వారఫలాలు
సాహితీమిత్రులారా!
ఈకథను ఆస్వాదించండి.....................
‘మీరోజు’ పత్రికాఫీసు. లోపల అంతా గందరగోళంగా ఉంది – యుద్ధంలో క్షతగాత్రుల్లా ఎక్కడపడితే అక్కడ విసిరేసినట్టు చెత్తకాయితాలూ, అవి అంత ముఖ్యం కానట్టు కంగారుగా వాటిమీదనుంచే ఇక్కడ్నుంచి అక్కడకి అక్కడ్నుంచి ఇక్కడకీ తిరిగే ప్రింటర్లూ, రిపోర్టర్లతో. ఇంతటి కంగార్లో కూడా తమకేం పట్టదన్నట్టు లోపల ఓ గదిలో పత్రికాధిపతి కమ్ ఛీఫ్ ఎడిటర్ కమ్ ఓనర్ లఖన్ రావు ముఖ్యులందర్తోనూ మీటింగులో కూర్చునున్నాడు. అసలు లఖన్ రావుకి తల్లితండ్రులు పెట్టిన పేరు లక్ష్మణ రావు. కానీ పేపర్ సర్కులేషన్ పెరిగే కొద్దీ ఊళ్ళు పట్టి తిరుగుతూ మొదట నేర్చుకున్న విషయం ఏమిటంటే తన పేరు అందరూ సులభంగా పలక గలిగేదిగా ఉండాలి. వీర వెంకట సూర్య భాస్కర లక్ష్మణ రావు అంటే ఎవరికి నోరు తిరిగేది? అందులోనూ – పేరు సుబ్బారావు అని చెప్పగానే ఇంటిపేరు డబ్బారేకుల అని ఆటోమేటిగ్గా తెలిసిపోయే – ఆంధ్రా వాళ్ళ పేర్లంటే ఎంత నామర్దా? అలా ఓ ఢిల్లీ ట్రిప్పూ, కలకత్తా ట్రిప్పూ వేసొచ్చేసరికి లక్ష్మణ రావు లఖన్ రావు అయిపోయేడు. అదలా ఉంచితే, మీటింగులో ముఖ్య విషయం ఏమిటంటే ఎప్పట్లాగానే మీ రోజు పత్రిక సర్కులేషన్ పెంచాలి. ఇప్పటికే తెలుగులో అత్యధిక సర్కులేషన్ ఉన్న పత్రిక, మీరోజు; కానీ డబ్బు యావ అంత సులభంగా తీరేది కాదు కదా? ఎందుకయ్యా అంత తంటా అంటే చెప్పడానికి సమాధానం సిద్ధంగానే ఉంది: “మా పత్రిక వల్ల ఎంతమందికి ఉపాధి లభిస్తోందో చూడవోయ్!”
గంట గడిచినా ఏ ఒక్క సబ్ ఎడిటర్కి కానీ, లఖన్ రావుక్కానీ ఐడియా తట్టనప్పుడో కుర్ర రిపోర్టర్ చెయ్యెత్తేడు మాట్లాడ్డానికి. లఖన్ రావు కు.రి. కేసి ఓ తీస్కారం పడేసి “ఆ చెప్పు, ఏమిటంటావ్?” అనడిగేడు విసుగ్గా.
“అదేం లేద్సార్, మన పత్రికలో మొదట్నుంచీ అసలు దిన ఫలాలు కానీ వార ఫలాలు కానీ ప్రచురించింది లేదు. మిగతా పత్రికల్లో నేను చూసినంత వరకూ ప్రతి ఒక్కరూ దిన, వారఫలాలు చూసుకుంటూ ఉంటారు. అందులోనూ మన హిందువులకి భయం భక్తీ ఎక్కువ గదా? అంచేత మనం కూడా వారఫలాలు రాయిస్తే…”
“ఠాఠ్, ఎవడయ్యా చెప్పింది? మీరోజు పత్రికలో వార ఫలాలా? ప్రచురించడమా? అవి నిజం అవుతాయా? ఇంక నోరు మూసుకో!” కరుగ్గా చెప్పేడు లఖన్ రావు.
కాస్త సీనియర్ ఎడిటర్ ఒకాయన చెప్పేడు పక్కనుంచి నెమ్మదిగా, “కు.రి. చెప్తోంది వార ఫలాలు ప్రచురించడం వల్ల వచ్చే సర్కులేషన్ గురించి సార్. అవి నిజం అవుతాయా పోతాయా అనే దాని గురించి కాదు.”
లఖన్ రావు కాస్త చురుగ్గా చూసేడు ఈ సారి, “దినఫలాలు వేసే ఆ పేజీలో ఆ రెండు మూడు కాలమ్‌ల నిడివి ఒక ఎడ్వర్టయిజ్మెంటుకి ఇస్తే డబ్బులు వచ్చేవుటయ్యా?”
“మీరే ఆలోచించండి, ఎడ్వర్టయిజ్మెంటు ఇస్తే వారానికో ఐదువేలు రావొచ్చు మహా. కానీ పేపర్ సర్కులేషన్ ముఫ్ఫైవేలు పెరిగితే వారానికి ఎంతలేదన్నా అరవైవేలొస్తాయి, పేపర్ రెండు రూపాయలకి అమ్మితే.” సీనియర్ ఎడిటర్ మంటని ఎగదోస్తూ చెప్పేడు.
“అయినా సరే, మీరోజు పత్రికలో వార ఫలాలు రాయలేదిప్పటిదాకా మనం.”
“దాందేవుంది లెండి. మార్పు అనేది సహజమే కదా?”
కాస్త మెత్తబడ్డట్టు కనిపించిన లఖన్ రావు అన్నాడు అనుమానంగా, “మరి అవి రాయడానికి డబ్బులివ్వొద్దూ ఓ సిద్దాంతి గారికి?”
సీనియర్ ఎడిటర్ చిర్నవ్వు నవ్వేడు, “అవి రాసే వాళ్ళంతా సిద్ధాంతులని మీరు నమ్ముతున్నారా?”
పెఠేల్మని నవ్వేడు లఖన్ రావు, “మొత్తం మీద అసాధ్యుడివయ్యా; సరే అలాగే కానీయండి కానీ దినఫలాలు వద్దు. వారానికో సారి వారఫలాలు రాద్దాం. సర్కులేషన్ పెరగక పోతే తీసేయడం అంత కష్టం కాకూడదు మరి.”
మీటింగ్ ముగిసిపోయింది. సీనియర్ ఎడిటర్లందరూ శెభాష్ అంటూ కుర్ర రిపోర్టర్ భుజం చరిచి పనుల్లోకి వెళ్ళిపోయేరు.
వారఫలాలు రాయడానికో పేరు కోసం సీనియర్ ఎడిటర్ ప్రయత్నం మొదలు పెట్టేడు. బాగా ఆలోచించి ఇంటికెళ్ళాక, గత పదిహేనేళ్ళుగా అమెరికాలో ఉంటున్న తన మేనల్లుడు పరమేశ్వర శాస్త్రికి ఫోన్ చేసేడు. వోనేజ్ వచ్చాక అమెరికా ఇండియాలకి అట్నుంచిటూ, ఇట్నుంచటూ ఫోన్లు ఉచితం కదా? ఉభయకుశలోపరి అయ్యేక అసలు విషయం చెప్పేడు, “ఒరే పరం, నీ పేరు వాడుకుని వారఫలాలు రాద్దాం అనుకుంటున్నాను మా పేపర్లో. నీకిష్టవేనా?”
“ఏవిటీ? నేనెప్పుడో నాన్న దగ్గిర కాస్త జాతకం నేర్చుకున్న మాట నిజమే కానీ ఇప్పుడు ఇరవై ఏడు నక్షత్రాల పేర్లు కూడా గుర్తు లేవు. అయినా అమెరికా వచ్చింది న్యూక్లియార్ సైన్స్‌లో డాక్టరేట్ కోసం. నాకు వారఫలాలు రాయడం వచ్చి ఏడిస్తేగా?”
“ఓరి నీ దుంప తెగా, నిన్నెవడు రాయమన్నాడ్రా, నీ పేరు వాడుకుంటాం అన్నాను కానీ.”
“మరెవరు రాస్తారు?”
“నేను లేనా ఇక్కడ?”
“నీ పేరే పెట్టుకోవచ్చుగా అయితే?”
“నాకు డాక్టరేట్ లేదుగా? డాక్టర్ పరమేశ్వర శాస్త్రి అంటే సర్కులేషన్ అమాంతంగా పెరగదూ?”
“అమెరికా అని కూడా రాస్తావా?” అనుమానంగా అడిగేడు పరం.
“లేదులే. అంతలేదు కథ.”
“రేప్పొద్దున్న ఎవరైనా కేసు వేస్తే?” అమెరికాలో లాయర్ల తఢాఖా తెల్సిన మేనల్లుడు అడిగేడు కుతూహలంగా.
“ఏమని వేస్తారు కేసు?” నవ్వేడు ఇండియా జనం నాడి బాగా తెల్సిన మావయ్య, “అయినా నువ్వొక్కడివేనా డాక్టర్ పరమేశ్వర శాస్త్రివి ఇండియాలో?”
“సరే అయితే,” నవ్వుతూ ఫోన్ పెట్టేసేడు మేనల్లుడు.
ఆ పైవారం నుంచి మీరోజు పత్రికలో ప్రతీ ఆదివారం వారఫలం రావడం ప్రారంభమైంది. మొదటి వారంలో హుందాగా ఈ వారఫలాలు రాసేది డాక్టర్ పానుగంటి పరమేశ్వర శాస్త్రి అనీ పెద్ద అక్షరాల్తో పేరు కూడా వేసేరు. వచ్చిన వారఫలాల్లో మచ్చుక్కి మకర లగ్నానికి ఇలా రాసేరు మీరోజు పత్రిక వారు.
కోపతాపాల్తో కుటుంబ సౌఖ్యం పాడుచేసుకోకండి. ఇతరులకి ఇచ్చే అప్పులు అంత సులభంగా వసూలు కాకపోవచ్చు. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే సౌలభ్యం. భగవదనుగ్రం ఉంది. నవగ్రహ స్తోత్రం పఠించాలి.
నాలుగు వారాల్లో మీరోజు ఆదివారం పత్రిక సర్కులేషన్ అమాంతంగా పదివేలు పెరిగింది. దరిమిలా ఈ వారఫలాలు మీ రోజు ప్రింట్ ఎడిషన్ లోనూ ఇంటర్నెట్ లోనూ రావడం మొదలైపోయింది.
ఇక్కడే ఎవరూ ఊహించని మలుపు తిరిగింది కధ.
ఈ నాలుగు వారాలూ విడవకుండా క్షుణ్ణంగా వారఫలాలు చదివిన న్యూక్లియార్ సైంటిస్టు డాక్టర్ పానుగంటి పరమేశ్వర శాస్త్రి ఉరఫ్ పరం తీరిగ్గా ఓ రెండు గంటలు ఆలోచించి సాయంకాలం బేస్ బాల్ ప్రాక్టీస్ నుంచి వచ్చిన కొడుకు సుధీర్‌తో చర్చించేడు కథా కమామీషూ.
సుధీర్ హైస్కూల్లోంచి యూనివర్సిటీ లోకి దూకడానికి సిద్ధంగా ఉన్నాడు. పరం ఎంత చెప్పినా అమెరికాలో పుట్టిన ప్రతీ రెండో జెనరేషన్ పిల్లల్లా డాక్టర్ గిరీ చేయడానికి ఇష్టపడకపోవడం, అటు తండ్రి ఎం.డి. చేసి తీరాలనడం, ఇటు కొడుకు నాకిష్టం లేదు, నేను చేయనని మంకు పట్టు పట్టడం జరుగుతూనే ఉంది. ఈ వాదోపవాదనల్తో విసిగిపోయిన పరం వాళ్ళావిడ, ‘పోనీ వాడికిష్టం వచ్చిన కోర్సు చేయనీయరాదుటండీ,’ అనేసింది కూడా. సుధీర్ అప్పుడే యూనివర్సిటీలకి అప్లికేషన్లు పెడుతున్నాడు కంప్యూటర్ సైన్సులో చేరడానికి. ఇటునుంచి తను వాడే ఐఫోను లోంచి స్టీవ్ జాబ్స్, అటునుంచి విండోస్ బిల్ గేట్సూ, మరో వైపు ఫేస్బుక్ జూకర్ బర్గూ పొడుస్తూంటే సుధీర్‌కి తండ్రి చెప్పే డాక్టర్ గిరీ, శవాలు కోయడం రోతగా అనిపించింది మరి. ప్రస్తుతానికో బ్రిలియంట్ ఐడియాతో ఒక ప్రాజెక్ట్ చేసినట్టు యూనివర్సిటీలకి చూపించగల్గితే సీటూ, దానితోపాటు రూమూ, బోర్డూ అన్నింటికీ స్కాలర్‌షిప్ సంపాదించొచ్చు.
పరం ఇప్పుడొచ్చిన బ్రిలియంట్ ఐడియా కొడుకుతో చెప్పేసరికి సుధీర్ ఎగిరి గంతేసేడు. మొదటి కారణం తండ్రి ఇంక తనని ఎం.డి. చేయమని రోజూ చంపుకు తినడు. రెండోది, ఈ ప్రోజక్ట్ చేస్తే తండ్రి మీద ఆధారపడకుండా ఏ ఫేస్బుక్ తరహాలోనో మిలియనీర్ ఐపోవచ్చు. తండ్రీ కొడుకులు వెంఠనే కార్యాచరణ లోకి దిగిపోయేరు.
రెండు, మూడు వారాలాగి పనంతా దాదాపు పూర్తయ్యేక పరం మావయ్యకి ఫోన్ చేసి క్లుప్తంగా చెప్పేడు, “మావయ్యా నువ్వు రాసే వారఫలాలు నేను చదువుతున్నాను. బాగున్నాయి. ఈ మధ్యన పని అంతగా లేక కాస్త ఖాళీ దొరుకుతోంది. వచ్చే వారం నుంచీ నేనే ఆ వారఫలాలు రాస్తే నీకేమైనా అభ్యంతరమా?”
మావయ్య హాయిగా నవ్వేశాడు, “అసలు మొదట నిన్నే రాయమందానుకున్నాన్రా. ఇప్పుడు నువ్వు రాస్తానంటే నాకు బోల్డు టైం మిగుల్తుంది. తప్పకుండా రాయి. ప్రతీ శుక్రవారం రాత్రి లోపుల నువ్వు పన్నెండు రాశుల వారఫలాలు పంపించావంటే చాలు. యూనీకోడ్లో పంపించావంటే మరీ సులభం. అవి అలాగే ప్రింట్లోకీ, ఇంటర్నెట్ గ్రూప్ వాళ్లకీ ఇచ్చేస్తాను. ఏం మార్పుల్లేకుండా ప్రింటైపోతుంది.”
“తప్పకుండా!”
మెల్లిగా పత్రిక సర్కులేషన్ పుంజుకుంటూంటే లఖన్ రావు మళ్ళీ వారఫలాల వూసెత్తలేదు. మీ రోజు పత్రిక వెబ్‌సైట్ వాళ్ళు కూడా వారం వారం, నెలకో సారి అందించే రిపోర్ట్స్ చూస్తూ లఖన్ రావు సంతోషించేడు కూడా. ఎందుకంటే ఈ వారఫలాలు ఇంటర్నెట్లో చూసేదానికి అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్నించి వేల సంఖ్యలో హిట్లు వస్తున్నాయి. ఈ వారఫలాల పేజీలో పక్కనే ఓ కాలమ్‌లో వెబ్‌సైట్ ఎడ్వర్టయిజ్మెంట్లు డబ్బులు రాలుస్తున్నాయి కూడా. ప్రింట్ ఎడిషన్ సంగతి చెప్పేదేముంది? అంతా సవ్యంగా జరిగిపోతోంది.
పరం వారానికో అరగంటో, గంటో కంప్యూటర్ మీద గడిపి ఠంచన్ తప్పకుండా ప్రతీ వారం వారఫలాలు యూనీకోడ్లో మావయ్యకి పంపిస్తూనే ఉన్నాడు. పనిలో పనిగా సరదాకో మరెందుకో గానీ ప్రతీ రాసి ఫలితంలోనూ చివరి వ్యాక్యంగా ఏదో దేవుణ్ణి ఆరాధించమనో, ఏదో దేవుడి జపం చేయమనో, మరో దేవుణ్ణి దర్శించమనో రాయడం అలవాటు చేసుకున్నాడు. అది కూడా జనాల మీద టానిక్‌లా పనిచేసింది. మేనల్లుడు రాయడం మొదలు పెట్టేక సీనియర్ ఎడిటరైన మావయ్య ఈ కాలమ్ పట్టించుకోవడం మానేశాడు. ప్రతీ శుక్రవారం వచ్చే ఈమెయిల్లో యూనీకోడ్ అంతా ఇలా కాపీ చేసి అలా ప్రింటర్లకీ వెబ్ సైట్ వాళ్లకీ ఇచ్చేయడమే. కధ ఇలా సజావుగా ఉండగా ఓ వారం వారఫలాల్లో రెండు రాసులకి ఇలా పడింది మీ రోజు పేపర్లో.
మీనం: వాహనం నడపడంలో జాగ్రత్త వహించాలి. ప్రయాణంలో అప్పులివ్వడం మంచిది కాదు. వచ్చే అమావాశ్య నుంచీ రెండు వారాలు భోజన సూచనలున్నాయి. వాతావరణం బాగుంటే ప్రయాణం చేయవద్దు. దుర్గాష్టకం చదవండి.
కర్కాటకం: అధికారులతో జాగ్రత్త గా ఉంటే దెబ్బలాటలు. భవిష్యత్తు ఫరవాలేదు. బంధువుల సహాయం ఆశిస్తే భంగపాటు తప్పుతుంది.అసంతృప్తి పెంపొందించుకోండి. ఇబ్బందులున్నా ఆటంకమే. నమ్మకం, ధైర్యం మిమ్మల్ని కూర్చోబెట్టేస్తాయి. అధైర్యమే మీ లక్ష్యం. తిరుపతి దర్శనం బలాన్ని ఇస్తుంది.
తలా తోకా లేని ఈ ఫలితాలు చూసి కొందరు మీ రోజు పాఠకులు నవ్వుకున్నారు. కొంతమంది ఇవి అప్పుతచ్చులనుకున్నారు. మరికొంతమంది, మీ రోజు పేపర్లో ఇప్పటి వరకూ అచ్చు తప్పులు లేవనుకున్నాం గానీ వీళ్ళూ ఇంతే?! అనుకున్నారు. కానీ అమెరికా లాంటి దేశాలనుంచి మీ రోజు పత్రికకి పుంఖానుపుంఖాలుగా ఈ మెయిల్స్ వచ్చాయి. మేనమావ ఎడిటర్ కూడా కాస్త కంగారు పడినట్టు కనిపించేడు. కానీ మరుసటి వారం వారఫలాలు అద్భుతంగా వచ్చేయి మళ్ళీ. ఇరవై ముఫ్ఫై ఏళ్లలో దాదాపు ఒక్కసారి కూడా అప్పు తచ్చుల్లేని మీ రోజు పత్రికలో ఒకసారి తప్పనగా ఎంత? సముద్రంలో కాకిరెట్ట కాదూ? దాంతో ఎవరికీ ఈ గోల పట్టలేదు.
అయితే పరం మాత్రం ఈ తప్పుల తడక చూసి, తెలుగు మాట్లాడితే అర్ధం చేసుకునే జ్ఞానం మాత్రమే ఉన్న కొడుకుతో చర్చించేడు. ఇద్దరూ నవ్వుకున్నారు. ఇది జరుగుతున్నప్పుడే సుధీర్‌కి పెన్సిల్వేనియా నుంచి కాలేజీలో సీటూ, స్కాలర్‌షిప్పూ వచ్చినట్టు ఉత్తరం వచ్చింది. కుర్రాణ్ణి తీసుకెళ్ళాలి కనక ఈ వారఫలాల విషయం తర్వాత చూడొచ్చులే అని పరం ఈ విషయం అక్కడితో అలా వదిలేసి రాబోయే యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా ఇంటర్వ్యూకి కుర్రాణ్ణి సిద్ధం చేయడం మొదలుపెట్టాడు. మొదట్లో అప్లికేషన్ పెట్టినప్పుడు పంపించిన డిటైల్స్, కుర్రాడు స్వంతంగా జావా భాషలో రాసిన ప్రోగ్రామూ, అది ఎలా పనిచేస్తుందో చూపించడానికో లాప్‌టాప్, మిగతా కాయితాలు అన్నీ వెంటబెట్టుకుని కులాసాగా డ్రైవ్ చేస్తూ యూనివర్సిటీకి జేరారు ఓ రోజు ముందు.
ముందే కంప్యూటర్ సైన్సులో స్కాలర్‌షిప్ ఇస్తామని యూనివర్సిటీ వాళ్ళు ఉత్తరం రాసేరు కనక ఈ ఇంటర్వ్యూ కుర్రాడి మొహం చూడ్డానికే తప్ప అంతకన్నా విశేషం ఏమీ లేదని తెలుసు. బయట లాబీలో తండ్రిని వదిలేసి సుధీర్ ఇంటర్వ్యూ గదిలోకి వెళ్ళేసరికి ముగ్గురు కనిపించేరు. పరిచయాలు మొదలయ్యేయి. ఒకాయన డాక్టర్ డేవిడ్ గోల్డ్‌మన్ – కంప్యూటర్ సైన్సు డిపార్ట్‌మెంట్ ఉండే కాలేజీ ఆఫ్ మేధమెటిక్స్ డీన్. రెండో ఆయన – డాక్టర్ స్టాన్ హేజ్‌వుడ్, కంప్యూటర్ సైన్స్‌లో కాకలు తీరిన మేధావి – సుధీరిక్ కాబోయే ఎడ్వైజర్. మూడో శాల్తీ కాయితం పనులన్నీ చూసే డిపార్ట్‌మెంట్ సెక్రటరీ, లిండా.
అన్ని యూనివర్సిటీలలో ఉండే డీన్‌ల లాగే గోల్డ్‌మన్ పాఠాలు చెప్పక, సబ్జెక్ట్ మర్చిపోయి చాలాకాలం అయింది. ఒకప్పుడు ఒంటిచేత్తో అందర్నీ గడగడలాడించినాయన ఇప్పుడు కాలేజీకి మిలియన్లు ఎలా సంపాదించాలా అనే పనిలో ఉన్నాడు. తన గురించి చెప్పమన్నప్పుడు, సుధీర్ అసలు తను ఎందుకు కంప్యూటర్ సైన్సులోకి వద్దామనుకుంటున్నాడో, తండ్రి ఎం.డి. చేయమన్నా సరే అది తనకి ఎందుకు నచ్చలేదో, తనకొచ్చిన గ్రేడ్‌లూ, బేస్బాల్ తదితర ఏక్టివిటీస్ అన్నీ ఏకరువు పెట్టేడు. అన్నీ విన్న డాక్టర్ హేజ్‌వుడ్ అడిగేడు, “సుధీర్, నువ్వు చెప్పినవన్నీ బాగున్నాయి. నువ్వు రాసిన కంప్యూటర్ ప్రోగ్రాముకి ఎలా ఐడియా వచ్చింది, అదేం చేస్తుందో కాస్త వివరించి చెప్తే వినాలని కుతూహలంగా ఉంది.”
“నేను మా నాన్నగారు ఐడియా ఇస్తే జావా లంగ్వేజ్‌లో రెండువారాల్లో రాశాను. దానికి బేక్ ఎండ్ మామూలు టెక్స్ట్ డాటాబేస్. అది రన్ చేస్తే పన్నెండు రాశుల జాతకం చూపిస్తుంది.”
“మీకు ఆస్ట్రాలజీ బాగా వచ్చినట్టుందే?” మెచ్చుకుంటున్నట్టు చూస్తూ అన్నాడు హేజ్‌వుడ్.
“లేదండి. నాకు ఆస్ట్రాలజీలో అసలు ప్రవేశం లేదు. మా నాన్నగారు ఇచ్చిన ఐడియా పట్టుకుని అల్లుకు పోయానంతే.”
“మీ నాన్నగారికి జాతకాలు చూడ్డంలో బాగా ఇంటరెస్ట్ ఉంది కాబోలు.”
“అబ్బే, ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నార్ట కానీ ఇప్పుడేం గుర్తు లేదన్నారు.”
“మీ నాన్నగారేం చేస్తూ ఉంటారు?”
“న్యూక్లియార్ సైంటిస్ట్.”
“ఈ సాఫ్ట్‌వేర్ ఎవరికైనా అమ్ముతున్నారా?”
“లేదండి. వారఫలాలు మా నాన్నగారు ఉచితంగా ఒక ఇండియన్ పత్రికకి పంపిస్తూ ఉంటారు సరదాగా. అంతకన్నా దీని గురించి పెద్ద ఆలోచించలేదు. ముందు ముందు ఏమో ఏం చెప్పగలం?”
“మీరు ఇండియన్స్ కనక మీ భాషలోనా రాశిఫలాలు చూపించేది?”
“భాషకీ ప్రోగ్రాముకీ సంబంధం లేదు. యూనికోడ్ కనక ఏ భాషలోనైనా రాశిఫలాలు వస్తాయి. మార్చాల్సింది డాటా ఒక్కటే.”
“మరి మీ ప్రోగ్రాము లాజిక్ ఏమిటి?”
“డేటా రేండమైజేషన్.”
హేజ్‌వుడ్ కుర్చీలోంచి చటుక్కున లేచి నుంచుని కళ్ళు పెద్దవి చేసి టేబుల్‌కి అటువైపు కూర్చున్న సుధీర్ వైపు కొద్దిగా వంగి “వాట్? ఆర్యూ సీరియస్?” అన్నాడు.
చిరునవ్వు నవ్వేడు సుధీర్ సమాధానంగా. ఒక్కసారి అర్ధమైందన్నట్టూ హేజ్‌వుడ్ అడిగేడు మళ్ళీ, “మరి తప్పులొస్తే?”
“ఎప్పటికప్పుడు డాటాబేస్‌లో ఎర్రర్ ఫైల్ అప్డేట్ చేస్తూంటాము. అలా డాటా ఫైన్‌ట్యూన్ చేయడమే.”
ఒక్కసారి హేజ్‌వుడ్ నవ్వడం మొదలెట్టాడు. మొదట్లో చిన్నగా మొదలైన నవ్వు తెరలు తెరలుగా పెద్దదై పక్కనున్న డేవిడ్, లిండాలు చూసినా సరే నవ్వుతూనే ఉన్నాడు. కాసేపటికి వచ్చే నవ్వు ఆపుకోలేక గదిలో ఉన్న కిటికీ దగ్గిరకెళ్ళి బయటకి చూస్తూ అదే పనిగా నవ్వు. ఇదంతా అర్ధం కాని డేవిడ్, “స్టాన్, ఆర్ యూ ఓకే?” అన్నాడు. లిండా కూడా కాస్త విస్తుపోయినట్టు చూసేసరికి తేరుకుని సుధీర్‌తో అదే నవ్వు మొహంతో అన్నాడు హేజ్‌వుడ్, “మీ నాన్నగారు మీ కూడా వచ్చారా?”
“అవును. బయట కూర్చున్నారు లాబీలో.”
ఇంకో పదినిముషాలు అదీ ఇదీ మాట్లాడాక ఇంటర్వ్యూ అయిపోయింది. బయటకొచ్చిన సుధీర్ జరిగింది చెప్తూంటే అప్పుడే వచ్చిన హేజ్‌వుడ్ చేయి చాచి పరంకి షేక్ హేండ్ ఇచ్చి చెప్పేడు, “మీరు సుధీర్‌కి ఇచ్చిన ఐడియా అద్భుతం.”
కొంచెం ఇరకాటంలో పడినట్టయింది పరమేశ్వర శాస్త్రికి. “ఏదో, కుర్రాడికి నాకు చేతనైనంతలో సహాయం…” అంటూ నసిగేడు.
“మీ కుర్రాడికి మంచి భవిష్యత్తు ఉంది. నేను మీ వాడితో పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను. గుడ్ లక్!” అంటూ ముందుకి సాగిపోయేడు హేజ్‌వుడ్.
కాయితాలన్నీ సరి చూసుకుని, రూమూ అన్నీ అమర్చుకుని, సామానంతా పట్టుకుని మళ్ళీ రావాలి కనక ఇంటికి సంతోషంగా బయల్దేరారు తండ్రీ కొడుకులు.
వెనక్కొచ్చాక మరో నాలుగు వారాలాగి కాలేజీలో మొదటి సారి జేరడానికి బయల్దేరేముందు మరోసారి తాను రాసిన ప్రోగ్రాము సరిదిద్ది తండ్రికి చూపించి సుధీర్ చెప్పేడు, “ఇదిగో ఈ ఫైల్లో ఎప్పటికప్పుడు తప్పులు చేరుస్తూ ఉండండి. దీనికి ఎర్రర్ ఫైల్ అని పేరు పెట్టాను. మరీ ఎక్కువ తప్పులొస్తే ప్రోగ్రాము నేను శెలవులకి వచ్చినప్పుడు తిరగరాద్దాం.”
కుర్రాడు ఇంట్లోంచి వెళ్ళిపోయి స్కూల్లో జేరిపోయాక కూడా పరమేశ్వర శాస్త్రి ప్రతీవారం ఠంచన్గా మీ రోజు పత్రిక్కి వారఫలాలు పంపిస్తూనే ఉన్నాడు.
కాలేజీలో చేరిన తర్వాతెప్పుడో ఓ రోజు క్లాసులకి వెళ్తూ డీన్ గోల్డ్‌మన్ కళ్ళబడ్డాడు సుధీర్. ఇతన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు హేజ్‌వుడ్ నవ్విన ఎడతెగని నవ్వు చటుక్కున గుర్తొచ్చింది డీన్ గారికి. వెదుక్కుంటూ స్టాన్ ఆఫీసుకెళ్ళేడు. కబుర్లయ్యేక సుధీర్ ఇంటర్వ్యూ గుర్తు చేసి, “ఆ రోజు ఎందుకంతలా నవ్వేవు?” అనడిగేడు.
స్టాన్ మళ్ళీ నవ్వి చెప్పేడు, “చూడు డేవిడ్, ఏ పేపర్లో చూసినా దిన ఫలాలు కానీయ్, వార, మాసఫలాలు కానీయ్ ఎలా ఉంటాయో నువ్వు ఎరుగుదువా?”
“అంత పెద్ద ఇంటరెస్ట్‌గా చూళ్ళేదు ఎప్పుడూ.”
“సరే అయితే విను. ఉండేవి పన్నెండు రాశులు. ఒక్కో రాశికి మహా అయితే ఐదో, ఆరో వ్యాక్యాలు రాస్తారనుకో. అంటే మొత్తం డెబ్బై రెండు వ్యాక్యాలు కదా? ఒక్కో వ్యాక్యాన్ని రెండు ముక్కలుగా విడగొట్టొచ్చు. ఉదాహరణకి, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి – అనే వాక్యాన్ని సరిగ్గా మధ్యకి విడగొడితే, రెండు ముక్కలొస్తాయ్. వాహనం నడిపేటప్పుడు, జాగ్రత్త వహించాలి, అనేవి. ఇలా వ్యాక్యాల్ని రెండేసి ముక్కలుగా విడగొట్టి మొదటి ముక్కల్ని ఓ గ్రూపులోనూ రెండోవాటిని రెండో గ్రూపులోని చేరిస్తే మనకో డాటాబేస్ తయారౌతుంది. ఒకో ముక్కకీ సీరియల్ నెంబరు వేసుకుంటూ ఎంత పెద్దదిగా కావలిస్తే అంత పెద్దదిగా ఎన్ని వ్యాక్యాలు కావలిస్తే అన్ని ఈ రెండు గ్రూపుల్లోనూ విడివిడిగా రాసుకుంటూ పోవచ్చు. చిన్న ప్రోగ్రాము రాసి మొదటి గ్రూపుకో రేండం నెంబరూ, రెండో గ్రూపుకో రేండం నెంబరూ తీయచ్చు. ఆ తీసిన రెండు నెంబర్ల ప్రకారం మొదటి గ్రూపులోంచి మొదటి ముక్కా, రెండో గ్రూపులోంచి రెండో ముక్కా తీసి కలిపితే వ్యాక్యం తయార్! ఓ సారి వచ్చిన అంకె మళ్ళీ రాకుండా రేండం నెంబర్లు ప్రతీ గ్రూపుకి జెనరేట్ చేసి డెభ్భైరెండు వ్యాక్యాలు తయారు చేసి, ఆరు వ్యాక్యాలు చొప్పున తలో రాశికి తగిలించేసి కట్ చేసి పేస్ట్ చేయడమే. ఇప్పుడర్ధం అయిందా?”
“మరి ఏ భాషలోనైనా సరే వారఫలాలు రాయొచ్చన్నట్టు గుర్తు. అదెలా?”
“యూనీకోడ్‌తో రెండు గ్రూపుల ఫైళ్ళలోనూ మన ఇష్టం వచ్చిన భాషలో రాయొచ్చు. జావా ప్రోగ్రాముకి ఆ ఫైళ్ళలో ఉండేది ఏ భాష అనేది అనవసరం. ఈ ప్రోగ్రాము చూసేదల్లా ఆయా ఫైళ్ళలో ఉండే కేరక్టర్స్ మాత్రమే కదా? ఇంగ్లీషు, రష్యన్, తెలుగు, తమిళం, హిందీ, ఇటాలియన్ అలా నీ ఇష్టమొచ్చిన భాషలో ఈ డాటా అంతా టైప్ చేసి ఫైళ్ళలో సేవ్ చేసుకుంటే ఏ భాషలో కావలిస్తే ఆ భాషలో ఫలితాలు జెనరేట్ చేసుకోవచ్చు. ప్రోగ్రాము ఒకటే. మార్చవల్సింది డాటా మాత్రమే. అంచేత భాషకీ ప్రోగ్రాముకీ సంబంధం లేదు. వార ఫలాలేం ఖర్మ? దిన, గంట, నిముష, సెకను ఫలాలు రాయొచ్చు. ఎప్పుడు కావాలిస్తే అప్పుడు ప్రోగ్రాము రన్ చేస్తే చాలు. వాహనం నడిపేటప్పుడు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి కదా, అయినా సరే రాశిఫలాల్లో రాస్తే దానికెక్కువ ఇంపార్టన్స్. అలాగే మిగతా అర్ధవంతమైన వ్యాక్యాలు తయారు చేసి ఫైళ్లలో దాచుకుంటే చాలు. ఇలాంటి వారఫలాలు రాయడానికి ఏ విధమైన జాతక పరిజ్ఞానం అవసరం లేదు. కావాల్సింది కామన్ సెన్స్ ఒక్కటే.”
ఫకాల్న నవ్వి అడిగేడు డీన్, “మరి ఈ రేండం నెంబర్ల వల్ల ‘వాహనం నడిపేటప్పుడు అప్పులివ్వరాదు’, ‘అసంతృప్తి పెంపొందించుకోండి’ అనే లాంటి తప్పు వ్యాక్యాలు వస్తే?”
“అదేకదా నేనూ అడిగేను ఇంటర్వ్యూలో? ఇలా తప్పుల వ్యాక్యాలన్నీ ఇంకో ఫైల్లో పెడతారు. మళ్ళీ ప్రోగ్రాము తిరగరాసి, రేండంగా వచ్చిన వ్యాక్యాలు ఈ తప్పుల ఫైల్లో ఉంటే దాని బదులు మరో కాస్త అర్ధవంతంగా ఉన్న వ్యాక్యం తీస్తారు ప్రోగ్రాము రన్ చేసి.”
“అర్ధం అయింది, అదేనా కుర్రాడు అప్డేట్ అనో మరేదో చేయడం అన్నట్టున్నాడు?” అడిగేడు డీన్.
“కరక్ట్. అందుకే నేను కుర్రాడి తెలివితేటలకి నవ్వు ఆపుకోలేకపోయేను. సుధీర్ ఇక్కడ కాలేజీలో జేరాక నేను ఈ ప్రోగ్రాము గురించి మళ్ళీ మాట్లాడాను. ఇండియన్స్‌కి హిందూ మతం, వాళ్ల దేవుళ్ళు, కల్చరూ గట్రా కలిపి రెండు వ్యాక్యాల ముక్కలు బాగా కలిసొచ్చేలా వాళ్ల నాన్నగారు వ్యాక్యాలు విడగొట్టి అతనికి హెల్ప్ చేశారు.”
తాను చెప్పినది అర్ధం కానట్టు కనపడిన డీన్ మొహం చూసి, ఇండియన్ల గురించి బాగా తెలిసిన హేజ్‌వుడ్ అన్నాడు.
“నీకర్ధం అయ్యేలా చెప్తా విను. ప్రతీ రాశికి చివర్లో ఏ దేముడికి ఏం చేస్తే మంచిదో ఓ వ్యాక్యం రాస్తారు – విష్ణు సహస్రనామం పఠించండి, సాయి నామం బలాన్ని ఇస్తుంది, శివస్మరణ మంచి చేస్తుంది, లాంటివి. వీటిని ముక్కలుగా విడగొట్టి ఒక గ్రూపులో దేముడి సంగతి రెండో గ్రూపులో ఆ దేముడికి ఏమి చేయాలో ఉంచారు. ఉదాహరణకి, మొదటి గ్రూపులో దుర్గా స్తుతి, సాయి నామం, శివస్మరణ, తిరుపతి దర్శనం; రెండో గ్రూపులో ‘చేయాలి, ‘పఠించండి, ‘బలాన్ని ఇస్తుంది’ లాంటివి ఉంచారు. వీటితో ఎటు తిప్పి ఎటు కలిపినా వచ్చే వ్యాక్యాలన్నీ దాదాపు అర్ధవంతంగానే ఉంటాయి కదా?
“మరి, తిరుపతి దర్శనం బలాన్ని ఇస్తుంది అనే వ్యాక్యం ఎర్రర్ ఫైల్లో ఉంటుందన్నమాట!’ ఈ సరికి లాజిక్ బాగా అర్ధమైన డీన్ అడిగేడు.
“అవును. దీన్నే డాటాబేస్ అప్డేట్, ఫైన్‌ట్యూన్ అన్నాడు కుర్రాడు. ఇండియన్స్‌కి ఉన్న అనేకానేకమంది దేవుళ్ళ వల్లా, పండగల వల్లా ఈ గ్రూపుల్లో ముక్కల వ్యాక్యాలు అనంతంగా పెంచుకుంటూ పోవచ్చు. ఒక్కొక్కప్పుడు ‘రాబోయే మార్స్ రెట్రోగ్రేడ్ మూలంగా’ అనీ ‘సూర్యుడి సింహ రాశిలో ప్రవేశం వల్లా’ అనీ వ్యాక్యాలు కూడా రాసుకోవచ్చు. జనాలకి అవన్నీ ఏమిటో తెలుసుకునే జ్ఞానం, కోరికా, ఓపికా ఉండవు కదా? అక్టోబర్లో అయితే దసరాకి సంబంధించినవీ, తర్వాత నెలలో దీపావళికి సంబంధించిన విషయాలూ సుధీర్ నాన్నగారు జాగ్రత్తగా సెలక్ట్ చేసుకుని ఆయా వ్యాక్యాలన్నీ ఫైళ్లలో జాగ్రత్తగా సేవ్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. ప్రోగ్రాము రన్ చేసినప్పుడు అది ప్రస్తుతం నెల నవంబర్ అయితే దీపావళికి సంబంధించిన వ్యాక్యాలు సమకూరుస్తుంది. ఏకాదశి, అమావాశ్య, పౌర్ణమీ, కార్తీక మాసం ఇలా ఎన్ని పండగలు జేరిస్తే జనం అంత ఇంటరెస్టింగా చదువుతారు రాశి ఫలాలు. అలాగే దసరాకీ మిగతా పండగలకీను. ఇంకో విషయం ఏవిటంటే ఈ వ్యాక్యాలన్నింటినీ రెండు గ్రూపుల బదులు మూడు గ్రూపులగానూ, లేకపోతే నాలుగు గ్రూపులగానూ విడగొట్టి ఇంకా చక్కగా చేయొచ్చు. ఇదంతా తెలివైన వాడు జనాల మీద ఆడుకునే ఆట. ఆస్ట్రాలజీ తెలిసి జాతక చక్రాలు వేసి చెప్పే శాస్త్రం వేరూ, ఇది వేరు.”
“దీంట్లో పెద్ద లాజిక్ ఏమీ ఉన్నట్టులేదే? కుర్రాడికి ఇచ్చే స్కాలర్‌షిప్పు దండగేనా?”
“అమ్మా, అలా తీసిపారేయకు మరి. పదిహేడేళ్ల కుర్రాడు తండ్రి ఇచ్చిన చిన్న ఐడియా అల్లుకుంటూ పోయి సులభంగా ప్రోగ్రాము రాసి పడేసేడు రెండు వారాల్లో – అదీ చిన్న చిన్న టెక్స్ట్ ఫైళ్ళు ఉపయోగించి, బేసిక్ కంప్యూటర్ సైన్స్ బేగ్రౌండ్ లేకుండానూ. ఇక్కడ ఐదారేళ్ళు నేను రీసెర్చ్ చేసే నాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ లేబ్‌లో సానపెడితే ఏమౌతాడో ఆలోచించు. చాకులాంటి సైంటిస్ట్‌ని తయారు చేయొచ్చు.”
“నిజమే,” వెళ్ళడానికి లేచేడు డీన్.
ఉపసంహారం: పరమేశ్వర శాస్త్రి ప్రతీవారం ఠంచన్గా వారఫలాలు పంపిస్తూనే ఉన్నాడు. అవి మీరోజు పత్రికలో అతి మామూలుగా వస్తూనే ఉన్నాయి. జనం వెర్రివెధవల్లా చదువుతూనే ఉన్నారు. లఖన్ రావు వచ్చిన లాభాలు చూసుకుంటూనూ, సీనియర్ ఎడిటరూ, కుర్ర రిపోర్టరూ ఉద్యోగాలు చేసుకుంటూనూ సంతోషంగానే ఉన్నారు కూడా. అయితే ఈ వార ఫలాల వల్ల ఏమీ ఉపయోగం లేదా అంటే ఏమాట కామాటే చెప్పుకోవాలి. మీ రోజు పత్రికలో వారఫలాలు రాక ముందు శ్రీ సూక్త, పురుష సూక్తాలు, విష్ణు, లలితా సహస్రనామాలు, కృష్ణ యజుర్వేదంలోని నమక, చమకాలు, దుర్గా స్తుతి, నవగ్రహ స్తోత్రం మొదలైన వాటిని పనికిరాని పుస్తకాలుగా భ్రష్టు పట్టించి మూలపారేసిన తెలుగు వాళ్లందరూ ఇప్పుడు ఈ వారఫలాలు చూసి వాటినన్నింటినీ బూజు దులిపి పవిత్రంగా చదవడం మొదలుపెట్టారు. అది కొంతలో కొంత నయమే కదూ?
----------------------------------------------------------
రచన: ఆర్. శర్మ దంతుర్తి,
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment