ఆకాశ దీపం
సాహితీమిత్రులారా!
ఈ కవితను ఆస్వాదించండి......................
మైదానాలూ కొండలూ పల్లాలూ
ఎక్కుతూ దిగుతూ పడుతూ లేచి
వచ్చిన తోవెంటే మన పరిచయం
తొలిరోజుల్లోకి నడిచిపోతున్నాను
నీకళ్లలో నాకోసమైన మెరుపు చూడాలని.
పరిగ కంప తట్టుకుంది కొంగు చివర
నువ్వు కోసిచ్చిన వగరు పళ్ల వాసన కమ్ముకుంది
చేయి పట్టుకొని రాయీ రాయీ ఎక్కించి
గట్టున కూర్చోబెట్టిన చెరువు అడుగుతోంది
నీ చేపకళ్ల పిల్లాడేడని.
చంచలమైన నీ చూపులు చెరువు అలల మీద తేలి తేలి ఒడ్డున తట్టుకున్నాయి
ముందుకు పోలేక వెనక్కీ మరలక ఏ సంధి కాలంలో చిక్కుకుపోయామో?
“ఇస్ కే పెహ్‌లే ఇస్ రస్తే మే
కిత్‌నే హీ మెహబూబ్ గయే హై
రస్తే మే దరియా హై కోయీ
జిస్ మే సారీ డూబ్ గయే హై”
మునక మనకీ తప్పదా!
చంద్రభాగలం మనం
గంగై పొంగుదామన్న
ఊసులు ఈ
ఇసుక మేటల్లోనేనా
రాసుకున్నది
నా చిన్ని పెరటిలో పూసిన పువ్వులు
చూడలేదని నిన్ను నిష్టూరమాడాను
నువ్వు నడచి వచ్చిన అడవి ఆరోజున చూశాక
ఎంతటి సిగ్గుతో ముడుచుకుపోయాను
నా అల్పత్వాన్ని చూసి ఎంత నొచ్చుకున్నావో గదా!
ఏమివ్వగలనని పరిపరి విధాల తపనపడతాను
నిన్ను సంతోషపెట్టే మార్గాలకై
రోజంతా కలియదిరుగుతాను
ఊరేగింపుకని పల్లకిని అలంకరించి
వీధులంతా ఉత్సవం చేస్తాను!
ఇంత చేసిన నన్నూ ఏమీ కాని తనను
అదే రీతిన ప్రేమించే నిన్ను చూసి
మనసు చిన్నబుచ్చుకుంటాను
ఏమి చేసి నీకు కొంచెం ఎక్కువకాగలనా
అని మథనపడతాను
ఈ ఎక్కువ తక్కువ మాటలేమిటని
ఏమీ తెలియక ప్రశ్నిస్తావు
ఇంకాస్త దగ్గర జరగాలని ఆశ
ఎప్పుడు దూరంగా వున్నావని అడుగుతావు
దారిలో వాళ్లు నన్నాపిన సంగతి
నీకు చెప్పాలని వుంటుంది
నువ్వున్న చోటంతా కిక్కిరిసి వుందంటే
నీకోసం బోలెడంత చోటుందంటావు
వాళ్లు ప్రశ్నలతో నన్ను గుచ్చుతారు
నీ మీద నిందలేస్తారు
పోనీమంటావు చెబితేను
ఎవరు నువ్వు?
అక్కమహాదేవి గుర్తుకు వస్తుంది అప్రయత్నంగా.
ఇన్ని తెలిసిన నువ్వు
నా గుండెలో దిగులు తీసివేయవు
ఎందుకా దిగులని ఎదురడుగుతావు
ఎట్లా చెప్పేది నీకర్థమయ్యేలా
నీలా వుండి చూపించనాని
వెర్రి ప్రశ్నలేస్తాను
ఇద్దరికీ తెలిసిపోతుంది జవాబేంటో
భాద్రపదంలో పొంగే నది
నిన్ను జ్ఞాపకం చేస్తుందని
ఉత్తరాలు రాస్తావు
నల్లని బరువైన మేఘం నువ్వని
పలవరించిన మాటలు
ఆలాపనలా తచ్చాడుతాయి
“ఎపుడు నీ పిలుపు వినపడదో”
వద్దు వద్దన్నా వెంట వెంట తిరిగి
పాడతావు ఆ విరహపు పాటలు
ఏమిటి లాభం వగచి వగచి
వచ్చిన దారిన ఒంటరిగా వెనక్కి నడుచుకుంటూపోతాను.
ఏ బావిగట్టు బీరపొదల పక్కనో కూర్చుని
ఎవరి బాధలో వింటుంటావు
ఎగిరెళ్లిపోయిన పక్షుల కోసం
శూన్యంలో గూడు కడుతుంటావు
మోయలేని భారాలు భుజానేసుకుని
పట్టుతప్పిన ఇసుక నేలల్లో తారాడుతుంటావు
హఠాత్తున జ్ఞాపకం వస్తాను
వదిలి వెళ్లిన చోటంతా వెతికి వెతికి వెర్రిగా దుఃఖిస్తావు
అంతటి దూరాలూ దాటుకొని
మళ్లీ వెనక్కి వస్తాను
వద్దు వద్దు కన్నీళ్లని ఊరుకోబెడతాను
అలసిన కళ్లతో సొమ్మసిల్లి నిద్రలోకి జారిపోతావు
చేపపిల్లలూ ఇసుకజాలూ ఎండమావి
దేనితో సరిపోలతావో నువ్వు
దగ్గరి దూరాల సరిహద్దుల్లో తారాట్లాడే నీడలా
నిన్ను వెంబడిస్తాను
తటాలున నిద్రలేస్తావు మరేదో జ్ఞాపకం
పరుగున వడి వడి అడుగులేస్తూ వెళ్లిపోతావు
వెళ్లినచోట వడలిన పువ్వులు
ఒడిలో నింపుకొని నీకోసమై
చూడకుండా వుండలేనితనంలోకి జారిపోతాను
వుండలేవు… వెళితే ఓర్చుకోలేవు
నేనేమైపోతాననే ధ్యాసే లేనివాడివి
What it takes to love you?
సమాధానంగా ఆకాశానికెత్తిన దీపంలా
రెపరెపలాడుతుంది నా మనసు
దుప్పటి చిరుగుల్లోంచి వెన్నెల ఒలకబోస్తానని
దిండుకింద నక్షత్రాలు దాచిపెడతానని
నువ్వు చెప్పిన మాటలు
గుర్తొచ్చి వెళ్లిపోలేక
అక్కడే కాచుకొని వుంటాను
ఎవరి చీకట్లని వెలిగిస్తుంటావో
ఇంకెవరి మీద దిగులు మబ్బై కమ్ముకున్నావో…
మొన్నొకామె ఎదురుపడింది
నిన్ను నానామాటలంది
అయినా నువ్వంటే ప్రేమంది
ఏమని అడిగితే నీకు
తెలియదు పొమ్మంది
నా దిగులు చెప్పుకోలేక
ఆమెని ఓదార్చి నిద్రపుచ్చాను.
నాకోసమై వచ్చిన నీకు
అందలేదని వెళ్లిపోయావు
నీ అడుగుల దారుల్లో
వెతుక్కుంటూ వచ్చి
నిన్ను చేరలేకపోయాను
దారి అడ్డగించారు
అక్కడి వాళ్లు
అతను మావాడన్నారు
గుర్తులు కూడా చూపించాను
అయినా తోవ వదలలేదు
ఎక్కడికిపోవాలో తెలియలేదు
అయినవాళ్లందరినీ కాదని వచ్చాను
వాళ్లూ చేరనివ్వరు
చలి ఎండలకి రాపాడి
ఒళ్లు పాడైపోయింది
(అట్లావున్న నన్ను చూసి బోలెడు జాలి పడతావు)
ఇంకెప్పుడూ ఎక్కడికీ పోనని
ఒట్టు పెడతావు
వెచ్చటి చేతులు ఊది
చెక్కిళ్లని వేడి చేస్తావు
నా రక్తం పొంగుతుంది
వెన్నెముక చేరకుండానే
కెరటం విరిగి పడుతుంది
ఎక్కడో తెరచాపెత్తుతారు
సరంగు కేక వినపడుతుంది
వెళ్లిపోయే పడవ
నీకు గాలమై తగులుతుంది
నాకేసి దీనంగా చూస్తావు
ఈసారి నేనే పంపిస్తాను
మాసిపోయిన బట్టలు మార్చి
సద్దిమూట చేతికిచ్చి
రేవులో నిన్ను విడిచి వచ్చి
నాలుగు రోడ్ల కూడలిలో కూర్చొని
దిగులు పాటలు పాడుకుంటాను
ఎవరికీ చెందకపోడమే
ఒక్కోసారి సాంత్వననిస్తుందేమో
“దారులన్నియు మూసె
దశదిశలు ముంచెత్తె”
ఇలా జరుగుతుందని
ఈ బాటన నడిచిపోయిన వారికి
ముందుగానే ఎలాగ తెలిసిపోయిందో…
ఈసారికి నువ్వు రావాలనికూడా వుండదు
తిరిగి ఎక్కడికీ వెళ్లాలనిపించక
అక్కడే కూలిపోతాను
నీలగిరి తరువుల బారు
ఆకాశాన్ని తాకే చోట
రహస్యమేదో రాసిపెట్టినట్లు
తెలిసీ తెలియని లోకానికి దారి చూపుతున్నట్లుంది
తెగిన రెక్కలల్లార్చుకుంటూ
వాడిపోయిన మొహంతో
ఇంతలేసి దిగులు కళ్లతో
నడుచుకుంటూ వస్తున్న నిన్ను చూస్తాను
నువ్వడిగిన అమ్మను నేను కానూ?
రా! ఇలా రా!
దిగుళ్లుండని నేల వుందని
ఎవరో చెప్పిన ఆ Neverlandకి
నిన్ను నడిపించుకుపోతాను
నీ దప్పి దీర్చి
నీకింత ముద్దపెట్టి
నిద్రపుచ్చి
భుజానేసుకుని నడుస్తాను.
తెలుసు ముందెక్కడో ఆగాలని
నువ్వు మళ్లీ మళ్లీ వెడతావని
తిరిగి తిరిగి వస్తావని
నీకోసం నేనుండాలని.
ఈ ఆకాశదీపం అందరిదీ కాదు
నా ఒక్కడిదేనని మారాం పోయావు
గుర్తుందా?
దివ్వె మలిగిపోతే
దారెటో ఇద్దరికీ తెలియదుగా…
దా… దీపస్తంభానికి
గుండెని కట్టిపోదాము.
-----------------------------------------------------------
రచన: ఉషాజ్యోతి బంధం,
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment