ముగ్గురు సాధువులు
సాహితీమిత్రులారా!
ఈ అనువాదకథను ఆస్వాదించండి.................
ఓడ బయల్దేరడానికి సిద్ధంగా ఉంది. సరంగు పైకెక్కి ఆకాశంలోకి చూస్తున్నాడు, ఎక్కడైనా వర్షం కానీ తుఫాను కాని వచ్చే సూచనలున్నాయేమో అని.
“అందరు ఎక్కేశారండి. బయల్దేరొచ్చు ఇంక!” వచ్చి చెప్పేడు నౌకరు.
“పాస్టరు గారు వచ్చినట్టేనా? ఆయన లేకుండా మనం వెళ్ళిపోతే బాగుండదు.”
“వచ్చారుగా. ఈ పాటికి ఆయన మళ్ళీ ప్రార్ధన చేసుకోడానికి లోపలకెళ్ళారేమో. ఆయనెక్కడం నేను చూశాను.”
“సరే ఐతే తెరచాపలెత్తమను. బయల్దేరదాం.”
ఓడ బయల్దేరిన చాలా సేపటికి పాస్టర్ తన గదిలోంచి బయటకొచ్చాడు. అంతా నిర్మానుష్యంగా ఉంది. చేతిలో జపమాల పట్టుకుని మెల్లిగా నడుచుకుంటూ కనపడిన ఆయన్ని అడిగేడు, “జనం ఎవరూ కనపడరేం?”
“అందరూ పైన ఉన్నట్టున్నారండి. చాలామందికి ఇలాంటి ప్రయాణం మొదటిసారి. అందుకే అలా చుట్టూ చూడ్డానికి పైకెక్కి ఉంటారు.”
“అరే, నేను సాయంకాలం అందరితో కలిసి ప్రార్ధన చేయిద్దామనుకున్నానే?”
“పైకి వెళ్ళి చూడండి, అక్కడే ప్రశాంతంగా ప్రార్ధనా అదీ చేయించుకోవచ్చు.”
సమాధానం కోసం చూడకుండా ముందుకెళ్ళిపోయేడు ఆయన, ఏదో పనిమీద ఉన్నట్టున్నాడు. పాస్టర్ పైకి వెళ్ళేసరికి జనం అంతా గుంపుగా నించుని ఒకాయన చెప్పేది శ్రద్ధగా వింటున్నారు. దగ్గిరగా వెళ్ళి మాట కలుపుతూ అడిగేడు –
“మీరందరూ ఏదో చర్చించుకుంటున్నట్టున్నారే?”
పాస్టర్ని చూడగానే అప్పటిదాకా మాట్లాడుతున్నతను చటుక్కున ఆపి తలమీద టోపీ తీసి వంగి నమస్కారం చేసేడు తప్ప ఏమీ మాట్లాడలేదు. గుంపులో ఉన్న ఒకాయన కాస్త ముందుకొచ్చి చెప్పేడు:
“ఆ దూరంగా కనబడే లంకలో ముగ్గురు సాధువులున్నారనీ, వాళ్ళొక వింత జీవితం గడుపుతున్నారనీ ఇతను చెప్తున్నాడు.”
“సాధువులా? ఎక్కడా ఆ దీవి?” పాస్టర్ గారి కుతూహలం ఎక్కువైంది.
మొదట మాట్లాడుతున్నాయన వేలితో చూపించేడు లంకవేపు. కళ్ళు చికిలించి చూశాడు. ఏమీ కనపళ్ళేదు. “నాకేం కనపడట్లేదోయ్, మీ అంత కుర్రవాణ్ణి కాదు కదా?” నవ్వుతూ చెప్పేడు.
“పోనీలే, ఈ సాధువులు ఎలాంటివారు?”
“క్రిందటేడు దాకా నాకూ తెలియదండి, అప్పుడప్పుడూ ఇలా ప్రయాణికులూ, చూసిన మా బెస్తవాళ్ళూ చెప్పడం తప్ప. కానీ పోయినేడాది నేను చేపలు పట్టడం కోసం వెళ్తే చిన్న తుఫానులో నా పడవ మునిగిపోయింది. నాకు స్పృహ పోయింది. నేను కళ్ళు తెరిచేసరికి ఆ లంకలో ఉన్నాను.”
“వాళ్ళేం చేస్తూంటారు ఆ ద్వీపంలో? అక్కడో గుడో, గోపురమో, ఆశ్రమమో ఉందా?”
“అక్కడేమీ ఉండదండి. వాళ్ళుండేదో చిన్న గుడిసె. నేను లేచేసరికి నాకు తిండీ నీరు ఇచ్చి నా పడవ బాగుచేసి పెట్టారు. ముగ్గురూ అసలు మాట్లాడ్డం కూడా అంతంతే.”
“ఆ ద్వీపం పేరేమిటి?”
“ఇలాంటి లంకలు ఈ చుట్టుపక్కల చాలా ఉన్నాయి. వీటికి పేర్లు అవీ లేవు.”
“సరే సాధువుల గురించి చెప్పు. వాళ్లు నీతో ఏం మాట్లాడేరు?”
“ఒకాయన చాలా ముసలివాడు. ఆయనకి నూరేళ్ళు దాటి ఉంటాయని ఖచ్చితంగా చెప్పగలను. మొహం మాత్రం అదో రకమైన వెలుగుతో ఉంది. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. రెండో ఆయన కూడా ముసలివాడే కానీ మొదటాయనకంటే కొంచెం తక్కువ ఉంటుంది వయస్సు. మూడో ఆయన కాస్త పడుచువాడే, ముఫ్ఫై, నలభై ఏళ్ల లోపుల ఉండొచ్చు. ఈ రెండో ఆయన్ని మీరిక్కడ ఎంతకాలం నుంచి ఉంటున్నారని అడిగేను. దానికే ఆయనకి కోపం వచ్చినట్టుంది. ఏదో అనబోయేడు కానీ పెద్దాయన ఈయన చేయి పట్టుకుని ఆపాడు. ఆ పెద్దాయనే నాకేసి చూసి, ‘మా మీద దయ ఉంచాలి’ అన్నాడు. ఇంకా తర్వాత మాటా మంతీ లేదు.”
ఇలా మాట్లాడుకునేంతలో ఓడ లంకకి దగ్గిరగా రావడం గమనించేడు పాస్టర్. “ఆ, ఇప్పుడు కనిపిస్తోంది. అక్కడకెళ్ళి వాళ్లని చూడడం కుదురుతుందా?”
“సరంగుని అడిగితే చెప్తాడండి. కానీ మనం అక్కడకెళ్తే మనకి ఆలస్యం అవుతుందని మీకు తెలియంది కాదు.”
“ఇక్కడ ఆ కనిపించే దీవిలో ముగ్గురు సాధువులున్నారని ఈయన చెప్తున్నాడు. నాకు వాళ్ళని చూడాలని ఉంది. మీరు అక్కడికి నన్ను ఎలా తీసుకెళ్లగలరో అని అడుగుదామని…” సరంగు వచ్చాక చెప్పేడు పాస్టర్.
“భలేవారే, ఈ కధలన్నీ నమ్ముతున్నారా? వాళ్ళు సాధువులని కొంతమందీ, కాదని కొంతమందీ అనడం నేను విన్నాను. ఇంతా చేసి అక్కడకెళ్తే వాళ్ళు మామూలు బెస్తవాళ్ళనుకోండి, మనకి సమయం వృధా, మీకు అనవసరపు శ్రమాను!” సరంగు కంగారుగా చెప్పేడు.
“నా సమయానికేంలే గానీ నన్ను అక్కడకి తీసుకెళ్ళాలంటే ఎలా కుదురుతుంది?”
“ఓడ ఆ లంక వరకూ వెళ్లడం కుదరదు కానీ మిమ్మల్నో చిన్న పడవలో నిచ్చెన మీదనుంచి దింపి ఇంకో ఇద్దరు తెడ్డువేసే బెస్తవాళ్లతో పంపించాల్సి వస్తుంది. ఇదంతా మనకెందుగ్గానీ మనం ఇక్కడ ఆగవద్దని నా మనవి. మనదారిన మనం పోదాం.”
పాస్టర్ గారి కుతూహలం ఇంకా ఎక్కువైంది. “అలా కాదు, మీ శ్రమ ఉంచుకోను. నన్ను ఓ సారి అక్కడకి తీసుకెళ్ళగలరా?”
సరంగు ఈ లంకలో ఆగడం ఎంత ప్రమాదమో, ఎందుకు వద్దో అన్నీ పాస్టర్‌కి చెప్పి ఆయన్ని అక్కడకి వెళ్ళకుండా ఆపుదామని చూశాడు కాని పాస్టర్ మంకుపట్టూ, ఆయన పాస్టర్ అనే గౌరవం వల్లా ఏదీ కుదర్లేదు. ఓ అరగంటలో చకచకా పడవ దింపడం, పాస్టర్ గారూ ఇంకో ఇద్దరు పడవ నడిపే బెస్తవాళ్ళూ దిగడం అయింది. పడవ మెల్లిగా లంక దగ్గిరకొస్తూంటే పాస్టర్‌కి సాధువులు ముగ్గురూ కనిపించేరు గట్టుమీదే. వాళ్ళ మొహాల్లో ఆశ్చర్యంతో కూడిన చిరునవ్వులని పెరిగిన గడ్డాలు దాచలేకపోతున్నాయి. పడవ దిగిన పాస్టర్ చెప్పేడు సాధువులతో.
“నేను మీలాగే యొహావా సేవకుణ్ణి. భగవంతుడి ఇష్టం ప్రకారం ఆయన నా దగ్గిరకి పంపించిన వాళ్లందరికి ఏదో నాకు తోచినంతలో ఆయన విభూతి గురించి చెప్తూ ఉంటాను. ఈ దారిలో ఈ రోజు వెళ్తూంటే మీ గురించి తెల్సింది. మిమ్మల్ని చూడాలనిపించి సరంగు వద్దంటున్నా ఇలా వచ్చేను.”
సాధువులు ముగ్గురూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు తప్ప బదులివ్వలేదు. మళ్ళీ పాస్టరే అన్నాడు.
“ఇలా జనాలకి దూరంగా సముద్రంలో ఉండే ఒంటరి దీవిలో మీరు ఎలాంటి ప్రార్ధన చేస్తారో, జ్ఞానం సంపాదించుకోవడానికేం చేస్తున్నారో మీరు చెప్తే తెల్సుకోవాలని ఉంది నాకు.”
ఈ మాట విని ఒక సాధువు నిట్టూర్చేడు. అందరికంటే ముసలి సాధువు చెప్పేడు పాస్టర్‌తో, “మాకు అసలు ప్రార్ధన అంటేనే తెలియదు. మాకొచ్చినదల్లా ఒకే ఒక వాక్యం. దానితోనే ఇలా జీవితం గడిచిపోతోంది.”
ఆయనిలా అనగానే ముగ్గురు సాధువులూ ఆకాశం కేసి చూసి గొంతెత్తి ఒక్క కంఠంతో అన్నారు “మీరు ముగ్గురు, మేం ముగ్గురం. మా మీద దయ ఉంచాలి.”
ఇది విని పాస్టర్ మనసులో చిన్నగా నవ్వుకుని ఇలా అన్నాడు.
“‘మీరు ముగ్గురు’ అంటున్నారంటే మీకు భగవంతుడి త్రిమూర్తి తత్వం గురించి తెలిసినట్టుంది, సంతోషం. కానీ మీరు చేసే ప్రార్ధన అంత బాగాలేదు. భగవంతుడే ఈ భూమ్మీద యొహోవా రూపంలో పుట్టి మనుషులందరూ సరిగ్గా ఎలా ప్రార్ధన చేయాలో నేర్పి వెళ్ళాడు. నేను చెప్పేది ఇదంతా నా స్వకపోల కల్పన అనుకునేరు సుమా, లేదు, ఆయన చెప్పిందే నేను చెప్తున్నాను. మీకు ఇష్టమైతే ఆ చిన్న ప్రార్ధన నేర్పుతాను ఇప్పుడు ఇక్కడే, భగవంతుడు చెప్పినట్టుగానే.”
“తప్పకుండా,” వెంఠనే చెప్పేడు సాధువులందర్లో పెద్దాయన.
“సరే అయితే వినండి. విన్న తర్వాత మీరు నేను చెప్పింది నాకు అప్పచెప్పారంటే మనం ఇది పది నిముషాల్లో పూర్తి చేయవచ్చు, చెప్పండి, స్వర్గంలో ఉండే పరమేశ్వరా..”
అందర్లోకీ చిన్న సాధువు “స్వర్గంలో ఉండే పరమేశ్వరా…” అనగలిగేడు, కానీ అలవాటు లేని భాష వల్ల కాబోలు రెండో సాధువు సరిగ్గా ఉఛ్ఛరించలేకపోయేడు. మాట్లాడుతూంటే ఆయన గెడ్డం నోటికడ్డం పడుతోంది మాటిమాటికీ. అందరికంటే పెద్దాయనకి పళ్ళే లేవు నోట్లో. ఆయనేదో గొణిగినట్టుంది ఇది చెప్తూంటే. ఆయనన్నదేమిటో పాస్టర్‌కే అర్ధం కాలేదు.
కాసేపు పాఠం చెప్పగానే పాస్టర్‌కి అర్ధమైంది. వీళ్ళు జనసమూహంలోంచి బయటకొచ్చి చాలా ఏళ్ళే అయింది కనక ఇది గంటా గంటన్నరల్లో తేలేది కాదు. అయినా సరే వీళ్ళని చూస్తే పాస్టర్ గారికి వదిలి వెళ్ళబుద్ధేయలేదు. వాళ్ళు ముగ్గురూ స్పష్టంగా చెప్పేదాకా రోజంతా అక్కడే కూర్చుని అలా పాఠం చెప్తూనే ఉన్నాడు, చెప్పిందే మళ్ళీ చెప్తూ. దాదాపు చీకటి పడేసరికి పాస్టర్ సంతోషంగా లేచాడు. ముగ్గురు సాధువులూ అప్పటికి మొదటి పంక్తి, “స్వర్గంలో ఉండే పరమేశ్వరా…” దగ్గిర్నుంచి ఆఖరి పంక్తి “పాపాల నుంచి రక్షించు…” వరకూ పూర్తిగా చెప్పగలుగుతున్నారు.
ముగ్గురు సాధువులూ కూడా సంతోషంగా పాఠం అప్పచెప్పి పాస్టర్‌కి సాష్టాంగ నమస్కారాలు చేశారు. పాస్టర్ ముగ్గుర్నీ లేపి దగ్గిరకి తీసుకుని దీవించి చెప్పేడు, “ఇలా మిమ్మల్ని కల్సుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మీకు కూడా నేను ఏదో ఒక సేవ చేయగలిగేను ఈరోజున. ఈ ప్రార్ధన మర్చిపోకుండా రోజూ చేయండి. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు.”
సరంగు ఇప్పటికే బాగా ఆలస్యం అయిందని కంగారు పడుతూ తెడ్డువేసే బెస్తవాళ్ళని హెచ్చరించి, నిచ్చెన మీదనుంచి పాస్టర్ గారిని ఓడలోకి త్వరత్వరగా ఎక్కించాడు. ఇది జరుగుతున్నంతసేపూ ముగ్గురు సాధువులూ లంకలో గట్టుమీద నుంచుని ఆపకుండా, “స్వర్గంలో ఉండే పరమేశ్వరా.. ” అంటూ గొంతెత్తి వాళ్ళకు నేర్పిన పాఠం వల్లిస్తూనే ఉన్నారు. వాళ్ళలా ప్రార్ధన చేస్తూండగానే చీకటి పడడం, పాస్టర్ ఓడలోకి చేరడం, ఓడ బయల్దేరి పోవడం జరిగిపోయింది.
పాస్టర్, ఓడలో మిగతా జనం ఈ సాధువులు కనపడేంతవరకూ అలా చూస్తూ కూర్చున్నారు. మెల్లిగా సాధువులూ వాళ్ళుండే దీవీ కనుమరుగయ్యేయి. చంద్రోదయం కావడంతోటే అదో రకమైన ప్రశాంతత వాతావరణం అంతా పరచుకుంది. బాగా చీకటి పడ్డాక మిగతా ప్రయాణీకులందరూ పడుకున్నారు గానీ పాస్టర్ గారికి నిద్ర దూరమైంది. ఆ రోజు తాను చూసిన సాధువులూ, వాళ్ళకి తనెలా ప్రార్ధన నేర్పించాడో మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తుంటే ఒళ్ళు గగర్పొడుస్తూ ఉంది ఆయనకి. మళ్ళీ పైకి ఎక్కి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుని దూరంగా కనుమరుగైన ద్వీపంకేసే చూస్తూ ఆలోచనల్లో మునిగిపోయేడు ఆయన. ఓడ కదుల్తూంటే నీళ్ళలో వచ్చే శబ్దం తప్ప ఇంకేమీ లేదు.
ఎందుకో ఓ సారి పాస్టర్ తలెత్తి చూశాడు. దూరంగా నీళ్ళమీద ఏదో తెల్లగా మెరుస్తూంది. ఇటువేపే వస్తూన్నట్టుందేం? కూర్చున్నాయన లేచి నిలబడి కుతూహలంగా చూడబోయేడు కనిపించేదేమిటో. ఈ వెల్తురు ఇంకా దగ్గిరైంది. పైకి చూసి అక్కడున్న చుక్కాని కదిపేవాడితో అన్నాడు పాస్టర్, “హేయ్, ఇదేదో ఓడ దగ్గిరకొస్తూంది. ఏమిటో తెలుసా?” వాడు చూసి భయంతో చుక్కాని వదిలేసి ఒక్క గావుకేక పెట్టేడు. ఈ పాటికి వచ్చేది ఏమిటో తెల్సింది. ముగ్గురు సాధువులూ నీళ్ళమీద పరుగెట్టుకుంటూ ఓడ కంటే వేగంగా వస్తున్నారు – ఓడ దగ్గిరకే.
చుక్కాని కదిపేవాడు పెట్టిన కేకకి మొత్తం ఓడలో జనం అంతా మేలుకున్నట్టున్నారు. వాళ్ళంతా పైకి చేరారు కంగారుగా, ఈ వింత చూడ్డానికి.
ఓడ దగ్గిరకి రాగానే అక్కడే నీళ్లలో నిలబడి పెద్ద సాధువు అన్నాడు, “మీరు చెప్పిన పాఠం మీరున్నంతవరకూ అలా అంటూనే ఉన్నాం. అలా అన్నంతవరకూ గుర్తు ఉంది. కానీ ఒక్కసారి ఆపగానే ఒక్కో పదం మనసులోంచి జారిపోయింది. ఇప్పుడు ముగ్గురికీ ఒక్క ముక్క కూడా గుర్తు రావట్లేదు. మళ్ళీ ఓ సారి నేర్పమని అడగడానికి వచ్చేం. శ్రమ అనుకోకపోతే మళ్ళీ నేర్పగలరా?”
ఛెళ్ళున చెంపమీద కొట్టినట్టైంది పాస్టర్‌కి. ఆయన కిందకి వంగి వాళ్ల ముగ్గురికి ప్రణామం చేసి చెప్పేడు, “మీరు జనసంద్రంలోంచి విడిపోయి, భగవంతుడి నుంచి దూరంగా ఉండిపోయారనుకుని అజ్ఞానంతో మీకేదో నేర్పడానికి ప్రయత్నించాను. మీరు చేసే ఆ చిన్న ప్రార్ధనే నేను నేర్పినదానికన్నా ఎంతో మేలైనది అని తెలిసింది ఇప్పుడు. క్షమించండి. నేను మీకు నేర్పగలిగేది ఏమీ లేదు. నాలాంటి పాపాత్ముణ్ణి కనికరించమని మీరే భగవంతుణ్ణి ప్రార్ధించాలి.”
ఇది విన్నాక ముగ్గురు సాధువులూ ఒకరి మొహం ఒకరు చూసుకుని వెనుతిరిగేరు. ఓడలో ఉన్న జనాల మొహాలలో కత్తివాటుకి నెత్తురు చుక్క లేదు. అందరూ తిరిగి వెళ్ళి పడుకున్నారు, ఈ సారి పాస్టర్‌తో సహా.
ఆ రాత్రి నుండి మర్నాటి సూర్యోదయం దాకా ముగ్గురు సాధువులూ – వాళ్ల లంక నుంచి ఓడవరకూ – నీళ్లమీద నడిచివచ్చిన బాట వెల్తురు చిమ్ముతూనే ఉంది.
----------------------------------------------------------
రచన: ఆర్. శర్మ దంతుర్తి,
మూలం: లియో టాల్‌స్టాయ్,
(మూలం: The three hermits – Leo Tolstoy)
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment