Monday, March 4, 2019

రెక్కలావు


రెక్కలావు



సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి....................

‘ఇండుబుగాయలు, కరక్కాయలు, సూదులు, చెంపిన్నీసులు’

డిడ్డిడ్డిడ్డిడ్డం… డిడ్డిడ్డిడ్డిడ్డం.

‘జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ’

కుయ్, కుయ్. కుయ్, కుయ్.

‘వంకాయలు, బీరకాయలు, కొత్తిమీర, టెంకాయలు, టెడ్డీబేర్లు…

‘చఛ్ఛ! రోడ్డా? రైతు బజారా?’

బంయ్, బంయ్, బంయ్.

‘సైలెంట్‌గా వుండాలన్న ఇంగితంలేని సైలన్సర్లు విషం చిమ్ముతున్నాయి. ఎవరిష్టమొచ్చినట్టు వాళ్ళు కసిగా నొక్కేస్తున్నారు. ట్రాఫిక్ హారన్ కొడితే క్లియరైపోద్దా. తలాతోకా తేడా తెలీని బొమ్మిడాయిల్స్. మట్టిలో బుర్రెట్టి పడుకునే మట్టగిడసల్స్.’

డ్రూడ్రూ… డ్రూడ్రూ… డ్రూడ్రూ…

‘దీనెమ్మా బతుకు…’ మెడని వంచిన మెడుల్లా ఆంబ్లాగేటా, మొబైల్ని భుజానికేసి నొక్కి చిర్రుబుర్రులాడుతోంది.

రొద. రొద. రొద. రొద.

చెవులని దొలిచేస్తూ… తల బద్దలుకొట్టేస్తూ…

“ఏంటి? ఏమయ్యింది?” బుర్ర నుంచి హెల్మెట్‌ని వేరుచేస్తూ ఆందోళన చెందిందో బుల్లెట్.

“ఏమో! ఎవడికి తెలుసు? ట్రాఫిక్‌జామ్‌. గంటనుంచీ. ఇంచు కూడా కదల లేదు.” సహనాన్ని అబినయించిందో స్ప్లెండర్.

వాళ్ళిద్దరి వెనకా ఆగిన ఆక్టివా కళ్ళు, ప్రక్కనే ఖాళీగా కనిపిస్తున్న ఏ.టి.యం. వైపు ఆశగా చూశాయి. కాళ్ళు ఆ పాడు దేహాన్ని ఆత్రంగా అక్కడకి లాక్కూపోయాయి.

“ఏమయ్యిందంటావ్?” బైక్ ఇంజన్ ఆఫ్ చేశాడు కృష్ణ.

“ఎవడితోనో, ఛీకొట్టించుకునే బదులు చూసొస్తే పోలా,” అర్జున్ ఉవాచ.

“ఐతే ఓకే.” బైక్ దిగిన కృష్ణ, ట్రాఫిక్ వ్యూహంలోకి చొరబడ్డాడు.

వెనకా ముందూ, ఈ ప్రక్కా ఆ ప్రక్కా, రోడ్డుని ఆక్రమించిన వాహన శ్రేణుల విలయంలో ఉక్కిరిబిక్కిరులకి రథసారథ్యం స్వీకరించిన అర్జున్ ఉచ్ఛ్వాస నిశ్వాసలయ్యాడు.

అందనంత ఎత్తులో హోర్డింగులు, పట్టపగలే నిద్రపొండి… కమ్మని కలలు రప్పిస్తామంటున్నాయి.

అసలు పని మానేసి పేవ్‌మెంట్ మీద, అటూ ఇటూ తిరుగుతున్న గాంధీగారి కోతులు వస్తుమార్పిడి ఆట ఆడుకుంటున్నాయి.

జాలిమ్‌ లోషన్‌కి బ్రాండ్ అంబాసిడరైన జాతినాయకుడొకడు కటౌట్లో నీతిమాటలకి జండూబామ్‌ రాస్తున్నాడు.

రోడ్ పొడవునా ఆగిన బైకుల్నీ, కార్లనీ దాటుకుంటూ చౌరస్తా వరకూ పోయొచ్చిన కృష్ణని, బద్దకానికి బ్రదరిన్లాస్‌లా వున్న వాళ్ళంతా చుట్టుముట్టారు.

“ఏమయ్యింది?” ఆదుర్దాగా ప్రశ్నించాడు స్ప్లెండర్.

“ఆవు, అరటిపండు తినేసింది.” కూల్‌గా చెప్పాడు కృష్ణ.

“ఆఁ! ప్లాస్టిక్ దొరకలేదేమో పాపం.”

“ఆవు అరటిపండు, కాకి దొండపండు తినడంలో వింతేముంది?” ఆశ్చర్యంతో నోరు తెరచి ఈగలకి ఆశ్రయం కల్పించాడు బుల్లెట్.

“…”

“రీసెంట్‌గా ‘బనానా’నేమైనా బ్యాన్ చేశారా?”

“…”

“అదేమన్నా నిషిధ్ధ ఫలమా?” బాక్టీరియా నాలుగు ప్రక్కలనుంచీ… ప్రశ్నలతోపాటూ చుట్టుముట్టింది.

“…”

“ఆవు అరటిపండు తినడానికీ, ఇలా ట్రాఫిక్‌ జామ్‌ అవడానికీ సంబంధం ఏంటి? అది చెప్పు బ్రో.” అడిగేవాడికి చెప్పేవాడు లోకువన్న అచ్చతెనుగు అబద్దాన్ని నిజం చేసిందో గ్రద్దముక్కు.

“అందులో అమృతం వుందట…” చెబుతున్న కృష్ణని, కృష్ణపరమాత్మని చూస్తున్నట్టు ఆశ్చర్యంగా చూస్తున్నారు అర్జున్‌తో పాటూ అందరూ.

“హైతే…” చేతిలోని హెల్మెట్‌ని నెత్తికి బిగిస్తూ ఆశ్చర్యంగా అడిగాడు పల్సర్.

“ఏఁవుందీ! అరటిపండు తిన్న ఆవుకి రెక్కలు వచ్చేశాయి.”

“వ్వాట్!” అందరూ ఒకేసారి అనడంతో, ఆమాట రణగొణ ధ్వనులని మింగేసింది.

ఆ నిశ్శబ్దాన్ని భరించలేని స్ప్లెండర్ ఫోన్ రింగయ్యింది.

“‘అనార్కికా’లో ఆవు అరటిపండు తినేసింది. ఆవుకి రెక్కలొచ్చేశాయి. ట్రాఫిక్ ఆగిపోయింది. ఏమో ఎప్పటికి క్లియర్ అవుద్దో. వెనక్కి త్రిప్పుకొచ్చేద్దామన్నా కుదిరేలా లేదు. రెక్కలొచ్చిన ఆవు ఏం చేస్తుందా? వన్ మినిట్. ఒక్కసారి లైన్లో వుండు.”

అంతా స్వయంగా చూసినట్టు వాగుతున్న స్ప్లెండర్ ఫ్లోని, అవతలప్రక్క క్వొశ్చన్ కట్ చేయడంతో…

“మేష్టారూ, ఆ ఆవు ఏం చేస్తోందండి?” అంటూ కృష్ణ దగ్గరకి వచ్చాడు.

“ఎగరడానికి ట్రయల్ రన్ వేస్తోంది. భటులు గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్తున్నారు.”

“ఏంటీ? ఎగరడానికి ట్రై చేస్తుందా? ఈ ముక్క ముందే చెప్పొచ్చుగా. నేనూ ఓసారి చూసొస్తా!” అంటూ జనప్రవాహానికి ఎదురీదుకుంటూ పోయాడు అర్జున్.

ఆవుకి రెక్కలొచ్చిన విషయాన్ని అంతా ఫోనుల్లో అందరికీ చేరవేస్తున్నారు.

కొన్ని దిక్కుమాలిన మొహాలు సెల్ఫీకోసం సరదాపడినా, మొండాలు కాయాన్ని కదల్చడానికి ఒప్పుకోకపోవడంతో మిన్నకుండిపోయాయి.

కొందరు ఔత్సాహికులు ఆవుకి గ్రాఫిక్స్‌లో రెక్కలు తొడుగుతూ, మెడలో గంటలు కడుతుంటే, ఇంకొందరు మూతికి చిరుముట్టి కట్టి, గిట్టలకి పాదుకలు తొడుగుతున్నారు.

ఆవుది, ఏ రంగో కూడా అడగడం మరిచిపోయి తమ సృజనాత్మకతలో లీనమయిపోయారు.

పాపం, ఆవు మింగిన అరటిపండుని ఎవరూ పట్టించుకోలేదు.

మొహానికి పట్టిన చెమటని తుడుచుకుంటూ, తడిచిన చొక్కాని పిండుకుంటూ, పద్మవ్యూహంలోంచి విజేతలా తిరిగొచ్చిన అభిమన్యుడిలా కనిపిస్తున్నాడు అర్జున్.

“ఆవేం చేస్తోందండి…?” నెత్తిమీద కళ్ళజోడుని ముక్కుమీదకి లాక్కుంటూ, ఓ ఐటెన్ అందరి ప్రాథమిక హక్కునీ తనే వినియోగించుకొంది.

“ఐదు నిమిషాల క్రిందటే ఆవు ఎగిరిపోయిందట.” అంటూ పైకి చూశాడు.

అంతే! వందల కళ్ళు ఆకాశానికి నిచ్చెన్లేశాయి. అక్కడ ఏమీ కనబడకపోవడంతో మళ్ళీ అర్జున్ కళ్ళలోకి చూపుల తాళ్ళు పేనాయి.

“అరటిపళ్ళ బండోడు, రేటు పెంచేశాడు. దాంతో జనం ఆందోళనకి దిగారు. రభస రభస అయిపోతోందక్కడ.”

“అరటిపళ్ళు, రేటు పెరిగిపోయాయా? ఎందుకని?”

“ఎందుకంటే ఏం చెబుతాం. వాడి అరటిపళ్ళు వాడిష్టం…” అంటూ ప్రక్కకి పోయాడు కృష్ణ.

వెళ్తున్న అతన్ని రుసరుసా చూసిన గారపళ్ళు “మీరు చెప్పండి మేస్టారు… ఏమాత్రం పెంచేశాడూ?” అనడిగాయి.

“చాలా దారుణంగా పెంచేశాడు, ఐద్రూపాయల పండు ఐదొందలట.”

“బాప్‌రే! దారుణం కాదిది, దుర్మార్గం! ఫెడీమని కొట్టెయ్యలేకపోయారా?” ఆక్రోశించిన యాక్టివా కొంచెం సైడుకి వెళ్ళి…

“ఫోనెత్తి చావవేం. అలా బయటకి వెళ్ళి, రెండు డజన్ల అరటిపళ్ళు కొని తీసుకురా. ఏంటి డబ్బుల్లేవా? నిన్నే కదా! ఏటియంలో వందలాగావు. సరే… నాలుగు ఉల్లిపాయలు కానీ, ఏడు బంగాళాదుంపలు కానీ వాడికిచ్చి అరటిపళ్ళలా మార్చి చావు. ఎందుకో… ఏంటో నేనొచ్చాకా చెప్పి చస్తాను. ముందా టీవీ సీరియల్ ఆపేడు.” ఫోన్ ఆఫ్ చేసి వచ్చి మళ్ళీ గుంపులో చేరిపోయాడు.

“మరీ ఐదొందలేటండీ, అన్యాయం.” అమ్మేది అర్జునే అన్నట్టు సాగుతోంది వ్యాపారం.

“అన్యాయం ఏముందండీ. లక్కీగా అది తిన్నవాడికి, ఆవుకిలాగే రెక్కలొస్తే ఎంత హ్యాపీ చెప్పండి. యాక్సిడెంట్లు, ట్రాఫిక్ జామ్‌లు, ఎండకి ఎండడాలూ వానకి తుమ్మడాలూ అస్సలేమీ వుండవు. ఎక్కడకి పడితే అక్కడకి హాయిగా ఎగిరిపోవచ్చు.” లిమిటెడ్ మెంబర్స్‌తో ఓపెన్ డిబేట్ మొదలయ్యింది.

“అలాగైతే క్యాంటీన్లో అరటిపళ్ళు హాఫ్ రేటుకే దొరకొచ్చు.”

“వై?”

“ఆకాశంలో ఎగిరే వాళ్లనెవరు కంట్రోల్ చేస్తారు? రాంగ్ రూట్, నో హెల్మెట్ కేసులు రాయాలి కదా! భటులకి రెక్కలు రావాలంటే అరటిపళ్ళు తినాలి కదా!”

“అలాటప్పుడు సబ్సిడీ ఇవ్వడం సబబే.”

“ఏంటండిక్కడ, ఆవుకి రెక్కలొచ్చాయని టివిల్లో వస్తోందట!” వెనక వున్న ఓ కారు డోర్ తీసి ఆవులించింది.

“డిస్కషన్ అంతా దానికోసమే.”

“ఓహ్… ఈ కాస్సేపట్లో ఇంతజరిగిందా? అసలేం జరిగిందో చెప్పరా ప్లీజ్!” అభ్యర్ధిస్తూ కారు నోరు మూసింది.

కథ మళ్ళీ మొదలయ్యింది.

“ఏవండీ? ఏమయినా క్లియర్ అయ్యే పరిస్థితి వచ్చిందా?” తిరిగొచ్చిన కృష్ణని అడిగాడు యాక్టివా.

“వచ్చినట్టే. ఇప్పుడే పౌరసరఫరాల మంత్రి వచ్చాడు. తెల్ల రేషన్ కార్డున్న వాళ్ళకి రెండేసి అరటిపళ్ళు ఐదు రూపాయయలకే ఇస్తాం… ఈ అవకాశం ఆధార్ కార్డుపట్టుకుని వచ్చిన వాళ్ళకే అని హామీ ఇచ్చాడు.” చెప్పి బైక్ పగ్గాలు చేపట్టాడు.

ఎవరో… ఏదో… అడిగే లోపే ట్రాఫిక్ కదిలింది.

“ఆవూ అరటిపండు కథ చెప్పి, అందరిని భలే బఫూన్స్‌ని చేశావురా!” అభినందనగా అన్నాడు వెనక కూర్చున్న అర్జున్.

“నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? ఆకాశాన్నంటిన రేటూ, ఆందోళన అంటూ బిల్డప్ ఇవ్వలేదా?”

“ఆవుకిలాగే మనిషికి రెక్కలొస్తే?”

“తైలం పిండే రాజ్యాలు, తిండి తక్కువైన పహిల్వానుల్లా ఉసూరుమంటాయి.”

వాళ్ళ మాటలు గాల్లో కలిసి వెనక్కి పోతుంటే… బైక్ రివ్వున ముందుకు దూసుకుపోతోంది.

“గుడాఫ్టర్నూన్ సర్, బగాన్స్ నుంచి మాట్లాడుతున్నాం. ఇన్వెస్ట్ చేసే ఇంట్రస్టుందా?”

“బగాన్సా?” ఫోన్ లిఫ్ట్ చేసిన అర్జున్ ఆశ్చర్యంగా అన్నాడు.

“అవున్సార్, బనానాగార్డెన్స్.” తియ్యగా గొణిగింది టెలీకాలర్. “ఒక్క టూ మినిట్స్ టైమ్ ఇవ్వండి సార్. టోటల్ ప్రోజక్ట్ డిటైల్స్ చెప్పేస్తాను. ఎకరాకి ఎనభై మొక్కలు వేస్తాం. ఫస్ట్ క్రాప్ పదకొండు నెలకొస్తుంది. కానీ… అది వేసే పిలకలు పెరిగి పెద్దయి గెలలేస్తే, ప్రతి మూడు నెలలకీ ఓ క్రాప్‌లా అనిపిస్తుంది. యావరేజిన ఏడాదికి ఫోర్ కటింగ్స్. ఎలా లేదన్నా గెలకి వంద పీసులుంటాయి. ప్రభుత్వం ‘లెవీ’కి యాభై పళ్ళు తీసేసినా, జస్ట్ టూ లాక్స్ మీవి కాదనుకుంటే… మీ టూ హండ్రెడ్స్ ఫ్రూట్స్ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈజీక్వెల్టూ… లెక్కేసుకోండి! ఎన్ని లక్షల ఆదాయమో. ఇప్పుడే సెంట్రల్ మినిష్టర్ చెప్పాడు అరటిపండ్ల మీద జియస్టీ తీసేసామని. అది అదనపు బోనస్.” కళ్లు బైర్లు కమ్మేలా కాసులు గలగల్లాడించినట్టు మాటలు మీటింది.

“ఎవర్రా అది? నడు క్యాంటీన్‌కి పోదాం.” సిస్టమ్ ఆఫ్ చేస్తూ లేచాడు కృష్ణ.

ఆ అమ్మాయి ప్రపోజల్‌కి యస్ ఆర్ నో చెప్పకుండా ఫోన్ పీక పిసికిన అర్జున్… ‘వాయిస్ బాగుంది, ఇంకో చాయిస్ తీసుకోకుండా వుండదు,’ అనుకున్నాడు.

“ఎంత అడ్వాన్స్ అయిపోయేర్రా జనం? అరటి తోటలు పెంచటానికి అప్పుడే స్టార్టప్ స్టార్ట్ అయ్యింది.”

“సింగిల్ విండోలో… చాలా సింపిలైపోయింది బిజినెస్.” అంటూ వైబ్రేట్ అవుతున్న ‘అవయవాన్ని’ ఆన్ చేశాడు కృష్ణ.

‘నమస్కారం, నేను మీ మహామంత్రి అండపిండబ్రహ్మాండాన్ని మాట్లాడుతున్నాను. ఆవు రెక్కలు, అరటి ధర పెరుగుదల అనే వివాదాంశాన్ని నిమిషాల వ్యవధిలోనే మన మహారాజు పరిష్కరించారని మీరు భావిస్తున్నారా? ఈ విషయం పై మీ అభిప్రాయం ఏమిటి? అవును అనుకుంటే ఒకటి నొక్కండి. కాదనుకుంటే రెండు నొక్కండి…’

“ముందు నీ పీక నొక్కుతాను.” సొల్లు ఆఫ్ చేసి “వీళ్లకేమన్నా పిచ్చేంట్రా? లేనిది వున్నట్టు భ్రమిస్తారు. ఒకడు స్టార్టప్ అంటాడు, ఇంకొకడు ట్రబుల్‌షూట్ అంటాడు.” కౌంటర్ దగ్గరకి నడిచాడు కృష్ణ.

క్యాంటీన్ అంతా అరటికాయలే నడుస్తున్నాయి. అరటికాయ బజ్జీ, అరటికాయ వేపుడు. అరటికాయ దూపుడు, అరటికాయ గోకుడు.

గోడకున్న టివిలో ఆవు-అరటిపండు మీద అష్టావధానం జరుగుతోంది.

చిరాగ్గా చానల్ మార్చాడు అర్జున్.

ఏదో భళ్ళుమని కూలిన చప్పుడు, అనుమానంగా అటూ ఇటూ చూశాడు.

“ఖంగారు పడకు, స్టాక్ మార్కెట్ కుప్పకూలి వుంటుందిలే.” కిందపడ్డ నీళ్లమగ్గుని తీస్తూ నవ్వాడు కృష్ణ.

“ఆవుకి రెక్కలొచ్చిన సమయంలో అక్కడ సి.సి.కామెరాలు ఎందుకు పనిచేయలేదు?” టీవీలో ప్రతిపక్షనాయకుడు కడుపునొప్పిని ప్రదర్శిస్తున్నాడు.

“కాస్సేపుంటే అక్కడ ఆవే లేదు, అది అరటిపండే తినలేదు అన్నా అంటావు! నోర్మూసుకోకపోతే తన్నులు తింటావు.” కోపంగా సీట్లోంచి లేచాడు కొత్తగా అధికార కూటమిలోకి జంప్ అయి వచ్చిన అపోజిషన్ లీడర్.

“ఏయ్, ఏం మాట్లాడ్తున్నావ్? గుద్దానంటే గుండాగి చస్తావ్!” నేనూ ఏం తక్కువ తినలేదన్నట్టు పంచెగ్గట్టాడు ప్రతిపక్ష నాయకుడు.

“ఆగండాగండి, నిన్నటిదాకా మీరిద్దరూ ఒక తాను ముక్కలే. ఇప్పుడిలా కలబడుతున్నారంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులూ, శాశ్వత మిత్రులూ వుండరని చెప్పడానికేనా?” ఇద్దరి కాలర్లూ పట్టుకొని నిలదీస్తూ… అరుచుకోవడమేనా కొట్టుకొని ఎంటర్‌టైన్ చేసేదేమన్నా వుందా? అన్నట్టు కొశ్చన్ మార్క్ ఫేస్ పెట్టాడు సంధాన కర్త.

అర్జున్‌ని అతని రూమ్ దగ్గర డ్రాప్ చేసి అపార్ట్‌మెంటుకొచ్చిన కృష్ణకి, ఎప్పట్లా కాలింగ్ బెల్ కొట్టే అవసరం లేకపోయింది.

ఫ్లాట్ తలుపులు బార్లా తెరిచి వున్నాయి.

ఆన్ చేసివున్న టివి, డైలీ సీరియల్ని మేస్తోంది.

‘ఎక్కడకి పోయారు వీళ్ళు’ అనుకుంటూ డ్రస్ చేంజ్ చేసుకుంటుంటే… పిల్ల, ఆ వెనకే తల్లీ గాల్లో తేలుతున్నట్టు వచ్చి ఇంట్లో వాలారు.

“ఎక్కడకి వెళ్లావు బంగారం?” అంటూ పిల్లని వళ్ళోకి తీసుకున్నాడు.

“ఆవుని చూడ్డానికి.”

“…”

“ఇదిగో చూడండి. ఎంత అందంగా వుందో…” పెళ్ళాం గ్యాలరీ ఓపెన్ చేసింది.

“…”

“పదండి. టైముకి బాగానే వచ్చారు. మీరుకూడా చూసేస్తే… ఇంటికి కలిసివస్తుంది.” తల్లీ పిల్లా బలవంతంగా మేడమీదకి ఈడ్చుకు వెళ్ళారు.

అరచేతిలో హారతి వెలిగించి గిరగిరా త్రిప్పుతూ గుటుక్కున మింగేశాడు ప్రక్కఫ్లాట్ ఆసామీ.

“రెక్కలావు రావే… అరటిపండుతేవే…” అని పాడుతూ చంకలో పిల్లముండకి గోరుముద్దలు తినిపిస్తోంది పై ఫ్లాటావిడ.

ఆకాశంలో చందమామ

చందమామలో రెక్కలావు

స్పష్టంగా కనబడుతుంటే… పిట్టగోడని పట్టుకొని తూలిపడకుండా నిలదొక్కుకున్నాడు కృష్ణ.
-------------------------------------------------------
రచన: చిరంజీవి వర్మ అనే వత్సవాయి చిట్టివెంకటపతి రాజు,
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment