న్యూ తెలుగు మదర్
సాహితీమిత్రులారా!
ఆ రోజు దిన పత్రికల్లో వచ్చిన ఒక వార్త రాష్ట్రమంతటా చెప్పలేని సంచలనం సృష్టించింది . నక్సలైట్ల మందు పాతరలా పేలింది. ప్రజలు ఆ వార్త గురించి గుంపులు గుంపులుగా ఏర్పడి చర్చించుకోవడం ప్రారంభించారు . కొందరు యిది మన ప్రాచీన సంస్కృతిపై దాడి …. అలాజరగడానికి వీల్లేదన్నారు . ఉడుకురక్తం ఉప్పొంగే కుర్రవాళ్ళు కొందరు ప్రపంచం మారుతున్నది ఇంకా యింకా ముందుకు దూసుకు పోతున్నది , మార్పు సహజం . పాతచింతకాయ పచ్చడి లాంటి ఆలోచనల్ని తుంగలో త్రొక్కి ముందుకురుకుతున్న కాలాని కనుగుణంగా మారాల్సిందే , మార్చాల్సిందే . ప్రాచీన సంస్కృతి గాడిద గుడ్డు అంటూ వేలాడాల్సిన పని లేదు . ఇవ్వాళ మనం మంచి అనుకున్నది ప్రారంభిస్తే కొన్నాళ్ళకు అదే క్రొత్త సంస్కృతిగా పరిణమించవచ్చు , కాబట్టి ఈ ఆలోచన వెరైటీగానే కాకుండా నావెల్టీగా కూడా ఉన్నది . తప్పకుండా ప్రయత్నించాల్సిందే అంటూ సపోర్టు చేశారు . పెద్దవాళ్ళు “పిదపకాలం పిచ్చిబుద్ధులు ….. పనికిమాలిన ఆలోచనలు …. ప్రజలు రకరకాల యిబ్బందుల్తో చస్తుంటే ….. ఇప్పుడీపని యింత అవసరమా …. అఘోరించండి .” అని గొణుక్కున్నారు , పెద్దగా అంటే కుర్రాళ్ళకి కోపాలొస్తాయేమోనని భయపడుతూ.
మొత్తానికి ఆశించిన కలకలం , కలవరం కలిగించడంలో కృతకృత్యమయ్యిందా వార్త.
“గుడ్ అయిడియా … గో ఎ హెడ్ ” అంటూ ప్రోత్సహిస్తూ వచ్చిన లెటర్లను , ఈ మెయిల్లను చూసి వుక్కిరి బిక్కిరి అవుతున్నారు ముఖ్యమంత్రి గారు . ఈ సంచలనానికి కేంద్ర బిందువయిన ‘ తెలుగు తల్లి ‘ విగ్రహం మాత్రం , మాటా పలుకూ లేకుండా , ఒక చేత్తో కలశంతో , మరోచేత్తో బిడ్డల్ని దీవిస్తూ టాంక్బండ్ పైన నిశ్చలంగా , నిర్వికారంగా , నిశ్చేష్టగా నిలుచుంది , హుస్సేన్ సాగర్ లోని బుద్ధుణ్ణి చూస్తూ .
సంగతేమిటో మీకు యింకా అర్ధం కాలేదుగదూ ! ట్రాన్స్ పరెన్సీని నిత్యం జపించే యీ రోజుల్లో విషయాన్ని మీ నుండి దాయడం భావ్యంకాదు గనుక …. సస్పెన్సుకు తెరదింపేస్తాను . ప్రజల్లోకి చొచ్చుకుపోయి యింత సంచలనం కలిగించిన యీ వార్తను అన్ని పత్రికలూ వాటికి తోచిన అలంకారాల్తో అభివర్ణించాయి . వాటన్నిటి సారాంశమేమిటంటే ….
“రాబోయే ఆంధ్రరాష్ట్రావతరణోత్సవాల్ని , వినూత్నంగా , ప్రపంచమంతా ఆశ్చర్య పోయేలా నిర్వహించాలని ముఖ్యమంత్రిగారి అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయించారు . ఈ సందర్భంగా వారిక్కలిగిన మరొక అద్భుతమైన యోచన ఏమంటే కాలానుగుణంగా ఎన్నో మార్పులు వస్తున్నప్పటికీ , మన తెలుగు తల్లి విగ్రహం మాత్రం మార్పు లేకుండా వుంది , ఎవరో ఏ నాడో డిజైన్ చేసి తయారు చేసిన ఆ విగ్రహాన్ని ప్రస్తుత హైటెక్ భావనలకు సరిపడేలా సరిక్రొత్త రూపంలో సంతరించాలని . దీనికి ప్రజలనుండి సూచనలు , సలహాలు ఆహ్వానిస్తున్నారు . అలాగే కొత్త తెలుగు తల్లి ఎలా ఉండాలో డిజైన్ చేసి పంపితే , పరిశీలించి , బాగున్న డిజైన్ ను యెన్నుకుని , ఆరూపంలో విగ్రహం తయారు చేయిస్తామనీ, ఆ డిజైనర్ ను సముచిత రీతిలో సత్కరిస్తామనీ తెలియజేస్తున్నారు.
********************************
నాలుగొందలేండ్ల పైచిలుకు ఘన చరిత్ర కలిగిన భాగ్యనగరంలోని మంత్రాలయం అది . మంత్రాలయం అంటే అదేదో పుణ్యస్థలమనుకునేరు , కాదు , మంత్రులుండే చోటు అని నా వుద్దేశ్యం . అది దుష్టసంధి , దుస్సమాసం అంటారా ? ఏమైనా అనుకోండి మీయిష్టం . మీకామాత్రం స్వతంత్రం వుంది . ఇంగ్లీషుతెలుగు , హిందీతెలుగు , తెలుగుసంస్కృతం పదాలతో రకరకాల క్రొత్త పదాలు పుట్టగా లేంది , నేను కేవలం సంస్కృతపదాలతోనే ఒక కొత్త పదం సృస్టిస్తే తప్పొచ్చిందా ? అలాంటి మంత్రాలయం లో , సి యం గారి నేతృత్వంలో సమావేశం జరుగుతున్నది . యమ్మెల్యేలు , మంత్రులు , అధికారులు , కొందరు అనధికార ప్రముఖులు ఆహ్వానించబడ్డారు .
మొదటగా ఈ మధ్యనే ఐదు దేశాల యాత్రకు వెళ్ళి యెన్నో క్రొత్త విషయాలను తెలుసుకుని వచ్చిన శాసన సభ్యులను అభినందిస్తూ , వారి అనుభవం రాష్ట్రాభి వృద్ధికి నూతన ద్వారాలను తెరవాలని ఆకాంక్షించారు సి యం గారు . తరువాత అసలు విషయానికొచ్చారు . ” మంత్రులారా ! మన ఆంధ్రదేశం అనేక విధాలుగా అభివృద్ధిని సాధిస్తూ యితర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న విషయం మీ అందరికీ తెలుసు . ఐ టి రంగంలో విప్లవాత్మకమైన మార్పు సాధించి , ఉన్నత స్థాయిలో నిలిచిన సంగతి మీకు చెప్పాల్సిన పనిలేదు . నాకు వచ్చిన ఒక వినూత్న ఆలోచనను ప్రజలలో చర్చకు పెట్టిన విషయం , ప్రజలందరూ ఏకగ్రీవంగా అంగీకరించిన విషయమూ మీకు తెలుసు . ప్రజామోదంతో మీ అందరి సహకారంతో తెలుగు తల్లి విగ్రహాన్ని , నేటి మార్పుల కనుగుణంగా డిజైన్ చేయించదలిచాను . అనేక మంది డిజైనర్లు ఉత్సాహంగా , తమ మేధకు పదనుపెట్టి , డిజైన్లు పంపించారు . వీటిని ఒక్కొక్కటిగా మనముందున్న తెరపై ప్రదర్శిస్తారు , బాగా ఉన్నదనుకున్న వాటిని మీరు నిర్ణయిస్తే , ఉత్తమమైన దానిని అనుసరించి క్రొత్త తెలుగు తల్లి విగ్రహాన్ని తయారు చేయిస్తాము . ఈ విగ్రహాన్ని ప్రతి నియోజక వర్గ కేంద్రంలోను నెలకొల్పాలని , ఆప్రాంతంలో పర్యావరణ పరిరక్షణకు చెట్లు పెంచి పెద్ద పార్కులుగూడా నెలకొల్పాలని ప్రభుత్వపరంగా నిర్ణయించాము . మీ అభిప్రాయాలనుగూడా చెప్పాలని కోరుతున్నాను . ”
ముఖ్యమంత్రి ప్రసంగం పూర్తి కాగానే ప్రతిపక్ష సభ్యులొకరు లేచి ” యిది మన ప్రాచీన సంస్కృతీ సంపదపై ప్రభుత్వ పరంగా జరగబోతున్న దాడి , దీనిని మేము సాగనివ్వం ” అన్నారు .
ఇంతలో సి యం గారు అందుకుని, ” మిత్రులకు మరొక విషయం చెప్పడం మరిచాను , ఈ ప్రాజెక్టు బాధ్యతను , డబ్బు ఖర్చు చేసే అధికారాన్ని శాసన సభ్యులకు అప్పగిస్తాం , ఎవరి నియోజక వర్గంలో వారు శ్రమించి ఈ కలల ప్రాజెక్టు కు ఆకారం కల్పించి విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను ” అని చెప్పారు ; ఇంక ఎవరికీ అభ్యంతరంచెప్పే అవసరమే కనిపించలేదు.
మిత్రపక్ష సభ్యులొకరు ” మీ ఆలోచన బాగానే వుందిగాని ఈ ప్రాజెక్టు కు యెంతో ఖర్చవుతుంది కదా, అంత డబ్బెలా వస్తుందో ఆలోచించారా ? ఇప్పటికే రాష్ట్రం అప్పుల వూబిలో కూరుకుపోయివుంది ” అన్నారు.
సి యం గారు ఆర్ధికమంత్రి గారి కోసం చూశారు . ఆయనలేరు. హోం మంత్రి గారి సీటుకూడా ఖాళీగా వున్నది . సెక్రటరీని పిలిచి అడిగారు ” ఇద్దరు మినిస్టర్లు రాలేదేమిటి ? ఫోను చేశారా ? ” అని “ఫోను చేశారు సార్ ! సార్ అడిగితే ఈ ప్రాజెక్టు కు అవసరమైన నిధులను యెక్కడినుండి మళ్ళించాలో ఆర్ధిక మంత్రిత్వ శాఖ అధికారుల సమావేశంలో చర్చించి , ప్రతిపాదనలతో వస్తామని చెప్పమన్నారు ఫైనాన్స్ మినిష్టర్ గారు . అలాగే ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే , ప్రజాందోళనను ఏ విధంగా ఎదుర్కోవాలో అధికారులతో చర్చించి , నిర్దిష్టమైన ప్రపోజల్స్ తో వస్తామని హోం మినిస్టర్ గారు చెప్పారు . వారిద్దరూ కొద్ది సేపట్లో రావచ్చు సార్ ” అని చెప్పాడు సెక్రటరీ .
“వారి సమావేశాల్ని ఆపివేసి వెంటనే రమ్మని ఫోన్ చేయండి ” అని చెప్పి ‘ డియర్ ఫ్రెండ్స్ ‘ మాయీ సరికొత్త ఆలోచనను ప్రపంచ బ్యాంకు వారికి తెలియజేసి , ఈ ప్రాజెక్టుకు ఋణ సహాయాన్ని అర్ధించాం , నిన్న రాత్రి వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంటు గారితో మాట్లాడాను , మన ప్రతిపాదన అద్భుతంగా వుందని అభినందించి , 400 కోట్ల రూపాయలు యివ్వడానికి ఒప్పుకున్నారు . అలాగే భారతమాతకు కూడా క్రొత్త రూపు సంతరించవలసినదిగా పి యం గారికి సలహా కూడ యిస్తామన్నారు . దీనిని బట్టి తెలుస్తున్నదేమిటంటే , మన ఈ కార్యక్రమం దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించనుందని . ఈ ఆర్ధిక సహాయం కన్ఫరం అయిన సంగతి ఈ సమావేశంలోనే వెల్లడించాలని , ఆర్ధిక మంత్రి గారికిగూడ చెప్పలేదు” అంటూ సి యం గారు ” మాటల్లోనే వచ్చారు ఫైనాన్సు మినిస్టరు గారు , హోంమంత్రి గారు . మంత్రిగారూ ! డబ్బు గురించి మీరు కసరత్తులు చేయాల్సిన పనిలేదు . మన అన్ని ప్రాజెక్టులకు అప్పిచ్చిన వాళ్ళే , ఈ ప్రాజెక్టుకు గూడా అప్పిస్తున్నారు . నారుపోసినవాడే నీరుకూడా పోయాలిగదా ! పోస్తాడు . కాబట్టి మీకేం బెంగవద్దు . హోం మంత్రి గారూ ! చాందసులు కొందరు అరచి గోల చేసినంత మాత్రాన మన ప్రాజెక్టు ఆగదు . ప్రజామోదంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఎవరూ ఆపలేరు . అవసరమైతే పారామిలటరీదళాల్ని వినియోగిస్తాం . అంతపెద్ద విద్యుత్ ఉద్యమాన్ని నిరోధించ గలిగిన మనం, వీటిని ఆపలేమా ? అప్పటి పరిస్థితుల కనుగుణంగా వ్యవహరిద్దాం . ఇప్పట్నుంచే మనకెందుకు ఆందోళన ? జరగవలసిన దానిగురించి ప్రస్తుతం ఆలోచిద్దాం ” అన్నారు .
మరొక సభ్యుడు ” నిధుల్నెలా ఖర్చు చేయాలో ఆలోచించారా” అని అడిగాడు . ” ఇప్పుడేగా ఆర్ధిక మంత్రిగారొచ్చారు , వారితో ఆలోచించి నిర్ణయిస్తాం . నా వుద్య్దేశ్యమేమిటంటే ప్రతి నియోజక వర్గానికి కోటిరూపాయలు కేటాయించి మిగిలింది రిజర్వు ఫండుగా ఉంచుతాం . ప్రాజెక్టు బాగాచేసిన వారికి యింకా యెక్కువ గూడ వుంచుతాం . కన్సల్టెంట్లకు పదిశాతం తప్పదుగదా ! ” అన్నారు సి యం గారు .
“ఈ ప్రాజెక్టుకు కూడా విదేశీ కన్సల్టెంట్లు అవసరమా ? మన తెలుగు తల్లి విగ్రహం యెలా వుండాలో వారి సలహా దేనికి ” అన్నారొకరు .
” మీరన్నది నిజమే , కాని వరల్డు బ్యాంకు వారి కండిషన్లు మీకుతెలుసుగదా ! పని చేయించుకున్నా , లేకున్నా , మనకుపయోగపడినా , పడకున్నా విదేశీ కన్సల్టెంట్లకు ముట్టజెప్పాల్సిందే ” వివరించారు ఆర్ధిక మంత్రిగారు .
మాట్లాడాలని ఉన్నా , ఎదురుగా కన్పిస్తున్న కోటి రూపాయల కలలో తేలిపోతూ , మిగిలిన వారెవరూ నోరు మెదపలేదు .
” ఫ్రెండ్స్ ! ఫండ్స్ గురించి క్లారిఫై అయ్యింది గనుక , ఇక డిజైన్లు చూసి , మీకు నచ్చినవి సూచించండి ” చెప్పారు సి యం గారు.
దాదాపు మూడువందల డిజైన్లను పరిశీలించారందరూ , కొన్ని నవ్వు తెప్పించేవి , కొన్ని కోపం తెప్పించేవి , విసుగుకల్గించేవి కొన్ని , చిరాకు కల్గించేవి కొన్ని …… యిలా అన్నింటినీ చూసి , పది బొమ్మలు బాగున్నాయని నిర్ధారించి వాటిలోంచి గెలిచిన డిజైన్‌ను నిర్ణయించే బాధ్యతను ముఖ్యమంత్రి , ఆర్ధిక , హోంమంత్రులు , కొందరు అధికార , ప్రతిపక్ష శాసన సభ్యులు , అనధికార ప్రముఖులతో కూడిన కమిటీకి అప్పగించారు . సమావేశం అల్పాహార విందుతో ముగిసింది .
్******************************************************
ఒక వారం రోజుల తరువాత ‘ న్యూ తెలుగు మదర్ ‘ విగ్రహ నిర్ధారణ కమిటీ సమావేశం సి యం గారి అధ్యక్షతన జరిగింది . విస్తృతసమావేశంలో నిర్ణయించిన పది డిజైన్లను నిశితంగా , నిర్దుష్టంగా పరిశీలించారు . వాడి , వేడి చర్చలు జరిగాయి .
చర్చల సందర్భంగా ఒకరికో చిన్న అనుమానం వచ్చింది . ” మనం ఈ డిజైన్లన్నీ చూస్తున్నాంగదా ! ఈ సందర్భంగా శంకరంబాడి సుందరాచార్య గారి మంచి పాపులర్ పాట ‘ మాతెలుగు తల్లికి మల్లె పూ దండ ‘ ను మనం మరచి పోకూడదు . ప్రజల హృదయాల్లోకి చొచ్చుకుని వెళ్ళి , ఉత్తేజం కలిగించిన , ఇంకా కలిగిస్తున్న పాట అది . కనుక మనం నిర్ణయించే డిజైనులో మల్లెపూదండ వేసుకున్న తెలుగు తల్లిని చూపిస్తే బాగుంటుందేమో ” అన్నాడు .
మరొక శాసన సభ్యునికి చాలా కోపం వచ్చింది . “ప్రపంచం ముందుకు దూసుకు పోతుంటే , మీరింకా స్వాతంత్రానికి పూర్వం వ్రాసిన పాటలోని పదాల్ని పట్టుకు వేలాడతారేమండీ , ప్రాస కోసం మల్లెపూదండ అనివాడారు అప్పుడు . ‘ న్యూ తెలుగుతల్లికి నుదుట రత్నాలు ‘ అని యిప్పుడెవరైనా వ్రాశారనుకోండి రత్నాలు పెట్టేస్తామా ? ఆవేశంలో ఏనాడో వ్రాసిన ఆ పాటను గురించి మర్చిపోండి . మనం ఈ నూతన విగ్రహాల్ని ప్రతిష్టించి , ఆవిష్కరిస్తే చాలా మంది వీటి గురించి కూడా పాటలు వ్రాస్తారు . అలంకారం కోసం వీళ్ళేదో వ్రాస్తే , అలా మార్చ గలమా విగ్రహాన్ని ? ” అని గద్దించాడు .
తర్జన భర్జనలు , తీవ్ర వాదోపవాదాలు జరిగాయి, సభ్యులు గ్రూపులుగా చేరి చర్చించుకున్నారు . రెండేసి మూడేసి గ్రూపులవారు తలకు తల ఆనించుకుని , ఆలోచనలు గాలికి పోకుండా బంధించి తీవ్రంగా ఆలోచించారు . టీ లు త్రాగి ఆలోచించారు , కాఫీ అలవాటున్నవారు కాఫీ త్రాగారు , వేసవిలో టీ లు కాఫీలేంటండీ, అసలే బుర్ర వేడెక్కి చస్తుంటే కూల్డ్రింక్ తెప్పించండని , కొందరు తెప్పించుకుని త్రాగారు . మరోరకం కూల్ డ్రింకులు అలవాటున్న వారు అవిగూడా తెప్పిస్తే బాగుండేదని మెల్లగా గొణుక్కున్నారు , పెద్దగా అంటే సి యం గారు తిడతారేమోనని . సిగరెట్ అలవాటున్న వారు బయటికెళ్ళి పొగతాగారు ‘ ఇచ్చట పొగత్రాగుట నిషేధించబడినది , పొగత్రాగినవారు శిక్షార్హులు ‘ అన్న బోర్డుకడ్డంగా నిలబడి . ఇలా యెవరికి అనుకూలమైన విధంగా వారు రిలాక్స్ అయి , నిర్ణయం తీసుకునే బాధ్యతను సి యం గారి కప్పగించారు , ఏకగ్రీవంగా .
సీ యం గారు అర్థనిమీలిత నేత్రులై ఆలోచించారు (పూర్తిగా నిమీలితులైతే నిద్రపోతున్నారనుకుంటారని). ఉల్ఫెన్ సన్ గారి సలహా తీసుకుందామా అనుకుని , ఛ ! ఛ ! డబ్బుతో సంబంధం లేని యీవిషయంలో గూడ ఆయన్నెందుకు సంప్రదించడం …. నేనే నిర్ణయిస్తా అని డిసైడ్ చేసుకుని , ఒక్క నిముషం యోగా లోకి దూకారు . ఫ్లాష్ వెలిగింది . మెల్లగా కళ్లు పూర్తిగా విప్పి , చిరునవ్వుతో అందర్నీ గమనించారు , గొంతు సవరించుకున్నారు , ” ఈ చిన్న విషయం గురించి యింతలా టైం వేస్టు చెయ్యడం అనవసరం . ఆ పాట ఎప్పుడో వ్రాసింది ప్రస్తుతం వున్న తెలుగు తల్లిని గురించి కదా ! సెంటిమెంటు ఉన్నవాళ్లు కొందరైనా వుంటారు . వాళ్ళుగూడా బాధపడకుండా , క్రొత్త తెలుగు తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించే సమయంలో , ముందుగా పాత తెలుగు తల్లి విగ్రహానికి మల్లెపూల దండలు వేసి , దండతో పాటు విగ్రహాన్నీ తొలగిస్తాం . అప్పుడు క్రొత్త విగ్రహాన్ని ఆవిష్కరిస్తాం . సరేనా ! “.
ఈ యిష్యూ యింత యీజీగా సాల్వ్ కావడంతో అందరూ కరతాళ ధ్వనులతో సి యం గారి ప్రతిపాదనను ఆమోదించారు . ఇక డిజైన్ సెలక్షన్ విషయం వైపు దృష్టిసారించారు . కొన్ని నిబంధనలు నిర్ణయించుకున్నారు ముందుగా , విగ్రహ రూపురేఖలు ప్రస్తుత ట్రెండుకనుగుణంగా వుండాలి . ఐ టి రంగాన్ని హైలైట్ చేస్తూ వుండాలి , గ్లోబల్ విలేజిగా మారిన ప్రపంచాన్ని ప్రతిబింబించాలి . దేశ , విదేశాల్లో పెరుగుతున్న మన రాష్ట్ర యిమేజిని గూడ దృష్టిలో వుంచుకోవాలి .
ఈ నిబంధనలకనుగుణంగా వున్న రెండు డిజైన్లను అంతిమ నిర్ణయం కోసం ఎంపిక చేసుకున్నారు . కాని విగ్రహానికి చూపిన డ్రెస్ విషయంలో మార్పు వుండాల్సిందేనని అందరూ అన్నారు . కారణం రెండు డిజైన్లలోనూ పంజాబీ డ్రస్ వాడడమే . విగ్రహానికి చీర వుండాలన్నారు కొందరు , తెలుగుదనం వుట్టిపడేలా పావడా , పరికిణీ వాడదామన్నారు కొందరు. చర్చించారు , తెలుగు “తల్లి” అంటున్నాం కనుక , తల్లులైన స్త్రీలు చీరలుకట్టడం సంప్రదాయం కనుక చీరకట్టినట్లు చూపడమే భావ్యం అని నిర్ణయానికొచ్చారు . మన క్రొత్త తెలుగు తల్లి సంప్రదాయం , ఆధునికత కలబోసి వుంటుందని ప్రచారం చేసుకోవచ్చని జబ్బలు చరుచుకున్నారు . ఒకరి భుజం ఒకరు తట్టుకుని , తమ ఆలోచనకు అభినందించుకున్నారు . చీరరంగు గురించి కొంత వాదన జరిగింది . తెల్ల రంగన్నారు కొందరు , కాదు పసుపురంగన్నారు , తెలుపు శాంతికి చిహ్నమని ఒకరంటే , పసుపు సౌభాగ్యానికీ , ఐశ్వర్యానికి చిహ్నమని మరొకరన్నారు . మెజారిటీ నిర్ణయం ప్రకారం పసుపు రంగు చీర వుంచాలని నిర్ణయించబడింది .
మొత్తం మీద ఈ ఐడియాలన్నిటిని కలగలిపి తెలుగుతల్లి క్రొత్త రూపు ఈ విధంగా ఉండాలని డిసైడ్ చేసారు స్త్రీత్వం ఉట్టిపడేలా ప్రసన్న వదనం , పెదవులపై చిరుమందహాసం , తలపై వుండే కిరీటాన , ముందు భాగంలో స్పష్టంగా కన్పించేలా హైటెక్ సిటీ చిత్రం , కిరీటాగ్రం పై వ్యవసాయాభివృద్ధికి గుర్తుగా వరికంకులు పింఛంలా మలచాలని , భుజ కీర్తులుగా డాము , విద్యుత్ టవర్ రెండువైపులా వుంచాలనీ , గళాభరణంగా సీ డీ ల దండ చెక్కాలని , దండ కడియాలు గా విద్యకు గుర్తుగా స్కూలు బిల్డింగు , మహిళాభివృద్ధికి గుర్తుగా డ్వాక్రా అనే పదాలు రెండువైపులా వుండాలని , సింహ మధ్య కటిభాగాన వడ్డాణము పై ‘ రోడ్ల విస్తరణ పధకం ‘ అని వ్రాయాలని , ఎదగడానికీ , ఎగరడానికీ ఉద్యుక్తమవుతున్న భంగిమలో ఒక చేత కంప్యూటర్ ను , మరో చేత విమానాన్ని పట్టుకుని వున్నట్లు చెక్కించాలని మెజారిటీ ఒపీనియన్ ప్రకారం నిర్ణయించారు కన్సెన్సెస్ కి అడ్డుపడుతూ పతిపక్షాలవారు ఈ విగ్రహాన్ని మీ ప్రభుత్వ పధకాల ప్రచారం కోసం వాడుకుంటున్నారు అని ఆరోపించడంతో . వాళ్ళు చెయ్యలేరు, మమ్మల్ని చెయ్యనివ్వరు. ఉక్రోషం పట్టలేక , అలవాటు ప్రకారం ఆరోపణలు చేస్తున్నారు , ఇలాటివాటిని మేం లెక్క చేయం అని అధికార పక్షం వారు తోసిపుచ్చారు .
ఈ విధంగా రూపురేఖలు నిర్ణయించబడ్డ తెలుగు తల్లి క్రొత్త విగ్రహాన్ని ప్రముఖ డిజైనర్ చేత డిజైన్ చేయించి , విగ్రహ తయారీకి గ్లోబల్ టెండర్లు పిలిచారు . ఒకో విగ్రహానికి 50 లక్షల రూపాయలు కోట్ చేసిన ఒక అమెరికన్ కంపెనీవారికి ఆర్డరు దొరికింది . ఆకంపెనీ వారు ఆంధ్రా లోని శిల్పులకు విగ్రహానికి 50 వేల రూపాయలు యిచ్చి 300 విగ్రహాలు తయారు చేయించారు .
రాష్ట్రావతరణ దినోత్సవం దగ్గరవుతున్నది … అన్ని నియోజక వర్గాలలో , మరి కొన్ని ముఖ్యప్రదేశాల్లో విగ్రహావిష్కరణకు రంగం సిద్ధమవుతున్నది .
టాంక్ బండ్ మీద తెలుగు తెల్లి , స్తూపం మీద నుండి మెల్లగా దిగి తల దించుకుని , రోడ్డు దాటి హుస్సేన్ సాగర్ వైపు వెళుతున్నది .
------------------------------------------------------
రచన: కె. యస్. పరబ్రహ్మం,
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment