Saturday, March 23, 2019

పనిపిల్లలు


పనిపిల్లలు




సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి..................

“అమ్మా నేను బడికి పోతానే … అందరు పిలకాయల్లాగా నేను కూడా మంచిగా చదువుకుంటానే ” పొద్దున్నే నిద్ర లేచి కళ్ళు నలుపుకుంటు అడిగాడు తల్లిని

” పోతావురా నువ్వు బడికి పోతావు … మీ అయ్య వల్లకాటికి పోతాడు నేను రెక్కలు ముక్కలు చేసుకుని మీ ఇద్దర్నీ పోషిత్తా ….. బడికి పోతాడంట బడికి అయినా బడికి పోయేది మనసుంటోల్లు కాదురా దానికీ ఎప్పుడో పుణ్ణెం చేసుకోనుండాలి …. పొద్దున్నే ఎదవాలోచనలు చెయ్యకుండా లేచి పనికి బయలుదేరు ” తల్లి మందలింపుతో ఆ పసి హృదయం చివుక్కుమంది

“అదేందమ్మా పిలకాయలు బడికి పోము మొర్రో అంటుంటే వాల్ల అమ్మా వాల్లు పొమ్మని బతిమాలుతుంటారు నువ్వేమో నేను బడికి పోతానమ్మా అంటే తిడుతున్నావు” అమాయకంగానే అడిగినా తల్లి హృదయానికి తగిలాయామాటలు , చెప్పేందుకు సమాధానంలేదు తనదగ్గర.

“చెప్పానా పిచ్చి పిచ్చి గా అదీ ఇదీ ఆలోచించొద్దని “ కోపంగా చెప్పింది , అంతే కిమ్మనకుండా ఇంట్లోకి వెల్లి సద్దెన్నం తిని అక్కడినుండి బయలుదేరాడు, కొంచం సేపు అక్కడా ఇక్కడా తిరిగి , బడి మొదటిగంట కొట్టే టైంకిి ఆ వీధి చివర వేపచెట్టు కిందున్న అరుగుమీద కూర్చుని ఆ దారి వెంట వెల్లే వాల్లను చూస్తూ ఉన్నాడు

రోజూ చూసేదే అయినా ఏరోజు కారోజు కొత్తగానే అనిపిస్తుంటుంది జట్లు జట్లుగా వడి వడి గా నడుచుకుంటూ భుజానికి వ్రేలాడే పుస్తకాల సంచులతో కొందరు అమ్మో , నాన్నో , అమ్మమ్మో , నాన్నమ్మో లేక తాతయ్యో ఎవరిదో ఒకరి వేలుపట్టుకుని బుడి బుడి అడుగులు వేసుకుంటూ మధ్య మధ్యలో ఆగి తనకు వింతగా కనిపించినదేదో చూస్తూ, జారిపోతున్న నిక్కరును ఓ చేత్తో పైకి లాక్కుంటూ నడిచే చిన్నారులు కొందరు నేను బడికెల్లను మొర్రో అని మారాం చేస్తుంటే చంకనేసుకుని ఎందుకెల్లవు రా అని గదుముతూనో లేక వెల్తే నీకు అది కొనిపెడతాను ఇది కొనిపెడాతాను అని బుజ్జగిస్తూ తీసుకెల్లే వాళ్ళు కొందరు ఇలా అందరి గమ్యం ఒక్కటే అదే బడికి వెల్లి చదువుకోవడం

మనసులో ప్రతీ రోజూ వచ్చే ఆలోచనే బడి గంట మోత వింటూ అందరిలాగా పుత్తకాల సంచీ తగిలిచ్చుకుని “అమ్మా నేను బడికెల్తన్నానే ” అంటూ బయలుదేరేదెప్పుడు, అయినా ఇంత మంది పిలకాయలు చేసుకున్న పుణ్ణెమేంది నేను చేసుకున్న పాపమేంది ఒకేళ నేను పాపమే చేసుంటే దానికి పరిహారం ఈ జల్మకు లేనట్లేనా ఒకవేళ ఉంటే ఎప్పుడు , నేనూ అందరిలా బడికెల్లేదెప్పుడు? ఇలా ప్రతీ రోజూ ఓ అరగంట ఆ అరుగుమీద కూర్చుని ఉదయమే బడికి వెల్లే పిల్లల్ని చూస్తూ తనలో తాను బాధపడుతూ తనను తాను ప్రశ్నించుకుంటూ ఉంటాడు

“ఓరి కిట్టిగా ఎక్కడ చచ్చావు రా …. టైమవుతా ఉండాది పనిలోకి పోవా ఏందియ్యాళ …..” వీధికి ఆచివర ఉండి అరిచింది లచ్చమ్మ

ఒక్కసారి స్పృహలో కి వచ్చాడు కిట్టిగాడు పుట్టినప్పుడు మంచిగా కృష్ణమోహన్‌అని పేరుపెట్టారు కాని వాడికి ఊహ తెలిసినతరువాత పిలిచే ప్రతి ఒక్కరూ కిట్టిగా అనేవాల్లేగాని అసలుపేరుతో పిలిచినవాళ్ళు లేరు

” ఆ వత్తన్నా ఎందుకంత గొంతు చించుకోని అరుత్తుండావ్‌పనిలోకి పోక సత్తాన చెప్పు ” అంటూ తల్లి కి ఎదురెల్లి చేతిలో ఉన్న సంచీ తీసుకుని బుజానికి తగిలించుకుని తనలో తానే చిన్నగా నవ్వుకుంటూ అక్కడినుండే వెనుతిరిగాడు ‘అందరూ పుస్తకాల చంచీ తగిలింకుకుంటుంటే నేను తిండిబోతోడి లా మద్దేనం తినేదానికి సంచీ తగిలించుకుంటున్నా ‘ మనసులో అనుకుంటూ నడుస్తున్నాడు

“ఏందిరో నీలో నువ్వే తెగ నవ్వేసుకుంటున్నావ్‌….. మాకూ చెపితే మేం కూడా కొంచం నవ్వుతాంకదా ” నవ్వుతూ అడిగాడు అప్పటిదాకా కిట్టిగాడికోసమే ఎదురుచూస్తూ ఉన్న రాముడు, రాముడు వయసులో కిట్టిగాడికన్నా ఓ మూడేల్లు పెద్దవాడు ఇద్దరూ మంచి స్నేహితులు చిన్నప్పటినుండీ ఇద్దరూ ఒకే చోట పని చేస్తున్నారు

“ఎంతసేపయిందేంది నువ్వొచ్చి ” అడిగాడు కిట్టిగాడు

” ఆ ఇప్పుడే మీ అమ్మ నీకోసం కేకేసిందే అదిని ఇంట్లో నించి బయటకొచ్చా ఇక నువ్వు రాకపోతావా అని ” చెప్పి “అదిసరే ఎందుకు నవ్వుతున్నావో చెప్పలేదు ” అడిగాడు

“ఏమీలేదురా ఊరికే సంచి తగిలించుకుంటుంటే నవ్వొచ్చింది ” అంటూ తనకు నవ్వురావడానికి గల కారణం చెప్పాడు

ఈ సారి నవ్వడం రాముడి వంతయింది “ఇప్పుడు నువ్వెందుకు నవ్వుతున్నావురా …. అందుకే నేనెవరికీ ఏదీ చెప్పకూడదనుకుంటా ” చెప్పాడు కిట్టిగాడు

“అందుక్కాదులేరా నా చిన్నప్పుడు నేనూ నీలా నే అనుకునే వాడిని అది గుర్తొచ్చి నవ్వొచ్చింది అంతే ….. నిన్ను ఎగతాలి చెయ్యడానికి నవ్వలేదు ” సంజాయషీగా చెప్పాడు

“నీక్కూడా అలానే అనిపించేదా ? ” అమాయకంగా ప్రశ్నించాడు

“ఏ నేను మాత్రం నీలా మనిషిని కాదా …. నాకూ బడికెల్లి చదువుకోవాలని ఉండదా ?” చెప్పాడు

” ఒరే నాకో చిన్న అనుమానం అడగనా ? ” మెల్లగా అడిగాడు కిట్టిగాడు

“అడుగురా….”

“అదే రా మనం ఒక్కసారన్నా బడిలో అడుగుపెడతామంటావా ?? ” ప్రశ్నించాడు

“నీసంగతి నాకు తెలియదుకాని నేను మాత్రం రెండు మూడేల్ల క్రితం ఒకసారి ఓ వారం రోజులు బడికెల్లాను రా …..”

నడుస్తున్నవాడల్లా ఒక్కసారిగా నిలబడిపోయి “నిజమా ” ఆశ్చర్యపోతూ అడిగాడు

“నిజమేరా ” చెప్పాడు

” మరి నాకెప్పుడూ చెప్పలేదే” మల్లీ తిరిగి ప్రశ్నించాడు

“ఇందులో చెప్పేదానికేముంది అప్పుడేదో అట్టా జరిగింది ”

“మీ అమ్మా అయ్యా నిన్ను బడికి పంపించారా ” ఇంకా నమ్మకం కుదరనట్లు అడిగాడు

“వాల్లు పంపించలా ….. బడిలో అయ్యోర్లొచ్చి తీసుకెల్లారు ”

“అదెట్టా …”

“అప్పుడేదో పండగంట …. అదేంపండగబ్బా ” అని తల గోక్కుంటూ కొంచం సేపు ఆలోచించుకుని ” ఆ అదే చదువుల పండగ , ఆ పండగప్పుడు పిల్లలు పనిలోకిపోకూడదని గవర్నమెంటోల్లు రూలు పెట్టారు అందుకే సేటు ఆ వారంరోజులు సెలవిచ్చాడు మా అయ్య వేరే గత్తెంతరం లేక బడికి పంపించాడు

“చదువుల పండగా ?” నేనెప్పుడూ వినలేదే ఇది అడిగాడు కిట్టిగాడు

“నేనుకూడా అప్పుడే విన్నా … అంతక ముందుగానీ ….. ఆ తరువాతగానీ ఎప్పుడూ ఇనలా ”

“మరి అన్నీ పండగలూ పెతేడూ వత్తయి కదా మరి ఈ పండగ రాదా … ? ” అమాయకంగా ప్రశ్నించాడు

“అదే నాకూ అద్దం కావటల్లా అన్నీ పండగల్లా అది పతేడూ రావడంలేదు ఎందుకో నాకయితే తెలియదు ” చెప్పాడు

“అయినా మనం బల్లోకని వెల్తే ఇంట్లో కూడెలా వత్తదిరా చెప్పు మీ అమ్మా మాయమ్మా నాలుగిల్లలో పాసిపని చేసి ఒకపూట వాల్లు పెట్టే ముద్ద తీసుకొచ్చి మనకు పెడతండారు వాల్లు నెలకిచ్చే వందో రెండొందలో రెండో పూటా మూడో పూటా మన తిండికే సరిపోదు మరి రోగాలనీ దవాఖానాలని ఇంటి ఖర్చులని వీటన్నిటికీ డబ్బులెలా వత్తాయ్‌రా ”

“చదువుకున్నాక పెద్ద ఉద్దోగం చేత్తాం కదా, అప్పుడు మరిన్ని డబ్బులొస్తాయి కదా ” మరిన్నీ అనే పదాన్ని నొక్కిపలుకుతూ చెప్పాడు కిట్టిగాడు

” ఓ రి పిచ్చి మొద్దా పెద్ద చదువులు చదవాలంటె పుత్తకాలనీ , పీజులనీ డొనేషన్లనీ చాలా డబ్బులు కావాలి మన దగ్గర అన్ని డబ్బుల్లేవు అలా కాకుండా ఇప్పుడు బడికెల్లినా పెద్ద పీజులు కట్టే చదువుకొచ్చేటప్పటికి మనం మల్లీ ఇదే పని చెయ్యాల , అప్పుడు చదువు మద్దెలో మానేయడమంటే చాలా బాదగా ఉంటాది అందుకే ఇప్పుడునుంచే ఈ పని చేస్తే ఏ బాదా ఉండదు ” వివరంగా చెప్పాడు రాముడు

“ఇవన్నీ నీకెలా తెలుసురా “అడిగాడు కిట్టిగాడు

“మన కాలనీలో ఎంతమంది లేరు చదువుకుంటు చదువుకుంటు మద్దెలో మానేసినోల్లు వాల్లందరికీ చదువుకోవాలనే ఉం టుంది కానీ అందరూ పుత్తకాలకీ పీజులకీ డబ్బుల్లేక మద్దెలో మానేసినోల్లే ” చెప్పాడు రాముడు

“రేయ్‌ఏందిరా నీటకంగా పెళ్లి నడక నడుస్తున్నారు తొందర్రండి అవతల టైం అయిపోతుంది …. వచ్చి బండెక్కండి ” సూపర్వైజర్‌కేకతో ఈ లోకంలోకొచ్చారిద్దరూ

“అప్పుడే అడ్డాకాకికొచ్చామా ? ” ప్రశ్నించాడు కిట్టిగాడు

“ఆ …. పద వాడు తిడతాడు ” సూపర్వేజర్నుద్దేసించి చెప్పాడు రాముడు

“అదికాదురా …..” ఎదో చెప్పబోయాడు కిట్టిగాడు

“ఇప్పుడుకాదు ఆనక్క మాట్టడుకుందాం పద బండెక్కు ” అంటూ పరిగెత్తుకెల్లి బండెక్కాడు రాముడు, రామున్నే అనుసరించాడు కిట్టిగాడు

ఇద్దరూ ట్రక్కులోకెక్కారు ఆ ట్రక్కులో తమలాంటి పిల్లాలే ఎక్కువ మంది మొత్తం నలబై మందికి పైగా ఉన్న ఆ ట్రక్కులో ఓ ఏడెనిమిది మంది మాత్రమే పెద్దవాళ్ళుంటారు మిగిలిన అందరూ ఏడు సంవత్సరాల వయసునుండి పదిహేనేల్ల వయసు మగపిల్లలూ ఆడపిల్లలే వీల్లందరూ పనిచేసేది ఝూట్‌మిల్లులో ఎక్కిన కొంచం సేపటికే బండి కదిలింది.

బండి దిగి అందరూ లైనులో నిల్చున్నారు ఒక్కొక్కరి సంచి చెక్‌చేసి పేరు చెప్పాక రిజిస్టరులో హాజరు వేసుకుని లోపలకు పంపిస్తారు సెక్యూరిటీ వాళ్ళు. గేటులో నుండి లోపలకు అడుగుపెట్టడంతోటే ఎవరి లైనుకు వాళ్ళు వెళ్ళిపోతారు లోపలంతా దుమ్మూ ధూళి. ఒక్కోసారి నాలుగైదు అడుగుల దూరంలో ఉన్న వ్యక్తి కూడా కనిపించనంతగా దుమ్ము లేస్తుంది అదే పీల్చుతూ లోపల పనిచేసేవాల్లకు అవీ ఇవీ అందించడం ఉదయం నుండి సాయంత్రం వరకూ ఒక్కచోట నిలబడడానికి కానీ కూర్చుంటానికిగానీ ఖాలీ దొరకదు మధ్యాహ్నం అన్నం తినేందుకు కేవలం అరగంట మాత్రమే టైం ఉంటుంది ఇంతా కష్టపడితే వచ్చేది రోజుకు ఇరవై నుండి ముప్పై రూపాయలు అదీ వయసునుబట్టి

ఆరోజు మద్యాహ్నం అన్నం తినేటప్పుడు మల్లీ బడి ప్రస్తావన తెచ్చాడు కిట్టిగాడు “అదిసరే రా నువ్వు పొద్దున చెప్పావే బడి మానేసినోల్లంతా పీజులు కట్టలేకో పుత్తకాలు కొనలేకో మానేసారని మరి గవన్నమెంటోల్లు మనసుంటోల్లకు పీజులు కట్టించుకోరంట అదీకాక పుస్తకాలుకూడా ఇస్తారంటకద ” అడిగాడు

“ఒరే నీకు తెలీదురా పీజులు కొన్నిరోజులే కట్టించుకోరు పుత్తకాలిత్తారు కానీ నోడుసులు అవీ ఇవీ చాలా ఉంటాయ్‌కదా అవన్నీ మనమే కొనుక్కోవాల అయినా ఆల్లు చెప్పేది ఒకటి చేసేది ఒకటి నీకివన్నీ తెలియదు ర అనవసరంగా బడిగురించి ఆలోచించకుండా పని చేసుకో ఎక్కువాలోసిత్తే పిచ్చెక్కుద్ది ”

“అవున్రా నాకు బడి పిచ్చెక్కింది ”

“అరే కిట్టిగా నీకో విషయం చెప్తా వింటావా మనం ఎంత అనుకున్నా చదువుకోలేము నేనూ చదువుల పండగప్పుడు బడికి పోయినప్పుడు ఎంతో ఆనంద పడ్డా ఇక నా జీవితం మారిపోయింది అందరిలా నేనుకూడా చదువుకోవచ్చు అని కానీ ఏమయింది వారం గడిచాక ఆ పండగ అయిపోయాక మల్లీ బడికిపోతానంటే మా అమ్మా, అయ్యా ఒప్పుకోలేదు చదువుల పండగప్పుడు పనిలో కి రానివ్వని సేటు పండగయిపోగానే ఇంటికి సూపెర్వేజర్ని పంపాడు పనిలోకి తీసుకురమ్మని పోనీ ఆ అయ్యోరన్నా వచ్చి మీ అబ్బాయిని బడికి పంపించండి అంటాడేమో అని ఓ వారం రోజులదాకా ఎదురుచూశా ఎమీ లాబం లేదు అందుకే అట్టాంటి పండగొచ్చినా ఈ సారి నేను బడికి పోదలుచుకోలేదు ”

“ఏ ఎందుకు ” అయోమయంగా అడిగాడు కిట్టిగాడు

“ఎందుకంటే వారం రోజులో పదిరోజులో పోతే కనీసం ఓ న మః లు కూడా రావు…తరువాత ఆ బడికి పోయిన రోజుల్ని గుర్తు చేసుకుంటూ చానాలు బాద పడాల ”

ఆలోచనలో పడ్డాడు కిట్టిగాడు

ఇంతలో అన్నం టైం అయిపోయింది మళ్లీ ఎవరి పనిలోకి వాళ్ళు వెల్లిపోయారు

******

సాయంత్రం ఆరుగంటలకు మల్లీ ట్రక్కులో ఎక్కారు, ఇంటికొచ్చి నీల్లుపోసుకుని అన్నంతిని పక్కమీద పడుకున్నాడు, వాడి ఆలోచనంతా ఒక్కటే ‘ నేను బడికెల్లి చదువుకోవాలంటే ఏం చేయ్యాల ?,

‘అయ్యా బడికిపోతానే అంటే ఏడిచావ్‌ ఎదవ , బడి గిడి అన్నావంటే చమడాల్‌ తీత్తా అయినా చదివి నువ్వేం సేత్తావ్‌రా పని చేసుకుంటే నాలుగు డబ్బులన్నా వత్తాయి అని తన్నినంత పని చేత్తాడు పనికి పోతే నాలుగు డబ్బులొత్తాయ్‌అని చెప్పే ఆయనెందుకు పనికిపోడో అడుగుదామంటే నిజంగానే తంతాడేమో అని బయం, ఆ పసాదు గాడు చేసినట్టు చదువుకోసం దొంగతనం చేసి జైలుకెల్తే ? వచ్చాక అందరూ దొంగోడంటారు అదీకాక అమ్మ నన్ను చూడకుండా ఉండలేదు మరేం చేయాల, తెల్లారే లోగా ఏదో ఒకటి చేయ్యాలంతే ‘ ఆలోచిస్తా నిద్రలోకి జారుకున్నాడు కిట్టిగాడు

“అమ్మా నేను బడికి పోతానే , అందరిలా చదువుకుని పెద్దయ్యాక నిన్ను మారాణిలా చూసుకుంటానే నన్ను బడికి పంపవే నీకు దణ్ణం పెడతా

చూడవే అందరు పిలకాయలు బడికెల్లోచ్చి ఎంచగ్గా ఆడుకుంటున్నారు నేనలా ఆడుకోనే ఈ టైములో ఏదన్నా పనిచేసి నాలుగు డబ్బులు తెత్తానే , ఎప్పట్లాగే నీకు సాయంగా ఉంటానే నీకు పుణ్ణెముంటదే అయ్యకు ఏదోకటి చెప్పి నన్ను బడికిపంపవే … ” మొదట్లో వాడేమంటున్నాడొ అర్దం కాకపోయినా పదే పదే ఈ విషయాన్నే కలవరిస్తుండడంతో ఒక్కసారి కళ్ల వెంట నీరు కారడం మొదలయింది లచ్చమ్మకి నిద్దర్లో ఏడుస్తున్న కిట్టిగాడి పక్కనే కూర్చుని వాన్ని తన ఒల్లో పడుకో పెట్టుకుని వాడికల్లు తుడుస్తూ ” ఏమి చెయ్యనురా నేను …చావనా చెప్పు, మీ అయ్య ఏదయినా పని చేత్తే నువ్విలా కట్టపడాల్సిన పనేముంది ఆడు పని చెయ్యడు నేను తెచ్చే సొమ్ము మనం తింటానికి సరిపోదు కన్న కొడుకు చదువుకుంటానంటే బడికి పంపలేని దరిద్రురాలి కడుపున పుట్టావు రా ఈ జనమకి మీ అయ్యా మారడు , మనకీ కట్టాలూ తప్పవు, కనీసం వచ్చే జనమలో అన్నా బడికి పంపించే చల్లని తల్లి కడుపున పుట్టి నీ కోరిక తీర్చుకో ” అంటూ తాను ఏడుస్తూనే వాన్ని సముదాయిస్తుంది లచ్చమ్మ.

******
ఉదయం నిద్రలేచి పక్కమీద కిట్టిగాని కోసం చూసింది లచ్చమ్మ ఇంటి చుట్టుపక్కలవెతికి కనిపించిన వాల్లందరినీ అడిగింది ఎవరూ చూడలేదనడంతో గుండెలు బాదుకుని ఏడుస్తుంది.
-------------------------------------------------------
రచన: కె . యస్ . వరప్రసాద్, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment