కూనిరాగం
సాహితీమిత్రులారా!
ఒక రాజు గారున్నారు.
అందరూ వారిని “పెద్ద రాజుగారు” అంటారు.
చూట్టానికి వారు “పెద్ద” రాజులా ఉండరు.
అసలు “రాజు”లా కూడా ఉండరు.
వారి ఒరిజినల్ పేరు “పెద్ది రాజు” గారు.
కాకపోతే గత కొంతకాలంగా వారి బొక్కసం ధనం బరువు మొయ్యలేక మూలుగుతోంది.
“పెద్దిరాజు” గారు “పెద్ద రాజుగారు” గా పరిణామం చెందటానికి అదో కారణం కావొచ్చు.
పెద్దిరాజు గారి సొంత వూరు “పెద్ద పాలెం”.
ప్రస్తుతం వారి నివాసం “మబ్బుల పాడు”.
వారు “పెద్ద రాజుగారు” కావటానికి అదీ ఓ కారణం కావొచ్చు.
పెద్దిరాజు గారు పెద్ద పాలెం నుంచి మబ్బుల పాడుకి నివాసం మార్చటానికి వెనక బోలెడన్ని ఆర్థిక, సాంఘిక, రాజకీయ కారణాలున్నాయి. ఐతే వాటితో యీ కథకి అంతగా సంబంధం లేదు కనక మనకు వాటి ప్రసక్తి అక్కర్లేదు.
మన సంప్రదాయం ప్రకారం డబ్బున్నవాడు రాజు. డబ్బున్నవాడే రాజు.
ఒకసారి రాజు గారయ్యాక వారా డబ్బు ఎలా సంపాయించారన్నది ఎవరికీ అక్కర్లేని విషయం.
వంశపారంపర్యంగా వచ్చిన డబ్బుకీ మరో మార్గాన వచ్చిన డబ్బుకీ రంగూ, రుచీ, వాసనల్లో తేడా ఏమీ లేదు కదా!
మరి రాజు గారున్నప్పుడు వారికి మందీ మార్బలం, భటులూ భట్రాజులూ, కవులూ గాయకులూ యిలా నానా జాతుల ఆశ్రితులూ వుండాలి కదా!
ఐతే, పెద్ద రాజుగారు పూర్వాశ్రమంలో పెద్దగా ధనవంతులు కారు.
ఆ స్వానుభవంతో వారు ఇప్పటికీ డబ్బు ఖర్చు పెట్టే విషయంలో చాలా అప్రమత్తులై వ్యవహరిస్తారు.
ఈ విషయాన్ని ఎత్తిపొడుస్తూ మబ్బుల పాడు కొంటె కోణంగులు కొందరు వారిని ” ‘ పేద్ద ‘ రాజు గారులే!” అని అప్పుడప్పుడు హేళన చేస్తుండటం కద్దు.
ఇలాటి వాటికి సామాన్యంగా చలించరు వారు.
ఎప్పుడన్నా బలహీన క్షణాల్లో మాత్రం అలాటివి విన్నప్పుడు వారి గుండె కొంచెం కళుక్కుమంటూంటుంది.
ఆ అపకీర్తిని ఎలాగేనా పోగొట్టుకోవాలని కొంతకాలం పాటు తీవ్రంగా ఆలోచించేరు వారు.
ఆ సమయంలోనే, మబ్బుల పాడులో తమ కీర్తి మబ్బుల్ని తాకాలంటే తమ ఖజానాలోని ధనం అందుకు బయానాకి కూడా చాలదని గ్రహించేరు వారు.
పెద్ద రాజుగారికి సొంతవూరు పెద్ద పాలెమంటే బోలెడంత అభిమానం.
అని అందరూ అనుకోవాలని వారి తాపత్రయం.
కాని వారికున్న అభిమానం అంతా కేవలం “సొంతం” మీదే కాని “సొంత”దేని మీదా కాదని వారికీ వారి శత్రువులకీ స్పష్టంగా తెలుసును.
అంచేత, డబ్బు బాహా సంపాయించేక, దాన్లో కొంత ఖర్చు పెట్టి బోలెడంత కీర్తిని కొనుక్కోవటం పెద్ద కష్టం కాదని గమనించేరు.
దానికి ఓ సులువైన పద్ధతి కనుక్కున్నారు వారు.
ఏటేటా విజయదశమి ఉత్సవాలకి తమ సొంత వూరు నుంచి తనక్కావలసిన వాళ్ళని కొందర్ని పిలిపించి వారికి ఘనంగా సన్మానాలు, సత్కారాలు చెయ్యటం ప్రారంభించేరు.
అలా, మబ్బుల పాడులో విజయదశమి మహత్తరంగా, ఆర్భాటంగా, హడావుడిగా ఉంటోంది.
అక్కడి ప్రజ చాలామంది మిగతా సంవత్సరం అంతటి పన్లనీ ఆ ఉత్సవాల చుట్టూ నిర్మించుకునేంత ప్రచారం లోకి వచ్చేయవి.
పెద్ద పాలెం దొమ్మరి మేళాలు, పగటి వేషగాళ్ళు, తోలుబొమ్మలాటల వాళ్ళు వీళ్ళ ఆటపాటల్తో, డప్పుల్తో, బాజాల్తో మబ్బుల పాడు మారుమోగుతుందప్పుడు.
ఇదిలా ఓ పక్క వుంటే, మరో పక్క పెద్ద పాలెం ఊరి పెద్దలూ, పెద కాపులూ కూడ కుటుంబాల్తో తరలి వస్తుంటారు ఈ పండగలకి.
వారికి పెద్ద రాజుగారు ప్రత్యేకంగా విడుదులు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మర్యాదలు జరిపిస్తారు.
ఎందుకంటే
ఎప్పుడన్నా ఏమీ తోచక పెద్ద రాజుగారు పెద్ద పాలెం చూట్టానికి వెళ్ళినప్పుడు ఆ ఊరిపెద్దల పరిచయంతో వారికి ఎంతో ఉపయోగం కలుగుతుంటుంది.
పైగా పెద్ద రాజుగారి బంధువర్గం చాలావరకు మబ్బుల పాడు తరలివచ్చినా, యింకా కొంతమంది పెద్ద పాలెం లోనే వుంటున్నారు. పెద్ద రాజుగారి పేరు ద్వారా ఆ ఊరిపెద్దల అండదండలు వాళ్ళ అవసరాలకు అంతో యింతో పనికొచ్చే అవకాశం కూడా వుంది.
అలా
ఉత్సవాల పేరుతో, సన్మానాల జోరుతో తమ పనులకు పనికొచ్చే వాళ్ళని, తమ భజనలకి పనికొచ్చే వాళ్ళనీ కూడా మంచి చేసుకుంటున్నారు పెద్ద రాజుగారు.
ఇలా, పెద్ద రాజుగారి పేరు ప్రతిష్ఠలు వారు పెద్ద పాలెంలో ఉన్నప్పటి కంటే దాన్ని వదిలేసి వెళ్ళేకే పెద్ద పాలెంలో పెద్ద పీట వేసుక్కూచోవటం మొదలెట్టేయి.
ఈ సదుపాయం కొన్నాళ్ళు సజావుగానే సాగింది.
పెద్ద రాజుగారి కోరిక మేరకు వారిని కోరినప్పుడల్లా కీర్తికాంత కామిస్తోంది.
వారి బంధు మిత్రులకు, ఆశ్రితులకు పెద్ద పాలెంలో పేరు పెరుగుతోంది.
ఎలాగూ రాజు గారుండేది మరో ఊళ్ళో గనక రోజూ ఉదయమే వెళ్ళి వారి భజన చేసే పని, వారి ఉప్పు కొంతైనా తింటున్నందుకు వారి అధికారాన్ని భరించాల్సిన అగత్యమూ లేక స్వేఛ్ఛగా, ఉన్నంతలో సుఖంగా ఉన్నారు వాళ్ళు.
ఐతే వాళ్ళెవరూ ఊహించని మరో పరిణామం కూడా పెద్ద పాలెంలో చాప కింద నీరులా చోటు చేసుకోవటం మొదలైంది. అదేమిటంటే
డబ్బు కక్కుర్తి పెద్ద రాజుగారు ఏటేటా పట్టి పట్టి ఓ వందమందికి సన్మానాలూ గట్రా చేయిస్తుంటే
వారి సన్మానాల కోసం చంద్రచకోరాల్లా ఎదురుచూస్తోన్న మిగతా యాభై వేల మంది పెద్ద పాలెం జనాభాకి మెల్ల మెల్లగా జ్ఞానోదయం కలిగింది తమ వంతు వచ్చేసరికి తాము యింకో లోకంలో వుంటామని!
దాంతో సహజంగానే వారికి, సన్మానాలు చేయించుకున్న వారి మీద, వారికి సన్మానాలు చేయిస్తోన్న పెద్ద రాజుగారి మీద అసూయగా మొదలైన భావం క్రమక్రమంగా కోపంగా, ద్వేషంగా వేషం వేసుకోవటం మొదలయ్యింది.
ఇక దాంతో వాళ్ళు, “రాచరికం నశించిందని మేం ఆనందిస్తోంటే (నిజంగా కాదు, ఉత్తుత్తినే), యింకా యీ సన్మానాలూ, బిరుదులూ (మాక్కాక యింకెవరికో) యేమిటి? అసలు యీ రాజు నిజంగా రాజు కాడు కూడా (అది నిజమే). ఇతని దగ్గర ఉందంటున్న డబ్బు ఎలా సంపాయించేడో మనకి తెలీనూ తెలీదు. ఏ దొంగనోట్లు గుద్దేడో, బేంక్ దొంగతనాలు చేసేడో!” అంటూ రాజు గారికే గోతులు తవ్వటం మొదలెట్టేరు.
ఐతే, సన్మానాలు చేస్తున్నప్పుడో చేయిస్తున్నప్పుడో చేయించుకునేప్పుడో మాత్రమే పెద్ద పాలెం వాళ్ళని కలిసే రాజుగారికి భజనబృందాల పొగడ్తల బృందగానాల్లో యీ నిరసనలూ యీర్య్షలూ తెలీనేలేదు.
ఈ నేపథ్యంలో, ఓ సారి పెద్ద రాజుగారు ఆర్భాటంగా పెద్ద పాలెం వెళ్ళినప్పుడు ఓ వింత సంఘటన జరిగింది.
దానికి మూలం ఏమిటంటే
పెద్ద రాజుగారికి ఎప్పట్నుంచో తీరని కోరిక ఒకటుంది.
రోజూ స్నానం చేసేప్పుడు కూనిరాగంతో పాటలు పాడుకోవటం పెద్ద రాజుగారికి ఎప్పుడు అలవాటయిందో తెలీదు గాని
ఆ సత్యాన్ని వారు స్పష్టంగా గుర్తించేసరికి, తాము కేవలం కూనిరాగాలు మాత్రమే తియ్యటం లేదనీ, సంగీత సాధన చేస్తున్నామనీ అనిపించింది వారికి.
దాంతో యింకా తీవ్రంగా గాత్రసాధన సాగించేరు వారు, స్నానం సమయాన్ని పొడిగించుకుంటూ.
అలా వారు బాత్రూమ్ భాగవతార్ లయేరు.
అప్పటికి తమ గాత్రసంగీతం మీద ప్రగాఢమైన నమ్మకం కుదిరింది వారికి.
మెల్ల మెల్లగా, ఎవరేనా తమ యింటికి వచ్చినప్పుడు గాని, ఎవరింటికేనా తాము విజయం చేసినప్పుడు కాని, సంభాషణల్లోకి విరివిగా కూనిరాగాలు ప్రవేశపెట్టసాగేరు వారు.
ఇలా కొద్దిరోజులే గడిచేయి.
ఎందుకంటే
మబ్బుల పాడులో అందరూ స్నానాల సంగీతంలో అంతటి ఉద్దండపిండాలే. ఈవిషయం మొదట్లో తెలీలేదు రాజుగారికి.
అంచేత
కొద్దిరోజుల్లోనే పరిస్థితులు తారుమారయ్యాయి.
రాజుగారు కూనిరాగం మొదలెట్టటం తోనే అక్కడినుంచి అంది పుచ్చుకుని గాత్రమల్లయుద్ధరంగం లోకి గోచీలు పెట్టుకు దిగిపోయేవారు మిగిలిన వాళ్ళంతా.
ఆ రణగొణధ్వని రాజుగారికే కర్ణకఠోరంగా వుండేది.
ఈ పరిణామంతో బిక్కచచ్చిపోయిన పెద్ద రాజుగారు తాము చేసిన పనికి ఎంతో వగచేరు.
ఎక్కడికి వెళ్ళినా వెంటపడుతున్న ఈ గార్దభస్వరసంగీతవిన్యాసాల్ని వదిలించుకోవటం ఎలాగో తెలీక నిద్రకు దూరమయేరు.
ఇంక ఇలా కాదని మరో మార్గం ఆలోచించేరు.
“అట్నుంచి నరుక్కురమ్మన్నారు” కదాని, అటుకే బయల్దేరేరు.
పెద్ద పాలెం ప్రయాణం కట్టేరు.
పెద్ద పాలెం చేరిన రాజుగారు ముందుగా అక్కడి సంగీత విద్వాంసుల్తో ఒక సభ ఏర్పరిచేరు.
ఊరికే రావటానికి ఊరివారందరూ మొహమాట పడటంతో, వచ్చిన వారందరికీ సన్మానాలు చేస్తామని ప్రకటించి వారికి మరో దారి లేకుండా చేసేరు కార్యశూరులైన రాజుగారు.
దాంతో తప్పనిసరై సంగీతవిద్వాంసులంతా సభకి విచ్చేసేరు.
విచ్చేసిన వారు అలవాటు ప్రకారం గానే ఒకరి మీద ఒకరు కొండేలు చెప్పుకుంటూ, చెప్పులు విసురుకుంటూ, బూతులు తిట్టుకుంటూ పరస్పరదూషణశాస్త్ర చర్చలు సాగిస్తోంటే
వారిని పాడమని ఆదేశించేరు రాజుగారు.
పాటకింతని పైకం పక్కనే పెట్టి అందరికీ ఎదురుగా ఉంచేరు.
ఆ దృశ్యం చూసి పులకించిన గాయకశిఖామణులు ఒక్కొక్కరే పోటీలు పడి పాడసాగేరు.
ఇక తాము ఏ ప్రణాళిక మీద ఇక్కడికి వచ్చేరో దాన్ని అమలు చెయ్యటానికి పూనుకున్నారు రాజుగారు.
అందులో తొలిభాగంగా ఆ గాయకుల గానం గురించీ ప్రావీణ్యం గురించీ తమకు తోచిన వ్యాఖ్యానాలు చెయ్యటం మొదలెట్టేరు వారు.
ఐతే
సహజంగానే, ఆ గాయకులకు రాజుగారి యీ వాలకం నచ్చలేదు.
అసలు వారికి ఒకర్నొకరు తిట్టుకోవటమో పొగుడుకోవటమో తప్ప గానాన్ని గురించీ జ్ఞానాన్ని గురించీ మాట్టాడాలంటే ఒంటిమీద తేళ్ళూ జెర్రులూ పాకినట్టుంటుంది.
నోరు మెదపనంత కాలం రాజుగారు సకలకళాభిరాములనీ, సాహితీమురళీకృష్ణులనీ, పుంభావసరస్వతీమూర్తులనీ పొగిడేరు కాని వారిలా నిజంగా తమకు తెలుసునన్నట్టు ప్రవర్తిస్తుంటే గాయకులకి మనుషులంత కోపాలొచ్చేయి.
“రాజుగారి పని బహుమానా లివ్వటం, గాయకుల పని పాటలు పాడటం. అలా కాకపోతే కుక్క పని గాడిద చేసినట్టే ఔతుంది” అని తమని తాము పొగుడుకుంటూ అక్కడికక్కడే కొందరు చెవులు కొరుక్కున్నారు కూడా.
ఐతే నేరుగా రాజుగారిని విమర్శించే ధైర్యం ఎవరికుంది?
ఇదంతా చూస్తున్న అక్కడి ఆస్థానవిద్వాంసుడు తల పంకించేడు.
అతను అనేక అంతస్తుల రాజకీయాల్లో తలమగ్గిన వాడు.
అతనికి రాజుగారి మనోగతం ఇట్టే అవగతమై పోయింది.
అప్పుడతను వినయంతో వణికిపోతూ అన్నాడూ “మహారాజా! మీ సంగీత జ్ఞానం అమోఘం, అద్వితీయం! కనక పెద్ద పాలెం వూరు బయట నల్లతుమ్మ తోటలో తమ సంగీత కచేరీ ఏర్పాటు చేసి మమ్మల్నే కాకుండా వూరి వారందర్నీ పునీతుల్ని చెయ్యాలని వీరందరి తరఫునా మిమ్మల్ని ప్రార్థిస్తున్నా”.
అది విన్న రాజుగారు ఎగిరి గంతేసేరు.
వారు వేసుకున్న పథకం అదేనాయె!
మబ్బుల పాడులో తన గానాన్ని ఎవరూ ఎలాగూ పట్టించుకోవటం లేదు. కనీసం పెద్ద పాలెంలో నైనా స్టేజి ఎక్కి పాడాలనే తమ చిరకాలవాంఛ నెరవేరబోతోందని ఆనందించేరు వారు.
అలా వారు అనుకున్నది ఒకటైతే
అసలు జరిగింది మరోటి.
అదెలాగంటే
అప్పటిదాకా రాజుగారి సన్మానాలకి నోచుకోని పెద్ద పాలెం పౌరులు యాభై వేల మంది ఉన్నారని ముందే మనవి చేసేను కదా. ఆ ఆటవికారణ్యం లోకి ఈ రాజుగారి సంగీతకచేరీ వార్త కారుచిచ్చులా వ్యాపించింది.
తమకు సన్మానాలు చెయ్యకపోగా రాజుగారు ఇలా సొంత సన్మానానికి ఒడిగట్టే సరికి వాళ్ళ ఆవేశాలకి పట్ట పగ్గాలు లేకుండా పోయేయి.
దాంతో వారు ఉగ్రులయేరు. ఆగ్రహోదగ్రులయేరు.
అసలు రాజుగారికి పెద్ద పాలెం సంగీతంలో ఓనమాలే తెలీవని దుష్ప్రచారం సాగించేరు. ఆయనకేమన్నా సంగీతం అనేది వస్తే అది మబ్బుల పాడు పాడుపద్ధతి దనీ అలాటి సంగీతం పెద్ద పాలెంలో వినిపిస్తే పెద్ద పాలేనికి జలప్రళయం వస్తుందనీ ఊరి పెద్దల్ని ఊదరగొట్టేసేరు వాళ్ళు.
ఓట్లు లెక్క పెట్టటంలో ఉద్దండపిండాలైన పెద్ద పాలెం ఊరిపెద్దలు వెంటనే తమ కర్తవ్యం గ్రహించేసేరు.
పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయనీ ఉగ్రవాద కలాపాలకి అవకాశాలు విపరీతంగా ఉన్నాయనీ ఆ స్థితిలో రాజుగారి భౌతిక సంరక్షణ కూడ క్లిష్టమౌతుందనీ అలాంటప్పుడు పాటకచ్చేరీ పెట్టినా దాన్ని వినే భాగ్యానికి పెద్ద పాలెం ప్రజలు నోచుకోలేరనీ వారు రాజు గారికి వినయంతో విన్నవించేరు.
రాజు గారి పాటకచ్చేరీ వినాలని తమకెంతో కుతూహలంగా ఉందనీ కనక ఎప్పుడు రాజుగారి ఖర్చుల మీద రమ్మన్నా అప్పుడు సకుటుంబ సపరివార సమేతంగా మబ్బుల పాడులో వచ్చి వాలి వారి సంగీతామృతాన్ని ఆస్వాదించటానికి తామంతా సిద్ధంగా ఉన్నామనీ ముక్తకంఠంతో వివరించేరు. ఆవేశం ఆపుకోలేని కొందరు ఢంకాలు బజాయించీ, బల్లలు విరగ్గొట్టీ మరీ వారి అభిప్రాయాల్ని విశదీకరించేరు.
అలా
పాపం, పెద్ద రాజుగారి పెద్ద పాలెం సంగీత కచేరీ నిరవధికంగా వాయిదా పడింది.
దాంతో వారు ఒక్క క్షణం ఖిన్నులే అయేరు.
ఐతే,
ధీరచిత్తులు గనక మబ్బుల పాడు తిరిగి వెళ్ళిన వెంటనే తమ కోశాగారంలో కాసేపు సుఖవిశ్రాంతి తీసుకుని ఆ ధనాలింగనసౌఖ్యంతో స్వస్థులయేరు.
--------------------------------------------------
రచన: కె. వి. ఎస్. రామారావు,
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment