Thursday, December 20, 2018

మల్లెపూలు


మల్లెపూలు




సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి..................
“ఎంత బావుందీ వెన్నెల”అన్నాడు మధు.
ప్రక్కన కూర్చుని కునికిపాట్లు పడుతున్న శైలజ ఆవులిస్తూ “బాహనే వుంది ల్హెండి” అంది కళ్ళు తెరవకుండానే.
ఫ్రీ వే మీద కారు డెబ్భై మైళ్ళ వేగంతో వెళుతోంది.
“అబ్బ లెద్దూ…నాకు బోరు కొడుతోంది. లేచి ఒక్కసారలా ఆకాశం వంక చూడు ఎంత బావుందో” అంటూ, కుడి చేత్తో మూన్రూఫ్‌ ఓపెన్‌ చేసాడు.
పున్నమిలా వుంది. చంద్రుడు నిండుగా నవ్వుతున్నాడు.
వెన్నెల నవ్వుల వరదలో కొట్టుకు పోయినన్ని చుక్కలు కొట్టుకుపోగా, మిగిలినవి ఒక దానితో ఒకటి పోటీ పడుతూ, చందమామను ఇంప్రెస్‌ చేయడానికన్నట్లు రోజూ కంటే బాగా మెరుస్తున్నాయి. దూరం నుంచీ ఓ తారక తన ఓణీని విసిరింది చందమామను వలలో వేసుకోవాలని.
“బాగా అలసటగా వుందండి” అంది శైలజ కళ్ళు తెరుస్తూ.
“కళ్ళు మూసుకుంటే అలాగే వుంటుంది. లే…లేచి పాటలేమైనా ప్లే చెయ్యి” అన్నాడు మధు, లేన్‌ ఛేంజ్‌ చేస్తూ.
“మంచి పాటలేమున్నాయబ్బా …” అని కెస్సెట్లు, సీడీ లు వెదుకుతూ
“పాత పాటలా… కొత్త పాటలా ” అడిగింది శైలజ.

లాస్‌ వేగస్‌ లో వీకెండు గడిపి, ఆదివారం రాత్రి ఫీనిక్స్‌ కు బయల్దేరారు .
“ఏ వైనా పర్లేదు. కొంచెం శ్రావ్యంగా వుండేవి పెట్టు…పాత వేమైనా వున్నాయా?”
“ఇదేదో బాగా పాతపడినట్లుంది. ఇది ప్లేచేయనా… “అంటూ, బాగా పాతగా కనిపిస్తున్న కెస్సెట్టును తీసి, ప్లేయర్‌ లో పెట్టింది.
మనసున మల్లెల మాలలూగెను… పాట మొదలయింది.
“శైలూ, మన పెళ్ళైన కొత్తల్లో… మనమిక్కడకు రాబోయే ముందు, ఓ రోజు మీ మేడ మీద వెన్నెలలో…”
“అబ్బ ఇప్పుడవన్నీ ఎందుకు గుర్తు చేస్తారు…”అంది సిగ్గునభినయిస్తూ.
శైలజ మత్తు కొంచెం తగ్గింది.
“ముందు మల్లెపూల గుబాళింపు, ఆ వెనక తెల్ల చీరలో, బరువుగా వాలబోతూన్న కనురెప్పల వెనుక గమ్మత్తుగా మెరిసే కళ్ళతో…అప్పుడే ఆకాశంలోంచి జారిన వెన్నెల ముద్దలా … అప్సరసలా…”
నిద్ర మత్తు పూర్తిగా ఎగిరిపోయింది.
“అబ్బాయిగారికి లాస్‌ వేగస్‌ దెబ్బ బాగానే తగిలినట్లుంది…అన్నట్లు మన మిక్కడికి వచ్చేక ఎప్పుడైనా ఓ మూరెడు మల్లెపూలు తెచ్చారా?”
“మల్లెపూలా? ఇక్కడ దొరుకుతాయా?” అడిగేడు ఆశ్చర్యంగా.
“ఎందుకు దొరకవ్‌ . మీకు తేవాలనే ఇంట్రెస్టు వుండాలేగానీ…” అంది శైలు.
” నిజంగా దొరుకుతాయా?”
“నిజమేనండీ బాబు…అయినా భార్య మీద ప్రేముంటే అడవిలో వున్నా మల్లెలు తేవొచ్చు”
“నీకు పుణ్యముంటుంది గానీ, ప్రేమకు ఈ మల్లెపూలకు లింకు పెట్టొద్దు డియర్‌ … కొన్ని విషయాల్లో అమెరికా అడవికంటే ఘోరం “అన్నాడు మధు.
“నాకవేమీ తెలియవు. మీగ్గానీ నామీద నిజంగా ప్రేముంటే … రేపు సాయంత్రానికల్లా నాకో మూరెడు మల్లెపూలు తేవాలి” చెప్పింది ఇక అదే ఫైనలన్నట్లు.
“అబ్బ ఎప్పుడూ నువ్వింతే! ఒకవేళ దొరక్క పోతే?”
“సింపుల్‌ … నామీద నీకు ప్రేమ లేనట్లే”
“మరోసారి ఆలోచించవూ?” ప్రాధేయపడుతూ అడిగేడు.
“ఇక ఆలోచించడానికేమీ లేదు. రేపు సాయంత్రం మల్లెపూలు తేకపోయారో అప్పుడు చెబుతా మీపని!”అంది శైలజ బెదిరిస్తున్నట్లు.
“పోనీ నాలుగైదు రోజులు గడువివ్వరాదూ?”
“నాలుగైదు రోజులా …సరే… అలాగే కానీండి” అంది శైలజ వుదారంగా.
ఇదంతా గమనిస్తున్న చందమామ మబ్బు చాటుకు వెళ్ళి పక పకా నవ్వాడు. చుట్టూ వున్న చుక్కలు దేనికది, తమను చూసే మామ నవ్వేడని, ఆనందంగా మెరిసే కళ్ళతో నవ్వడం మొదలెట్టాయి.

0000000000000000000000000000000000000000000000000000000000000000000000000000్‌

మర్నాడు ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళే దారిలో ఫ్లోరిస్ట్‌ దగ్గర ఆగి “జాస్మిన్‌ లున్నాయా?” అనడిగేడు మధు.
“ఏ జాస్మిన్‌ లూ?”అడిగేడు పూల షాపతను, ఇంగ్లీషులో మెక్సికన్‌  యాసతో.
ఓహో  వాటిలో వెరైటీలు కూడా వుంటాయా అనుకుని, “ఏ జాస్మిన్లున్నాయి మీ దగ్గర” అడిగేడు.
“ప్రస్తుతానికైతే ఏరకమూ లేవు. మీకే రకం కావాలో చెబితే తెప్పిస్తానికి ప్రయత్నిస్తాం” చెప్పాడు వినయంగా.
“ఎన్ని రోజుల్లో అందిస్తారు?” అడిగేడు.
“మీక్కావలసిన వెరైటీ బట్టి ఎంత టైము పడుతుందో చెప్పగలను”అన్నాడు షాపతను, కంప్యూటర్‌ కీ బోర్డు మీద వేళ్ళతో నొక్కుతూ, స్క్రీను మీద చూస్తూ.
మళ్ళీ మొదటికొచ్చాడు వీడు. లాభంలేదు వీడ్నే అడిగేద్దాం అనుకుని,”ఇంతకీ జాస్మిన్లలో ఏమేం రకాలున్నాయి” అడిగాడు మధు.
“స్పానిష్‌ , ఇటాలియన్‌ , యేషియన్‌ స్టార్‌ , వైట్‌ జాస్మిన్‌ , వింటర్‌  జాస్మిన్‌ , ఇండియన్‌ , షోవీ జాస్మిన్‌ …” స్పీడుగా, గుంటూరు శంకర్‌ విలాస్‌ హోటెల్లో సర్వరు వేడిగా ఏమున్నాయో ఏకరువు పెట్టినట్లూ.
ఇండియన్‌ అన్న శబ్దం వినగానే, కావలసింది దొరికినట్లు ఫీలై, “అద్గదీ… నాకు ఇండియన్‌ జాస్మిన్లు కావాలి” అన్నాడు మధు.
“అవి దొరకడం బాగా కష్టమనుకుంటాను” అని వాచీ చూసుకుని, “మీ నంబరు ఇస్తే,  వాటి గురించి కనుక్కుని మీకు ఫోను చేస్తాను” అన్నాడు షాపతను.
నంబరిచ్చి, ధాంక్స్‌ చెప్పి, తప్పకుండా కనుక్కుని ఫోను చేయమని చెప్పి   బయట పడ్డాడు మధు.

ఇంటికి వెళ్ళగానే “ఏమండీ తెచ్చారా మల్లెపూలు?” అడిగింది శైలజ.
షాపులో దొరకలేదని చెప్పటానికి మనసొప్పక, “ఈ రోజు వర్కు దగ్గర లేటైంది శైలూ. రేపు తెస్తాను” అన్నాడు అలసట నటిస్తూ.
“అయ్యో… మీరు పూలు తెస్తారని గంపెడు ఆశతో ఎదురు చూస్తున్నా” అందామె డిసప్పాయింటుగా.
“రేపుతప్పకుండా తెస్తాగా…” అన్నాడు మధు, కొంచెం విసుగ్గా.
రేపు తేకపోయినా పర్లేదుగానీ, ఎల్లుండు కూడా చేతులూపుకుంటూ ఇంటికి వస్తే, అప్పుడు చూపిస్తా నా తఢాకా, అనుకుంది శైలజ మనసులో.

0000000000000000000000000000000000000000000000000000000000000000000000000000్‌

మరుసటి రోజు ఇంటర్నెట్‌ లో వెదికాడు మల్లెపూల గురించి.
సమాచారమైతే పోగయిందిగానీ, మధుకు వుపయోగపడే వివరాలు దొరకలేదు. కొన్ని పూల షాపుల సైటు అడ్రెస్‌ లను బుక్‌ మార్కుల్లో దాచుకుని, లంచ్‌ టైం లో, చుట్టూ ఎవరూ లేకుండా చూసుకుని, కొలీగ్‌  ఏంజెలా దగ్గరకు వెళ్ళాడు మధు.
నవ్వుతూ ఆమెను విష్‌ చేసి, “మల్లెపూలు ఎక్కడ దొరుకుతాయో నీకు తెలుసా?” అని అడిగేడు.
“మల్లెపూలా ఎందుకు” అడిగిందామె.
“వూరికే …” అన్నాడు మధు, ఆలోచిస్తూ.
“అలాగా. అయితే నాకు తెలియదు” చెప్పిందామె సాలోచనగా.
ఓహో అలా వచ్చావా అనుకుని, “వూరికే అంటే వూరికే కాదుగానీ, ఓ చిన్న పనుండి” అన్నాడు.
“ఏం పనీ ” అడిగింది ఏంజెలా, కొంచెం దీర్ఘం తీస్తూ.
ఏ విషయాన్నైనా మనకెందుకులెమ్మని వదిలిపెట్టే రకం కాదు ఏంజెలా.
పెళ్ళాం జడలోకని చెబుదామనుకుని, ఆ కాన్సెప్ట్‌ ఆమె కర్ధమయ్యేలా చెప్పేంత ఓర్పూ, నేర్పూ లేక పూజ కోసమని చెబుదా మనుకున్నాడు. కానీ, “ఏం పూజ, ఏ దేవుడికి పూజ,ఆ దేవుడి పేరును మీ భాషలో ఎలా రాస్తారు, సంస్కృతంలో అయితే ఎలా రాస్తారు, ఆ దేవుడి మహత్తులేమిటి, పుట్టు పూర్వోత్తరాలేమిటి” అంటూ నాన్‌ స్టాపుగా ఆమె అడగబోయే ప్రశ్నావళి గుర్తొచ్చి భయమేసి ఇంట్లో ఫ్లవర్‌ వేజ్‌ లోకని చప్పున చెప్పేడు మధు.
“ఫ్లవర్‌ వేజ్‌ లోకి మల్లెపూలా?” అంటూ ఓ రకంగా చూసి, కుర్చీలో రిలాక్స్డ్‌ గా కూర్చుని, “ఇక ఇప్పుడు చెప్పు …  మల్లెపూలను వేజ్‌ లో ఎలా వుంచుతావో” అడిగింది.
అంటే విషయం సమగ్రంగా తనకర్ధమయ్యేంత వరకు వదలదన్న మాట.
మధు మాట్లాడకపోయేసరికి, మళ్ళీ తనే అంది “గులాబి పూలో, బంతి పూలో పెట్టుకోవచ్చు కదా? ప్రత్యేకంగా మల్లెపూలే  ఎందుకు పెట్టా లనుకుంటున్నారు” అనడిగింది.
తిక్క పుట్టి అందామనుకున్నాడు కానీ బాగోదని, ఓ వెర్రి నవ్వొకటి నవ్వి “మల్లె పూలైతే మంచి వాసనొస్తాయని” చెప్పేడు.
“అలాగా … అయిడియా బాగానే వుంది. వాసన కోసమే అయితే, మామూలు పూలేమైనా పెట్టి జాస్మీన్‌ స్ప్రే చల్లితే సరిపోతుందికదా?” ఎలావుంది ఈ అయిడియా అన్నట్లు చూసింది.
“సరిపోదు. గులాబీలు మల్లెల వాసనేస్తే ఎబ్బెట్టుగా వుండదూ?” అన్నాడు మధు.
“అలాగైతే ప్లాస్టిక్‌ పూలు లతలతో సహా వాల్‌ మార్టు స్టోరులో దొరుకుతాయి. వాటిలోంచి పూలున్న మల్లె తీగొకటి కొని, దాన్ని వేజ్‌ లో వుంచి పైన దట్టంగా జాస్మీన్‌ స్ప్రే కొట్టెయ్‌ ” అందామె.
ఒప్పుకోక పోతే ఇంకెంత సేపు వాయిస్తుందోనని, “అబ్బ ఎంత గొప్ప సొల్యూషన్‌ . అద్భుతం . ఆహా…ఓహో… చాలా ధాంక్స్‌ ఏంజెలా” అంటూ మొహంలో సంభ్రమాశ్చర్యాలను ప్రకటించేడు మధు.
” ఈ విషయంలో ఇంకేమైనా డౌట్సు వుంటే మొహమాట పడకుండా అడుగు”అందామె నవ్వుతూ.
“తప్పకుండా… మళ్ళీ కలుస్తాను” అంటూ తన సీటు దగ్గరకొచ్చేడు.
ఛా … ఇల్లాంటి వాళ్ళతో లాభం లేదనుకున్నాడు.
మన వాళ్ళనెవరినైనా అడిగితే కాస్తో కూస్తో ముందుకు వెళ్ళొచ్చనుకున్నాడు.
సాయంత్రం ఆఫీసునుంచి రాబోయే ముందు, ఈస్టు కోస్టులో వున్న ఫ్రెండు చలపతికి కాల్‌ చేసేడు, అతనేమైనా ఐడియా ఇస్తాడేమోనని.
చలపతి వాళ్ళావిడ సీత ఫోనెత్తింది. “ఆయన బయటకు వెళ్ళారన్నయ్యగారు. ఓ గంటలో వస్తారు. ఏమైనా అర్జంటు పనా” అడిగింది.
పూల గురించి చలపతి కంటే వాళ్ళావిడకే ఎక్కువ నాలెడ్జి వుంటుందని, ఆమెనే అడిగేడు “మల్లె పూలు అమెరికా లో దొరుకుతాయా” అని.
“ఏమో నండి. నేనైతే ఎక్కడా చూళ్ళేదు. ఇంతకీ వదినేమైనా కావాలని అడుగుతోందా” అంది నవ్వుతూ.
“అబ్బే తనకు కాదు. ఈ వీకెండు చిన్న పూజ చేయిస్తున్నాం. దాని కోసం” కాజ్యువల్‌ గానే అబద్ద మాడేడు.
“ఏం పూజన్నయ్య గారూ? నేనిందాక మాట్లాడినప్పుడు వదిన పూజ గురించి నాతో ఏమీ చెప్పలేదే… నేను మళ్ళీ
శైలజకు ఫోను చేసి కనుక్కుంటాను లెండి. ఈయన వచ్చేక మీకు ఫోను చేయమని చెబుతాను” అంటూ ఫోను పెట్టేసింది.
మల్లె పూల గురించి ఎన్ని  అబద్దాలాడాల్సి వస్తోంది? ఎవరిగొయ్యి వాళ్ళు తీసుకోడమంటే ఇదే కాబోలు నను కున్నాడు మధు. నిద్ర పోతున్న భార్యను లేపి, అప్పుడెప్పుడో జరిగిన విషయాల్ని ఆవేశంతో గుర్తు చేసి… పైగా మల్లెపూలను గురించిన పాటల్ని వినిపించి… ఛా ఇంకెప్పుడూ ఇల్లాంటి పనులు చేయకూడదు …శబ్దమయ్యేలా చెంపలేసుకున్నాడు మధు.
సమయానికి బద్రి వాళ్ళు కూడా లేరాయె ఏదైనా ఉపాయం చెప్పడానికి.
ఇంకెవరున్నా రబ్బా కనుక్కోడానికి ఆలోచనలో పడ్డాడు మధు.

ఓసారి ఇండియన్‌ గ్రోసరీ స్టోరులో కూడా ప్రయత్నిద్దామని బయల్దేరాడు.
స్టోరులో వాళ్ళు పూలెందుకని అడిగితే ఏమని చెప్పాలి? పూజ అని చెప్పాలా, లేక ఏదో వైద్యానికని చెప్పాలా? పూజంటే మళ్ళీ ఏం పూజ, ఎక్కడ చేయిస్తున్నారు లాంటి ప్రశ్నలు రావచ్చు. పైపెచ్చు అక్కడ ఏవైనా తెలిసిన మొహాలు కనిపించి, పూజ గురించి విన్నాయంటే … సవాలక్ష ఆరాలు! వైద్య మన్నా చిక్కే. ఏం వైద్యం? ఎవరికి రోగం… ఈ పూల ఖర్చు కూడా ఇన్సూరెన్సు కవర్‌ చేస్తుందా అంటూ ఇంటర్వ్యూలు మొదలెడతారు. కాబట్టి మరేదైనా కారణం ఆలోచించాలి అనుకున్నాడు మధు.
అలా ఆలోచిస్తూండగానే స్టోరు వచ్చేసింది.
కారు పార్క్‌ చేసి, లోపలికి వెళ్ళాడు.
షాపంతా, ఓ సారి తిరిగి చూసేడు ఎవరైనా మల్లె పూలు పెట్టుకుని కనిపిస్తారేమోనని.
నో లక్‌ …
అయినా వీళ్ళ దగ్గర కధలెందుకు. పూలు తలలో పెట్టుకుంటారని వీళ్ళకీ తెలుసు కదా. హు… ఇందాకటి నుంచీ, వీళ్ళకే అబద్దం చెప్పాలా అని ఆలోచించి అనవసరంగా బుర్ర బద్దలు కొట్టుకున్నానే అనుకున్నాడు. రిజిస్టరు దగ్గర కష్టమర్‌ లెవరూ లేరు.
వెంటనే వెళ్ళి అడిగేడు “మల్లెపూలు ఎక్కడ దొరుకుతాయ”ని.

ఎక్కడ దొరుకుతాయో తనకు తెలియదనీ,కాకపోతే అప్పుడప్పుడు ఒకరిద్దరు మల్లెపూలు పెట్టుకొని షాపు కొస్తుంటారనీ చెప్పింది షాపావిడ.
హమ్మయ్య. మొత్తానికి తీగ దొరికిందనుకున్నాడు.
“వారెవరో మీకు తెలుసా” అనడిగేడు చాలా ఉత్కంఠతో.
చూస్తే గుర్తు పట్టగలనని చెప్పింది.
“పోనీ…వాళ్ళు ఎక్కడుంటారు, ఎప్పుడెప్పుడు షాపు కొస్తుంటారు లాంటి వివరాలేమైనా తెలుసా మీకు?” అడిగేడు.
వాళ్ళు మొన్ననే ఓ సారి వచ్చారు. వారం పది రోజులకోసారి వస్తూంటారు. సారీ, మిగిలిన వివరాలు నాకు తెలియవు.
తెలిస్తే చెప్పే దాన్ని అందామె.
తెలిసినా చెప్పదేమోననిపించింది మధుకు.
ఇంటికి వెళ్ళి, మిగిలిన ఫ్రెండ్సును అడిగితే వుపయోగం వుండొచ్చనిపించింది.

“చలపతన్నయ్య ఫోను చేసాడు” అంది శైలజ, లోపలికి వస్తున్న భర్తతో.
“ఎంత సేపయింది” అడిగేడు.
“పావు గంట అవుతోంది. మీరేమిటి మనమేదో పూజో, వ్రతమో చేస్తున్నా మని చెప్పేరట సీత తో”
“అదా…వుట్టినే…” అన్నాడు నవ్వుతూ.
“నేనూ అదే చెప్పాను తనతో… పూజా లేదూ గాడిద గుడ్డూ లేదని. మరి మల్లె పూలెందుకూ అనడిగింది. ఎందుకేమిటే పిచ్చి మొహమా… నేను తలలో పెట్టుకోడానికని చెప్పా. తనూ వాళ్ళ ఆయన్ని అడుగుతానని చెప్పింది”
“అరే… నువ్వెందుకలా చెప్పేవు. నేను చెప్పినట్లే పూజకని చెప్పక పోయావా?” అంటూండగానే ఫోను మ్రోగింది.
శైలజ కాల్‌ రిసీవ్‌ చేసుకుని, “చలపతన్నయ్య” అంటూ మధు చేతికిచ్చింది ఫోను.
“ఏరా బాగున్నావా?”
“గంట క్రితం వరకు బాగానే వున్నా. అయినా ఈ మల్లెపూల గోలేమిట్రా”
“మల్లె పూల గోలా”
“మరే… మా ఆవిడ తనకు మల్లె పూలు తెచ్చే వరకు నన్ను గుమ్మం తొక్కొద్దంటోంది. అసల్నిన్నూ…” అంటూ పూర్తి సంస్కృతం లోకి వెళ్ళే దారిలో వాడుండగానే, తర్వాత మాట్లాడతానంటూ ఫోను కట్‌ చేసాడు మధు.
లాభం లేదు…ఫ్రెండ్సు సలహా దొరకడం కూడా కష్టమే!
పెళ్ళాం తోనే రాజీ పడితే బెటర్‌ కాంపన్సేషన్‌ గా మరేదైనా తనకిష్టమైంది కొనిస్తానంటే ఒప్పుకుంటుందేమో!
అయినా చూద్దాం, తను మరీ గొడవ చేస్తే అప్పుడు చూడొచ్చు అనుకున్నాడు మధు.

0000000000000000000000000000000000000000000000000000000000000000000000000000్‌

పోనీ ఇండియా ఫోను చేసి లక్కు బాగుండి రెండు మూడు రోజుల్లో వచ్చే వాళ్ళున్నారేమో కనుక్కుంటే ఆలోచన రాగానే ఆలస్యం చేయకుండా ఫోనందుకున్నాడు.
కుశల ప్రశ్న లయ్యేక, “తెలిసిన వాళ్ళెవరన్నా ఇక్కడకు వస్తున్నారా?” అనడిగేడు.
“రేపు రాత్రికి సుధ ఆంటీ బయల్దేరుతోంది, కూతురు దగ్గరకి… ఏమైనా పంపాలా?”
“అలాగా… ఆంటీ గారి తో కాసిని మల్లెపూలు పంపిస్తారా ”
“ఇక్కడనుంచీ మల్లెపూలెందుకురా? అక్కడ దొరకవూ? అయినా మన వూరి నుంచీ విమానం దాకా, అక్కడ నుంచీ మీ వూరు దాకా వచ్చే సరికి వాడి పోవూ?” అనడిగేరు.
అదీ నిజమేనని పించింది.
“తడి గుడ్డలో చుట్టి తెస్తే వాడవు కదా?”సలహా ఇచ్చేడు.
“ఏమో దూరా భారం కష్టమేమో. అయినా అంత అర్జంటుగా నీకు మల్లెపూలెందుకురా” అడిగేరు.
“అదీ… మరే … శనివారం ఓ పూజ చేయ్యాలనుకొంటున్నాం అందుకు”
“అక్కడ అసలు పూలే దొరకవా?”
“అన్నీ దొరుకుతాయి గాని, మల్లెపూలు దొరకడంలేదు”
“మల్లె పూలతోనే పూజ చెయ్యాలా?”
“అవును… ఇక్కడికీమధ్యనే మల్లేనంద స్వామి అని ఒక కొత్త స్వామి వచ్చాడు. ఆయనకు మల్లెపూలతో పూజ చేస్తే చాలా మంచిదట. అందుకని…”
“అంతేనా లేక మీ ఆవిడకా”
“అబ్బ పూజకే … ఇంతకీ పంపిస్తున్నారా?” అడిగేడు విసుగు ధ్వనిస్తూ.
“కష్టమనుకుంటారా. ఇది సీజను కాదుగా … అయినా పోయిన సారి మీ ఆవిడ కరివేపాకు పాక్‌ చేసుకుంటే ఆకులూ, కాయలూ అమెరికాలోకి తీసుకెళ్ళకూడదన్నావుగా? మరి పూలైతే ఓకేనా?”అడిగేరు.
“పూలైనా కష్టమే. పైగా పెద్దావిడ ఆవిడకెందుకులే ట్రబులు. ఇక్కడే నేను ట్రై చేస్తాను. మళ్ళీ మాట్లాడతాను …” అని ఫోను పెట్టేసాడు మధు.
“పంపిస్తామన్నారా?”అడిగింది శైలజ.
“ఇప్పుడక్కడ దొరకవట. ఇదసలు మల్లె పూల సీజను కాదని చెప్పారు. పైగా పూల లాంటివి బయట దేశాలనుంచీ ఇక్కడకు తేకూడదు కదా! ఇక ఆ గొడవ వదిలెయ్య కూడదూ” అన్నాడు శైలజ ప్రక్కనే కూర్చుని, గాజులతో ఆడుకుంటూ.
“అక్కడ సీజను కాదేమో గానీ ఇక్కడిప్పుడు సీజనే” అంది శైలజ.

“నీకెలా తెలుసు?” ఆశ్చర్యంతో అడిగేడు.
“పోయిన వారం సినిమాకు వెళ్ళినప్పుడు చూసా”
“ఏదీ సినిమా లో పూలనా?”
“కాదు, సినిమా కొచ్చిన ఓ అమ్మాయి పెట్టుకుంటే”
మొత్తానికి మరో క్లూ దొరికింది …అంటే … ఈ వూళ్లోనో, ప్రక్క వూళ్లోనో మల్లె పూలు దొరుకుతాయి.
“ఆమె ఎవరో నీకు తెలుసా?”
“తెలియదు. వాళ్ళు మనకంటే బాగా లేటుగా వచ్చారు. సినిమా అయిపోయాక అడుగుదామంటే, ముందే వెళ్ళి పోయారు”
“అంతకు ముందు ఆమెను చూసిన గుర్తేమన్నా వుందా? ఏ దైనా పార్టీ లో గాని, స్టోరులో గానీ”
“చెప్పానుకదా! వాళ్ళు సినిమా మొదలెట్టాక వచ్చారని. ఎలా కనిపిస్తారు?” విసుగ్గా అంది, ఆవులిస్తూ.
“మరి చీకట్లో ఆమె పెట్టుకుంది మల్లె పూలని అంత ఖచ్చితంగా నీకెలా తెలుసు?” లాజిక్కు అదిరిందనుకున్నాడు.
“ఖచ్చితంగా తెలీదనుకో. తలలో చీకట్లో తెల్లగా కనిపిస్తే మల్లెపూలనుకున్నా. అదీగాక మల్లెపూల వాసన కూడా వచ్చింది ధియేటర్‌ లో ”
“వాళ్ళు ఏవో పిచ్చి ప్లాస్టిక్‌ పూలను తలలో పెట్టుకుని, జాస్మిన్‌  సెంటు స్ప్రే చేసుకుని వుండొచ్చుకదా”
“వుండొచ్చు…”
“నాలుగు రోజులనుంచీ చూస్తున్నావుగా… కళ్ళు తెరిచినా, కళ్ళు మూసినా మల్లెపూల గురించే ఆలోచిస్తున్నా”
“తెలుసు … రాత్రి నిద్రలో కూడా వాటి గురించే కలవరిస్తున్నారు”
“చూడు ఇంత తీవ్రంగా వెదుకుతున్నా నాకు దొరకడం లేదు. పోనీ మల్లెపూలకు బదులు ఓ గోల్డ్‌ కాయిన్‌ కొనివ్వనా?”
“ఒకటా… నేను రెండు జడలు వేసుకుని పూలు పెట్టుకుందామనుకున్నా”
“అబ్బ… నీకు రెండు జడలు బాగోవు శైలూ”
“వూహూ… ఐతే నాకు మల్లె…”
“సర్లే రెండు కాయిన్స్‌ … సరేనా?!”
“ఓకే ” అంది శైలజ వెలిగిపోతున్న మొహంతో.
ఆ రాత్రికి ప్రశాంతంగా కలవరింతలు లేకుండా నిద్ర పోయాడు మధు.

0000000000000000000000000000000000000000000000000000000000000000000000000000్‌

రెండ్రోజుల తర్వాత ఓ సాయంత్రం శైలజ కోసం ఫోను చేసింది సీత.
“శైలజ స్నానం చేస్తోంది” చెప్పాడు ఫోను లిఫ్ట్‌ చేసిన మధు.
“సర్లే అన్నయ్యా… నేను తర్వాత కాల్‌ చేస్తాను… ఇంతకీ మీకు మల్లె పూలు దొరికాయా?” అడిగింది సీత.
“లేదమ్మా నాకెక్కడా దొరకలేదు. మీకెక్కడన్నా దొరికాయా?”
“పూలైతే దొరకలేదు గానీ పూల చెట్టు దొరికింది. ఇంకో నాలుగైదు రోజుల్లో పూలు పూయొచ్చు”
“మల్లె పూల చెట్టా? ఎక్కడ దొరికింది? ఎలా పెంచుతున్నారు?” అడిగాడు మధు.
వివరాలు చెప్పింది సీత.
“చాలా ధాంక్స్‌ సీతా. ఈ విషయం శైలూకు చెప్పకు…ప్లీజ్‌ ”
“అలాగే అన్నయ్యా … చెప్పంలే” అంది సీత.
ఫోను పెట్టేసి, “శైలూ ఆఫీసు నుంచీ కాల్‌ . ఏదో ప్రోసెస్‌  ఫెయిలయిందట. అర్జంటుగా వెళ్ళాలి. ఓ గంటలో వస్తాను” అని కేకేసి చెప్పి… బయటకు బయల్దేరాడు మధు.

్‌0000000000000000000000000000000000000000000000000000000000000000000000000000్‌
మరో వారం రోజులు గడిచేయి.
శైలజ మల్లెపూల వూసు మరచిపోయింది.
“ఎప్పటినుంచో పోట్రైయిట్స్‌ తీయించుకుందామంటున్నావుగా. సాయంత్రం వెళ్దాం రెడీ అవ్వు. మా ఫ్రెండొకతను క్యూపనొకటి ఇచ్చాడు. ఈ రోజు తీయించుకుంటే హాఫ్‌ ప్రైసే” అన్నాడు మధు ఆఫీసుకు బయల్దేరుతూ.
“ఇప్పుడెందుకండీ … మన మేరేజ్‌ డేకి తీయించుకుందాం” అంది శైలజ.
“ఆరునెళ్ళ దాకా ఈ క్యూపన్‌ పనిచెయ్యదు. నేనాల్రెడీ అప్పాయింట్మెంటు తీసుకున్నా. ఇవ్వాళే తీయించుకుందాం” చెప్పాడు మధు.
“ప్చ్‌ మీరెప్పుడూ ఇంతే. ఏమి కట్టుకోను చీరా లేక డ్రెస్సా?”
“మన సంప్రదాయం ప్రకారం చీర కట్టుకుంటే బాగుంటుంది”
“ఏ చీర కట్టుకోను?”
“తెల్ల పట్టు చీర … ఎర్ర బోర్డరుదుందే అది కట్టుకో”
“ఫోటోకు తెల్ల చీరె బాగుంటుందా?”
“మన శోభనం రోజు శైలులా … తెల్ల చీర ఎర్ర బోర్డరులో మెరిసిపోతావు”
“మరి మీరు పంచె కట్టుకోరూ ”
“పంచె నాకులేదుగా?”
“మరి శోభనం రోజు కట్టారుగా. పైగా మన సంప్రదాయం కూడాను” అంది వుడికిస్తూ.
“అది వేరు. అయినా ఇంట్లో ఒకళ్ళు సంప్రదాయం పాటిస్తే సరిపోద్దిలెద్దూ … నాకు టైమవుతోంది. ఆరున్నరకల్లా రెడీ గావుండు” చెప్పి, వర్కుకు బయల్దేరాడు మధు.

0000000000000000000000000000000000000000000000000000000000000000000000000000్‌

వర్కు నుంచీ మధు ఇంటి కొచ్చేసరికి ముచ్చటగా ముస్తాబై ఎదురు చూస్తోంది శైలజ.
“అబ్బ … ఎవరీ అందాల తార?” అన్నాడు మధు శైలజను చూడగానే.
సిగ్గు పడుతూ నవ్వింది శైలజ శోభనం రోజులా.
“శైలూ నీ కోసం ఏమి తెచ్చానో చూడు …” అంటూ, చేతిలోని పాకెట్‌  ఓపెన్‌ చేసి … మల్లె చెండునందించాడు మధు.
“మల్లె పూలా … నిజంగా మల్లె పూలే..” శైలజ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. గొంతు లోంచి ఆనందం చూపుల్లో అనురాగం … “ఎక్కడ దొరికాయండీ?” అడిగింది మల్లె చెండును అపురూపంగా అందుకుంటూ.
“ఎక్కడో దొరకడమేమిటి డాళింగ్‌ నీ కోసం మల్లె మొక్కను పెంచి, పూలు పూయించి నా స్వహస్తాలతో మాలగా చుట్టి తెస్తే…”
“అబ్బ మీరెంత మంచివారో…” అంటూ భర్త కళ్ళలోకి ప్రేమగా చూస్తూ పూలను ఒకసారి గట్టిగా వాసన పీల్చింది శైలు.

నుదుట ఎర్ర బొట్టు,
అరమోడ్పులౌతూన్న కళ్ళకు మరి కాస్త అందాన్నిస్తూ కాటుక రేఖ,
పసిమి చాయలో మెరుస్తూన్న నున్నని చెక్కిలిని తాకి, పరావర్తనం చెందలేక ఇంకి పోతున్న వెలుతురు,
పూల స్పర్శతో పులకించబోతున్న కురుల సంకేతాలననువదిస్తూ కదులుతూన్న చెవి రింగులు…
మల్లెల సువాసననాస్వాదిస్తూ మరింత బారైన ముక్కు,
ముచ్చట తీర్చిన మొగుడిపై అనురాగాన్ని అద్దడానికి నేనంటే నేనని పోటీ పడుతున్న ఎర్రటి పెదవులూ…

రెప్ప వాల్చకుండా చూస్తున్న భర్త వైపు ఓ చిరునవ్వు విసిరి, మల్లె చెండును చేతికిచ్చి, అద్దం వైపు  ఓ అడుగేసింది శైలజ.
పడగ్గది దిగ్గున లేచింది పట్టు చీర మెరుపులో.
సన్నగా కంపిస్తూన్న చేతులతో, అప్పుడప్పుడే రెండు వూపిరుల వేడిమికి వాడబోతూన్న మల్లె చెండును శైలజ జడలో అలంకరించాడు మధు.
జడను ముందుకు వేసుకుని, మధు వైపు తిరిగి, భర్తను మల్లెదండలా చుట్టేసి, మెడను అరవై డిగ్రీలు కుడి పక్కకు వాల్చి…తలను నెమ్మదిగా ముప్పై డిగ్రీలు పైకెత్తి, అక్కడ ఆల్రెడీ నిరీక్షిస్తూ సన్నగా వణకుతున్న పెదాలతో… ఆమె అధరాలు “ఐ లవ్‌ యూ” చెప్పేయి.
ఆకాశంలో జాబిలి అగుపించకపోయినా, ఆ జంట గుండెల్లో వెన్నెల జల్లు కురిసింది.
శైలజ కళ్ళ నుంచి జారిన నీటి బొట్లను చూసి ఆనంద బాష్పాలనుకుని “శైలూ…” పిలిచేడు మధు మంద్ర స్వరంతో.
కళ్ళను తుడుచుకుంటూ … “హాచ్‌..” తుమ్మింది శైలజ, ఒకచేత్తో అప్పటికే ఎర్రబడ్డ ముక్కును నలుపుకుంటూ.
“ఏమైంది…” అడిగేడు మధు ఆదుర్దాగా.
“ఏమో … కళ్ళు మండుతున్నాయి. ముక్కు…” అంటూ మరోసారి తుమ్మింది.
“ప్రొద్దుటి నుంచీ ఇలాగే వుందా?”
“లేదు … ఇప్పుడే సడన్‌ గా… ఒక టిస్యూ ఇవ్వరూ…” అంటూ కళ్ళ వెంట కారుతున్న నీటిని ఒకచేత్తో… ముక్కుల నుంచీ జారుతున్న నీటిని మరో చేత్తో తుడుచుకుంటూ.
“కొంప తీసి పూల వల్ల ఎలర్జీ లాంటిది రాలేదు గా…” అంటూ టిస్యూ కోసం పరుగెత్తాడు మధు.

“మీరేమీ బాధ పడకండి. నాకే పూలు పెట్టుకొనే ప్రాప్తం లేదు. మీకు నా మీద ఎంత ప్రేమ వుంటే ఇంత కష్టపడి మొక్కను సంపాదించి, ఫ్రెండింట్లో పెంచి, పూలు పూయించి … నా కోసం మీరెంత శ్రమపడ్డారండీ” అంది శైలజ.
అప్పుడే డాక్టర్‌ దగ్గరకు వెళ్ళి వచ్చారిద్దరూ.
“శ్రమ ఏముంది శైలు… నీ ముచ్చట తీర్చడం నా బాధ్యత కాదూ? అయినా బాధ పడకుండా ఎలావుండను. నీకు మల్లెపూలంటే ఎంత ప్రేమో నాకు తెలియదూ. పూలు దొరక్క పోయినా బావుండేది దొరకలేదన్న బాధ ఒక్కటే వుండేది. ఇప్పుడు చూడు ఈ ఎలర్జీ బాధొకటి… ఐ యాం సారీ శైలు” నొచ్చుకున్నాడు మధు .
కిటికీ లోంచి చూస్తున్న చందమామ మనస్సు కూడా చివుక్కుమంది మొహం చిన్న బోయింది.
“అన్ని బాధలూ తీరడానికి మందేమిటో చెప్పనా?” అంది శైలు మధు వంక కొంటెగా చూస్తూ.
చెప్పకుండానే అర్ధమైంది శైలజకు మరి కాస్త దగ్గరగా జరిగేడు మధు.
----------------------------------------------------------
రచన: కె. వి. గిరిధరరావు, 
ఈమాట సౌజన్యంతో

Wednesday, December 19, 2018

జీవనసంధ్య


జీవనసంధ్య




సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి...................
తీరా అక్కడికెళ్ళి చూస్తే ఏముంది?

తెరలు దించేశారు. ఇంక నాటకం ఆడేది లేదు పొమ్మన్నారు.

నువ్వు బిచ్చగాడు ముద్దకోసం అరిచినంత దీనంగా అరిచావు. పిచ్చోడు గరుకు రాళ్లేరుకుని మూట కట్టుకున్నంత శ్రద్ధగా అడిగావు. జ్వరం తగిలిన పిల్లాడికి వళ్ళు తుడుస్తూ దేవుళ్లకి మొక్కుకునే తల్లిలా, కేవలం మనిషివి తప్ప మరేం కాకుండా మోకరించావు వాళ్ల ముందు.

“ముసలోన్ని బాబూ, చేతికర్ర పోటేసుకుని పొగులంతా నడిసొస్తన్నా నాయనా, ఇదొక్కపాలి నాకోసం ఆడండి తండ్రుల్లారా! పోనీ ఆ చివరాకర తెరదించే ముందు వొస్తదిగా. ‘ఈ సుకదుక్కాల్ని యిస్మరించి, చాస్వతానంద కారకమైన సత్తేన్ని అనువేచించి… ఆ మాటల్నోసారి చెప్పించరాదా అయ్యా!’ అని కళ్లనీళ్ళు పెట్టుకున్నావు.

వాళ్లందరూ స్టేజీ సర్దేశారు. మొహాలకి పూసుకున్న రంగులు తుడిచేసుకున్నారు. తళుకుల బట్టలు మార్చి అతుకులేసిన పాతచొక్కాలు తొడిగేసుకున్నారు. పొట్లాల్లో ఆరిపోయి బిగుసుకుపోయిన అన్నం సయించక పాడుబడ్ద పెంకుటింటి వసారాలో చింకిచాపో తలగుడ్డో వేసుకుని నిద్రరాక పొర్లుతున్నారు. కథానాయకుడున్నాడుగా, నువ్వడిగిన మాటలు మహబాగా చప్పట్లమధ్య మళ్లీ మళ్ళీ చెప్పి గొంతుజీరబోయిన వాడు, వాడు మాత్రం నల్లవిగ్గు తీసేసి ఎర్రజుట్టు దువ్వుకున్నాడు, సీసా మూత తెరుచుకు కూచుని, అప్పుడప్పుడూ ఏదో గుర్తొచ్చి అమ్మలక్కలు లంకించుకుని శివాలెత్తుతున్నాడు.

వాళ్ల దగ్గర, వాళ్లకన్నా హీనంగా చతికిలబడి దణ్ణాలు పెట్టి అడుక్కుంటున్నావు నువ్వు. ఆ వూర్నుంచి ఈ వూరిదాకా కాళ్ళీడ్చుకొచ్చేసరికి ఈవేళయింది. నువ్వొచ్చేసరికే నాటకం ఐపోయింది. ఇప్పుడు నువ్వు తిరిగెళ్లలేవు. నువ్వడిగిన ఆ నాలుగు మాటలు వినటానికే ఈ జీవుడు ఇంకా నిలిచిపోయింది.

ఎన్నేళ్లనాటి మాట! ఏ కాలం నాటిదీ నాటకం? ఇరవయ్యేళ్లేమో నీకప్పుడు. ఎన్ని ఊర్లలో ఎంత ఘనంగా ఆడిన నాటకం! ఏవూర్లో ఆడినా ఎంత పెద్ద స్టేజీ మీదైనా వేషగాళ్ల మొహానికి నువ్వే రంగులు పూసేవాడివి. విగ్గులు పెట్టి, వాళ్ల చొక్కాలమీద మెరుపు కాయితాల పూలు అంటించేవాడివి. ఆట మొదలవగానే పరిగెత్తి జనంలో చేరి చూసేవాడివి. ఇకంతే, నీకు వొళ్ళు తెలిసేది కాదు. చివరికంటా చూశాక, ఆఖర్లో కథానాయకుడు ఇల్లొదిలి వెళ్ళిపోతూ ‘ఈ సుఖదుఃఖాల్ని విస్మరించి, శాశ్వతానంద కారకమైన సత్యాన్ని అన్వేషించి…’ అనే మాటలు గంభీరంగా చెప్తుంటే వొళ్లంతా పులకరించి పూనకమెత్తేవాడివి. నీకా అక్షరమ్ముక్క రాదు. ఆ మాటలన్నీ ఏంటో, వాటి అర్థమేంటో నీ ఊహకి కూడా అందలేదు. అవేవో గొప్పమాటలని మాత్రం నీకు తెలుసు, వాటి ప్రకారం నడిస్తే ఏడుపుండదని, బతుకంతా అట్లా ఆ నాయకుడిలా గంభీరమైన మొహంతో గొప్పోడిలా బతకొచ్చని నీకు నికరంగా తెలుసు. ఈ చదువుకున్నోళ్లకంటే చాలా బాగా నీకొక్కడికే తెలుసు ఆ సంగతి. ఎవర్నో అడిగి బతిమాలి ఆ మాటల్ని ఓ కాయితమ్ముక్కమీద రాయించుకుని నీ ఇంట్లో మట్టిగోడ మీద మైదాపిండి రాసి అంటించుకున్నావు కూడా.

మాయదారి జబ్బేదో వచ్చి నీ అయ్య పోయాడు. పెద్దోడివి, నాటకాలని ఊళ్ళు పట్టుకు తిరిగితే ఈ సంతకి కూడుబెట్టే దిక్కేదని కావల్సినోళ్ళు నాలుగు చివాట్లేసి నిన్ను కూలిపనికి కుదిర్చారు. నీ అయ్య పోతే నువ్వేడవలేదు. దిక్కుమాలినోడు, పెట్టిందానికన్నా కొట్టిందే ఎక్కువ పాపిష్టోడు అని మీ అమ్మ లోపల, నువ్వు పైకే అనుకున్నారు. కానీ, నువ్వు లేకుండా జీవనసంధ్య నాటకం పక్కూర్లో ఆడిన రోజు మాత్రం ఏడ్చావు. గోడకంటించిన కాయితమ్ముందు కూర్చుని ఎక్కిళ్లతో పేగులు నెప్పెట్టేలాగా ఏడ్చావు. నాటకం పూర్తయ్యే జాముకి ఆ కాగితాన్ని తడుముకుని, దాన్లో మాటలు గుర్తు తెచ్చుకుని, ‘ఇట్లా ఏడవకూడదని కదా, బాగా పెద్దరికంగా, మొకం దైర్నంగా ఉంచుకుని బతకమని కదా దీన్లో ఉంది,’ అనుకుని మొహం కడుక్కుని పడుకున్నావు.

తర్వాత్తర్వాత ఏడుపు మర్చిపోయావు గాని, నాటకాన్ని గానీ నాయకుణ్ణి, అతని మాటల్ని గానీ మర్చిపోలేదు. ఎట్లా కనిపెట్టిందో గాని సుగుణమ్మ కాపురానికొచ్చినరోజే అడిగింది. ‘ఒక్క దేవుడి బొమ్మా లేదుగా ఇంట్లో వాసనకడ్డీ యెలిగిద్దామంటే! ఈ కాగితమ్ముక్కకి దణ్ణం బెట్టుకోడం ఎవరు నేర్పారోగాన్నీకూ…’ అని. బయటికి ఎవర్తో చెప్పుకోకపోయినా నీ పెళ్ళానికి తెలుసు నువ్వు మిగతా వాళ్లలాగా కాదని. సాయంకాలం పూట పొయ్యి దగ్గర చేరి దాకలో పులుసు కలబెడుతూ ఆకాశంలోకి అట్లా చూస్తూ ఉంటావు కదా, అప్పుడది నిదానంగా సణుక్కునేది. ‘ఏం విడ్డూరం మనిషమ్మా! చుట్టకనో, చుక్కకనో బజాట్టోకి పోకండా పెళ్ళాం చేతికి అడ్దం పడతాడు. ఇంకేవన్నా అంటే అట్టా పైకంటా సూత్తాడు. ఏవయ్యో! ఏవుంటదాడ?’ అట్లా పైకంటుంది గానీ నీకు తెలీదు, దానికి లోపలెంత కులుకో, ఏం టెక్కో, దాని మొగుడు బలే మర్యాదగల్లోడు, వివరం తెలిసినోడు అని.

పెళ్లయ్యేదాక ఎవరూ సుగుణమ్మతో ‘నువ్వు చక్కనిదాని’వనలేదు. బక్కపలచటి మనిషి. కాయకష్టం చేసుకున్న చామనచాయ ఒళ్ళు. ఎప్పుడూ ఏదోక పని చేస్తానే ఉండేది. తిన్నగా చతికిలబడి నేలమీద కూచోగా చూడలేదు ఎవరూ. మోకాళ్ల మీద గొంతు కూర్చునే అన్నమొండటం, కోళ్లకి గింజలెయ్యడం, కత్తిపీటతో కాయగూరేదో తరిగేటప్పుడు కుక్క గానీ అటువైపొస్తే దానికో రెండు ముక్కలిసరడం, గిన్నెలు తొలిపిన నీళ్ళు అట్లా మొక్కల్లోకి జల్లడం, అంతే దానికి తెలుసు. చీలమండల పైకి చీర, ఎప్పుడన్నా నాలుగు నిత్యమల్లి పూలో కనకాంబరాలో జుట్టుముడిలో దోపుకోడం, అదీ దాని అలంకారం. పని చేసుకునేటప్పుడు, కూర్చుని లేచేటప్పుడు టకటకమని మొటికల చప్పుడు పైగా.

అప్పటిదాకా ఎన్ని మొహాలకి రంగులేసినా అవి నీకు ఒట్టి మొహాలే. సుగుణొచ్చేదాకా ఆడవాళ్లంటూ ప్రత్యేకంగా ఉన్నట్టు ఎప్పుడూ అనిపించలా నీకు. అదొచ్చాక ఇంకెవరూ ఆడోళ్లలాగా కనపళ్ళేదు. ఎందుకు? అదేమన్నా అందగత్తా? రంగా రూపమా కళ్ళా ఒళ్ళా? అవేం లేవు. నీతోపాటు ఉండిపోడానికి వచ్చేసిందిగా, నీతో చెప్పుకునే మాటలు ఇంకెవరితో చెప్పుకోదుగా. సంతోషంగా ఉండటమంటే ఇదీ అని నీకెప్పుడూ దేని గురించీ అనిపించలేదు కానీ సుగుణ ఉన్నప్పుడు అంతా మాములుగా ఉన్నట్టు, అదింట్లో లేనప్పుడు వెలితిగా ఉన్నట్టూ మాత్రం అనిపించేది. అదేం చేసినా నచ్చుతుందని కాదు, దాని పెడసరం మాటలు కొన్ని, పాడలవాట్లు కొన్నీ చికాకు పెట్టవనీ కాదు. మనుషులమీద కోపమెట్లా తెచ్చుకోవాలో నీకు చేతగాక, కోపం రాని మొగుణ్ణి సాధించడమెట్లాగో దానికి తోచక, అట్లా గడిచిపోయేది. ఒకవేళ నువ్వెందుకన్నా మనసు కష్టపెట్టుకుని మాట్లాడకుండా ఉంటే ‘ఓయబ్బ! నీలిగింది చాల్లే, పోయి తిను పో’ అని సుగుణ అటు తిరిగి ఆవులించినట్టు నాటకమాడటం, ‘ఏదో మాట జారాన్లేవే గుణమ్మా! మనసులో పెట్టుకోమాక,’ అని నువ్వు దాని భుజం పట్టుకు ఊపి దొంగనిద్ర చెడగొట్టడం, ఇదే మోస్తరు నడిచింది చాన్నాళ్ళు.

జీవనసంధ్య నాటకంలో ఒకచోట నాయకుడు ప్రియురాలితో అంటాడు, ‘నా అనురాగం కళంకం లేనిది. హృదయపూర్వకంగా నీ ప్రేమని అర్థిస్తున్నాను,’ అని. ఆ మాట అనేటప్పుడు ఆ పిల్ల అరచేతిని తన చేతుల్లోకి తేసుకుని క్షమాపణగా, ఆరాధనగా, నిస్సహాయంగా ఆమె వైపు చూస్తాడు. అప్పట్లో నీకా భాగం అంతగా నచ్చేది కాదు. పెద్దగా అర్థమయ్యేది కూడా కాదు. కానీ సుగుణతో పేచీ పడ్దప్పుడు, ఏదో ఆలాపనలో ఉండి అది పిలిస్తే కసురుకున్నప్పుడు, అది రుసరుసలాడితే ఓర్చుకోలేక విసిరికొట్టినప్పుడు, అట్లా విసిరికొట్టాక అది అలిగి మూగమొద్దులాగా పనిచేసుకుంటున్నప్పుడు, నీకనిపించేది గుండెలోంచి ఏదో తన్నుకొస్తున్నట్టు, ఏవో మాటలు లోపల్నించి ఊపిరాడకుండా ఒకదాంతో ఒకటి పురిపడుతున్నట్టు. చింతచెట్టు కింద ఒక్కడివే బాసింపట్లేసుకుని ఆ ‘అనురాగం, కళంకం’ వాక్యాలు పెద్దగా నీతో నువ్వు చెప్పుకునేవాడికి. మళ్ళీ చుట్టూ ఎవరన్నా చూస్తారేమో అని మెల్లగా గొణుక్కునేవాడివి. పదాలు నోరు తిరగనప్పుడు బుర్ర మీద నీకు నువ్వే ఒక మొట్టికాయ వేసుకునేవాడివి. పదిసార్లు నీకు నువ్వు చెప్పుకుని, తప్పులేం లేవని తీర్మానించుకుని, తీరా సుగుణ దగ్గరకెళ్ళాక చెప్పటానికి మాట పెగిలేది కాదు. అక్కడక్కడే తల గోక్కుంటూ, చొక్కా అంచులు లాక్కుంటూ దాని చుట్టూ తిరిగేవాడివి. అదెట్లానో కనిపెట్టేది నీ వాలకం. ‘మళ్ళీ వచ్చా? ఆ కాగు ఇటందియ్యి. నీళ్లకి పోతా,’ అని పట్టీ పట్టనట్టుగా మాట్లాడి మళ్ళీ నిన్ను మాటల్లో కలిపేసుకునేది. ఎన్ని సంవత్సరాలు గడిచినా నీకా ‘అనురాగం’ మాట సుగుణతో చెప్పే ధైర్యం రాలేదు.

మూడు సార్లు కడుపు పోయి మోయలేనన్ని మొక్కులు మొక్కుకుని దాదాపు నడివయసు మీదపడ్డాక దక్కిన ఒక్కగానొక్క పిల్లాడికి దేవుడి పేరు పెట్టకుండా జీవనా అని పిలుస్తావని ఊరోళ్లతో పాటు సుగుణ కూడా తిట్టిపోసేది. కానీ, ఆ పేరువల్లే వాడివ్వాళ ఇంత తెలివిగల్లోడయ్యడని నీకు తెలిసినట్టు వాళ్లకి తెలీదుగా. సుగుణ మాత్రం వాణ్ణి జీవుడూ అని కేకేస్తే నీకెంత కచ్చిగా ఉండేదో. ‘నా అంటే ఉన్నంత మెత్తంగా డూ అంటే ఉండదే యెర్రిదానా!’ అన్నువ్వు చెబితే అది కోరగా ఓ చూపు చూసి ‘ఏవోనయ్యో, ఆ సోపలన్నే నాకు తెలవదు. మొక్కు ఎగ్గొట్టిన మొనగోడివి, ఏ మొహం బెట్టుకుని చెబుతున్నా?’ అని తిరుగులేని నెపంతో తెగబడేది.

మాగన్ను నిద్రలో ఏనాటివో సుగుణ మాటలు తలపుకొచ్చి నవ్వుకున్నావు. కూర్చునే నిద్రలోకి పోతున్నావు. చలికి మునగదీసుకు పడుకున్న వీధికుక్క ఒకదానికొకటి మెలిపడ్డ కాళ్ళని మత్తుగా విడదీసుకుంటూ సన్నగా కుయ్యిమంది. గోడల వెనకనుండి కీచురాళ్ళు రూరూమని రొదపెడుతున్నాయి. పందిరి గుంజ వీపుకి ఒత్తుకుని కళ్ళు తెరిచావు. నాటకం వాళ్లంతా చింకిచాపల మీద, అరుగుల మీద, దొరికినచోట దొరికినట్టు వెర్రినిద్రలో ఉన్నారు. దిగులుగా, జాలిగా, నీ గతమ్మీద గుబులుతో వాళ్లవైపే చూస్తున్నావు.

ఆ చివరాఖర్న మూలన ముడుచుకు పడుకున్నవాడు సుమారుగా జీవన ఈడు వాడే. ఐతే వీడు బక్కపలచన, ఎవరేం చెప్పినా చేసుకుపోయే మొహమాటపోడు. జీవనట్లా కాదు. గట్టి ఒళ్ళు, నిక్కచ్చి మనిషి. మాటలో జంకూ, బొంకూ తెలీదు. ‘నీకంతా మీ అమ్మదే వొచ్చిందిరా!’ అని మురిపెంగా విసుక్కుంటావు నువ్వు. వాడికెప్పుడూ జనం కావాలి. చేతినిండా పని కావాలి. ఎక్కడిక్కడికెళ్తాడో, ఎవరెవర్తో సావాసం కడతాడోగానీ భలే భలే పనులు నేర్చుకొస్తాడు. పాత టైర్లు, పారేసిన కొబ్బరి టెంకెలు, తెగిపోయిన చెప్పులు, పీలికలైన పాతబట్టలు, ఒకటనేంటిలే… ఏద్దొరికితే దాంతో వాడుకునే వస్తువులో, దాచుకునే బొమ్మలో ఏదో ఒకటి చేస్తాడు. వాడిచుట్టూ ఓ పదిమంది పిల్లలో, పెద్దోళ్ళో ఎప్పుడూ మూగే ఉంటారు. పాతవాళ్ళూ, పట్నంవాళ్ళూ అన్లేకుండా ఏ దూరపు వూళ్ళమ్మటో తిరుగుతూ, కొత్త పనులు చేసుకుంటా సందడిగా ఉంటాడు. వాడికి పొద్దు చాలదు, నీకు పొద్దు గడవదు. ఏ పని చెయ్యటానికీ నీ చేతుల్లో సత్తువ లేదు. సుగుణ పోయాక ఏదన్నా చెయ్యాలన్న హుషారూ మిగల్లేదు. ఈ నాటకం కోసమని ఇన్నేళ్లకి ఇల్లు కదిలి, ఊరొదిలి కర్ర పోటేసుకుని ఇంతదూరమొచ్చావు గానీ లేకపోతే ఎవరితోటీ మాట్లాడాలని, ఎటన్నా పోయి తిరగాలనీ మొదట్నుంచి ఎట్లానూ లేదు.

ఇప్పటిదాకా పక్కూరి గుళ్ళోనుంచి వినిపిస్తున్న భజన సద్దుమణిగింది. వసారాలో ఒక మూలన చిందరవందరగా నాటకం వాళ్ల అరిగిపోయిన చెప్పులు, బట్టల పెట్టెలు, అలంకరణ సామాన్లూ. వాటిక్కాస్త అవతల దీపం మలిగిపోయిన మట్టి ప్రమిదెలో నూనెవాసన, నూనెలో ఇంటివాసన, ఇల్లంటే సుగుణతో పాటు కలియతిరిగే నేతచీర వాసన, ఆమె చేతుల్లో తిరిగే రకరకాల పనుల తాలూకు దినుసుల, వస్తువుల వాసన, చివర్రోజుల్లో ఆమె మంచం పక్కన గుట్టగా పడున్న మందుల వాసన. ఆ మంచం పక్కనే మట్టి మూకుడులో పాలు కతికే పిల్లి వాసన. ఆమె పోయాక పిల్లి రావడం మానేసింది. నీ ఇంట్లో చాలా వాసనలు రావటం మానేశాయి. నీకు చాలా చప్పుళ్ళు వినపడటం మానేశాయి.

అప్పుడప్పుడూ నీకు కలలొచ్చేవి. ఈమధ్య కొద్దికాలం దాదాపు ప్రతీరాత్రీ వచ్చాయి. నిద్ర పట్టడం బాగా ఆలస్యమైనా బానే పడుతుంది కానీ ఎక్కడ కుక్క మొరిగినా, గట్టిగా గాలి వీచి చెట్లు కదిలినా, ఏ పొరుగూరి నుంచి ఆలస్యంగా వచ్చినోళ్ళెవరైనా దారంట నడిచెళ్ళినా, అదే అదనుగా, ఆ వంక పెట్టుకుని లేస్తున్నావు. చేతికర్ర మంచంకోడుకేసి కొట్టి ‘ఎవురదీ?’ అని కాసేపు దిక్కులు చూసి పడుకుంటూన్నావు. తెల్లారే వేళకి కలలొచ్చేవి. ఒకటనేముండదు. చాలాకలల్లో నువ్వు ముసలోడివి కాదు. ‘ఆలీసెం జెయ్యొద్దు. తెరలెత్తాలి. తొరక్కానీ,’ అని ఎవరో పురమాయిస్తుంటారు. నువ్వు ‘ఇదుగో, ఈ విగ్గొకటీ నిలబడితే యీళ్ళని రంగమ్మీదకొదలొచ్చు,’ అని గిరగిరా గదంతా తిరిగి అందరి వేషాలు బాగొచ్చాయా లేదా అని చూస్తుంటావు. ‘వృథా పోకూడదు. బట్టలుతికిన నీళ్లని ఇలా కాలవ తీసి మొక్కల్లోకి వదలొచ్చు,’ అనే జీవన గొంతు విని నిద్ర లేస్తావు. వాడు వూరోళ్ళెవరికో నీళ్ళవాడకం గురించి చెప్తూ ఉంటాడు. అప్పటికే తెల్లంగా తెల్లారిపోయి ఉంటది. ‘ఈసారి వారానికే వచ్చా ఊర్నించీ?’ అని వాణ్ణడుగుతూ మంచం దిగుతావు.

రాన్రానూ జీవనకి పన్లెక్కువయ్యాయి. స్థిమితంగా ఒక వూర్లో ఉండటం కుదరటల్లేదు. ఇప్పుడు నీకు కుక్కలు, చెట్టుకొమ్మలు మెదలకపోయినా మెలకువొస్తుంటుంది. ఇప్పుడు తెల్లారిపూట కలలూ రాటల్లేదు. పాతమనుషులెవరూ పెద్దగా గుర్తుకీ రారు. పగలంతా గుమ్మంలో కూర్చుని వచ్చిపోయే మనుషుల్ని చూస్తుంటావు. ఎవర్నీ పిలిచి పలకరించాలనేముండదు. వాళ్ళెవరా, ఎందుకటెళ్తన్నారా అన్న ఆరా కూడా ఉండదు. అట్లా చూస్తూ ఉంటావంతే. బాట మీద గులకరాళ్లని, ఎద్దులు నడిచెళ్తే రేగే దుమ్ముని, వానపడినప్పుడు నానిపోయే పాత మట్టిగోడనీ ఊరకనే అట్లా చూస్తూ ఉంటావు.

ఎప్పుడన్నా ఒకసారి నీ ఈడువాళ్ళో, నీ పాత సావాసగాళ్ళో వచ్చి పక్కన కూర్చుంటారు. ‘ఏవన్నా జెప్పూ, ఎంత కష్టం జేశావూ… ఆ వరదొచ్చినేడాది ఒక్కడివే నిట్టాడి నిలబెట్టి, వాసాలేసుకుని, ఈ గూడు నిలబెట్టుకోలా! ఎండాకాలం దొంగలుబడి చెంబూ, తపేలా ఎత్తుకుపోతే నువ్వూ, సుగుణమ్మా కలిసి మళ్ళీ కార్తె నాటికి సామానంతా సమకూర్చుకోలా!’ అని ఎప్పటివో మాటలు చెప్తుంటారు. నువ్వు వాళ్ళమొహంలోకే చూస్తా దీక్షగా వింటుంటావు. చివరికి ‘ఆ? ఏవోఁ! గుర్తు రాటల్లా…’ అని వేరేపక్కకి తిరుగుతావు.

అట్లాంటి నువ్వు మొన్నెవరో వచ్చి ‘తెలిసిందా? పక్కూళ్ళో నాటకవాడతన్నారంట. ఏనాటిదో పాత ఆటంట. మళ్ళీ ఇన్నాళ్లకి ఎవరో ఆడిస్తన్నారు. అప్పుట్లో ఆ నాటకానికి నువ్వు గూడా పనిజేశావంటనే?’ అనడగ్గానే కాళ్లూ చేతులు కూడదీసుకుని మంచంలో లేచి కూర్చున్నావు. ‘అదేనంటావా? ఎప్పుడంటా?’ అనడిగావు.

ఇకంతే, అప్పుణ్ణించీ రెండో ధ్యాస లేదు. రోజులూ గంటలూ లెక్కబెట్టుకోడమే పని. కానీ, కాలం నీకిప్పుడు ‘కూ’మని ముందుకుపోయే రైలుబండి కాదు. నిముషానికోసారి బయల్దేరిన చోటికే గుండ్రంగా తిరిగొచ్చే ఎడ్లబండి చక్రం. ఆ పాతరోజులు గుర్తు తెచ్చుకుంటూ, దారినపోయే వాళ్లని కేకేసి ఏదోకటి చెబుతూనే ఉన్నావు. పాత రేకుపెట్టె తెరిచి మైదాపిండి అట్టగట్టిన కాగితంముక్కని చూసి పదే పదే తడుముకుని మళ్ళీ లోపల పెడ్తున్నావు. తెగిపోయిన చెప్పుకి రెండు టాకాలు వేయించుకుని, అలమర్లో దాచుకున్న తెల్లచొక్కా మడతలు సరిజేసి పెట్టుకుని తయారయావు.

తీరా నాటకమాడే రోజొచ్చింది. తెల్లచొక్కా, కుట్టిన చెప్పులు వేసుకుని చేతికర్ర పోటేసుకొని బయల్దేరావు. మా జీవనా వస్తే చెప్పండని పక్కవాళ్లకి ఓ మాటచెప్పి, వసారాలో నులకమంచం ఎత్తి గోడకి చేరవేసి పొద్దుగుంకక ముందే బయల్దేరావు. ఇల్లు కదిలి, బజారుకెళ్ళి ఎన్నాళ్ళయిందోగానీ ఎక్కడికక్కడే కొత్తగా చూసుకుంటా వెళ్ళావు. ఊరుదాటి పొలాలమీదగా పోతుంటే నీ మాయదారి నీరసం నడవనీదు. గట్టురాయి పక్కన మర్రిమాను మొదట్లో కూలబడ్డావు. అట్లా ఎన్నిగంటలు గడిచిందో, ‘ఓ ముసలయ్యో!’ అనెవరో కుదుపుతుంటే తేరుకుని లేచావు. ‘ఈవరకాడ ఒక్కడివే యాడికెల్దామనొచ్చా?’ అని జాలిగా కసిరి ఏదో బండిలో తీసుకుపోయి నిన్ను పొరుగూర్లో వదిలిపెట్టారు.

తీరా అక్కడికెళ్ళి చూస్తే ఏముంది?

తెరలు దించేశారు. ఇంక నాటకం ఆడేది లేదు పొమ్మన్నారు.

కాళ్ళూ గడ్డాలూ పట్టుకున్నా లాభం లేదని తెలిశాక, పొనీ నువ్వడిగిన నాలుగుమాటలూ చెప్పించుకోవాలన్న భ్రమకొద్దీ వాళ్లనొదలకుండా వాళ్ళ విడిది దగ్గరే జోగుతూ కునికిపాట్లు పడుతున్నావు. చూసీ చూసీ ఏ నడిజాముకో నీకూ కన్నంటింది. నిద్రలో ఎప్పటెప్పటివో సంగతులు కలల్లాగా ఒకదాంతర్వాత వొకటి వచ్చిపోతూ ఉన్నాయి. అంతా ఇప్పుడు జరుగుతున్నట్టే, కళ్లముందున్నట్టే, చప్పుళ్ళు, వాసనలు, మాటలు, అన్నీ.

దిగ్గున లేచావు. తెల్లంగా తెల్లారిపోయుంది. రాత్రంతా పందిరిగుంజ ఒత్తుకుపోయి భుజం నొప్పి చేసింది. చుట్టూరా వెతికావు. అక్కడక్కడా పడేసిన చెత్తాచెదారం, పనికిరాక వదిలేసిన పగిలిపోయిన సామాను తప్ప వేరే వస్తువులు, మనుషులు ఎవరూ కనపడలేదు. నాటకం వాళ్ళు సర్దుకుని తెల్లారగట్టే వెళ్ళిపోయారని తెలిసింది. వాళ్లెళ్తున్నప్పుడు ఆ సందడి కూడా కలలోదే అనుకుని అటుతిరిగి పడుకున్నావేమో, లేదంటే మెలకువొస్తే నువ్వొదలవని వాళ్ళే చప్పుడుకాకుండా వెళ్ళారేమో. దిక్కుతోచని వాడిలాగా అక్కడే చతికిలబడి ఉండిపోయావు. ‘ఇంకేవుంది? యెళ్ళెళ్ళు,’ అని అక్కడ ఊడవడానికొచ్చినామె నిన్ను అదిలిస్తుంది. కాళ్ళు, చేతులూ కూడదీసుకుని కర్రపోటేసుకుని, మనసు దిటవు చేసుకుని నిదానంగా ఆ తెల్లవారి వెలుతురుకి ఎదురుగా నడిచి వెళ్ళిపోతున్నావు.

నువ్వా సందు మలుపు తిరిగే ధ్యాసలో చూసుకోలేదు కానీ, ఆ మూలమీద ఇంటెదురుగా పిల్లాడొకడు, వాళ్ళనాన్న పాతచొక్కాని గుండీలు పెట్టకుండా కోటులాగా వేసుకుని, నడుమ్మీద చెయ్యుంచుకుని ‘ఈ సుఖదుఃఖాల్ని విస్మరించి, శాశ్వతానంద కారకమైన సత్యాన్ని అనువేచించి…’ అని డైలాగు చెప్తున్నాడు. ఆ తమ్ముడు గట్టిగా చప్పట్లు కొడుతూ, ‘అదే, అదే, అంతే అంతే, బలే చెప్పావురా!’ అని నీళ్లమడుగులో చిందులేస్తున్నాడు.
-----------------------------------------------------------
రచన: బండ్లమూడి స్వాతికుమారి, 
ఈమాట సౌజన్యంతో

Monday, December 17, 2018

చీకట్లో సన్మానం


చీకట్లో సన్మానం




సాహితీమిత్రులారా!

చంటిగాడూ, నేనూ చిన్నప్పటినుంచీ నేను అమెరికా వచ్చేదాకా, ఇంచుమించు, కలిసి పాఠాలు నేర్చుకున్నాం, కానీ కలిసి చదువుకో లేదు. ఎందుకంటే వాడు చదివితే, నేను వినేవాణ్ణి. నేను పాఠం చదివితే వాడు ఆకాశం కేసి చూస్తూ పాఠం వినేవాడు. మా combined studies  అలా మూడు సీసాలూ, ఆరు గళాసులుగ మమ్మల్ని ప్రాణ మిత్రుల్ని చేసింది. పైగా నాకూ, వాడికీ నవాబ్‌ ఆఫ్‌ పటౌడీ, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్‌ వి. రంగారావు, రేలంగీ అంటే చాలా ఇష్టం. హిందీ భాష, హిందీ సినిమాలు వగైరాలంటే ఇష్టమున్న తెలుగు వాళ్ళని చూస్తే వాళ్లందరూ దేశద్రోహుల కిందే లెఖ్ఖ. ఆ రోజుల్లో నార్త్‌ ఇండియన్స్‌ అంటే కోస్తా జిల్లా కుర్రకారుల అభిప్రాయం అది.

నాకూ, చంటిగాడికీ ఒక్కటే విషయంలో చిన్నప్పటినుంచి ఏకాభిప్రాయం లేదు. అదే… చీకటి… వాడికి చీకటి అంటే ప్రాణ భయం. ఎప్పుడైనా లైట్లు ఆరిపోతే… అంటే ఆ రోజుల్లో కనీసం ప్రతి రాత్రికీ ఒకటి, రెండు సార్లు అన్నమాట, లైట్లు ఆరిపోగానే వాడు అరక్షణంలో అరవై అడుగులు గాలిలోకి ఎగిరి, క్రింద పడి అదో రకమైన, విచిత్రమైన గావుకేక పెట్టే వాడు. ఆధునిక శాస్త్రజ్ఞులు genetic engineering తో పిల్లి మొహం, కుక్క తోక మరియు అడ్డ గాడిదల గొంతుక కలిసి తయారు చేసిన వింత జంతువు అరుపు అలా ఉంటుంది… వాడి గావు కేక.. నా మటుకు నాకు చీకటి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చంద్రుడు,
నక్షత్రాలు చాలా అందంగా ఉంటాయి. హాయిగా లాహిరి లాహిరి లాహిరిలో పాట, అందాల చందమామ, రావోయి చంద మామ లాంటి సినిమా పాటలు పాడుకోవచ్చు. అప్పటికింకా ప్రేయసితో చీకటిలో వెన్నెల రాత్రుల వెచ్చదనంలో అనుభవం లేదు… ఇప్పటి సంగతి చెప్పను గాక చెప్పను.

పెళ్ళాం, పిల్లలతో ఇండియా వెళ్ళడం ఈ జన్మకి ఇక కుదరదని నిశ్చయం చేసుకొని, అమ్మని చూడాలని అనిపించి, ఇండియా బయలు దేరాను. R. R. Travel  అధినేత రాణి గారి ధర్మమా అని తక్కువ ఖరీదులో టిక్కెట్టు కొనుక్కొని చెన్నై  air port లో అర్ధరాత్రి దిగాను. ఇది వరకు Bombay, Madras  అనే పేర్లు ఉన్నప్పుడు, అన్నప్పుడు, ఏదో అసలు సిసలు ఇంగ్లీషువాడు, లేదా అమెరికా వాడిలా మాట్లాడుతున్న ఫీలింగు ఉండేది. ఇప్పుడు ముంబై, చెన్నై అంటుంటే త్తౖతె, ధ్తిౖతె అంటున్న బృహన్నలలాటి dance మాస్టారులా వంకర టింకర తిరిగిపోతున్న ఫీలింగు వస్తోంది. సరే… చెన్న పట్నం అదే Madras , అదే చెన్నైలో దిగి … రెండు డజన్ల ఇడ్లీలు, మూడు బాల్చీలు సాంబారు కొట్టేసి, ఒక విపరీతమైన express  రైలు, కోణార్కో, కోరమాండలో, ఏదైతేనేం అందులో సామర్లకోట జంక్షన్‌లో దిగాను. మా ఊరు కాకినాడ. రైలు ఆగగానే సామర్లకోట platform  మీద కోలాహలం చూసి ఎవరో మినిస్టర్‌ గారి బావమరది దిగుతున్నాడో, ఎక్కుతున్నాడో అనుకున్నాను. కానీ, ఆశ్చర్యం ఏమిటంటే, ఆ కోలాహలం జనాభా ఇంచుమించు వంద మందిలో పదిమంది మా కుటుంబం వాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ దండలూ, డప్పులూ, నమస్కార బాణాలు,సాష్ట్టాంగ ప్రణామాలు లాటి సరంజామా పట్టుకున్న జనం. ఆ జనంలో నాకు ఎవ్వళ్ళూ తెలీదు. నా మొహంచూడగానే, మా బంధువుల్ని పక్కకి లాగేసి ” ఆహా! హ్యూస్టన్‌ రాజుగారూ, ఓహో,  హ్యూస్టన్‌ రాజుగారూ” అంటూ నన్నూ, నా సామాన్లనీ ఆ రైలు ఆగే అర క్షణంలో platform మీదకి ఎంతో మర్యాదగా విసిరేశారు…. చెప్పొద్దూ… నాకు అర్జెంటుగా “నేను NTR  లాంటి వాణ్ణి జనాలకి, అంటే అందరకీ NTR తెలుసు, కానీ NTR కి వాళ్ళెవరూ తెలియదు” లాంటి feelings  అన్నమాట అలాంటి feeling వచ్చేసింది. ఎప్పటి లాగానే శివరాం కూడా station కి వచ్చి, మా అందరితోటీ ఇంటికొచ్చాడు.

రైలు స్టేషన్‌ నించి ఇంటికి వెళ్ళి అందరితోటీ కులాసాగా మాట్లాడుతుండగా ఫోన్‌ మోగింది. ఇంత సేపూ అలా స్టేషన్‌కి వచ్చి ఎంతో ప్రేమగా పలకరించి స్వాగతం చెప్పిన వాళ్లంతా ఎవరూ, అసలు నేను గానీ, నేను వస్తున్నట్టుగానీ ఎలా తెలుసు అని అమ్మని, మిగిలిన వాళ్లనీ అడగబోతున్న నేను ఫోన్‌ తీసుకొన్నాను.  ” ఇంకా పూర్తిగా వచ్చావో లేదో అప్పుడే వెధవ ఫ్రెండ్స్‌.. ఒక్క క్షణం మాట్లాడుకోనివ్వరు” అని విసుక్కుంటూ ఫోన్‌ నాకు ఇచ్చింది అమ్మ.

” నమస్కారం సార్‌”
“నమస్కారం, ఎవరండీ”
“నేనూ, ఆచారినండీ”
“ఏ ఆచారండీ”
“చిన్నప్పుడు మీ వెనకాల వీధిలో ఉండే వాణ్ణండీ, ఇప్పుడూ అక్కడే లెండి. మీరు inter college cricket  టొర్నమెంట్‌లో రంగరాయ మెడికల్‌ కాలేజీలో ఆడిన match లో half-century  కొట్టినపుడు తప్పట్లు కొడుతూ, హుర్రే, హుర్రే అని అరిచిన వాడిని నేనే … మీకు జ్ఞాపకం ఉందో లేదో”
” ఆ! ఆచారి గారా! ఓహో! అంటే ఏ ఆచారి గారూ?” అన్నాను ఎక్కడా tube light  వెలక్క.
“అదేనండీ పొట్టి శ్రీరాములు గారు సత్యాగ్రహం చేసి పోయినపుడు మీ వీధి గోడమీద కాలేజీ కుర్రాళ్ళు strike  చేస్తూ సి. ఆర్‌ చావాలి అని మద్రాసు ముఖ్య మంత్రి సి. రాజగోపాలాచారి గారి గురించి బొగ్గుతో రాస్తే అది మీ గురించే అంటే మీ పేరు కూడా సి.ఆర్‌ అంటే చిట్టెన్‌ రాజు కదా… అది మీ గురించే అనుకొని వారం రోజులు భోజనం మానేశారు, జ్ఞాపకం ఉందా… అప్పుడు నేను కూడా మీతో బాటు పస్తులు ఉన్నాను..”
” ఆ! అవునవును.. జ్ఞాపకం వస్తోంది.. అదే . ఇప్పుడే కదా నాలుగు రోజులు ప్రయాణం చేసి వచ్చానూ.. కొంచెం జెట్‌లాగ్‌ మూలాన” అన్నాను. నా గురించి ఇన్ని వివరాలు తెలిసిన ఆచారి మొహం ఎలా ఉంటుందో అని ఊహించుకోటానికి విశ్వ ప్రయత్నం చేస్తూ.
“… అదే లెండి మీకెలా జ్ఞాపకం ఉంటుందీ. అమెరికాలో అన్నేళ్ళనుంచి ఉంటూ, మీరు మన దేశానికి, సంస్కృతికి ఎంతో సేవ చేస్తున్నారు కదా… అందుకు మీకు పెర్సనల్‌గా thanks  చెబ్దామని పిలుస్తున్నాను.” అన్నాడు ఆచారి.
” ఓ.. అలాగా, చాలా thanks  అండీ…” అన్నాను మొహం వెధవలా పెట్టి… ఎందుకంటే అసలు ఆచారి ఎవడో, నా చిన్నప్పటి సంగతులు అంతగా తెలిసిన వాడు నా కెందుకు జ్ఞాపకం రావడం లేదో… అంతకన్నా ముఖ్యం మా ఇంటా వంటా లేని దేశసేవ, సాంస్కృతిక సేవా లాటి యూస్‌లెస్‌ పనులు నేను అమెరికాలో చెయ్యడం ఏమిటో తలా,తోకా తెలియక…
” అవునండీ… అందుకే… మీకు కృతజ్ఞతా పూర్వకంగా అందరం కలసి ఇవాళ రాత్రి మీకు ఒక చిన్న సన్మానం… చిన్న ఏమిటిలెండి… పెద్ద సన్మానమే తల పెట్టాం”
” నాకా, సన్మానమా… అంటే” …. నాకు గొంతు గట్టిగా పెగలలేదు కాని… కళ్ళు పెద్దవయ్యాయి. ఇందాకా అనుకోకుండా పెట్టిన వెధవ మొహం రేలంగి జోకులకి నవ్వుతున్న మొహంలా మారి పోయింది, కాలరు నిక్క బొడుచుకొంది… ఆచారి మీద అభిమానం పుట్టుకొచ్చింది….  ఎంతయినా సన్మానం కదా!
” ఏమిట్రా, ఇంకా ఇంట్లో పూర్తిగా కాలు పెట్టలేదు … అప్పుడే ఆ వెధవ ఎవడో సాయంత్రం రమ్మంటే ఇప్పుడే వెళ్ళేలా ఉన్నావే నీ మొహం చూస్తేనూ” అంటోంది అమ్మ చీపురు కట్టకోసం వెతుకుతూ.
” ఆ, అలాగే తప్పకుండానూ… ఎన్నింటికీ? ఎక్కడా?” అడిగాను.. వెనకాల అమ్మ తిడుతున్న తిట్లు అప్పుడే మూడు పేజీలు దాటి పోయాయి.
” అలాగే ఆచారి గారూ! సాయంత్రం ఏడు గంటలకి రెడీగా ఉంటాను మీరు వస్తానంటే” అంటూన్న నా చేతిలోంచి ఫోన్‌ ఠప్పున లాగేసుకొని.. “ఆచారీ! నేను శివరాంని… వీణ్ణి నేను నా కారులో తీసుకొస్తాను.. మీరు రావక్కర్లేదు” అని ఇంకా ఠప్పున ఫోన్‌ పెట్టేశాడు శివరాం.
” నువ్వు ఉట్టి వెర్రి వెధవ్విరా! దేశ కాల పరిస్థితులు ఎంతమాత్రం తెలియవు” అన్నాడు నన్ను చూసి జాలిగా నవ్వి… గత అరగంటనించీ నా ఫోన్‌ రామాయణం, మా అమ్మ భారతం పూర్తిగా విన్న శివరాం.

నేను సన్మానం కోసమని ప్రత్యేకంగా కాస్త ఎక్కువ పౌడరు, సెంటూ వగైరాలు రాసుకొని అన్నట్టుగానే శివరాం కారులో ఆచారి గారి ఆడిటోరియం చేరుకొన్నాం. గోగినేని చౌదరి మరియు చౌదరీ మణి గారు కట్టించిన వేదిక మీద నాలుగు భోజరాజు సింహాసనాలు,పొడుగాటి బల్ల మీద తెల్ల దుప్పటీ, దానికి చుట్టూ బంగారు అంచు, అగరొత్తులు వగైరా సన్మాన సామాగ్రి … నేనూ, శివరాం వెళ్ళగానే అర్జంటుగావచ్చి నన్ను కావలించుకొని, శివరాంని కారు డ్రైవరుని చూచినట్టుగా చూసిన ఆసామీ ఆచారి అని తెలిసిపోయింది. ఆ మేష్టారి చిన్నప్పటి మొహంకాని, ఇప్పటి ముసలి మొహం కాని ఎక్కడా చూసిన జ్ఞాపకం లేదు… సరే!

ఎవడైతేనేం సన్మానం జరిపిస్తున్నాడుకదా … అనుకొంటూండగానే తండోప తండాలుగా జనం, కిళ్ళీలు నవుల్తూ, సిగరెట్లు, బీడీలు కాల్చుకొంటూ వాళ్ళ తాలూకు ఆడంగుల్తో మొత్తం మూడు వందల మంది వచ్చి నాకు నమస్కారం తగలేసి ఎవరి కుర్చీ వాళ్ళు వేసుకొని కూర్చొన్నారు. అర్జంటుగా ఒక ఆడ అనాచారి …  ఆచారి భార్య అనుకొంటాను … మైకు ముందుకు వెళ్ళి నన్నూ, స్థానిక అసెంబ్లీ సుభ్యుడు గారినీ, జిల్లా కలెక్టరి గారిని represent  చేస్తూ వారి పి. యే. ని … ఇలా అందరినీ వేదిక మీదకి ఆహ్వానించారు. నాకు ఒక్కడికీ N.T.R. కి వేసే పెద్ద పెద్ద బంతి పూవులు, మల్లె పూవులు, కనకాంబరాలు గుచ్చిన ఆరడుగుల బరువైన దండ, మిగిలిన వారికి బావుండదని పుష్ప గుచ్ఛాలు సమర్పించారు … నేను మహదానందపడుతూ హాలు చుట్టూ చూశాను. గోడలమీద చిన్న దేవుడి ఫొటోలు, వాటికి మధ్యలో పెద్ద పెద్ద అక్షరాలతో దాతల పేర్లు, వాళ్ళిచ్చిన విరాళాల మొత్తం కనబడుతున్నాయి. ఆ పేర్లలో చౌదరి, రెడ్డి నాయుడు, గుప్తా, శెట్టి వగైరా పేర్లు కనపడ్డాయి కాని ఎక్కడా శాస్త్రి, శర్మ, దీక్షితులు కనపడ లేదు. మొట్ట మొదటి వరసలో కూర్చున్న శివరాం నాకేసి జాలిగా చూస్తున్నాడు. అసెంబ్లీ సభ్యుడు గారు ప్రసంగం మొదలు పెట్టి, హఠాత్తుగా నా పేరు తెలియక తడబడుతుంటే హ్యూస్టన్‌ రాజు గారు,ఎన్నారై, అమెరికా అని అనాచారి, ఆచారి  నేను వినడం లేదనుకొని ఆయనకి నా క్వాలిఫికేషన్సు అర్జెంటుగా వివరించారు. ఆయన పుంజుకొని అమెరికా సామ్రాజ్యానికి మహా రాజువి, చక్రవర్తివీ, హ్యూస్టన్‌కి సామంతుడివీ అని నన్ను పొగిడి … మహా దాతలైన బలి, కర్ణుడూ మొదలైన పురాణ పురుషులతో నన్ను పోల్చి సభకి విశదీకరించారు. ఈ పోర్షను, సంభాషణలూ ఆయనకి చాలా బ్రహ్మండంగా వచ్చాయి సుమా అని అనిపించి నా తలకాయలో “విరాళం సుమా!” అన్న మాట వెల్గగానే శివరాం కేసి చూసాను. వాడింకా అలాగే నవ్వుతున్నాడు. ఇంతలో హఠాత్తుగా హాలు వెనకాల ఒక మూల నుంచి పెద్ద చప్పుడు, గావు కేక  నాకు కర్ణాకర్ణిగా వినపడింది, అసెంబ్లీ సభ్యుడు గారు మైకు ఆగిపోగానే ఆటోమేటిక్‌గా గొంతుక  సౌన్డ్‌ లెవెల్‌ విపరీతంగా పెంచెయ్యడంతో.

” మధ్యలో ఈయనొకడు, ప్రాణం తీస్తున్నాడు కరెంటు పోయినప్పుడల్లా” అని ఎవరో విసుక్కొన్నారు ఆ చీకట్లో ..
నేను లేవబోతుంటే కలెక్టర్‌ గారి పి. యే. గారి భారీ హస్తం, ఆచారి, అనాచారి వాళ్ళ అవయవాలు .. ఏ అవయవాలో తెలియలేదు ఆ చీకట్లో .. నా శరీరం మీద పడి నన్ను లేవనీయకుండా చేశాయి … ఆడియన్సు కాని, ఆహ్వానితులు కాని ఏమీ జరగ నట్టుగానే సన్మాన కార్యక్రమం కొన సాగించారు. అర్జెంటుగా నాలుగు పెట్రుమాక్సు లైట్లు వెలిగించి.

ఆచారి కాలయాపన చెయ్యకుండా విజృంభించి, ఎంత విరాళానికి ఎంత పుణ్యమో విశదీకరిస్తూ కేవలం పాతికవేల రూపాయలకి మా తండ్రిగారి ఆత్మ పూర్తిగా శాంతిస్తుందని పురాణాల్లో రాసి ఉందని నాలుగు
సంస్కృతంలో శ్లోకాలు చదివి, తెలుగులోనూ, నాకు అర్ధం అవలేదేమో అని తెలుగుఇంగ్లీషులోనూ వివరించారు. మా తండ్రిగారు చనిపోయి 15 సంవత్సరాలు అయింది. నా పాతికవేల విరాళం గురించి మా నాన్నగారు ఇంకా కాసుక్కూర్చొన్నారని వినగానే నాకు విరాళం tubelight  మళ్ళీ వెలిగింది, నేను మళ్ళీ లేవబోతుండగా. అనాచారిగారు … అంటే ఇందాకటి ఆచారి గారి భార్య, ఎంతో విలాసంగా, ప్రేమ పూరితమైన కళ్ళతో … ఆచారి మీద కాదు ఆ విరహం, విరాళ దాహంతో … నా మీద, సౌందర్య చిరంజీవికేసి నిజంగానూ, మోహిని భస్మాసురుడు కేసి అబద్ధంగానూ చూసినట్టు చూస్తూ, పైలెట్‌ పెన్ను మూత తీసి, నాకేసి రాబోతుండగా చూశాను. అప్రయత్నంగా, దైవ ప్రేరణ వలన నా రెండు అరి చేతులూ చొక్కా జేబూ, పంట్లాం వెనకాల జేబు కేసి పారిపోయి, నా చెక్కు బుక్కుగాని, వాలెట్‌ గాని ఎవరికీ కనబడకుండా గట్టిగా నొక్కేసాయి.

ఆ చీకట్లో నాకు జ్ఞానోదయం అయ్యేటప్పటికి శివరాం గాడు వాన చినుకుల్లో నకులుడిలా నన్ను ఆచారి, అనాచారి, అసెంబ్లీ సభ్యుడు, కలెక్టర్‌ పి. యే. మరియు మూడు వందల మంది కిళ్ళీ, సిగరెట్‌ బీడీ వాళ్ళ మధ్య నుంచి వాడి get-away  కారులోకి తోసేసి సన్మాన రక్షక భటుడి బిరుదు సంపాయించాడు.
” ఏమిటి గురూ, ఇదంతానూ … What is this garbage ” అన్నాను శివరాంతో ఇంటికొస్తూ దారిలో.
“ఏమిటేమిట్రా, నీ తలకాయ. నిరుద్యోగ సమస్య తీరడానికి మన వాళ్ళు మొదలు పెట్టిన మరో పద్ధతి. చిన్నదో, పెద్దదో సంఘసేవకి, సాహిత్య సేవకో, దీనికో, దానికో ఒక సంఘం పెట్టడం, దాన్ని నడపడానికి, తమ కుటుంబం నడవడానికి డబ్బుకోసం, విరాళాలు పోగు చెయ్యడం … ముఖ్యంగా నీ బోటి ఎన్నారై గాళ్ళ దగ్గర్నుంచి …”

” ఆ పోదూ, నువ్వు మరీనూ ఆచారీ వాళ్ళూ ఏమీ చెయ్యకపోతే అంతమంది జనం, అసెంబ్లీ సభ్యుడూ అందరూ వస్తారేమిటి?  … అది సరే నా గురించి వాళ్ళకి అన్ని వివరాలు ఎలా తెలిసాయి చెప్మా” … నా మనసులో ఇంకా ఆశ చావ లేదు. నేను నిజంగా గొప్పవాణ్ణి కాబట్టి నాకు వాళ్ళు సన్మానం ఏర్పాటు చేశారని …

” దాని కేముంది, నువ్వు మమ్మల్ని విరాళం అడక్కుండా ఉంటే … మీరు ఎన్నారైల దగ్గర్నుంచి డొనేషన్‌ల కోసం ఏర్పాటు చేసే అన్ని సన్మాన సభలకు వచ్చి తప్పట్లు కొడతాం అని కిళ్ళీ, సిగరెట్‌ గాళ్ళూ, ఏడ్చేదాని మొగుడు వస్తే నా మొగుడూ వస్తాడని అసెంబ్లీ సభ్యుడూ వగైరాలూ ఆచారి, వాడి బాసుతో చేసుకొన్న లోపాయకారీ ఒప్పందం ” శివరాం విశదీకరించాడు.

” కానీ … ఈ ఆచారిగాడు ఎవరో నాకు చచ్చినా జ్ఞాపకం రావడం లేదు … చిన్నప్పటి friend  అంటాడు … కానీ ఏమండీ, సార్‌ అని పిలుస్తాడు …  I still do not understand what is going on … ”
ఇది వినగానే శివరాం వికటాట్టహాసం చేశాడు.
“ఏమిట్రా వెధవా! ఏమిటా నవ్వు, చెప్పి చావు ” అన్నాను.
” ఆ ఆచారి గాడికి నువ్వు ఎవరో అస్సలు తెలియదు. నువ్వు, నాకు తెలిసి వాడి మొహం ఎప్పుడూ చూడాలేదు.”
” … మరి వాడు నా గురించి అంతా తెలిసున్నట్టు మాట్లాడుతున్నాడే?”
” వాడికి, అంటే ఆచారికి, నీ information  అంతా వాడి దగ్గర్నుంచి వచ్చింది ” అంటుండగా
” వెర్రి నాయనా! సన్మానం మధ్యలో కరెంటు పోయినప్పుడు ” శివరాం గుంభనంగా అన్నాడు.

నా బుర్ర అద్భుతంగా అర్జంటుగా వెయ్యివాట్ల బల్బులా వెలిగింది  …
“అవున్రా, ఆ చప్పుడు, ఆ విచిత్రమైన గావుకేక …. వాడే”
” ఈ తతంగానికీ, ఈ సంఘానికీ, ఈ సన్మానానికీ మూలపురుషుడు … వాడే … వాడే చాణుక్యుడు … చీకట్లో కూడా నన్ను సన్మానించిన అస్మదీయుడు … ఆప్తమిత్రుడు ” స్వయానా నా మేనత్త కొడుకు …. సామర్లకోట స్టేషన్‌కి, దండలూ వగైరాలు పట్టుకొచ్చిన వాళ్ళందరూ  అస్మదీయులు … పుణ్యం, పురుషార్ధం దక్కే గౌరవప్రదమైన ఉద్యోగస్తుడు వాడు.

“ఏదిరా వాళ్ళు వేసిన దండ పట్టుకు రాలేదేం? ఇంట్లో అందరికీ తల్లో పూలు వచ్చేవి.” అంది అమ్మ. చెవిలో పూవు అనే మాటకి అమ్మకి అర్ధం తెలియదు.

సంగతి అంతా విని ” అదా సంగతి. మొన్ననే చంటి వచ్చి, నువ్వెప్పుడు వస్తున్నావు, ఏమిటి అని అన్ని వివరాలు అడిగాడు. ఇందుకా … నీ దగ్గర విరాళం కోసం అని చెప్తే నేనే చెప్పేదాన్నిగా. నువ్వూ, మన శర్మలూ, శాస్త్రులు గాళ్ళందరికీ యుగ యుగాల నుంచీ పుచ్చుకోడమే గానీ ఇవ్వటం ఇంటా వంటా లేదని” అంది అమ్మ డబ్భై సంవత్సరాల అనుభవంతో … అందులోనూ నువ్వు మరీ కక్కుర్తి వెధవ్వి … అని ఇంకా ఏదో అనబోతుంటే లైట్లు వెలిగాయి… అమ్మ నాకు చేసే సన్మానం ఎప్పుడూ వెలుగులోనే…
-----------------------------------------------------------
రచన: వంగూరి చిట్టెన్‌ రాజు, 
ఈమాట సౌజన్యంతో

Sunday, December 16, 2018

క్లబ్బులో చెట్టు కథ


క్లబ్బులో చెట్టు కథ




సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి.......

క్లబ్బులో చెట్టు కొట్టేశారని రెడ్డి మేష్టారు రాజు గారింట్లో చెప్పంగానే, నా కుడిచెయ్యి కొట్టేసినట్టనిపించింది.  కుడి చేతిలో స్కాచ్‌ గ్లాసు జారిపోతుందేమోనని భయపడి, గట్టిగా ఎడమచేత్తో వత్తి పట్టుకున్నా బాలాజీ గుడిలో పూజారి మంత్రపుష్పం చెప్పేప్పుడు పెట్టే  నమస్కారంలాగా!

..

మా తాత అంటూవుండేవాడు. “చెట్టు కొట్టేసినవాడి చెయ్యి కొట్టమన్నాడోయ్‌ నైజాము నవాబు! అదీ రాచరికం, పరిపాలన అంటే.” తాతయ్యది ఖమ్మం జిల్లాలో బేతుపల్లి గంగారం. రజాకార్లు ఆయన గుర్రానికి చెవులూ తోకా కోసి పారేసిన తరువాత కూడా నైజాము నవాబుని ఎంతమంది ఎప్పుడు ఎంత తిట్టినా అసహ్యించుకున్నా(ఆ విషయంలో మా నాన్నది అగ్ర తాంబూలమే!), చెట్లు నరికేయడం అన్న కసాయి ప్రసక్తి వస్తే, నవాబుని తెగ పొగిడే వాడు! నవాబు గారన్నది నిజమే అయితే, ఆ వొక్క విషయంలో అతగాడిని పొగడక తప్పదు!

..

“ఎందుచేత చెట్టు కొట్టేశారు? పుచ్చిపోయిందా, పురుగు పడ్డదా?” అని అడగంగానే, రాజుగారు “అబ్బో! అది చాల పెద్ద కథ, రెడ్డి గారినే చెప్పనీయండి,” అంటూ, రాజ దర్పం చూపించారు.

..

నా బుర్ర గింగుర్లు తిరిగి, నన్ను  నాలుగున్నర దశాబ్దాలు వెనక్కి పంపించింది. ఆ నాటి అనుభవాలు ఎన్నో ఒక్కటొక్కటే గుర్తుకు రావడం మొదలయ్యాయి.

క్లబ్బులో చెట్టు, మాకు తెలిసేటప్పటికే కనీసం నలభై  అడుగుల ఎ్తౖతెన పెద్ద మాను. క్లబ్బు రెండో అంతస్థు పైన ఇంకో పది అడుగుల ఎత్తుండి పైన పెద్ద స్టేకు పేకాట వాళ్ళకి చల్లగా గాలి విసిరేది. అప్పుడప్పుడు, చీకట్లో దారి తప్పిన పిట్టల కిలకిలలు వినిపించేవి.

క్లబ్బులో చెట్టు  నిద్రగన్నేరు చెట్టు. బ్రహ్మ సృష్ఠి పొట్టి గన్నేరని, నిద్రగన్నేరు విశ్వామిత్ర సృష్ఠి అనీ అనే వాడు మామేనత్తగారి భర్త. ఆయన  ప్రవరలో విశ్వామిత్రుడు ఒక ఋషిగాబట్టి అల్లా గొప్ప చెప్పుకున్నాడు కానీ, నన్నడిగితే, నిద్రగన్నేరే బ్రహ్మ సృష్టి అని ఢంకా బజాయించి చెప్పగలను. అంత గొప్ప చెట్టు  విశ్వామిత్రుడు సృష్టించలేడు. చూడరాదూ! వేపచెట్టుకీ, కరివేపచెట్టుకీ భేదం! కరివేపచెట్టు విశ్వామిత్ర సృష్ఠేకదా మరి! హుందాతనంలో కరివేపచెట్టుని వేపచెట్టుతో పోల్చగలరా!

క్లబ్బులో చెట్టు కొట్టేసేటప్పటిికి,  ఆ చెట్టుకి కనీసం డెబ్భై ఐదు ఏళ్ళైనా వుండి వుండాలి. అది క్లబ్బుకన్నా ముందే పుట్టింది. మరి ఏ “సుందరి విత్తనం చేతనుంచి పలక్కండా వెళ్ళిపోయిందో,” తెలియదు. ఇప్పుడు,  “ఆమెను వెతుక్కుంటూ, యోజనాలు నడిచి పోవడం,” శుద్ధ అనవసరం! ఆ క్లబ్బు స్థలంలో ఆగ్నేయంగా ఉన్న  నిద్రగన్నేరు చెట్టుని ఆ పళంగా అల్లాగే వుంచి,  క్లబ్బు కట్టారుట! ఆ కట్టించిన పంతులుగారికి నైజాము నవాబు గురించి తెలియడానికి ఆస్కారం లేదు. కానీ, చెట్లంటే ఎడతెగని అభిమానం, ఆప్యాయత  వుండి వుండాలి.

ఎండల్లో ఎర్రగా కుంకుమ రంగు పూలతో విరబూసి, సాయంకాలం అయ్యేటప్పటికి, కాసిని పూల గుత్తులు మాను చుట్టూరా, నేలమీద, హుందాగా తంగెళ్ళమూడి ఉన్ని తివాచీ మీద డిజైనులా విచ్చలవిడిగా పరిచేది “ధరను చొచ్చి, దివిని విచ్చి, విరులు తాల్చు తరువు,” అన్న కవిగారి హృదయంలా! ఆ పూలగుత్తుల్లో పుప్పొడి కొక్కెంలా చిన్న కాడకి పట్టుకొని పచ్చగా బంగారంలా వుండేది. మా చిన్నప్పుడు, ఆ కొక్కెంలావున్న కాడలతో కోడిపందేలాట ఆడుకునే వాళ్ళం.

సాయంకాలం ఐదు కొట్టగానే,  ఆ నిద్రగన్నేరు చెట్టు నీడలో,  క్లబ్బులో పనిచేసే కుర్రాళ్ళు, ఆనవాయితీగా పది పేము కుర్చీలు వేసే వాళ్ళు ఓ చిన్న కాఫీ బల్ల చుట్టూరా. కాఫీ బల్ల మీద ఇంగిలీషు దినపత్రికలు, తెలుగు వార పత్రికలూ, ముఖ్యంగా నెలవారీ వచ్చే భారతి, పడేసే వాళ్ళు. ఆరు గంటలు కొట్టంగానే ఖద్దరు పంచె బిళ్ళగోచీతో  పెద్ద రాజు గారు,  గ్లాస్గో పంచె వారగోచీతో పెద్ద ప్లీడరు గారు, కాలేజీ లెక్కల మేష్టారు, జరీపంచె,జరీకండువా లాయరు  గారు, వైసు ప్రిన్సిపాలు గారు, ఎకనామిక్స్‌ మేష్టారు,  అప్పుడప్పుడు టకప్పు చేసుకోని మా డాక్టరు గారు వచ్చేవాళ్ళు. బోలెడు విశేషాలు, లోకాభిరామాయణం చెప్పేవాళ్ళు. రాజకీయాల వాదోపవాదాలు జరగడం కూడా కద్దు. జరీపంచ లాయరు గారు ఏదో అనవసర ప్రసంగం చేసేవారు.  అంతే! మా లెక్కల మేష్టారు వాదనలోకి దిగి,నిష్కర్షగా ఒకటి, రెండు, మూడు, ఖతం అన్నట్టు ఆఖరి మాట చెప్పేసే వాడు. QED .  అందరూ మాట్లాడకండా వెర్రి మొహాలేసుకొని వినాల్సిందే.  అడపా తడపా, పైసా స్టేకు పేకాటలో ఆట పారేసిన (రమ్మీ లో డ్రాపు అంటారు) మధ్యకారు ప్లీడర్లు మధ్యలో వచ్చి, ఏదో తెలిసినట్టు విసుర్లు వేసి పోయేవాళ్ళు. వెంటనే మాచెవిటి మేష్టారు, కెమెస్త్రీ మేష్టారూ, మెత్త మెత్తగా వాళ్ళకి చివాట్లు పెట్టే వాళ్ళు. పెద్ద రాజు గారు, పెద్ద ప్లీడరు గారు వెళ్ళే వరకూ మేము నోరెత్తకుండా వింటూ కూచునే వాళ్ళం. వాళ్ళు సరిగ్గా ఎనిమిది కొట్టంగానే పంచెల కుచ్చిళ్ళు సర్దుకొని ఇళ్ళకి పోయేవాళ్ళు. అదేదో, గంట కొట్టగానే పాలకోసం పరిగెత్తే పిల్లుల్లా వాళ్ళు వెళ్ళంగానే, మా వాగుడు మొదలెట్టే వాళ్ళం, సిగరెట్లు వెలిగించి.  ఎందుకనో తెలీదు వాళ్ళ ముందు సిగరెట్లు కాల్చే వాళ్ళం కాదు.

ఈ నిద్రగన్నేరు చెట్టు ఎందరో “జనాల మనోగగనంలో చాపుకున్న జ్ఞాపకాల కొమ్మలనీ, గాఢానురాగాల ఊడల్నీ,” వెనక్కి పిలిచి పిలిచి చెపుతున్నట్టుంటుంది.

కవిగారూ! క్షంతవ్యుడిని!!

మా డాక్టరు గారు మమ్మల్ని రమ్మీనుంచి విముక్తులని చేసి, బ్రిడ్జ్‌ ఆటలోకి దింపింది ఈ చెట్టుకిందే! ఆయన్ని ఎవడో హత్య చేసి చాలాకాలం అయ్యింది. కానీ, ఆయన అన్న మాటలు చెవుల్లో ఇంకా రింగు రింగుమని గంటల్లా వెంటాడుతూనే ఉన్నాయి. రమ్మీ ఆడటం ఎందుకు మానేశారండీ అని అడిగితే, ఆయన ఇచ్చిన సమాధానం. “ఏ ఆట అయితేనే! చేతిలో పదమూడు ముక్కలేగా కావలిసింది.  బ్రిడ్జ్‌ లో ఆట పోతుంది కానీ డబ్బులు పోవు; రమ్మీలో ఆటా పోతుంది, దానితో డబ్బులూ పోతాయి. అందుకని బ్రిడ్జ్‌ లో పడ్డా.” అప్పటినుంచీ మేమూ బ్రిడ్జ్‌ ఆటలో పడ్డాం, ఆయనతో పాటూ.

క్లబ్బులో ఎలెక్ట్రీ లైట్లు తెగ పోయేవి. ఈ ఎలక్ట్రీ బాధ  అప్పుడే వుండేది. దానికి తోడు, ఎలక్ట్రీ డిపార్ట్‌ మెంటు ఇంజనీర్లు క్లబ్బులో ఎడతెరపి లేకండా పెద్ద ఎత్తునే పేకాడుకునే వాళ్ళు. వాళ్ళకి తోడు సెంట్రల్‌ ఎక్సైజు ఇనస్పెక్టర్లూ! లైట్లు పోయినప్పుడు, రమ్మీ జనం గొల్లున గోల చేసే వాళ్ళు  క్లబ్బు కుర్రాళ్ళని పెట్రమాక్స్‌ లైట్లు వెలిగించమని.  కొందరైతే, పనిచేసే కుర్రాళ్ళని అడ్డమైన తిట్లూ తిట్టే వాళ్ళు. ఎలెక్ట్రీ డిపార్ట్‌ మెంటు  ఇంజనీర్లని నానా మాటలూ అనే వాళ్ళు. వీళ్ళకి,పారేసిన పేక ముక్కలు చీకట్లో దొంగతనంగా ఎవడన్నా ఎత్తుకుంటాడేమోనని భయం.

అయితే, చెట్టు కింద బ్రిడ్జ్‌ జనానికి ఆబాధలేదు. పైగా, బ్రిడ్జ్‌ ఆట లో సుఖం (కష్టం?) ఏమిటంటే, చేతిలో ముక్కలు, పారేసిన ముక్కలూ అందరికీ గుర్తుండాలి; అలా గుర్తుండేవి! లైట్లు పోయినప్పుడు, ఆ నిద్రగన్నేరు చెట్టు పూలగుత్తులు,”పచ్చటి చీకట్లో మంటేదో ఎర్రగా కదిలి,”  నట్లుండేది. లైట్లు తిరిగి రాగానే,”వంద వాయిద్యాలతో వికసించిన బ్యాండు మేళంలా, అకస్మాత్తుగా చివిరించినట్టు,” గల గల పూలగుత్తులు కురిపించిందా అన్నట్టు ఉండేది.  చెట్లని అనుభవించడం చేతకాని వాళ్ళకి ఆ అనుభవంలో ఆనందం  తెలియదు.
……

రెడ్డి గారు చెప్పుకో పోతున్నారు. నేను వినటల్లేదని, ఎక్కడో గగనవీధిలో ఎగిరి పోతున్నాననీ పసి గట్టి, ” అయ్యా! కాస్త ఓపిగ్గా వినండి. అడిగారుగదా!” అని హెచ్చరించారు. నేను వెంటనే excuse me  అని, మరో రెండు జిగ్గర్ల స్కాచ్‌ ఐసు మీద పోసుకున్నా.

“ఆనందం క్లబ్బు ప్రెసిడెంటు అవడం మీకు తెలుసుగా! అప్పుడు క్లబ్బు వైభవం అంతా ఇంతా కాదు. స్కూటర్లకి షెడ్డు కట్టించారు. పక్కనే మునిసిపాలిటీ వాళ్ళ స్థలం ఆక్రమించి రెండస్తుల మేడ వేశారు. అంతా పేకాట మహిమేననుకోండి. క్లబ్బుకి లక్షల మీద లక్షలు ఆదాయం. ఒక ఐదారేళ్ళు ఏ ప్రెసిడెంటూ గుక్కతిప్పుకోలేక పోయాడు. ఆనందం తర్వాత, ఐదుగురు పెద్దమనుషులు ప్రెసిడెంట్లయ్యారు. ఇఖ ముసలం ఎప్పుడు మొదలయ్యిందీ అని అడగండి?” అంటూ ఆయన మరో విడత స్కాచీ సోడా కలుపుకున్నాడు.

“చెప్పండి! ముసలం మొదలవడమేవిటి?”

“అప్పలరాజు నాయుడు సెక్రటరీ అయ్యాడు. స్కూటర్లు, మోటారు సైకిళ్ళూ క్లబ్బులోకి సరాసరి రావడానికి, చెట్టు మొదలు మినహాయించి మొత్తం మట్టి కనిపించకండా అంతా గచ్చు చేయించాడు. అదెందుకయ్యా అని అడిగితే, చెట్టు కింద మట్టి, వర్షాలొస్తే బురద బురదగా తయారయి, మనుషులూ మోటారు బండ్లూ జారి పడే ప్రమాదం ఉందని గచ్చు చేయించాడుట! విన్నారా వింత! ఇన్నేళ్ళుగా ఎవ్వడూ కాలు జారి చెట్టుకింద మట్టిలో పడలేదు.”
..

నాకు వానొచ్చినప్పుడు చెట్టుకింద కూర్చున్న రోజులు గుర్తుకొచ్చాయి. వాన చినుకులు పడినంతసేపూ, చెట్టుకింద ఒక్క చుక్క కూడా రాలేది కాదు. అలా “హఠాత్తుగా ఒక మేఘం యుద్ధం ప్రకటించినపుడు,” మేము “నెత్తిమీద రుమాళ్ళు వేసికోని పరిగెత్తి తల దాచుకునే,” వాళ్ళం కాదు. వాన తగ్గి, గాలి వీచినప్పుడు మాత్రం, చెప్పకండా, చెయ్యకండా, క్లబ్బులో నిద్రగన్నేరు చెట్టు “తన ప్రైవేటు వానతో తడిపేసేది,  మమ్మల్ని.”

..

“ఏమండోయ్‌ మిమ్మల్నే. వింటున్నారా,” అని ఆయన కసిరే వరకూ ఈ స్పృహ లోకి రాలేదు. రెడ్డి గారు చెప్పుకో పోతున్నారు.

“అసలు వీళ్ళ రోగం ఏమిటంటే,క్లబ్బుకి బాగా డబ్బులొస్తున్నాయిగా! ఎన్నికయిన ప్రతి వాడూ ఏదో పేరుపెట్టుకొని పని చేయించాలి, వాడి హయాంలో! మీకు తెలీదు గానీ, గచ్చు చేయించిన తర్వాత, చెట్టు కింద కూర్చోడం మహ కష్టంగా ఉండేది. ఎండల్లో చచ్చే వేడి. నిద్రగన్నేరు పూలు కూడా పడటం తగ్గింది; చుట్టూ గచ్చు చెయ్యడం మూలంగానో  ఏమో మరి!

ఒక రోజున అప్పలరాజు నాయుడు తిన్నగా క్లబ్బులోపలికి స్కూటర్‌ మీదొచ్చి, చెట్టు పక్కనే దభేలుమని పడ్డాడు. ఎడమ కాలు విరిగింది. పుర్రచెయ్యి అదే! వాడు పేక ముక్కలు పట్టుకునే చెయ్యి ముంజేతి కణుపు దగ్గిర బెణికింది. అప్పటి పెద్ద ఘటాల్లో చాలామంది పోయారు. బాగా వయసు మీరిన వాళ్ళు క్లబ్బుకి రావడం మానేశారు. ఇప్పుడు, చెట్టు కింద కూచునే జనం, ఎవ్వరూ లేరు, నేను, ఈ రాజుగారూ తప్ప. అడపా తడప, గాడిదాట సుబ్బయ్య గారున్నూ! ముత్యంగా మూడు కుర్చీలుకూడా వేసేవాళ్ళు కాదు. సెక్రటరీ అప్పలరాజు నాయుడు పడ్డప్పుడు మేము లేము. క్లబ్బు కుర్రాళ్ళు చెప్పగా వినడమే!

అప్పలరాజు నాయుడు చెట్టుపక్కన పడంగానే, మా రెడ్డిశాస్తుర్లు ఊరుకోకుండా, “నే చెప్పలా! ఆగ్నేయంగా చెట్టు అనర్థం అని. ఇవాళ అప్పలరాజు నాయుడు పడ్డాడు. రేపు, ప్రెసిడెంటు కోదండం గారికే ముప్పు రావచ్చు,” అని, ఆరు డ్రాపుల తరువాత, రెండు సీసాల బ్రాందీ పట్టించి, తన  మిడి మిడి వాస్తు జ్ఞానం  మళ్ళీ ప్రదర్శించాడు.

ఈ వాగుడు ఎవడో కోదండం గారికి చెప్పాడు. ఆయన ఇద్దరు సాయి బాబాల భక్తుడు. చాలా పెద్ద స్టేకు పెట్టి పేకాట ఆడతాడు. ఆయన వెంటనే, తణుకునించి ఆంజనేయులు శాస్త్రి గార్ని వెంటనే రమ్మని క్లబ్బునుంచే ఫోను చేశాట్ట! ఆంజనేయులు శాస్త్రి  మరుసటి రోజునే గురవయ్య చౌదరి గారిని వెంటపెట్టు కోని క్లబ్బు కొచ్చేశాడు.”

“వీళ్ళెవళ్ళు?  క్లబ్బుతో వీళ్ళకేమిసంబంధం?” అని అడిగా. రెడ్డి గారు మరో పెగ్గు స్కాచ్‌ లో సోడా కలిపి, మొదలెట్టారు. ” మీకు తెలియదు. ఈ జిల్లాలో వాళ్ళిద్దరూ వాస్తు బ్రహ్మలు. అప్పలరాజు నాయుడు చెట్టు చుట్టూ గచ్చు చేయించేటప్పుడు, వాళ్ళని సంప్రదించ లేదని, గురవయ్య చౌదరి గారు మండి పడ్డాడట.

ఇంతకన్నా ముందు ఇంకొకటి చెప్పాలి. అసలు, కోదండం వైసు ప్రెసిడెంటుగా నెగ్గాడు. అప్పల రాజు నాయుడు బావ జోగయ్య నాయుడు ప్రెసిడెంటు అయిన మూడో రోజునో, నాలుగో రోజునో, ఆయనకి హఠాత్తుగా క్లబ్బులో గుండె నెప్పి వచ్చింది. జోగయ్య నాయుడిని చిన్న కార్లో హుటాహుటిన హైదరాబాదు తీసుకోపోయారు. ఆయన ఇంకా కోలుకోలేదు; మంచం మీదే వున్నాడు. ఆయన చేత బలవంతంగా రాజీనామా చేయించారు. ఆయనకి, గురవయ్య చౌదరి చెప్పాడుట. గచ్చు చేసినప్పుడు, దక్షిణం వేపు ఉత్తరం వేపుకన్నా ఎత్తు ఎక్కువయ్యిందిట. అది క్లబ్బు పెద్ద ఎవడైౖతే వాడికి హానిట. మరి, క్లబ్బు పెద్ద అంటే, ప్రెసిడెంటేగదా! అందుకే, కోదండం గారికి హృద్రోగం వచ్చిందిట. అది విని, కోదండం అప్పలరాజు నాయుడి మీద కత్తులు నూరుతున్నాడట. లేచే ఓపిక లేదుగానీ, అప్పలరాజు నాయుడిని నరికిపారెయ్యాలి, అంటున్నాడుట!

ఏది ఏమయితేనే! వాస్తు బ్రహ్మలు, ఆంజనేయ శాస్త్రి, గురవయ్య చౌదరీ, ఇద్దరూ వచ్చారు. విరుగుడు మంత్రం చెప్పారు, నిద్రగన్నేరు చెట్టు కొట్టెయ్యమని. ఈ చెట్టు ఇక్కడ వుంటే, క్లబ్బుకి ఇంకా బోలెడు అనర్థాలు వస్తాయి అని నొక్కి చెప్పి, క్లబ్బు డబ్బు పది వేల రూపాయలు భరణం తీసుకోని మర్నాడే తణుకు వెళ్ళిపోయారు.

మరుసటి ఆదివారం పొద్దున్నే, నిద్రగన్నేరు చెట్టు అప్పలరాజు నాయుడు దగ్గిర ఉండి  మరీ నరికించాడు. ఇదీ, నిరిటి వరకూ జరిగిన భాగవతం; క్లబ్బులో నిద్రగన్నేరు చెట్టు కథ.”

“మరయితే, ఇప్పుడు క్లబ్బు బాగా నడుస్తున్నదా?” అని అడిగా. రెడ్డిగారు, మందహాసం చేసి, “మళ్ళీ వచ్చే ఏడు మీరు ఏలూరు రాకముందే, క్లబ్బు దివాలా తీస్తుంది. పేకాట పూర్తిగా పడిపోయింది. దొంగ తాగుడు బాగా పెరిగింది. ప్రస్తుతం ఇప్పుడు, క్లబ్బుకి, ఎలక్ట్రీ బిల్లు కట్టడానికి కూడా డబ్బులు లేవు. పేకాట ఉంటేకదా, డబ్బులొచ్చేది! పీడా వదిలి పోతుంది లెండి, తథాస్తు” అంటూ  రెడ్డి మేష్టారు కథ ముగించారు.

..

“క్షుద్ర గృహాలకి (గ్రహాలకి!) అతీతంగా ఎదిగిన,”  డెబ్భై ఐదేళ్ళ నిద్రగన్నేరు చెట్టు కొట్టేసారు. ఇప్పుడు “చిగిర్చే చెట్టు” లేదు. చీకట్లో దారి తప్పి”ఎగిరే పిట్టలు” లేవు.

“చిలకలు వాలిన చెట్టు లోతైన కావ్యం లాంటిది,” ట! అది ఎందరికి తెలుసు?
-----------------------------------------------------------
రచన: వేలూరి వేంకటేశ్వర రావు, 
ఈమాట సౌజన్యంతో

Saturday, December 15, 2018

ఒక మరిచిపోలేని వాక్యం


ఒక మరిచిపోలేని వాక్యం




సాహితీమిత్రులారా!

He was suddenly reminded of girls in white gowns with blue sashes around trim waists, broad rimmed hats pinned to high-piled curls, who played tennis and strolled on cropped green lawns and laughed lightheartedly in the summer of 1914, then disappeared forever.

ఈ వాక్యం నేను 2002లో అనుకోకుండా కొని చదివిన ఒక మిస్టరీ పుస్తకంలోనిది. ఇన్నేళ్లకీ నన్ను వెంటాడుతూనే ఉంది.

ఒకసారి, నేను పిల్లలతో ఆన్ ఆర్బర్ వెళ్ళాను. ఆ ఊరు నిండా పుస్తకాల షాపులు. అక్కడ ఆంట్ అగాథాస్ బుక్ స్టోర్ (Aunt Agatha’s, అగాథా క్రిస్టీ పేరు మీద పెట్టినది) అని ఒక షాపు ఉంది. ఆ షాపుకి వెళ్లి పుస్తకాలు చూస్తుంటే అక్కడ పనిచేసే కుర్రవాడు సహాయం చేయచూపాడు. మాటల్లో నాకు నచ్చే మిస్టరీ పుస్తకాలు ఎలాగ ఉంటాయో చెప్పాను: కొట్లాటలు ఉండకూడదు. అనవసరమైన హత్యలుండకూడదు. పాత్రల వివరణ ముఖ్యం. ఆ పాత్రల అంతర్మథనం ముఖ్యం. ఆ పాత్రల మధ్యన జరిగే ఘర్షణ ముఖ్యం. ఆ పాత్రలు ఉండే ప్రపంచవర్ణన ముఖ్యం. ఇది విని, ‘ఇంక మీరేమీ చెప్పనక్కర లేదు. ఈ పుస్తకం నచ్చకపోతే వాపసు తీసుకుంటాను,’ అని నాకు ఎ టెస్ట్ ఆఫ్ విల్స్ (A Test of Wills) అనే పుస్తకం ఇచ్చాడు. ఆ పుస్తక రచయిత ఛాల్స్ టాడ్ (Charles Todd). తన తల్లి కెరోలిన్‌తో కలిసి రాస్తుంటాడు. చిన్నప్పటి నుండీ, అతడికి ఇంగ్లాండ్ చరిత్ర అంటే మక్కువ. ఇంగ్లాండ్ చరిత్ర నేపథ్యంతో రాసిన ఆ పుస్తకానికి కొన్ని అవార్డులు కూడా గెలుచుకున్నాడు.


కొన్ని వారాల తర్వాత, నేను ఒక ప్రయాణంలో ఆ పుస్తకం చదువుతూ నన్ను నేను మరిచిపోయాను. కొట్లాటలు లేవు. ఒకే ఒక హత్య. పాత్రల వెనుక ఏవో రహస్యాలు. చదువుతున్న కొద్దీ ఒక్కొక్క పొర తొలగిపోతూ మరికొన్ని వివరాలతో చిత్రం పూర్తవుతుంటుంది. కొంచెం కొంచెంగా మనకి ఆ పాత్రల గురించి, మరణించిన వ్యక్తి గురించి తెలుస్తుంటుంది. మన మనసు కలుక్కుమంటుంది ఆ మరణానికి. మనకి హతుడు తెలియపోయినా, సానుభూతి కలుగుతుంది.

పుస్తకమంతా బాగున్నప్పటికీ, నాకు అందులో ఒక వాక్యం ప్రత్యేకంగా నచ్చింది. ఇన్నేళ్ళకీ ఆ వాక్యం మరచిపోలేకపోతున్నాను. ఇది ఏదో కవిత్వం పూనిన వాక్యం కాదు. ఇది ఏదో రహస్యం మన చెవిలో గుసగుసలాడే వాక్యం అంతకంటే కాదు. ఇది గుండెను మెలితిప్పి కళ్లనీళ్లు కార్పించే వాక్యమూ కాదు. ఏదో అందమైన, మధురమైన పదబంధాలతో నిండి ఉన్న వాక్యం కాదు. అయినప్పటికీ, ఆ సాధారణమైన వాక్యంలో నా కళ్ల ముందు కొన్ని శతాబ్దాల ఇంగ్లాండు చరిత్రని రచయిత ప్రదర్శించాడు.

అయితే, ఆ వాక్యం అర్థం చేసుకోవడానికి, ఆ వాక్యం వెనకున్న చారిత్రక నేపథ్యం తెలియాలి.

కథ మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన కొన్ని నెలలకి జరుగుతుంది. కథలో డిటెక్టివ్, యుద్ధంలో మానసికంగా దెబ్బతిన్న ఒక చిన్న సైన్యాధికారి. ఒక ఊరికొచ్చి ఆ ఊరిలో ఒక పెద్దింటి అమ్మాయిని ప్రశ్నిస్తుంటాడు. యుద్ధం మూలాన ఆ కుటుంబాలు కొంచెం దెబ్బతిని ఉంటాయి. ఆ సందర్భంలో, ఆ డిటెక్టివ్‌కి ఏమనిపించిందో రచయిత ఇలా చెప్తాడు: “తెల్లని దుస్తులు వేసుకొని, నీలి రంగు రిబ్బను సన్నని నడుముకు కట్టుకొని, ఉంగరాల జుట్టు మీద, ఎండ తగలకుండా టోపీ పెట్టుకొని, టెన్నిస్ ఆడి, కిలకిలలాడుతూ, ఆకుపచ్చని మైదానాల మీదుగా షికారు కెళుతూ, ఆ 1914 వేసవి సాయంత్రాల్లో, ఎవరూ గమనించకుండానే కనుమరుగైపోయిన అమ్మాయిలు అతనికి హఠాత్తుగా గుర్తుకు వచ్చారు.”

19వ శతాబ్ది చివరికి గ్రేట్ బ్రిటన్, ప్రపంచంలో పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించింది. అంతకు ముందు అనేక దేశాలు ప్రపంచాధిపత్యం నెరిపాయి. అవి తమ ఆధిపత్యం నిలుపుకోవడానికి, తమ ముద్ర వేయడానికి అనేక రకాల సాంస్కృతిక, రాజకీయ, మతపరమైన ఉపకరణాలు వాడుకున్నాయి. ఉదాహరణకి, అరబ్బులు తమ రాజ్యానికి ఒక ఏకీభావం ఇవ్వడానికి మతాన్ని వాడుకున్నారు. చైనావారికి వారి లిపి ఒక ఏకత్వభావన ఇచ్చింది. ఇతిహాసాలు, కథలు, సంగీతం, ఇలాగ అనేకం మన దేశానికి ఒకప్పుడు రూపాన్ని ఇచ్చాయి.

కానీ, ఇంగ్లండ్ పరిస్థితి వేరు. వాళ్ళు ఎన్ని దేశాలు జయించినా, వాటిని పరిపాలించారే తప్ప అక్కడే స్థిరపడలేదు. ఇంగ్లండ్‌లో పుట్టి, పెరిగి, వలసపోయి, డబ్బు సంపాదించి, మళ్ళీ ఇంగ్లండ్‌కి తిరిగి వచ్చి ఒక ఇల్లు, కాపురం ఏర్పాటు చేసుకోవడం సాధారణంగా జరిగే విషయం. ఇది ఒక మధ్యతరగతి కల. లెక్కలు చూసి, కాలువలు తవ్వించి, రోడ్లు వేయించి, కొత్త వాణిజ్య కేంద్రాలు పెట్టించి, పన్నులు వసూళ్లు చేసి, స్థానికులని నయాన్నో భయాన్నో అదుపులోకి తెచ్చుకొని, ఒక సామ్రాజ్య మహాచక్రంలో ఆకుల వంటి వీళ్ళే నిజమైన సామ్రాజ్య నిర్మాతలు.

మరి, మాతృదేశంతో అంతగా పెద్ద సంబంధాలు లేని వీళ్ళకి, ఇంగ్లండ్‌కి దూరంగా గడిపే వీళ్ళకి, ఎందుకు దేశ, రాజభక్తి ఉండేది? ఎందుకు అమెరికాలో లాగ కొత్త రాజ్యాలను స్థాపించలేదు? ఎందుకు తమకు తాము ఇంగ్లీష్ వాళ్లమని అనుకునేవారు? ప్రాచీనకాలం నుండి ఉన్న తెగ, జాతి నుండి విధేయత ఎందుకు దేశానికి బదిలీ అయింది? దేశదేశాలు వెళ్లిన ఇంగ్లీష్‌వాడు, మరి తన మాతృభూమితో ఎలాగ సంబంధం ఉంచుకోగలడు? ఆఫ్రికాలో పుట్టి పెరిగిన ఇంగ్లీష్‌వాడు, తన ఇంగ్లీష్ తనాన్ని ఎలా కల్పించుకోగలడు? ఎలా నిలుపుకోగలడు?

ఈ ‘దేశం’ అనే ఒక కల్పనను నూతన యుగంలో దృఢంగా స్థాపించింది ఇంగ్లీష్‌వారు. పునరుజ్జీవనం ఇటలీలో మొదలయినా వాళ్ళు తమ నగరానికే విధేయులుగా ఉండేవారు. నగరం బయట కొన్నేళ్లు గడిపితే ఆ విధేయతాభావం పోతుంది. మతపరమైన అస్తిత్వంతో దేశాలు ఉన్నా, వాళ్లలో వాళ్ళకి మతం మీద గొడవలు. ఆధునిక యూరప్ చరిత్రనంతా క్రిస్టియన్ మతశాఖల మధ్య గొడవల్లాగా చూడవచ్చు. యూరప్ చరిత్రలో, దేశానికి కావలసిన ఒక రాష్ట్రీయతా అస్తిత్వం ఇంగ్లాండ్ కంటే ఏ దేశంలోనూ లేదు.

ఈ ఇంగ్లీష్ అస్తిత్వభావం పెరగడానికి, ముఖ్యంగా విక్టోరియా పరిపాలనలో, అన్ని కళలూ సహాయం చేశాయి. ఉదాహరణకి, జనసామాన్యంలో పేరు పొందిన గిల్బర్ట్ & సలివన్ (Gilbert & Sullivan) పాటల్లో ఒకటి అతడు ఇంగ్లీష్ వాడు (For he is an Englishman) అనేది ఒకటి ఉన్నది. ఇంకా, పైరేట్స్ అఫ్ పెంజాన్స్‌లో (Pirates of Penzance) ‘అతడిలో ఎన్ని తప్పులు ఉన్నా, అతడు తన రాణిని ప్రేమిస్తాడు’ అని ఒక పాట పల్లవి ఉంటుంది. ఇంగ్లీష్ జీవన విధానం గొప్పది, ఈ మానవ సంబంధాలు గొప్పవి, అసలు ఇంగ్లీష్ పుటకే గొప్పది అనేది వాళ్లకి సాహిత్యం, సంగీతం, మిగిలిన కళలు మాటిమాటికీ చెప్పేవి. ఎంత అంటే, ఫ్రెంచ్ చిత్రకారులు గొప్పవారని ఒప్పుకున్నా, వారి జీవిత విధానం విషయలోలత్వంతో కూడుకున్నదని చిన్నచూపు చూసేవారు!

19వ శతాబ్దం చివరికి, ఇంగ్లాండ్ స్వర్ణయుగం వచ్చింది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం ఏర్పడింది. అప్పటికి, ఈ ఇంగ్లీష్ వాళ్ళు తమ అస్తిత్వంలో భాగంగా నమ్మినవి రెండు: ఒకటి వాళ్ళ వర్గ వ్యవస్థ. రెండవది వారి గ్రామ జీవితం మీద మమకారం.

ఇంగ్లీష్ వర్గ వ్యవస్థ అనేక పుస్తకాలలో కనబడుతుంది. జేన్ ఆస్టిన్, అగాథా క్రిస్టీ, ఛాల్స్ డికెన్స్ పుస్తకాల్లో, దాదాపు ప్రతి పుస్తకంలో ఈ వర్గాల విషయాలు కనబడుతుంటాయి. పెద్దింటివారు పెద్ద చదువులు చదువుకుంటారు. లేదా, వారికి ఉన్నతమైన ఆలోచనలు ఉంటాయి. చిన్నవారు తమ పనులేవో చేసుకుంటూ జీవితాన్ని గడిపేస్తుంటారు. వారి జీవితం బండగా ఉంటుంది. పెద్దవారు సున్నితంగా ఆలోచిస్తారు. చిన్నవారు తాత్కాలికమైన శారీరక సౌఖ్యాలే చూసుకుంటారు. ఇటువంటి అనేక ముతక పడికట్టు వర్ణనలు ఈ కథల్లో కనబడుతుంటాయి.

20వ శతాబ్దానికి ముందు, ఈ వర్గ వ్యవస్థను అందరూ ఒప్పుకున్నవారే. ఒప్పుకోనివాళ్ళని అరాచకులని, రకరకాల పేర్లు పెట్టి బహిష్కరించిన సందర్భాలున్నాయి. పెద్దింటి అమ్మాయిలంటే గౌరవం. జార్జ్ బెర్నార్డ్ షా రాసిన పిగ్మేలియన్‌ (Pygmalion) నాటకంలో ‘ఈ సమయంలో మీరు ఉండకూడదు మిస్,’ అని పూలమ్మే ఆవిడ ఎలైజాకి గౌరవంగా, పెద్దింటివాళ్లకి చెప్పినట్లు చెబుతుంది. లోకంలో ఉండే మట్టి, మురికి, బాధలు, క్రూరత్వం, ఇవేవీ ఆ పెద్దింటి అమ్మాయిలకు కనబడకుండా కాపాడటం ఈ వర్గ సంస్కృతి మాత్రమే కాదు, సమాజ సంస్కృతి కూడానూ. పెద్దింటి అబ్బాయిలు, బోర్డింగ్ స్కూల్‌లో చదివి, ఒక ద్వంద్వ దృష్టిని తెచ్చుకుంటారు. క్రూరత్వం చిన్నవర్గాల మీద, వలస దేశాల్లో స్థానికుల మీద. సున్నితత్వం పెద్ద సమాజంలో, ముఖ్యంగా ఆడవాళ్ళతో. ఇంకా ముఖ్యంగా, వయసులో ఉన్న ఆడవాళ్ళతో. విక్టోరియన్ రోజులలో ఆడవాళ్లని ఇంగ్లీష్ రోజ్ అని భావించడం, వర్ణించడం చాలా సాధారణం. వలస దేశాల్లో ఉన్నన్నాళ్ళు ఈ ఇంగ్లీష్ రోజ్ గురించి కలలు కనేవాళ్ళు (Oh, my heart still beats /For my home and my English rose).

ఇక గ్రామీణ జీవన మమకారానికి వస్తే, పారిశ్రామిక విప్లవం ఇంగ్లండ్‌లోనే వచ్చినప్పటికీ, ఇక్కడ గ్రామీణ జీవన సరళికి గౌరవం ఎక్కువ. మాగ్నా కార్టా (Magna Carta Libertatum) రోజులనుండీ, ఇంగ్లండ్‌కి ఒక స్థిరత్వం, శాశ్వతత్వం ఇచ్చింది భూస్వామ్య వ్యవస్థ. వీళ్ళు విశ్రాంతి సమయాల వినోదాలు ఇంగ్లీష్ ఆదర్శాలు. ఉదాహరణకి, గుర్రపు స్వారీ, ఆటలు ఆడటం, డాన్స్ చెయ్యడం, నక్కల వేటలు, కుక్కలు పెంచడం. ఇటువంటి గ్రామ ప్రాంతపు పెద్ద తరగతి సరదాలు దేశమంతా ప్రాచుర్యంలో ఉండేవి. అంతేకాదు, బాగా డబ్బులున్న జమీందారులు పట్టణాలలో ఇళ్ళు కొనుక్కొని వాటిలో గడిపేవారు. ఎండాకాలం తమ గ్రామాలకు వెళ్ళి ఆటపాటల్లో వేటవిందుల్లో గడిపేవారు. చలికాలం విదేశాల్లో, మధ్యలో నగరంలో ఉండేవారు. ఇలాగ వారి జీవితం అందం, ఆనందం, అనుభవం కోసమే గడుపుతుండేవారు, బాధ్యతారహితంగా, పొలాల మీద వస్తున్న డబ్బులు తింటూ.

కానీ, 20వ శతాబ్ది వచ్చేటప్పటికి, ఆ సమాజం క్షీణిస్తూ వచ్చింది. బ్రిటిష్ సామ్రాజ్యం పతనం కాసాగింది. వర్గ వ్యవస్థ, దాని చిహ్నాలు, రాజరికం మీద బ్రిటిష్ ప్రజలలో అసహనం, ద్వేషం పెరగటం మొదలయింది. ఒక వైపు వ్యాపారం మూలాన పైకివచ్చినవారు, ఈ వంశ పారంపర్య వ్యవస్థను చిన్నచూపు చూపేవారు. ఇంకొక వైపు, యూరప్ నుండి సామ్యవాద భావజాలం అసలు పెద్ద, చిన్న భావాలమీదే దాడి చేసింది.

మొదటి నుంచీ పరిశ్రమల నుంచి, వ్యాపారం నుంచి డబ్బులు సంపాదించినవారు ఉన్నప్పటికీ, వారు ఈ భూస్వామ్య వర్గం వారి ఆమోదం కోసం తపించేవారు. పెద్దింటి వివాహ సంబంధాలు, దొర బిరుదులు కొనుక్కోవడం, ఇటువంటి పనులతో పెద్ద వర్గంలో చేరిపోయేవారు. కానీ, 20వ శతాబ్దంలో, ఈ భూస్వామ్య వర్గపు పలుకుబడి, గౌరవం తగ్గిపోవడంతో, కొత్త వర్గం మొదలయింది. ఈ చారిత్రక పరిణామం ది వే ఉయ్ లివ్ నౌ (The way we live now) అనే ఆంథొనీ ట్రాలప్ (Anthony Trollope) నవలలో; సామ్యవాద ప్రభావంతో ఈ ఇంగ్లీష్ విలువలు మారడం హవర్డ్‌స్ ఎండ్ (Howards End) అని ఫార్‌స్టర్ (E.M.Forster) నవలలో చూడవచ్చు.

ఇక, టెన్నిస్ ఆటకు వద్దాం. ఇంగ్లీష్‌వారు ప్రపంచం మీద వేసిన రెండు పెద్ద ముద్రలలో మొదటిది భాష, రెండవది ఆటలు. ఈ ఆటలు ప్రచారం చెయ్యడంలో ఒక పరమార్థం ఉన్నది. ఈ ఆటల ద్వారా వాళ్ళు నియమాలకు కట్టుబడి ఉండటం, అంపైర్ మాట వినడం వంటి కీలమైన విషయాలు స్థానిక ప్రజలకు అలవాటు చేశారు. నిజానికి, పెట్టుబడిదారీ వ్యవస్థకి, ఆటలకు మధ్యన చాలా పోలికలు ఉంటాయి. రెండూ సంప్రదాయ, యాదృచ్ఛిక నియమాలకి ప్రజలు కట్టుబడి ఉండడం మీద ఆధారపడి ఉంటాయి.

ఇక ఆడవాళ్లు ఆడటం ఎప్పుడు మొదలయింది? ముందు ఇంగ్లండ్‌లో కూడా ఆటల నియమాలు బాగా పాటించేవారుకాదు. క్రీడారంగంలో కత్తులు దూయడం సాధారణంగా ఉండేది. 1850లు వచ్చేసరికి ఆడవాళ్లు, అందునా పెద్దింటి ఆడవాళ్లు ప్రేక్షకులుగా ఉండడం మొదలయిన తర్వాత, ఆటలలో సభ్యత, హుందాగా ప్రవర్తించడం పెరిగింది. టెన్నిస్ లాంటి ఆటలు, ఈ సామాజిక సభ్యతని, క్రీడాస్ఫూర్తిని పెద్దింటి గుణాలుగా, అంటే అందరికీ ఆదర్శప్రాయంగా చేశాయి. 1900లు వచ్చేసరికి ఆడవాళ్లు టెన్నిస్ ఆడటం ఆధునిక సమాజ లక్షణంగా అయింది.

ఇప్పుడు వ్యాసం మొదట్లో నేను చెప్పిన వాక్యం పరిశీలించండి. ఇంతవరకూ చెప్పిన విషయాలు ఎలా సూచనప్రాయంగా కనబడతాయో చూడండి.

1914లో ఏమైంది? మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది. దానితో ఇంగ్లీష్ బండారం బయటపడింది. మిగిలిన యూరప్ దేశాలు కూడా, ఇంగ్లండ్ లాగ అభివృద్ధి చెందాయని, నిజానికి ఇంగ్లండే కొన్ని కొన్ని విషయాల్లో వెనకపడి ఉన్నదనీ తెలిసింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఫ్యూడల్ వ్యవస్థ పడిపోసాగింది. గ్రాండ్ ఇల్యూజన్ (Grand Illusion) అని ఒక సినిమాలో ఈ ఫ్యూడల్ విలువలు పడిపోవడం బాగా చూపిస్తాడు జాఁ రెన్వార్ (Jean Renoir).

ఏ మాత్రం బాదరబందీ లేకుండా ఆడుకునే ఆడపిల్లలు. వెన్నెల్లో కాదు, వీరు చల్లని ఇంగ్లీష్ ఎండాకాలంలో పగలు ఆడుకొనేవారు. ఇంగ్లీష్ రోజ్, మాసిపోకుండా నెత్తిన టోపీ పెట్టుకొని మరీ. ఇది మగవాళ్ల టోపీ కాదు. ఇది ఉంగరాల జుట్టుకి పిన్ను పెట్టిన టోపీ.

రానురాను, 1920 రోజుల నాటికి స్త్రీ స్వాతంత్య్రం పెరగగానే, రింగుల జుట్టు, వంకీల జుట్టు పోయి, బాబ్ జుట్టు ఫ్యాషన్ అయింది. బాబ్ జుట్టే కాదు, ఒంటి ఒంపుసొంపులు చూపకుండా, పైనుంచి కిందవరకూ ఒకే విధంగా కనబడడటం ఫ్లాపర్ ఫాషన్ అయింది. వీరు ‘పృథు వక్షోజ నితంబ యౌవన భారలై’ వంగిపోయేవారు కాదు. పురుషులని ఆకర్షించే శారీరక లక్షణాలని ఈ ఫ్లాపర్ యువతులు తిరస్కరించారు. సామాజిక కట్టుబాట్లను ఉల్లంఘించారు. అంటే, కొన్ని తరాలుగా పెంచిన విక్టోరియన్ విలువలు, సామ్రాజ్యవాదపు సమాజ లక్షణాలు దెబ్బతినడం మొదటి ప్రపంచ యుద్దపు కాలంలోనే మొదలయింది.

తెల్లటి బట్టలు వేసుకోవడం, ఉతికే మనుషులు ఉంటారు కాబట్టి పెద్దింటివారికి కుదురుతుంది. నీలి రంగు రిబ్బన్ నడుము చుట్టూ కట్టుకొని, సంప్రదాయక ఆకారంగా కనపడే ఆడపిల్లలు. సన్నని నడుము, అది కొట్టవచ్చే విధంగా, నీలి రిబ్బను కట్టి ఉండటం మరుగున పడిపోతున్న సంప్రదాయక ఇంగ్లీష్ స్త్రీత్వం. అందునా, కిలకిలలాడుతూ, అందంగా, ఆరోగ్యంగా, లోకంలో కష్టాలు తెలియకుండా ఉండే ఆ ఆడపిల్లలు. వారిని రక్షణ కావలసినవారిగా చూడటం ఒకప్పటి ఇంగ్లీష్ ఆధిపత్య భావ చిహ్నాలు. కానీ, యుద్ధం ఆ భావజాలాన్ని మార్చేసింది. ఈ యుద్ధంలో అందరూ, అంటే ఉన్నత కుటుంబాలవారు, సాధారణ సైనికులు అందరూ పాల్గొన్నారు. బాదరబందీ లేని రోజులు అంతరించాయి. యుద్ధం ఏదో వలస దేశాల్లో వేరే ప్రతినిధులతో చేయించడం కాదు. ఇది గుమ్మం మీదకి వచ్చిన యుద్ధం. అమ్మాయిలు కూడా యుద్ధంలో పనిచేశారు, వెనకనుంచి హాస్పిటల్స్‌లో, పొలాల్లో, ఆఫీసుల్లో. అగాథా క్రిస్టీ కూడా హాస్పిటల్లో నర్సుగా చేసింది. ఈ అనుభవాల మూలాన, ఇంగ్లీష్ రోజ్ కొత్త నిజాలు నేర్చుకుంది. పూలరెక్కలు రాలిపోయాయి. సంరక్షణ కోసం ముళ్ళు బయటకి రాక తప్పలేదు.

ఆ విధంగా ఈ కథాకాలానికి, సమాజం నెమ్మదిగా, హఠాత్తుగా మారుతూ వచ్చింది. మార్పు నెమ్మదిగా కావడంతో, గుర్తించడం కష్టం. కానీ, ఒకరోజు లేచి చూసేసరికి, అనేక చిహ్నాలు పోయి, హఠాత్పరిణామంలాగా ఈ మార్పు కనబడుతుంది. ఈ వాక్యంలో ఆ చిహ్నాల గుర్తింపు ఉంది. ఆ అందమైన ఇంగ్లీష్ అమ్మాయిలు, ఆనందమైన ఆటలు ఇవన్నీ సామ్రాజ్యవాదపు లోతులు చూడకుండా పైపైన మెరుగులు. అయినా, ఆ వ్యవస్థకి ఒక అర్థం ఇచ్చిన సామాజిక సాంస్కృతిక విలువలు ఇటువంటి చిన్ని చిన్ని అభిరుచులగుండా బయటపడతాయి.

ఇలాగ, మనుషులు మారారు. స్త్రీ పురుష సంబంధాలు మారాయి. వ్యవస్థ మారుతూ ఉన్నది. అందరూ నమ్మిన సత్యాలు మారుతున్నాయి. ఏది అందమో, ఏది వాంఛనీయమో అన్నీ మారుతూ వస్తున్నాయి. ఒకే ఒక్క వాక్యం సాధారణమైన పదాలతో ఇంత చరిత్ర చూపించింది. అందుకే నాకు నచ్చిన వాక్యం అయింది.
---------------------------------------------------------
రచన: రామారావు కన్నెగంటి, 
ఈమాట సౌజన్యంతో

Friday, December 14, 2018

కలుపుకొంటే కలుపుకొన్నంత


కలుపుకొంటే కలుపుకొన్నంత




సాహితీమిత్రులారా!

తెలంగాణాంధ్రలలో ఎందరు తెలుగువారు ఉన్నారో ఇంకా అందరు తెలుగువారు ఆ ఎల్లలకు బయట ఉన్నారు. ఆ ఎల్లలకు లోపల తొమ్మిది, వెలుపల తొమ్మిది, మొత్తం పద్దెనిమిది కోట్ల తెలుగు ఎనము (జాతి) మనది. ఈమాట నిక్కమేనా? నమ్మవచ్చా? పదండి కొందరిని పలకరించి వద్దాం.

కొంగాపి (వైశాఖం) నెల, నిన్నాడుకు (పౌర్ణమి) ముందునాడు, మదరాసు నుండి పయనం మొదలిడినాను. మరునాడు రేయి శాలియ మంగళంలో తెలుగు బాగవతం ఆటను చూడడానికి. పేరేగిలో (బస్) సోరణం (కిటికి) పక్కనే ఇరవు (సీటు) దొరికింది. బయటంతా పత్తికాయలు పగిలినట్లు వెన్నెల. రయ్యిమని పరుగెత్తుతూ ఉంది పేరేగి.

నగరంలో కోయల మిట్ట దగ్గర బయలెక్కినాము కదా, గండిని గడచినాము, మీనంబాక చిట్లపాకలను దాటినాము, తాంబరంకు దరిదాపుల్లో ఉన్నాము. తాంబరాన్ని దాటుకొంటే నగరాన్ని వదిలేసినట్లే.

ఒక్క కుదుపు, పెద్ద కలకలం. గబగబ అందరమూ దిగినాము. పేరేగి ముందుగానుల (చక్రాలు) నడుమ ఒక ముగ్గాను (రిక్షా) నుజ్జునుజ్జయి పడి ఉంది. ఒక నడీడు ఆమె గుండెల్ని బాదుకొంటూ ఎలుగెత్తి తెలుగులో అరుస్తూ ఉంది. మెల్లగా పేరేగి కిందనుండి పాక్కుంటూ ఒకతను బయట పడినాడు. ఒంటిమీది గాయాలను కూడా పట్టించుకోకుండా, ఒక్క గెంతున ఆమె దగ్గరకు పోయినాడు. “ముయ్ లంజా, ముయ్ నోరు!” అంటూ ఆమె చెంపలమీద రెండు పీకినాడు.

జరిగినది ఏమిటంటే, పేరేగి తోలరి (డ్రైవరు) ఏమరుపాటున ముగ్గానును గుద్దేసినాడు. నడుపరి (కండక్టరు), ఆ ముగ్గాను అతనిని పిలిచి, అరవంలో బెదిరించి, ఏబై రూపాయల రేకును చేతిలో పెట్టి, ‘పోలాం పో రైట్!’ అని అరచినాడు. నాకు ఏమి చేయాలో తోచలేదు. నూర్రూపాయల రేకును తీసి పెద్దాయన చేతిలో పెడుతూ “ఆమెను కొట్టింది ఎందుకు?” అని అడిగినాను.

“తెలుగులో అరిసింది సారు, లంజముండ! దానికే వాడు ఏబైతో సరిపెట్టేసినాడు.”

గుండె కలుక్కుమనింది. పేరేగి కదిలింది. మీరు, అంటే తెలంగాణాంధ్రులవారు కలనైనా కనలేని తెలుగు నిలవరం ఇది.

ఇంకొక అరగంటకు కలవ చెరువు పక్కన పోతూ ఉన్నాం. చెంగలపట్టు పేటను ఆనుకొని ఉంటుంది కలవ చెరువు. అల అల మీదా కల్వరేడు పుట్టి చెరువునంతా మినమిన మెరిపిస్తున్నాడు. పేద్ద చెరువు అది. నిక్కంగానే, పెద్ద కాదు, పేద్ద చెరువు. మా దామన్న గురుతుకొచ్చినాడు. ‘చూడు బా, మా చెంగలపట్టుకు, చెన్ కళినీర్ పట్టు అని తమిళ్లో రాస్తా ఉండారు!’ అంటూ వెతపడినారు ఒకసారి. ఎర్రటి మురికినీళ్ల పట్టు అట అది. చెంగలరాయడు అనే తెలుగు వెలమదొర పేరుమీదుగా పుట్టిన ఊరు అది, చివరికి మురికినీళ్ల ఊరు అయింది. ఇదే మాటను ఒక ఆంధ్ర నేస్తుడితో అన్నాను. ‘చెంగలరాయడు అనకూడదు, చెంగల్వరాయుడు అనాలి. అంటే ఎర్రకలువ దొర అని.’ అంటూ నన్ను దిద్దాలని చూసినాడు ఆ నేస్తం. నేను ఒప్పుకోకపోయినా అతను వినిపించుకోలేదు. మీరైనా వినిపించుకోవాలి కదా? చెంగలరాయడు అనేది సుబ్బారాయడికి మరొక పేరు. చెంగల అనేది ఒక తీరు గడ్డి. చెంగల గడ్డిలో పుట్టినవాడు చెంగలరాయడు.

చెంగలపట్టును దాటినాక నాకు కునుకు పట్టింది. పొద్దున తంజావూరులో దిగినాను. పేరేగిలు (బస్టాండు) లోనే కళ్లూ పళ్లూ ఒళ్లూ కాళ్లూ కడిగేసుకొన్నాను. అక్కడికి అరగంట పయనంలోని శాలియమంగళంకు చేరుకొన్నాను. నిలుకు (బస్టాపు) నుండి ఒక్క కిలోమీటరు లోపే అగ్రహారం. అగ్రహారాన్ని మేము మేల్గేరి అంటాము లెండి.

మేల్గేరిలో వడమ, వాతిమ, అష్టసహస్రం చీలకల తమిళ అయ్యవార్లు ఉంటారు. ఒకే ఒక్క ఇల్లు తెలుగువారు ఉంటారు. వాళ్లు వేంగినాటి వైదికులు. నాలుగునూర్ల ఏండ్ల కిందట నాయకదొరల తరిలో (కాలంలో) మూడువంతులు తెలుగు వైదికులు, ఒక వంతు తమిళ వైదికులు బతికిన తావు ఇది. మొదట తెలుగువారే ఈ భాగవతాలను ఆడేవారు. తెలుగువారినుండి తమిళ వైదికులు ఈ కళను అందిపుచ్చుకొన్నారు. శాలియమంగళంలో మూడునాళ్లు మూడు కతలను ఆడ్తారు. అందులో రెండవది అయిన ప్రహ్లాద చరిత్ర మట్టుకే తెలుగులో మిగిలి ఉంది. మిగిలిన రెండూ తమిళ భాగవతాలుగా మారిపోయినాయి.

ఇప్పటి తమిళనాడులో, ఒకప్పుడు జరిగిన పారులెదిరింపు ఎసవులో (ఉద్యమంలో), ఎక్కువగా దెబ్బతినింది తెలుగు పౌరులే (బ్రాహ్మణులే). ఊళ్లకు ఊళ్లు, ఇళ్లకు ఇళ్లు వదిలేసి నగరాలకు వలసపోయింది తెలుగు వైదికులే. ఇప్పటికీ కావేరి ఒడ్డునున్న మేల్గేరులలో అంతో ఇంతో తమిళ పౌరులు ఉన్నారు కానీ, తెలుగువారిని వెతికివెతికి పట్టుకోవాలి.

శాలియమంగళం కంటే ఎక్కువగా గొప్పగా భాగవత కళను నిలబెట్టుకొన్న మెలట్టూరు కూడా అంతే. ఒకప్పుడు అది వెలనాటివారి మేల్గేరి. ఇప్పుడు అక్కడ ఉన్నది ఒకే ఒక వెలనాటి కుటుంబం. మిగిలినవారు అందరూ పడమలే. మెలట్టూరు కాపుగేరిలో ఉంటున్నది ఎక్కువగా కమ్మవారు.

మెలట్టూరులో తొమ్మిది కతలను తెలుగులో ఆడుతారు. తేపెరుమా నల్లూరులో కూడా ఇంకా భాగవతం నడుస్తూ ఉన్నది. తంజావూరికి చుట్టుపక్కల ఈ మూడు ఊర్లలో ఇంకా తెలుగు భాగవతాలను ఆడుతున్నారు. చూడ మంగళం, ఊటకాడు, పులిమిట్ట వంటి ఊర్లలో ఇదివరకు నడిచేవంట, ఇప్పుడు లేవు. ఇవన్నీ వైదికుల మేల్గేరులే. నాలుగైదు ఏండ్ల కిందట, మన్నారుగుడి అనే ఊరిలోని అయ్యంగార్లు, తెలుగు భాగవతాన్ని ఆడడం మొదలిడినారు. ‘మా ఆటకు నూర్లేండ్ల మెలన ఉండేది, నడుమన మరుగయింది అంతే!’ అంటున్నారు వాళ్లు.

ఇవన్నీ చోళమండలంలో జరుగుతున్నవి. తెలుగును ఎక్కువగా పోగొట్టుకొన్నది చోళమండలం వాళ్లే. నట్టనడి తమిళనాడులోని చోళమండలంలోకన్నా, కట్టకడన ఉండే పాండ్యమండలంలో తెలుగు బాగా నిలచి ఉంది. ఎందుకో తెలియదు, కాపు కులాలే కాదు బడుగు కులాలు కూడా తెలుగును వదిలేస్తున్నాయి చోళమండలాన.

భాగవతాలు చోళమండలంలోనే మిగిలి వున్నాయి. ఇప్పటి తమిళనాడులోని మిగిలిన మూడు తావులైన తొండ, కొంగు, పాండ్య మండలాల్లో భాగవతాలకు పాత పొడలైన తెరువాటలుగా ఉన్నాయి. తెలంగాణాంధ్రలలో యక్షగానాలు అంటారే, అవే ఇవి. ఇక్కడ కొన్ని తావులలో ఆట అంటారు, కొన్ని తావులలో తెరువాట అంటారు, కొన్ని తావులలో కేళిక అంటారు, కొన్ని తావులలో బయలాట అంటారు, కొన్ని తావులలో కుందు అంటారు.

నెల్లూరు, చిత్తూరులకు ఆనుకొని ఉండే తొండమండలంలో తెరువాటలు చాలాచోట్ల జరుగుతుంటాయి. జంగాలపల్లి, గంగాపురం, పెరుమాళ్లపల్లి, దక్షిణ పాతపాళం వంటి వూర్లు పేరుకెక్కినవి. కొంగు మండలంలోని నానుగల్లులో సీతాకల్యాణం అనే భాగవతం నడుస్తూ ఉండేదంట. అట్లాగే ధర్మపురిలో వామనచరిత్రం అనే భాగవతం జరుగుతుండేదంట. ఇవి రెండూ నలబై ఏండ్ల కిందటనే నిలిచిపోయాయంట.

మరలా శాలియమంగళం దగ్గరకు పోదాం. ఆ రెయ్యి తమిళ వైదికులు ఆడిన భాగవతాన్ని అబ్బురపడి చూసినాను. తిరుగు పయనం అయినాను.

రెండేండ్ల కిందట ఇంకొక ఆంధ్ర నేస్తంతో కలిసి అదే చోళమండలంలోని మెలట్టూరుకు బయలుదేరినాను. ఇద్దరమూ తంజావూరులో పట్టేగి (రైలు) దిగినాము. చోళమండలాన తెలుగువాళ్లు తక్కువ. ఉన్నవారు కూడా తెలుగుకు విరవిర ఎడమవుతున్నవారే. దిగుతూనే, పాత పేరేగిలుకు పోయే దారిని గురించి ఒకాయన్ని తెలుగులో అడిగినాను. అతను ఆ దోవను తమిళంలో విడమరచి చెప్పినాడు. నాకు తెలిసిన దారే, నేను బాగా ఎరిగిన తావే. బయటకు వచ్చి ఒక తానేగి (ఆటోరిక్షా) అతన్ని అదే అడిగినాను, తెలుగులోనే. అతను, ఏబై రూకలిస్తే ఎక్కించుకొనిపోయి వదులుతానన్నాడు. ఆ పక్కనే ఉన్న మరొక తానేగతను అక్కరలేదు, నడిచిపోతే దగ్గరే అని తెలుగులో మాటాడినాడు. వెంటనే నా నేస్తం, పలుకెన (ఫోన్) తెరచి దానిని దారి అడిగినాడు. అది చెప్పసాగింది. నేస్తం నాకు దారి చూపించసాగినాడు. కొంత దవ్వు నడిచినాక, ఒకతను వీరతాడుతో ఒళ్లంతా నెత్తురు కారేటట్లు బాదుకొంటూ ఉంటే, అతని ఇల్లాలు గుయ్యిగుయ్యిమని ఉరుమును వాయిస్తూ ఉంది. వాళ్లని సాట కొట్టేవాళ్లు అంటాము. తెలుగువాళ్లే. పలుకరించి దారిని అడిగితే తెలుగులో చెప్పినారు. మరికొంత దవ్వున తాళాలు బాగుచేస్తూ దారిపక్కన కూర్చునున్న ఇంకొకతను కనిపించినాడు. నా పలుకరింపూ అతని మారింపూ నడిచినాక, మీరు దొమ్మిదాసర్లా చెన్నదాసర్లా అని అడిగినాను. మేము దోవదాసర్లం దొరా అన్నాడు అతను. వీళ్లనే రాయలసీమలో సమేదాసర్లు అంటారు. ఇంకొంత దవ్వున చెప్పులు కుడుతూ కనిపించినాడు మాదిగన్న. పలుకరింపుకే పులకరించి దగ్గరుండి దారి చూపించినాడు. అప్పటికి కానీ ఎరుకపడలేదు నా నేస్తానికి, ఆయన చేతిలోనిది ఉసురు కాదు ఉరువు అని.

తడబడి తడబడి కడనడకలు నడుస్తున్న చోళమండలపు తెలుగులో కూడా ఇంత పలుతనం (వైవిధ్యం) ఉంది. ఇప్పటి తమిళనాడు మొత్తం మీద నూటపది పల్లెకళలు ఉంటే, అందులో నూరు తెలుగువారివి.

దేవరాట, జిక్కాట, చెక్కపుల్లలాట, కోలాట, పూజాట, రోకలాట, కీలుగుర్రాలాట, మరుగాట, కొక్కిలికట్టె ఆట, మోడి ఆట, సామాట, బుర్రకత, జంగంకత, తందానకత, బయినికత, పిచ్చిగుంట్ల కత, నోక్కం కత, కూనపులి కత, తప్పాట, పలకలాట, పంబ కతలు, సిలములాట, పండరి బజన… కంచి, ఆరణి పట్టుచీరలు, సేలం పట్టుపంచెలు, తళుదాల కొయ్యబొమ్మలు, తంజావూరు సోవులు, కుంబకోణం కంచుబొమ్మలు, ఆలకొండ మట్టిబొమ్మలు, శివకాశి టపాకాయలు, బరతనాట్యంగా పేరు మార్చుకొన్న దాసియాట, సదిరాటలు, జల్లికట్టు, పొంగలి పండుగ, జాము కోడంగులు, పాముల్నాడించే నాగకుళువర్లు, కోతుల్నాడించే రామకుళువర్లు, వడ్ల పేర్లను కాపులకు గురుతుచేసే నాళిమణికారులు, వల్లకాటికి కావలి కాచే సిద్దనార్లు, తెరువాటల ఆండిపండారాలు, బలిజల్ని నమ్ముకొని బతికే ఉప్పాండి పప్పండి ఉంగరాలాండిలు…

ఈ వరుస అట్లా సాగిపోతూనే ఉంటుంది. ఇది ఇప్పటి తమిళనాడులోని తెలుగుదనం మట్టుకే. ఇంతకింతా ఇప్పటి కర్నాటకలో, ఇప్పటి మహారాష్ట్రలో, ఇప్పటి ఒడిశాలో, ఇంకా చాలా చోట్ల ఉంది. మనం వెతుక్కొంటే వెతుక్కొన్నంత, తవ్వుకొంటే తవ్వుకొన్నంత, కలుపుకొంటే కలుపుకొన్నంత.

పద్దెనిమిది కోట్ల తెలుగు ఎనము మనది. ఎన్ని నాడులలో ఉన్నా, ఎన్ని ఏలుబడుల కింద ఉన్నా, తెలుగువారంతా ఒక్కటే. చాటుకొంటే పోయేదేమీ లేదు, చేవలేనితనం తప్ప.
----------------------------------------------------------
రచన: స. వెం. రమేశ్, 
ఈమాట సౌజన్యంతో

Thursday, December 13, 2018

తడిబల్ల – పొడిబల్ల


తడిబల్ల – పొడిబల్ల



సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి.............

సినిమా అంత పెద్ద ప్రశ్న
ఎట్లనో మా బలరామ్‌గాడు డిగ్రీ తర్వాత ఇండస్ట్రీలోకి ఎంటరైనాడు. అంటే ఎవరో హీరోయిన్‌కు అద్దం పట్టే పనిలాంటిదేదో దొరికించుకున్నాడు. వాడికి నా బాధొకటి చెప్పుకున్నాను. వాడు తన అనుభవంలోని పరిచయాలతో ఓరోజు ఒక ‘అన్న’ దగ్గరికి తీసుకెళ్లాడు.

పొద్దున మేము వెళ్లేప్పటికి ఆయన హోటల్లో ఇడ్లీ తింటూ వున్నాడు. బయట రోడ్డు మీదకు వచ్చేట్టుగా కూడా కుర్చీలు వేసివున్నాయక్కడ. మేము వెయిట్‌ చేశాం. ఈయన కెమెరా అసిస్టెంట్‌. ఈయన ఎక్కడైనా పెట్టిస్తే, మళ్లీ అక్కణ్నుంచి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వెళ్లాలనేది నా దూరాలోచన. ముందైతే ఏదో ఒకదాన్లో చేరమన్నాడు బలరామ్‌గాడు.

అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కావడం మామూలు విషయం కాదు. మీరు నటులనుకుందాం, ఇదెట్లా చేస్తావో చూపించమని ఒక సీన్‌ ఇవ్వొచ్చు. మీరు పాట రాస్తామంటే, రాసిందేదైనా చూపించమనొచ్చు. పాడతా అన్నారా ఇంకా మంచిది, పాడి వినిపించొచ్చు. అవకాశం ఇస్తారని కాదు, కనీసం మీరు ఏమిటో చెప్పుకోవడానికీ, మిమ్మల్ని ఎదుటివాళ్లు అంచనా వేయడానికీ ఒక సులువు ఉంటుంది. కానీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అవుతానంటే ఏం పరీక్షించాలి?

తర్వాతెప్పుడో ఈ సంగతి చెబితే దర్శకుడు సుకుమార్‌ చెప్పారు నాతో: ‘మీరు ఐఏఎస్‌ కావాలనుకుంటే, కనీసం ఇలా చదవాలి అనే ఒక ఐడియా ఉంటుంది; కష్టపడితే అయ్యే అవకాశం కూడా ఉంది. కానీ సినిమాల్లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అవ్వడం ఐఏఎస్‌ అవడం కన్నా కష్టం; ఎందుకంటే ఇక్కడ ఏ మార్గంలో వెళ్లాలో చెప్పే సిలబస్‌ లేదు.’

ఆ అన్న తినడం పూర్తి చేసి, చేయి కడుక్కుని తుడుచుకుంటూ వచ్చి, మళ్లీ ఇందాకటి కుర్చీ మీదే కాళ్లు ముడుచుకుని కూర్చుంటూ ‘ఏం తమ్ముడూ ఏం సంగతి?’ అన్నట్టుగా కొన్ని వివరాలు అడిగాడు. నా చదువూ ఊరూ గురించి చెప్పాక, నా రహస్యాన్ని బయటపెట్టేశాను. చాలా క్యాజువల్‌గా మాట్లాడుతున్నవాడల్లా కుర్చీలోకి మరింత ఒరుగుతూ, నా ముఖాన్ని పరీక్షగా చూసేలా తల పైకెత్తి, ‘డైరెక్టర్‌ అవడమంటే మాటలా?’ అన్నాడు. నేనేమీ మాట్లాడలేదు.

‘చూడు, ఈ ప్రశ్నకు జవాబు చెప్పు? ఒక తల్లి తన కొడుక్కు పాలిస్తున్నప్పుడు ఆమె చేతులు ఎక్కడుంటాయి?’

నాకు వెంటనే జవాబు తోచలేదు. ఎక్కడ ఉంటాయబ్బా చేతులు? ఇది ఆలోచించాల్సినంత విషయమా? నిజమే కదా, తల్లి తన బిడ్డకు పాలిస్తూ ఎక్కడ చేతులు వేస్తుంది? అరే, చాలా చిన్న ప్రశ్నలా కనబడుతోంది, కానీ నాకు స్పష్టంగా జవాబు తోచడం లేదు. బుర్రలో ఏవేవో తిరుగుతున్నాయి. మొత్తం నన్ను నిర్ణయించే జవాబా ఇది?

గింజుకుని, నాకు తెలియట్లేదని చెప్పాను. చాలా స్థిరమైన గొంతుతో చెప్పాడాయన: ‘పిల్లాడి తల మీద ఉంటాయి చేతులు.’

అబ్బా! అరే నాకు ఇది కూడా తెలీదే. ఇది కూడా తెలీని నేను ఏం లోకాన్ని చదివినట్టు? నాకు ఇంకేం అర్హత ఉన్నట్టు? నేనింకా పరీక్షలో విఫలమయ్యాను కాబట్టి, బలరామ్‌గాడు నోరు తెరిచి ఏమనీ అడగలేకపోయాడు. రాక రాక ఒక పెద్దమనిషిని కలిసే అవకాశం వస్తే ఆయన్ని ఇంప్రెస్‌ చేయలేకపోయాను.

అవకాశం ఎటూ పోయింది, కానీ తర్వాత నేను ఈ ప్రశ్న గురించే చాలా ఆలోచించాను. అరే, పాలిస్తున్న తల్లి తన చేతుల్ని కచ్చితంగా బిడ్డ తల మీదే వేస్తుందా?

ఆ రొమ్ము ఏదో పిల్లాడి నోటికి ఇచ్చేసి తన మానాన తను పేపర్‌ చదువుతూ ఉండొచ్చు. పక్కింటామె వచ్చి తలలో పేన్లు కుక్కుతూవుంటే తన్మయంగా కళ్లు మూసుకుని చేతుల్ని పక్కన పెట్టుకోవచ్చు. యారాలుతో మాటలతో పోట్లాడుతూ ఆ చేతుల్ని దానికి అనుగుణంగా ఊపుతూ ఉండొచ్చు. అత్త చెప్పే ఇంటిపనిని తప్పించుకోవడానికి ఈ పాలు ఇవ్వడమనే సాకుగా కూర్చుండి ఎడమచేత్తో కింది పెదాల్ని సాగదీసుకుంటూ తమాషా చూస్తుండొచ్చు. బీడీలకు ఆకు కత్తిరిస్తుండొచ్చు. వాడి గోళ్లు కత్తిరిస్తుండొచ్చు. అన్నం మెతుకులు అట్లేనా అని పెద్దబిడ్డను మందలిస్తూ ఉండొచ్చు. ఏ వదినో చాయ్‌ గ్లాసు చేతిలో పెడితే తాగుతూ ఉండొచ్చు. గల్ఫ్‌కు పోయిన వాళ్ల నాన్నో, అన్నో గుర్తొచ్చి కళ్లల్లో నీటిని కొంగుతో ఒత్తుకుంటూ ఉండొచ్చు. పాలు తాగుతూ ఆ ప్రేమ ప్రవాహానికి నిక్కిన వాడి బుచ్చి మీద చిరుకోపపు నవ్వుతో చేయి ఎత్తవచ్చు, లేదా దానితో ఆడుకోవచ్చు. నిజంగానే అతడు అన్నట్టు మురిపెంగా వాడి తలను దువ్వుతూ ఆస్వాదిస్తుండవచ్చు కూడా. కానీ ఇన్ని సాధ్యాలకు అవకాశం ఉన్నప్పుడు గన్‌షాట్‌గా తల మీద చేయి వేయడమే జవాబు ఎలా అవుతుంది? అసలు ఒక దృశ్యంలోంచి ఇంకో దృశ్యంలోకి ప్రవహించే కథను బట్టి కదా, ఆమె చేతులు ఎక్కడ వేస్తుందనేది తేలుతుంది. మరి ఇంత తతంగం ఉన్నప్పుడు ఆమె కచ్చితంగా చేతుల్ని వాడి తల మీదే ఎలా వేస్తుంది?

ఆ అన్న ఇప్పుడు ఏం చేస్తున్నాడోగానీ నాలో మొగ్గ రూపంలో ఉన్న కళాకారుడిని ఇడ్లీ తిన్నంత ఈజీగా ఆరోజు నలిపేశాడు!

శుక్రవారం
షాపు ఎందుకో మొన్న చూసినట్టు లేదే! మొన్న కౌంటర్‌ ఎడమవైపు ఉన్నట్టు అనిపించింది. ‘కస్టమర్‌ ఈజ్‌ గాడ్‌’ అని రాసివున్న ప్లేట్‌ ఒకటి కౌంటర్‌ మీద పెట్టివుంది. కొంచెం లావుగా, అంతకుమించి ఎత్తుగా ఉన్న వ్యక్తి కౌంటర్‌ మీద ఉన్నాడు. చూడగానే గుర్తుపట్టి, నవ్వాను. షాపతను బదులు నవ్వలేదు. మనం ఎందుకొచ్చామో వీళ్లకు ముందే తెలిసిపోతుందా?

చేతిలో పట్టుకున్న టాబ్లెట్‌ స్ట్రిప్స్‌ చూపిస్తూ, ‘ఇవి మొన్న పదిహేను రోజులకని పొరపాటున మూడు స్ట్రిప్సు తీసుకున్న. కానీ ఐదు రోజులు వేసుకుంటే చాలని చెప్పిండు డాక్టర్‌’ అన్నాను. నాకెందుకు చెప్తున్నట్టుగా షాపతని ముఖంలో ప్రశ్న గుర్తు. నిశ్శబ్దంగా కవర్‌ను టేబుల్‌ మీద పెట్టాను. షాపాయన వాటి వైపు కూడా చూడలేదు, కానీ ‘పొద్దున్నే ఏంటయ్యా’ అన్న విసుగు ముఖం మాత్రం పెట్టాడు. మొన్న సాయంత్రం వచ్చినప్పుడు ఈయనే ‘సార్‌’ అన్న విషయం గుర్తుంది. నన్ను కాసేపు నిలబడనిచ్చి, ‘ఒకసారి అమ్మినై వాపసు తీసుకోం’ అని తేల్చేశాడు.

నేనేమీ మాట్లాడలేదు. నాకు వెనక్కి తీసుకెళ్లే ఉద్దేశం లేదన్నట్టుగా, కవర్‌ను టేబుల్‌ మీద అతడి వైపు మరింత జరిపాను. పదకొండు రూపాయల తొంభై పైసలకో టాబ్లెట్‌. మొత్తం ఇరవై. వదిలేస్తే పోతుందా? చూస్తూ చూస్తూ… షాపాయన వాటి మీద ఓ కన్నేశాడుగానీ చేతిలోకి తీసుకోలేదు. హెల్పర్‌ వచ్చి, చిన్న కవర్లో వేసివున్న స్ట్రిప్సునూ, వాటితోపాటు మడతపెట్టి వున్న బిల్లునూ ఓసారి అట్లా చూసి, మళ్లీ టేబుల్‌ మీద పెట్టాడు, యజమాని ఒక మాట అనకుండా, తాను సొంతనిర్ణయం తీసుకోవడం బాగోదన్నట్టుగా.

షాపాయన కంప్యూటర్‌లో నిన్నటి రోజు లెక్కలు కావొచ్చు, ఏవో కాసేపు చూసి, ముందట నిలుచున్నవాడికి ఏదో ఒకటి చెప్పాలన్న బాధ్యత తన మీద ఉందని గుర్తొచ్చినట్టుగా ‘తొమ్మిది కూడా కాలేదు, బోణీ కాకుండా వాపసు తీసుకోం’ అన్నాడు. ఫర్లేదు, కొంచెం మెత్తబడ్డాడు. అది కూడా కరెక్టే అనిపించింది. ‘అయితే నన్ను తర్వాత రమ్మంటారా?’ అంత వినయంగా మాట్లాడగలనని నేనే అనుకోలేదు. ‘పన్నెండు తర్వాత చూద్దాం.’

చూద్దాం. ఇది స్పష్టమైన హామీ కాదు, కానీ కొంతనయం. కానీ మళ్లీ మధ్యాహ్నం రావాలంటే, లంచ్‌ అవర్లో పర్మిషన్, రాను బస్సు పోను బస్సు, ఇటు పది అటు పది, పైగా ఎండ, దానికన్నా సాయంత్రం రావడం బెటర్‌. ఒక్క అదనపు పదిరూపాయలతో చెల్లిపోతుంది.

‘మధ్యాహ్నం వచ్చినా డబ్బులైతే వాపసు ఇవ్వం, వేరేది ఏదైనా తీసుకోవాలి.’

కోపం వచ్చింది. వచ్చినా ప్రదర్శించకూడదు. ‘వేరేదంటే…’ నీళ్లు నమలడం అనే స్థితి.

మళ్లీ అతడు కంప్యూటర్లో ముఖం పెట్టాడు. హెల్పర్‌ మందులున్న కార్టన్స్‌ను హేక్సాబ్లేడ్‌తో కట్‌ చేస్తున్నాడు.

‘ఎక్కడన్నా బియ్యం కొంటే మీరు వాపసు ఇస్తారా?’

హెల్పర్‌ కట్‌ చేయడం ఆపి, ఇటు చూశాడు.

‘బియ్యం అంటే ఇవ్వాళో రేపో ఖర్చవుతాయి, వీటిని అట్లా వాడుకోలేంగా!’ నవ్వుతూ అన్నాను. ఇట్లాంటి సందర్భంలో లాజిక్కులు పనిచేయవని షాపాయన ముఖం చూశాక అర్థమైంది. ఆ ముఖం మీద ఆయన్ని ఎక్కువ సేపు ఉంచితే కష్టం. కానీ దేబిరించినట్టు ముఖం పెట్టడం ఇష్టంలేదు. పోనీ, జింకోవిట్‌ లాంటిది ఏమైనా కొందామా అనుకున్నాను. దానికన్నా అలాగే కౌంటర్‌ మీద స్ట్రిప్సును విసిరేసిపోవడం ద్వారా ఒక తృప్తిని ఏదైనా పొందగలనా అని కూడా ఆలోచించాను. కానీ అవేమీ చేయలేదు. ‘మీరే ఏదైనా చూడండి సార్‌.’

వెంటనే రియాక్ట్‌ అవ్వాల్సినదేమీ లేదన్నట్టుగా కాసేపు లెక్కల్లో గడిపి, కౌంటర్‌ మీద తాపీగా కూర్చుని, హెల్పర్‌ వైపు చూశాడు. హెల్పర్‌ వచ్చి కవర్‌ను చేతిలోకి తీసుకుని, బిల్లు మడత విప్పి తల మరింత వంచి చూశాడు. ‘అన్నా, ఇది ఆ షాపుది’. నాకేమీ అర్థం కాలేదు. ‘మొన్న మీరు ఆ షాపులో కొన్నట్టున్నారు, అక్కడే ఇవ్వాలి’ అన్నాడు షాపాయన. నాకు అయినా అర్థం కాలేదు. ‘అన్నా, ఇరవై షట్లర్ల తర్వాత ఇంకో బ్రాంచుంది, అక్కడ ఇయ్యిపో’ చెప్పాడు హెల్పర్‌. అందుకా కౌంటర్‌ మారినట్టనిపించింది! ‘మరి మొన్న మీరే ఉన్నారు’ షాపతడిని ఉద్దేశించి అన్నాను. ‘రెండూ మాయే, అక్కడా ఉంటా ఇక్కడా ఉంటా.’

మెడ పైకి చూసుకుంటూ వెళ్తే త్వరగానే భార్గవ్‌ మెడికల్‌ హాల్‌ కనబడింది. అవును, మొన్న చూసిందిదే! కౌంటర్‌ మీద బక్క పలుచటి మనిషి ఉన్నాడు. దాదాపుగా మళ్లీ మొత్తం రిహార్సల్‌ జరిగింది. ‘పదిహేను రోజలకు కొంటే మాదా తప్పు?’ అన్న అదనపు ప్రశ్న కూడా పడింది.

అలా కొనాల్సిరావడానికి తగినన్ని చారిత్రక కారణాలున్నాయి. డాక్టర్‌ రాసింది అర్థం కాక, అర్థం కావట్లేదని అర్థమయ్యేసరికి డాక్టర్‌ అందుబాటులో లేక, హాస్పిటల్‌ ఫార్మసీలోనే కొనేస్తే వాళ్లే ఏదో తిప్పలు పడతారులే అనుకుని, తీరా రాసిన నాలుగు ముందుల్లో మూడు మాత్రం ఇచ్చి ఈ ‘షాప్‌ వాపసీ’ కార్యక్రమానికి కారణమవుతున్న టాబ్లెట్స్‌ మాత్రం వాళ్లు లేవని చెప్పి, వారి అనుభవసారాన్నంతా రంగరించి ‘పదిహేను రోజులు’ అని నా ప్రశ్నకు జవాబుగా ఇచ్చి, మరెక్కడో ఎందుకులే పనైపోతుందని హాస్పిటల్‌ పక్కనేవున్న ఈ మెడికల్‌ షాపులోనే ఆ టాబ్లెట్స్‌ కూడా కొనేసి, ఎందుకొచ్చిన రిస్కూ అని మళ్లీ రెండ్రోజుల తర్వాత ఆ డాక్టర్‌తోనే నిర్ధారించుందామని వెళ్తే ఆయన కూల్‌గా ‘ఐదు రోజులు వేసుకుంటే చాలు’ అని, కుర్చీలోంచి అలాగే ఎత్తి పడేద్దామన్నంత కోపం వచ్చినా శాంతంగా చిరునవ్వుతో తమాయించుకుని…

షాపతని ప్రశ్నకు జవాబుగా, ‘మీ అన్ననే ఇక్కడికి పోతే ఇస్తరన్నడు.’ ఇది పని చేసింది. ‘అన్న కాదు, తమ్ముడు’ అని చెప్పి, ‘రెండ్రూపాయలు ఇవ్వండి’ అన్నాడు రౌండ్‌ ఫిగర్‌ ఇచ్చే ఉద్దేశంతో. నేను ప్యాంటు వెనక జేబులోంచి బిళ్ల తీసి టేబుల్‌ మీద పెట్టాను. షాపాయన గల్లాలో చేయిపెట్టి, రెండు వంద నోట్లు, నాలుగు పదులు తీస్తున్నవాడల్లా ఎందుకో క్యాలెండర్‌ వైపు చూస్తూ, ‘ఇవ్వాళ ఏ వారంరా?’ అని అడిగాడు పక్కనే మా తమాషా చూస్తున్న హెల్పర్‌ను.

దీనికోసమైనా యజమాని తన మీద ఆధారపడ్డందుకు సంబరపడ్డట్టుగా, ‘శుక్రవారమన్నా’ అని అతడు జవాబిచ్చాడు. నాకు ధడిల్లుమంది. ‘ఇవ్వాళ శుక్రవారం, డబ్బులు వెనక్కి పోనివ్వం, రేపు ర’మ్మంటాడా కొంపదీసి?

తెలుగు సంసారి వెర్రినవ్వు ముఖంతో ఆ కౌంటర్‌ ముందు నిల్చున్న నాకు, ఈ మొత్తం హైరానా అంతా మనసులోంచి ఎగిరిపోయేలా ఒక ఆలోచన తళుక్కుమంది. ఇప్పుడు గనక ఇతడు డబ్బులు వాపస్‌ ఇస్తే పనయిపోయి లాభం; ఇవ్వకపోతే గనక దీనిమీద ఒక కథ రాసుకోవచ్చు. ఇన్‌స్పిరేషన్లు ఉత్తగనే వస్తాయేంటి మరి!

పేరు లేని పరిచయం
అలవాటైన స్థలంలో కాకుండా, ఎవరైనా మరోచోట కనబడినప్పుడు, ఈ ముఖం మనకు తెలిసినట్టుందే అని గుర్తు చేసుకుంటూ ఒక నిలిపే చూపు సారిస్తాం. ఎదుటివారి స్పందనను బట్టి అది ఒక చిరునవ్వుకు దారితీయవచ్చు. అయితే ఓసారి ఈ చూపు నాకు అవతలివైపు నుంచి వచ్చింది.

పిల్లలతో మృగవని పార్కుకు వెళ్తున్నాం. టికెట్స్‌ తీసుకునేటప్పుడు కండక్టర్‌ నా ముఖం మీద ఒకసారి ఆగింది. నాకు ఆమెవరో చప్పున స్ఫురించలేదు. కానీ ఆ ముఖాన్ని ఎక్కడో చూశాను. ముప్పైల్లో ఉంటుంది. బక్కపలుచటి దేహం. పంజాబీ డ్రెస్‌ మీద బూడిద రంగు అంగి వేసుకుంది. ‘మీ పిల్లలాన్నా?’ అని అడిగింది. ‘అవును’ అని చెప్తున్నాగానీ నాలో చిక్కు వీడలేదు. వంద నోటుకు చిల్లరతోపాటు టికెట్లు ఇచ్చి, ‘ఇవ్వాళ ఈ రూటేసిండ్రు నాకు’ అని చెబుతూ వేరే ప్రయాణీకుల దగ్గరకు వెళ్లిపోయింది. ఓహో! ఆమెవరో నిర్ధారించుకున్నట్టుగా, అప్పటికే కళ్లల్లో ప్రశ్న కనబడుతున్న నా భార్యతో ‘తాళ్లగడ్డ బస్సుల కనవడుతది’ అని చెప్పాను.

బంజారాహిల్స్‌ నుంచి తాళ్లగడ్డకు డైరెక్ట్‌ బస్సు దాదాపుగా దొరకదు. ప్రతిసారీ మెహిదీపట్నం వెళ్లి ఆటో ఎక్కాల్సిందే. కానీ అట్లా దొరికిన కొన్నిసార్లలో కొన్నిసార్లు ఈమే కండక్టర్‌గా ఉండటమూ, ఆమె నా ముఖాన్ని గుర్తించడమూ విశేషమే.

అట్లాంటి అరుదైన సందర్భం మళ్లెప్పుడో తటస్థించింది. ఆ రోజు బస్సు చాలా రష్షుగా ఉంది. స్కిప్‌ చేయొచ్చు, కానీ ఎందుకో ఇది మన బస్సు అనిపిస్తుంది, అందుకే ఎక్కేశాను. అంతమందిలో కండక్టర్‌ దోవ తీసుకుంటూ వస్తున్నప్పుడు, కొందరు జరిగీ కొందరు జరగకా ఒక రకమైన చికాకు ఆమె ముఖంలో ప్రతిఫలిస్తున్నప్పుడు, ఈమెవరో నాకు తెలిసిన ముఖమే అనిపిస్తూవున్నా, దాన్ని నిర్ధారించుకునేలా ఒక పరిచయపు నవ్వు నవ్వనీయకుండా, యాంత్రికంగా పది రూపాయలిచ్చి, ‘శారదానగర్‌’ అనేలా చేసింది ఆ ప్రతికూల వాతావరణం. ఆమె మిషన్‌లోంచి ప్రింటెడ్‌ టికెట్‌ చింపి నా చేతికిస్తూ, ‘మీరాన్నా?’ అంది నవ్వుతూ. బదులుగా నేనూ నవ్వాను. ‘ఏడాది, ఏడాదిన్నర అయుంటుంది కదా కనవడక’ అంటూ ముందుకు కదిలింది. ‘టికెట్, టికెట్‌.’ ఓ! అయితే, పిల్లల్ని నేను మృగవని పార్కుకు తీసుకెళ్లి ఏడాది, ఏడాదిన్నర అయివుంటుందా? ఊళ్లల్లో కాలాన్ని లెక్కించే పద్ధతి గుర్తొచ్చింది. ‘మా లింగంకు పుట్టెంటికలు తీసిన యాడాది తిరుపతికి వోయినం.’

టికెట్లు చకచకా ఇచ్చింది. ఫుట్‌బోర్డులో నిలబడిన కాలేజీ పిల్లల్ని అదిలించి పైకొచ్చేలా చేసింది. బస్సు మాసాబ్‌ట్యాంకు నుంచి ఎన్‌ఎమ్‌డీసీ వైపు మలుపు తిరుగుతున్నప్పుడు మళ్లీ అదే రద్దీలో దారి చేసుకుంటూ ముందున్న లేడీస్‌ వైపు వెళ్లడానికి మధ్యలో ఉన్న నన్ను దాటుతున్నప్పుడు, మర్యాద కోసం నేను ఆమె వైపు ముఖం పెట్టాను. ‘ఇప్పుడెక్కువ ఉప్పల్‌ రూట్ల వోతున్నా; ఇయ్యాల్నే ఇటొచ్చినా’ అంది. అట్లనా అన్నట్టుగా నేను తలాడించాను. నాకు దాదాపు అటువైపు పోయే పనుండదు. ఆమె ముందుకు వెళ్లిపోయింది.

ఈ బస్సులో మెహిదీపట్నంలో చాలామంది దిగిపోతారు. ఈసారి కూడా అట్లే సీట్ల మందం జనం ఉండేలా బస్సు ఖాళీ అయింది. ఆమె కొత్తగా ఎక్కినవారికి టికెట్లు ఇచ్చేసి, ఇంకెవరూ లేరని నిర్ధారించుకుని, నా దగ్గరకు వచ్చి నిలబడింది. ఈమెను ఏం ప్రశ్న అడగొచ్చు? ఏం పేరు? మీదేవూరు? ఒక మగ కండక్టరునైనా ఈమాత్రం పరిచయానికే పేరేమిటని అడగలేం. కాకపోతే క్యాజువల్‌గా ‘ఏ ఊరన్నా’ అనొచ్చు. కానీ మహిళకు అట్లాంటి ప్రశ్న వేయడం కూడా మర్యాద కాదనిపించింది. మరి ఇంక ఈమెతో నేను ఏం మాట్లాడగలను? అయినా తల తిప్పుకున్నట్టుగా ఉండటం మర్యాద కాదు కాబట్టి, ఆమె వైపు తలెత్తాను. ‘ఎక్కడ పనిజేస్తరన్నా?’ చెప్పాను. రెండు ఆఫీసు గురించిన ప్రశ్నలు. తర్వాత ఎటు సాగాలో సంభాషణకు తెలియదు. బస్సును ఓసారి కలియజూసి, వెనక ఖాళీ ఉన్న సీట్లోకి వెళ్లి కూర్చుంది.

కిలోమీటరున్నర దూరమే కాబట్టి, అప్పటికే దాదాపుగా వచ్చేశాను కాబట్టి, సీట్లోంచి లేచి, ఫుట్‌బోర్డు దగ్గరకు వెళ్లి నిల్చున్నా. బస్సు శారదా నగర్‌ స్టాపులో ఆగుతోంది. వెనక్కి చూడాలా, మామూలుగా దిగిపోవాలా? చివరి మెట్టు దిగుతూ తల తిప్పాను. ఆమె తన మానాన తను నోట్లు లెక్కపెట్టుకుంటోంది.

రెండో అనుభవం
మొదటి అనుభవం అయిన మూడేళ్ల తర్వాత గానీ నాకు మళ్లీ దాని మీద ఆసక్తి పుట్టలేదు. మధ్యలో ఒకట్రెండుసార్లు గుర్తొచ్చినా, అంత బలమైన కోరికేం కాదు. వేసవి సెలవులు రావడమూ, పెద్దోడు మా అమ్మ దగ్గరికీ, చిన్నోడు వాళ్లమ్మ దగ్గరికీ, తను విపాశన ధ్యానం క్లాసులని పది రోజులూ… ఇంట్లో ఒక్కడినే ఉండటమే దీనికి ప్రేరణగా పనిచేసి వుండాలి.

పాత దోస్తే. పాత లెక్కనే. శనివారం అనుకున్నాం. అవసరమైతే తెల్లారి ఆదివారమంతా పడుకునే ఉండొచ్చని.

ఈసారి పాత తప్పులు చేయదలుచుకోలేదు. తినకుండా మొదలెట్టొద్దు. దానికి ప్రిపరేషన్‌గా రెండు స్మాల్స్‌ విత్‌ ఉడికించిన పల్లీలు, నేనే పొద్దున నానబెట్టి వచ్చి పోయాక ఉడికించాను కొద్దిగా ఉప్పు వేసి. ఉలవ మొలకలు, ఇవి అంతకుముందు రాత్రి నానబెట్టి తెల్లారి బట్టలో కట్టిపెట్టాను, వెళ్లేసరికి చిన్న తెల్ల మొలకలు పుట్టినై… వీటిమీద సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు, మూడు నాలుగు చుక్కల నిమ్మరసం పిండుకుని బుక్కాలని ప్లాను. అంటే ఆ చేసేదేదో కొంచెం ఆరోగ్యకరంగా చేద్దామని!

వంశీ వచ్చేసరికి ఎనిమిది దాటింది. నేను పొయ్యి మీద బియ్యం పెట్టాను. ఇంకో స్టవ్‌ మీద పోచ్‌డ్‌ ఎగ్‌ అని, మొన్న ఎందులోనో ఏదో చదువుతుంటే తగిలింది, అది ఎలా చేయాలో నెట్లో గాలిస్తే గిన్నెలో నీళ్లు పోసి, మరిగాక సుడిగుండం వచ్చేట్టుగా నీటిని తిప్పి, ముందే గిన్నెలో కొట్టిపోసుకున్న ఎగ్‌ అందులో పొయ్యాలన్నాడు. ‘అన్నా, మరి నేను రెడీ చేసుకోవన్నా?’ కొత్త లైట్స్‌ ప్యాకెట్‌ చేతికిచ్చాను. న్యూస్‌ పేపర్‌ ముందేసుకుని, బుద్ధిగా కూర్చుండి, సిగరెట్‌లోంచి తంబాకు రాల్చడం మొదలుపెట్టాడు. అయ్యో, ఇట్లా అని ముందే ఆలోచనవుంటే ఏ బ్రిస్టలో తెచ్చినా అయిపోయేది, డబ్బులు మిగిలేవి! పోచ్‌డ్‌ ఎగ్‌ కోసం ఫ్రెష్‌ ఎగ్‌ కావాలన్నాడు. తీరా నేను తెచ్చినవి చూస్తే శీగుడ్లయినాయి. అవి తినడమా? మానడమా? ఆ ప్రయత్నం ఫ్లాప్‌ అయింది. ఆనియన్‌ రింగ్స్‌ కూడా ఉన్నాయి కాబట్టి స్టఫ్‌ సరిపోతుందిలే.

ఇంకంతా మామూలే. హాల్లో చాప వేసుకుని కూర్చుని, అన్నీ ముందర పెట్టుకుని, ‘బిడ్డకు ఇప్పుడెంత వయసు?’ ‘రెండేండ్ల్లకొచ్చిందన్నా’ ‘రెండేండ్లు, ఆడపిల్లంటే… గిరగిర మాట్లాడుతున్నమటే’ ‘అవన్నా, వచ్చినవాయే పోయినవాయే అని ఇంట్ల మాట్లాడినట్టే మాట్లాడుతున్నది’… ఇవన్నీ ముగించి, అన్నాన్ని కొత్త నిమ్మకాయతొక్కుతో కొంచెం, పెరుగుతో కొంచెం తినేసే సరికి పదయినట్టుంది.

బయటికి వెళ్లేముందు గిన్నెలన్నీ జాగ్రత్తగా ఎక్కడివక్కడ సర్దాను, తక్షణం కడగ్గలిగేవి కడిగేశాను, మళ్లీ వాటిని తర్వాత కదిలించలేం. ఇంకా ముఖ్యంగా బెడ్రూమ్‌ కిటికీ తెరిచిపెట్టాను. తర్వాత కిటికీ రెక్కకూ నా రెక్కకూ సంయమనం కుదరకపోవచ్చు. కాళ్లకు అడ్డం తగిలేవి ఏమైనా ఉన్నాయా? స్టూల్‌ కొంచెం పక్కకు జరిపి, ముందు డోర్‌ బిగించి పెట్టి, ‘వంశీ, నువ్వు పడుకునేటప్పుడు వెనకాలి డోర్‌ వేయడం మాత్రం మరిచిపోకు’, ’సరే అన్నా’, తను హాల్లోనే చాప మీద పడుకుంటానన్నాడు కాబట్టి, మెత్త, చెద్దరు వేసి, ‘ఫ్యాన్‌ స్విచ్‌ ఇక్కడుంది నీకు తెలుసుకదా’ ‘ఓకే అన్నా’. అగ్గిపెట్టె ఎక్కడుంది?

ఎండాకాలమైనా బయట చలిగా ఉంది. నిన్న కురిసిన వర్షమూ మళ్లీ కురుస్తుందేమోనన్నట్టున్న వాతావరణమూ తగిన మూడ్‌ను ఇస్తున్నాయి. ‘అయిపోయినంక ఈ బట్స్‌ ఇక్కడ పడేయొద్దు, సింకు పక్కన కవరుంది చూడు, అందులో వేద్దాము’ ‘ష్యూర్‌ అన్నా’. కొంచెం ఉద్విగ్నంగానే ఉంది. ఊ, స్టార్ట్‌ చేద్దామా!

కూర్చుని, నాకోటిచ్చి, నాకు అంటించి, తను అంటించుకుని…

తెలిసిందే. పెదాల్లోకి చేదు. మామూలు పొగే. ఒకటి, రెండు, మూడు, ‘ఇంకేంటి? నీ జాబ్‌ బానేవుందా?’ ‘బానేవుందన్నా, స్కూలు పిల్లల్లెక్క. నైన్‌ టు ఫోర్‌’, నాలుగు, ‘పేషెంట్లు ఎంతమందొస్తరు?’ ‘ఓ యాభై’. ‘తక్కువనే’. ‘తక్కువనే, కానీ సంగారెడ్డి లెక్కల ఇదెక్కువన్నా’, ఐదు, ఆరు. ముందున్న చిన్న కళ్యామాకు చెట్టు కనబడుతోంది. దూరంలో ఒకట్రెండు మల్లెమొగ్గలు తెల్లగా. ఇంటిపక్కోళ్లు ఎవరో బాత్రూములోకి వచ్చినట్టున్నారు, ముందు వెలిగిన లైట్‌. ‘ఆ బట్స్‌ ఇవ్వు, నేను పడేసొస్తా’ ‘ఇంకొకటుంది, అది కూడా కాల్చేద్దామా?’ ‘ఏమైతలేదుగదా, ముట్టియ్యి’ ‘నువ్వు ముట్టియ్యన్నా’. తర్వాత ఫ్లష్‌ చేసిన శబ్దం. ఏడు, ఎనిమిది, ‘ఇగో’ లైట్‌ బందయింది. ఆ, ఆ, ఆ… నాభి కింద ఏదో తెలుస్తోంది. ఊఊఊ, ‘రంగులరాట్నం ఎక్కుతున్ననబ్బా.’ చిరునవ్వు. కడుపు ఊగినట్టయింది. కిందికీ మీదికీ. కిందీకీ మీదికీ కిందికీ మీదికీ. ‘పొట్ట కదిలినట్టయితుంది.’ ‘మనం స్మోక్‌ చేసినప్పుడు పొగ మొత్తం లంగ్స్‌కే కాకుండా కొంచెం ఇంటెస్టయిన్ లోకి కూడా పోతుందన్నా’. ఇప్పుడు కడుపులో రాయి ఏదో ఉండి, అది బరువుగా కదులుతున్నట్టుగా… పొట్ట కదలట్లేదు, కష్టంగా, రాయిని పెట్టినట్టు. గుండె డుమ్‌ డుమ్‌ డుమ్‌… ‘శ్వాస పెరిగినట్టయితుంది’ ‘పెరిగిందా? తగ్గిందా?’ మళ్లోసారి ఆగి చూసుకుని, ‘పెరిగినట్టే అనిపిస్తుంది’. డుమ్‌ డుమ్‌ డుమ్‌. అది నా గుండె చప్పుడా? ఇంక నేను లోపటికి వెళ్లాలి, ‘నువ్వు జాగ్రత్తగా వచ్చేసెయ్‌’ ‘ఏంకాదన్నా నువ్వెళ్లు, నేనొస్తా’.

నోరంతా కటిక చేదు. వాష్‌ బేసిన్‌. నీళ్లు మరీ చల్లగా తగిలినై. పళ్లు తోమి కడిగి ఉమ్మి, అయ్యో! ఇప్పుడు నీళ్లు ముట్టుకోవద్దుకదా, నీళ్లు ముట్టుకున్నానేంటి? శరీరం చల్లబడుతోందా? ఐసు తగిలినట్టుగా, ఒళ్లంతా ఏదో పొంగు వచ్చినట్టుగా… వెంటనే బెడ్రూములోకి వెళ్లి తువ్వాలతో తుడుచుకున్నా. వెర్రికుక్కలు నీళ్లు తాకొద్దంటారు కదా! భయంగా, బయటికి హడావుడిగా వెళ్లి, ‘ఇప్పుడు నీళ్లు తాగొచ్చా?’ ‘తాగొచ్చన్నా’ నాకొక్కసారి అట్ల అనిపించిందేంటి? బెడ్రూమ్‌లోకి వెళ్లి, మంచం మీద వెల్లకిలా పడుకుని…

శరీరం బరువుగా, మరింత బరువుగా, నిశ్చలంగా, ఎటూ కదలలేకుండా, కదల్చగలనా? కదిలేట్టులేను, చేయి కూడా కదలట్లేదు, ఇంత బరువుగా ఉందేమిటి? టక్‌ టక్‌… టక్‌ టక్‌… టక్‌ టక్‌… ఒంట్లోంచి సిరిసిల్లలో విన్న సాంచెల టకటక కొట్టుకునే శబ్దం… టక్‌ టక్‌… టక్‌ టక్‌… ఒక లయగా లోపలెవరో డమరు కొడుతున్నారు… టక్‌ టక్‌… టక్‌ టక్‌… మీసాల మీద ఏదో చిమచిమ… డమరు దిశ మారింది, అదే శబ్దం, మరింత బలంగా, అటూ యిటూ… అటూ యిటూ… అటూ యిటూ… చీమలు నడుస్తున్నట్టు పెదవుల మీద, మూతి మీద… అటూ యిటూ… ఒక క్రమంలో అటూ యిటూ… అటూ యిటూ… కదిలే శక్తి లేదా, కదలాలనిపించట్లేదా? నెమ్మదిగా ఎడమచేతి వేళ్లను… ఊఊ కదిలినై. లేచాను! ఈజీగా. ఈజీ. మళ్లీ తువ్వాలతో మూతి తుడుచుకున్నాను. ఇందాక మిగిలిన తడి అది. మళ్లీ వచ్చి, మళ్లీ అలాగే వెల్లకిలా పడుకుని…

మెదడు లోపల ఏదో మెత్తటి వలయం తిరుగుతోంది. ఒక రిథమ్‌తో. ఆలోచనా రహిత వలయం. బరువులేని వలయం. లోతుగా, నెమ్మదిగా, ఒక ధ్యానంలాగా, హాయిగా, మెదడును తేలిక చేస్తూ… జ్‌జ్‌జ్‌జ్‌… దాని మీద ఇంకో వలయం, డిస్ట్రాక్షన్‌… ఏవో గుర్తొస్తున్నై, నాకు తెలియకుండానే ఆ వలయాన్ని ఇది డిస్టర్బ్‌ చేస్తోంది… అచేతనంగా ఉన్న ఆలోచనలు… మెదడు బరువెక్కుతోంది, బరువుగా, కొట్టినట్టుగా, జ్‌జ్‌జ్, వద్దు, కాన్సంట్రేట్, కాన్సంట్రేట్‌… ఊఊమ్‌ తేలిగ్గా, హాయిగా, జ్‌జ్‌జ్‌… బరువుగా, ఒత్తుతున్నట్టుగా, కాన్సంట్రేట్‌… పళ్లు మరీ కరుచుకుంటున్నానా? నోరు తెరిచి, దవడలు రెండూ కొంచెం ఎడంగా పెట్టి, నాలుకను ఎక్కడుంచాలి? మధ్యలో ఆగట్లేదు. జ్‌జ్‌జ్‌జ్‌… మొదటిసారిలాగా బ్లిస్‌ రావట్లేదేంటి? ఆ అనుభూతి ఏది? ఇది వేరే ఉంది. ఇది వేరే. ఆ బ్లిస్‌ ఏది? అట్లా ఉండదా ఈసారి? హాయిగా ఉన్న వలయం చెదురుతూ, మళ్లీ పట్టాలెక్కుతూ… పిల్లలు గుర్తొస్తున్నారు. వాళ్ల ముఖాలు… ఆఫీసులో వాళ్ల ముఖాలు… ఒకదాన్నొకటి దాటిపోతూ… దీన్నంతా ఎవరైనా షూట్‌ చేయగలరా? ఒక పెయింటింగ్‌లాగా వేయగలరా? యానిమేషన్‌ కరెక్ట్‌. ముందు బ్లూ లైన్‌ తిరుగుతోంది. బ్లూ బ్లూ బ్లూ హాయిగా స్మూతుగా… రెడ్‌… చెదిరి… బ్లూ బ్లూ… రెడ్‌ దాన్ని చెదరగొడుతోంది. ఒక్కోసారి బ్లూ మీదే తిరుగుతూ ఒక్కోసారి పక్కకే తిరుగుతూ… బ్లూ బ్లూ బ్లూ… హాయి హాయి… బ్రేక్‌! బ్లూ బ్లూ రెబ్లూ రెబ్లూ… రెడ్‌ రెడ్‌ రెడ్‌.. బ్లూడ్‌ బ్లూడ్‌! ఈ పైనేమిటి? ఇది బ్లాక్‌ వలయం. ఇవి నేనుగా గుర్తుకు తెచ్చుకుంటున్న విషయాలు… రేపు ఆఫీసులో పని, చేయాల్సిన ప్రూఫులు… వంశీ నడిచిన చప్పుడు. హాల్లో. చెవుల్తో ఆలోచిస్తున్నాను. చెవుల్తో! బయట వర్షం చినుకులు. గాలి వీస్తోంది. ఎవరిదో కిటికీ రెక్క కొట్టుకుంటోంది. ఇదంతా ఎల్లో వలయం. ‘నువ్వింకా పడుకోలేదా?’ ‘ఒక ఫోన్‌ వస్తుందని చూస్తున్నాన్న’ బ్లూ డిస్టర్బ్‌ అయిపోయింది. బ్లూ డిస్టర్బ్‌ అయిపోయింది. నాకు అర్థమౌతోంది, నేను ఎందుకు ఎక్కువ ఆలోచించి జీవితాన్ని స్పాయిల్‌ చేసుకుంటున్నానో! నాకు అర్థమౌతోంది. బ్లూ రెడ్‌ బ్లూ రెడ్‌… తల నొప్పి, పోటు. ఇదే ఇదే లేదు నాకు. ఈ ధ్యానం లేదు. ఇది చెదరకుండా లేను. నాకు ఇది అర్థం చేయించడానికే ఇదంతా జరుగుతోంది. ఆలోచనారహితంగా ఉండటంలోని ఆనందం. కామ్‌ కామ్‌. తల వాల్చు. మళ్లీ రెడ్‌. దాహం. కొన్ని నీళ్లు తాగొద్దాం. దాహం. మళ్లీ ఈజీగానే లేచాను. కిచెన్‌లోకి వెళ్తూ, ‘వంశీ, వంశీ, చెద్దరు కప్పుకోలేదేంటి?’ ‘ఎండకాలమే కదన్నా’ ఫోన్‌ ఇతడు తల దగ్గర పెట్టుకుని పడుకుంటాడేమిటి? కిచెన్‌లోకి వెళ్లి, గ్లాసెడు నీళ్లు తాగి, మరికొన్ని ముంచుకుని తాగి, బెడ్రూములోకి వచ్చి, కిటికీలోంచి, బయట వర్షం పడుతోంది, చినుకుల చప్పుడు. దారి ఖాళీగా ఉంది. కానుగ చెట్టు ఊగుతోంది. అన్వర్‌ గారికి మెసేజ్‌ పెట్టాలి. రేపటికి కార్టూన్‌ కావాలి. ముందు వద్దనుకున్నాం. ఇప్పుడు చెబితే ఈ నిద్రలో… కొంచెం కోపం రాకుండా, ‘తెల్లారి ఈ మెసేజ్‌ చూడగానే తిట్టుకోవద్దు సార్‌’… సెంట్‌. మంచం మీద పడుకుంటే, మళ్లీ బరువుగా, మళ్లీ ఏదో అవుతుండగా. ఇదేదో బాగుంది. కిటికీ తీసుకుని బయటకు రావొచ్చు, కిటికీ మూసుకుని మళ్లీ లోపలికి వెళ్లిపోవచ్చు. ఈసారి అనుభవంలో వేరియేషన్‌ లేదు. ముందులా లేదిది. గాఢంగా లేదు. కానీ ఈ ఆలోచనల వలయం. ఇది రేపటికి గుర్తుంటుందా? డైరీలో రాద్దాం. మళ్లీ హాల్లోకి వెళ్లి, డైరీ ఎక్కడ? పెన్‌ పెన్‌ ఏది? లైట్‌ వేసి, చిన్న స్టూల్‌ మీద కూర్చుని, రాయగలనా? రాస్తున్నా. ఫోర్‌ లేయర్స్‌ ఆఫ్‌ థాట్‌ ప్రాసెస్‌. చిన్న సర్కిల్‌. ఇది డీపర్, మెడిటేటివ్‌ థాట్‌. ఒక రిథమ్‌ ఉంది ఇందులో. రెండోది బ్లర్రీగా, ముందుదాన్ని చెదరగొడుతూ… డాటెడ్‌ సర్కిల్‌. మూడోది చేతన సర్కిల్‌. నా స్పృహతో గుర్తుతెచ్చుకుంటున్న అంశాలు. నాలుగోది బయటి శబ్దాలను గుర్తిస్తున్న స్పృహ. వంశీ నడవడం, చెట్ల ఆకులు కదలడం. ఇక ఐదవది, నేను పార్టిసిపేట్‌ అవుతున్న యాక్షన్‌. నీళ్లు తాగడం, ఈ డైరీ రాయడం. రాయడం పూర్తి చేసి, టైమెంత? రెండూ ఇరవై. పీఎం. కొట్టేసి ఏఎం. మళ్లీ వచ్చి మళ్లీ మంచం మీద, మళ్లీ బరువుగా, మళ్లీ ఏదో అవుతుండగా.

తెల్లారి లేచేప్పటికి ఏడవుతోంది. ‘ఎట్లుందన్నా?’ ‘ఉందో రకంగా.’ వంశీ పోవడానికి రెడీ అవుతున్నాడు. ‘ఆగు, లెమన్‌ టీ తాగుదాం’. కళ్లు కొంచెం బరువుగానే ఉన్నాయి. పొయ్యి మీద నీళ్లు సిమ్‌లో పెట్టి, పిసరంత చాయ్‌పత్తా, మూడు చంచాల చక్కెర వేసి, బ్రష్‌ చేసుకునొచ్చి, గ్లాసుల్లోకి దాన్ని వడగట్టి, నిమ్మరసం నాలుగు నాలుగు చుక్కలు పిండి… ‘బాగుందన్నా’. పేపర్‌ ఏదో వచ్చింది. తియ్యలేదు. ‘పోతవా ఇగ?’ బయటికి వెళ్లి, బై చెప్పి, అట్లానే కూర్చీలో కూర్చుని, బరువుగా మగతగా చిత్రంగా… ఎనిమిదవుతోంది. బాపు నుంచి ఫోన్‌. కట్‌ చేసి చేశాను. పెద్దోడు. ‘నానా, మంచిగున్నవా?’ ‘బాగున్నరా బుజ్జి, ఏం జేస్తున్నవురా?’ ‘నానా, అన్విగాడు మేకను తెచ్చిండు నానా’ ‘అరే, అట్లనా?’ ‘వాడెట్ల పెంచుతడు నానా దాన్ని?’… ‘నానా’ ‘నానా’ ‘హలో’ ‘హలో’ ‘హలో బుజ్జి, చెప్పురా’ ‘హలో నానా’ ‘చెప్పు బిడ్డా’ హలో హలో ఇంకేదో లైను మధ్యలోకి. కట్‌ కాదూ మాట్లాడరాదూ. ఇంకెవరో మాట్లాడుతూ గర్‌గర్‌గర్‌. ‘నానా’ ‘హలో’ బ్లూ మీద రెడ్‌. బ్లూ మీద రెడ్‌. రెడ్‌ రెడ్‌!

తడిబల్ల – పొడిబల్ల
పార్కుకున్న చిన్న గేటు దగ్గరికి చేరుకునేసరికి, రోజూ కనబడే నలుగురైదుగురు మధ్యవయస్కులు నడక సాగిస్తూవున్నారు. పార్క్‌ మెయింటెయిన్‌ చేసే వ్యక్తి పచ్చిక మీద నీళ్లు పడుతున్నాడు. పొద్దుటిపూట జనం ఉండగా ఎప్పుడూ నీళ్లు పట్టడం చూడలేదు. నేను రౌండ్‌ మొదలుపెట్టి, కొంత దూరం వెళ్లేసరికి నా రాతిబల్ల మీద తడి కనబడింది. ‘గాడిదిగాడు తడిపినట్టున్నాడు.’

పార్కుకు రెండు వైపులా రెండేసి ఒరిగి కూర్చునేలా రాతికుర్చీలుంటాయి. మరో రెండువైపుల్లో ఒక వైపు రెండూ, ఇంకోవైపు ఒకటీ రాతి బల్లలు ఉంటాయి. నేను చేయాల్సిన రన్నింగ్‌ చేశాక, ఈ రాతిబల్ల మీద, ఒకవైపు రెండున్నవాటిల్లో ఒకటి, నిజానికి అవతలి వైపు విడిగా ఒకటున్నదే ఏకాంతంగా ఉంటుంది కానీ పార్కులో ఉన్న ఒక విడి ట్రాక్‌ ఆ రాతిబల్లకు దగ్గరగా ఉంటుంది కాబట్టి, నేను ఈ రెండున్న వైపు దాన్లోనే ఒకదాన్ని నాదని అనేసుకున్నాను, దీని మీద పడుకుని పుషప్, బ్యాకప్‌ లాంటివి చేస్తుంటాను. అయితే మరీ అంత తడి ఏమీలేదు. అంచుల్లో నీళ్లు పడ్డాయంతే. కాబట్టి నా రొటీన్‌ చేసుకోవచ్చు.

శారదానగర్‌లో ఉంటున్న పదేళ్లకుగానీ ఎక్సర్‌సైజ్‌ చేయడానికి తగిన క్రమాన్ని కనుక్కోలేకపోయాను. పిల్లల్ని ఏడు ఇరవైకి స్కూలు బస్సు ఎక్కించేసి, అట్నుంచే పార్కుకు వచ్చేస్తే సరి! చిన్న పార్కే. కానీ పన్నెండు రౌండ్లు కొడితే చెమట పట్టేంత పెద్దది. అంతకుముందు పిల్లలతో పాటు తినేయాలని, అంటే రోజుకు నాలుగు పూటలు తినాలనే ప్రణాళికలో భాగంగా, పిల్లలకంటే ముందు లేచి వ్యాయామం చేయడానికి ప్రయత్నించి, ఒక్కోసారి బద్దకం వల్ల లేవక ఆగిపోయేది; పిల్లలతోపాటే లేస్తే పొద్దుటి హడావుడిలో ఏదైనా సాయం చేయాల్సి వచ్చి, వచ్చి కాదు, చేసి తీరాల్సి వచ్చి, కాడా పడేది. మూడు పూటల భోజనం చాలని తేల్చుకున్నాక, నా పొద్దుటి తిండి సమయాన్ని ముందుకు జరపడంతో ఈ వ్యాయామానికి నిర్దేశిత సమయం కుదిరింది.

నా రన్నింగ్‌ అయింది. వ్యాయామం మొదలైంది. నడకదారుల్లో కొందరు వెళ్లిపోయారు, కొందరు వచ్చి చేరారు. నీళ్లు పడుతున్న మనిషి పైపు చుట్టేసి ఇంట్లోకి వెళ్లిపోయాడు. పార్కు మూలకే ఒక చిన్న గది ఉంటుంది. అందులోనే అతడి ఇద్దరు కొడుకులు, భార్య ఉంటారు. అతడు ఈ బల్లలన్నింటినీ పూర్తిగా కడిగేసివుంటే బాగుండేదే! మంచిగా శుభ్రమయ్యేవి కదా! అతడికి ఈ ఆలోచన ఎందుకు రాలేదు? ఎటూ గడ్డికి నీళ్లు పట్టినప్పుడు వీటి పైకికూడా పట్టేయాలన్న ఇంగితం ఎందుకు లేదు?

అలుపు తీర్చుకోవడానికి తలకింద చేతులు పెట్టుకుని బల్ల మీద విరామంగా పడుకున్నాను. సీజన్‌ అయిపోవడంతో మూలనున్న పెద్ద కానుగ చెట్టు పూలను బలహీనంగా రాలుస్తోంది. దాని కొమ్మల మీదుగా నీలి ఆకాశం కనబడుతోంది. తెల్లటి మబ్బులు కదులుతూ వస్తున్నప్పుడు ఈ తెల్లరంగు కాంట్రాస్టుగా ఆకాశం నీలపుదనం మరింత చిక్కనవుతోంది. గూడు కట్టుకోవడానికి కావొచ్చు, చుక్కల గువ్వ ఒకటి ఎండిన గడ్డిపోచను ముక్కున కరుచుకుని ఎగురుతూ పోయింది. వాకర్స్‌ అడుగుల చప్పుళ్లు వినబడుతున్నాయి. పాతకాలపు సన్నమీసాల హీరోలా ఉండే నల్లటి అంకుల్‌ చాలా వేగంగా నడుస్తాడు. ప్రతి నమస్కారం చేయడమే తన వయసుకు సార్థకత అన్నట్టుగా ముఖమంతా విప్పార్చుకుని కళ్లు కలపడానికి సిద్ధంగావుండే పెద్దాయన అడుగులు రాసినట్టుగా పడతాయి. అందరి మీదా తియ్యటి ఆధిపత్యం చలాయించే (‘అప్పుడే కూలబడ్డారేంటీ, లేవండి లేవండి.’) సెక్సీ తెల్లాంటీ అడుగులు మృదువుగా పడతాయి. బట్టతలలో కూడా అందంగా ఉండే కళ్లజోడు అంకుల్‌ చెప్పులు టిక్కుటిక్కుమంటాయి. ఒకాయన ఫ్యామిలీ చరిత్ర మొత్తం ఫోన్లో ఏకరువు పెట్టుకుంటూ నడుస్తాడు (‘నా బామ్మరుదులు మంచిగ సెటిలైతే నాకే గద మంచిపేరు’). అరగంట కాలావధిలోనే నేను రెండు రకాలుగా ఆలోచించాను. ఇందులో ఏది నేను? ఏది కరెక్టు? మబ్బులా నా నుంచి నేనే జారిపోతున్నప్పుడు ఏ దృక్కోణం నాదనుకోవాలి?

టెన్తు వరకు కీసరగుట్ట హాస్టల్లో ఉన్నప్పుడు–-ఎ, ఎస్, పి, వీఆర్‌–-ఈ బ్యాచొకటి ఉండేది; వీళ్లు బుద్ధిగా చదివే గ్యాంగు; సహజంగానే నేను ఇందులో కలిసిపోయేవాణ్ని. అట్లానే, ఎన్, కె, జి–-కబడ్డీ ఆడటం, డైనింగ్‌ హాల్లోంచి దొంగతనంగా ఉల్లిగడ్డలు ఎత్తుకొచ్చి అంచుకు తినడం ఈ బ్యాచీ ప్రత్యేకతలు. నేను ఇందులోనూ చేరేవాణ్ని. ఎం, ఏఎన్, కేఆర్‌–వీళ్లు ఒకటి. ఇది దొంగతనంగా సినిమాలు చూసే బ్యాచీ. నేనూ స్టడీ అవర్స్‌ తప్పించుకుని ఎన్నో సినిమాలు చూసొచ్చాను. తమాషా ఏమిటంటే, ఉల్లిగడ్డల బ్యాచీకి సినిమాలంటే ఇంట్రెస్టు ఉండదు; చదివే గ్యాంగుతో ఉంటే ఉల్లిగడ్డలు దొరకవు. కాబట్టి, అన్నింట్లోనూ నాక్కావాల్సింది నేను కొంత కొంత వెతుక్కునేవాణ్ని. వాళ్లకూ నాకూ తేడా ఏమిటంటే, వాళ్లు రాజాల్లా సినిమా చూసొస్తారు; నేను గుండెల్లో గుబిల్లు గుబిల్లుతో ఆ పని చేస్తాను. ఉల్లిగడ్డలు పట్టుకొచ్చేవాళ్లు అవసరమైతే వంటాయన్ని ఒక మాట అనగలరూ పడనూగలరూ. నేను అనలేనూ పడలేనూ. మంచో, చెడో ఏదో ఒకదానికి స్థిరీకరించుకోగలిగే స్వభావం నాకెందుకు లేదు? అందరితో ఉండి ఎవరికీ చెందక, ఎవరితోనూ పూర్తిగా ఉండకపోవడం వల్ల కూడా ఎవరికీ చెందక… ఎందుకిలా నేను? పోనీ, ఏ దృక్కోణం లేదన్న దృక్కోణం ఉన్నవాడిగానైనా చెప్పుకుందామంటే, నీళ్లు పట్టినతణ్ని మనసులో కూడా ‘గా… గాడు’ అనుకోకుండా ఉండగలిగే గాడిదితనం లేకుండా అయినా ఎందుకు లేను?
----------------------------------------------------------
రచన: పూడూరి రాజిరెడ్డి, 
ఈమాట సౌజన్యంతో