Monday, October 7, 2019

స్టకాటో


స్టకాటో




సాహితీమిత్రులారా!

టింగ్-టిటింగ్-టిటింగ్-టింగ్ టింగ్ టింగ్-టిటింగ్-టిటింగ్-టింగ్ టింగ్… అలారం మోగింది. నిద్ర తేలిపోయింది. డిజిటల్ క్లాక్ ఎర్రగా చూపిస్తోంది. అయిదు. అంటే పావుతక్కువ అయిదే. పావుగంట ఎర్లీగా సెట్ చేసిందది. పిల్లలు రెడీ అవడానికి టైమ్ దొరకుతుందని.

చల్లటి ఫాను గాలి. చల్లబడ్డ మార్బుల్ ఫ్లోర్. వెచ్చబడ్డ మాట్రెస్. లేవాలి. తను లేస్తాడు. తేలిగ్గానే. అయిదారు నెల్ల క్రితం కష్టమయ్యేది కిందనుంచి లేవడం. ఇప్పుడు తేలికే. కళ్లు మంట. లేట్‌గా పడుకోబట్టి. మూసుకుంటే సరి. కాసేపేగా. ఏమిటా కల? కొంచెమే గుర్తుంది. అబ్బే. లేదు. ఎరేజ్ ఐపోయిందప్పుడే. మబ్బులా తేలిపోయింది. నింగిలో మబ్బు. నేలపై గబ్బు. నింగి. దివి… ఏ దివిలో విరిసిన పారిజాతమో… ఏ కవిలో మ్రోగిన… మ్రోగిన… త్రాగిన… క్రాగిన… లేదు క్రాగిన అన్న పదమే లేదు. మూతపడతామంటున్న కళ్లు తెరిచి చూస్తే అయిదుంపావు. అంటే అయిదు. ఇక లేవాలి. లే. ఇవాళ డేటెంతా? సెప్టెంబర్ ఇరవై. ఇంకా వారముంది. శాలరీ క్రెడిట్ కావడానికి. నిద్రమత్తు వదిలింది. త్వరగా నడు.

మొబైల్లో మూడు మెసేజిలు. రెండు ఆఫీస్ నుంచి. కొంపేం మునగలేదు. తర్వాత చదవొచ్చు. ఇంకోటి కవితనుంచి. ఏమంటోంది కవిత? కళ్లజోడు పెట్టుకుంటే గానీ కనపడదు. కళ్లజోడేదీ? బెడ్రూమ్‌లోకి. వొద్దులే. లైటేస్తే తను తిడుతుంది. తర్వాతే చదువుదాం.

కిచెన్లోకి. గిన్నేదీ? ఇక్కడుంది. అరగ్లాసు నీళ్లు. స్టవ్ మీద. లైటర్? ఇదిగో. ఠక్. ఠక్. రెండుసార్లు కొడితే గానీ వెలగదిది. వెలిగింది. నీలం మంట. గ్లాస్. ఉప్పు డబ్బా. రెండు చిటికెల ఉప్పు గ్లాసులో. స్టవ్ ఆఫ్. గోరువెచ్చటి నీళ్లు గ్లాసులోకి. ఇవ్వాళ డేటెంతా? ఇరవై. ఓకే. గ్లాసు గుండ్రంగా తిప్పుతూ నేరుగా బాత్రూమ్‌లోకి. లైటాన్. ఒకప్పుడు ‘లైట్సాన్. సైలెన్స్.’ చెన్నైలో కదూ విన్నది. జిప్ డౌన్. ఫ్లష్. చిన్న పనిక్కూడా పన్నెండు లీటర్లు హుష్ కాకి. కానీ. తప్పదంతే. వాష్ బేసిన్. పుక్కెడు నీళ్లతో పుక్కిలింపు. ఉప్పటి రుచి. నిద్రమత్తు పూర్తిగా వదిలింది. టీషర్ట్. ఇవ్వాళేది వేసుకుందాం? యెల్లోది. బానే ఉంటుంది. బ్లూ నిక్కర్ మీద బ్రైటెల్లో.. సాక్స్.. షూస్.. నాలుగువేలు. హష్ పపీస్‌ట. అయితే ఏంటటా? నాలుగువేల రూపాయల షూస్ వేసుకుంటానని యెప్పుడన్నా అనుకున్నామా? అసలు, అన్నీ అనుకున్నట్టే అయితే అంతకన్నా కావలసిందేముంది? అందరూ అంబానీలైపోరూ? అంబానీకి మాత్రం సుఖమెక్కడిది? నిరంతరం పని పని పని… సరిగ్గా నిద్రైనా పడుతుందా? అనుమానమే. రెప్పపాటు అజాగ్రత్తగా ఉన్నా కోట్లలో నష్టం రాదూ? లాభం కూడా కోట్లలోనే వస్తోంది కదోయ్ బడుద్ధాయ్? అసలూ, అన్ని వేల కోట్లు యేం చేసుకుంటారు? ఎలా ఖర్చుపెట్టుకుంటారు? అబ్బా! ఈ సాక్స్ తొందరగా పట్టవేం? షాపులో చూసినప్పుడు బానే చచ్చినై. వేసుకుంటున్నప్పుడే టైటు. వేసుకున్న తర్వాత మళ్లీ బానే చస్తాయి. కిచెన్‌లో లైటాఫ్. స్కూటీ కీస్. తనూ లేచింది. ఒక చిన్న నవ్వు. వెచ్చటి హగ్. తనకింకా నిద్రమత్తు తగ్గలేదు. ఎలా తగ్గుతుందీ! తనూ లేటుగానే పడుకుందిగా వాట్సాప్ చూసీ చూసీ!

తలుపు తీయగానే మెట్లు. మూడో అంతస్తునుంచి దిగేటప్పుడు బానే ఉంటుంది. ఎక్కేటప్పుడే… ఈ మధ్య బానే ఉంటోందిలే. ఈ లిఫ్టుని ఎప్పుడు బాగుచేయిస్తారో మరి. ఏడాదిన్నరైంది. వెధవ ఇగోలకి పోతారు పైన ఫ్లాటువాడూ కింద ఫ్లాటువాడూను. జేబులోంచి పైసా తియ్యాలంటే చచ్చిపోతారు. అంబానీ అంత కాదు గానీ బానే సంపాదిస్తున్నారుగా. ఏమిటో వీళ్ల మధ్య ఎందుకూ పనికిరాని రాజకీయాలు. చావనీ. టైమెంతా? అయిదున్నర. అంటే… అయిదుంపావు. కాదు. అయిదున్నరే. మొబైల్ సరిగ్గానే చూపిస్తుంది. సర్లే.

బయటింకా చీకటిగానే ఉంది. స్కూటీ స్టాండు తీసి నెట్టుకుంటూ బైటకు. హోండా. పార్కింగ్‌లోపలే స్టార్ట్ చేస్తే పెద్ద సౌండ్ అవుతుంది. నచ్చదు. డిక్కీలోంచి హెల్మెట్ తీసి తగిలించుకుని, స్కూటీని బయటికి నడుపుకొచ్చి స్టార్ట్ చేసి… రివ్వున మొహానికి తగులుతున్న చల్లటి గాలి. అయిదు నిముషాలు చాలు.

ఆరావళీ బయోడైవర్సిటీ పార్క్. పేరు మాత్రం అదిరింది. ట్రాకు మాత్రం బాలేదా ఏంటి? బానే వుంది. చాలావరకూ జెంట్రీ కూడా పర్లేదు. ఇనపగేటులోంచి లోపలికి అడుగుపెడుతూ మొబైల్ తీసి చూస్తే అయిదూ యాభైరెండు. అంటే… అంటే అయిదూ నలభయ్యేగా? కాదూ! ఇది సరిగ్గానే చూపిస్తుంది. ఇందాకేగా అనుకుందీ? సర్లే సర్లే. యాభై రెండు గుర్తుంచుకుంటే సరి.

నడవడం. పల్లంగా సాగుతున్న ట్రాక్. వద్దనుకున్నా పెద్ద పెద్దగా పడే అడుగులు. జాగింగ్? ఇప్పుడే కాదు. బాడీ వార్మయాక, అప్పుడు. ఓకే. ముందు ముగ్గురు కుర్రాళ్లు నడుస్తున్నారు. పల్లం కాబట్టి వాళ్లని దాటేయడం ఈజీనే. దాటుతుంటే వాళ్ల దగ్గర్నుంచి సిగరెట్ వాసన. సిగరెట్లు తాగి వాకింగా? ఏమిటో ఈ కుర్రకారు తీరు. వర్క్ హార్డ్. పార్టీ హార్డర్. అంటే? హార్డ్‌గా తాగాలా? నీళ్లు లేకుండానా? అది రా గదా? తాగగలిగినవాళ్లు తాగుతారోయ్, తాగుతారు. తారు-కారు-తీరు. వరస బాగుంది. వరస సరే. వాళ్లు సిగరెట్లు కాల్చితే తనకెందుకు? తాగితే తనకెందుకు? నాకెందుకులే అని వూరుకోలేకే గదా తంటా!

వంపులు తిరుగుతూ ట్రాక్. మనుషులు ఆ వొంపుల్లో నడుస్తూ మాయమౌతూ. అదుగో, వస్తోంది పొట్టిపిల్ల. గబగబా నడుస్తూ. కళ్లు దించుకుని. బ్లూ టీషర్టు. నల్ల పాంటు. పిల్ల నా భుజాల కిందికి వస్తుందేమో. వద్దూ. వద్దూ. మొహం కన్నా కిందికి చూడకు. కష్టమైనా సరే. వెధవ అలవాటు. ఎంత వయసొచ్చినా పోదు. ఎంతనీ. నలభై మూడేగా. ఇంకా సౌత్ హీరోలాలేనూ. జుట్టు కొంచెం పల్చబడిందిగానీ…

ఇప్పుడు పెరుగుతున్న ఎత్తు. అడుగుల్లో వేగం. వొళ్లు కొద్దికొద్దిగా వెచ్చబడుతోంది. ట్రాక్‌కి రెండు వైపులా దట్టమైన మొక్కలూ చెట్లూ. రకరకాల కీటకాల, పక్షుల కూతలు. మెల్లిమెల్లిగా తెలుపెక్కుతున్న ఆకాశం. చల్లగా గాలి. ఆహా! ఎంత ప్రశాంతత! ఎంత బాంది! బాంది కాదు. బాగుంది అనాలి. సర్లేవోయ్! రెండూ ఒకటే. పద పద. ఇప్పుడు లంబీ లంబీ సాస్. దీర్ఘంగా శ్వాసించాలట. రాందేవ్ ఉవాచ. రాందేవ్ చెప్పింది ఇప్పుడు. ఆర్మీలో పీటీ ట్రైనర్లూ చెప్పేవాళ్లు. లంబీ లంబీ సాస్. బ్రెత్ కంట్రోల్. లెఫ్ట్-రైట్-లెఫ్ట్-రైట్-బ్రీత్ ఇన్- బ్రీత్ ఔట్-బ్రీత్ ఇన్-బ్రీత్ ఔట్. అమ్మయ్య, సెట్టయింది.

జాగింగ్ మొదలు. ట్రాక్ మళ్లీ పల్లం. ట్రాక్ పక్కనున్న సిమెంట్ కుర్చీలు. దానిమీద కూర్చుని ప్రాణాయామం చేస్తున్నాడొకతను. ఓకే. బ్రీత్ ఇన్- బ్రీత్ ఔట్. ఒక ముంగిస లెఫ్ట్ నుంచి రైట్‌కి పరుగెత్తి పొదల్లో మాయమైంది. లెఫ్ట్-రైట్-లెఫ్ట్-రైట్… ఇనప గేట్. ఇక్కడ ఈ గేటెందుకో తెలీదు. అందరూ దాటడానికుందేమో!

ఒక్క ఆకైనా లేని చిన్న మోడు చెట్టు. చిటారుకొమ్మన కాకి. ఒంటరి చెట్టు, ఒంటరి కాకి. ఒంటరి కాబట్టి మోడైందా లేక మోడు కాబట్టి ఒంటరైందా? తేల్చడం కష్టమే. ఇప్పుడు సూర్యుడు ఎడమ వైపున. ఎర్రగా. సగం పిజ్జాలా చెంద్రుడు. నడినెత్తిన. వెలాతెలాపోతున్నాడు. అయినా చందమామేగా. అందగాడేగా. వస్తున్నారు. అదుగో, ఆ నలుగురూ వచ్చేస్తున్నారు. పెద్దగా మాట్లాడుతూ. నవ్వుకుంటూ. అబ్బా. చక్కటి ట్రాంక్విలిటీని ఎందుకలా ఛిద్రం చేస్తారో. పోనీ. ఏమంటాం? భరించాల్సిందే. మూసుక్కూచోటమే మంచిది. గిజిగాడి గూళ్లు. ఎడమ పక్కన ఒక చెట్టుకి. కనీసం పది. వీటిని ఫొటో తియ్యాలి. ఐఫోన్‌తో సరిగ్గా రాలేదు. రేపెప్పుడైనా నా నైకాన్‌తో తియ్యాలి. డిఎసెలార్‌తో వాకింగెలా? ఒకరోజు వాకింగ్‌ని శాక్రిఫైస్ చెయ్యాల్సిందే.

ముందు ఒకావిడ. పొడగరి. వొత్తుగా జుట్టు. ట్రాక్ సూట్లో. చేతిలో రుమాల. విసురుకుంటూ వాకింగ్. వెనకాల వాళ్ల అమ్మ. పొట్టిగా. ఆవిడ తల్లేనా? బహుశా ఆమె తండ్రి పోలికేమో. వాకింగ్ చేస్తూ విసురుకోడమెందుకూ? నీకెందుకోయ్? ఊరుకోలేకేనా మళ్లీ?

ఇంతమంది ఎదురుపడుతున్నా ఎవరూ కనీసం చిరునవ్వు విసరరు. ఫారిన్‌లో ముక్కూమొహం ఎరగనివాళ్లు కూడా విష్ చేసుకుంటార్ట! ఒకరోజు ఎదురుపడ్డవాళ్లందరికీ ‘గుడ్ మార్నింగ్’ చెప్పుకుంటూ పోతే ఏమయింది? దాదాపు అందరూ తిరిగి గుడ్ మార్నింగ్ చెప్పారు. కానీ ఒకరోజే. మర్నాడు వాళ్లలో ఎవరైనా ముందుగా విష్ చేస్తారేమోనని ఆశ. ఎవరూ చెప్పలేదు. మర్నాటినుంచీ మనమూ అంతే.

ట్రాక్ ఎత్తుగా ఏటవాలుగా. వేగం తగ్గించకుండానే నడక సాగుతో…

ఎవరో ఫ్లూట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. రాతిమీదెక్కి. సగం సగం రాగాలు. తప్పుల్లేకుండా. పొద్దున్నే పాడే రాగమేది? భూపాలం కదూ. ‘తొలిసంజ వేళలో, తొలిపొద్దు పొడుపులో, తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం, ఎదురొచ్చే కెరటం సిందూరం.’ తొలిసంజ, తొలిపొద్దు, తెలవారే తూరుపూ ఒకటేగా? కాదా? దాసరివారి కవితా ప్రవాహం. ఆయన కాదుటగా? వేరే ఎవరోటగా రాసిందీ? అయినా ఎప్పటి పాట! ఎవర్రాస్తే ఏమిటి? మనకి కావలసింది రాగం కదా.

ఆహ్!నా లిబిడో పసిగట్టిన శరీరం! అమ్మాయి మంచి పట్టుగా ఉంది. ఉంటే ఏంటటా? పదడుగుల వెనక అబ్బాయి. బాడీబిల్డల్లే ఉన్నాడే! ఇద్దరూ నల్ల టీషర్టులే. కూడబలుక్కుని వేసుకున్నారా? మొగుడూ పెళ్లామేమో. కాకపోతే మాత్రమేం? అమ్మాయి టీషర్టుమీద రాసుంది. మాంగో. ఓహో! అంటే? ఏమనుకోవాలి? పెద్ద పెద్ద తెల్లటి అక్షరాలు. కింద? ఛీ. ఛీ. మర్యాద మర్యాద. అదేంటి? వేసుకుంటే పోని మర్యాద చూస్తే పోతుందా? ఆపవోయ్. చూడకు. వెళ్లిపోతున్నారు. వెనక్కి చూద్దామా? ఒద్దు ముందుకే చూడు.

హయిపోవచ్చింది. ఈ మలుపు తిరిగితే చాలు. మరో వంద గజాలు ఎక్కుడు. అక్కడితో ఒక రౌండ్ ఖతం. రెండో రౌండ్ కొడదామా? కొడదాం.

చెమట. తలనుంచి చుక్కలు. భలే మజాగా. చుక్క పడింది. రెప్పమీంచి కంట్లోకి జారి. ఒహ్! మంట. ఉప్పు కదూ. అందుకే మంట. మజా వెనకే మంట!

యాభై గజాలు. నలభై… ముప్ఫై… పది… హమ్మ! అయిపోయిందీ! టైమెంతా? ఆరూ ముప్పయ్యైదు. పర్లేదు. బానే కొట్టుకొచ్చాం. 4652 స్టెప్స్‌ట. 3.2 కిలోమీటర్లట. మొబైల్లో యాప్ చెప్పింది. ఇవాళ్టికి ఓకే!

స్కూటీ స్టార్ట్ చేసి రోడ్ మీదకు రాగానే రివ్వున తాకిన గాలి. ఈసారి మొత్తం వొళ్లంతా తడుముతోంది.. పరమ హాయి. హాయి హాయిగా ఆమని సాగే. సాగిపోదాం పద!
---------------------------------------------------
రచన: ఎస్. ఆర్. బందా, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment