Thursday, March 21, 2019

రి సైకిల్


రి సైకిల్
సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి.................

రంగనాథానికి పేపర్లు, అవే దినపత్రికలు అతి జాగర్తగా దాచి నెలాఖరుకి “పాతపేపర్లు కొంటాం, పాత డబ్బాలు కొంటాం” అని అరుచుకుంటూ వచ్చే గడ్డం సాయిబ్బు కోసం ఎదురుచూడడం అక్కడ ఉండేరోజుల్లో మామూలే!

ఆ రోజుల్లో పేపర్లు అమ్ముకుంటే వచ్చే డబ్బులు వాడికి కనీసం వారం రోజులకి సిగరెట్ల ఖర్చుకి సరిపోయేది. అందుకని, వాళ్ళ ఇంటిపక్కన కోమట్ల ఇంట్లో అద్దెకుండే గాంధీ స్కూల్ టీచరమ్మ గారు పేపరు అడిగి తీసుకోపోతే, తిరిగి ఇచ్చేవరకూ వదిలిపెట్టేవాడే కాదు. ఈ పేపర్లు అమ్మిన డబ్బుల జమా ఖర్చు చెప్పమని వాడి అమ్మగారు కానీ, నాన్న గారు కానీ, అడిగే వారు కారు. రంగనాధం తమ్ముడు రామచంద్రం బాగా చిన్నవాడు. వాడికి రెండు చాక్లెట్లు కొని ఇస్తే వీడి సిగరెట్ల విషయం కూడా గప్చిప్ రహస్యమే. అంతేకాదు. అప్పుడప్పుడు, ఎవరి ఇంటిముందైనా పేపరు పడి వుంటే, అటూఇటూ చూస్తూ, కాలితోతన్నుకుంటూ ఏమీ ఎరగనట్టుగా నటిస్తూ వాళ్ళ పేపరు ఎత్తుకొచ్చిన రోజులు కూడా లేకపోలేదు. ఈ కళలో ఆరితేరిన వాడు రంగనాధం గురువు చిన సుబ్బయ్య చౌదరి. చిన సుబ్బయ్య చౌదరే రంగనాధానికి సిగరెట్లు కాల్చడం నేర్పిన గురువు కూడాను.

రోజూ పొద్దున్నే విస్సిగాడికి తోడుగా, రంగనాధం, చిన సుబ్బయ్య చౌదరీ కోట దిబ్బకింద పెరుగు చెట్టు దగ్గిరకి వెళ్ళేవాళ్ళు. పెరుగు చెట్టు అంటే పెద్ద మర్రిచెట్టు. పొద్దున్నే, ఆచెట్టుకింద పక్కూరి గొల్లలు కుండల్లో పెరుగు తెచ్చి అమ్మే వాళ్ళు. ఆ చెట్టుని ఊళ్ళో అందరూ పెరుగు చెట్టు అనేవాళ్ళు. ఇప్పుడు ఆ చెట్టు కొట్టేసి సిమెంటు రోడ్డు వేసేశార్లేండి. విస్సిగాడు రోజూ వాళ్ళ ఇంటికి పెరుగు కొనటానికి పెరుగు చెట్టు దగ్గిరకి వెళ్ళే వాడు. రంగనాధం, చిన సుబ్బయ్యా విస్సిగాడికి తోడు! అసలు మతలబు ఏమిటంటే, ఆ వీధిలో షావుకార్ల ఇళ్ళముందు దినపత్రికలు దొరికితే ఎత్తుకోపోవడానికి వీళ్ళిద్దరూ విస్సిగాడితో వెళ్ళేవాళ్ళు. విస్సిగాడు, వీళ్ళిద్దరినీ తోడుదొంగలని ఆక్షేపించేవాడు, నవ్వుతూ. అవి ఆ రోజులు. మిడిల్ స్కూలు, హైస్కూలు కెళ్ళే రోజులు. మహమంచి రోజులు.

రంగనాధం కాలేజీ రోజుల్లోనూ, ఆ తరువాత రెండేళ్ళు అడ్డగాడిలాగా తిరిగిన రోజుల్లోనూ, రాజుగారితో స్నేహం అయ్యింది. ఆయన అలవాటు చేశాడు, మోహన రావు పెట్టిన కనకదుర్గా స్వీట్ హోం లో మెత్తని పకోడీలు ఆనవాయితీగా కొనుక్కో తినడం. రాత్రి పదికొట్టంగానే అక్కడ చేరేవాళ్ళు, లెక్కల మేష్టారు, రావుగారు, రాజు, లక్ష్మణాచార్యులూ, రంగనాధం. పకోడీలు కాదు ముఖ్యం. ఆ పకోడిలు కట్టిన పొట్లం కాయితం. ఆ కాయితంలో వున్న పాత వార్తో, అదృష్టంబాగుండి ఆదివారం పేపరైతే కథో, సగం చిరిగిపోయిన ఆథునికకవితో పకోడీల నూనెలో తడిసి చదవడానికి మహ సొంపు గా వుండేవి. రాజు తనలో తనే చదువుకునే వాడు. రంగనాధం మాత్రం పైకి ఘట్టిగా చదివేవాడు. ఆ రోజుల్లో పకోడీ పొట్లం కట్టిన కాయితంలో చదివిన పద్యం టైటిల్ “వేరు వేరు విధమ్ముల ఆరు కారు మేఘమ్ములు,” ఇప్పటికీ గుర్తుంది, రంగనాధానికి. నూనె అంటక పోతే, పకోడీ కాయితాలు కూడా భద్రంగా దాచేవాడు, రంగనాధం, అలవాటుగా!

2.

పైచదువులు నెపంతో రంగనాధం అమెరికాకి వచ్చాడు. వచ్చిన కొత్త రోజుల్లో, అబ్బో చాలాకాలం క్రిందట లెండి, ధాతనామ సంవత్సరం అన్నా దిగులు లేదు– పాత అలవాటు ప్రకారం దినపత్రికలన్నీ దాచి వుంచేవాడు. అంతే కాదు. అల్యూమినియం డబ్బాలు అతి జాగ్రత్తగా పోగు చేసేవాడు. ఉన్నది, లింగూ లిటుకూ అనుకుంటూ ఒక్క గది. ఒక్క మంచం. ఓ చిన్న ఫ్రిజ్. రెండు ఎలట్రీ పొయ్యిలు. ఇదీ మనవాడి సంసారం. అన్నీ అందులోనే అన్న సామెతలా ఒక మూల పేపర్లు, మరోమూల డబ్బాలు. రంగనాధం పేపరు కొనేవాడు కాదు. పక్క గదిలో నర్సింగ్ స్కూలు పిల్లలు పేపరు తెప్పించేవాళ్ళు. వాళ్ళు చదివింతర్వాత పేపరు రంగనాధానికిచ్చేవాళ్ళు. ఆ పేపర్లు భద్రంగా దాచేవాడు. అబ్బో! అమెరికాలో పేపరు మనకిమల్లే కరువుగా ఉండదు. ఆదివారం పేపరయితే, కనీసం అర్థ మణుగు పైచిలుకే ఉండేది. ఈ పేపర్లు, డబ్బాలూ, ముఖ్యంగా పేపర్లు ఎక్కడికి పట్టికెళ్ళి అమ్మాలో రంగనాధానికి తెలియదు. ఏవరినన్నా అడగడానికి, మహమాటం… నామర్దా.

ఇలా వుండగా ఒక రోజున రంగనాధానికి విపరీతంగా జలుబు చేసి జ్వరం వొచ్చింది. ఫ్లూ అన్నారు, పక్క రూములో నర్సింగ్ పిల్లలు. రెండురోజులు స్కూలు కెళ్ళ లేదు. అప్పుడు ప్రొఫెసర్ జాన్, రంగనాధాన్ని చూడటానికొచ్చాడు. గది లోకి రాగానే ఆయనకి అయిదడులెత్తు కుప్పగా దుమ్ముకొట్టుకొని పేపర్లు కనిపించాయి.

“ఈ పేపర్లు పారేయలేదేమిటీ? ఈ దుమ్ము మూలంగానే నీకు జలుబు జ్వరం వచ్చాయి. Get rid of them, ASAP,” అని చెప్పి, కాఫీ మరకలు పడ్డ సోఫామీద ఓ మూల కాస్సేపు కూచొని, Get well soon అని చెప్పి వెళ్ళిపోయాడు. ఒక రెండు ఘంటలు తిరక్కముందే ప్రొఫెసర్ రావు గారొచ్చారు, రంగనాధాన్ని చూడటానికి. రావు గారు తెలుగు వాడే! ఇండియాకి స్వరాజ్యం రాకముందే అమెరికాకి వొచ్చేశాడు. ఒక తెల్లావిడని పెళ్ళాడాడు; ఇద్దరు పిల్లలు కూడాను!

ఎంతయినా తెలుగు వాడే కదా! ఆయన ఇట్టే పసిగట్టేశాడు, రంగనాధం పేపర్లు ఎందుకు దాస్తున్నాడో. “ఏమిటి? ఈ పేపర్లు మనదేశంలో లాగా అమ్ముదామని దాస్తున్నావా?” అని నవ్వుతూ అడిగాడు. అవునన్నట్టు తలూపాడు, రంగనాధం. ఆయన ముసిముసి నవ్వులు నవ్వుతూ, “ఒక టన్ను పేపరు పోగుచేస్తే, బహుశా, రెండు డాలర్లు వస్తాయి. అదికూడా, నువ్వు ఈ పేపర్లు తీసికెళ్ళి ఎక్కడో recycling సెంటర్లో ఇస్తేనే. ఈ లోపుగా నీగది ఈ పేపర్లతోటీ దుమ్ముతోటీ నిండిపోతుంది,” అని మెత్తగా చివాట్లు పెట్టాడు.

నాలుగు రోజులు పోయింతర్వాత, బాలచందర్ అనే గుజరాతీ స్నేహితుడొస్తే వాడి సాయం తీసుకోని రంగనాధం తను పోగుచేసిన పేపర్లూ, అల్యూమినియం డబ్బాలు వాళ్ళ అపార్ట్మెంటు వెనకాల వీధిచివర పెద్ద చెత్త డబ్బాలో పడేశాడు, చాలా బాధ పడుతూ! Recycling Centers గురించి కొంచెం పరిశోధన కూడా చేశాడు, రాడ్నీ స్మిత్ సాయంతో. పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే, ఈ సెంటర్లకి ప్రభుత్వం డాలరు కర్చుకి ఎదురు నాలుగు డాలర్లిస్తుందిట. అంటే, సెంటరు పోగుచేసిన పేపర్ల విలువ ఒక డాలరయితే, ప్రభుత్వం వారు ఈ సెంటరు నడిపే కంపెనీకి నాలుగు డాలర్లు ఇస్తారట! ప్రభుత్వం సొమ్ము తినేయడానికే ఈ సెంటర్లు, పుట్టగొడుగుల్లా పుట్టేశాయి. అప్పుడు జ్ఞానోదయం అయ్యింది, రంగనాధానికి; ఇంత గొప్ప తెల్ల దేశంలో కూడా, వ్యాపారస్తులందరూ ప్రభుత్వాన్ని ఎడా పెడా రోజూ దోచుకుంటారని! ఒక్క ఆదివారం మినహా!!

నిజం చెప్పొద్దూ! ఇప్పటికీ ఈ దేశంలో పేపరు కొనడం దండగే అని అనిపిస్తుంటుంది, రంగనాధానికి. దానికి కారణాలు వేరే ఉన్నాయనుకోండి — కానీ, ఇప్పటికీ ప్రతిరోజూ పేపరు తెప్పించడం, పేజీలు అన్నీ యధావిధిగా తిప్పి బాధపడుతూనే ఆ పేపర్ని చెత్త బుట్టలో పారెయ్యడం మానలేదు.

3.

రంగనాధానికి చదువు పూర్తికావడం, పెళ్ళాం రావడం, అపార్టుమెంటునించి చిన్న ఇంటికి మారడం అన్నీ ‘క్లాక్ వర్క్’ లా జరిగిపోయాయి. ఓ నాలుగేళ్ళతర్వాత సంసారం పెద్దదవటంవల్ల, చిన్న ఇంటినుంచి ఇంకొంచెం పెద్ద ఇంటికి మారడం జరిగిపోయింది. ఇల్లు పెద్దదయ్యేకొద్దీ నానా చెత్తా ఇంట్లో పోగుపెట్టడం మొదలెట్టాడు. పుర్రెతో పుట్టిన బుద్ధికదా, ఇప్పటికీ ఏదీ పారెయ్య బుద్ధికాదు, రంగనాధానికి. చదువుకునే రోజుల్లో కొనుకున్న డాలరు చొక్కాలు, అరిచిచచ్చినా పట్టని పాలియెస్టర్ పంట్లాములు, జోళ్ళు, కాలిజోళ్ళు, కంటి జోళ్ళు, అంకెలూ అక్షరాలూ చెరిగిపోయిన రకరకాల టెలిఫోన్లు, నాబు ఎంతతిప్పినా స్టేషను మారక గీ పెడుతూ మారాం చేసే చిన్న చిన్న రేడియోలు, వగైరా వగైరా గరాజ్ లో పోగు పెడుతూనే వున్నాడు. రంగనాధం భార్య రుక్మిణమ్మకి అప్పుడప్పుడు విసుగెత్తి బెదిరిస్తూనే వుండేది, “అవన్నీ ఎప్పుడో గారబేజ్ లో పారేస్తా,” అని. అలా అన్నప్పుడు రంగనాధానికి చచ్చే కోపం వచ్చేది. వెంటనే, “అవేం నిన్ను కరుస్తున్నాయా?” అని చీదరించికునేవాడు.

చూస్తూ ఉండంగా మరో అయిదేళ్ళు గిర్రున తిరిగొచ్చాయి. వాళ్ళ అమ్మాయికి, అదే దాన్ని పాపాయి అంటారు; దానికి నాలుగేళ్ళొచ్చాయి. అదృష్టం బాగుందో ఏమో వాళ్ళు మరో పెద్ద ఇంట్లోకి మారారు. ఇంటితో పాటు, రంగనాధం పోగుచేస్తున్న వస్తుసముదాయం కూడా కొత్త ఇంటికి చేరింది. ఈ సారి, గరాజ్ లోనే కాకండా, బేస్మెంటులో సగం రంగనాధం సామానుతో నిండి పోయింది. ఇల్లు పెద్దదయేకొద్దీ, అక్కరలేని చెత్త కూడా పెరుగుతుంది. ఇది అమెరికన్ ఆచారం! రంగనాధానికి ఈ వస్తు సముదాయమంతా భద్రంగా దాచి పెట్టడం సంప్రదాయం!

ఈ అయిదేళ్ళల్లో రంగనాధం, రుక్మిణీ లకి ఒక కొత్త వ్యాపకం వచ్చింది. ఎక్కడ గరాజ్ సేల్ పెట్టినా, సరదాగా వెళ్ళి చూసి వచ్చేవాళ్ళు. అదొక హాబీ! ఇంటికొచ్చి, పొట్ట చెక్కలయ్యేట్టు తెగ నవ్వుకునేవాళ్ళు. విశేషమేమిటంటే, పెద్ద పెద్ద ఇళ్ళున్న subdivision లలో, కనీసం మూడు నెలలకోసారి గరాజ్ సేళ్ళు వస్తాయి, అదేమి చోద్యమోగానీ, పై స్థాయిలో ఉన్న మధ్య తరగతి కుటుంబీకులుండే పేటల్లోనే ఈ గరాజ్ సేళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఉంటాయి; — సంపాదన పెరగడం వల్ల, ఇళ్ళు పెద్దవి కావడంవల్లా, కావలసినంత తీరిక ఉండడం వల్లా కాబోలు. రంగనాధం, వీళ్ళని “పనిలేని మంగళ్ళు” అని అంటే, రుక్మిణి , “ఈ గరాజ్ సేల్స్ పెట్టుకునే ఆడంగులందరూ, రోజూ పేపర్లో సేళ్ళు చూసి, మురిసిపోతూ షాపింగుకి పోయి కావలనే నానా చెత్త కొంటారు, రాబోయే గరాజ్ సేల్ కోసమా అన్నట్టు,” అని అనేది.

కాకపోతే ఏమిటి? ప్లాస్టిక్ దువ్వెనలూ, వాడిన రంగు బ్రష్షులు, థాయిలాండులో అల్లిన వెదురు బుట్టలు, రీడర్స్ డైజెస్టు వాళ్ళు కుదించిన చచ్చు నవలలూ, పిల్లల టీ షర్టులు, అమ్మగారి డ్రెస్సులూ, అయ్య గారు వాడేసిన చొక్కాలు, సగం వాడిన షాంపూలు, కొవ్వొత్తులు పెట్టే గాజు బుడ్డీలు, పాత వంట గిన్నెలు, గీతలు పడిన నాన్ స్టిక్ బూరెల మూకుళ్ళు, మొక్కలు ఎండిపోయి ఉసూరు మంటూన్న పూల కుండీలూ, రకరకాల సైజుల్లో లంబాడీ పూసల దండలు, అరిగిపోయిన మెల్మాక్ ప్లేట్లూ, కప్పులూ సాసర్లూ, గాజు గ్లాసులూ….ఒకటేమిటి, అన్ని రకాల సరంజామా డ్రైవ్ వేలో పెట్టుకొని రోజంతా పడగాపులు పడతారు, ఈ ముష్టి సామాన్లు అమ్ముకోటానికి. ఇంకో విశేషం ఏమిటంటే, ఈ సామాన్లు ఆ పేటలోనే ఒక ఇంటినుంచి మరోఇంటికి మారుతూ ఉంటాయి, అని రుక్మిణి చేసిన థీసిస్. అప్పుడప్పుడు, రంగనాధాన్ని ఏడిపించటానికో యేమో, “ఏమండోయ్ మీరు పోగుచేస్తున్న తుక్కంతా కూడా ఎప్పుడో గరాజ్ సేల్ పెట్టి అమ్మేస్తా! పీడ విరగడయి పోతుంది,” అని నవ్వుతూ బెదిరిస్తూనే ఉండేది. రుక్మిణి ఏమిచెప్పినా రంగనాధం “మీరజాలగలడా,” అన్నట్టు జవదాటకుండా ఉండే వాడేకానీ గరాజ్ సేల్ మాత్రం సాగనియ్యలేదు. ఆవిషయం రుక్మిణికి కూడా తెలుసు.

4.

“మన neighborhood లో పిల్లలందరూ సాయంకాలం పూట సైకిల్ తొక్కు కుంటున్నారు; పాపాయికి కూడా ఒక సైకిల్ కొనితేవాలి,” అని ముచ్చట పడిపోయేది. “దానికి నాలుగేళ్ళు కూడా లేవు; ఇప్పుడు సైకిల్ తొక్కడం చాలా ప్రమాదం. ఏ కాలో చెయ్యో విరిగితే, మధ్య మనం చావాలి,” అని చాలా సార్లు గసురుకున్నాడు, రంగనాధం. అంతేకాదు. “ నేను సైకిలు పదిహేనోయేడు వచ్చేవరకూ నేర్చుకోలేదు. మన అమ్మాయికూడా, అంతే. That’s it,” అనే వాడు. అలా అన్నాడే కానీ, తనూ చూస్తున్నాడుగా, చుట్టుపక్కల పిల్లలందరూ పాపాయి ఈడు వాళ్ళే! “Keeping up with the Joneses! అమ్మాయికి సైకిల్ కొనాలి,” అని తనకీ మనసులో వుంది.

ఒక శనివారం రంగనాధం ఆడపిల్ల సైకిలు కోనటానికి ముహూర్తం పెట్టుకున్నాడు. దోవలో లక్ష్మి, ప్రసాదరావులని చూసి చాలారోజులయ్యిందని వాళ్ళ డ్రైక్లీనింగ్ కొట్టు దగ్గిర ఆగాడు. ఆప్యాయంగా లక్ష్మి పీజ్జా తెప్పించిపెట్టింది. ఆవిడతో, మాటవరసకి అన్నాడు; “ పాపాయికి సైకిలు కొనమని రుక్మిణి చంపేస్తోంది. ఇవాళ సియర్స్ కెళ్ళి సైకిల్కొందామనుకుంటున్నా,” అని. వెంటనే లక్ష్మి, “ కొనడం ఎందుకండీ! మా ఇంట్లో ఆడపిల్ల సైకిలు ఊరికే గరాజ్ లో పడి ఉన్నది, దుమ్ము కొట్టుకుంటూ. దాన్ని తీసుకో పొండి,” అన్నది. గరాజ్ అన్న మాట వినంగానే, రంగనాధానికి వాళ్ళ పేటలో గరాజ్ సేళ్ళే గుర్తుకొచ్చాయి. “అయితే లక్ష్మి గారూ! మీ ఇంటిముందు గరాజ్ సేల్ పెట్టి అమ్మెయ్యక పోయారా?” అన్నాడు, నవ్వుతూ. “ఇంకా నయం! అదొక్కటే తక్కువయ్యింది, మన దౌర్భాగ్యానికి,” అన్నది లక్ష్మి. వెంటనే కొట్లో పనిచేసే నల్ల కుర్రాడిని పంపించి సైకిలు తెప్పించింది. కానీ కర్చు లేకండా అమ్మాయికి సైకిలు దొరికినందుకు ఉబ్బిపోయాడు, రంగనాధం. వెంటనే, “ Thanks Lakshmi gaaru. నాకు కర్చు తగ్గించారు, అంతకన్నా ముఖ్యం శ్రమ తగ్గించారు,” అని, మిగిలిన పీజ్జా పూర్తిగా తినేసి బయల్దేరాడు.

సైకిలు చూడటానికి చక్కగా వుంది. గులాబిరంగు ఫ్రేము, బరువుగా రబ్బరు చక్రాలు, వెనక చక్రానికి అటూ ఇటూ రెండు బుల్లి చక్రాలు; ఊదా రంగు సీటు, బంగారం రంగు హేండిల్బార్ కవర్లు, వాటి చివర రెండువైపులా కొరడా చివర వుండే తోలు పటకా జూళ్ళు, ముందు చక్రంపైన హేండిల్ బార్ కి తగిలించి ఒక చిన్న ప్లాస్టిక్ బుట్ట…. రంగు కొంచెం మాసినట్టున్నది కానీ, అన్నీ సవ్యంగానే ఉన్నట్టు కనిపించాయి. కారు ట్రంకులో సైకిలు పెట్టుకొని, ఆల్బర్ట్ ఇంటికెళ్ళాడు. ఆల్బర్ట్ పాత వస్తువులన్నీ చక్కగా బాగు చేసి కొత్తగా కనిపించేట్టు చెయ్యగలడు. వాడి గరాజ్ అంతా ఒక పెద్ద వర్క్ షాపే!

సైకిలు దింపి, ఆల్బర్ట్ కి విషయమంతా విప్పి చెప్పాడు. వాడు, సైకిల్ని, శుభ్రంగా వాటర్ జట్ తో కడిగి, సీటుకింద, వెనకా గులాబీ రంగు పూసి, తోలు జూలు పటకాలని అదేదో నూనె పులిమి శుభ్రం చేసి, సీటు వెనకాల తెల్లటి పూసలదండ కట్టి, బ్రహ్మాండంగా తయారుచేశాడు, మా పాపాయి సైకిలుని.

ఇంటికి రాంగానే రుక్మిణి ఖస్సు మంది; చెప్పా చెయ్యకండా బజారుకి పోయినందుకు. విజయోత్సాహంతో, ట్రంకులోంచి, సైకిలు చూపించాడు, రంగనాధం. “ఈ పాత సైకిలు ఎక్కడనుంచి పట్టుకొచ్చారు? కొంపదీసి ఎక్కడో గరాజ్ సేల్ లో కొనలేదుకదా?” అని కసురుకుంది. “ఇది పాతదంటావేమిటి? నాకు కొత్తగానే కనిపిస్తోంది,” అని సర్దుకున్నాడు, రంగనాధం. “దాని మొహం చూడగానే తెలియటల్లా? పాతదని,” అన్నది రుక్మిణి. డ్రైక్లీనింగు లక్ష్మి గారిచ్చారు అని చెప్పంగానే, “పోనీలే! మూణ్ణెల్ల తర్వాత ఈ సైకిలు పాపాయికి ఎల్లాగో పనికే రాదు. దానికి సైకిలు బాగా తొక్కడం వచ్చిన తరువాత, మరొ పెద్ద సైకిలు, కొత్తది కొనిపెడదాం లెండి,” అని సర్దుకుంది. ఎంతయినా లక్ష్మి తన జట్టు కదా!

ఆరునెల్లు తిరక్కుండానే, పాపాయికి అసలు సైకిలంటేనే మొహం మొత్తిపోయింది. రుక్మిణికీ ఆ కాస్త మోజూ తీరిపోయినట్టుంది. మళ్ళీ సైకిలు మాట ఎత్తలేదు, ఏ ఒక్కరూనూ!

5.

వాళ్ళ వీధి చివర ఇల్లు మరియా, రాయ్ అనే మళయాళీలు కొనుక్కున్నారని తెలిసి, వాళ్ళని చూడటానికి వెళ్ళారు, రుక్మిణి రంగనాధం. రాయ్ సాఫ్ట్ వేర్ ఇంజనీరు, మరియా ఐ.సీ. నర్సు. వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు. పెద్దదానికి, నాలుగేళ్ళు రెండోదానికి రెండేళ్ళు. చూడటానికి ఇద్దరూ ముచ్చటగా ఉన్నారు. రుక్మిణి వెంటనే వాళ్ళ పెద్ద అమ్మాయిని చేరదీసింది. మిగిలిన వాళ్ళనందరినీ వదిలిపెట్టి వాళ్ళిద్దరూ ఏవిటేవిటో మాట్లాడుకున్నారు. “ మా ఇంటికి రా! నీకు సైకిలిస్తా,” అనేసింది రుక్మిణి. ఆపిల్ల, “Thank you Auntie! అంటూ కావలించేసుకుంది. అంతే! లక్ష్మిగారి దగ్గిరనుంచి ఊరికే వచ్చిన సైకిలు, పాపాయి సైకిలు తొక్కడం నేర్చుకున్న ముద్దుల సైకిలు, దాని మొదటి సైకిలు, రుక్మిణి దానం చేసేసింది. రంగనాధానికి చచ్చే కోపం వచ్చింది; ఇదే తనైతే, ఆ సైకిలుని గరాజ్ లోనో, బేస్మెంట్ లోనో భద్రంగా దాచి ఉంచేవాడు. ఎంతయినా అది వాడి కూతురి సైకిలు కదా!

మరో నాలుగేళ్ళు గడిచాయి, రంగనాధానికి, రుక్మిణికి. అమ్మాయి పెద్దదవుతున్న కొద్దీ, రంగనాధానికి దాచే సరంజామా పెరగడం మొదలెట్టింది. పాపాయి వేసిన బొమ్మలు, చేసిన లక్క పిడతలు, దాని పుస్తకాలు, లంచ్ డబ్బాలూ, అన్ని అతిజాగ్రత్తగా పోగు పెడుతున్నాడు. ఇప్పుడు ఈ పోగుపెట్టడం అతనికి హాబీ కాదు; ఒక వ్యసనంగా తయారయ్యింది. ఏ వస్తువూ తనకి అడ్డు రానంతవరకూ, రుక్మిణి జోక్యం చేసుకోదు. మనకెందుకులే అని, చూసీ చూడనట్టు ఊరుకునేది. ఇది నిజంగా పెద్ద compromise అనే చెప్పాలి!

ఇలా రోజులు గడుస్తూ వుండగా, రుక్మిణి మేనల్లుడు, వాడి భార్య, ఐదేళ్ళ కొడుకూ, వెరసి ముగ్గురూ ఇండియానుంచి దిగుమతయ్యారు. వాళ్ళిద్దరూ ఇంజనీర్లే! వాడికి ఇక్కడే సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం వచ్చిందిట; వాడి భార్య కడుపుతోఉన్నది. అంచేత, ఇంటిపట్టునే ఉంటుంది. వాళ్ళ పిల్లడు పొట్టిగా బొద్దుగా ఉంటాడు. బుద్ధిమంతుడే కాని, సైజు చూస్తే పదేళ్ళవాడిలా ఉంటాడు. వాడు, ఇరుగుపొరుగు పిల్లలందరి తోటీ మచ్చికగా చేసుకోవాలంటే, వాళ్ళలాగా సాయంత్రం వాళ్ళతోటి పేవ్మెంట్లమీద సైకిలు తొక్కాలసిందే నని రుక్మిణి హుకుం జారీ చేసింది.

“ఏమండీ! మా మేమల్లుడి కొడుక్కి ఒక సైకిలు కొనిపెడదాం. ఏమంటారు?” అని అంది, రంగనాధంతో. “చూద్దాంలే! ఇప్పుడేంతొందర?” అన్నాడు రంగనాధం. “అల్ల అంటారేవిటి? ఆ అబ్బిగాడు మా పెద్దన్నయ్య మనవడు. మా పెద్ద అన్నయ్య అంటే నాకు ఎంత ప్రాణమో మీకు తెలుసు గా. పైగా, ఆయనంటే మీకూ ఇష్టమేగా,” అని పాట పాడింది, రుక్మిణి. “సరే! సరే! చూద్దామన్నాగా!,” అంటూ తప్పుకున్నాడు రంగనాధం.

ఓ వారం తర్వాత, ఓ శనివారం నాడు, మరియా ఇంటిముందు డ్రైవ్ వే లో కారు కడుగుతూ రాయ్ కనిపించాడు. ఆగి, “హై” అంటూ, రాయ్ తో పిచ్చాపాటీ మొదలెట్టాడు. ఏదో సడెన్గా గుర్తుకొచ్చినట్టు ముఖం పెట్టి, “ హే రాయ్ మీఅమ్మాయికిచ్చిన సైకిలు ఎక్కడ పెట్టావ్?” అని అడిగాడు. “ ఓ! నాధ్! అదా. ఆ సైకిలు ఎప్పుడో గరాజ్ సేల్లో అమ్మేశా,” అన్నాడు, రాయ్. రంగనాధానికి రాయ్ గాడిని గొంతుపిసికి చంపేద్దామన్నంత కోపం వచ్చింది. తన దగ్గిర ఊరికే సైకిలు దొబ్బేసి, దాన్ని గరాజ్ సేల్ లో అమ్ముకుంటాడా? వీడికి ఎంత ధైర్యం? ఎంత కండ కావరం? అని అనుకుంటూ, వెర్రి మొహం పెట్టుకోని కోపంగా ఇంటికొచ్చాడు.

6.

మరో మూడు వారాలు గడిచాయి. రంగనాధం ఓ శుక్రవారం మధ్యాన్నం, ఆఫీసునుంచి కొంచెం తొందరగా వస్తూ, వాళ్ళ subdivision లోకి తిరిగాడు. మొట్టమొదటి వీధిలో గరాజ్ సేల్! ఆ వీధిలో రెండోఇంటి దగ్గిర డ్రైవ్వే లో ముందుగా గులాబిరంగు సైకిలు కనిపించింది, రంగనాధానికి. “ఈ సైకిలు మనదే! పాపాయి మొట్టమొదటి సైకిలు!” అని అనుకుంటూ, కారు ఆపి, ఇంటిముందు కూర్చున్న తెల్లావిడతో పరిచయం చేసుకొని, “ ఈ సైకిలు ఎంతకిస్తారు?” అని అడిగాడు. “పదిహేను డాలర్లు,” అన్నది ఆవిడ ముఖం ఎత్తకండానే. ఎండకి ఆవిడ ముఖం కందగడ్డలా తయారయ్యింది. “ఐదు డాలరిస్తా,” అన్నాడు రంగనాధం. ఆవిడ, ముఖం ఎత్తకండానే “O.K. Take it.” అన్నది. వెంటనే సైకిలు ట్రంకులోపెట్టుకొని, ఐదు డాలర్ల ముడుపూ చెల్లించి, తిన్నగా ఆల్బర్ట్ ఇంటికి బయలుదేరాడు.

“అనుమానం లేదు, ఈ సైకిలు పాపాయిదే! అది సీట్ వెనకాల దాని పేరు పి.ఆర్. అని బ్లేడుతో చెక్కింది. కావాలంటే చూడు,” అని ఆల్బర్ట్ తో జరిగిన కథ అంతా చెప్పుకున్నాడు. “ ఇదిగో, ఆల్బర్ట్ ఇటు చూడు. ఈ సైకిల్ కాస్త బాగుచేసి మా ఆవిడ మేనల్లుడి కొడుక్కి ఇద్దామనుకుంటున్నా. కాస్త నీ హెల్ప్ కావాలి,” అన్నాడు. “ఇది ఆడపిల్లల సైకిలు. దీని రంగు చూసి ఆ కుర్రాడు నాకొద్దు, ఈ పాడు ఆడపిల్లల సైకిలు, అంటాడు. రుక్కి సిస్టర్కి కోపం వస్తుంది, ఆ తరువాత నీ ఇష్టం,” అన్నాడు, ఆల్బర్ట్.

“అందుకేగా నీ సాయం కావాలనేది. దీని గులాబి రంగు గీకేసి, నల్ల రంగు వేద్దాం. దీన్ని, మొగపిల్లల సైకిలు గ తయారు చేద్దాం. ఏమంటవ్”? అన్నాడు రంగనాధం. “రేపు శనివారం. పొద్దున్నే రా. దీని పని పడదాం,” అన్నాడు ఆల్బర్ట్. రంగనాధానికి, ఎగిరిగంతేసి “యురేకా” అని అరుద్దామనిపించింది. ఇంటికొచ్చి, రెండు బీర్లు పట్టించి, టీ.వీ. లో మునిగిపోయాడు.

మర్నాడు, పొద్దున్నే పదిగంటలకి ఆల్బర్ట్ ఇంటికెళ్ళి, పాపాయి సైకిలు మీద గులాబీ రంగంతా గీకి, ఎమరీ పేపర్తో శుభ్రంచేశాడు. ఆల్బర్ట్ నల్ల రంగు స్ప్రే చేశాడు, సీటుకి ప్లాస్టిక్ అంటించి. తోలు జూలు పటకాలు కత్తిరించి, హేండెల్ బార్ మీదున్న బుట్ట పీకేసి, ఒక సైకిలు బెల్లు తగిలించాడు. “ఆల్బర్ట్ నువ్వు గొప్ప ఆర్టిస్ట్ విరా,” అని రంగనాధం మెచ్చుకుంటూనే వున్నాడు. సరిగ్గ ఈ పని పూర్తయి, నల్ల రంగు ఆరడానికి అంతా వెరసి ఆరు గంటలు పట్టింది; చెరో ఆరు బీర్లు పట్టించారు, ఈ పేరుతో!

సాయత్రం ఐదు గంటలకి రంగనాధం ఇంటికి చేరాడు. ఇంటిముందు పోర్చ్లో రుక్మిణి, మేనల్లూడు, వాడి భార్య చాలా ఉత్సాహంగా రోడ్డుకి అటు ఇటు చూస్తూ, అబ్బిగాడితో “జాగర్త, జాగర్త,” అని ఉద్రేకంగా అరుస్తున్నారు. అబ్బిగాడు సరికొత్త సైకిలు పక్కకి వంచి, కుడికాలు యెగరేసి సైకిలెక్కి, తూటాలా దూసుకొ పోతున్నాడు, పేవ్మెంట్ మీద.

“ Honey! మేమంతా అబ్బిగాడిని సియర్స్ తీసికెళ్ళాం. అక్కడ వాడికి నచ్చిన ఈ సైకిలు కొన్నా. వచ్చే వారం వాడి పుట్టింరోజు. Advance గా అబ్బిగాడికి మన gift! పెద్ద ఖరీదేం కాదు; సైకిలు ఎనభై. దాన్ని బిగించి ఇవ్వడానికి పాతిక; Taxతో కలిపి మొత్తం నూట పదకొండు డాలర్లు,” అన్న ది రుక్మిణి.

గరాజ్లో కారు పెడుతూ, రంగనాధం తనుతెచ్చిన సైకిలు ట్రంకులోనే వదిలేశాడు. “రేపో మాపో, రుక్మిణి చూడకండా, గరాజ్ గోడకి మేకు కొట్టి ‘పాపాయి సైకిలు’ ఆ మెకుకి తగిలించాలి,” అని అనుకుంటూ ఇంట్లోకి చేరాడు, పిల్లిలా.
--------------------------------------------------------
రచన: వేలూరి వేంకటేశ్వర రావు, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment