు.అందరినీ కసురుకొన్నట్లు వాడిని కసురుకొని, తర్వాత నొచ్చుకొనే వాడిని. వాడి ఆరోగ్యం అంతంత మాత్రమే. నాకు ఆందోళనగా ఉండేది. తీవ్ర జ్వరాలు వచ్చేవి వాడికి. ప్రేలాపన మొదలయ్యేది. ఒకరోజు భారమంతా దేవుడిమీద వేశాను. ఎనిమిది వారాలయినా టైఫాయిడ్‌ తగ్గలేదు. తోటకూర కాడలా వాలిపోతున్నాడు. అంత బలహీనతలో కూడా వాడి మొహంలో భయం ద్యోతకమయ్యేది కాదు. అంత నిబ్బరం నాలో లేదు. నిమ్మకు నీరెత్తినట్లు వుండిపోయేవాడు. ఎవరి పెదవి విరుపులు, ఆగ్రహాలు వాడి మీద పని చేసేవి కావు. నిశ్చలంగా నవ్వేవాడు. వాడి స్వభావంలో లోతు నన్ను నిలువ నిచ్చేది కాదు. కడగొట్టు సంతానంలో కొన్ని ప్రత్యేకతలు వుంటాయి అనడంలో వాస్తవం లేకపోలేదు అనిపించేది వాడిని చూస్తుంటే. నా కన్నా వాడు వాళ్ళమ్మకు బాగా అర్థమయ్యాడని నా విశ్వాసం. విచిత్రమేమిటంటే నా దగ్గరే వాడికి చనువెక్కువ.

తెగ ఆడి ఇల్లు చేరే వాడు. ఎవరో ఒకరు అన్నం కలిపి పెడితే భోంచేసేవాడు. నిద్రే నిద్ర. వళ్ళు తెలిసేది కాదు. డాబా మీద పడుకొని, మధ్య రాత్రిలో వర్షం వచ్చినా లేచేవాడు కాదు. నేను నా చేతులమీదుగా మోసుకొని వచ్చి వాడిని పడుకోబెట్టేవాణ్ణి. తాషా ఏమిటంటే వాడు ఠంచనుగా అనుకున్న వేళకి లేచిపోయేవాడు. అలారం పెట్టనిచ్చే వాడు కాదు, పరీక్షల ముందు కూడా; యధాప్రకారం తాపీగా వెళ్ళేవాడు.

నా కళ్ళముందే పెరిగి పెద్ద వాడయ్యాడు. పై చదువులకని ఇల్లు వదిలాడు. నాకు వాడి గురించి బెంగ లేదు. వాడు దారి తప్పడని నా ప్రగాఢ విశ్వాసం. ఒకవేళ తప్పినా, వాడి పట్టుదలతో మళ్ళీ వాడు దారిలో పడతాడని నా నమ్మకం. వాడిది చాలా సూక్ష్మబుద్ధి. మనలో ఎక్కువమంది కొత్తవిషయాణ్ణి అర్థం చేసుకొని అంతటితో వదిలేస్తాం. వాడలా కాదు ఆమూలాగ్రం శోధిస్తాడు. ఆ భావం వాడిలో భాగమైపోతుంది. కాబట్టి వాడు ఏదైనా సరే స్వంతంగా నేర్చుకోవలసిందే. ఇతరులు చెప్పిన పద్ధతిలో నడవడు. ఈ ధోరణి వాడికి చాలా చిక్కులు తెచ్చిపెట్టింది. కానీ ఇవేమీ ఎరగనట్టు అమాయకంగా ఉంటాడు. నేను వాడి అలవాట్లన్నీ గమనిస్తూ ఉండేవాణ్ణి. ఒక్కోసారి వాడు చదవడానికి కూచుంటే, వాడికి తెల్లారినట్టు కూడా తెలిసేది కాదు. నేను అప్పుడప్పుడూ మందలించేవాణ్ణి.

9.
వాడే విషయాన్ని ఒక పట్టాన నమ్మేవాడు కాదు. వాడెప్పుడూ దేవుడిని మొక్కగా నేను చూడలేదు. అలా అని వ్యతిరేకించనూ లేదు. ఏమీ పట్టనట్లు వ్యవహరించేవాడు. వాళ్ళమ్మకు, వాడికి ఈ విషయం దగ్గర పడేది కాదు. భక్త శబరి తరహాలో తను పూజాదికాలు నిర్వహించేది. వీడిలోని చార్వాకాంశను భరించలేక పోయేది. అడగ్గా, అడగ్గా ఓ రోజు నోరు విప్పాడు.
“దేవుణ్ణి ఎందుకు మొక్కాలి?”
“గొప్ప చదువుల కోసం” కొంచెం జంకు నా గొంతులో.
అంతేనా అన్నట్లు తల పంకించాడు.
“జీవితం లో పైకి రావాలని” అన్నా.
“స్వార్థ బుద్ధి తప్ప రెండో చింత లేదన్నమాట” స్థిరంగా ఉంది వాడి స్వరం.

దిమ్మతిరిగిపోయింది. వాడిలో ఇంత లోచూపు ఎలా కలిగిందో అంతుపట్టలేదు. వాడు తృణాన్ని తృణంగా చూడగలడు. ఇంకెప్పుడూ మా మధ్య దైవప్రసక్తి రాలేదు. ఆ విషయం మీద వాడితో  మాట్లాడటానికి నాకు అర్హత కూడా లేదనిపించింది. వాడిలో ఏదో అసంతృప్తి, అన్వేషణ .. ఇంతేనా అన్న నిర్లిప్తత వుండేవి. చిన్న చిన్న విషయాలు కళ్ళకు ఆనేవి కాదు. తల దువ్వుకునేవాడు కాదు, అంత అశ్రద్ధ.. ఎవరైనా గుర్తుచేసినా.. నవ్వి ఊరుకొనేవాడు. అరుదుగా అద్దం ముందు నిలబడి జుట్టు సరిచేసుకొనేవాడు. పాతాళగంగలా పారే వాడి భావధారను ఆనవాలు పట్టలేక పోయేవాణ్ణి.

10
చదువైపోయింది. నిరుద్యోగ పర్వం. ఆడపిల్లల పెళ్ళి విషయమై నేను కాళ్లరిగేలా తిరుగుతున్నా. ఒక హఠాత్పరిణామం. వీడిని ఎవరో ఒక అమ్మాయి తలమునకలుగా ప్రేమిస్తుందట. తలదువ్వు కోవడం రాని వాడిలో ఏంచూసి ప్రేమించి వుంటుందన్నది బేతాళ ప్రశ్న. నా దగ్గర ఏమైనా బయట పడతాడేమో అని చూశా. నోరు విప్పలేదు. వీడికి ఇతరుల ప్రేమను గుర్తించే తాహతు వుందా లేదా అన్నది  మీమాంస. కారణం వీడు అస్తమానం అందరినీ దూరంగా వుంచుతాడు.వాడు గలగలా మాట్లాడుతున్నా ఒంటరితనం తాండవించేది వాడి మొహంలో. తీవ్ర భావావేశం వల్ల వాడలా అవుతున్నాడని, సమాధాన పడేవాణ్ణి. నా ధైర్యమల్లా ఒక్కటే. వాడిలో పిరికితనం ఏ కోశానా లేదు. ఎంత ఎదురుదెబ్బ తిన్నా కోలుకోగలడు. ఆ నమ్మకం నాకుంది. ఆ అమ్మాయి విసిగి వేసారి చివరికి ఎవరినో కట్టుకొంది. నా కన్నీ తెలుస్తూనే వున్నాయి. వీడు పెళ్ళికైతే వెళ్ళలేదు కానీ, ఆ రోజు మామూలుగానే వున్నాడు. వీడి తస్సాదియ్యా అనిపించింది.

11
ఉద్యోగరీత్యా దేశాంతరాలు వెళ్ళాడు.నాకు లోలోపల ఆనందంగానే వుండేది. వాళ్ళమ్మకు మాత్రం తహతహ .. ఆందోళన. “ఒక్కగానొక్కడు మన కళ్ళముందు వుంటే ఎంత బావుండు” అని అప్పుడప్పుడు బాధ పడేది. ఎప్పుడూ నేను వాడితో పెళ్ళి విషయం కదపలేదు. వాళ్ళమ్మ వాడిని సన్యాసి కిందే జమకట్టేసింది. పెళ్ళి ప్రసక్తి తీసుకురావాలంటే మా ఇద్దరికి భయంకూడా, వినకూడనిది విన వలసి వస్తుందేమోనని. వాడిని క్రుంగదీసినట్టుందీ మరణం. కానీ అంతా నా ఊహేమో! వాడు తొట్రుబాటు ప్రదర్శించడు.

ఈ సారి వాడి మొహంలో మార్పు కనిపిస్తోంది. ఇంకా లేతగా తయారయింది వదనం. లలితంగా వుంది చిరునవ్వు. కళ్ళల్లో ఏదో పరితృప్తి.

“రెండు రోజులుగా చూస్తున్నాను మీరు బయటపడతారా అని. వాడిని ఆడి పోసుకొని ఏం లాభం. అయ్యపోలికే బిడ్డ కూడా. వాడి పెళ్ళి సంగతి ఏమాలోచించారు??” దెప్పిపొడిచింది. నాకు అంతా అయోమయంగా ఉంది. వాడికి నా దగ్గర చొరవ ఎక్కువను కొన్నా.పొరబడ్డానన్న మాట. తనే వాడిని బాగా అర్థం చేసుకొనేది.

సాదా దుస్తుల్లో వాడు, పక్కన చక్కని దుస్తుల్లో గువ్వలా ఒదిగి అమ్మాయి. “చిదిమి దీపం పెట్టుకోవచ్చు” ఫోటో చూసి మురిసిపోతోంది తాను!! దేశాలు, దేశాంతరాలు అన్నీ చుట్టుముట్టి ఊపిరాడనివ్వలేదు నాకు !

12
చాలా రోజుల తర్వాత సుయ్‌ మెయ్‌ కు ఒక ఉత్తరం అందింది.
నాలుగే వాక్యాలు :

“నాకు పూర్తి ఏకాంతం కావాలి.
త్వరలో మళ్ళీ నిన్ను కలుస్తాను
నా గురించి బెంగ పెట్టుకోకు.
టుక్‌ టుక్‌ కులాసాయే కదా !”

నవ్వు దాచుకోలేకపోయింది. తన నవ్వు చూసి కిచ కిచ మంది టుక్‌ టుక్‌ . దూరంగా బ్రహ్మ ఆలయంలో గంట మోగింది.చిత్తడినేల మీద ఎండ కాసింది. గట్టుమీద పూసిన తెల్లటి పూవు మాత్రం దిగులుగా ఊగింది.
------------------------------------------------
రచన: తమ్మినేని యదుకులభూషణ్, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment