Saturday, September 18, 2021
BBC RADIO DRAMA Mrs. M
Thursday, September 16, 2021
పానుగంటివారి కంఠాభరణం
పానుగంటివారి కంఠాభరణం
సాహితీమిత్రులారా!
పానుగంటివారి హాస్య నాటిక
కంఠాభరణం రేడియోలో
ప్రసారం చేయబడింది.
అది ఇక్కడ ఆస్వాదించండి-
Tuesday, September 14, 2021
రేడియోహాస్యకథ
రేడియోహాస్యకథ
సాహితీమిత్రులారా!
రచన - పొత్తూరి విజయలక్ష్మి
ప్రసారం ఆలిండియా రేడియో
ఆస్వాదించండి-
Sunday, September 12, 2021
సూరనగారి జైత్రయాత్ర
సూరనగారి జైత్రయాత్ర
సాహితీమిత్రులారా!
పింగళి సూరనగారి రాఘవపాండవీయంలోని ఈ పద్యం
అజమహారాజు(మరో అర్థంలో పాండురాజు) జైత్రయాత్రకు
వెళుతున్న సందర్భంలో కూర్చిన పద్యం
గమనించండి ఎంతటిదో-
తలపం జొప్పడి యొప్పెనప్పుడు తదుద్యజ్జైత్ర యాత్రా సము
త్కలికారింఖ దసంఖ్యసంఖ్య జయవత్కుంభాణరింఖా విశృం
ఖల సంఘాత ధరాపరాగ పటలాక్రాంతంబు మిన్నేఱన
ర్గళ భేరీరవ నిర్దళద్గగన రేఖాలేప శంకాకృతిన్
(రాఘవపాండవీయం - 1-09)
మహారాజు జైత్రయాత్రకు వెళ్లగా
అతని వెంట గుఱ్ఱపు దండు భేరీదళం ఉన్నది.
అతని గుఱ్ఱపు దండు విశృంఖలంగా పరుగెత్తుతూ ఉంటే
వాని గిట్టలతో లేచిన దుమ్ముతెరంతా ఆకాశగంగలో పడి
అదంతా పలుచని బురదగా మారిపోతోంది.
రాజుగారి వెంట ఉండే భేరీల మ్రోతలకు దద్ధరిల్లి
ఆకాశం బీటలు వారుతుండగా
ఆ ఆకాశ గంగ యొక్క పంకం(బురద) అంతా నెఱ్ఱెలు వారిన
ఆకాశాన్ని పూయటానికి కలిపిన అలుకువలె ఉన్నది - అని భావం
ఎంతటి ఊహోకదా!
Friday, September 10, 2021
ఎఱ్ఱనగారి మధుపానం
ఎఱ్ఱనగారి మధుపానం
సాహితీమిత్రులారా!
ఎఱ్ఱనగారు తన నృసింహపురాణంలో తృతీయాశ్వాసంలో హిరణ్యకశిపుడు
వనవిహారం వెళ్ళినపుడు అక్కడ చీకటిపడగా అక్కడే గుడారాలు వేసుకొని
ఉన్నాడు అప్పుడు చంద్రోదయం తర్వాత మధుపానం చేయడం మొదలు పెట్టారు
ఆ సందర్భంలో మధుపాత్రలో చంద్రుడు ఎలా కనిపించాడో కొన్ని పద్యాల్లో వర్ణించారు
ఎఱ్ఱనగారు. వాటిలోని ఒక పద్యం ఇక్కడ-
సురుచిర పానపాత్రమున సుందరి యొక్కతె కేల నిండుచం
దురుఁడు ప్రకంపితాంగకముతోఁదికించెఁ దదాననాంబుజ
స్ఫురిత వికాస వైభవము సొంపు లడంకువ మ్రుచ్చలింపఁ జె
చ్చెరఁ జనుదెంచి పట్టువడి చేడ్పడి భీతి వడంకు చాడ్పునన్
(నృసింహపురాణము - 3- 97)
ఒక సుందరి(అందాలరాశి) చేతిలో
అందమైన పానపాత్ర
అందులో నిండు చందురుడు ప్రకంపిత (కదలాడే)
అంగకముతో(రూపంతో) ఎలా కనిపించాడంటే
ఆమె ముఖపద్మం తాలూకు విస్ఫురిత వికాస వైభవాల సొంపుల్ని
అణకువతో దొంగిలిండానికి వేగంగా వచ్చి పానపాత్రలో పట్టుబడి
నిశ్చేష్టుడై భయంతో వణికిపోతిన్నట్టు కనిపించాడు
(ఆమె కంటికి అలా అనిపించాడు
లేదా ఆమె అలా తిలకించింది.) - అని భావం.
Wednesday, September 8, 2021
కంకంటివారి జలక్రీడ
కంకంటివారి జలక్రీడ
సాహితీమిత్రులారా!
కంకంటి పాపరాజు గారు తన
ఉత్తర రామాయణంలో ఆరవ ఆశ్వాసంలో
సీతారాముల జలక్రీడావర్ణన లోని
ఒక పద్యం గమనించండి-
మొగములు గానరా నిగిడి కామిను లీఁదఁ
గొల నెల్లఁ జంద్రమండలము లయ్యెఁ
గుచములు గానరాఁ గొమ్మ లీఁద సరోవ
రం బెల్లఁ గమలకోరకము లయ్యె
గ్రొమ్ముడుల్ గానరాఁ గొమిరె లీఁదఁగఁదటా
కంబెల్ల గాఢాంధకార మయ్యెఁ
బిఱుఁదులు గానరా బిసరుహానన లీఁద
దీర్ఘికాంతర మెల్ల దీవు లయ్యె
బాహువుల్గానరాఁ బద్మపాణు లీఁద
నరసి యెల్ల మృణాళైకసదన మయ్యె
నంగములు గానరాఁ గాంచనాంగు లీఁద
సారసాకర మెల్ల బంగార మయ్యె
(ఉత్తరరామాయణము - 6-82)
ఈ పద్యంలో యువతులు సరస్సులో దిగి ఒక్కోసారి ఒక్కొక్క అవయవం కనబడే విధంగా ఒక్కొక్క విధమైన ఈత ఈదుతుంటే ఆ సరస్సు ఎలావుందో కంకంటివారు వర్ణిస్తున్నాడు
మొగములు గానరా నిగిడి కామిను లీఁదఁ
గొల నెల్లఁ జంద్రమండలము లయ్యెఁ
కామినులు(స్త్రీలు) ముఖాలు కనపడే విధంగా వెల్లకిలా నిలువుగా నిగిడి(సాగి) ఈదుతుంటే కొలనంతా చంద్రబింబాలతో నిండినట్లయింది ప్రతిముఖం చంద్రునిలా ఉండడంచేత
గుచములు గానరాఁ గొమ్మ లీఁద సరోవ
రం బెల్లఁ గమలకోరకము లయ్యె
కుచాలు కనబడేవిధంగా ఆ కొమ్మలు(యువతులు) ఈదుతుంటే సరస్సంతా కమలకోరకమ్ముల(తామర మొగ్గల)తో నిండినట్లుంది. వారి కుచాలు తామరమొగ్గల్లా ఉండటంతో
గ్రొమ్ముడుల్ గానరాఁ గొమిరె లీఁదఁగఁదటా
కంబెల్ల గాఢాంధకార మయ్యెఁ
కొమెరలు(యువతులు) బోర్లా పడుకొని కేశపాశాలు నీటిమీద పరుచుకొని కనబడే విధంగా ఈదుతుంటే సరస్సంతా దట్టమైన చీకటితో నిండినట్టయినది. అంతమంది స్త్రీల ముడుల నల్లదనమంతా సరస్సంతా వ్యాపించడంతో
బిఱుఁదులు గానరా బిసరుహానన లీఁద
దీర్ఘికాంతర మెల్ల దీవు లయ్యె
బిసరుహాననలు(తామరపూలవంటి ముఖాలున్న స్త్రీలు) పిఱుదులు కనబడేవిధంగా ఈదుతుంటే సరస్సుమధ్యంతా దీవులతో నిండినట్లయింది. పిఱుదులు దీవుల్లా వుండంతో
బాహువుల్గానరాఁ బద్మపాణు లీఁద
నరసి యెల్ల మృణాళైకసదన మయ్యె
నంగములు గానరాఁ గాంచనాంగు లీఁద
సారసాకర మెల్ల బంగార మయ్యె
కాంచనాంగులు(బంగారువంటి శరీరంగల యువతులు) శరీరాలు కన్పడేవిధంగా సరస్సంతా బంగారమైంది.
Monday, September 6, 2021
కన్నుల వర్ణన
కన్నుల వర్ణన
సాహితీమిత్రులారా!
ముకుందవిలాసంలోని ఈ పద్యం గమనించండి-
ఇది భద్రాదేవి కన్నులను గురించి చెప్పే పద్యం.
ఒకయేటఁ జిక్కె మీనము
నొకనెలకేఁ చిక్కెఁ పద్మమొక పగటింటన్
వికలతఁ జిక్కెంగుముదము
టకి నయనసమంబులగునె జడగతులెపుడున్
(ముకుందవిలాసము - 1-219)
భద్రాదేవి నేత్రసామ్యాన్ని పొందటానికి
చేప, తామర, కలువ ప్రయత్నించాయట.
దానిలో చేప ఒక ఏట (సంవత్సర కాలంలో)
కృశించిపోయిందట.
తామర ఒక నెలలోనే చిక్కిపోయిందట.
కలువ ఒకరోజులోనే చిక్కిపోయిందట.
కావున అవి భద్రాదేవి నయన సామ్యం
పొందలేక పోయాయని తెలుస్తున్నది.
కానీ దీనిలోని అసలు అర్థం అదికాదట -
మరి ఎలా అంటే -
చేప ఏటిలో(నదిలో) చిక్కిపోయిందట
తామర ఒక నెలకే చిక్కె (వెన్నెలలో) చిక్కిందట
(అంటే వెన్నెలలో తామర ముడుచుకు పోతుంది)
కలువ ఒక పగటింట(పగలులో) చిక్కెనట
(అంటే పగలు సూర్యుని వెలుతురులో
కలువ ముడుచుకుపోతుంది) ఈ విధంగా అవి
భద్రాదేవి నయనాల సామ్యం కాలేక పోయినవట.
చిన్న పదాల విరుపుకూడాకాదు పునరుక్తిచే
చమత్కరించారు ఈ కవి కాణాదం పెద్దనామాత్యుడు

