Wednesday, October 9, 2019

టీమ్ వర్క్


టీమ్ వర్క్

సాహితీమిత్రులారా!

నాన్నా, ఆమెను చంపేయవా! అని అడుగుతున్నాడు నా బిడ్డ. అదే మాటల్లో కాదు. వాడి అయిదేళ్ళ పసిమనసు అలా మాటల్లో పెట్టగలిగే కోరిక కాదు అది. కానీ వాడేమడుగుతున్నాడో నాకు స్పష్టంగా అర్థం అవుతోంది.

“నాన్నా! తన్నీ గట్టిగా కొట్టవా!”

“ఎంత గట్టిగా? పెద్దగా ఏడ్చేంత గట్టిగా కొట్టనా?”

“ఊహూ! ఇంకా ఇంకా గట్టిగా.”

తల బలంగా ఊపుతూ అన్నాడు. వాడివైపు చూసేను. వాడెప్పుడూ ఇలా అడగలేదు. ఎవరినీ కొట్టమనలేదు. నిజానికి వాడు చాలా సాధువు. ఎవరితోనూ తగాదాలు పడడు. వేరే పిల్లలనుంచి వాళ్ళ వస్తువులు గుంజుకోవడం, వాళ్ళను తోయడం, కొట్టడం లాంటివి చేయడు. ఇంట్లోనూ వస్తువులు విసిరేయడం, చెప్పిన మాట వినకపోవడం వంటివీ లేవు. ఆమాటకొస్తే వాడికి అవసరం లేనిదేదీ, కావాలనిపించనిదేదీ వాడెప్పుడూ అడగలేదు. ఛోటాభీమ్ స్కూల్‌బ్యాగ్ కావాలనో, అవెంజర్స్ లంచ్‌బాక్స్ కావాలనో ఎప్పుడూ గోల పెట్టలేదు. అవసరం అనుకున్నవి, తగినవి అనుకున్నవే అడుగుతాడు. వాడు అచ్చు నాన్న పోలికే.

వేలెత్తి చూపుతున్నానని కాదు కాని, వాడు నాన్న పోలిక అనేకన్నా, వాడు అమ్మ పోలిక మాత్రం కచ్చితంగా కాదనాలి. వారంలో రెండుసార్లు ఇంట్లోకి రుసరుసలాడుతూనో, కళ్ళల్లో నీళ్ళు నింపుకొనో వచ్చేది. ట్రాఫిక్ లైట్ దగ్గర ఎవడో అద్దం దించి తిట్టాడనో, మార్కెట్‌లో బేరం చేయబోతే షాపువాడు కసురుకొని వెళ్ళిపోమన్నాడనో, ఇంకెవరో ఇంకేదో అనవసరంగా అన్నారనో, ఇలానే ఏవో కథలు. నేను ఏం జరిగిందో కాస్త క్లియర్‌గా చెప్పు అనేవాణ్ణి. ప్రశ్నలడిగేవాణ్ణి, రకరకాలుగా అసలు ఏం జరిగిందో తన నుంచి రాబట్టేవాణ్ణి. తీరా చూస్తే, నూటికి తొంభైసార్లు తప్పు తనదే అని అర్థమయేది. ట్రాఫిక్ లైట్ దగ్గర కారు కదల్చకుండా ఫోన్లో టెక్స్ట్ చేస్తుంటే, షాపువాడిని వందది పదికిమ్మని విసిగిస్తే, ఎవరైనా ఎందుకు తిట్టరు? అందరు చేయట్లేదా, ఒక నిమిషం ఆగితే వాడి సొమ్మేమైనా పోతుందా, లాంటి సమర్థింపులు తప్పు అని ఒప్పుకోదు.

కానీ నా బిడ్డ, నా గౌతమ్ అలాంటివాడు కాదు. ఏడ్చేంతకన్నా గట్టిగా కొట్టవా అని వాడు అడుగుతున్నాడు అంటే దానికి చాలా బలమైన కారణం ఉండే వుండాలి.

“ఎందుకు నాన్నా! నిన్ను కొట్టిందా?”

“ఊహూ! కొట్టలేదు. అమ్మ బైటకు వెళ్ళినప్పుడల్లా అమ్మమ్మను పిలుస్తుంది కదా నన్ను బేబీ సిట్ చేయడానికి. తనొచ్చేమో, తలుపేసేస్తుంది. నన్ను నా గదిలోకి నెట్టేసి బైట నుంచి గొళ్ళెం పెడుతుంది. చీకట్లో నాకు భయమేస్తుంది. నేను ఏడ్చినా తలుపు తీయదు. అమ్మమ్మా, నేను మంచిగా ఉంటాను, చెడ్డపనులు చేయను, అని ప్రామిస్ చేసినా తీయదు.”

నేను వాణ్ణి గట్టిగా, గట్టిగా గుండెకు హత్తుకున్నాను. “నీకేం కాదు నాన్నా! నేనున్నాగా! అమ్మమ్మ అలా చేయకుండా నాన్న ఆపుతాడుగా!”

“మరి గట్టిగా కంటే ఇంకా గట్టిగా కొడతావా?” నీళ్ళు నిండిన కళ్ళలోంచి చూస్తూ అడిగాడు.

కన్నబిడ్డ ఏడుస్తుంటే చూడ్డం కన్నా గుండెకోత ఇంకొకటి ఉండదు. ఆ కడుపు మంట చెప్పలేనిది, ప్రత్యేకించి పెళ్ళి పెటాకులైనాక. భార్య విడాకులిచ్చి వేరే పెళ్ళి చేసుకున్నాక. వాడలా అడిగితే, తప్పకుండా కొడతాను! చచ్చేలా కొడతాను, నామీద ఒట్టు, అని వాడికి ఒట్టు పెట్టి చెప్పాలని మనసంతా పట్టి ఊపేసింది. కాని, అతికష్టం మీద మాట బైటకు రాకుండా ఆపుకున్నాను. నేను జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలకు ఏదైనా మాట ఇచ్చి చేయకపోతే దానికన్నా ఘోరం ఇంకొకటి లేదు. ఒక్కసారి ఇచ్చిన మాట తప్పితే అది వాళ్ళ మనసును దెబ్బతీస్తుంది. జీవితాంతం ఆ గాయం వాళ్ళను సలుపుతూనే ఉంటుంది. చటుక్కున మాట మార్చాను.

“నాన్న ఆఫీసుకెళ్ళి, అక్కడ పార్కింగ్ లాట్‌లో నువ్వూ నేనూ టీమ్ వర్క్ ఆడుకుందామా? నువ్వు నా ఒళ్ళో కూర్చుంటే ఇద్దరం కలిసి డ్రైవింగ్ టీమ్ ఆట ఆడుకోవచ్చు.”

టీమ్ వర్క్ అనగానే వాడి కళ్ళు మెరిశాయి. ఆ మెరిసిన కళ్ళల్లోంచి మిగిలిపోయిన నీటిచుక్కలు మరింత మెరుస్తూ స్ఫటికాలలాగా రాలిపడ్డాయి. వాడు నా ఒళ్ళో కూర్చొని స్టీరింగ్ వీల్ తిప్పుతుంటే నేను కాళ్ళతో పెడల్స్ కంట్రోల్ చేస్తూ, పార్కింగ్ లాట్‌లో అలా ఒక అరగంట టీమ్ ఆట ఆడేం. నేను వాణ్ణి గేర్లు కూడా మార్చనిచ్చాను కాసేపు. రివర్స్ గేర్ వేసినప్పుడల్లా వాడు ఒకటే కేరింతలు. కన్నబిడ్డ నవ్వును మించింది ఏముంటుంది ఈ లోకంలో.

చెప్పిన టైముకు ఒక పావుగంట ముందే వాణ్ణి వొదిలిపెట్టడానికి తీసుకొచ్చాను. నాకు తెలుసు, ఇలాంటి చిన్న పొరపాట్లు ఎప్పుడు చేస్తానా అని వాళ్ళు వేయికళ్ళతో చూస్తుంటారు. అందుకే జాగ్రత్తగా ఉంటాను. లిఫ్టులో ఎక్కకముందే వాణ్ణి శ్రద్ధగా ఒళ్ళంతా చూశాను, ఎక్కడా బట్టల మీద దుమ్ము కాని, మరకలు కాని లేవు. వాడి షూస్ క్లీన్‌గానే ఉన్నాయి. నాతో ఎలా వచ్చాడో అలానే ఉన్నాడు. లిఫ్టులో అద్దంలో నన్ను నేనూ ఒకసారి చూసుకున్నాను వాటికోసమే.

“ఎక్కడికెళ్ళారు?” డోర్‌బెల్ మోగీ మోగకుండానే తలుపు తీసిన రాధిక వాణ్ణి ఇంట్లోకి కూడా రానీయకుండా గుమ్మంలోనే నిలబెట్టి అడిగింది.

“కిడ్స్ క్లబ్.” మేము ముందుగా అనుకున్న సమాధానమే ఇచ్చాడు వాడు.

“నాన్న బానే ఆడుకున్నాడా నీతో? ఇంకెవరి పిల్లల్నీ కొట్టలేదు కదా?” వాణ్ణే చూస్తూ అడిగిన రాధిక గొంతులో ఆ గీర నన్ను గీరింది. అవును, తనెప్పుడూ ఏ తప్పూ చేయదు కదా!

“నాన్న ఎవరినీ తోయలేదు, కొట్టలేదు.” అన్నాను నేను పిల్లవాడి ముందు నన్ను అలా తగాదాకు రెచ్చగొట్టడం నాకు ఏమాత్రమూ నచ్చలేదన్న గొంతుతో.

“ఊహూ! నాన్న ఎవరినీ కొట్టలేదు. మేం భలేగా ఆడుకున్నాం.” గౌతమ్ చెప్పాడు.

డ్రైవింగ్ ఆట అయ్యేసరికి, వాడు ఏడ్చింది, అమ్మమ్మను గట్టిగా కొట్టమన్నది, అన్నీ పూర్తిగా మర్చిపోయాడు. పిల్లల్లో గొప్పతనమే అది. వాళ్ళను ఏది బాధ పెట్టినా, మనం వాళ్ళను తిట్టినా కొట్టినా, ఒక గంట తర్వాత అవన్నీ మర్చిపోయి ధ్యాస ఇంక దేనిమీదకో మర్లుతుంది. పిల్లలెప్పుడూ ఆనందంగా ఉండడానికే ప్రయత్నిస్తుంటారు. అది వారి సహజ లక్షణం. కానీ నేను పిల్లవాణ్ణి కాదు. తిరిగి కిందకొచ్చి కార్‌లో కూర్చున్న నాకు ఇటువైపు గదిలో ఏడుస్తూ తలుపు మీద బాదుతున్న గౌతమ్, అటుపక్క రాధిక అమ్మ, అదే నా ఒకప్పటి అత్తగారు, తలుపు తీయకుండా, విననట్టు అసలు తనకేమీ పట్టనట్టు కూర్చున్న దృశ్యం మెదడులో సినిమా రీలు లాగా తిరుగుతూనే ఉంది. ఆ రాక్షసికి బుద్ధి చెప్పాలి, కాని అది నేను జాగ్రత్తగా చేయాలి. నన్ను నేను ప్రమాదంలోకి నెట్టుకోలేను. ఎంతో కష్టం మీద, నాకు ఈమాత్రమైనా విజిటేషన్స్ దొరికాయి మగ జడ్జ్ పుణ్యమా అని. వారానికి ఒక్కసారి వాడితో గడిపే ఈ కొద్దిగంటలనూ పోగోట్టుకోలేను. లాయర్లకు ఇంచుమించు కిడ్నీ లివరూ సమర్పించుకున్నంత ఖర్చయింది ఈమాత్రం దానికే.

ఇంతా చేస్తే అది చాలా చిన్న సంఘటన. గుర్తు పెట్టుకొనేపాటిది కానే కాదు. కానీ నా ఖర్మ కాలి ఇప్పటికీ దానికి మూల్యం చెల్లిస్తూనే ఉన్నాను. ఆ రోజు పార్కులో ఒక దుబ్బు పిల్ల వచ్చి తాళ్ళ నిచ్చెన దగ్గర ఆడుకుంటున్న గౌతమ్‌ను తోసింది. వాడు పక్కకు పడబోయి ఆపుకున్నాడు, తాడు వదల్లేదు. ఆ పిల్ల వీడిని గట్టిగా గిచ్చింది. అది చూసి నేను ఆ పిల్లను వాణ్ణుంచి విడదీయడానికి చూశాను. కొట్టనూ లేదు, తిట్టనూ లేదు. ఆ పిల్ల చేయి పట్టుకొని కొద్దిగా వెనకకు లాగాను. దాన్ని గుంజడం అని కూడా అనరు. ఆ పిల్ల, ఆ మాత్రానికే వెనకకు పడింది. అక్కడున్న మెటల్ ఫ్రేమ్‌కు తల తగిలి పెద్దగా గయ్యిమంది. దెబ్బ లేదు, గాటు లేదు, రక్తం లేదు, కనీసం తాకిన చోట కదుము కూడా కట్టలేదు. ఆ పిల్ల తల్లి సినిమాలో సూర్యకాంతం లాగా నామీదకు దాడి చేసింది. ఆ పిల్లను నేనేదో బండకు మోది చంపేయబోయినంతగా అఘాయిత్యం చేసింది. ఆ సాయంత్రం ఇంటికి తీసుకొచ్చి దింపినప్పుడు పొరపాటున ఈ సంగతి గౌతమ్ వాళ్ళ అమ్మకు చెప్పాడు. అంతే! అప్పణ్ణుంచి రాధిక, ఆమె భర్త కిశోర్ నన్ను భూతద్దంలో చూడడం మొదలుపెట్టారు. ఇంకోసారి ఇలా వయొలెంట్‌గా బిహేవ్ చేస్తే, కోర్టుకి వెళ్ళి నా విజిటేషన్స్ కేన్సిల్ చేయిస్తానని రాధిక వార్నింగ్ ఇచ్చింది. కిశోర్ పక్కనే గానుగెద్దులా అవునవునంటూ తలూపాడు.

“ఏం వయొలెన్స్? ఏం బిహేవియర్? ఏం మాట్లాడుతున్నావ్ రాధికా?” అని అడిగాను. “మనిద్దరం ఐదేళ్ళు కలిసున్నాం. ఆ అయిదేళ్ళలో నేనెప్పుడైనా చెయ్యెత్తానా, నీమీద కాని, ఇంకెవరి మీద కాని?”

రాధిక ఏమీ మాట్లాడలేదు. తనకూ తెలుసు సమాధానమేమిటో. నిజానికి లెక్కలేనన్నిసార్లు మెత్తగా తన్నించుకొనే పనులే చేసింది తను, అయినా నేను ఎప్పుడూ కంట్రోల్ తప్పలేదు. ఇంకోడింకోడయ్యుంటే తెలిసేది, చావు తన్నులు తిని నిమ్స్ హాస్పిటల్లో ఎమర్జన్సీ రూములో పడుండేది నెలలో రెండు సార్లు. కాని, నేనలా కాదు. జీవితంలో ఎప్పుడూ ఆడవారి మీద చేయి చేసుకోలేదు. ఇంతలో తగుదునమ్మా అనుకుంటూ కిశోర్ వచ్చి దూరాడు మా సంభాషణలోకి.

“ఏం వయొలెన్సా? అద్దంలో చూసుకో. నువ్వెంత భయం పుట్టేట్టు ఉన్నావో తెలుసా ఇప్పుడు? నీ కళ్ళు చూసుకో. క్రేజీ స్కేరీ లుక్స్ ఆఫ్ అ లూనటిక్.”

“కిశోర్, నాకు పిచ్చీ లేదు. నావి పిచ్చి చూపులూ కాదు,” నవ్వుతూనే చెప్పాను. “నా కళ్ళల్లో కనిపించేదాన్ని ఎమోషన్ అంటారు. నా కళ్ళల్లో నువు చూసేది ఒక తండ్రి మనసు పడే బాధ. నీకు అలాంటివేమీ లేవు, నీలాంటివాడికి ఎప్పటికీ తెలీవు. అంతమాత్రాన అది పిచ్చి అనుకోకు. అయామ్ నాట్ స్కేరీ ఆర్ క్రేజీ.”

నేనేదో ఉన్మాదిని, హింసాత్మకుణ్ణి, తనేదో శాంతికాముకుడు అన్నట్టు మాట్లాడిన కిశోర్ వెంటనే గొంతు పెంచి పెద్దగా అరవడం మొదలుపెట్టాడు, నువ్వెలాంటివాడివో నాకు బాగా తెలుసంటూ. కాసేపలా అరిచాక, ‘ఖబడ్దార్! ఇకనుంచీ నీ కొడుకుని నువ్వు ఎలా చూస్తావో నేనూ చూస్తాను!’ అని బెదిరింపుల్లోకి దిగాడు. నా సొంత కొడుకును! అసలు ఆ అరుపులన్నీ నేను రికార్డ్ చేయాల్సింది. వాడూ, వాడి మురుగ్గుంట నోరూ! కానీ నేను మాత్రం కోపం తెచ్చుకోలేదు. వాడు అరుస్తున్నంతసేపూ నవ్వుతూనే ఉన్నాను. దాంతో వాడింకా రెచ్చిపోయాడు. ఇక రాధిక మళ్ళీ ముందు గదిలోకి వచ్చి, కిశోర్‌ను ఆపి, అదేదో నా మంచి కోసమే అన్నట్టు, మళ్ళీ నాతో మొదలుపెట్టింది. చివరకు, ఇంకెప్పుడూ నేనలా చేయనని తనకు వాగ్దానం చేయాల్సొచ్చిందారోజు- అప్పటికేదో అదే నా పని అయినట్టూ, ప్రతీరోజూ పోయి ప్లే గ్రౌండ్‌లో పిల్లలని కొట్టడానికి కేలండర్లో రిమైండర్లు రాసుకున్నట్టూ!

గౌతమ్‌ను ఆ తరువాతి వారం పికప్ చేసుకొని ప్లే గ్రౌండ్‌కి తీసుకెళ్ళగానే అమ్మమ్మ సంగతి గుర్తుచేశాను. వాడంతట వాడే ఆ సంగతి ఎత్తేదాకా ఆగుదామనుకున్నాను కాని నాదగ్గర అంత సమయం లేదు. ఇలాంటివి పిల్లలు మర్చిపోతే మళ్ళీ ఎప్పటికో కాని గుర్తుకురాదు వాళ్ళకు.

“గౌతూ, పోయిన వారం తర్వాత అమ్మమ్మ వచ్చిందా నిన్ను బేబీ సిట్ చేయడానికీ?”

రాలేదన్నట్టు తల అడ్డంగా ఊపాడు. “మళ్ళీ అమ్మమ్మ అలానే చేస్తే నువ్వు బాగా కొడతావు కదా తనని?”

లోపలికి బలంగా ఊపిరి పీల్చుకున్నాను. అవునని అనాలని ఎంతగా ఉన్నా అనలేని పరిస్థితి నాది. ఏమాత్రం అనుమానం వచ్చినా నాకు వీడిని దూరం చేసేస్తారు పూర్తిగా. వీణ్ణి చూడలేకుంటే నాకు చావే గతి. “అవున్నాన్నా! కొడతాను. గట్టిగా చాలా గట్టిగా కొడతాను. అమ్మమ్మ అనే కాదు, నిన్ను ఎవరు ఏడిపించినా వారందరినీ అలానే కొడతాను. నిన్నెవరేమన్నా సరే, వాళ్ళను చచ్చేలా కొడతాను.”

“ఆ పార్కులో దుబ్బు పిల్ల లాగానా?” వాడి కళ్ళు మళ్ళీ మెరిశాయి.

“అవును. ఆ దుబ్బు పిల్ల లాగానే.” తల ఊపాను. “కానీ అమ్మకు నచ్చదు నాన్న ఎవరినైనా కొడితే. నాన్న అమ్మమ్మను కొట్టినా, అసలింకెవరిని కొట్టినా సరే, వాళ్ళొచ్చి నిన్ను తీసుకెళ్ళిపోతారు. ఇక నిన్నెప్పుడూ నాతో ఆడుకోనివ్వరు. మనిద్దరం ఒక టీమ్ కదా. కానీ టీమ్ తీసేస్తారు తెలిసిందా?”

గౌతమ్ ఏమీ మాట్లాడలేదు. వాడికి కొనిచ్చిన ఐస్‌క్రీమ్ కోన్ నుంచి ఒక చుక్క జారి వాడి లాగు మీద పడింది. అది కరిగిపోయేదాకా వాడు దాన్నే చూశాడు. నాన్న మధ్యలో తుడుస్తాడనుకున్నాడేమో కాని నేనేమీ దాన్ని పట్టించుకోలేదు. దాన్ని అలానే పూర్తిగా కరిగిపోనిచ్చాను. ఇంకాసేపు అలానే నిశ్శబ్దంగా ఉన్నాక వాడన్నాడు. “నాకు అలా గదిలో ఒంటిగా ఉండడం అస్సలిష్టం ఉండదు.”

“నాకు తెలుసు గౌతూ. కానీ నేను ఇంట్లోకి రాలేను కదా. అందుకని నువ్వే ఆపాలి దాన్ని. ఎలా ఆపాలో నాన్న ప్లాన్ చెప్తాడు, సరేనా?”

ఇంకోసారి అమ్మమ్మ గౌతమ్‌ను గదిలో పెట్టి తలుపేస్తే ఏం చేయాలో వివరంగా చెప్పాను–తలను ఎలా పక్కకు వంచి ఏ చోట గోడకు గట్టిగా మోదితే నొప్పి ఎక్కువ సేపు ఉండదు కాని నల్లగా కదుము కట్టి పెద్ద దెబ్బలా కనిపిస్తుందో.

“నొప్పి పుడుతుందా నాన్నా?”

పుడుతుందనే చెప్పాను. నేనెప్పుడూ వాడితో అబద్ధాలు చెప్పలేదు. రాధిక లాగా కాదు. మేమిద్దరం విడిపోకముందు ఒకసారి గౌతమ్‌ను వాక్సిన్ వేయించడానికి తీసికెళ్ళాం. దారిపొడుగునా తను వాడి బుర్రలో లేనిపోనివి పెడుతూనే ఉంది. వెళ్ళేచోట తుమ్మెదలని ఉంటాయని, అవి కుడతాయని, కానీ కుడితే మంచిదని, అలా కుడితే ఏడవకుంటే మంచబ్బాయి అని అందరూ అంటారని, అందరూ మంచబ్బాయిలకు స్వీట్లూ చాక్లెట్లూ ఇస్తారనీ. ఇక నావల్ల కాక తనను మధ్యలో ఆపి వాడికి నిజం చెప్పాను. “నాన్నా గౌతూ! మనం హాస్పిటల్‌కి వెళుతున్నాం. అక్కడ ఒక నర్స్ ఉంటుంది. ఆమె నీకు సూది పొడుస్తుంది. నీకు నొప్పి పుడుతుంది. మనమేం చేయలేం. కొన్నిసార్లు మనకు నొప్పి తప్పదు. ప్రపంచంలో ఇలాంటివుంటాయి. వాటిని భరించి పోతుండాలి. అంతే.” గౌతమ్‌కి అప్పటికి మూడేళ్ళు కూడా సరిగ్గా నిండలేదు. కళ్ళు పెద్దవి చేసి నేను చెప్పింది విన్నాడు. వాడి తెలివైన మొఖం నేను చెప్పింది అర్థం చేసుకున్నట్టే అనిపించింది. హాస్పిటల్‌కు వెళ్ళాక, ఆ నర్స్ వాక్సీన్ ట్రేతో వచ్చాక, వాడి శరీరం బిగుసుకొనిపోయి గదిలోంచి పారిపోడానికే ప్రయత్నించింది కాని, వాడు ఏడవలేదు, మొండికేయలేదు. కళ్ళు మూసుకొని నిబ్బరంగా సూది పొడిపించుకున్నాడు ఒక పెద్దమనిషిలా.

మళ్ళీ వాడికి ప్లాన్ అంతా చెప్పాను. టీమ్ వర్క్. ఇద్దరం కలిసి ప్రతీ స్టెప్ ఎలా వేయాలో ఒకటికి రెండుసార్లు చెప్పుకున్నాం. చేయాల్సిన పనులు, రాధిక ఇంటికి రాగానే ఏం చెప్పాలి, ఇవన్నీ. అమ్మమ్మను కొద్దిగా సతాయించాడు. అమ్మమ్మ వాణ్ణి గట్టిగా గోడకేసి నెట్టింది. ఆ దెబ్బ వాడికలా తగిలింది.

“నొప్పి పుడుతుందా నాన్నా?” మళ్ళీ అడిగాడు వాడు చివర్లో.

“పుడుతుంది. కానీ ఈ ఒక్కసారే. ఇక ఇంకెప్పుడూ అమ్మమ్మ నిన్ను గదిలో పెట్టి తలుపేయదు.” నుదుటి మీద పడ్డ వాడి జుట్టు వెనక్కు దువ్వుతూ చెప్పాను.

వాడు మళ్ళీ కాసేపు ఏమీ మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తున్నట్టుగా పరధ్యానంగా… అప్పటికి ఐస్‌క్రీమ్ అయిపోయి కోన్ మాత్రమే మిగిలింది, దాన్ని మునిపళ్ళతో అంచులు కొరికాడు నిదానంగా. “మరి అమ్మ నన్ను తిడితే? అబద్ధాలు చెప్తున్నావు కదూ, ఈ దెబ్బ నువ్వే తగిలించుకొని అమ్మమ్మ మీద చాడీలు చెప్తున్నావు కదూ? అంటే?”

“లేదు నాన్నా. దెబ్బ కొంచెం బాగానే పెద్దదిగా ఉంటే అమ్మ అలా అనదు, సరేనా?” వాడి నుదుటి మీద వేలితో రాస్తూ చెప్పాను.

ఆపైన నేనూ వాడూ కలిసి పార్కింగ్ లాట్ లోకి వెళ్ళి మా టీమ్ వర్క్ డ్రైవింగ్ ఆట ఆడుకున్నాం. గౌతమ్ స్టీరింగ్ వీల్ తిప్పుతుంటే నేను బ్రేక్, ఆక్సిలరేటర్ కాళ్ళతో కంట్రోల్ చేశాను. స్టీరింగ్ మీదనుంచి చేతులు తీయకుండా హార్న్ ఎలా కొట్టాలో నేర్పించాను. వాడి ఆనందం చెప్పతరం కాదు. ఆపకుండా హార్న్ కొడుతూనే ఉన్నాడు. కారు టర్న్ తిరిగినప్పుడల్లా హార్న్. ఆగినప్పుడల్లా హార్న్. చివరికి పార్కింగ్ అటెండంట్ వచ్చి మమ్మల్ని ఆపాడు. “క్యా సాబ్! క్యా షోర్ మచల్ రహా హై యహా! సబ్‌కో తక్‌లీఫ్ హోతాహైనా!” అన్నాడు. “జానేదోనా భయ్యా, దస్ పంద్రా మినట్ కీ బాత్ హై” అన్నాను, అతని చేతిలో ఒక ఐదొందల నోట్ పెడుతూ, “బచ్చా హై. బహుత్ ఖుషీసే ఖేల్ రహా హైఁ.” అతనేమీ అనలేదు. నోట్ జేబులో పెట్టుకుంటూ తన బూత్ వైపు వెళ్ళిపోయాడు.

“నాన్నా, ఆ అంకుల్ ఏమంటున్నాడు? అంకుల్‌కి కోపం వచ్చిందా?”

“లేదు లేదు నాన్నా. హార్న్ ఎవరు మోగిస్తున్నారూ? అని అడిగాడు. అంతే.”

“మరి నేను మళ్ళీ మోగించచ్చా?

“మోగించచ్చు నాన్నా” వాణ్ణి బుగ్గల మీద ముద్దు పెట్టుకున్నాను. “ఒక్కసారి కాదు. రెండు సార్లు కాదు. హాయిగా నీ ఇష్టం వచ్చినన్ని సార్లు హార్న్ మోగించుకో నా బంగారు కొండా.”
-----------------------------------------------------
రచన: మాధవ్ మాౘవరం
మూలం: Etgar Keret
(మూలం: Team work.)
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment