ప్రాణంతో చెలగాటం
సాహితీమిత్రులారా!
“దూరంగా కుడివైపుకి, ఇక్కడే ఎక్కడో ఒక దీవి ఉండాలి. అదో అంతుపట్టని రహస్యం,” అన్నాడు విట్నీ.
“ఏమిటా దీవి?” అడిగేడు రైన్స్‌ఫర్డ్.
“పాత పటాలలో దాని పేరు ఓడముంపు దీవి. తగ్గపేరే పెట్టారు. అందుకేనేమో నావికులకి ఈ ప్రాంతం దగ్గరకి రాగానే హడలు. ఏదో మూఢనమ్మకం…”
“నాకేం కనిపించడంలేదే!” అన్నాడు రైన్స్‌ఫర్డ్ ఆ వేసవి రాత్రి తమ చిన్న ఓడ చుట్టూ తడిదుప్పటిలా బరువుగా కప్పివున్న చీకట్లోకి కళ్ళు చికిలించి చూస్తూ.
“నీ కళ్ళు ఎంత చురుకో నాకు బాగా తెలుసు. కానీ…” నవ్వాడు విట్నీ. “ఎండురెల్లు పొదల్లో దాక్కున్న గోధుమవన్నె దుప్పిని నువ్వు నాలుగు వందల గజాల దూరం నుండి కూడా చూడగలవు, నాకు గుర్తుంది. కానీ, మనమున్నది కారిబియన్ ఐలండ్స్ ప్రాంతంలో. నీలాంటివాడు కూడా నాలుగు మైళ్ళు చూడలేడు, అదీ ఈ అమావాస్య చీకట్లో.”
“మైళ్ళదాకా ఎందుకు, నాలుగు గజాలు కూడా కష్టమే. అబ్బ! చుట్టూ తడి ముఖ్‌మల్ గుడ్డ కప్పినట్టు, ఎంత చిక్కగా ఉందో ఈ చీకటి!” అన్నాడు రైన్స్‌ఫర్డ్ సన్నగా జలదరిస్తూ.
“రియో పర్లేదు. మరీ ఇంతలా చీకటి పడదు. ఇంకెంత, నాలుగు రోజుల్లో చేరుకుంటామక్కడికి. మనం చేరేసరికి, పర్డీస్ కంపెనీ పంపించిన రైఫిల్స్ మన ఔట్‌హౌస్‌కి వచ్చేసుంటాయి. అమెజాన్ అడవుల్లో చిరుతలూ మనకోసం ఎదురు చూస్తుంటాయి. ఇక మనకి పండగే పండగ. ఏమాటకామాటే, వేటాడ్డంలో ఉన్న సరదా ఇంక దేన్లోనూ రాదు.”
“నన్నడిగితే ప్రపంచంలో దానికంటే గొప్ప ఆట లేదు!” తలూపుతూ వంతపాడాడు రైన్స్‌ఫర్డ్.
“అవును. కానీ అది వేటగాడికి, వేటకు కాదు.” విట్నీ సరిదిద్దబోయాడు.
“విట్నీ, నువ్వు వేటగాడివి. వేదాంతివి కావు. ఎవడికి పట్టింది చిరుతపులి ఏమనుకుంటుందో.”
“ఏమో, చిరుతకు పడుతుందేమో!”
“ఇంకా నయం! వాటికంత తెలివి ఉండదు.”
“ఉండకపోతేనేం? కానీ వాటికి ఒకటి మాత్రం తెలుసనిపిస్తుంది నాకు. అదే భయం! బాధంటే భయం, చావంటే భయం.”
“నాన్సెన్స్! విట్నీ…” నవ్వుతూ కొట్టిపారేశాడు రైన్స్‌ఫర్డ్. “ఈ వేడి దెబ్బకు మెత్తబడ్డట్టున్నావు నువ్వు. వాస్తవంగా ఆలోచించు. ఈ లోకంలో ఉన్నవి రెండే రెండు జాతులు: ఒకటి వేటాడేవి, రెండవది వేటాడబడేవి. అదృష్టంకొద్దీ మనిద్దరం వేటాడే జాబితాలో ఉన్నాం. ఇంతకీ, నువ్వు చెబుతున్న ఆ దీవిని మనం దాటేసినట్టేనా?”
“ఈ చీకట్లో చెప్పడం కష్టం. దాటేసుంటే మంచిదే.”
“ఎందుకని?”
“ఈ ప్రాంతానికి చాలా చెడ్దపేరు ఉంది.”
“నరమాంస భక్షకులుంటారనా?”
“అబ్బే. ఇటువంటి చోట వాళ్ళు కూడా బతకలేరు. ఎప్పుడు మొదలయిందో, ఎలా చేరిందో గాని, ఈ ప్రాంతాల్లో సరంగులందరూ చెప్పుకునే కథే అది. పొద్దున్నుంచీ గమనించలేదా, సెయిలర్స్ అందరూ ఎలా బిక్కుబిక్కుమంటున్నారో.”
“నువ్వంటే అవుననిపిస్తోంది. చివరకి కెప్టెన్ నీల్సన్ కూడా…”
“అవును, నీల్సన్ కూడానూ. నేరుగా పోయి సైతానును చుట్టకు నిప్పడిగే రకం. అతనూ డీలాగానే ఉన్నాడు. మొదటిసారిగా నాకతని కళ్ళల్లో కనిపించిందలా. నేనప్పటికీ ఒకట్రెండుసార్లు అతన్ని కదిలించి చూశాను. చివరికెప్పటికో ‘ఎప్పుడూ సముద్రాల్లో తిరిగేవాళ్ళం. మాకు భయాలు తెలీవు. కానీ, ఈ చోటు చాలా చెడ్డది. అది అందరికీ తెలిసిన విషయమే. మీకేమీ తేడాగా అనిపించటం లేదా?’ అన్నాడు, ఓడ చుట్టూ విషపు గాలేదో కమ్ముకున్నట్టు మొహం పెట్టి.
నువ్వు నవ్వుకుంటే నవ్వుకోలే కాని… చూడు. ఎక్కడా గాలి లేదు. సముద్రం పలకలా చదునుగా ఉంది. నాకు తల దిమ్మెక్కిపోతోంది. నా అనుమానం మనం ఆ దీవికి దగ్గర్లోనే ఉన్నామని.” విట్నీ ఉన్నట్టుండి నిలువెల్లా వొణికాడు.
“అదంతా నీ ఊహ, విట్నీ! ఒక్క పిరికివాడు చాలు ఓడ ఓడంతా పిరికివారిని చేయడానికి! అదో అంటువ్యాధి.”
“కావొచ్చు. కానీ ఇలా ఎప్పుడూ సముద్రాల్లో తిరిగేవారికి అపాయం పలకరించబోతోందని ముందే తెలుస్తుంది. వాళ్ళకు ప్రమాదాన్ని పసిగట్టడం ముందే వస్తుంది. నాకేమనిపిస్తుందంటే వెలుగూ, శబ్దమూ లాగానే చెడు కూడా వ్యాపిస్తుందని. అంటే మంట చుట్టూ వేడి లాగా ఒక చెడ్ద ప్రదేశం చుట్టూ చెడు కమ్ముకొనుంటుందని. అంతెందుకు, ఇందాక చీకటి గురించి నీకేమనిపించింది… సరే. ఏమైతేనేం, రేప్పొద్దునకల్లా ఈ నరకాన్ని దాటిపోతాం. ఇక నేను పోయి పడుకుంటా. నీ సంగతేంటి?”
“నాకు నిద్ర రావడంలేదు. ఇంకో పైపు ముట్టించి చూస్తాను.”
“సరే అయితే! రేప్పొద్దున కనిపిస్తాను. గుడ్ నైట్ రైన్స్‌ఫర్డ్!”
“గుడ్ నైట్ విట్నీ!”
నీటి అడుగున ఓడ ఇంజను చేస్తున్న గురగుర శబ్దం, ఓడ వెనక నీటిని కోస్తున్న ప్రొపెల్లర్ రెక్కల చప్పుడు తప్ప రాత్రి అంతా నిశ్శబ్దంగా ఉంది. ఎక్కడా కదలిక లేదు. డెక్ మీద కూడా ఎవరూ లేరు.
డెక్ మీదున్న వాలుకుర్చీలో మేను వాల్చి రైన్స్‌ఫర్డ్ నిదానంగా, తనకిష్టమైన పొగాకును ఆస్వాదిస్తూ, పైపు పీల్చసాగాడు. ‘ఇంత చిక్కటి చీకటి. కళ్ళు మూసుకోకుండా కూడా నిద్రపోవచ్చు!’ ఆకాశంలోకి చూస్తూ మనసులో అనుకున్నాడు. మెల్లిగా రాత్రుళ్ళు కప్పే నిద్రమత్తు అతనిపై వాలసాగింది.
అకస్మాత్తుగా ఎక్కడనుండో వినిపించిన శబ్దానికి అతను ఉలిక్కిపడ్డాడు. నిద్రమత్తులో కాదు. ఇలాంటి విషయాలలో తను పొరబడే అవకాశంలేదు. ఖచ్చితంగా ఆ శబ్దం తనకి కుడివైపునుండే వచ్చింది. ఇంతలోనే మళ్ళీ ఆ చప్పుడు వినిపించింది. మళ్ళీ మరొకసారి. ఈ చీకటిలో ఎక్కడో ఎవరో మూడుసార్లు రైఫిల్ పేల్చారు.
ఆశ్చర్యంతో, రైన్స్‌ఫర్డ్ ఒక్క ఉదుటున లేచి డెక్ మీదున్న రెయిలింగు దగ్గరకి వెళ్ళాడు. శబ్దం వచ్చిన దిక్కుకేసి కళ్ళు చికిలించి చూశాడు. దుప్పటిలోంచి చూస్తున్నట్టుంది తప్ప ఏమీ కనిపించలేదు. మరికొంచెం ఎత్తునుండి చూస్తే ప్రయోజనం ఉంటుందేమోనని రెయిలింగు మీదకి ఎగిరి పడిపోకుండా నిలదొక్కుకున్నాడు. కానీ అతని నోట్లోని పైపు అక్కడున్న తాడుకి తగిలి జారిపడిపోయింది. దాన్ని పట్టుకుందుకు కొంచెం ముందుకి వంగి చెయ్యిజాచాడు. అంతే! అతని నోటివెంట అనుకోకుండా గట్టికేక వెలువడింది. పైపుని పట్టుకునే ప్రయత్నంలో తను మరీ ముందుకి వొంగాడనీ, దాంతో అంచున కాలుజారి నీటిలో పడిపోయాడనీ అతనికి అర్థమయింది. నులివెచ్చని కారిబియన్ సముద్ర జలాలు మునిగిపోతున్న అతని నోటివెంట వచ్చిన ఆ చిన్నపాటి శబ్దాన్ని కూడా వెంటనే తమలో ఇముడ్చుకున్నాయి.
రైన్స్‌ఫర్డ్ పైకి తేలడానికి ప్రయత్నిస్తూనే గట్టిగా అరిచాడు. కాని జోరుగా వెళుతున్న పడవ చాలులో ఎత్తుగా లేచిన అలలు అతని ముఖాన్ని గట్టిగా తాకడంతో ఉప్పునీరు నోటిలోకి పోయి ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. దీపాల వెలుగు క్రమంగా క్షీణిస్తున్న ఆ పడవ వెనుకే పెద్ద పెద్ద బారలు వేస్తూ ఈదడానికి గట్టి ప్రయత్నమే చేశాడు. కానీ యాభై అడుగులు కూడా ఈదకుండానే వివేకం పనిచేసి ఆ ప్రయత్నం మానుకున్నాడు. అటువంటి విషమ పరిస్థితుల్లో చిక్కుకోవడం అతనికిది మొదటిసారి కాదు. అతని కేకలు పడవలోవాళ్ళు వినే అవకాశం ఉన్నా, పడవ వెళుతున్న వేగానికి ఆ అవకాశం రానురాను సన్నగిలిపోయింది. ఎలాగో కష్టపడి తడితో బరువెక్కిన తన ఒంటిమీది బట్టలు విప్పుకున్నాడు. ఆఖరి ప్రయత్నంగా, శక్తికొద్దీ గట్టిగా అరిచాడు. దూరంగా ఎగిరిపోతున్న మిణుగురుల్లా ఓడ దీపాలు క్రమంగా సన్నగిలుతూ, చివరకి చీకటిలో కనుమరుగైపోయాయి.
తుపాకి పేలిన శబ్దాలు కుడివైపు నుండి వినిపించాయని రైన్స్‌ఫర్డ్ గుర్తు చేసుకున్నాడు. నిదానంగా, అలసిపోకుండా ఉండేలా, చిన్నగా ఆ దిక్కుకు ఈదడం ప్రారంభించాడు. ఎంతసేపు ఈదాడోనన్న స్పృహ లేకుండా ఈదాడు. ఆ తర్వాత ఎన్ని బారలు ఈదాడో లెక్కపెట్టసాగేడు. బహుశా అతను వంద దాకా లెక్కపెట్టి ఉంటాడేమో…
రైన్స్‌ఫర్డ్‌కి మళ్ళీ మరొకసారి రైఫిల్ పేలిన శబ్దం వినిపించింది. చీకటిలోండి వినిపించిన పెనుకేక. ఏదో జంతువు విపరీతమైన బాధతో, ప్రాణభయంతో వేసిన వెర్రికేక.
ఆ కేక వేసిన జంతువు ఏమిటో అతను పోల్చుకోలేకపోయాడు. నిజానికి అతనా ప్రయత్నం చెయ్యలేదుకూడా; రెట్టించిన ఉత్సాహంతో శబ్దం వచ్చిన దిక్కు జోరుగా ఈదడం ప్రారంభించాడు. మరొకసారి ఆ కేక వినిపించింది. తర్వాత టకటకమని వరుసగా పేలిన తుపాకిగుళ్ళ చప్పుడు.
ఈదుతూనే, ‘అది పిస్టల్ చప్పుడు,’ అని శబ్దాన్ని బట్టి ఆయుధాన్ని మనసులో అంచనా వేసుకున్నాడు.
మరొక పదినిమిషాలు పట్టుదలతో ఈదిన తర్వాత అతని చెవులకి కోరుకుంటున్న శబ్దం వినిపించింది. సముద్ర తీరంలో ఎత్తుగా ఎగిసిన అలలు, కొండరాళ్ళపై విరిగిపడుతూ చేస్తున్న శబ్దం అతనికి ఒక గొప్ప స్వాగతం లాగా అనిపించింది. అతను ఆ రాళ్లని చూసి పోల్చుకునే లోపునే వాటి సమీపంలోకి వచ్చేశాడు. సముద్రంలో ఆ రాత్రి ఏమాత్రం పోటు ఉండివున్నా అలలు అతన్ని ఆ బండలకేసి బాది వుండేవే. అక్కడ ఇసుక లేదు. అలలు నేరుగా బండల్ని తాకి విరిగిపడుతున్నాయి. రాతి మొనలు కోసుగా చీకట్లోకి పొడుచుకొని వున్నాయి. ఎలానోలా రాతి పగుళ్ళ మధ్యలో వేళ్ళతో వేలాడి పాకుతూ పైకి చేరుకున్నాడు. అలసిపోయిన శరీరంతో ఆ కొండ చరియ అంచు మీద అలానే పడుకొని ఉండిపోయాడు. దట్టమైన అడవి ఆ బండరాళ్ళదాకా పాకింది. ఆ క్షణంలో ఆ అడవీ, ఈ కొండరాళ్ళూ ఇంకా ఏ ఆపదలని తనకోసం దాచి ఉంచేయో రైన్స్‌ఫర్డ్ ఆలోచించే స్థితిలో లేడు. అతనికి తెలిసిందల్లా, సముద్రం నుండి తప్పించుకున్న తృప్తి. అలసట కమ్మిన శరీరంతో అక్కడే వాలిపోయి జీవితంలో ఎన్నడూ ఎరుగనంత గాఢనిద్రలోకి జారుకున్నాడు.
రైన్స్‌ఫర్డ్ కళ్లు తెరిచేసరికి సూర్యుడు అటుపక్కకు వాలుతున్నాడు. అలసటతీరా తీసిన నిద్ర అతనికి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. నాలుగువేపులా చూశాడు. అతనికి విపరీతమైన ఆకలి వేసింది. ‘ఎక్కడ పిస్తోళ్ళుంటాయో అక్కడ మనుషులుంటారు; ఎక్కడ మనుషులుంటారో అక్కడ తిండి ఉంటుంది.’ అదీ అతనికొచ్చిన మొదటి ఆలోచన. కానీ, ఇలాంటి చోట ఎలాంటి మనుషులుంటారో!? కనుచూపుమేర తీరమంతా ఎక్కడా ఖాళీ లేకుండా దట్టంగా ఎగుడుదిగుడుగా పెరిగిన అడవి కనిపిస్తోందతనికి.
ఆ దట్టమైన చెట్ల మధ్య కాలిబాట లాంటిదేమీ కనపడలేదు. అడవిలోకి పోవడం కంటే తీరం వెంట నడవడమే మేలనుకున్నాడు. నీటి అంచునే ఇసుకలో తడబడుతూ అడుగులు వెయ్యడం ప్రారంభించాడు. ఎక్కువ దూరం నడవకుండానే… అక్కడ పొదల మధ్య నేలమీద గాయపడ్డ ఏదో పెద్దజంతువు సృష్టించిన భీభత్సం కనిపించింది. అక్కడి తుప్పలన్నీ చదునై ఉన్నాయి. దట్టంగా పరిచినట్టున్న నాచు చాలా చోట్ల గీరుకుని, పెళ్లగించబడి ఉంది. కొన్ని మొక్కలమీద రక్తపు మరకలు. ఇంతలోనే ఏదో మెరుస్తున్న వస్తువు మీద రైన్స్‌ఫర్డ్ దృష్టి పడింది. తీసి చూశాడు. అది ఖాళీ తుపాకి గుండు.
‘హ్మ్! పాయింట్ 22 కేలిబర్!’ పైకే అనుకున్నాడు రైన్స్‌ఫర్డ్. ‘ఇదేదో చాలా పెద్ద జంతువు. కాని, దీన్ని ఇంత చిన్నపాటి పిస్టల్‌తో చంపడానికి ప్రయత్నించేడంటే, ఆ వేటగాడెవడో బాగా గుండెధైర్యం గలవాడై ఉండాలి. వేట గట్టిగానే పోటీ ఇచ్చింది. నేను మొదటిసారి విన్న మూడు గుళ్ళ చప్పుడూ వేటను బాగా బలహీనపరిచుండాలి. చివరిది దాని వెనుకే అనుసరిస్తూ వచ్చి ప్రాణం తీయడానికి దగ్గర్నుంచి కాల్చినది. అదీ సంగతి.’
రైన్స్‌ఫర్డ్ పరిసరాల్ని మరింత క్షుణ్ణంగా పరిశీలించాడు. అతను వెతుకుతున్నవి కనపడ్డాయి… వేటగాడి బూట్ల అడుగుజాడలు. అతను నడుస్తున్న దిక్కునే దారి తీస్తూ కనిపించాయవి. బురదనేలలో, అక్కడక్కడా పుచ్చిపోయిన దుంగల మీదనుండి తడబడుతూ వాటి వెనుకే త్వరత్వరగా నడవడం ప్రారంభించాడు. నెమ్మదిగా ఆ దీవి మీద చీకటి చిక్కబడసాగింది.
సముద్రాన్నీ, అడవినీ చీకటి కమ్ముకునే వేళకి రైన్స్‌ఫర్డ్‌కి లీలగా దీపాల వెలుగు కనిపించింది. తీరం వెంబడి నడుస్తూ కొండ మలుపు తిరిగిన చోట అతనూ తిరగగానే ఒక్కసారిగా చాలా దీపాలు కనిపించాయి. ముందు అది చిన్న ఊరేమో అనుకున్నాడు. కానీ దగ్గరకొచ్చేకొద్దీ అవన్నీ ఒక భవనంలోని దీపాలని తెలిసివచ్చింది. విస్తుపోయాడు. ఒక పెద్ద భవనం. రాజుల కోటలాగా దాని బురుజులు కోసుగా ఆకాశంలోకి పొడుచుకొని కనిపించాయి. కొండ అంచున భవనం. మూడు వైపులా కోసినట్టున్న కొండ చరియలు, ఎక్కడో కింద వాటిని ఆబగా నాకుతున్న నల్లటి సముద్రం.
‘కలగంటున్నాను!’ అనుకున్నాడు రైన్స్‌ఫర్డ్ తనలో. కానీ ఆ ముఖద్వారంలో ఉన్న మొనదేరిన చువ్వల ఇనుప తలుపు, తలుపుకున్న వికృతమైన తల, దానినుంచి వేలాడుతున్న తలుపు తట్టే పిడి, అది కల కాదు నిజమేనని నిర్ధారించేయి. అయినప్పటికీ, అతన్ని అనుమానం వదలలేదు.
రైన్స్‌ఫర్డ్ తలుపుకున్న బొమ్మ పిడిని ఎత్తేడు. చాలారోజులబట్టి వాడడం లేదని సూచిస్తూ కీచుమంటూ కదిలిందది. పైకి ఎత్తి వొదిలాడు. అతను ఉలిక్కిపడేలా ధనామని పెద్ద చప్పుడుతో పడిందది. తలుపు వెనుక అడుగుల చప్పుడు విన్నట్టు అనిపించింది కానీ, ఎవరూ తలుపు తెరవలేదు. మరొకసారి తలుపు పిడిని ఎత్తి ఈసారి జాగ్రత్తగా విడిచిపెట్టాడు. అది తాకీ తాకకుండానే స్ప్రింగులున్నాయేమోననిపించేట్టుగా తలుపు ఒక్కసారిగా తెరుచుకుంది. ముఖం మీద వెలుగు పడింది. ఆ బంగారు రంగు వెలుతురుకి కళ్లు చికిలించాడు రైన్స్‌ఫర్డ్. కళ్ళు వెలుతురుకి అలవాటుపడ్డాక రైన్స్‌ఫర్డ్ ముందుగా చూసింది తనకి ఎదురుగా, నడుముదాకా వేలాడుతున్న చిక్కని నల్లని గడ్దంతో, మునుపెన్నడూ చూడనంత మహాకాయుడిని. అతని చేతిలో ఉన్న పొడవైన తుపాకీ గొట్టం సరిగ్గా తన గుండెకి గురిపెట్టి ఉంది. దట్టమైన కనుబొమలూ, గెడ్దం మధ్యనుండి రెండు చిన్నకళ్ళు రైన్స్‌ఫర్డ్‌నే సూటిగా చూస్తున్నాయి.
చేతులు చూపిస్తూ చిన్నగా నవ్వాడు రైన్స్‌ఫర్డ్. “భయపడకండి. నేను దొంగను కాదు. మా ఓడలోంచి జారి పడిపోయాను. నా పేరు రైన్స్‌ఫర్డ్. నాది న్యూయార్క్.”
కానీ ఎదుటి వ్యక్తి కళ్ళల్లో తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. ఆ మహాకాయుడు ఒక శిలావిగ్రహమేమో అనిపించేట్టుగా రైన్స్‌ఫర్డ్ గుండెకి గురిపెట్టిన తుపాకీ అలాగే ఉంది. రైన్స్‌ఫర్డ్‌కి ఆ వ్యక్తి తను చెప్పిన మాటలు అర్థంచేసుకున్నట్టు గాని, అసలు విన్నట్టు గాని దాఖలా కనిపించలేదు. అతను నల్లటి రష్యన్ యూనిఫామ్‌లో ఉన్నాడు.
“నా పేరు సాంగర్ రైన్స్‌ఫర్డ్. నేను న్యూయార్క్ వాసిని. మా ఓడలోంచి పడిపోయాను. నాకు చాలా ఆకలిగా ఉంది.” మరొకసారి చెప్పాడు.
అతనినుండి వచ్చిన ఒకే ఒక్క ప్రతిస్పందన అంతవరకు ట్రిగర్ మీదనే ఉంచిన చూపుడువేలుని పక్కకి తియ్యడం. ఆ తర్వాత ఆ వ్యక్తి రెండుకాళ్ళ మడమల్నీ మిలిటరీ తరహాలో కొడుతూ ఎవరికో సెల్యూట్ కొట్టాడు. అప్పుడుగాని నిటారుగా, సన్నగా, నైట్‌డ్రస్‌లో ఉన్న ఒక వ్యక్తి పాలరాతి మెట్లమీంచి దిగుతూ రావడాన్ని గమనించలేదు రైన్స్‌ఫర్డ్. అతను రైన్స్‌ఫర్డ్‌ని సమీపించి, కరచాలనం కోసం చెయ్యి ముందుకు చాచేడు.
చాలా స్పష్టమైన ఉచ్చారణతో “సాంగర్ రైన్స్‌ఫర్డ్ వంటి గొప్ప వేటగాడిని మా ఇంటికి స్వాగతించగలగడం అరుదైన గౌరవంగా భావిస్తున్నాను,” అన్నాడు ఆ వ్యక్తి. అతను బాగా చదువుకున్నవాడని రైన్స్‌ఫర్డ్‌కి అర్థమయింది.
రైన్స్‌ఫర్డ్ ఆ వ్యక్తితో యాంత్రికంగా కరచాలనం చేశాడు.
“నేను మీరు రాసిన ‘టిబెట్‌లో మంచుపులులను వేటాడటం ఎలా?’ అన్న పుస్తకాన్ని చదివేను. నేను జనరల్ జరోఫ్‌ని,” అని తనని పరిచయం చేసుకున్నాడు.
రైన్స్‌ఫర్డ్‌కి అతన్ని చూడగానే అతనిలో ఏదో ప్రత్యేకమైన ఆకర్షణ, ముఖంలో ఒక విలక్షణత ఉన్నాయనిపించింది. స్పష్టంగా కనిపిస్తున్న తెల్లబడిన జుత్తు సన్నని ఆ వ్యక్తి మధ్య వయసు దాటినవాడని తెలుపుతోంది. కానీ దట్టమైన అతని కనుబొమలూ, కొనదేరి ఉన్న అతని మీసమూ మాత్రం తను ఈదుకుంటూ వచ్చిన చీకటంత నల్లగా ఉన్నాయి. అతని కళ్ళు నల్లగా కళగా ఉన్నాయి. కోసుగా దవడలు, కొనదేరిన ముక్కుతో, అతని ముఖంలో రాజసం కనిపిస్తోంది. ఆ మహాకాయుడి వంక తిరిగి జనరల్ జరోఫ్ ఏదో సంజ్ఞ చేశాడు. అప్పుడతను రైన్స్‌ఫర్డ్ గుండెకి గురిపెట్టిన పిస్తోలును పక్కకి తీసి, సెల్యూట్ చేసి వెనక్కి వెళ్లిపోయాడు.
“ఈవాన్ నమ్మలేనంత బలశాలి. కానీ దురదృష్టం కొద్దీ అతను చెవిటి, మూగ. చాలా సాదాసీదాగా కనిపిస్తాడు గాని, తన జాతి మనుషుల్లాగే బాగా అనాగరికుడు.”
“అతను రష్యనా?”
“కాదు. కొసాక్,” అన్నాడు జనరల్ నవ్వుతూ. నవ్వుతున్నప్పుడు అతని ఎర్రని పెదాలూ, పదునైన పళ్ళూ కనిపించేయి. “నేనూ కొసాక్‌నే,” అన్నాడు ముక్తాయింపుగా.
“మనం తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. మీకు తక్షణం కావలసినవి మీకు సరిపడే దుస్తులు, కడుపునిండా భోజనం, తగినంత విశ్రాంతీ. వాటికి ఇంతకంటే మంచి చోటు మీకు దొరకదు. పదండి,” అన్నాడు మళ్ళీ.
ఈవాన్ మళ్ళీ ప్రత్యక్షం అయ్యేడు. జనరల్ ఏ చప్పుడూ లేకుండా పెదాలు కదుపుతూ ఏదో చెప్పాడు.
“మిస్టర్ రైన్స్‌ఫర్డ్, ఏమీ అనుకోకపోతే మీరు ఈవాన్ వెంట వెళ్ళండి. నా దుస్తులు కొత్తవి మీకు ఇస్తాడు. మీకవి సరిపోతాయనే నా నమ్మకం. మీరు వచ్చినపుడు నేను భోజనానికి కూర్చున్నాను. మీరు తయారై రండి. నేను ఎదురు చూస్తుంటాను.” అన్నాడు.
రాక్షసాకారుడైన ఈవాన్, రైన్స్‌ఫర్డ్‌ని విశాలమైన పడకగదికి తీసుకువెళ్ళాడు. అక్కడ పందిరిమంచం ఆరుగురు మనుషులు పడుకోడానికి సరిపడా ఉంది. ఈవాన్ రైన్స్‌ఫర్డ్‌కి కొత్త దుస్తులు ఇచ్చాడు. రాజుల హోదాకి తక్కువవారికి బట్టలు కుట్టని ఒక లండను దర్జీ పేరు కాలరు మీద చూసి, ఆ బట్టలు ఇంగ్లండునుండి తెప్పించినవని రైన్స్‌ఫర్డ్ గ్రహించాడు.
రైన్స్‌ఫర్డ్‌కి భోజనాలగది కూడా చాలా విశిష్టంగా కనిపించింది. దాన్ని తీర్చిన పద్ధతిలో రాజుల కాలంనాటి ఆడంబరం స్పష్టంగా కనిపిస్తోంది. నగిషీలు చెక్కిన బల్లలు, కుర్చీలు, గది లోకప్పు, గోడలపై తాపడాలు, నలభైమంది ఒక్కసారి తినడానికి సరిపడినంత విశాలమైన భోజనాల బల్ల, ఏ పెద్ద జమీందార్లకో చెందినవని చెప్పకనే చెబుతున్నాయి. ఆ గదికి నాలుగుప్రక్కలా పులులూ, సింహాలూ, ఏనుగులూ, దుప్పులూ, ఎలుగుబంట్ల ఆకారాలు నిలబెట్టి ఉన్నాయి. సజీవంగా ఉన్నట్టు కనిపిస్తున్న అంత పెద్ద నమూనాలని రైన్స్‌ఫర్డ్ మునుపెన్నడూ చూడలేదు. భోజనాల బల్ల దగ్గర, జనరల్ ఒక్కడే కూచుని ఉన్నాడు. టేబుల్ మీద పరిచిన గుడ్డ నుంచి, కత్తులూ, చెంచాలు, గ్లాసులూ, పింగాణీ అన్నీ కూడానూ చాలా ఖరీదైనవీ, గొప్ప నాణ్యత కలిగినవీ అని తెలుస్తూనే ఉన్నాయి.
“మిస్టర్ రైన్స్‌ఫర్డ్, కాక్‌టెయిల్ తీసుకోండి.” కాక్‌టెయిల్ అంత బాగుంటుందని రైన్స్‌ఫర్డ్ ఊహించలేదు. ఆపైన, రష్యన్లకు బాగా ఇష్టమైన బోర్‌ష్ట్ సూపు వడ్డించబడింది. బీట్‌రూట్, మీగడతో చేసిన ఆ సూప్ అంత రుచిగా రైన్స్‌ఫర్డ్ ఇంతకుమునుపెన్నడూ తినలేదు.
“నాగరికతకి అందుబాటులో ఉన్న సౌకర్యాలన్నీ ఇక్కడ కూడా అందుబాటులో ఉంచడానికి మా శాయశక్తులా ప్రయత్నిస్తాము. ఏవైనా లోటుపాట్లుంటే క్షమించండి. మీకు తెలుసుగదా, మేము ఎక్కడో దూరంగా విసిరేసినట్టు ఉంటాము. చాలాకాలం ఓడలో ప్రయాణించడంవల్ల షాంపేన్ రుచిలో ఏమైనా తేడా కనిపిస్తోందా మీకు?” మర్యాదగా అడిగాడు జెనరల్ జెరోఫ్.
“లేదు లేదు,” బదులిచ్చాడు రైన్స్‌ఫర్డ్. జనరల్ జెరోఫ్ ఎంతో మర్యాదస్తుడు, కులీనుడని అనిపిస్తున్నా, ఒక్క విషయం అతన్ని చాలా ఆందోళనకు గురిచేస్తోంది: తింటూ మధ్యమధ్యలో తను జనరల్ వైపు కళ్ళు తిప్పినప్పుడల్లా, అతను తనని నిశితంగా పరిశీలిస్తూ అంచనా వేస్తున్నట్టు కనిపించడం.
జనరల్ జరోఫ్ మళ్ళీ అందుకుని, “మీ పేరు వినగానే మిమ్మల్ని ఎలా పోల్చుకోగలిగానా అని మీకు ఆశ్చర్యం కలగొచ్చు. నిజానికి వేట మీద ఇప్పటి వరకు ఇంగ్లీషు, ఫ్రెంచి, రష్యను భాషల్లో ప్రచురించబడ్డ అన్ని పుస్తకాలూ నేను చదివేసేను, మిస్టర్ రైన్స్‌ఫర్డ్! నాకు జీవితంలో ఉన్న ఒకే ఒక్క వ్యామోహం వేట.”
“ఋజువుగా ఇక్కడ చాలా తలకాయలు కనిపిస్తున్నాయి. అయితే, మునుపెన్నడూ నేను ఇంత పెద్ద ఆఫ్రికన్ దున్నపోతు తల చూడలేదు!” అన్నాడు రైన్స్‌ఫర్డ్, చక్కగా వండిన లేత మాంసాన్ని ఆస్వాదిస్తూ.
“ఓ! అదా! అవును. అది చాలా పెద్ద జంతువు.”
“అది మీ మీద దాడి చెయ్యలేదూ?”
“చెయ్యకపోవడమేం. చెట్టుకేసి విసిరి కొట్టింది,” అన్నాడు జనరల్. “ఆ దెబ్బకి నా తల పగిలింది. అయితేనేం, దాన్ని సాధించాను.”
“నేనెప్పుడూ అనుకుంటుంటాను, ఆఫ్రికన్ దున్నను వేటాడ్డం అన్నిటికన్నా ప్రమాదం అని,” అన్నాడు రైన్స్‌ఫర్డ్.
ఒక క్షణంపాటు జనరల్ ఏమీ సమాధానం ఇవ్వలేదు. చిత్రమైన నవ్వొకటి అతని ముఖంలో మెరిసింది. తర్వాత తీరుబాటుగా, “లేదు. మీరు పొరబాటుపడ్డారు. అన్ని వేట జంతువుల్లోనూ అతి ప్రమాదకరమైనది ఆఫ్రికన్ దున్న కాదు,” అన్నాడు. ఆగి ఒకసారి వైన్ చప్పరించాడు. “నా ఈ దీవిలోని అడవిలో అంతకన్నా ప్రమాదకరమైన జంతువుల్ని వేటాడుతుంటాను.” ప్రశాంతంగా చెప్పాడు.
రైన్స్‌ఫర్డ్ ఆశ్చర్యపోయాడు. “ఏమిటీ! ఈ దీవిలో పెద్ద వేటజంతువులు కూడా ఉన్నాయా!?”
“అన్నిటికంటే పెద్ద జంతువు.”
“నిజంగా?”
“అయితే అది ఇక్కడ పుట్టి పెరిగినది కాదు. నేను వాటిని తెప్పించుకోవలసి వచ్చింది.”
“అయితే వేటిని దిగుమతి చేసుకున్నారు మీరు? పులుల్నా?”
ఎప్పటిలాగే జనరల్ మొఖంలో చిత్రమైన నవ్వు. “లేదు. పులివేట మీద నాకు వ్యామోహం ఎప్పుడో చచ్చిపోయింది. పులుల్లోని అన్ని రకాల్నీ లెక్కలేనన్నిసార్లు వేటాడేను. వాటివల్ల నా ప్రాణానికి ముప్పు లేదు. మిస్టర్ రైన్స్‌ఫర్డ్, నాకు ప్రాణంతో చెలగాటమాడే వేటంటే ఇష్టం.”
జనరల్ తన జేబులోని బంగారు సిగరెట్ కేస్ తీసి, తెరిచి, తీసుకోమన్నట్టు అతిథివైపు సాదరంగా చెయ్యి చాచాడు. చక్కటి సువాసన ఉన్న సిగరెట్లవి.
“మనిద్దరం కలిసి ఒక గొప్ప వేట ఆడదాం, ఈ వేటలో మీ తోడు దొరకడం నాకు మహదానందంగా ఉంది,” అన్నాడు జనరల్.
“కానీ, ఏ జంతువుని…”
“ఆ విషయానికే వస్తున్నా. మీకు కుతూహలంగా ఉండడం సహజమే. నాకు తెలుసు. నేనొక అపురూపమైన వేటని కనిపెట్టేను. మీకు కొంచెం వైన్?”
“థాంక్యూ, జనరల్!”
జనరల్ ఇద్దరి గ్లాసులూ నింపేక ఇలా ప్రారంభించేడు… “భగవంతుడు కొందర్ని కవులుగా సృష్టిస్తాడు. కొందరిని మహరాజులుగానూ, మరికొందర్ని బిచ్చగాళ్ళుగానూ సృష్టిస్తాడు. నన్ను మాత్రం అతడు వేటగాడిగా సృష్టించేడు. మా నాన్న అంటూండేవాడు ‘నీ చెయ్యి ట్రిగ్గర్ కోసం పుట్టిందిరా!’ అని. అతను మంచి ఆస్తిపరుడు. క్రిమియాలో అతనికి పాతికవేల ఎకరాలకు పైబడి భూములుండేవి. గొప్ప ఆటగాడు. నా ఐదవ ఏట రష్యాలో ప్రత్యేకంగా తయారుచేసిన తుపాకీ ఒకటి కొనిచ్చాడు, పిచ్చుకలని వేటాడమని. నేను వాటితోపాటు, ఆయన అపురూపంగా పెంచుకుంటున్న సీమకోళ్ళని కూడా వేటాడితే, ఆయన నన్ను శిక్షించలేదు సరికదా, నా గురిని ఎంతో మెచ్చుకున్నాడు. మొట్టమొదటిసారిగా కాకేసస్ పర్వతాల్లో నేను ఒక ఎలుగ్గొడ్డును చంపేను. అప్పటినుండీ నా జీవితం ఒక నిరంతరాయమైన వేటగానే సాగింది. నేను సైన్యంలో కూడా చేరాను. రాజవంశీకుల పిల్లలకి అది తప్పనిసరి. కొన్నాళ్ళు కొసాక్ ఆశ్వికదళానికి నాయకత్వం వహించాను కూడా. కానీ నాకు నిజమైన వ్యామోహం ఉన్నది వేట మీదే. ఈ భూమ్మీద యేయే దేశాలలో చెప్పుకోదగ్గ పెద్ద జంతువులున్నాయో, వాటన్నిటినీ వేటాడేను. ఎన్ని జంతువుల్ని వేటాడేనో లెక్కచెప్పమంటే నాకు సాధ్యం కాదు.”
జనరల్ ఆగి, ఒకసారి గట్టిగా సిగరెట్ దమ్ము పీల్చాడు.
“రష్యా పడిపోయిన తర్వాత నేను దేశాన్ని విడిచి వచ్చేశాను. జార్ చక్రవర్తుల అధికారులకి అక్కడ ఉండడం అంత క్షేమం కాదు. చాలామంది రాజవంశీకులు సర్వస్వం కోల్పోయారు. నా అదృష్టం కొద్దీ నా పెట్టుబడులన్నీ అమెరికాలో పెట్టాను. దానివల్ల తక్కినవాళ్ళలా పారిస్‌లో టాక్సీ నడుపుకోవడమో, మోంటేకార్లేలో టీ దుకాణం పెట్టుకోవడమో తప్పింది. అలవాటైన నా వేట వ్యాపకాన్ని కొనసాగించేను. మీ రాకీ పర్వతాల్లో ఎలుగులనూ, గంగానదిలో మొసళ్ళనీ, తూర్పు ఆఫ్రికాలో రైనోలనీ వేటాడేను. ఆఫ్రికాలో ఉన్నప్పుడే ఆ దున్న, నన్ను చెట్టుకి విసిరికొట్టినపుడు కోలుకోడానికి ఆరు నెలలు పట్టింది. కోలుకోగానే నేను అమెజాన్‌లో చిరుతలను వేటాడడం కోసం వెళ్ళేను. అవి చాలా అసాధారణమైన తెలివిగల జంతువులని అంటారు. కానీ, అది నిజం కాదు.”
ఒకసారి గొంతు సవరించుకున్నాడు. “వేటగాడికి తన పరిసరాల పట్ల చక్కటి స్పృహ ఉండి, చేతిలో మంచి గన్ ఉంటే, వాటి తెలివితేటలు అతనికి ఏమాత్రం సాటి రావు. నా ఉత్సాహం నీరుగారిపోయింది. ఒక రాత్రి నేను తలనొప్పితో బాధపడుతూ నా టెంట్‌లో పడుకున్నప్పుడు అనిపించింది, వేట నాకు విసుగు పుడుతోందని. నాకు! అప్పటి వరకు జీవితమంతా వేటలోనే గడిపాను. అది నా ప్రాణం. అమెరికాలో తాము జీవితమంతా నడిపిన వ్యాపారాన్ని వదిలేయాల్సి వస్తే కొందరు వ్యాపారస్థులు దిగులుతో కృశించిపోతారని విన్నాను. ”
“ఆ మాట నిజం. కొందరికి అది కేవలం వ్యాపారం కాదు. అది వారి జీవితం.”
జనరల్ మరొకసారి చిరునవ్వు నవ్వేడు. “నాకు అలా పోవాలని లేదు. నేనేదో ఒకటి చెయ్యాలి. మిస్టర్ రైన్స్‌ఫర్డ్, నాది చాలా ఎనలిటికల్ మైండ్. అందుకనే వేటంటే అంత ఇష్టపడతాను.”
“అందులో సందేహం లేదు, జనరల్ జరోఫ్.”
“వేట మీద నాకు ఎందుకు మోజు తగ్గిపోతోంది? కారణం తెలుసుకుందుకు విశ్లేషణ ప్రారంభించాను. మిస్టర్ రైన్స్‌ఫర్డ్, మీరు నా కంటే చాలా చిన్నవారు. నేను వేటాడినంత విస్తృతంగా మీరు వేటాడి ఉండరు. మీరు దానికి సమాధానాన్ని ఊహించగలరేమో ప్రయత్నించండి?”
“ఏమిటది?”
జనరల్ మరొక సిగరెట్ వెలిగించాడు. “క్లుప్తంగా చెప్పాలంటే, వేట ఒక ఆటగా ఇవ్వగలిగిన ఆనందాన్ని నాకు ఇవ్వలేకపోతోంది. రాను రాను వేట నాకు మరీ తేలికపాటి వ్యవహారం అయిపోయింది. వేటకెళ్ళిన ప్రతిసారీ గురి తప్పకుండా నా వేట జాడను పసిగట్టగలుగుతున్నాను. ఏ జంతువు ఎక్కడ ఎలా దాగి వుంటుంది, అది ఎలా ప్రవర్తిస్తుంది, అన్నీ తెలిసిపోతున్నాయి. నా బారిన పడ్డ ఏ జంతువూ నన్ను తప్పించుకోలేకపోతోంది. తార్కికంగా వివేచించే మన మేధతో పోలిస్తే జంతువుకుండే సహజగుణం ఏపాటిది? అందుకే వేటంటే విసుగెత్తింది. నా జీవితంలో అంతకంటే విషాదం ఇంకేమైనా ఉందనుకోను.”
రైన్స్‌ఫర్డ్ చాలా ఆసక్తిగా ముందుకు వంగి వినసాగాడు.
“ఉన్నట్టుండి నేనేం చేయాలో నాకొక ఇన్‌స్పిరేషన్ లాగా వచ్చింది,” అన్నాడు జనరల్.
“ఏమిటది?”
జనరల్ చిరునవ్వులో ఒక పెద్ద అవరోధం ఎదురై, దాన్ని జయప్రదంగా అధిగమించిన తర్వాత కలిగే ఆనందం కనిపించింది.
“నేను వేటాడడానికి ఒక కొత్త జంతువును కనిపెట్టాలి.”
“కొత్త జంతువా? మీరు మరీ వేళాకోళం ఆడుతున్నారు.”
“వేళాకోళం ఆడటంలేదు. వేట విషయంలో నేను ఎప్పుడూ వేళాకోళం ఆడను. నాకో కొత్త జంతువు అవసరం. అది నాకు దొరికింది. అందుకని ఈ దీవిని కొని ఈ భవనం కట్టించాను. నా వేట కొనసాగించేది ఇక్కడే. ఈ దీవి నా అవసరాలకి అతికినట్టు సరిపోయింది… ఈ అడవీ, ఇక్కడి కొండలూ, చిత్తడి నేలలూ…”
“మరి జంతువు మాటేమిటి?”
“ఓ, అదా! అది నాకు ప్రతిరోజూ వేటలోని మజా రుచి చూపిస్తూనే ఉంది. మరే ఇతర క్రీడా ఒక్క క్షణం కూడా దానికి సాటిరాదు. ఇప్పుడు ప్రతిరోజూ వేటాడుతున్నా, నాకు విసుగు రావడం లేదు. నా జంతువు నాతో సమానంగా ఆలోచిస్తుంది. దానితో సరిసమానంగా ఎత్తుకి పైయెత్తు వెయ్యగలుగుతున్నాను.”
రైన్స్‌ఫర్డ్ ముఖంలో ఆశ్చర్యం స్పష్టంగా కనిపిస్తోంది.
“వేటాడడానికి నాకిపుడు గొప్ప తెలివైన జంతువు కావాలన్నాను గదా? అటువంటిదానికి ఎటువంటి లక్షణాలుండాలి? దానికి సాహసం, యుక్తి, తార్కికంగా ఆలోచించగల శక్తీ ఉండాలి.”
“కానీ ఏ జంతువుకీ అలా ఆలోచించగల శక్తి లేదే!” అభ్యంతరం లేవదీశాడు రైన్స్‌ఫర్డ్.
“మిత్రమా, అటువంటి జంతువు ఒకటి ఉంది.”
“అంటే, మీ ఉద్దేశ్యం… !” రైన్స్‌ఫర్డ్ కళ్ళు పెద్దవయేయి.
“ఎందుకు కాకూడదు?”
“జనరల్ జరోఫ్! మీరు ఈ మాటలు సీరియస్‌గా అంటున్నారనుకోను. ఇది మరీ క్రూరమైన పరిహాసం.”
“నేను సీరియస్‌గానే అంటున్నాను. వేట గురించి మాటాడుతున్నపుడు పరిహాసం ఆడను.”
“దాన్ని వేట అంటారా, జనరల్ జరోఫ్? మీరు చెబుతున్నదాన్ని హత్య అంటారు.”
జనరల్ స్నేహపూర్వకంగానే నవ్వాడు. రైన్స్‌ఫర్డ్ వంక వింతగా చూశాడు. “మీలాంటి నవనాగరిక యువకుడు మనిషి ప్రాణం విలువ గురించి ఏవో లేనిపోని ఆలోచనలు కల్పించుకోవడం ఊహించలేకపోతున్నాను. యుద్ధంలో మీ అనుభవం…”
“నిర్దాక్షిణ్యంగా చేస్తున్న హత్యల్ని మన్నించనియ్యదు.” పూర్తిచేశాడు రైన్స్‌ఫర్డ్.
జనరల్ వికటాట్టహాసం చేశాడు. “మీరెంత పాతకాలపు మాటలు మాట్లాడుతున్నారు! ఈ రోజుల్లో అమెరికాలో సైతం, చదువుకున్నవాళ్ళలో ఇంత అమాయకంగా మాట్లాడేవాళ్లని చూడం. ఇది రోల్స్ రాయిస్ కారులో ముక్కుపొడి డబ్బా పెట్టుకోవడం లాంటిది. బహుశా మీ పూర్వీకుల నుంచి వచ్చిన సంస్కారమై ఉంటుంది. చాలామంది అమెరికన్ల విషయంలో ఇది నిజం. కానీ, ఒకసారి మీరు నా వెంట వేటకి వస్తే, మీ ఆలోచనలు మార్చుకుంటారని నా నమ్మకం. మిస్టర్ రైన్స్‌ఫర్డ్, మీకోసం కొత్త ఉత్తేజం కాచుకుని ఉంది.”
“కృతజ్ఞతలు. నేను వేటగాడినేగాని హంతకుడిని కాను.”
“మళ్ళీ అదే అభియోగం! మీ విశ్వాసాలు సరైనపునాది లేనివని నేను నిరూపించగలను.”
“నిరూపించండి,”
“జీవితం బలవంతులది. జీవించాలంటే బలం కావాలి. ఆమాటకొస్తే అవసరమైతే దాన్ని ముగించడానికీ బలం కావాలి. బలహీనులందరూ ఈ భూమిమీద బలవంతులకి ఆనందాన్ని ఇవ్వడానికే పుడతారు. నేను బలవంతుడిని. నేను నాకిచ్చిన ఈ బహుమానాన్ని ఎందుకు వాడుకోకూడదు? నాకు వేటాడాలనిపిస్తే, ఎందుకు వేటాడకూడదు? భూమి మీద ఎందుకూ కొరగాని చెత్తని నేను వేటాడుతాను. ఉదాహరణకి దారి తప్పిన ఓడల మీది నల్లవాళ్ళూ, చైనీయులూ, తెల్లవాళ్ళూ, సంకరజాతివాళ్ళూ. వాళ్ళకంటే ఒక్క జాతి గుర్రం గాని, వేటకుక్క గాని వెయ్యిరెట్లు విలువైనవి.”
“కానీ వీళ్ళంతా మనుషులు,” అన్నాడు రైన్స్‌ఫర్డ్ ఆవేశంగా.
“సరిగ్గా ఆ కారణం వల్లనే! అందుకే వాళ్ళని నేను వాడుకుంటున్నాను. అది నాకు వినోదాన్నిస్తుంది. వాళ్ళు ఒకరకమైన వివేకంతో ఆలోచించగలరు. వాళ్ళతో అందువల్లనే ప్రమాదం.”
“వాళ్ళు మీకెక్కడనుండి దొరుకుతారు?”
“ఈ దీవికి ‘ఓడముంపుదీవి’ అని పేరుంది. ఒక్కొక్కసారి సముద్రం కోపంతో వాళ్ళ ఓడలను ఆ కొండలకేసి కొట్టి వాళ్లని నా దగ్గరకి పంపిస్తుంటుంది. ప్రకృతి నాకు అనుకూలంగా లేనపుడు, నేనే ప్రకృతికి సాయం చేస్తుంటాను. ఒకసారి కిటికీ దగ్గరకి రండి, చూద్దురుగాని.”
రైన్స్‌ఫర్డ్ కిటికీ దగ్గరకి వెళ్ళి సముద్రంలోకి చూశాడు.
“అదిగో! అటు చూడండి. అక్కడ!” చీకట్లోకి వేలు చూపించాడు జనరల్. రైన్స్‌ఫర్డ్‌కి చీకటి తప్ప మరేమీ కనిపించలేదు. కానీ, జనరల్ ఒక మీటను నొక్కగానే, దూరంగా సముద్రంలో కొన్ని దీపాలు వెలుగులు చిమ్ముతూ కనిపించాయి.
జనరల్ నవ్వేడు. “అవి చూసి అక్కడ రేవు ఉందనుకుంటారు. నిజానికి అక్కడ ఏ రేవూ లేదు. కత్తిలా పదునైన అంచులున్న రాళ్ళు సముద్ర రాక్షసిలా నోళ్ళు తెరుచుకుని ఉంటాయక్కడ. నేను ఈ కాయని నలిపినట్టు అవి ఎంత పెద్ద ఓడనైనా నలిపెయ్యగలవు.” జనరల్ ఒక అక్రోటు కాయను నేలమీద వేసి బూటుతో నాజూకుగా పొడిపొడి చేశాడు. ఇంతలోనే అడగని ఏదో ప్రశ్నకు సమాధానం చెబుతున్నట్టు అన్నాడు, “అవును, మేము నాగరీకులమే. ఆటవికులం కాదు. నాకు ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఉంది.”
“నాగరికత? మనుషుల్ని చంపడమా?”
జనరల్ నల్లని కళ్లలో లేశమాత్రంగా కోపం కనిపించింది. అదీ ఒక లిప్తపాటే. అతను ఎప్పటిలా స్నేహపూర్వకంగా “మిస్టర్ రైన్స్‌ఫర్డ్! మీరు మరీ నీతివంతుల్లా మాటాడుతున్నారు. మీరు అంటున్నదేదీ నేను చెయ్యను. అది మరీ అనాగరికంగా ఉంటుంది. వచ్చిన అతిథులకి కావలసినవన్నీ సమకూరుస్తాను. వాళ్ళకి కావలిసినంత తిండీ, వ్యాయామమూ దొరికేలా చూస్తాను. వాళ్ళు చాలా ఆరోగ్యంగా, బలిష్ఠంగా తయారౌతారు. రేపు మీరే చూద్దురుగాని.”
“అంటే మీ ఉద్దేశ్యం?”
“మనం శిక్షణాశిబిరానికి వెళదామని,” అంటూ చిరునవ్వు నవ్వాడు జనరల్. “అది భూగృహంలో ఉంది. ఇప్పుడక్కడ ఒక డజనుమందిదాకా విద్యార్థులున్నారు. దురదృష్టం కొద్దీ ఒక స్పానిష్ ఓడ ఆ రాళ్ళకు గుద్దుకోవడం వల్ల వచ్చి చేరినవారు. చెప్పడానికి సిగ్గుగా ఉన్నా చెప్పక తప్పదు. ఎందుకూ కొరగానివాళ్ళు. లక్ష్యంగా పనికిరానివాళ్ళు. ఓడకే తప్ప అడవికి అలవాటుపడనివాళ్ళు.”
అతను చెయ్యి పైకి ఎత్తగానే, ఈవాన్ వెండి పళ్ళెంలో చిక్కని టర్కిష్ కాఫీ తీసుకువచ్చాడు. రైన్స్‌ఫర్డ్ అతన్ని చూసి ఏదో అనబోయి అతి ప్రయత్నం మీద తన నాలికని అదుపులో ఉంచుకున్నాడు.
జనరల్ తిరిగి ప్రారంభించేడు: “అదొక ఆట. అంతే. దాన్ని అలాగే చూడండి. వాళ్ళలో ఒకరితో రేపు మనం వేటకి వెళుతున్నాం అంటాను. అతనికి సరిపడినంత తినుబండారాలూ, పదునైన వేటకత్తీ ఇస్తాను. నా కంటే మూడుగంటలు ముందు అడవిలోకి వెళ్ళే అవకాశం ఇస్తాను. ఆ తర్వాత, నేను చాలా తక్కువ కేలిబర్ ఉన్న పిస్టల్ మాత్రమే తీసుకొని వేటకు వెళతాను. మూడురోజులపాటు నాకు దొరక్కుండా అతను ఉండగలిగితే అతను గెలిచినట్టు లెక్క. కానీ అతను నాకు దొరికితే…” అని నవ్వుతూ, “అతను ఓడిపోయినట్టే.”
“అలా అతను ఒప్పుకోకపోతే?” అడిగాడు రైన్స్‌ఫర్డ్.
“ఓ, దానికేముంది… అతనికి ఇష్టం లేకపోతే ఈ ఆట ఆడనక్కరలేదు. అతన్ని ఈవాన్‌కి అప్పగిస్తాను. ఈవాన్ ఒకప్పుడు జార్ చక్రవర్తి దగ్గర నౌటర్‌గా చాలా పేరు తెచ్చుకున్నాడు. అదే, కొరడాతో మనుషులను కొట్టి చంపే పని. అతనికీ ఆ ఆటంటే ఇష్టం. ఈ రెండింటిలో ఏది కావాలో ఎంచుకోమంటాను. అనుకున్నట్టే, వాళ్ళు వేటగా ఉండడానికే ఒప్పుకుంటారు.”
“ఒకవేళ వాళ్లు గెలిస్తే?”
జనరల్ అందమైన ముఖం మీద చిరునవ్వు విప్పారింది. “ఆ రోజు ఇప్పటివరకూ రాలేదు,” అన్నాడు. వెంటనే, “మిస్టర్ రైన్స్‌ఫర్డ్, నేను డంబాలు పలుకుతున్నాననుకోకండి. ఈ ఆటలో కూడా అందరూ ఒకే రకమైన ఆలోచనలే చూపిస్తారు. ఎప్పుడో కాని దీటైన వేట తగలడు. ఒకడైతే దాదాపు గెలిచినంత పనిచేశాడు. చివరకి నేను వేటకుక్కల్ని ఉపయోగించవలసి వచ్చింది.”
“వేటకుక్కల్నా?”
“ఇటు రండి చూపిస్తాను.”
సరికొత్త ఉత్సాహంతో పారిస్ కేబరే పాట ఒకటి ఈల వేస్తూ జనరల్ జరోఫ్ రైన్స్‌ఫర్డ్‌ని కిటికీ దగ్గరకి తీసుకువెళ్ళాడు. కిటికీ దగ్గర వెలుగుతున్న దీపాలతో తోటలోని పొడుగాటి నీడలు దోబూచులాడుతున్నాయి. అక్కడ సుమారు ఒక డజను దాకా నల్లని భీకరమైన ఆకారాలు అటూ ఇటూ నడుస్తున్నాయి. అవి కిటికీ వైపు చూసేసరికి వాటి కళ్ళు ఆకుపచ్చగా మెరిసేయి.
“ఇవి వేటకుక్కల్లో చాలా ఉత్తమమైన జాతివి. రాత్రి ఏడింటికల్లా వీటిని స్వేచ్ఛగా వదిలేస్తాం. ఆ తర్వాత లోపల నుండి బయటకి గాని, బయట నుండి లోపలకి గాని వెళ్లడానికి ఎవరైనా ప్రయత్నిస్తే, పాపం, ఊహించలేరు ఏ జరగబోతోందో! రండి, ఇప్పుడు నేను వేటాడిన తలకాయలని చూపిస్తాను. లైబ్రరీకి వెళదాం పదండి,” అన్నాడు జనరల్.
“మీరేమీ అనుకోకపోతే, జనరల్ జరోఫ్! ఈ రోజుకి నన్ను క్షమించండి. నాకు ఒంట్లో అంత బాగాలేదు,” అన్నాడు రైన్స్‌ఫర్డ్.
“అరే! అలాగా?” అంటూ జనరల్ విచారాన్ని వ్యక్తం చేశాడు. “మీరు అంతదూరం ఈదుకుని రావడం వల్ల అలా అనిపించడం సహజమే. మీకు విశ్రాంతి కావాలి. రేపు ఉదయానికి మీరు మామూలు మనిషి అయిపోతారని పందెం కాస్తాను. అప్పుడు మనం వేటకి వెళ్ళొచ్చు. సరేనా? ఈ రోజు వేటకి మరొకడున్నాడు…” రైన్స్‌ఫర్డ్ గదిలోంచి వెళ్ళబోతుండగా వెనకనుంచి మాటలు కొనసాగాయి. “ఈ రాత్రికి మీరు నాతో రాలేకపోతున్నందుకు విచారంగా ఉంది. అయినా ఫర్వాలేదు. ఒక మంచి ఆఫ్రికా మనిషి ఈ రాత్రికి వేటగా పనికొచ్చేలా ఉన్నాడు. బలంగా కండలుతిరిగి వున్నాడు. చూద్దాం ఎంత సవాల్ చేయగలడో నన్ను. మిస్టర్ రైన్స్‌ఫర్డ్, గుడ్ నైట్. ఈరాత్రి హాయిగా పడుకోండి.”
పరుపు మెత్తగా హాయిగా ఉంది. సిల్కు పైజమా సుఖంగా ఉంది. శరీరంలో ప్రతి అణువూ పూర్తిగా అలిసిపోయి వుంది. అయినా సరే, రైన్స్‌ఫర్డ్‌కి నిద్ర రాలేదు. రెప్ప వేయని కళ్ళతో మంచానికి చారగిలబడ్డాడు. గది బయట వరండాలో ఎవరో నక్కినక్కి నడుస్తున్న అడుగుల చప్పుడు విన్నట్టనిపించి ఒక్కసారిగా తలుపు తెరుద్దామని ప్రయత్నించాడు గానీ, తలుపు తెరుచుకోలేదు. కిటికీ దగ్గరకి వెళ్ళి బయటకి చూశాడు. అతనున్న గది బాగా ఎత్తుగా ఉన్న ఆ కోటబురుజుల్లో ఒక దాంట్లో ఉంది. కోటలో దీపాలు ఆర్పివేసి ఉన్నాయి. ఎటుచూసినా చీకటి, నిశ్శబ్దం. ఆకాశంలో అమావాస్య ముందరి చంద్రుడు బాగా పాలిపోయి ఉన్నాడు. ఆ గుడ్డి వెలుగులో కనీకనిపించకుండా ఉన్న ఆవరణని పరికించాడు. అక్కడ నల్లగా, చప్పుడు చెయ్యకుండా కదులుతున్న కొన్ని ఆకారాల నీడలు రకరకాలుగా తరుగుతూ పెరుగుతూ తిరుగుతున్నాయి. అతను కిటికీ దగ్గరకి వచ్చిన శబ్దం విని ఒక్కసారి తలెత్తి ఏదో ఊహిస్తూ ఆకుపచ్చని కళ్లతో అతని వంక చూశాయి. రైన్స్‌ఫర్డ్ తిరిగి తన పక్కమీద వాలాడు. నిద్రలో జారుకుందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నించాడు. చివరికి తెల్లవారబోతుండగా, దూరంగా ఎక్కడో పిస్టల్ శబ్దం లీలగా వినిపిస్తుండగా నిద్రలోకి జారుకున్నాడు.
మధ్యాహ్నం భోజనంవేళ దాకా జనరల్ జరోఫ్ కనిపించలేదు. కనిపించగానే మర్యాదగా రైన్స్‌ఫర్డ్‌ని అతని ఆరోగ్యం ఎలా ఉందని కుశలం అడిగాడు. రైన్‌ఫర్డ్ ఏమీ అనకముందే, ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడుస్తూ, “నా మట్టుకు నాకు మనసు ఏమీ బాగులేదు. నాకు మళ్ళీ నా పాతరోగం తిరగబెట్టిందేమోనని భయం పట్టుకుంది,” అన్నాడు.
ఏమిటది అన్నట్టు రైన్స్‌ఫర్డ్ చూసిన చూపుకు సమాధానంగా “అదే, వేటంటే నిరుత్సాహం. బోరుకొట్టడం,” అని బదులిచ్చాడు.
క్రేప్స్ వడ్డించుకుంటూ జనరల్ వివరాలు చెప్పసాగేడు: “నిన్న రాత్రి నాకు వేట అంత బాగులేదు. ఆ వెధవకి బుర్రలేదు. అతని ఉనికి కనుక్కోవడం నాకు ఏమాత్రం సవాలు కాకుండా తన జాడలు పరుచుకుంటూ మరీ వెళ్ళాడు. ఈ నావికులకు ఉండేవే తెలివితక్కువ బుర్రలు. దానికి తోడు వాళ్లకి అడవిలో ఎలా వెళ్ళాలో తెలీదు. వాళ్ళు ఇట్టే తెలుసుకోగలిగిన బుద్ధితక్కువ పనులు అనేకం చేస్తుంటారు. అవి చూస్తుంటే గొప్ప కోపం వస్తుంది. మిస్టర్ రైన్స్‌ఫర్డ్, మీకు వైన్ గ్లాసు నింపనా?”
“జనరల్! నేనీ దీవిని తక్షణం విడిచిపెట్టి పోవాలనుకుంటున్నాను,” అన్నాడు రైన్స్‌ఫర్డ్.
జనరల్ కనుబొమలు ముడివేశాడు. “అదేమిటి, మీరు వచ్చి ఎక్కువసేపు కాలేదు. పైగా మీరు వేటలో పాల్గొనలేదు కూడా,” అన్నాడు నొచ్చుకుంటున్నట్టుగా.
“నేనీ రోజే ఇక్కడినుండి వెళ్ళిపోదామనుకుంటున్నాను,” చెప్పాడు రైన్స్‌ఫర్డ్.
జనరల్ జరోఫ్ నల్లని కళ్ళు తననే పట్టి పట్టి పరిశీలించడం గమనించాడు రైన్స్‌ఫర్డ్. ఒక్కసారిగా జనరల్ ముఖం వెలిగింది. రైన్స్‌ఫర్డ్ గ్లాసుని వైన్‌తో నింపాడు.
“ఈ రాత్రే మనిద్దరం వేటకి వెళుతున్నాం. మీరూ! నేనూ…” అంటూ నొక్కి చెప్పాడు జనరల్.
రైన్స్‌ఫర్డ్ తల అడ్దంగా ఊపుతూ, “లేదు జనరల్, నేను వేటకు రాను,” అన్నాడు.
జనరల్ భుజాలెగరేసి, తీరిగ్గా ద్రాక్షపళ్ళు తినడం ప్రారంభించాడు. “మై డియర్ ఫ్రెండ్! మీ ఇష్టం. ఏది కోరుకుంటారన్నది మీ ఇష్టం. కాని సాహసం చేసి ఒక విషయం చెప్పగలను. ఈవాన్‌తో కన్నా, నేను ప్రతిపాదించిన క్రీడంటేనే మీరు ఇష్టపడతారని ముందే చెబుతున్నా,” అన్నాడు. అడవిపందంత బలిష్ఠమైన గుండెల మీద చేతులు కట్టుకుని చిరచిరలాడుతూ చూస్తూ నిలుచున్న ఈవాన్ వైపు ఒక సంకేతం చేశాడు.
“అంటే మీ ఉద్దేశ్యం…?” అని ఆగిపోయేడు.
“మిత్రమా, నేను ముందే చెప్పలేదూ? వేటంటే నేను చెప్పేదెప్పుడూ ఒక్కటే. దానిలో మార్పు లేదు. ఇది నిజంగా గొప్ప ప్రేరణనిచ్చే సందర్భం. నాకు సమవుజ్జీ అయిన వేటగాడు దొరికినందుకు చాలా ఆనందంగా తాగుతున్నాను,” అంటూ జనరల్ తన గ్లాసు పైకి ఎత్తాడు. రైన్స్‌ఫర్డ్ అతన్ని కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు.
“ఈ ఆట నిజంగా ఆడదగ్గ ఆట అని మీకే తెలుస్తుంది,” అన్నాడు జనరల్ చాలా ఉత్సాహంగా. “మీ తెలివితేటలకీ, నా తెలివితేటలకీ పోటీ; అడవిలో మీ పరిజ్ఞానానికీ నా పరిజ్ఞానానికీ పోటీ; మీ శక్తిసామర్థ్యాలకీ నా శక్తిసామర్థ్యాలకీ పోటీ. ప్రకృతిలో ఆడే చదరంగం ఆట. దానికి వచ్చే ప్రతిఫలం, ఎంత బాగుంటుందో గదా!”
“ఒకవేళ నేను గెలిస్తే,” అంటున్న రైన్స్‌ఫర్డ్ గొంతులోమాట గొంతులో ఉండగానే…
“మూడవరోజు అర్ధరాత్రి వేళకి నేను మీ ఉనికి పట్టుకోలేకపోతే, సంతోషంగా నా ఓటమిని అంగీకరిస్తాను,” అన్నాడు జనరల్ జరోఫ్. “అంతే కాదు, మిమ్మల్ని నా ఓడలో సుఖంగా ఏ రేవులో కావాలంటే అక్కడ దింపే ఏర్పాటుకూడా చేస్తాను.”
రైన్స్‌ఫర్డ్ మనసులో ఉన్న ఆలోచనలను జనరల్ గ్రహించాడు.
“మీరు నా మాట నమ్మొచ్చు,” అన్నాడు ఆ కొసాక్ మళ్ళీ. “ఒక సభ్యతగల ఆటగాడిగా, నాగరికుడుగా మాట ఇస్తున్నాను. అలాగే, మీరు కూడా ఇక్కడికి వచ్చిన విషయం, ఇక్కడి విషయాలూ ఎవరికీ చెప్పకూడదు.”
“అలాంటి షరతులకి నేను అంగీకరించను,” అన్నాడు రైన్స్‌ఫర్డ్.
“ఓ, అలాగా! అయినా ఆ విషయాలు ఇప్పుడెందుకూ చర్చించుకోవడం? మూడు రోజులు పోయిన తర్వాత షాంపేన్ తాగుతూ చర్చించుకోవచ్చు… అప్పటికింకా మీరు…”
జనరల్ తన వైన్ కొద్దిగా తాగి గ్లాస్ టేబుల్ మీద ఉంచాడు. వెంటనే అతని మాటల ధోరణి తక్షణం చెయ్యవలసిన పనిమీదకి మళ్లింది. “ఈవాన్ మీకు వేటకి పనికొచ్చే దుస్తులూ, సరిపడేంత ఆహారం, ఒక పదునైన కత్తీ ఇస్తాడు. నా సలహా మీరు మొకాసిన్ బూట్స్ తొడుక్కోమని. అవి తేలికగా ఉండి అడుగుల జాడ విడిచిపెట్టవు. అంతే కాదు, మీరు ఈ దీవికి ఆగ్నేయంగా ఉన్న రొంపి వైపు వెళ్ళకండి. దాన్ని మేము చావురొంపి అంటాం. అక్కడ ఒక పెద్ద ఊబి ఉంది. ఒక తెలివితక్కువవాడు ఆ ప్రయత్నం చేశాడొకసారి. నా దగ్గరున్న వేటకుక్కలన్నిటిలోకీ చురుకైన లాజరస్ అతన్ని వెంబడించింది. నా ఉద్దేశ్యం మీకు అర్థమయే ఉంటుంది. ఇక నాకు శలవు ఇప్పించండి. నాకు మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే కొంచెంసేపు నిద్రపోవడం అలవాటు. బహుశా మీకు మధ్యాహ్నం పడుకుందుకు సమయం లేదేమో. మీరు ఇప్పుడే బయలుదేరదామని అనుకుంటే ఇప్పుడే బయల్దేరొచ్చు. నేను ఎలానూ సూర్యాస్తమయం అయేదాకా అడవిలోకి అడుగు పెట్టను. పగటికంటే రాత్రివేళే వేటకి బాగా ఉత్సాహకరంగా ఉంటుంది. మీకేమనిపిస్తుంది? మళ్ళీ కలుద్దాం మిస్టర్ రైన్స్‌ఫర్డ్, మళ్ళీ కలుద్దాం.” జనరల్ జరోఫ్ అభివాదం చేస్తున్నట్టు కొద్దిగా వొంగి, గదిలోంచి బయటకు నడిచాడు.
మరొక గదిలోంచి ఈవాన్ వచ్చాడు. ఒక చంకలో ఖాకీ వేటదుస్తులు, వీపుకడ్డంగా వేలాడేసుకొనే ఒక సంచీ నిండా ఆహారం, పొడవాటి వేటకత్తీ, దాన్ని ఉంచడానికి తోలు ఒర ఉన్నాయి. రెండో చేతి బొటనవేలు నడుముకు వేలాడుతున్న దట్టీలో పేల్చడానికి సిద్ధంగా ఉన్న తుపాకీ మీద ఉంది.
రైన్స్‌ఫర్డ్ రెండుగంటలపాటు తుప్పల్లో డొంకల్లో పడి అక్కడినించి దూరంగా పారిపోడానికి కష్టపడ్డాడు. ‘నేను నా ధైర్యాన్ని కోల్పోకూడదు, నా ధైర్యాన్ని కోల్పోకూడదు,’ అనుకుంటూ పండ్ల బిగువున తనని తను హెచ్చరించుకున్నాడు. ఆ కోట తలుపులు తన వెనకే గట్టిగా మూసుకుపోయినపుడు ఏమి చెయ్యాలన్న విషయంలో అతనికి స్పష్టత లేదు. జనరల్ జరోఫ్‌కీ తనకీ ఎంత ఎక్కువ దూరం ఉంటే అంత మంచిదన్నదే ఆలోచించాడు. అందుకనే, ఆలోచన రావడమే ఆలస్యం, భయంతో తెడ్డువేస్తున్న పడవ సరంగులా హుటాహుటిని బయలుదేరాడు. నడుస్తూ నడుస్తూ పరిస్థితినంతా పూర్తిగా అర్థంచేసుకున్న తర్వాత అతనికి తన పరిస్థితి మీద, తప్పించుకునే ఉపాయం మీద సరియైన అవగాహన వచ్చింది. జనరల్‌కి దూరంగా పారిపోవాలనుకోవడం తెలివితక్కువ అని అర్థం అయింది. ఎందుకంటే, తను ఎటు పరిగెత్తినా చివరకి సముద్రపు ఒడ్డుకే చేరుకుంటాడు. చట్రంలో బిగించిన పటంలా తానేం చేసినా దాని పరిధిలోనే చెయ్యవలసి వస్తుంది. కాబట్టి, ఏం చేసినా జెరోఫ్‌కు దొరుకుతున్నట్టే ఉంటూ దొరక్కుండా ఉండాలి.
ఒక్కసారి ఏం చేయాలో స్పష్టత రాగానే రైన్స్‌ఫర్డ్ అప్పటివరకూ నడుస్తున్న దారి వదలి, అడవి దారి పట్టాడు. నక్కలను వేటాడే పద్ధతులు, అవి తప్పించుకోవడానికి వేసే ఎత్తుగడలు గుర్తు తెచ్చుకున్నాడు. ఆపైన అడవిలోకి నేరుగా కాకుండా వలయాలు వలయాలుగా తిరుగుతూ లోపల్లోపలికి నడవడం ప్రారంభించాడు. చీకటిపడేసరికి బాగా అలసిపోయి, చెట్లకొమ్మలు గీరుకుపోయి, దెబ్బలుతిని ముఖమూ కాళ్ళూచేతులూ స్వాధీనం తప్పుతూండగా చివరికి, బాగా దట్టంగా చెట్లున్న గుట్ట మీదకి చేరాడు. అలసట తీర్చుకోవడం తప్పనిసరి అని గ్రహించాడు. శక్తి ఉన్నా, వేటగాడికి చీమ చిటుక్కుమన్నా వినిపించే చీకట్లో నడవడమంత బుద్ధితక్కువ పని మరొకటి ఉండదని అతనికి తెలుసు. అతనికి పిల్లీ నక్కల కథ గుర్తొచ్చింది. ‘ఇప్పటిదాకా నక్కలా చేశాను కాబట్టి, ఇప్పుడు పిల్లిలా చేస్తాను’ అనుకున్నాడు. దగ్గరలోనే విశాలంగా, అన్ని దిక్కులకూ కొమ్మలు చాచుకొనివున్న పెద్ద చెట్టు కనిపించింది. నేలమీద ఏ చిన్న ఆనవాలూ పడకుండా జాగ్రత్త తీసుకుని చెట్టుపైకెక్కి, రెండు కొమ్మల మధ్య విశాలంగా గుబురుగా పరుచుకొని ఉన్న ఒక కొమ్మ మీద పడిపోకుండా కుదురుకుని పడుకున్నాడు.
అలా దొరికిన విశ్రాంతి కొంత అలసట తీర్చింది, ధైర్యాన్ని కూడా ఇచ్చింది. తన జాడ పసిగట్టడం జనరల్ జరోఫ్ లాంటి నిపుణుడైన వేటగాడికి కూడా సాధ్యం కాదు. తను పన్నిన జాడల మతలబు రాక్షసులకు తప్ప సామాన్యులకు చీకటిలో ఛేదించడం సాధ్యం కాదు. కానీ, ఈ జనరల్ రాక్షసుడేనేమో?
దెబ్బతిన్న పాములా రాత్రి చాలా నెమ్మదిగా గడిచింది. అడవి అంతటా శ్మశానంలోలా నిశ్శబ్దం ఆవరించినా, రైన్స్‌ఫర్డ్‌కి మాత్రం నిద్రపట్టలేదు. తెలతెలవారుతూ, ఆకాశం రంగులు మారబోతున్న వేళకి ఎక్కడో భయపడిన పిట్ట అరుపు విని రైన్స్‌ఫర్డ్ ఆ దిక్కున చూసి పరాకయ్యాడు. తుప్పల్లోంచి ఏదో ఆకారం నెమ్మదిగా, జాగ్రత్తగా అడుగులేసుకుంటూ, రైన్స్‌ఫర్డ్ విడిచిన జాడలను అనుసరిస్తూ వస్తోంది. వెంటనే పడుగూపేకలా దట్టంగా అల్లుకుపోయిన ఆకులగుబురులో కొమ్మ మీద కనిపించకుండా దాక్కొని, వస్తున్నదెవరో, ఏమిటో గమనించాడు. ఆ వస్తున్నది మనిషే.
అతను జనరల్ జరోఫ్. నేలమీద జాడలు వెతుకుతున్న తన ఏకాగ్రత ఏమాత్రం సడలకుండా వస్తున్నాడు. అతను చెట్టు క్రిందకు వచ్చి దాని మొదలు దగ్గర నేలనీ, మొక్కల్నీ మోకాళ్ళ మీద కూర్చొని మరీ నిశితంగా పరిశీలించాడు. రైన్స్‌ఫర్డ్‌కి ఒక్కసారి పులిలా అతని మీదకి దూకేద్దామన్నంత ఆవేశం వచ్చింది. కానీ జనరల్ కుడిచేతిలో ఉన్న ఆటోమేటిక్ పిస్తోలు మెరుస్తూ కనిపించింది.
చిక్కుసమస్యలో ఇరుక్కునట్టు, వేటగాడు తన తలను చాలాసార్లు పంకించాడు. తర్వాత లేచి నిల్చుని, సిగరెట్టు వెలిగించాడు. అతను వదిలిన పొగ ఘాటుగా రైన్స్‌ఫర్డ్ ముక్కుపుటాలను తాకింది.
రైన్స్‌ఫర్డ్ ఒక్కసారిగా ఊపిరి బిగబట్టాడు. జనరల్ దృష్టి నేలను విడిచి చెట్టుమీదకి మళ్ళింది. చెట్టును అంగుళం అంగుళం పరీక్షించడం మొదలుపెట్టింది. రైన్స్‌ఫర్డ్ అక్కడికక్కడే కొయ్యబారిపోయాడు. ప్రతి కండరం స్ప్రింగులా సాగింది. కానీ ఎందుకో రైన్స్‌ఫర్డ్ ఉన్న కొమ్మదాకా పోకుండానే జనరల్ దృష్టి మరలింది. అతని ముఖంలో చిరునవ్వు విరిసింది. గాలిలోకి రింగులు రింగులుగా పొగ వదిలాడు. చెట్టు సంగతి విడిచిపెట్టి నిర్లక్ష్యంగా వచ్చిన జాడల వెనుకే తిరిగి వెళ్లడం ప్రారంభించాడు. అతని అడుగుల చప్పుడు క్రమంగా క్షీణించింది.
అంతవరకు ఊపిరి ఉగ్గబట్టుకున్న రైన్స్‌ఫర్డ్ ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. ముందుగా, రాత్రిపూట అడవిలో తను వదిలిన జాడలను జనరల్ పసిగట్టగలిగేడన్న ఆలోచన అతనికి ఎక్కడలేని నిస్సత్తువని కలుగజేసింది. అది కూడా సామాన్యమైన జాడల వలయం కాదు. నిస్సందేహంగా అతనికి అసాధారణమైన శక్తియుక్తులున్నాయి. కేవలం తన అదృష్టం వల్ల ఒక్క లిప్తలో జనరల్ తన జాడ పోల్చుకోలేకపోయాడు.
కానీ మరికొంచెం ఆలోచించిన తర్వాత తట్టిన కారణం అతనికి మరింత భయాన్ని కలగజేసింది. వెన్నులో వణుకు పుట్టింది. జనరల్ వెళ్ళేముందు ఎందుకు చిరునవ్వు నవ్వాడు? అనుమానం వచ్చిన తర్వాత నివృత్తి చేసుకోకుండా ఎందుకు వెనక్కి వెళ్ళిపోయాడు?
తార్కికంగా వచ్చిన ఏ సమాధానమూ అతనికి సంతృప్తికరంగా లేదు. తొలిసంధ్య మబ్బుతెరలలోంచి సూర్యుని లేతకిరణాలు చొచ్చుకొస్తున్నంత స్పష్టంగా ఇప్పుడు నిజం అతని కళ్ళముందు కనిపించసాగింది. జనరల్ తనతో ఆడుకుంటున్నాడు! జనరల్ తనకోసం మరొక రోజు వినోదాన్ని దాచుకున్నాడు! నిజానికి జెరోఫ్ పిల్లి; తనే ఎలుక. అప్పుడు ప్రాణభయం అంటే ఏమిటో పూర్తిగా అర్థం అయింది రైన్స్‌ఫర్డ్‌కి.
‘లేదు. నా ధైర్యాన్ని కోల్పోకూడదు; నా ధైర్యాన్ని కోల్పోను.’ అనుకున్నాడు.
చెట్టునుండి క్రిందకి దిగబ్రాకేడు. మళ్ళీ అడవి త్రోవ పట్టాడు. అతని ముఖం గంభీరంగా మారింది. అతని సర్వశక్తులూ ఇపుడు తర్వాత చెయ్యవలసిన పనిమీదే నిమగ్నమై ఉన్నాయి. మూడువందల గజాల దూరంలో చచ్చి, బాగా ఎండిపోయిన పెద్ద చెట్టు ఒకటి బ్రతికున్న మరొక చిన్న చెట్టుకి అతి ప్రమాదకరంగా ఆనుకుని ఉండడాన్ని గమనించాడు. సంచీ పక్కనబెట్టి, ఒరలోంచి కత్తి బయటకి తీసి, తన వ్యూహాన్ని అమలు చెయ్యడానికి ఉపక్రమించాడు. చివరికి ఎలాగో అనుకున్నది అనుకున్నట్టు పూర్తిచెయ్యగలిగాడు. మరొక వందగజాల దూరంలో, పడిపోయి ఉన్న ఒక పెద్దదుంగ క్రింద దాక్కున్నాడు. అతను ఎక్కువసేపు నిరీక్షించనవసరం లేకపోయింది. ఎలుకతో చెలగాటం ఆడడానికి పిల్లి మళ్ళీ వస్తోంది.
వేటకుక్కకున్నంత ఖచ్చితత్వంతో, జనరల్ జరోఫ్ తన వేట జాడలు అనుసరిస్తూ వస్తున్నాడు. తొక్కుకుపోయిన గడ్డిపరక, వొంగిపోయిన కొమ్మ, నాచుమీద ఎంత చిన్న అనుమానించదగ్గ ఆనవాలు కనిపించినా, అది నిశితమైన అతని పరిశీలననుండి తప్పించుకోలేకపోయింది. అతనెంత ఏకాగ్రతతో నడుస్తూ వస్తున్నాడంటే రైన్స్‌ఫర్డ్ అతనికోసం పన్నిన ఉచ్చుని గుర్తించే లోపునే పొరపాటు జరిగిపోయింది. పైకి చొచ్చుకువచ్చిన కొమ్మని అసంకల్పితంగా తన కాలు ఇలా తాకీ తాకగానే, రానున్న అపాయాన్ని జనరల్ క్షణంలో గ్రహించాడు. వెంటనే, అతిలాఘవంగా వెనక్కి గెంతాడు; అయినా ఆ గెంతడంలో అతనొక లిప్తకాలం ఆలస్యం చేశాడు. తగిలితే చాలు పడిపోయేలా ఆ బ్రతికున్న చెట్టుకి జాగ్రత్తగా ఏర్పాటు చేసిన ఆ ఉచ్చుకి, ఎండిన మాను దబ్బున పడిపోతూ జనరల్ భుజాన్ని బలంగా తాకింది. గెంతడం ఏమాత్రం ఆలస్యం అయి ఉన్నా అతను దానికింద పడి నలిగిపోయి ఉండేవాడే. అతను తూలేడు గాని దానిక్రింద పడిపోలేదు. గాయపడిన భుజాన్ని చేతితో ఒత్తి పట్టుకొని అక్కడే నిలబడ్డాడు.
అప్పుడు జనరల్ హేళనగా నవ్విన నవ్వు, రైన్స్‌ఫర్డ్‌ని నిలువెల్లా వణికించింది.
“రైన్స్‌ఫర్డ్!” అంటూ గట్టిగా అరిచాడు జనరల్, “మీరు ఇక్కడే ఎక్కడో నా మాటలు వినిపించేంత దూరంలో ఉంటారని నా నమ్మకం. మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. మలయాలో ప్రయోగించే ఈ ‘మనుషుల ఉచ్చు’ ఎలా ఏర్పాటు చెయ్యాలో చాలామందికి తెలీదు. అదృష్టవశాత్తూ నాకు మలయాలో వేటాడిన అనుభవం ఉంది. మిస్టర్ రైన్స్‌ఫర్డ్, మీతో వేట చాలా సరసంగా ఉంది. నా గాయానికి కట్టు కట్టుకుందుకు నేనిప్పుడు వెళుతున్నాను. గాయం చిన్నదే. కట్టు కట్టుకుని తిరిగి వస్తాను. తప్పకుండా తిరిగి వస్తాను.”
గాయపడ్డ భుజాన్ని రెండో చేత్తో రాసుకుంటూ జనరల్ నిష్క్రమించగానే, రైన్స్‌ఫర్డ్ మళ్ళీ తన పలాయనం ప్రారంభించాడు. ఈసారి నిజంగా పలాయనమే. అన్ని ఆశలూ అడుగంటి, తెగించి చేస్తున్న సాహసం. అలా అతను కొన్ని గంటలు నడుస్తూపోయాడు. సూర్యాస్తమయం అయింది. చీకటిపడింది. అయినా నడక ఆపలేదు. కొంత సేపటికి మొకాసిన్ల క్రింద నేల మెత్తగా తగలడం ప్రారంభించింది. నేలమీది తుప్పలు కూడా గుబురుగా పెరిగి ఉన్నాయి. దోమలు గట్టిగా కుట్టడం మొదలుపెట్టేయి.
అడుగు ముందుకు వెయ్యబోయేసరికి కాలు మెత్తగా నేలలో దిగబడింది. బైటకి లాక్కునేందుకు ప్రయత్నించాడు గాని జలగపట్టు పట్టినట్టు బురద లోంచి అతని కాలు ఊడి రాలేదు. కష్టపడి కష్టపడి చివరకి కాలు బయటకి తీసుకోగలిగాడు. అప్పుడతనికి అర్థమయింది ఆ ప్రదేశం ఏమిటో. జనరల్ చెప్పిన చావురొంపి అదే. భయం అతనికి ఒక కొత్త ఉపాయం చెప్పింది. పది పన్నెండు అడుగులు ఆ ఊబి నుండి దూరంగా జరిగి, ఏదో జంతువు తవ్వినట్టు అక్కడి నేలను తవ్వడం ప్రారంభించాడు.
రైన్స్‌ఫర్డ్‌కి పూర్వం ఫ్రాన్స్‌లో యుధ్ధం చేస్తున్నప్పుడు కందకం తవ్విన అనుభవం ఉంది. క్షణం ఆలస్యమైనా మృత్యువాత పడడాన్ని తప్పించుకోలేని సందర్భం అది. కానీ, ఇప్పటితో పోలిస్తే, ఆ పరిస్థితి అసలేమీ కాదు. క్రమంగా గొయ్యి లోతు అయింది. అది అతని భుజాలదాకా వచ్చిన తర్వాత బయటకి వచ్చి, చుట్టుపక్కల ఉన్న చేవైన కొమ్మల్ని నరికి సూదిగా చెక్కేడు. వాటిని ఆ గోతిలో అడుగున నిలువుగా పాతి, గొయ్యి కనిపించకుండా బులబులాగ్గా చుట్టుపక్కల దొరికిన లేత కొమ్మలతో, తీగెలతో మెత్తగా శయ్యలా పరిచాడు. ఒళ్ళంతా అలిసి, చెమటలు కారుతుండగా, దూరంగా, పిడుగుపాటుకి కాలిపోగా మిగిలిన ఒక చెట్టుకొయ్య కనిపిస్తే, దాని వెనక నక్కి కూచున్నాడు.
వేటగాడు తరుముకుంటూ వస్తున్నాడని అతనికి తెలుస్తోంది. ఎందుకంటే, మెత్తని నేలమీద గబగబా వేసే అడుగులు చేసే శబ్దం అతనికి వినవచ్చింది. దానికి తోడు, తేలికగా వీస్తున్న గాలి జనరల్ కాలుస్తున్న సిగరెట్టు పొగ కమ్మని వాసనని మోసుకువస్తోంది. చిత్రంగా జనరల్ తన జాడలు వెతుక్కోకుండా అసాధారణమైన వేగంతో అడుగులు వేసుకుంటూ వస్తున్నట్టు అనిపిస్తోంది. నక్కి కూచున్న రైన్స్‌ఫర్డ్ జనరల్‌ని గాని, గోతిని గాని చూడడం లేదు. క్షణం ఒక యుగంలా గడిపేడు. గోతిమీద కప్పిన కప్పు కూలి, విరిగిన కొమ్మల చప్పుడూ, సూదిగా ఉన్న కర్రలు తమ లక్ష్యానికి గుచ్చుకోగానే అకస్మాత్తుగా ఒక జీవి చేసిన ఆక్రందనా వినిపించాయి. ఉత్సాహంతో విజయగర్వంతో గట్టిగా కేకవేద్దామన్న కోరిక కలిగింది రైన్స్‌ఫర్డ్‌కి; అతను దాగున్న చోటునుండి ఒకసారి లేచి తొంగి చూశాడు. భయంతో వెంటనే తిరిగి దాక్కున్నాడు. గొయ్యికి మూడడుగుల దూరంలో చేతిలో టార్చిలైటుతో ఒక వ్యక్తి నిలుచుని కనిపించాడు.
“బ్రావో రైన్స్‌ఫర్డ్!” అన్నాడు జనరల్. “బర్మాలో పులుల్ని పట్టుకుందుకు ఏర్పాటుచేసే పన్నాగం నా వేటకుక్కల్లో గొప్పదైన మరో కుక్కను బలి తీసుకుంది. ఇప్పుడు కూడా మీదే పైచేయి. అయితే నా వేటకుక్కలన్నిటినీ మీరు ఎలా ఎదుర్కుంటారో చూస్తాను. ఇక ఈ రాత్రికి విశ్రాంతి తీసుకుంటాను. ఈ సాయంత్రం చాలా సరదాగా గడిపే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.”
తెల్లవారుతుండగా, ఊబికి దగ్గరలోనే నిద్రపోతున్న రైన్స్‌ఫర్డ్‌కు భయపడటానికి కొత్త నిర్వచనాన్నిచ్చే అరుపులు వినగానే తెలివొచ్చింది. అవి చాలా దూరం నుండే ఆగి ఆగి వినిపిస్తున్నప్పటికీ, అవేమిటో వెంటనే పోల్చుకున్నాడు. అవి వేటకుక్కలగుంపు మొరుగులు.
అతనికిప్పుడు తనముందు రెండే మార్గాలు కనిపించాయి. ఉన్నచోటే ఉండి నిరీక్షించడం. కానీ అది ఆత్మహత్య చేసుకోడంతో సమానం. రెండవది అక్కడినుండి పరిగెత్తి పారిపోవడం. అది జరగబోయేదాన్ని కొంచెం వాయిదా వేస్తుంది తప్ప ఇంకేమీ చేయదు. ఒక్క క్షణం అక్కడే ఆలోచిస్తూ నిలుచున్నాడు. అతనికి తప్పించుకోడానికి అతి చిన్న అవకాశం ఇవ్వగలిగిన ఒక ఆలోచన తట్టింది.
కుక్కల అరుపులు రాను రాను దగ్గరౌతున్నాయి. ఒక గుట్ట దగ్గర రైన్స్‌ఫర్డ్ పెద్ద చెట్టు ఎక్కి వెనక్కి చూశాడు. ఒక పావుకిలోమీటరు దూరంలో చిన్న సెలయేటికి దగ్గరలో పొదల్లో కదలిక కనిపించింది. పట్టిపట్టి చూస్తే, సన్నగా పొడవుగా జనరల్ జరోఫ్, అతనికి కొంచెం ముందు, అడవిలోని చెట్టుకొమ్మల్ని చీల్చుకుంటూ వస్తున్న మరొక భీకర ఆకారమూ కనిపించాయి. అతను ఈవాన్ అని వెంటనే అర్థమయింది. అతన్ని ఏదో ముందుకుపట్టి లాగుతుంటే నిలదొక్కుకుంటూ వస్తున్నాడు. అంటే అతను వేటకుక్కల్ని అదుపు చేస్తూ నడుస్తున్నాడన్నమాట.
ఇక వాళ్ళు ఏ క్షణంలోనైనా తనమీద పడొచ్చు. అతనికి ఉగాండాలో స్థానికులు ఉపయోగించే ఒక ఉపాయం తట్టింది. చెట్టుమీంచి క్రిందకి దిగాడు. స్ప్రింగులా బాగా వొంగగలిగిన చేవగల లేత చెట్టుకొమ్మనొకదాన్ని ఎంచుకొని, తన చేతిలో ఉన్న కత్తిని అక్కడ కనిపించిన అడవి తీగతో దానికి ఈటె లాగా బిగించి, తన దారికి వెనుకగా వచ్చేట్టు ఎక్కుపెట్టిన బాణం లాగా కట్టాడు. ఆపైన దానికి ఆకులు కప్పేడు. ఒక పది అడుగుల ముందు దానికి సన్నని అడవి తీగను కట్టిపెట్టేడు. తీగ ఏమాత్రం కదిలినా ఈటె నేరుగా గుండెల ఎత్తులో దూసుకొనిపోతుంది. ఆపైన రైన్‌ఫర్డ్ ప్రాణానికి తెగించి పరిగెత్తడం ప్రారంభించాడు. సరికొత్త చప్పుడు పసిగట్టగానే వేటకుక్కలు మరింత గట్టిగా అరవడం ప్రారంభించాయి. మరింత బలంగా ముందుకు పరిగెత్తడానికి గింజుకున్నాయి. వాసన పసిగట్టిన వేటకుక్కల మానసికస్థితి ఎలా ఉంటుందో రైన్స్‌ఫర్డ్‌కి బాగా తెలుసు.
పరిగెత్తి పరిగెత్తి ఊపిరి నిలబెట్టుకుందుకు ఒక్క క్షణం ఆగేడు. కుక్కల మొరుగులు క్షణకాలం ఆగేయి. రైన్స్‌ఫర్డ్ గుండె కూడా ఉత్కంఠతో ఆగినంత పనయ్యింది. కుక్కలు కత్తి దాపుకి వచ్చి ఉంటాయి.
ఒక ఎత్తైన చెట్టుకొమ్మని ఎగిరి రెండుచేతులతో అందుకుని వెనక్కి చూశాడు. తనని వెంట తరుముతున్న వాళ్ళు ఆగిపోయారు. చెట్టు పైకెక్కి చూసిన తర్వాత రైన్స్‌ఫర్డ్ మనసులో కలిగిన ఆనందం ఆవిరైపోయింది. సమతలంగా క్రింద కనిపిస్తున్న అ లోయలో జనరల్ జరోఫ్ ఇంకా నడుస్తూ కనిపించాడు. అయితే ఈవాన్ మాత్రం కనిపించలేదు. తన ఉపాయం పూర్తిగా విఫలం కాలేదు అనుకున్నాడు.
అతను చెట్టు దిగేడు, అంతలోనే వేటకుక్కల అరుపులు మళ్ళీ అందుకున్నాయి. ‘ధైర్యం కోల్పోకూడదు’ అని తనని తాను హెచ్చరించుకుంటూ పరుగు లంకించుకున్నాడు. ఎదురుగా చెట్లసందుల్లోంచి నీలంగా ఏదో ఖాళీ కనిపిస్తోంది. వేటకుక్కలు రాను రాను మరీ దగ్గరౌతున్నాయి. రైన్స్‌ఫర్డ్ కనిపిస్తున్న ఆ ఖాళీ వైపు పరిగెత్తాడు. సముద్రం అంచుకు చేరుకున్నాక, అటూ ఇటూ చూసేడు. అక్కడనుండి జనరల్ జరోఫ్ కోట కనిపిస్తోంది. ఇరవై అడుగుల లోతులో సముద్రం భీకరంగా అల్లకల్లోలంగా ఉంది. రైన్స్‌ఫర్డ్ దూకడానికి సందేహించాడు. కానీ దగ్గరలోనే వేటకుక్కల అరుపులు వినిపించాయి. అంతే, వేరే ఆలోచన లేకుండా ఒక్కసారిగా సముద్రంలోకి దూకేడు.
వేటకుక్కలతో అక్కడిదాకా వచ్చిన జనరల్, చుట్టూ చూసి, క్రింద లోతుగా కనిపిస్తున్న సముద్రతలాన్ని తీక్షణంగా పరిశీలించాడు. తర్వాత ఒకసారి భుజాలెగరవేసి అక్కడే కూర్చుని, తన వెండి ఫ్లాస్కులోంచి బ్రాందీ వొంపుకు తాగి, సిగరెట్టు ముట్టించి, కూనిరాగం తియ్యడం ప్రారంభించేడు.
విశాలమైన భోజనంబల్ల మీద ఆ రాత్రి జనరల్ జెరోఫ్ ఒక్కడే కూచుని మంచి భోజనం చేశాడు. చక్కటి వైన్, షాంపేన్ తాగేడు. వేట ఇచ్చిన సవాలు అతనికి ఆనందాన్నిచ్చింది. అంత ఆనందంలోనూ అతన్ని రెండు విషయాలు బాధిస్తున్నాయి. మొదటిది, ఈవాన్ లాంటి మనిషి తనకు మళ్ళీ దొరకడు. రెండవది, తన వేట తనని తప్పించుకుని పారిపోయాడు. దానికి కారణం ఆ అమెరికన్ తన ఆట పూర్తిగా ఆడకపోవడమే, అనుకున్నాడు. మనశ్శాంతికోసం లైబ్రరీకి వెళ్ళి మార్కస్ ఆరీలియస్ పుస్తకం ఒకదాన్ని కాసేపు చదివాడు. పది కొట్టగానే తన పడకగది చేరుకున్నాడు. తలుపు గడియ వేస్తూ ఒళ్ళు సలపరించేంత హాయిగా తను అలిసిపోయేడని అనుకున్నాడు. లైటు వెలిగించబోతూ, కిటికీలోంచి సన్నగా వెన్నెల కనిపించడంతో, అక్కడనుండి క్రింద ఆవరణలోకి చూశాడు. తన వేటకుక్కలవైపు చూస్తూ, ‘వచ్చేసారి అదృష్టం మనదే!’ అంటూ చెయ్యి ఊపాడు. తిరిగి వచ్చి లైటు వేశాడు.
పందిరి మంచం వెనుక తెరల్లో ఎవరో మనిషి నిలుచున్నట్టు అనిపించింది.
“రైన్స్‌ఫర్డ్!” అంటూ గట్టిగా ఒక్క కేకపెట్టాడు. “మీరిక్కడికి ఎలా రాగలిగేరు?”
“ఈదుకుని,” జవాబిచ్చాడు రైన్స్‌ఫర్డ్. “అడవి లోనించి నడిచిరావడం కంటే ఇదే సులువైన మార్గం అని తోచింది.”
జనరల్ గుండెనిండా ఊపిరి పీల్చుకుని ఒక నవ్వు నవ్వాడు. “నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. గెలుపు మీదే!”
బదులుగా, రైన్స్‌ఫర్డ్ నవ్వలేదు. “నేను ఇంకా వెంట తరుముకుంటూ వస్తున్న మృగాన్నే జనరల్ జరోఫ్, సిద్ధంగా ఉండండి!” అని హెచ్చరించాడు.
అభివాదం చేస్తున్నట్టు, జనరల్ సగానికి వొంగి, “అలాగా! అయితే మరీ మంచిది. మనలో ఎవరో ఒకరు వేటకుక్కలకి ఈ రాత్రి విందు అవుతారు. రెండవవాళ్ళు ఈ మెత్తని పరుపు మీద పడుకుంటారు. రైన్స్‌ఫర్డ్, కాచుకోండి!” అని ప్రతి సవాలు విసిరాడు.
‘ఇంత చక్కని పరుపు మీద నేను ఇంతకు ముందెప్పుడూ పడుకోలేదు!’ అనుకున్నాడు రైన్స్‌ఫర్డ్.
-------------------------------------------------
రచన: నౌడూరి సూర్యనారాయణ మూర్తి
మూలం: Richard Connell
(మూలం: The most dangerous game.)
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment