Sunday, October 27, 2019

డాట్కామ్‌ మాయోపశమన వ్రతము


డాట్కామ్‌ మాయోపశమన వ్రతము





సాహితీమిత్రులారా!

సూతమహాముని శౌనకాది మునులకు డాట్కామ్మాయా ప్రభవమును, తన్నివారణోపాయంబును ఇట్లని చెప్పదొడంగెను.

పూర్వము త్రేతాయుగంబున మహావిష్ణువు అసుర సంహారార్ధియై శ్రీరామచంద్రమూర్తిగా నవతరించి యుండెను. తపస్వియు పరాక్రమవంతుండును అయినట్టి రావణాసురుండను రాక్షసాధిపతి, భూపుత్రియు శ్రీరాముని ధర్మపత్నియు నగు జానకిని మాయోపాయమున అపహరించి లంకానగరంబున గల అశోకవనమందుంచెను. కారణజన్ముడగు శ్రీరాముడు వానర సైన్యపు సహాయమునంది సముద్రము దాటి రావణునిపై సంగ్రామము ప్రకటించెను. ముల్లోకములు, దేవ దానవ మానవ సర్వ జనావళి భయకంపితులయి చూచుచుండ ఘోర సంగ్రామమారంభమాయెను.

రావణాసురుని సుతుండును, బహు మాయావియు, జిత్తులమారియును అయినట్టి ఇంద్రజిత్తును, శ్రీరాముని ప్రియ సోదరుండును, అరణ్యవాసమున సైతము వెన్నంటి నడిచినట్టి వాడును నగు లక్ష్మణుండు ఎదుర్కొనెను. ఇరువురి మధ్యను ఘోర సంగ్రామము జరిగెను. ఎట్టకేలకు లక్ష్మణుండు ఇంద్రజిత్తును జయించెను. మరణావస్థలో నున్న ఇంద్రజిత్తు లక్ష్మణుని జూచి, ఓయీ లక్ష్మణా, ఈ విజయమయిననూ అపజయమయిననూ మనిద్దరిదీ కానోపదు. నా తండ్రి కోసము నేనును, నీ సోదరుని కోసము నీవును తెగించితిమి గాని మనిద్దరిలో స్వార్థచింతనమేమున్నది జెప్పు మనెను.

ఇంద్రజిత్తు మాటలకు కలత పడిన లక్ష్మణుండు, మారు మాటాడక శిబిరమునకేగి అన్నగారికి జెప్పెను. “ఇంద్రజిత్తునకును నాకును భేదమేమున్నది? నీ ధర్మ వర్తనము నన్ను కాపాడుచున్నది. రావణుని దుర్మార్గము ఇంద్రజిత్తును కాల్చినది గాని అతగాని త్యాగమునకు వేరర్థమే లేదా? యుద్ధమున నేనోడిపోయియుండినచో నా గతియునూ అంతియే గదా” అనెను. ఆ మాటలకు చిరునవ్వు నవ్వి శ్రీరాముడు, “ఓయీ లక్ష్మణా, ఈ జన్మలన్నీ కర్మానుసారములని నీవెరుంగవా? మనకు లభించు సోదరులు, బంధువులు అన్ని బంధములూ కర్మానుసారములే అని శాస్త్రములు పల్కుటలేవా?” అని ఊరడించెను. లక్ష్మణుని మనసెరిగిన శ్రీరాముడు తమ్ముని ఆనందపరచనెంచి ఇంకా ఇట్లనెను “ఇంతటి విజయుడవయి యుండి ఇట్లు ఖేద పడుట నేచూడలేను.ఇంద్రజిత్తునకు మరణానంతరము వరమిచ్చు చున్నాను. అతగాడు అదృశ్యరూపుడై తన మాయాజాలమును కలియుగాంతమున ప్రయోగించగలందులకు నేనవకాశము నిచ్చు చున్నాను. ఏ భవ బంధములూ, బాధ్యతలూ లేని మాయావి తన శక్తులనెట్లుపయోగించనెంచునో చూచెదము”.

శ్రీరాముని ఔదార్యమునకు దేవతలు పూలజల్లులు కురిపించిరి. అసువులు బాసి వీరస్వర్గమున కేగుచున్న ఇంద్రజిత్తు, వెల్లువలై వర్షిస్తున్న పుష్పములను గాంచి “ఏమిటీవింత?” అని సమీపమున నున్న నారదమునీంద్రుల నడిగెను. నారదుడు ఇంద్రజిత్తునకు జరిగిన వృత్తాంతమునెరింగించి, కలియుగమున నాతడికి సంక్రమింపబోవు శక్తులను వివరించెను.

కాలచక్రము గిర్రున తిరిగెను. త్రేతాయుగము, ద్వాపరయుగములు గడచి కలియుగంబారంభమయ్యెను. ధర్మాధర్మ విచక్షణము సన్నగిల్లెను. మానవ జాతి ఇహ పరములనొక్కటి జేసి మాటాడదొడగెను. దైవచింతన, ధర్మచింతన క్షీణించి స్వార్థచింతనే మానవజాతిని నడిపించ సాగెను. యుగాంతము సమీపించు చున్నదా అన్నంత దైన్య స్థితికి మానవ జాతి దిగజారెను.

మరో పక్క అదేమానవ జాతి, విద్యా వైజ్ఞానిక రంగములలో అధ్భుతమైన ప్రగతి సాధించి విమానములను, రాకెట్లను, కంపూటర్లను సృష్టించెను. కొత్త జీవరాసులనే మనిషి సృజించెను. బ్రహ్మ సృష్టించిన జీవ జాతులు కొన్నింటిని భూలోకమునుండి పూర్తిగా చెరిపి వేసెను.

దీనినంతను జన్మరహితుడై స్వర్గమున నున్న ఇంద్రజిత్తు అత్యంతాశ్చర్యముతో గమనించుచుండెను. తాను త్రేతాయుగమున సాధించి ప్రయోగించిన మాయాజాలము, కలియుగపు మానవుని ముందు పారదని తోటి స్వర్గవాసులు హేళనజేయ జొచ్చిరి. ఇంద్రజిత్తు తన శక్తి యుక్తులను పరీక్షించు కొనుటకు అదే సందర్భమని ఎంచి, అదృశ్యరూపుడై భూలోకమునకరుదెంచెను.

ఖండములన్నీ గాలించెను. తన శక్తియుక్తులకు దీటయిన పరీక్ష కోసమై అన్ని మూలలా శోథించెను. చివరికాతడు అమెరికా ఖండంబును జేరి అదేతనకు సరియయిన ప్రయోగశాలయని నిర్ణయించుకొనెను. ప్రపంచపు నలుమూలలనున్న మానవ మేథా సంపత్తికీ మాయా జాలమునకూ అదే కేంద్ర బిందువని ఆ మాయావి గుర్తించెను.

అనుకొన్నదే తడవుగా ఆతడు తన మాయాజాలమును కేంద్రీకరించి, మానవమేథకు పరాకాష్ట యని విర్రవీగి ప్రజ్వరిల్లుతున్న అత్యాధునిక సాంకేతిక వ్యాపార సామ్రాజ్యమయిన కాలిఫోర్నియా పై దండెత్తెను. “హ్రీమ్‌ డాట్కామ్‌, క్రీమ్‌ డాట్కామ్‌” అని మంత్రించి ఓ మహా మాయను మానవాళి పై సంధించెను.

అంతవరకును కొన్ని సూత్రములకు, మానవమేథకు లోబడి నడిచిన సాంకేతిక వ్యాపార రంగము ఒక్క సారిగా పూనకము వచ్చిన చందమున ఊగిసలాడినది. జాతి, వర్గ, వర్ణ భేదముల్లేక జనావళి మొత్తము “డాట్‌ కామ్‌” “డాట్‌ కామ్‌” అంటూ ఏదో చావులాటి మగతలో కలవరించ సాగెను. అది ఆనందమో బాధో తెలియని ఒక యోగస్థితి, ఒక పెను మాయ!

భరతఖండమున కాలిక్యులేటర్‌ కూడా చూడనోపని ఓ యువకుడు ఈ మంత్ర జపమున కాలిఫోర్నియా జేరెను. పదేండ్లలో పదవీకాలము ముగియనున్న తరుణమున ఓ ప్రభుత్యోద్యోగి అదే మంత్రము జపిస్తూ పిల్లా పాపలను వదిలి దేశములు పట్టిపోయెను.

అన్ని సంస్థలలో అన్నిరంగములలో అన్ని విభాగములలో ఇదే జపం నిర్దేశించిరి. అందరికన్న ఎక్కువ నష్టము సాధించిన సంస్థ, డాట్‌ కామ్‌ జపం నేర్చిన కారణాన ఎక్కువమందికి ప్రీతిపాత్రమాయెను. తత్కారణమున దీనిని నమ్మి స్టాకులు కొనియున్న వారు కన్ను మూసి తెరిచి నంతలో అత్యంత ధనికులయ్యిరి. మానవమేథకు మూల విలువలూ, కొలబద్దలూ అయినట్టి లాభనష్టములు, నాణ్యత, ఇత్యాది విశేషములు ఆ మాయను వివరింప జాలకపోయినవి. మరో ప్రదేశమున నూట ఏబది వేల డాలర్లకు లభించగల గృహము ఆరునూర్ల వేలకు జేరుకొనెను. కొన్నవాళ్ళకు గాని, అమ్ముకున్న వాళ్ళకు గానీ ఏమి జరుగుతున్నదో తెలియని అమాయక స్థితి, ఆ మాయ సృష్టించియుండిన పరిస్థితి!

ఇట్టి మాయను ప్రయోగించిన ఇంద్రజిత్తు చిద్విలాసమున చిత్రము జూచుచు నుండెను. కొంతకాలమట్లు గడిచెను. ఓ నాడు అతడకస్మాత్తుగా తన మాయను ఉపసంహరించు కొనెను. మానవాళి మేలుకొనెను. మాయ స్థానమున హేతువు పునః ప్రతిష్టితమయ్యెను. తిరిగి ఓడలు బండ్లయ్యెను. బండ్లు ఓడలయ్యెను. ప్రోగ్రామర్లు, డిబిఏలు, ఉద్యోగులు, గంటకూలీలు అన్ని జాతులవారికిని ఉద్వాసనలు ప్రారంభమయ్యెను.

అంతవరకూ అందరికీ ప్రీతి పాత్రమయిన “డాట్‌ కామ్‌” మంత్రము క్షుద్ర మంత్రమయ్యెను. అది ఉచ్చరించుట అన్ని సంస్థలకూ, సర్వ మానవాళికీ దుష్ఫల హేతువూ గానూ, నష్ట దాయకము గానూ పరిగణించబడసాగెను.

ఇది ఇట్లుండగా ఇంద్రజిత్తు తన శక్తి యుక్తులకు సంతుష్టుడై మరో మాయ ప్రయోగించుటకు సిద్ధమై యున్నాడు.

అని చెప్పి సూత మహాముని “ఇది వర్తమానము, కానున్నది వేచి చూడవలెను” అని చెప్పి ముగించెను.

వృత్తాంత మంతను అత్యంత శ్రద్ధాసక్తులతో విన్న శౌనకాది మునులు భయావహులై, మరిట్టి మాయకు ఉపశమనమో, మరో ఉపాయమో లేదా? మరి ఈ మానవజాతికి ముందున్న మార్గమేమిటి అని ప్రశ్నించిరి.

సూతముని ఇట్లు ప్రసంగించెను.

శిష్యులారా, ఉపశమన మార్గమున్నది. ఒకనాడు బే ఏరియా కు నారదుడు విహారార్థియై వెళ్ళెను. ఫ్రీమాంటు లోని ఉడుపి రెస్టారెంటులో సౌత్‌ ఇండియన్‌ కాంబో తిని బయట పడు సందర్భమున మునీంద్రునికి ఓ యువకుడు తారసపడెను. ఆ యువకుని క్రెడిట్‌ కార్డ్‌ రిజెక్ట్‌ అయిన కారణాన మొహము జెల్లక సిగ్గుతో తలవంచుకొని వ్యాలెట్‌ తీసి చిల్లర పైసలు వెతికి బిల్లు కట్టు చుండెను. క్రితం సారి బే ఏరియా విచ్చేసిన సందర్భమున అదే యువకుడు BMW లో విచ్చేసి పదిమందికి భోజనమిప్పించి, ప్లాటినమ్‌ కార్డుతో చెల్లించి బయటికి నడిచిన సంగతి జ్ఞప్తికి రాగా, అదే సంగతి ఆ యువకుని అడిగెను.

ఆ యువకుడు నారదమునీంద్రుని గాంచి, “మునీంద్రా మిమ్ములను జూచి బాటా వారేసిన దీపావళి నాటికనుండి కాస్య్టూము మార్చకుండానే భోజనమునకొచ్చిన ఓ బే ఏరియా ప్రోగ్రామరాధముడనుకొంటిని. నన్ను క్షమించి నా కష్టము తీరగల ఉపాయము జెప్పుడి” అని బ్రతిమిలాడెను. ఆ యువకుడు “డాట్‌ కామ్‌” మాయలో పడి ఉన్న ఏబదివేల స్టార్టప్‌ కంపెనీ ఆప్షన్లనూ ఎర జూపి మిలియన్‌ డాలర్ల అప్పుతో ఓ బ్రహ్మాండమయిన భవంతిని, వసతి గృహముగా జేసికొనియుండెను. మాయ జల్లారిన పిదప ఆ కంపెనీ మూతబడెను, ఇతగాడు రోడ్డునబడెను.

కథ విన్న నారదమునీంద్రులు నిట్టూర్చి, ఇట్లు పలికిరి. “నాయనా డాట్కామ్మాయోపశమన వ్రతమను ఒక వ్రతము కలదు. రానున్న కష్టము ముందే తెలిసిన శ్రీరాముడు చిరంజీవి యగు హనుమంతునికిని నాకును ఈ వ్రతమును జెప్పియుండెను. సబీర్‌ భాటియా ఈ వ్రతము నాచరించినందుననే స్క్రీన్‌ సేవర్‌ నుండి ప్రత్యక్షమయిన బిల్‌ గేట్స్‌ హాట్‌ మెయిల్‌ ను తనలో ఐక్యమొందించు కొనెను. పది మిలియన్ల డాలర్ల వరమును భాటియాకొసంగి, డాట్కామ్మాయ నుండి ఆతనిని రక్షించెను. ఆ వ్రత విధమిట్టిది అని చెప్పనారంభించెను.

ఈ వ్రతమును అత్యంత క్లిష్టతరమయిన 3వ క్వార్టర్‌ నందు మీ కంపెనీ రిజల్స్ట్‌ ప్రకటించుటకు ముందురోజున ఆచరించవలెను. దీనికి లింగ, జాతి భేదములు లేక ఎవరైనను ఆచరించవచ్చును. కాంట్రాక్టర్లు, ఉద్యోగులు, Visual Basic, UNIX, C++, Oracle, SAP, PeopleSoft, DBA, Java ఇత్యాది సర్వ మతస్థులునూ ఈ వ్రతమును ఆచరించ వచ్చును. భక్తులు తమ స్థాయికి తగిన విధముగా పెద్ద సర్వరును గానీ, డెస్క్టాప్ను గానీ, లాప్టాప్ను గానీ, ఫ్రైస్‌ ఎలెక్ట్రానిక్స్‌ వాడు మెయిల్‌ ఇన్‌ రిబేట్‌ ద్వారా వుచితముగానిచ్చు పనికిరాని కంపూటరనబడు డబ్బాను గాని ఇంటికి దెచ్చి తూర్పు ముఖమున ప్రతిష్టించ వలెను.

అంత వరకు జెప్పిన సూత మహాముని, అక్కడితో నాపి ఇట్లనెను. “తదుపరి విధమును పూర్తిగా నారదుండాయువకునికి జెప్పి రక్షించెను. కానీ నేను మీకు మిగిలిన వ్రత విధానమును జెప్పలేను. ఈ విధమును నారదునినుండే విన్న సర్వోత్తమ పటేల్‌ అనునొక గుజరాతీ ప్రోగ్రామరుడు, నారదునికిని నాకూనూ కూడా తెలియకుండా, ఆ ప్రొసీజర్‌ కి అమెరికాలో తన పేర ఓ పేటెంట్‌ సంపాదించెను. వేయి నూట పదహారు డాలర్లను www.dotcommayavratamu.com కు వెళ్ళి రాయల్టీ జెల్లించినచో మీకు ఆ మిగిలిన విధము తెలియ గలదు” అని జెప్పి సూతముని నిష్క్రమించెను.

స్వస్తి!
-------------------------------------------------------
రచన: అక్కిరాజు భట్టిప్రోలు, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment