Saturday, December 10, 2016

కృష్ణుని సేవింప వచ్చిన శివుడా!


కృష్ణుని సేవింప వచ్చిన శివుడా!




సాహితీమిత్రులారా!


పింగళి సూరన కృత
ప్రభావతీ ప్రద్యుమ్నము నందలి
ఈ ఉత్ప్రేక్ష చూడండి-

ఇంద్రునికి ఆయన రథసారథి మాతలి ద్వారకా
పట్టణంలోని ఉద్యానవనం చూచి
తనఱేనికి ఈ విధంగా చెప్పుచున్నాడు-

కలధౌతకేళినగంబుగాఁ బోలును
         దనరుచున్నది శంభుతనువులీల
ఘనపుష్పచాంపేయ వనరాజి గాబోలు
         నేలుచున్నది పులితోలు సిరుల
హరినీల సోపానసరణి గాఁబోలును 
         బగటుచున్నది నల్లపాఁపపేరుఁ
బవడంపుటలవ సౌభాగ్యంబుగాఁబోలుఁ
         జాటుచున్నది జటాజూటరుచిని
సరసిగాఁబోలుఁ గ్రాలెడు సురనదిగతి
నోడగాఁబోలుఁ బోలెడునుడుపతికళ
ననిమిషాధిప చూచితే యల్లపసిడి
కోటనడిమి శృంగారపుఁదోఁటలోన
                                       (ప్రభావతీప్రద్యుమ్నము - 1- 63)

ఓ దేవతలరాజా! ఇంద్రా!
వెండి క్రీడా పర్వతము శివుని శరీరంగాను,
పచ్చని సంపెగ చెట్లచాలు పులితోలుగను,
నీలంపు మెట్లవరుస నల్లత్రాచుల హారంగాను,
పగడాల కంచె జటాజూటంగాను,
నడుమనున్న కొలను ఆకాశగంగగను,
ఆ కొలనిలోని నావ చంద్రకళగాను,
చెప్పి, ఉద్యానవనరూపమున శ్రీకృష్ణుని
సేవింపవచ్చియున్న శివుడు కాబోలు - అని
ఉత్ప్రేక్షించినాడు కవి.

ఇవి గుర్తుంచుకోవాలి


ఇవి గుర్తుంచుకోవాలి




సాహితీమిత్రులారా!


ఈ శ్లోకం చూడండి-

నవిగన్హ్య కథాంకుర్యా
ద్బహిక్మాల్యం నధారయేత్,
గవాంచయానంపృష్ఠేన
సర్వన్త వవిగర్హి తమే

నిందించే విధంగా ఎప్పుడూ ప్రసంగించకూడదు.
మనం ధరించినా గాని, ఇతరులు ధరించినాగాని
ఒకసారి బైట పారవేశాక ఆ పూల మాలలు ధరించకూడదు.
ఎద్దు మూపున ఎక్కి ప్రయాణించకూడదు.
అది శివుని వాహనం అని మరచిపోకూడదు.

Friday, December 9, 2016

వారు స్త్రీలు కారా?


వారు స్త్రీలు కారా?




సాహితీమిత్రులారా!


తంజావూరును పాలించిన విజయరాఘవుని
ఆస్థానంలో మన్నారుదాసవిలాసం(యక్షగానము) అనే
శృంగార కావ్యరచయిత్రి రంగాజీ (రంగాజమ్మ)
ఆస్థాన కవయిత్రిగా ఉండేది. చక్కని కవిత్వం చెప్పగలదిట్ట.
విజయరాఘవునిచేత కనకాభిషేక గౌరవాన్ని పొందినది.
ఆమె అంటే ఎక్కువ ప్రేమతో రాజుగారు ఎక్కువగా
ఆమెతోటి కాలం గడిపేవాడు. ఒకరోజు విజరాఘవుని భార్య
రంగాజమ్మ దగ్గరికి ఒక దూతికతో నిందా పూర్వకంగా
తన భర్త సాంగత్యము వదలుకొమ్మని సందేశం పంపినది.
దానికి రంగాజమ్మ ఈ పద్యంతో సమాధానం చెప్పింది.
చూడండి ఆ పద్యం -

ఏ వనితల్మముం దలపనేమి పనో! తమరాడువారు గా
రో వలపించు నేర్పెరుగరో! తమ కౌగిటిలోన నుండగా
రావది యేమిరా! విజయరామ! యటం చిలుదూరి బల్మిచే
దీవరకత్తెనైపెనగి తీసుకువచ్చితినా? తలోదరీ!

ఎవరైనా స్త్రీలు మావిషయం
స్మరించవలసిన అవసరంమేమి?
వారు స్త్రీలు కారా తమ భర్తను అనురాగంతో
వశపరచుకునే తెలివి వారికి లేదా?
నేను విజయరాఘవుడు ఆమె కౌగిలిలో ఉండగా
తీసుకొని వచ్చినానా? నన్ను నిందించటం ఎందుకు - అని భావం.

రాయలు తనంత తానే నా దగ్గరికి వస్తున్నాడు
రాణి తన ప్రేమతో ఆయనను బంధించలేనప్పుడు
నా దోషం ఏమున్నది అది ఆమె లోపమే
అని యుక్తిగా సమాధానమిచ్చింది.

తగినవానికి ఇవ్వలేక పోతే ఎలా?


తగినవానికి ఇవ్వలేక పోతే ఎలా?




సాహితీమిత్రులారా!


జాలి, దయ, కరుణ ఇవి అందరికీ ఉంటాయి.
అయితే అవి కొందరిలో ఎక్కువగాను మరికొందరిలో
తక్కువగాను ఉంటాయి. ఆ ఉన్న కరుణ ఎవరికైతే
అవసరమో వారికి చెందితే మంచిది. అలా కాని
పక్షంలో అది వృధా అవుతుంది దానికి సంబంధించిన
ఈ శ్లోకం చూడండి-
ఇది నీతిశాస్త్రంలోనిది-

దీనానా మిమ పరియహా శుష్కసస్యా
న్యేదార్యం ప్రకటయతో మహీదరేషు
ఔన్నత్యం పరమవాప్య దుర్మదస్య
జ్ఞాతోऽ యం జధర తావకో వివేకం

మేఘుడు లేదా వరుణుడు కరుణమాలి మితిమీరిన
గర్వం చేత కొండలలో, కోనల్లో అపారంగా వర్షం
కురిపించేస్తుంటాడు. దీనంగా ఆకాశం వంక చూస్తూ,
తమ పంటచేల పైన ఇంత వానను కురిపించమని
రైతులు మోరలు సాచి ప్రార్థిస్తున్నా అతనికి జాలి
కలగదు - అని భావం.

పంటచేలు ఎండిపోతున్నా, ఆర్భాటంగా పనికి రాని చోట్ల
కురిసే మేఘుడిలాంటి వాళ్లే లోకంలో కొందరుంటారు.
వీళ్లది ఉదారబుద్ధే కాని, అవసరమైన వారికి వీరి సహాయం
అందదు, వ్యర్ధులకు అందుతుంది.

Thursday, December 8, 2016

మందార మకరంద మాధుర్యమున (భావానుకరణ)


మందార మకరంద మాధుర్యమున (భావానుకరణ)




సాహితీమిత్రులారా!


అనుకరణ అనేది మన మనుగడకు మూలం.
అలాగే మంచి విషయాలు ఎక్కడఉన్నా
అవి స్వీకరించాల్సిందే
అలాంటి పనే మనకవులు చేశారు.
అలాంటి వాటిలో ఇది చూడండి-


పాల్కురికి సోమనాథుని బసవపురాణం
తృతీయాశ్వాసంలోని ఈ పద్యాలు(ద్విపద)
చూడండి -

క్షీరాబ్దిలోపల గ్రీడించు హంస 
గోరునే పడియల నీరు ద్రావంగ
జూతఫలంబుల జుంబించు చిలుక
జాతిబూరుగుమ్రానిపండ్లు గన్గొనునె
రాకామలజ్యోత్స్న ద్రావుచకోర
మాకాంక్షసేయునే చీకటిద్రావ
విరిదమ్మివాసన విహరించుతేటి
పరిగొని సుడియునే ప్రబ్బలి విరుల

ఈ ద్విపదపాదాలలోని భావాన్ని
బమ్మెర పోతన ఎంత మధురంగా కర్ణపేయంగా
మందార మకరందాన మత్తెక్కించారో
తెలియనివారు లేరనవచ్చు అది-

మందార మకరంద మాధుర్యమునఁ దేలు                           మధుపంబు బోవినే మదనములకు?నిర్మల మందాకినీ వీచికలఁదూఁగు                           రాయంచ సనునే తరంగిణులకు?లలితరసాల పల్లవఖాదియై చొక్కు                          కోయిల సేరునే కుటజములకుఁ?బూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం                          బరుగునే సాంద్ర నీహారములకు?అంబుజోదర దివ్యపాదారవిందచింతనామృతపానవిశేష మత్తచిత్తమేరీతి నితరంబు చేర నేర్చు?వినుత గుణశీల మాటలు వేయునేల?


భక్తి పారవశ్యంలో ఎంత
హాయిగా ఓలలాడించాడోగదా

దీన్నే నందికొటుకూరి సిద్ధయోగి
తన యోగీశ్వర విలాసంలో ఇలా అనుకరించారు-

నిగమాంతశాస్త్రముల్ నేర్చి ధైర్యమున
దగబ్రహ్మవిద్యా పదార్థంబు గూర్చి
కనికరంబెప్పుడు గలిగిన జియ్య
యెనయంగ నీవుగా కెశ్వరు గలరు
మానితభక్తి క్రమంబున ముక్తి
నేనేల వేడెద నితరుల జేరి
పదపడి తన తల్లి పాలు ద్రావంగ
మదినిచ్చయించెడు మాతంగపోత
మేలీలనైనను స్పృహనూరబంది
పాలకు బోవునే భక్తైకలోల
అంభోజ బృందాంత రాయుతైకాంత
బంభరంబులు చన్నె బర్బరంబులకు
సంపూర్ణ పూర్ణిమా చంద్రచంద్రికల
గుంపున నుండు చకోర సంచయము
చేరునే దట్టపు చీకట్ల కడకు
క్షీరపాధోధి వీచీనిత్యయుత సు
ధార సానంద మత్తమరాళచయము
కూరిమి జేర్చునే కుంటలకడకు
సహకార ఫలసార సౌఖ్యసత్కీర
బహుళౌఘ మేగునే బదరిశాఖలకు
నూతన ముదిర బంధుర తోయపాన
చాతకం బాసించి చనునెనూతులకు
లీల నీభంగి మేలిమి గృపావాల
శీల వాగ్జాల ప్రసిద్ధచే మున్ను
పుడమి బోధించి శంభుడవైన నిన్ను
విడిచి హృత్పద్మంబు వేరొక్కదారి
జనదయ్యజియ్య శిష్యస్వాంత శయ్య
(యోగీశ్వరవిలాసము -1- 289-315)

గమనించారా !
సోమన నుండి పోతన
పోతన నుండి సిద్ధయోగి అనుకరణ.

వీటికి దూరంగా ఉండాలి


వీటికి దూరంగా ఉండాలి



సాహితీమిత్రులారా!



ఏవైతే చేయకూడదో అవేవో తెలియాలికదా!
అందుకే మన పెద్దలు నీతిశాస్త్రం పేరుతో
అనేకానేక విషయాలను క్రోడీకరించి ఉంచారు-
వాటిలోని ఈ శ్లోకం చూడండి-

వైరిణం నోపసేవేత
సహాయం చైవ వైరిణ:,
అధార్మికం తస్కరించ
తదైవ పరయోసితమ్

ఆపదలు సంభవించ గల పనులు కొన్ని ఉన్నాయి.
అవి ఎన్నడూ చేయకూడదు-
శత్రువుతో గాని, శత్రువుకు సహాయపడే వానితో గాని,
ధర్మవర్తనుడు కాని వ్యక్తితో గాని,దొంగతోగాని,
పరస్త్రీలతో చెలిమిగాని - వారికి అనుకూలంగా
వర్తించడం తప్పక ఆపద కలిగిస్తాయి లేదా
అవమానాలనూ కలిగించవచ్చు
వీటిని లేదా వీరికి దూరంగా ఉండాలి.

Wednesday, December 7, 2016

ధనహీనుని జీవితము వ్యర్ధము


ధనహీనుని జీవితము వ్యర్ధము




సాహితీమిత్రులారా!


ఈ చమత్కార పద్యం చూడండి-

వాస శ్చర్మ విభూషణాని ఫణిన: భస్మాంగరాగోధునా
గౌరేక: నచ కర్షణే నకుశల: సంపత్తి రేతాదృశీ
ఇత్యాలోచ్య విముచ్య శంకర మగాత్ రత్నాకరం జాహ్నవీ
వ్యర్థం నిర్ధనికస్య జీవన మహోదారై రపిత్యజ్యతే


ధరించేది చర్మం,
ఆభరణాలు సర్పాలు,
అంగరాగము చితాభస్మము,
ఉన్నది ఒక్క ఎద్దు,
అది దున్నుటకు ఉపయోగపడదు.
ఈయన ఐశ్వర్యమిది -
అని ఆలోచించి గంగాదేవి
శంకరుని విడచి రత్నాకరుని
(సముద్రుని) చేరింది-
ఆహా! ధనహీనుని జీవితమెంత వ్యర్థము
చివరికి భార్యకూడా విడిచి పెడుతుందికదా!