గోవిందా! గోవిందా!
సాహితీమిత్రులారా!
“ఏడుకొండల వాడా! వెంకట రమణా! గోవిందా! గోవింద!”
పెద్దగా కేకలు పెడుతూ రోడ్డు మీద ఎవరో మేళ తాళాలతో ఊరేగింపుగా వెడుతున్నారు, జోలి ఎత్తుకుంటున్నారు కాబోలు! అటువంటి పార్టీ వస్తే, ఇంతో అంతో డబ్బును వాళ్ల జోలిలో వెయ్యకుండా ఉండరు సాధారణంగా భక్తులెవరూ. ఎంతటి భాగ్యవంతులైనా సరే ఆపద గడిస్తే చాలనే, ఆపదమొక్కుల వాడి పేరుతో జోలెత్తుకోడానికి ఏమాత్రం మొహమాటపడరు. స్వామి మీద జనానికున్న భయ భక్తులు అటువంటివి మరి!
“గోవిందా! గోవింద!”. జోలెత్తుతున్న భక్తులందరూ కలిసి మళ్ళీ ముక్త కంఠంతో పెద్దగా అరిచారు. ఆ కేకలు గోడలు దాటి వచ్చి వంటగదిలో పని చేసుకుంటున్న జానకి చెవిలో దూరాయి. ఒక్కసారిగా ఉలిక్కిపడి “అపచారం, అపచారం” అంటూ చెంపలమీద టపటపా కొట్టుకుంది, హఠాత్తుగా ఎప్పుడో పెట్టుకున్న మొక్కు గుర్తుకు రావడంతో.
జానకి ఆ మొక్కు పెట్టుకుని ఐదేళ్లకు పైనే అయ్యింది! అప్పుడు అబ్బిగాడు చంటాడు. అకస్మాత్తుగా వాడికి జబ్బుచేసి ప్రాణమ్మీదికి వచ్చినప్పుడు, “స్వామీ! ఆపద మొక్కుల వాడా! బ్రతికి బట్ట కడితే, వీడి పుట్టువెంట్రుకలు నీ సన్నిధిలో తీయిస్తాను” అంటూ జానకి ఆ మొక్కు పెట్టుకుంది. ఇద్దరు ఆడపిల్లల తరువాత అపురూపంగా పుట్టిన అబ్బిగాడు మాట దక్కించాడు. జబ్బు నయమయ్యింది. జానకి మొక్కు ఫలించింది. ఆ తరువాత, ఆ జబ్బు కుదిర్చిన స్పెషలిస్టుకి గడ్డు రోగాల్ని కుదర్చడంలో దిట్ట అనే మంచిపేరు కూడా వచ్చింది. అది వేరే కథలెండి! ఆ తరువాత ఆ మొక్కు మాటే మర్చిపోయింది జానకి. వాడిప్పుడు కాన్వెంట్ స్కూల్లో ఫస్టు స్టాండర్డులో ఉన్నాడు. ఐదో ఏడు రాగానే వాడికి పుట్టువెంట్రుకలన్న హంగామా ఏమీ లేకుండానే, బజారు వీధిలో ఉన్న గాంధీ సెలూన్లో, వాడిని కాన్వెంట్‌లో చేర్పించీ హడావిడిలో, వాళ్ల నాన్న తీసుకెళ్లి అత్యవసర క్షురకర్మ జరిపించేశాడు. అప్పుడు కూడా మొక్కున్న సంగతి భార్యా భర్త లిద్దరిలో ఎవరికీ గుర్తు రాలేదు.
“హమ్మయ్య, ఇప్పుడైనా గుర్తొచ్చింది నయమే” అనుకుంది జానకి. స్వామికి ఆపద మొక్కులూ కొత్తవి కావు, సంపద మరుపులూ కొత్తవి కావు! అప్పు చేసిన వాళ్లు ఎప్పుడో ఒకప్పుడు చేసిన అప్పును చచ్చినట్లు తీర్చక తప్పదు అన్నది ఆయనకు బాగా తెలుసు. అప్పిచ్చిన వాడికి, అప్పు చేసినవాడు ఆ అప్పును తీర్చడంలో ఎంత ఆలస్యం చేస్తే అంత లాభం! ఎక్కువ వడ్డీ వస్తుంది. ఆయన అప్పు తీర్చుకునే తాపత్రయంలో ఆయనున్నాడు మరి, నిజమైన భక్తులు, కుహనా భక్తులు అన్న వివక్ష మర్చిపోయి అడిగిన వారి కందరికీ అడిగినవీ అడగనివీ వరాలను గుప్పిస్తూ, ఆలస్యం చేస్తే వడ్డీ మీద వడ్డీని గుంజుతూ.
“స్వామీ! నన్ను మన్నించు. మొక్కు విషయం మర్చిపోయి ఇప్పటికే ఒక తప్పు చేశా, మళ్లీ వడ్డీ కాసులు మర్చిపోయి మరో తప్పు చెయ్యను. దయ ఉంచు తండ్రీ” అంటూ మరోమారు చెంపలేసుకుంది జానకి. సీతాపతి ఇంటికి రాగానే తేల్చి చెప్పేసింది తిరపతి కెళ్ళాల్సిందే అని. ఆ రాత్రే యుద్ధ ప్రాతిపదిక మీద నిర్ణయాలు జరిగిపోయాయి. పిల్లలకు దసరా సెలవులు రాగానే తిరుపతి ప్రయాణానికి ముహూర్తం పెట్టేశారు. ఇంక ఆట్టే వ్యవధి లేదు. రేపటినుండే సన్నాహాలు ప్రారంభించేసెయ్యలి అనుకున్నారు ఆ దంపతులిద్దరూ కూడబలుక్కుని.
ప్రయాణం ఇక రెండురోజుల్లో ఉందనగా, దారిలో తినడానికి చిరుతిళ్ళు చేసే సన్నాహంలో పడింది జానకి. అంతలో దొడ్లోంచి ‘అమ్మగోరూ’ అన్న కేక వినిపించడంతో తలెత్తి గుమ్మం వైపు చూసింది. తనవైపే చూస్తూ నిలబడివున్న రత్తాలు కనిపించింది.
“ఏమిటి రత్తాలూ, ఏం కావాలి” అని అడిగింది జానకి.
“ఏం నేదండి అమ్మగోరూ! దినామూ మా మావతొ ఏగలేకపోతుండానమ్మా” అంటూ ఒక కాగితపు పొట్లం అందించింది రత్తాలు.
“ఇది సోమోరి డబ్బు. ఆడికి తాగుడుకి డబ్బు సాలనప్పుడల్లా ఈ డబ్బు లాక్కోవాలని సూత్తాడు. ఇది జోలడుక్కున్న డబ్బు, సోమోరి సొమ్ము ఏరెవోటికి వోడుకోడం అపశారం కదమ్మా. ఈ డబ్బు మీరట్టుకెల్లి ఉండీలో ఏస్తిరా సచ్చి మీ కడుపున పుడతా! దయుంచండమ్మా”
“సర్లే. దానికేముంది, అలాగే. అసలు మొక్కు ఎందుకుపెట్టుకున్నావే”, కుతూహలంగా అడిగింది జానకి.
“సెప్పుకోడానికి సిగ్గైతాదమ్మా, ఏం సెప్పుకోను! వరాసకీ నాకు ఆడపిల్లలే పుడ్తండారని ‘ఈ పాలీ మల్లీ ఆడకూతుర్నే కన్నేవా నిన్ను ఒగ్గెయ్యడం క్కాయం’ అంటూ నిక్కచ్చిగా చెప్పేసిండు నా పెనిమిటి. సామికి మొక్కుకుంటే పుట్టినోడే మా ఏడుకొండలసామి! ఆసామి పేరే ఎట్టినా ఆడికి. ఆ తరువోత మొక్కు తీర్సాలని ఓపాలి జోలెత్తిన గని రైలు కర్సులకు కూడా రాలే. మరో పాలి జొలెత్తితే సరిపోద్దని దాన్ని దాసిన. కాని మా మావ నన్ను బతకనిచ్చీలాలేడు” అంటూ దణ్ణం పెట్టింది రత్తాలు.
రత్తాలే కాదు, ఇంకా చాలామంది ఇరుగుపొరుగు వాళ్లు, ఎరుగున్నవాళ్లు ఎంతమందో వచ్చి, తమపేరు చెప్పి స్వామికి సమర్పించమంటూ ఏవేవో ముడుపులు తెచ్చి ఇవ్వడం మొదలుపెట్టారు. స్వామి కార్యాన్ని తమ కార్యంగా భావించి, సీతాపతి వాటిని జాగ్రత్తగా కాగితంలో పొట్లం కట్టి, ఎప్పటికప్పుడు ఆ ఇచ్చినవారి పేరు దానిమీద రాసి ఒక పెట్టెలో పెట్టేవాడు. ప్రయాణం రేపటికి వచ్చేసింది. ఈ రోజు తొందరగా పడుకుంటే రేపు తొందరగా లేచి ప్రయణ సన్నాహాలు చేసుకోవచ్చని, ఎనిమిది గంటలకే పడుకునే యత్నంలో పడ్డారు వాళ్లు. అంతలో వీధి గుమ్మం తలుపు తట్టారు ఎవరో. పడుకోబోతున్నదల్లా లేచి వెళ్లి తలుపు తెరిచింది జానకి. శాంత వచ్చింది లోపలికి.
శాంత, సీతాపతి పెద్దమ్మకి చిన్న కూతురు. వాళ్లూ ఆ ఊళ్లోనే కొంచెం దూరంలో ఉంటారు. శాంత భర్త కాలేజి ప్రొఫెసర్. ఒక మైలు దూరంలో ఉంటుంది వాళ్ల ఇల్లు. చీకటి వేళ శాంత ఇలా వచ్చిందేమిటా అని ఆశ్చర్యపోయారు సీతాపతి, జానకి కూడా.
“వదినా! రాజుకి ఒళ్లు తెలియని జ్వరం. మూసిన కన్ను తెరవకుండా మంచానపడి ఉన్నాడు. ఇందాకా అన్నయ్య ఫోనుచేసి మీరు తిరుపతి వెడుతున్నాట్లు చెప్పగానే, ఎవరో నా చెంపమీద ఛెళ్లున కొట్టి, గుర్తుచేసినట్లుగా జ్ఞాపకం వచ్చిందంటే నమ్ము! రాజుకి కాన్వెంటులో సీటు వస్తే తిరుపతి వచ్చి, హుండీలో ఐదు వందలు వేస్తానని మొక్కుకున్నా. సీటు వచ్చింది. ఇప్పటి వరకు ఆ మొక్కు తీర్చనేలేదు, ఏంచెప్పమంటావు వదినా! ఇలాంటివి అసలు పట్టనే పట్టవు ఆయనకు. వట్టి చార్వాక మతమనుకో! ఇన్నాళ్లిల్లాగా జాప్యం చేస్తే స్వామికి కోపం వచ్చిందన్నా ఆశ్చర్యం లేదు. రాజుకి అంత జ్వరం వచ్చిందా, ఐనా ఆయనకేం చీమ కుట్టినట్లు కూడా లేదు. నాదగ్గర ఐదొందలుంటే తెచ్చా. వీటిని హుండీలో మా రాజు గాడి పేరు చెప్పి వేసి, స్వామిని మా అపరాధం మన్నించమని మా తరఫున కోరండి వదినా, మీకు పుణ్యముంటుంది” అంది శాంత గుక్కతిప్పుకోకుండా. చాలా ఆదుర్దా పడుతోంది ఆమె అపరాధ భావంతో.
“స్వామి వడ్డికాసులవాడు కదా వదినా. మొక్కు తీరిస్తే సరిపోదు, పైన ఇంకా కొంచెం డబ్బు అదనంగా వెయ్యాలి. లేకపోతే చెల్లు రాసుకోడుట స్వామి, తెలుసా?”
“అలాగా వదినా! ఐనా ప్రస్తుతం నా దగ్గర ఇంకేమీ లేదు. ఆయనని అడిగినా లాభంలేదు. దేవుడికోసం అంటే ఆయన అసలు ఇవ్వరు. అదో వితండం” అంటూ నిట్టూర్చి, సీతాపతి వైపు తిరిగి, “అన్నయ్యా! నువ్వే ఒక వంద సద్దుబాటు చెయ్యి. తరవాత నీకు ఇచ్చేస్తాను” అంటూ తన దగ్గరున్న ఐదువందలూ జానకి చేతిలో పెట్టి, తన మొక్కు తీర్చేభారం వాళ్ల మీద ఉంచి, సెలవు తీసుకుని వెళ్లిపోయింది శాంత.
మర్నాడు తొందరగా తెమిలి భోజనాలు చేసేశారు. ఇరుగుపొరుగుల కందరికీ వీడ్కోలు చెప్పి, మొక్కుబళ్లు మొత్తం ఉంచిన పెట్టె పట్టుకుని వచ్చి టాక్సీ ఎక్కింది జానకి. పిల్లలు రైలెక్కబోతున్న సంతోషంతో కేరింతలు కొట్టారు. మధ్యాహ్నం ఒంటి గంటకు స్టేషన్‌లో తిరుమలా ఎక్సుప్రెస్ ఎక్కింది సీతాపతి కుటుంబం. వీళ్లు ఎక్కి కూర్చున్న కాసేపటికే రైలు కదిలింది. కంపార్టుమెంటులో ఉన్న అమాంబాపతు తుప్పతలల భక్త జనం యావన్మందీ ముక్త కంఠంతో “గోవిందా గోవింద” అంటూ ఏకగ్రీవంగా పెద్దగా కేక పెట్టారు. కిటికీ వార కూర్చుని ఏదో పుస్తకం శ్రద్ధగా చదువుకుంటున్న యువకుడు, చిరాకుగా మొహం చిట్లించుకున్నాడు.
మొక్కు పెట్టుకుని జుట్టూ గడ్డం విపరీతంగా పెంచేసి ఉన్న ఒక భక్తుడు అది చూసి ఉడుక్కున్నాడు. “ఇదిగో అబ్బాయా! ఈ బండి ఎందుకెక్కావు, ఇది భక్తుల బండని తెలీదా” అన్నాడు కోపంగా.
ఆ అబ్బాయికి కూడా కోపం వచ్చింది. “వెళ్లాల్సింది తిరుపతి ఐనప్పుడు, ఈ బండి కాక ఏ బండి ఎక్కాలి? ఎంత భక్తి ఉంటే మాత్రం అంత గట్టిగా అరవాలా, ఆ అదురుకు రైలు పట్టాలు తప్పకుండా ఉన్నందుకు సంతోషించాలి” అన్నాడు కసిగా.
అక్కడున్న వాళ్లలో ఒక పెద్దాయన టప టపా లెంపలేసుకున్నాడు. “అపచారం నాయనా, అపచారం! అలా ఎప్పటికీ జరగదు. స్వామి ఆపద్బాంధవుడు. నమ్మిన భక్తులను దగా చెయ్యడు. ఇక్కడున్న వారిని ఎవరినైనా అడుగు, స్వామి కృప వల్ల కొండల్లాంటి ఆపదలు మంచులా ఎలా విడిపోయాయో చెప్పి, నీ కళ్లు తెరిపిస్తారు.”
“నా కళ్లు తెరిచేఉన్నాయి. ఎవరూ తెరిపించవలసిన పనిలేదు. మీరే తెలుసుకోవాలి. ఏ పనైనా జరగడం జరక్కపోవడం అన్నవి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సుతో ఉంటాయి. మీరంతా మొక్కులు చెల్లించుకోడానికి బయలుదేరారంటే, మీ కోరికలు తీరాయనే కదా అర్ధం! తక్కిన సగం మందీ కోర్కెలు తీరక నిరాశతో ఇళ్లల్లోనే ఉండిపోయి ఉంటారు. అలాంటి కుటుంబాల్లో మాదీ ఒకటి. మా అమ్మ పెట్టుకున్న ఏమొక్కూ కూడా మా నాన్నని కేన్సర్ బారినుండి రక్షించలేకపోయింది. అందుకే నాకు ఈ మొక్కులన్నా మొలతాళ్లన్నా నమ్మకం పోయింది”.
“తప్పు బాబూ! అలా మాట్లాడకూడదు. ఒక్కొక్కప్పుడు మన కర్మానుభవం ఎక్కువ పట్టుతో ఉండి, దైవకృపకు అడ్డం నిలుస్తుంది. తెలిసి చేసినా తెలియక చేసినా, చేసిన పాపాలు ఊరికే పోవు. జన్మ జన్మలా కట్టి కుడుపకుండా వదలవు. అందుకే, ఏ కష్టం వచ్చినా, మనవాళ్లు ‘ఇది ఏనాడు చేసుకున్న పాప ఫలమో’ అంటారు! సరిగా అర్ధం చేసుకో బాబూ” అంది ఆ కంపార్టుమెంట్‌లో ఉన్న ఒక ఇల్లాలు అతని మాటలకు రవంత బాధపడిపోతూ.
“బాగానే ఉంది మీరు చెప్పేది వినడానికి. ఇలాగే పరస్పర విరుద్ధంగా ఏవేవో చెప్పి చివరకు మనల్ని మనమే మోసం చేసుకుంటున్నామేమో ఆలోచించండి. మనల్ని సృష్టించింది దేవుడు కాదు, మనమే దేవుణ్ణి సృష్టించాం అనిపిస్తుంది. తనకున్న మంచిచెడ్డలన్నీ ఆయనకీ ఆపాదించి, ఒక రూపాన్ని కల్పించి, కథలల్లి ప్రచారం చేస్తున్నాడు మనిషి. మనం దేవునికే ఉపచారాలంటూ చంచాగిరీ చేస్తూ, ముడుపులు పేరుతో లంచమిచ్చి పనులు చేయించుకోవాలని చూస్తున్నామంటే, ఇక మన దేశంలో కరప్షన్ మూడు పూవులు ఆరు కాయలుగా వర్ధిల్లక ఏమౌతుందిట” ఆమెకు వెంటనే జవాబు చెప్పాడు ఆ అబ్బాయి ఉద్వేగంతో.
ఆ కంపార్టుమెంట్‌లో హాహాకారాలు చెలరేగాయి . అందరూ తలోమాటా మాట్లాడసాగారు. కొందరికి చాలా కోపం వచ్చి అతని వైపు కొర కొరా చూశారు. ఇంకా మాట్లాడితే, ఇక తన ఆబోరు దక్కదు అనిపించిందేమో, వెంటనే లేచి పై బెర్తు మీదికి ఎక్కి గొణుక్కుంటూ వెనక్కి తిరిగి పడుకున్నాడు ఆ కుర్రాడు. ఒక్కసారిగా భక్తులందరూ విజయోత్సాహంతో గొంతెత్తి గట్టిగా ‘గోవింద’ కొట్టారు. చాలా సేపటివరకు ఆ గోవిందుల కలకలం అలా సాగుతూనే ఉంది.
రాత్రంతా ప్రయాణం చేసి, తెల్లవారేసరికి గూడూరులో ఆగింది రైలు. మళ్ళీ బయలుదేరబోతుండగా, అప్పుడే ఫ్లాట్ఫారం మీదకి వచ్చిన ఒక కుటుంబం, కదుల్తున్న రైలు బండిని అందుకుని పెట్టెలో ఎక్కబోయారు. ఆడమనిషి ఒక చేత్తో పెట్టె మరొక చేత్తో ఒక కర్ర పట్టుకుంది. వాళ్ల కొడుకు కాబోలు, ఆమె భర్త పదేళ్ల కుర్రాడిని చంకనెత్తుకుని ఉన్నాడు. మొత్తానికి ఎలాగైతేనేం వాళ్లు పెట్టెలో ఉన్న ప్రయాణీకుల సాయంతో లోపలకు రాగలిగారు. ఆమె పెట్టె దించి ఉస్సురని నిట్టూర్చింది. అతడు పిల్లాడిని కిందకు దించగానే వాళ్ల అమ్మ కర్ర అందించింది. ఆ కర్ర ఆసరాతో నిలబడ్డాడు ఆ పిల్లాడు. రైలుపెట్టె తిరుపతి ప్రయాణీకులతో కిట కిటలాడుతోంది, ఎక్కడా కూర్చునే చోటు లేదు. ఒక పుణ్యాత్ముడు లేచి ఆ అబ్బాయికి చోటిచ్చాడు.
దగ్గరలోనే కూర్చుని ఉన్న జానకి ఆమెను, “మీరూ తిరుపతేనా? మొక్కుందా” అని పలకరించింది. ఆమె ఏమీ మాట్లాడకుండా భర్త వైపు చూసింది.
“లేదమ్మా! మా కష్టాలు మొక్కులతో తీరేవి కాదమ్మా. మాకు వీడొక్కడే బిడ్డ. మా అదృష్టం బాగోక వీడికి పోలియో వచ్చింది. కాలు ఔడు, నాలా కాయకష్టం చేసి బ్రతకలేడు, చదువు చెప్పిస్తే ఉద్యోగం చేసుకుని బ్రతుకుతాడనే ఆశతో బడిలో వేశా. డబ్బు బోలెడు కట్టాల్సి ఉంది. మా నాయన సాయం చేస్తాడేమో అడగడం కోసం మా ఊరు వెడుతున్నాం. తిరపతిలో దిగి బస్సుమీద వెళ్లాలి” అన్నాడతను.
అతని మాటలు అక్కడున్న వాళ్ల మనసుల్ని కదిలించాయి. పెదవి విరుస్తూ అందరూ తలలడ్డంగా వూపారు. లాభసాటి వ్యాపారంగా మారిపోయిన విద్యారంగాన్ని దుయ్యబట్టి, భావిభారత పౌరుల్ని తీర్చి దిద్దవలసిన విద్యాలయాలకు పట్టిన దుర్గతిని గురించి, పట్టని ప్రభుత్వం గురించి తలోమాటగా వాపోయారు. ఈ చర్చతో కాలం తెలియకుండా గడిచిపోయింది. రైలు తిరుపతిని సమీపించింది. తిరుమల దర్శనం కాగానే భక్తులు ఇంకోసారి “గోవిందా! గోవింద!” అంటూ దైవ నామ స్మరణ చేసి నెమ్మదిగా దిగే సన్నాహంలో సామాను సద్దుకోడం మొదలుపెట్టారు.
ప్రయాణం ఒక కొలిక్కి వచ్చినందుకు ‘అమ్మయ్య’ అనుకున్నారు జానకీ సీతాపతులు. జనం లేచి గుమ్మం దగ్గరకి చేరుకోడం మొదలుపెట్టారు. కిటికీ పక్క సీట్లు ఖాళీ కాగానే అక్కడ చేరిపోయారు పిల్లలు. సీతాపతి బెర్తు కిందనున్న పెట్టెలు బయటికి లాగాడు. జానకి సామాను లెక్క పెట్టింది. ఒకటి తక్కువ కావడంతో మళ్లీ మళ్లీ లెక్కేసింది.
“ఏమండీ మొక్కుబళ్లు ఉంచిన పెట్టె ఏదండీ” అని అరిచింది, ఆర్తనాదం లాంటి కంఠస్వరంతో.
సీతాపతి కంగారుగా పైనాకిందా వెతికాడు. కాని అది ఎక్కడా కనిపించలేదు. నిర్ఘాంతపోయారు ఇద్దరూ. భయం భయంగా చూశాడు భార్య వైపు సీతాపతి.
“దాన్ని ఆ మూలకంతా పెట్టా కదే! ఏమైపోయిందే” అని బుర్ర గోక్కున్నాడు.
“బాగానే ఉంది వరస! నన్నడుగుతారేమిటి? నా కెల్లా తెలుస్తుంది” అంటూ ఎదురడిగింది జానకి.
బిక్కమొహం పెట్టాడు సీతాపతి. రైలు దిగే జనం, కంగారుపడుతున్న ఆ దంపతులవైపు ఒక్కక్షణం సానుభూతితో చూసి తమ దారిన తాము వెళ్లిపోసాగారు. సీతాపతి పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాడు.
“ఏమండీ, పోనీ పోలీసులకు రిపోర్టు ఇద్దామా?”
“పోలీసులకా? అలా చేస్తే వాళ్లు కేసు, గీసు అంటూ మనల్ని ఇక్కడే కట్టి పడేయ్యగలరు. అంతేకాదు, “ఆ పెట్టెలో ఏమున్నాయి” అని అడుగుతారు. కరెక్టుగా చెప్పాలి మనం. పిసరంత తేడా కూడా రాకూడదు, ఏమనుకుంటున్నావో!” సీతాపతి కంగారుపడ్డాడు.
“అమ్మో! అవన్నీ మనo ఇప్పి చూస్తే కదా చెప్పేందుకు! ఇచ్చినవి ఇచ్చినట్లుగా పొట్లాలు కట్టి పెట్టేశాం, ఇప్పుడెల్లాగ?”
“అదే నాకూ తెలియడం లేదు. పుణ్యానికి పోతే పాపం ఎదురొచ్చిందిట… అలాగుంది మన పని”
“అయ్యో, అలా దిగులు పడకండీ. నేను చెప్పేదొకసారన్నా విని అర్ధం చేసుకోండి. దేవుడి సొమ్మది, ఆయనే దాన్ని తీసుకెళ్లిపోయాడనుకుని నోరు మూసుకుందాం” అంది జానకి తుని తగవుగా.
“నేను కాంపుకి పట్టుకెళ్లే వి.ఐ.పి. సూట్కేసు కదే పోయింది! చూస్తే, పోయీ భూతం చెట్టు కొమ్మనుకూడా పట్టుకుపోయింది అన్నట్లుగా ఉంది, అయ్యో!” అన్నాడు సీతాపతి ఇంకా దిగులుగానే .
ఫ్లాట్ఫారం మీద తిరుగుతున్న భక్తులు కొందరు అకస్మాత్తుగా “గోవిందా! గోవింద!” అంటూ ముక్త కంఠంతో ఓ పొలికేక పెట్టారు. ఉలిక్కిపడ్డట్లై ప్రస్తుతానికి వచ్చారు భార్యా భర్తలు.పిల్లల్ని లేవగొట్టే ప్రయత్నంలో పడింది జానకి. సామాను తీసుకుని గుమ్మం దగ్గరికి నడిచాడు సీతాపతి. రష్ తగ్గాక రైలు దిగొచ్చు లెమ్మని వేచి ఉన్న పోలియో వచ్చిన అబ్బాయి, అతని తల్లితండ్రులూ అప్పుడే దిగుతున్నారు. వాళ్లని చూడగానే సీతాపతి మనసులోకి ఒక ఆలోచన వచ్చి, ముల్లులా కుట్టింది.
” ఆ పెట్టెలో డబ్బు ఈ అబ్బాయికి ఇచ్చినా సద్వినియోగమై ఉండేది కదా! కాని, భవిష్యత్తు ఏమిటో తెలియని తప్పు నాది కాదు, ఆ దేవదేవుడిదే! గోవిందా! గోవింద!” అనుకున్నాడు మనసులో.
టాక్సీ బేరం చేసుకుని కొండ పైకి వెళ్ళి, ముందే బుక్‌చేసి ఉంచుకున్న కాటేజ్ చేరుకున్నారు సీతాపతి, కుటుంబం. ఆ రోజు స్వామి వారికి ప్రియమైన శనివారం కావడంతో, కల్యాణ కట్టకు వెళ్లి మొక్కు తీర్చుకోవాలనీ, అప్పటికప్పుడే దైవ దర్శనం చేసుకోవాలని పట్టుపట్టింది జానకి. వెంటనే వాళ్లు స్నానాలు చేసి తయారైపోయారు. అదృష్టం బాగుండి, కల్యాణకట్ట దగ్గర పని తొoదరగానే జరిగిపోయింది. పిల్లవాడికి జుట్టు తీయించడంతోపాటుగా, మొక్కు తీర్చడంలో జరిగిన జాప్యానికి వచ్చిన అపరాధ భావంతో సీతాపతి కూడా తన తలనీలాలు ఇచ్చాడు. జానకీ, కూతురూ తలో మూడు కత్తెరలూ ఇచ్చి తమ భక్తిని నిరూపించుకున్నారు. కాటేజ్‌కి తిరిగి వచ్చి మళ్లీ స్నానాలు కానిచ్చి, ముస్తాబై వెళ్లి దైవ దర్శనం చేసుకోడం కోసం క్యూలో నిలబడ్డారు.
అది మంచిరోజు కావడంతో క్యూ చాలా పొడుగ్గా ఉంది. ఆ వరసలో వెళ్లాలంటే ఎన్ని గంటలు పడుతుందో తెలియదు. రాత్రంతా ప్రయాణం చేసి ఉన్నారేమో, పిల్లలు బడలికతో వాడిన తోటకూర కాడల్లా వేల్లాడిపోసాగారు. ఇలా కాదని దర్శనానికి దగ్గర దారులు వెతికాడు సీతాపతి. తలకొక వంద చొప్పున ఇచ్చి, దగ్గర దారి టిక్కెట్లు కొన్నాడు. దాంతో తొందరగానే గర్భ గుడి దగ్గరికొచ్చారు. సింహద్వారానికి మొక్కి గడప దాటి, ప్రవహిస్తున్న నీళ్లలో నడిచి వెళ్లే సరికి కృతక ఓంకార నాదం వినిపించసాగింది. అక్కడనుండి తొందరగా నడవమని భక్తులకు హెచ్చరికలు చెపుతూ తోసేస్తూ వుండే వాలంటీర్ల సంఖ్య కూడా పెరిగింది.అక్కడికి చేరిన యాత్రీకుల హృదయాలు భక్తి భావంతో బరువెక్కి ఉండడంతో ఎవరెంత హెచ్చరించినా, గర్భవతుల్లా నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ తోపుళ్ళను ఓపుకుంటూ కదులుతున్నారు.
చివరికెలాగో జానకి సీతాపతులు పిల్లలతో స్వామి దగ్గరకి చేరుకున్నారు. ఎదుట నున్న వాళ్ల తలల పైనుండి, కనీ కనిపించకుండా వున్నాడు ఆ దేవదేవుడు. సీతాపతికి గాలి స్థంభించి పోయినట్లనిపించింది. ఓంకారమే జగత్తు మొత్తం నిండిపోయి ఉన్నట్లు తోచింది. స్వామిని ఎదురుగా కళ్లారా చూడాలని తహతహలాడాడు. అక్కడున్న వారందరి పరిస్థితి ఇంచుమించు అలాగే ఉంది. ఇది అది అని చెప్పలేని ఏదో ఉత్సుకతతో జనం ముందు ముందుకి జరిగి స్వామి సన్నిధికి చేరుకుంటున్నారు. స్వామికి ఎదురుగా వచ్చిన సీతాపతి కళ్లు పైకి లేపి నిండుగా అలంకరించబడి ఉన్న ఆ దివ్యరూపాన్ని కళ్లారా చూడాలని ప్రయత్నించాడు. అంతలోనే వాలంటీర్లు జబ్బపట్టుకు అతన్ని పక్కకి నెట్టేశారు, వెనకాలే జానకిని కూడా. వెనకవాళ్లు ముందుకు వచ్చేశారు. ముందు వాళ్లు ముందుకి కదలక తప్పలేదు. ఉసూరుమన్నారు సీతాపతి, జానకీ. దీనికోసమేనా ఇంత దూరం వ్యయప్రయాసలకు ఓర్చి వచ్చింది, అనిపించింది వాళ్లకి. కాని అంతలోనే వాళ్లు హుండీ ఉన్న చోటుకి వచ్చేశారు. అక్కడితో, వాళ్ల ఆలోచనల దారి మారింది.
వాళ్ల తరఫున మొక్కుల్ని హుండీలో వెయ్యమంటూ, తమమీద నమ్మకం ఉంచి అప్పగించిన స్నేహితులూ, ఇరుగుపొరుగువారూ గుర్తు వచ్చి, జానకీ సీతాపతులకు గుండెలు బరువెక్కాయి. వాళ్లందర్నీ పేరు పేరునా తలుచుకున్నారు మనసులో. తమకు తోచిందేదో హుండీలో అందరి పేరు మీదా వేసి అక్కణ్ణుంచి కదిలారు. కొంచెం అటుపైగా దేవస్థానం వారు తలో కాస్తా ప్రసాదం చేతిలో ఉంచారు. అక్కడే ఉన్న అరుగుమీద విశ్రాంతిగా కాసేపు కూర్చుని, ఆ ప్రసాదం నోట్లో వేసుకోడంతో వాళ్లకు మొక్కు చెల్లించిన తృప్తి కల్గింది. కాళ్ళసందుల్లోంచి దేవుణ్ణి చూశాగా! అన్నాడు అబ్బిగాడు. వాడి బోడిగుండు తడిమి ఆ చెయ్యి ముద్దు పెట్టుకున్నారు ఆ తల్లీ, తండ్రీ. మొక్కు తీర్చుకున్న సంతోషం వారి మనసుల్లో నిండిపోయింది.
ఆ తరువాత లడ్డూల వేట మొదలయ్యింది. దేవస్థానం వాళ్ల షాపు దగ్గర పెద్ద క్యూ ఉంది. చచ్చిచెడి ఆ క్యూలో పడి వెడితే, డబ్బు తీసుకుని తలకొక లడ్డూ అంటూ లెక్కపెట్టి మరీ ఇచ్చారు వాళ్లు. ఇంక ఎంత బ్రతిమాలినా, ససేమిరా ఇవ్వడం కుదరదు పొమ్మన్నారు. ఆ లడ్డూల్ని చూసి బిత్తరపోయాడు సీతాపతి. లడ్డూ ఉరవ చూస్తే, తమ పెళ్లైన కొత్తలో దైవ దర్శనానికి వచ్చినప్పుడు ఇచ్చిన లడ్డూలో సగం కూడా లేదు ఇప్పటి లడ్డూ.
“ఇంత చిన్నవేమిటి! ఈ నాలుగూ ఏమూలకీ రావు. మనకి మొక్కులందించిన వాళ్లకి మనం ప్రసాదమైనా ఇవ్వాలా వద్దా! బ్లాకులో కొనాలి, తప్పదు” అంది జానకి. వెర్రి మొహం పెట్టుకు భార్య వైపు అదోలా చూశాడు సీతాపతి. దాన్ని అపార్ధం చేసుకున్న జానకి రుస రుస లాడింది.
“మీరు మరీనండీ! జరిగిందేదో జరిగిపోయింది. దానికి మనమేం చెయ్యగలం? కనీసం మనం వాళ్లకి కొంచెం ప్రసాదాలైనా ఇస్తే బాగుంటుంది కదా. ఇక్కడ పీనాసితనం చేయకండి. ఔనంటారా, కాదంటారా, చెప్పండి” అంది.
“అదికాదే బాబూ! దేవుడి ప్రసాదం బ్లాకులో అమ్మడమా! అలాగైతే అది ప్రసాదం ఎలాగౌతుందీ అని ఆలోచిస్తున్నా, అంతే. కొంటాలే” అన్నాడు సీతాపతి ఇంకా అదోలానే.
వాళ్లు బయటికి వచ్చేసరికి కొందరు, సినిమాహాళ్ళ దగ్గర బ్లాకులో టిక్కెట్లు అమ్మేవాళ్లల్లా చుట్టుముట్టి, “లడ్డూ కావాలా, లడ్డూ కావాలా” అంటూ వీళ్ల చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. జానకి అరడజను కావాలంది. కాని సీతాపతి, పది లడ్డూలకు ఆర్డర్ చేశాడు.
వెంటనే జానకి “నేను ఆరంటే మీరు పదంటారేం” అంది.
“నీ తస్సాదియ్య, ఆగవే బాబూ! అవంటే నాకు చచ్చేటంత ఇష్టం. ఈ తిరుపతి లడ్డూకున్న రుచి మరే లడ్డూకీ రాదు. నీకిష్టం లేకపోతే మానెయ్. నేనూ పిల్లలూ నాల్గునాళ్లు దాచుకు తింటాం. ఈ ఫారమ్లాయే వేరు. ఇలా ఇల్కెవలూ చెయ్యలేలు” అన్నాడు సీతాపతి నోరూరుతూండగా.
జానకి నవ్వింది. ఆ రాత్రికి కాటేజీలో ఉండి, తిరుమల అంతా తిరిగారు. అక్కడే కావలసినవన్నీ కొనుక్కుని , తిరుగు ప్రయాణమై కుటుంబమంతా మరునాటికల్లా ఇంటికి తిరిగి వచ్చేశారు.
వీళ్లు యాత్ర ముగించుకుని తిరిగి వచ్చినట్లు ఎలా కబురందిందో ఏమో, ఒక్కొక్కళ్లూ వచ్చి, పలుకరించి, కుశల ప్రశ్నలడిగి వెళ్లడం మొదలుపెట్టారు. అందరిదీ మొదటి ప్రశ్న దర్శనం బాగా అయిందా అనే. సమాధానం అయింది అనే. తిరుమల కబుర్లు చెప్పి, కొంచెం లడ్డూ ముక్క, స్వామివారి చిన్న పటం, యాత్రా తోరం ఇచ్చి చిరునవ్వుతో అందర్నీ సాగనంపింది జానకి.
సాయంకాలం శాంత వచ్చింది. వస్తూనే, జానకిని కౌగిలించుకుని, “వొదినా, నీ మేలు ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు. ఆవేళ నీ చేతికి మొక్కుకున్న డబ్బు ఇచ్చి, స్వామివారి హుండీలో వెయ్యమని చెప్పి వెళ్లానా, నేను ఇల్లు చేరే సరికి రాజు దోరాటం తగ్గి ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించాడు. కాసేపట్లో కళ్లు తెరిచి, “అమ్మా దాహం” అని అడిగి గ్లాసుడు నీళ్లు తాగి పడుకున్నాడు. అంతా ఆ ఏడుకొండలవాడి దయ. మీ అన్నయ్యగారు సరేలే, ‘నువ్వటెళ్ళావో లేదో, డాక్టర్ ప్రసాద్ వచ్చి ఇంజక్షన్ చేసి, మందులు రాసి ఇచ్చి వెళ్లాడు. అరగంటలో గుణం కనిపిస్తుందని చెప్పాడ్లే. అది ఆయన దయ’ అన్నారు. ఎడ్డెమంటే తెడ్డెం! నువ్వు చెప్పు వదినా! మందు అంత తొందరగా గుణమిచ్చిందంటే, అది స్వామి మహిమ కాక మరేమిటిట! మీరు వడ్డి కాసుల కోసం ఇచ్చిన వందా ఇదిగో” గుక్కతిప్పుకోకుండా అంటూ శాంత ఒక వంద కాగితాన్ని తీసి జానకివైపుగా చెయ్యిచాపి అందించింది.
ఆ నోటు తీసుకోవాలో, వద్దనాలో తెలియక వెర్రిమొహం వేసుకుని భర్త వైపు చూసింది జానకి. ఏమని చెప్పాలో అర్ధం కాక తెల్లమొహం పెట్టుకుని గోడనున్న వెంకటేశ్వరస్వామి పటం వైపు చూశాడు సీతాపతి.
శాంత చేతిలోని వంద రూపాయల నోటు ఫానుగాలికి నవ్వినట్లుగా రెపరెపలాడింది.
-----------------------------------------------------
రచన: హేమ వెంపటి,
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment