Sunday, October 13, 2019

చిరుదీపం


చిరుదీపం





సాహితీమిత్రులారా!

ఉదయం 7.30 కావస్తోంది. కిటికీలోంచి కనిపిస్తూన్న ఆహ్లాదకరమైన దృశ్యాన్ని గమనిస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు రామారావ్‌. చుట్టూరా మంచి తోట. ముందుభాగంలో ఒక చిన్న సరస్సు. అందులో బాతులు. పరిసరాలు ఎంతో అందంగా ఉన్నాయి. ఏప్రిల్‌ నెల కావడం వల్ల చలి తగ్గింది. ఉదయం 6.00 కాకుండానే సూర్యోదయం అవుతోంది. ఆరోజు తన 70వ పుట్టినరోజు. బయటకి పోవాలని, విచ్చలవిడిగా తిరగాలని, బలమైన కోరిక కలిగింది రామారావుకి. కాని తను ఖైదీ. నర్సింగ్‌హోమ్‌లో బందీ. తనకి నచ్చినట్లు చేయడానికి కావలసిన స్వాతంత్య్రం, సత్తువా లేవు తనకి. అక్కడి రొటీన్‌ అలవాటు పడలేకపోతున్నాడు రామారావు. ఇక తనకిదే ప్రపంచం. ఆలోచనలు పరిపరి విధాల పోయాయి రామారావుకి.

“గుడ్‌ మార్నింగ్‌ మిష్టర్‌ గేంటీ … హేపీ బర్త్‌డే. హియరీజ్‌ యువర్‌ బ్రెక్‌ ఫాస్ట్‌. ఇటీజ్‌ ఎ వండర్‌ ఫుల్‌ బ్రీజౌట్‌ సైడ్‌ ఎంజోయ్‌ యువర్‌ మీల్‌” అంటూ డే ట్రేని తన ముందుకి తోసి, భారమైన తన శరీరాన్ని ఊపుకుంటూ బయటకు పోయింది నర్సింగ్‌ ఎయిడ్‌ బ్రెండా. అలవాటు ప్రకారం ఆ ట్రేని పరిశీలించాడు రామారావ్‌. ఒక బౌల్‌ లో సీరియల్‌, చిన్న కార్టన్‌లో పాలు, రెండు టోస్ట్‌ పీస్‌లు, జెల్లీ, ఆరంజ్‌ జ్యూస్‌. ఎందుకో అవి తినబుద్ధి అవలేదు. నిర్లిప్తతతో ప్రక్కకి తోసేసాడు. ఆరంజ్‌ జ్యూస్‌ మట్టుకు గబగబా త్రాగేశాడు. ఎలాంటి బ్రతుకు బ్రతికాడు తను? ఇలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుంటాడని కలలో కూడా అనుకోలేదు.

గంటి రామారావు 45 సంవత్సరాల క్రితం పాతికేళ్ళ వయసులో ఈ దేశం వచ్చాడు భార్య వసంతతో. వసంత నిజంగా అతని జీవితంలో వసంతం తీసుకొచ్చింది. నల, భీమ పాకంతో పాటూ, సంగీతం, సాహిత్యం, తెలుగు సంస్కృతీ అన్నీ అతని జీవితంలో నింపింది. ఉదయాన తనకు నచ్చినట్లుగా జీడిపప్పు ఉప్మా, ఇడ్లీ, సాంబారు, దోసెలు, చేస్తూ ఉండేది. “రోజూ ఎందుకంత కష్టపడతావు?” అని తాను ఎంత వారించినా, కారం కారంగా, పుల్ల పుల్లగా ఉంటే తనకు నచ్చుతాయని ఉదయాన్నే వంట చేసి లంచ్‌ పేక్‌ చేసి ఇచ్చేది. రామారావుకి లేవగానే ఎమ్‌.ఎస్‌. సుబ్బులక్ష్మిదో, బాలమురళిదో సంగీతం, సాయంత్రం ఘంటసాల, సుశీల సినిమా పాటలు, శని ఆది వారాల్లో తెలుగు సినిమాలు, కచేరీలు, సాహితీ సదస్సులతో రామారావు జీవితం గడిచిపోయేది. కొడుకు ఆనంద్‌ని, కూతురు అరుణని కూడా చాలా పద్ధతిగా సంప్రదాయంతో పెంచేరు రామారావు, భార్య. పిల్లలిద్దరూ తల్లిదండ్రుల ఇష్టాలకు భిన్నంగా కాకుండా లక్షణంగా తల్లిదండ్రులు ఒప్పుకున్న ఆంధ్రా పిల్లల్నే పెళ్ళి చేసుకున్నారు. మంచి మంచి ఉద్యోగాల్లో సెటిలయ్యారు. అంతా చూసి తన అదృష్టం అని మురిసిపోయాడు రామారావు. అరుణ కొడుకు, కూతురు పెంపకంలో తాము చేయగలిగినంత సహాయం చేసేరు కూతురికి రామారావు, భార్య. ఆనంద్‌, లతలకు,  పదేళ్ళ క్రితం కవల పిల్లలు పుట్టినప్పుడు అతనూ భార్య ఏడాది పాటు వాళ్ళ ఇంట్లో ఉండి ఎంతో సాయం చేశారు. అప్పుడప్పుడు కోడలు ముభావంగా ఉన్నా వేరే భావించకుండా ఎలాగో సర్దుకుపోతూ వచ్చేరు తనూ, భార్య.

ఆరు సంవత్సరాల క్రితం భార్యకు కేన్సరు రావడం, రెండేళ్ళు తిరక్కుండానే 62వ ఏట కన్నుమూయడం రామారావు జీవితంలో పెద్ద అశనిపాతం. అంతే అప్పటి నుండి తను కోలుకోలేదు. కీళ్ళవాతం, నరాల జబ్బు, మొదలెట్టి పనిచేయలేక 65 వెళ్ళాక రిటైరైపోవాలిసి వచ్చింది. ఒక ఏడాది ఒంటరిగా తన ఇంట్లోనే ఉన్నాడు రామారావు. కాని రాను రాను జబ్బు ముదిరి, మరొకరి సహాయం లేకుండా నడవలేక పోయేవాడు. చివరికి వీల్‌చైర్‌లో కూర్చోవాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో ఒకటి, రెండు నెలలు కొడుకు, కోడలి దగ్గర ఉన్నాడు రామారావు. కాని అక్కడి వాతావరణం మనస్సుకి కష్టంగా తోచింది రామారావుకి. గత్యంతరంలేక తన కొడుకు ఉన్న ఊళ్ళోనే కొడుకు ఇంటికి దగ్గరగానే ఉన్న నర్సింగ్‌హోమ్‌లో చేరాడు. అతను తన తల్లి ఇండియాలో చనిపోతే, వెంటనే తండ్రిని తన దగ్గరకు తెచ్చుకొని, ఆయన మరణించిన దాకా తనూ, భార్యా సాకేరు. అంత్యక్రియలన్నీ సవ్యంగా జరిపించేరు. తనకి కూడా అలాగే జరుగుతుందని తనెప్పుడూ బలంగా ఆశించలేదు. కాని ఇలా నర్సింగ్‌హోమ్‌లో బందీగా అయిపోతానని కూడా ఎన్నడూ ఊహించలేదు రామారావు.

నర్సింగ్‌హోమ్‌లో చేరిన మొదట్లో కొడుకు, కోడలు, వారం వారం అతన్ని చూడడానికి వచ్చేవారు. రాను రానూ నెలకో సారి రావడం మొదలెట్టారు. కొన్నాళ్ళకి ఆ ఊరు వదిలి, మంచి ఉద్యోగం వచ్చిందని టెక్సస్‌కి వెళ్ళిపోయారు. తండ్రిని ఆ ఊళ్ళో వదిలేసి వెళ్ళడం ఆనంద్‌కి ఇష్టం లేదు. తమ ఊరు రమ్మని బలవంతం చేశాడు. కాని రామారావే వద్దన్నాడు. ప్రస్తుతం కొడుకు టెక్సస్‌లో కూతురు కాలిఫోర్నియాలో ఉన్నారు. రామారావు మాత్రం నేష్‌విల్‌లో నర్సింగ్‌హోమ్‌లో సెటిలయి పోయాడు. అందరూ ఇచ్చిన పాటలు విన్నవే విని పుస్తకాలు చదివినవే చదివి మెదడు మొద్దుబారిపోయింది రామారావుకి. ఎప్పుడో ఆరునెలలకో, ఏడాదికో కొడుకో, కూతురో, అల్లుడో వస్తూ ఉంటారు. నెలకో, రెణ్ణెల్లకో ఫోన్‌ చేస్తూ ఉంటారు. మిగతా సమయం ఆ నర్సింగ్‌హోం నాలుగు గోడల మధ్య. రామారావు కాళ్ళూ, చేతులూ స్వాధీనంలో లేవు గాని మెదడు మట్టుకు చురుగ్గా బాగా పనిచేస్తుంది. దాంతో ఆలోచనలు చుట్టుముట్టేస్తూ ఉంటాయి. దానికి తోడు అక్కడ తిండీ, పద్ధతులూ ఏవీ రామారావుకి అలవాటు పడలేదు. బ్రతుకంటే విసుగొచ్చింది రామారావుకి.

అతని ఆలోచనలని కట్టిపెట్టేస్తూ, జోరుగా తలుపు తీసుకుంటూ లోపలికి వచ్చిందో తెల్ల అమ్మాయి.

“హేయ్‌ మిష్టర్‌ గేంటీ, హేపీ బర్త్‌డే!” అంటూ, అక్కడున్న ట్రే వైపు చూసి, “యు ఆర్‌ ఇన్‌కారిజబుల్‌. మీరు మళ్ళీ మొదటికొచ్చారు. ఏమీ తినలేదు ఈరోజు కూడా. ఇలా ఐతే ఎలా? మీరు తినేస్తే, మీకు మంచిది చూపిస్తా” అంటూ తన చేతిలో సంచీ చూపించింది ఆ పిల్ల.

“హాయ్‌ క్రిస్టీ, వాటీజిట్‌?” అన్నాడు నిర్వికారంగా రామారావు.

“వెల్‌ మా నైబర్స్‌, పటేల్స్‌ ఇచ్చేరు ఈ విడియో. ఇది చాలా మంచి సినిమా మీకు నచ్చుతుందని చెప్పేరు. ఇది హిందీ సినిమా అనాడీ. రాజ్‌కపూర్‌ సినిమా తెలుసా?” హిందీ బాగా వచ్చిన దానిలా ఆరిందాలా కళ్ళు చక్రాల్లా తిప్పుతూ చెప్పింది క్రిస్టీ.

“బి ఎ గుడ్‌ బాయ్‌ ఎండ్‌ ఈట్‌ యువర్‌ బ్రెక్‌ ఫాస్ట్‌. ఐ విల్‌ గెట్‌ ది విసీఅర్‌ ఫర్‌ యూ” అంటూ బయటకు పరిగెత్తింది. క్రిస్టీ పదిహేడేళ్ళ అమెరికన్‌ పిల్ల. ఆ నర్సింగ్‌ హోమ్‌లో వలంటీరు పని చేస్తూ ఉంటుంది. ఆవారం స్ప్రింగ్‌ బ్రేక్‌ అవడం వల్ల వారం అంతా అక్కడే పని చేస్తోంది. బలవంతాన ఏదో కుక్కుకుని, సినిమా చూడ్డానికి నిశ్చయించుకున్నాడు రామారావు.

తనకి ఎన్‌.టి. రామారావు సినిమాలంటే ఎంత ఇష్టమో! ఎన్నాళ్ళయింది ఆ సినిమాలు చూసి. పోన్లే ఏదో ఒకటి  పాత సినిమా కదా అనుకుంటూ ఆ హిందీ సినిమా చూడ్డంలో లీనమయిపోయాడు రామారావు. ఫోన్‌ రింగయితే, రిసీవర్‌ ఎత్తాడు.

“మామయ్య గారూ, నేనూ లతని, బాగున్నారా? పుట్టినరోజు శుభాకాంక్షలు” కోడలు పలకరించింది. “ఆఁ బాగానే ఉన్నా. ఆనంద్‌, పిల్లలూ ఎలా ఉన్నారు?”

“అంతా బాగున్నాం. ఆనంద్‌ యూరప్‌ వెళ్ళేరు. వారం అయింది. తనకి పని వత్తిడి అంతా ఇంతా కాదు. పైగా ఇదిగో ఈ కొత్త ఇల్లు కట్టిస్తున్నామా, మొత్తం ఆరువేల అడుగులు. మూడు లెవెల్స్‌. పెద్ద ఇల్లు. దగ్గరుండి కట్టించడం మాటలతో పనా? పగలూ రాత్రి ఇంటికి కావలసిన పనులతోనే సరిపోతుంది. ఈ ఇల్లు ఎప్పుడు పూర్తవుతుందో గాని నాకు ఊపిరి తీసుకోవడానికి ఒక్క నిముషం దొరకడం లేదు. ఇంకో విషయం మీ మనవరాళ్ళు ఉన్నారే అచ్చంగా మీవి, అత్తగారివి భావాలన్నీ పుణికిపుచ్చుకు పుట్టారంటే నమ్మండి. ఆషాకి ఎన్‌.టి. రామారావు సినిమాలంటే పిచ్చి. ఉష ఎమ్‌.ఎస్‌. సుబ్బులక్ష్మి పాటలంటే చెవికోసుకుంటుంది. మీ పుణ్యమా అని మా పిల్లలందరికీ మన సంస్కృతి, సంప్రదాయం అంటే మహా ఇష్టం సుమండీ. దాంతో వాళ్ళ భరతనాట్యం క్లాసులు, వాళ్ళ సంగీతం క్లాసులతో సతమతమవుతున్నానంటే నమ్మండి. అందుకే ఈ మధ్య ఇంట్లో పనులే చేసుకోలేకపోతున్నా.

ఈ రోజు మీ పుట్టిన రోజు అని మొన్న కొన్ని జంతికలు, కాజాలు చేసి పంపేను అందేయా?” అడిగింది లత. “లేదు” అన్నాడు రామారావు ముభావంగా.

“ఇవ్వాళో, రేపో అందుతాయేమో. ఆనంద్‌ యూరప్‌ నుండి రాగానే కొంచెం వీలు చేసుకొని, మిమ్మల్ని చూడడానికి వస్తారు. ఇవ్వాళ నాకు ఇంటీరియర్‌ డెకరేటర్‌తో ఎపాయింట్‌మెంట్‌ ఉంది. వెళ్ళాలి. ఉంటా. మీ ఆరోగ్యం జాగ్రత్త. మందులు వేసుకోవడం మర్చిపోకండి” హెచ్చరించి మరీ ఫోన్‌ పెట్టేసింది. నవ్వొచ్చింది రామారావుకి.

నర్సింగ్‌ హోం లో ఉంటూ మందుల గురించి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం తనకేమిటీ! ఏమిటో వాళ్ళ  జీవితాలు వాళ్ళవి. వాళ్ళ జీవితాలకీ, తన జీవితంకీ ఎక్కడా సంబంధం లేదు. మళ్ళీ సినిమా చూడ్డంలో మునిగిపోయాడు రామారావు.

“వాటార్‌ యు వాచింగ్‌” అంటూ లావుపాటి నర్సు లోపలికి వచ్చింది రామారావుకి మందులివ్వడానికి.

“అనాడీ” అన్నాడు సినిమా కట్టేస్తూ రామారావు. “అంటే” ప్రశ్నార్థకంగా అంది బ్రెండా. “చేతకానివాడు బ్రెండా. దట్స్‌ హౌ ఐ ఫీల్‌ నౌ. మై లైఫ్‌ ఈజ్‌ ఎ వేస్ట్‌. మై కిడ్స్‌ డోంట్‌ వాంట్‌ మి. ఐ జస్ట్‌ హావ్‌ టు లివ్‌ ఎ మిజెరబుల్‌ లైఫ్‌ ఆల్‌ ఎలోన్‌ హియర్‌” విసుగ్గా తనలో తానే గొణుక్కున్నాడు రామారావు.

“కమాన్‌ మిష్టర్‌ గేంటీ. లెట్స్‌ బి ప్రాక్టికల్‌. ది ప్రాబ్లం విత్‌ యూ ఇండియన్స్‌ ఈజ్‌ దట్‌ వెన్‌ యూ హేవ్‌ కిడ్స్‌ యూ కేంట్‌ కట్‌ ది అంబిలికల్‌ కార్డ్‌ ఎండ్‌ లెట్‌ గో. ఇప్పుడు మీకు ఏం తక్కువయింది? మేమంతా లేమూ! మీవాళ్ళు వీలయినప్పుడు వస్తూ  ఉంటారాయె. అప్పుడప్పుడు ఫోన్‌ చేసి మాట్లాడుతూ ఉంటారు. మరి వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతకాలా? వాళ్ళ పిల్లలూ, వాళ్ళ ఉద్యోగాలతో వాళ్ళు సతమతమవుతూ ఉంటే, వాళ్ళ పరిస్థితి మీరు అర్థం చేసుకోవాలి. స్టాప్‌ థింకింగ్‌ టూ మచ్‌ అబౌట్‌ ఇట్‌. గో, మిక్స్‌ విత్‌ అదర్స్‌. వాచ్‌ సం గేంస్‌, మూవీస్‌ ఎండ్‌ ఆల్‌. యు ఆర్‌ ఎ ఫైన్‌ మేన్‌. ఉయ్‌ లైక్‌ యూ” అంటూ మాత్రలు ఒక చిన్న కప్పులో, నీళ్ళు వేరే గ్లాసులో ఇచ్చి, రామారావు అవి మింగిన తరువాత భారీగా నడుచుకుంటూ బయటికి పోయింది బ్రెండా.

అవును బ్రెండా చెప్పింది నిజమే. ప్రపంచంలో తినడానికి తిండి, నిలవడానికి నీడ లేనివాళ్ళు ఎంత మంది లేరు? ఉన్నదానికి తృప్తి పడక, తనెందుకు ఇలా విసుక్కుంటున్నాడు? అని ఒక్క క్షణం అనిపించింది రామారావుకి. ఇంకా ఎన్నాళ్ళిలా బ్రతకాలా అని అనుకుంటూ నడుం వాల్చాడు. వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. తలుపు చప్పుడుకి తెలివి వచ్చి “కమిన్‌” అన్నాడు.

తలుపు తోసుకుంటూ లోపలికి ఓ యువకుడు వచ్చాడు. “తాతయ్య, బాగున్నారా?” దగ్గరగా వెళ్ళి ఆలింగనం చేసుకున్నాడు. “కిరణ్‌ నువ్వా, ఎప్పుడొచ్చావు?” కిరణ్‌ రామారావు మనవడు. అరుణ కొడుకు. హైస్కూల్‌ సీనియర్‌. 18 సం. ల వయస్సు.

“నిన్న రాత్రి వచ్చాను తాతయ్యా! డాడీ ఫ్రెండ్‌ సుదర్శన్‌ అంకుల్‌, లక్ష్మి ఆంటీ ఇంట్లో ఉన్నాను. అంకులే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. కారు పార్క్‌ చేసి వస్తారాయన” అన్నాడు కిరణ్‌. “ఏమిటి ఇలా వచ్చావు? నువ్వు హార్వర్డ్‌కి వెళ్తావని మీ అమ్మ చెప్పింది చాలా సంతోషించాను. ఇక్కడికి వట్టినే వచ్చావా? లేదా స్కూల్‌ పని మీద వచ్చావా?” అడిగాడు రామారావు.

“అదికాదు తాతయా. నాన్న గారికి నేను హార్వర్డ్‌కి వెళ్ళడం ఇష్టం తాతయ్యా. కాని మా ఫేకల్టీ అడ్వైజర్‌ జిం కాలిన్స్‌ తమ్ముడికి కూడా హార్వర్డ్‌లో సీటు వస్తే, అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ వేండర్‌బిల్ట్‌లో రిసెర్చ్‌ స్కాలర్‌షిప్‌తో అండర్‌గ్రాడ్యుయేట్‌ చేసేడు. ఇప్పుడు హార్వర్డ్‌లో న్యూరోసర్జరీ. అతను చెప్పిందేమిటంటే బోలెడంత డబ్బు ఖర్చు పెట్టుకొని హార్వర్డ్‌కి వెళ్ళేబదులు ఇక్కడ ఫుల్‌ స్కాలర్‌షిప్‌తో చదువుకుంటే మంచిదని.

ఇంకో విషయం, అమ్మ మీ గురించి బాధ పడుతూ ఉంటుంది ఎప్పుడు తాతయ్యా, మీరొక్కరూ ఇక్కడ ఉన్నారని. నేను ఇక్కడ నాలుగేళ్ళు ఉంటే వారానికొకసారి మిమ్మల్ని చూడవచ్చు కదా! అందుకే నాకు ఫుల్‌ స్కాలర్‌షిప్‌ రాగానే ఇక్కడికే రావడానికి నిర్ణయించుకున్నాను. నిన్న ఓరియంటేషన్‌కి ఈ ఊరు వచ్చా” వచ్చీ రాని తెలుగులో చెప్పేడు కిరణ్‌. రామారావుకి నోట మాట రాలేదు.

“తాతయ్యా, ఈ రోజు మీ పుట్టిన రోజు కదా. అందుకని మీకిష్టమైన పులిహోర, పెరుగు గారెలు లక్ష్మి ఆంటీ చేత చేయించి పట్టుకొచ్చాను. తినండి తాతయ్యా. తరువాత మిమ్మల్ని గణేష్‌ టెంపుల్‌కి తీసుకెళ్తా. వస్తారు కదూ!” అంటూ చేతిలోని కేరియర్‌ తెరిచి రామారావు ముందు ఉంచాడు.  “తప్పకుండా వస్తా కిరణ్‌” అంటూ, రుచికరమైన తిండి తిని ఎన్నాళ్ళయిందో ఏమొ, తిండి ముఖం ఎరుగని వాడిలా ఆవురావురుమని తిన్నాడు రామారావు.

“తాతయ్యా, నేను రెగ్యులర్‌గా మీ దగ్గరకు వస్తుంటే నాకు తెలుగు బాగా నేర్పిస్తారా? నాకు నేర్చుకోవాలని ఉంది” అన్నాడు కిరణ్‌.

“అంతకంటేనా నాయనా” సంతోషంతో తబ్బిబ్బయిపోతూ అన్నాడు రామారావు. తన జీవితంలో ఇటువంటి సంతోష ఘడియ వస్తుందని ఊహించలేదు రామారావు. తను తెచ్చిన కొత్త డుయల్‌ సీడీ, టేప్‌ రికార్డర్‌లో తాత కిష్టమైన ఘంటసాల, సుశీల పాటల కేసెట్‌ పెట్టేడు కిరణ్‌. తాత చేతిని నిమురుతూ ప్రక్కనే కూర్చున్నాడు.

వెలుగునీడలు సినిమాలో ఘంటసాల పాట వస్తోంది. “అగాధమౌ జలనిధి లోన ఆణిముత్యమున్నటులే, శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే. ఏదీ తనంత తానే నీదరికి రాదు. శోధించి సాధించాలి. అదియే ధీరగుణం” తను అనుభవిస్తున్న ఈ సుఖం దానంతట అదే తన దగ్గరకు వచ్చింది అనుకుంటూ తన్మయత్వంతో కళ్ళు మూసుకున్నాడు ఆ తాతయ్య.
----------------------------------------------
రచన: పూడిపెద్ది శేషుశర్మ, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment