Saturday, March 23, 2019

పనిపిల్లలు


పనిపిల్లలు




సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి..................

“అమ్మా నేను బడికి పోతానే … అందరు పిలకాయల్లాగా నేను కూడా మంచిగా చదువుకుంటానే ” పొద్దున్నే నిద్ర లేచి కళ్ళు నలుపుకుంటు అడిగాడు తల్లిని

” పోతావురా నువ్వు బడికి పోతావు … మీ అయ్య వల్లకాటికి పోతాడు నేను రెక్కలు ముక్కలు చేసుకుని మీ ఇద్దర్నీ పోషిత్తా ….. బడికి పోతాడంట బడికి అయినా బడికి పోయేది మనసుంటోల్లు కాదురా దానికీ ఎప్పుడో పుణ్ణెం చేసుకోనుండాలి …. పొద్దున్నే ఎదవాలోచనలు చెయ్యకుండా లేచి పనికి బయలుదేరు ” తల్లి మందలింపుతో ఆ పసి హృదయం చివుక్కుమంది

“అదేందమ్మా పిలకాయలు బడికి పోము మొర్రో అంటుంటే వాల్ల అమ్మా వాల్లు పొమ్మని బతిమాలుతుంటారు నువ్వేమో నేను బడికి పోతానమ్మా అంటే తిడుతున్నావు” అమాయకంగానే అడిగినా తల్లి హృదయానికి తగిలాయామాటలు , చెప్పేందుకు సమాధానంలేదు తనదగ్గర.

“చెప్పానా పిచ్చి పిచ్చి గా అదీ ఇదీ ఆలోచించొద్దని “ కోపంగా చెప్పింది , అంతే కిమ్మనకుండా ఇంట్లోకి వెల్లి సద్దెన్నం తిని అక్కడినుండి బయలుదేరాడు, కొంచం సేపు అక్కడా ఇక్కడా తిరిగి , బడి మొదటిగంట కొట్టే టైంకిి ఆ వీధి చివర వేపచెట్టు కిందున్న అరుగుమీద కూర్చుని ఆ దారి వెంట వెల్లే వాల్లను చూస్తూ ఉన్నాడు

రోజూ చూసేదే అయినా ఏరోజు కారోజు కొత్తగానే అనిపిస్తుంటుంది జట్లు జట్లుగా వడి వడి గా నడుచుకుంటూ భుజానికి వ్రేలాడే పుస్తకాల సంచులతో కొందరు అమ్మో , నాన్నో , అమ్మమ్మో , నాన్నమ్మో లేక తాతయ్యో ఎవరిదో ఒకరి వేలుపట్టుకుని బుడి బుడి అడుగులు వేసుకుంటూ మధ్య మధ్యలో ఆగి తనకు వింతగా కనిపించినదేదో చూస్తూ, జారిపోతున్న నిక్కరును ఓ చేత్తో పైకి లాక్కుంటూ నడిచే చిన్నారులు కొందరు నేను బడికెల్లను మొర్రో అని మారాం చేస్తుంటే చంకనేసుకుని ఎందుకెల్లవు రా అని గదుముతూనో లేక వెల్తే నీకు అది కొనిపెడతాను ఇది కొనిపెడాతాను అని బుజ్జగిస్తూ తీసుకెల్లే వాళ్ళు కొందరు ఇలా అందరి గమ్యం ఒక్కటే అదే బడికి వెల్లి చదువుకోవడం

మనసులో ప్రతీ రోజూ వచ్చే ఆలోచనే బడి గంట మోత వింటూ అందరిలాగా పుత్తకాల సంచీ తగిలిచ్చుకుని “అమ్మా నేను బడికెల్తన్నానే ” అంటూ బయలుదేరేదెప్పుడు, అయినా ఇంత మంది పిలకాయలు చేసుకున్న పుణ్ణెమేంది నేను చేసుకున్న పాపమేంది ఒకేళ నేను పాపమే చేసుంటే దానికి పరిహారం ఈ జల్మకు లేనట్లేనా ఒకవేళ ఉంటే ఎప్పుడు , నేనూ అందరిలా బడికెల్లేదెప్పుడు? ఇలా ప్రతీ రోజూ ఓ అరగంట ఆ అరుగుమీద కూర్చుని ఉదయమే బడికి వెల్లే పిల్లల్ని చూస్తూ తనలో తాను బాధపడుతూ తనను తాను ప్రశ్నించుకుంటూ ఉంటాడు

“ఓరి కిట్టిగా ఎక్కడ చచ్చావు రా …. టైమవుతా ఉండాది పనిలోకి పోవా ఏందియ్యాళ …..” వీధికి ఆచివర ఉండి అరిచింది లచ్చమ్మ

ఒక్కసారి స్పృహలో కి వచ్చాడు కిట్టిగాడు పుట్టినప్పుడు మంచిగా కృష్ణమోహన్‌అని పేరుపెట్టారు కాని వాడికి ఊహ తెలిసినతరువాత పిలిచే ప్రతి ఒక్కరూ కిట్టిగా అనేవాల్లేగాని అసలుపేరుతో పిలిచినవాళ్ళు లేరు

” ఆ వత్తన్నా ఎందుకంత గొంతు చించుకోని అరుత్తుండావ్‌పనిలోకి పోక సత్తాన చెప్పు ” అంటూ తల్లి కి ఎదురెల్లి చేతిలో ఉన్న సంచీ తీసుకుని బుజానికి తగిలించుకుని తనలో తానే చిన్నగా నవ్వుకుంటూ అక్కడినుండే వెనుతిరిగాడు ‘అందరూ పుస్తకాల చంచీ తగిలింకుకుంటుంటే నేను తిండిబోతోడి లా మద్దేనం తినేదానికి సంచీ తగిలించుకుంటున్నా ‘ మనసులో అనుకుంటూ నడుస్తున్నాడు

“ఏందిరో నీలో నువ్వే తెగ నవ్వేసుకుంటున్నావ్‌….. మాకూ చెపితే మేం కూడా కొంచం నవ్వుతాంకదా ” నవ్వుతూ అడిగాడు అప్పటిదాకా కిట్టిగాడికోసమే ఎదురుచూస్తూ ఉన్న రాముడు, రాముడు వయసులో కిట్టిగాడికన్నా ఓ మూడేల్లు పెద్దవాడు ఇద్దరూ మంచి స్నేహితులు చిన్నప్పటినుండీ ఇద్దరూ ఒకే చోట పని చేస్తున్నారు

“ఎంతసేపయిందేంది నువ్వొచ్చి ” అడిగాడు కిట్టిగాడు

” ఆ ఇప్పుడే మీ అమ్మ నీకోసం కేకేసిందే అదిని ఇంట్లో నించి బయటకొచ్చా ఇక నువ్వు రాకపోతావా అని ” చెప్పి “అదిసరే ఎందుకు నవ్వుతున్నావో చెప్పలేదు ” అడిగాడు

“ఏమీలేదురా ఊరికే సంచి తగిలించుకుంటుంటే నవ్వొచ్చింది ” అంటూ తనకు నవ్వురావడానికి గల కారణం చెప్పాడు

ఈ సారి నవ్వడం రాముడి వంతయింది “ఇప్పుడు నువ్వెందుకు నవ్వుతున్నావురా …. అందుకే నేనెవరికీ ఏదీ చెప్పకూడదనుకుంటా ” చెప్పాడు కిట్టిగాడు

“అందుక్కాదులేరా నా చిన్నప్పుడు నేనూ నీలా నే అనుకునే వాడిని అది గుర్తొచ్చి నవ్వొచ్చింది అంతే ….. నిన్ను ఎగతాలి చెయ్యడానికి నవ్వలేదు ” సంజాయషీగా చెప్పాడు

“నీక్కూడా అలానే అనిపించేదా ? ” అమాయకంగా ప్రశ్నించాడు

“ఏ నేను మాత్రం నీలా మనిషిని కాదా …. నాకూ బడికెల్లి చదువుకోవాలని ఉండదా ?” చెప్పాడు

” ఒరే నాకో చిన్న అనుమానం అడగనా ? ” మెల్లగా అడిగాడు కిట్టిగాడు

“అడుగురా….”

“అదే రా మనం ఒక్కసారన్నా బడిలో అడుగుపెడతామంటావా ?? ” ప్రశ్నించాడు

“నీసంగతి నాకు తెలియదుకాని నేను మాత్రం రెండు మూడేల్ల క్రితం ఒకసారి ఓ వారం రోజులు బడికెల్లాను రా …..”

నడుస్తున్నవాడల్లా ఒక్కసారిగా నిలబడిపోయి “నిజమా ” ఆశ్చర్యపోతూ అడిగాడు

“నిజమేరా ” చెప్పాడు

” మరి నాకెప్పుడూ చెప్పలేదే” మల్లీ తిరిగి ప్రశ్నించాడు

“ఇందులో చెప్పేదానికేముంది అప్పుడేదో అట్టా జరిగింది ”

“మీ అమ్మా అయ్యా నిన్ను బడికి పంపించారా ” ఇంకా నమ్మకం కుదరనట్లు అడిగాడు

“వాల్లు పంపించలా ….. బడిలో అయ్యోర్లొచ్చి తీసుకెల్లారు ”

“అదెట్టా …”

“అప్పుడేదో పండగంట …. అదేంపండగబ్బా ” అని తల గోక్కుంటూ కొంచం సేపు ఆలోచించుకుని ” ఆ అదే చదువుల పండగ , ఆ పండగప్పుడు పిల్లలు పనిలోకిపోకూడదని గవర్నమెంటోల్లు రూలు పెట్టారు అందుకే సేటు ఆ వారంరోజులు సెలవిచ్చాడు మా అయ్య వేరే గత్తెంతరం లేక బడికి పంపించాడు

“చదువుల పండగా ?” నేనెప్పుడూ వినలేదే ఇది అడిగాడు కిట్టిగాడు

“నేనుకూడా అప్పుడే విన్నా … అంతక ముందుగానీ ….. ఆ తరువాతగానీ ఎప్పుడూ ఇనలా ”

“మరి అన్నీ పండగలూ పెతేడూ వత్తయి కదా మరి ఈ పండగ రాదా … ? ” అమాయకంగా ప్రశ్నించాడు

“అదే నాకూ అద్దం కావటల్లా అన్నీ పండగల్లా అది పతేడూ రావడంలేదు ఎందుకో నాకయితే తెలియదు ” చెప్పాడు

“అయినా మనం బల్లోకని వెల్తే ఇంట్లో కూడెలా వత్తదిరా చెప్పు మీ అమ్మా మాయమ్మా నాలుగిల్లలో పాసిపని చేసి ఒకపూట వాల్లు పెట్టే ముద్ద తీసుకొచ్చి మనకు పెడతండారు వాల్లు నెలకిచ్చే వందో రెండొందలో రెండో పూటా మూడో పూటా మన తిండికే సరిపోదు మరి రోగాలనీ దవాఖానాలని ఇంటి ఖర్చులని వీటన్నిటికీ డబ్బులెలా వత్తాయ్‌రా ”

“చదువుకున్నాక పెద్ద ఉద్దోగం చేత్తాం కదా, అప్పుడు మరిన్ని డబ్బులొస్తాయి కదా ” మరిన్నీ అనే పదాన్ని నొక్కిపలుకుతూ చెప్పాడు కిట్టిగాడు

” ఓ రి పిచ్చి మొద్దా పెద్ద చదువులు చదవాలంటె పుత్తకాలనీ , పీజులనీ డొనేషన్లనీ చాలా డబ్బులు కావాలి మన దగ్గర అన్ని డబ్బుల్లేవు అలా కాకుండా ఇప్పుడు బడికెల్లినా పెద్ద పీజులు కట్టే చదువుకొచ్చేటప్పటికి మనం మల్లీ ఇదే పని చెయ్యాల , అప్పుడు చదువు మద్దెలో మానేయడమంటే చాలా బాదగా ఉంటాది అందుకే ఇప్పుడునుంచే ఈ పని చేస్తే ఏ బాదా ఉండదు ” వివరంగా చెప్పాడు రాముడు

“ఇవన్నీ నీకెలా తెలుసురా “అడిగాడు కిట్టిగాడు

“మన కాలనీలో ఎంతమంది లేరు చదువుకుంటు చదువుకుంటు మద్దెలో మానేసినోల్లు వాల్లందరికీ చదువుకోవాలనే ఉం టుంది కానీ అందరూ పుత్తకాలకీ పీజులకీ డబ్బుల్లేక మద్దెలో మానేసినోల్లే ” చెప్పాడు రాముడు

“రేయ్‌ఏందిరా నీటకంగా పెళ్లి నడక నడుస్తున్నారు తొందర్రండి అవతల టైం అయిపోతుంది …. వచ్చి బండెక్కండి ” సూపర్వైజర్‌కేకతో ఈ లోకంలోకొచ్చారిద్దరూ

“అప్పుడే అడ్డాకాకికొచ్చామా ? ” ప్రశ్నించాడు కిట్టిగాడు

“ఆ …. పద వాడు తిడతాడు ” సూపర్వేజర్నుద్దేసించి చెప్పాడు రాముడు

“అదికాదురా …..” ఎదో చెప్పబోయాడు కిట్టిగాడు

“ఇప్పుడుకాదు ఆనక్క మాట్టడుకుందాం పద బండెక్కు ” అంటూ పరిగెత్తుకెల్లి బండెక్కాడు రాముడు, రామున్నే అనుసరించాడు కిట్టిగాడు

ఇద్దరూ ట్రక్కులోకెక్కారు ఆ ట్రక్కులో తమలాంటి పిల్లాలే ఎక్కువ మంది మొత్తం నలబై మందికి పైగా ఉన్న ఆ ట్రక్కులో ఓ ఏడెనిమిది మంది మాత్రమే పెద్దవాళ్ళుంటారు మిగిలిన అందరూ ఏడు సంవత్సరాల వయసునుండి పదిహేనేల్ల వయసు మగపిల్లలూ ఆడపిల్లలే వీల్లందరూ పనిచేసేది ఝూట్‌మిల్లులో ఎక్కిన కొంచం సేపటికే బండి కదిలింది.

బండి దిగి అందరూ లైనులో నిల్చున్నారు ఒక్కొక్కరి సంచి చెక్‌చేసి పేరు చెప్పాక రిజిస్టరులో హాజరు వేసుకుని లోపలకు పంపిస్తారు సెక్యూరిటీ వాళ్ళు. గేటులో నుండి లోపలకు అడుగుపెట్టడంతోటే ఎవరి లైనుకు వాళ్ళు వెళ్ళిపోతారు లోపలంతా దుమ్మూ ధూళి. ఒక్కోసారి నాలుగైదు అడుగుల దూరంలో ఉన్న వ్యక్తి కూడా కనిపించనంతగా దుమ్ము లేస్తుంది అదే పీల్చుతూ లోపల పనిచేసేవాల్లకు అవీ ఇవీ అందించడం ఉదయం నుండి సాయంత్రం వరకూ ఒక్కచోట నిలబడడానికి కానీ కూర్చుంటానికిగానీ ఖాలీ దొరకదు మధ్యాహ్నం అన్నం తినేందుకు కేవలం అరగంట మాత్రమే టైం ఉంటుంది ఇంతా కష్టపడితే వచ్చేది రోజుకు ఇరవై నుండి ముప్పై రూపాయలు అదీ వయసునుబట్టి

ఆరోజు మద్యాహ్నం అన్నం తినేటప్పుడు మల్లీ బడి ప్రస్తావన తెచ్చాడు కిట్టిగాడు “అదిసరే రా నువ్వు పొద్దున చెప్పావే బడి మానేసినోల్లంతా పీజులు కట్టలేకో పుత్తకాలు కొనలేకో మానేసారని మరి గవన్నమెంటోల్లు మనసుంటోల్లకు పీజులు కట్టించుకోరంట అదీకాక పుస్తకాలుకూడా ఇస్తారంటకద ” అడిగాడు

“ఒరే నీకు తెలీదురా పీజులు కొన్నిరోజులే కట్టించుకోరు పుత్తకాలిత్తారు కానీ నోడుసులు అవీ ఇవీ చాలా ఉంటాయ్‌కదా అవన్నీ మనమే కొనుక్కోవాల అయినా ఆల్లు చెప్పేది ఒకటి చేసేది ఒకటి నీకివన్నీ తెలియదు ర అనవసరంగా బడిగురించి ఆలోచించకుండా పని చేసుకో ఎక్కువాలోసిత్తే పిచ్చెక్కుద్ది ”

“అవున్రా నాకు బడి పిచ్చెక్కింది ”

“అరే కిట్టిగా నీకో విషయం చెప్తా వింటావా మనం ఎంత అనుకున్నా చదువుకోలేము నేనూ చదువుల పండగప్పుడు బడికి పోయినప్పుడు ఎంతో ఆనంద పడ్డా ఇక నా జీవితం మారిపోయింది అందరిలా నేనుకూడా చదువుకోవచ్చు అని కానీ ఏమయింది వారం గడిచాక ఆ పండగ అయిపోయాక మల్లీ బడికిపోతానంటే మా అమ్మా, అయ్యా ఒప్పుకోలేదు చదువుల పండగప్పుడు పనిలో కి రానివ్వని సేటు పండగయిపోగానే ఇంటికి సూపెర్వేజర్ని పంపాడు పనిలోకి తీసుకురమ్మని పోనీ ఆ అయ్యోరన్నా వచ్చి మీ అబ్బాయిని బడికి పంపించండి అంటాడేమో అని ఓ వారం రోజులదాకా ఎదురుచూశా ఎమీ లాబం లేదు అందుకే అట్టాంటి పండగొచ్చినా ఈ సారి నేను బడికి పోదలుచుకోలేదు ”

“ఏ ఎందుకు ” అయోమయంగా అడిగాడు కిట్టిగాడు

“ఎందుకంటే వారం రోజులో పదిరోజులో పోతే కనీసం ఓ న మః లు కూడా రావు…తరువాత ఆ బడికి పోయిన రోజుల్ని గుర్తు చేసుకుంటూ చానాలు బాద పడాల ”

ఆలోచనలో పడ్డాడు కిట్టిగాడు

ఇంతలో అన్నం టైం అయిపోయింది మళ్లీ ఎవరి పనిలోకి వాళ్ళు వెల్లిపోయారు

******

సాయంత్రం ఆరుగంటలకు మల్లీ ట్రక్కులో ఎక్కారు, ఇంటికొచ్చి నీల్లుపోసుకుని అన్నంతిని పక్కమీద పడుకున్నాడు, వాడి ఆలోచనంతా ఒక్కటే ‘ నేను బడికెల్లి చదువుకోవాలంటే ఏం చేయ్యాల ?,

‘అయ్యా బడికిపోతానే అంటే ఏడిచావ్‌ ఎదవ , బడి గిడి అన్నావంటే చమడాల్‌ తీత్తా అయినా చదివి నువ్వేం సేత్తావ్‌రా పని చేసుకుంటే నాలుగు డబ్బులన్నా వత్తాయి అని తన్నినంత పని చేత్తాడు పనికి పోతే నాలుగు డబ్బులొత్తాయ్‌అని చెప్పే ఆయనెందుకు పనికిపోడో అడుగుదామంటే నిజంగానే తంతాడేమో అని బయం, ఆ పసాదు గాడు చేసినట్టు చదువుకోసం దొంగతనం చేసి జైలుకెల్తే ? వచ్చాక అందరూ దొంగోడంటారు అదీకాక అమ్మ నన్ను చూడకుండా ఉండలేదు మరేం చేయాల, తెల్లారే లోగా ఏదో ఒకటి చేయ్యాలంతే ‘ ఆలోచిస్తా నిద్రలోకి జారుకున్నాడు కిట్టిగాడు

“అమ్మా నేను బడికి పోతానే , అందరిలా చదువుకుని పెద్దయ్యాక నిన్ను మారాణిలా చూసుకుంటానే నన్ను బడికి పంపవే నీకు దణ్ణం పెడతా

చూడవే అందరు పిలకాయలు బడికెల్లోచ్చి ఎంచగ్గా ఆడుకుంటున్నారు నేనలా ఆడుకోనే ఈ టైములో ఏదన్నా పనిచేసి నాలుగు డబ్బులు తెత్తానే , ఎప్పట్లాగే నీకు సాయంగా ఉంటానే నీకు పుణ్ణెముంటదే అయ్యకు ఏదోకటి చెప్పి నన్ను బడికిపంపవే … ” మొదట్లో వాడేమంటున్నాడొ అర్దం కాకపోయినా పదే పదే ఈ విషయాన్నే కలవరిస్తుండడంతో ఒక్కసారి కళ్ల వెంట నీరు కారడం మొదలయింది లచ్చమ్మకి నిద్దర్లో ఏడుస్తున్న కిట్టిగాడి పక్కనే కూర్చుని వాన్ని తన ఒల్లో పడుకో పెట్టుకుని వాడికల్లు తుడుస్తూ ” ఏమి చెయ్యనురా నేను …చావనా చెప్పు, మీ అయ్య ఏదయినా పని చేత్తే నువ్విలా కట్టపడాల్సిన పనేముంది ఆడు పని చెయ్యడు నేను తెచ్చే సొమ్ము మనం తింటానికి సరిపోదు కన్న కొడుకు చదువుకుంటానంటే బడికి పంపలేని దరిద్రురాలి కడుపున పుట్టావు రా ఈ జనమకి మీ అయ్యా మారడు , మనకీ కట్టాలూ తప్పవు, కనీసం వచ్చే జనమలో అన్నా బడికి పంపించే చల్లని తల్లి కడుపున పుట్టి నీ కోరిక తీర్చుకో ” అంటూ తాను ఏడుస్తూనే వాన్ని సముదాయిస్తుంది లచ్చమ్మ.

******
ఉదయం నిద్రలేచి పక్కమీద కిట్టిగాని కోసం చూసింది లచ్చమ్మ ఇంటి చుట్టుపక్కలవెతికి కనిపించిన వాల్లందరినీ అడిగింది ఎవరూ చూడలేదనడంతో గుండెలు బాదుకుని ఏడుస్తుంది.
-------------------------------------------------------
రచన: కె . యస్ . వరప్రసాద్, 
ఈమాట సౌజన్యంతో

Friday, March 22, 2019

రంగులూ మాటాడతాయి!


రంగులూ మాటాడతాయి!




సాహితీమిత్రులారా!

ఈ కవితను ఆస్వాదించండి..............

గీతలూ గీయని, రంగులేవీ అద్దని పటవస్త్రం
జీవితమెలా అవుతుంది?
అర్థమయో అర్థంకాకో
కొన్ని గీతలు గీయాలి
కొన్ని రంగులు అద్దాలి

గీత గీసే ముందూ రంగులద్దేముందూ
ఒకింత పరికించుకో
ఆకసానికి ఆకుపచ్చనీ
గడ్డిపరకకు నీలాన్నీ అద్దకు
నవ్వుకూ కన్నీటికీ
ప్రతి రంగుకూ ఓ భాష వుంటుంది
కొంచెం గమనించుకో

ఉన్నాయి కదా రంగులని
ఊరికే అతిగా పులమకు
కోపం మరింత ఎర్రబడినా బాగోదు
నవ్వులు తెల్లబడినా బాగోదు

ఇన్ని మనసుల ప్రపంచంలో
ఎన్నో కష్టాలూ సుఖాలూ
నవ్వులు ఏడుపులూ
ఈ రంగులన్నిటినీ చక్కగా కలుపుకో

ఆ గుసగుసలు పోయే గాలి పాటని
అదుగో ఆ మెరుపు నవ్వు చూపుని
ఈ హోరుగాలి గుండె బరువును
కలగలిపి వేసిన చిత్రాన్నలాగే
వదిలేయకు

గుండె అంగీలా చుట్టుకో
నవ్వుల పటంగా కట్టి
కనీసం ఒక్కరితోనైనా పంచుకో
---------------------------------------------------------
రచన: విజయ్ కోగంటి, 
ఈమాట సౌజన్యంతో

Thursday, March 21, 2019

రి సైకిల్


రి సైకిల్




సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి.................

రంగనాథానికి పేపర్లు, అవే దినపత్రికలు అతి జాగర్తగా దాచి నెలాఖరుకి “పాతపేపర్లు కొంటాం, పాత డబ్బాలు కొంటాం” అని అరుచుకుంటూ వచ్చే గడ్డం సాయిబ్బు కోసం ఎదురుచూడడం అక్కడ ఉండేరోజుల్లో మామూలే!

ఆ రోజుల్లో పేపర్లు అమ్ముకుంటే వచ్చే డబ్బులు వాడికి కనీసం వారం రోజులకి సిగరెట్ల ఖర్చుకి సరిపోయేది. అందుకని, వాళ్ళ ఇంటిపక్కన కోమట్ల ఇంట్లో అద్దెకుండే గాంధీ స్కూల్ టీచరమ్మ గారు పేపరు అడిగి తీసుకోపోతే, తిరిగి ఇచ్చేవరకూ వదిలిపెట్టేవాడే కాదు. ఈ పేపర్లు అమ్మిన డబ్బుల జమా ఖర్చు చెప్పమని వాడి అమ్మగారు కానీ, నాన్న గారు కానీ, అడిగే వారు కారు. రంగనాధం తమ్ముడు రామచంద్రం బాగా చిన్నవాడు. వాడికి రెండు చాక్లెట్లు కొని ఇస్తే వీడి సిగరెట్ల విషయం కూడా గప్చిప్ రహస్యమే. అంతేకాదు. అప్పుడప్పుడు, ఎవరి ఇంటిముందైనా పేపరు పడి వుంటే, అటూఇటూ చూస్తూ, కాలితోతన్నుకుంటూ ఏమీ ఎరగనట్టుగా నటిస్తూ వాళ్ళ పేపరు ఎత్తుకొచ్చిన రోజులు కూడా లేకపోలేదు. ఈ కళలో ఆరితేరిన వాడు రంగనాధం గురువు చిన సుబ్బయ్య చౌదరి. చిన సుబ్బయ్య చౌదరే రంగనాధానికి సిగరెట్లు కాల్చడం నేర్పిన గురువు కూడాను.

రోజూ పొద్దున్నే విస్సిగాడికి తోడుగా, రంగనాధం, చిన సుబ్బయ్య చౌదరీ కోట దిబ్బకింద పెరుగు చెట్టు దగ్గిరకి వెళ్ళేవాళ్ళు. పెరుగు చెట్టు అంటే పెద్ద మర్రిచెట్టు. పొద్దున్నే, ఆచెట్టుకింద పక్కూరి గొల్లలు కుండల్లో పెరుగు తెచ్చి అమ్మే వాళ్ళు. ఆ చెట్టుని ఊళ్ళో అందరూ పెరుగు చెట్టు అనేవాళ్ళు. ఇప్పుడు ఆ చెట్టు కొట్టేసి సిమెంటు రోడ్డు వేసేశార్లేండి. విస్సిగాడు రోజూ వాళ్ళ ఇంటికి పెరుగు కొనటానికి పెరుగు చెట్టు దగ్గిరకి వెళ్ళే వాడు. రంగనాధం, చిన సుబ్బయ్యా విస్సిగాడికి తోడు! అసలు మతలబు ఏమిటంటే, ఆ వీధిలో షావుకార్ల ఇళ్ళముందు దినపత్రికలు దొరికితే ఎత్తుకోపోవడానికి వీళ్ళిద్దరూ విస్సిగాడితో వెళ్ళేవాళ్ళు. విస్సిగాడు, వీళ్ళిద్దరినీ తోడుదొంగలని ఆక్షేపించేవాడు, నవ్వుతూ. అవి ఆ రోజులు. మిడిల్ స్కూలు, హైస్కూలు కెళ్ళే రోజులు. మహమంచి రోజులు.

రంగనాధం కాలేజీ రోజుల్లోనూ, ఆ తరువాత రెండేళ్ళు అడ్డగాడిలాగా తిరిగిన రోజుల్లోనూ, రాజుగారితో స్నేహం అయ్యింది. ఆయన అలవాటు చేశాడు, మోహన రావు పెట్టిన కనకదుర్గా స్వీట్ హోం లో మెత్తని పకోడీలు ఆనవాయితీగా కొనుక్కో తినడం. రాత్రి పదికొట్టంగానే అక్కడ చేరేవాళ్ళు, లెక్కల మేష్టారు, రావుగారు, రాజు, లక్ష్మణాచార్యులూ, రంగనాధం. పకోడీలు కాదు ముఖ్యం. ఆ పకోడిలు కట్టిన పొట్లం కాయితం. ఆ కాయితంలో వున్న పాత వార్తో, అదృష్టంబాగుండి ఆదివారం పేపరైతే కథో, సగం చిరిగిపోయిన ఆథునికకవితో పకోడీల నూనెలో తడిసి చదవడానికి మహ సొంపు గా వుండేవి. రాజు తనలో తనే చదువుకునే వాడు. రంగనాధం మాత్రం పైకి ఘట్టిగా చదివేవాడు. ఆ రోజుల్లో పకోడీ పొట్లం కట్టిన కాయితంలో చదివిన పద్యం టైటిల్ “వేరు వేరు విధమ్ముల ఆరు కారు మేఘమ్ములు,” ఇప్పటికీ గుర్తుంది, రంగనాధానికి. నూనె అంటక పోతే, పకోడీ కాయితాలు కూడా భద్రంగా దాచేవాడు, రంగనాధం, అలవాటుగా!

2.

పైచదువులు నెపంతో రంగనాధం అమెరికాకి వచ్చాడు. వచ్చిన కొత్త రోజుల్లో, అబ్బో చాలాకాలం క్రిందట లెండి, ధాతనామ సంవత్సరం అన్నా దిగులు లేదు– పాత అలవాటు ప్రకారం దినపత్రికలన్నీ దాచి వుంచేవాడు. అంతే కాదు. అల్యూమినియం డబ్బాలు అతి జాగ్రత్తగా పోగు చేసేవాడు. ఉన్నది, లింగూ లిటుకూ అనుకుంటూ ఒక్క గది. ఒక్క మంచం. ఓ చిన్న ఫ్రిజ్. రెండు ఎలట్రీ పొయ్యిలు. ఇదీ మనవాడి సంసారం. అన్నీ అందులోనే అన్న సామెతలా ఒక మూల పేపర్లు, మరోమూల డబ్బాలు. రంగనాధం పేపరు కొనేవాడు కాదు. పక్క గదిలో నర్సింగ్ స్కూలు పిల్లలు పేపరు తెప్పించేవాళ్ళు. వాళ్ళు చదివింతర్వాత పేపరు రంగనాధానికిచ్చేవాళ్ళు. ఆ పేపర్లు భద్రంగా దాచేవాడు. అబ్బో! అమెరికాలో పేపరు మనకిమల్లే కరువుగా ఉండదు. ఆదివారం పేపరయితే, కనీసం అర్థ మణుగు పైచిలుకే ఉండేది. ఈ పేపర్లు, డబ్బాలూ, ముఖ్యంగా పేపర్లు ఎక్కడికి పట్టికెళ్ళి అమ్మాలో రంగనాధానికి తెలియదు. ఏవరినన్నా అడగడానికి, మహమాటం… నామర్దా.

ఇలా వుండగా ఒక రోజున రంగనాధానికి విపరీతంగా జలుబు చేసి జ్వరం వొచ్చింది. ఫ్లూ అన్నారు, పక్క రూములో నర్సింగ్ పిల్లలు. రెండురోజులు స్కూలు కెళ్ళ లేదు. అప్పుడు ప్రొఫెసర్ జాన్, రంగనాధాన్ని చూడటానికొచ్చాడు. గది లోకి రాగానే ఆయనకి అయిదడులెత్తు కుప్పగా దుమ్ముకొట్టుకొని పేపర్లు కనిపించాయి.

“ఈ పేపర్లు పారేయలేదేమిటీ? ఈ దుమ్ము మూలంగానే నీకు జలుబు జ్వరం వచ్చాయి. Get rid of them, ASAP,” అని చెప్పి, కాఫీ మరకలు పడ్డ సోఫామీద ఓ మూల కాస్సేపు కూచొని, Get well soon అని చెప్పి వెళ్ళిపోయాడు. ఒక రెండు ఘంటలు తిరక్కముందే ప్రొఫెసర్ రావు గారొచ్చారు, రంగనాధాన్ని చూడటానికి. రావు గారు తెలుగు వాడే! ఇండియాకి స్వరాజ్యం రాకముందే అమెరికాకి వొచ్చేశాడు. ఒక తెల్లావిడని పెళ్ళాడాడు; ఇద్దరు పిల్లలు కూడాను!

ఎంతయినా తెలుగు వాడే కదా! ఆయన ఇట్టే పసిగట్టేశాడు, రంగనాధం పేపర్లు ఎందుకు దాస్తున్నాడో. “ఏమిటి? ఈ పేపర్లు మనదేశంలో లాగా అమ్ముదామని దాస్తున్నావా?” అని నవ్వుతూ అడిగాడు. అవునన్నట్టు తలూపాడు, రంగనాధం. ఆయన ముసిముసి నవ్వులు నవ్వుతూ, “ఒక టన్ను పేపరు పోగుచేస్తే, బహుశా, రెండు డాలర్లు వస్తాయి. అదికూడా, నువ్వు ఈ పేపర్లు తీసికెళ్ళి ఎక్కడో recycling సెంటర్లో ఇస్తేనే. ఈ లోపుగా నీగది ఈ పేపర్లతోటీ దుమ్ముతోటీ నిండిపోతుంది,” అని మెత్తగా చివాట్లు పెట్టాడు.

నాలుగు రోజులు పోయింతర్వాత, బాలచందర్ అనే గుజరాతీ స్నేహితుడొస్తే వాడి సాయం తీసుకోని రంగనాధం తను పోగుచేసిన పేపర్లూ, అల్యూమినియం డబ్బాలు వాళ్ళ అపార్ట్మెంటు వెనకాల వీధిచివర పెద్ద చెత్త డబ్బాలో పడేశాడు, చాలా బాధ పడుతూ! Recycling Centers గురించి కొంచెం పరిశోధన కూడా చేశాడు, రాడ్నీ స్మిత్ సాయంతో. పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే, ఈ సెంటర్లకి ప్రభుత్వం డాలరు కర్చుకి ఎదురు నాలుగు డాలర్లిస్తుందిట. అంటే, సెంటరు పోగుచేసిన పేపర్ల విలువ ఒక డాలరయితే, ప్రభుత్వం వారు ఈ సెంటరు నడిపే కంపెనీకి నాలుగు డాలర్లు ఇస్తారట! ప్రభుత్వం సొమ్ము తినేయడానికే ఈ సెంటర్లు, పుట్టగొడుగుల్లా పుట్టేశాయి. అప్పుడు జ్ఞానోదయం అయ్యింది, రంగనాధానికి; ఇంత గొప్ప తెల్ల దేశంలో కూడా, వ్యాపారస్తులందరూ ప్రభుత్వాన్ని ఎడా పెడా రోజూ దోచుకుంటారని! ఒక్క ఆదివారం మినహా!!

నిజం చెప్పొద్దూ! ఇప్పటికీ ఈ దేశంలో పేపరు కొనడం దండగే అని అనిపిస్తుంటుంది, రంగనాధానికి. దానికి కారణాలు వేరే ఉన్నాయనుకోండి — కానీ, ఇప్పటికీ ప్రతిరోజూ పేపరు తెప్పించడం, పేజీలు అన్నీ యధావిధిగా తిప్పి బాధపడుతూనే ఆ పేపర్ని చెత్త బుట్టలో పారెయ్యడం మానలేదు.

3.

రంగనాధానికి చదువు పూర్తికావడం, పెళ్ళాం రావడం, అపార్టుమెంటునించి చిన్న ఇంటికి మారడం అన్నీ ‘క్లాక్ వర్క్’ లా జరిగిపోయాయి. ఓ నాలుగేళ్ళతర్వాత సంసారం పెద్దదవటంవల్ల, చిన్న ఇంటినుంచి ఇంకొంచెం పెద్ద ఇంటికి మారడం జరిగిపోయింది. ఇల్లు పెద్దదయ్యేకొద్దీ నానా చెత్తా ఇంట్లో పోగుపెట్టడం మొదలెట్టాడు. పుర్రెతో పుట్టిన బుద్ధికదా, ఇప్పటికీ ఏదీ పారెయ్య బుద్ధికాదు, రంగనాధానికి. చదువుకునే రోజుల్లో కొనుకున్న డాలరు చొక్కాలు, అరిచిచచ్చినా పట్టని పాలియెస్టర్ పంట్లాములు, జోళ్ళు, కాలిజోళ్ళు, కంటి జోళ్ళు, అంకెలూ అక్షరాలూ చెరిగిపోయిన రకరకాల టెలిఫోన్లు, నాబు ఎంతతిప్పినా స్టేషను మారక గీ పెడుతూ మారాం చేసే చిన్న చిన్న రేడియోలు, వగైరా వగైరా గరాజ్ లో పోగు పెడుతూనే వున్నాడు. రంగనాధం భార్య రుక్మిణమ్మకి అప్పుడప్పుడు విసుగెత్తి బెదిరిస్తూనే వుండేది, “అవన్నీ ఎప్పుడో గారబేజ్ లో పారేస్తా,” అని. అలా అన్నప్పుడు రంగనాధానికి చచ్చే కోపం వచ్చేది. వెంటనే, “అవేం నిన్ను కరుస్తున్నాయా?” అని చీదరించికునేవాడు.

చూస్తూ ఉండంగా మరో అయిదేళ్ళు గిర్రున తిరిగొచ్చాయి. వాళ్ళ అమ్మాయికి, అదే దాన్ని పాపాయి అంటారు; దానికి నాలుగేళ్ళొచ్చాయి. అదృష్టం బాగుందో ఏమో వాళ్ళు మరో పెద్ద ఇంట్లోకి మారారు. ఇంటితో పాటు, రంగనాధం పోగుచేస్తున్న వస్తుసముదాయం కూడా కొత్త ఇంటికి చేరింది. ఈ సారి, గరాజ్ లోనే కాకండా, బేస్మెంటులో సగం రంగనాధం సామానుతో నిండి పోయింది. ఇల్లు పెద్దదయేకొద్దీ, అక్కరలేని చెత్త కూడా పెరుగుతుంది. ఇది అమెరికన్ ఆచారం! రంగనాధానికి ఈ వస్తు సముదాయమంతా భద్రంగా దాచి పెట్టడం సంప్రదాయం!

ఈ అయిదేళ్ళల్లో రంగనాధం, రుక్మిణీ లకి ఒక కొత్త వ్యాపకం వచ్చింది. ఎక్కడ గరాజ్ సేల్ పెట్టినా, సరదాగా వెళ్ళి చూసి వచ్చేవాళ్ళు. అదొక హాబీ! ఇంటికొచ్చి, పొట్ట చెక్కలయ్యేట్టు తెగ నవ్వుకునేవాళ్ళు. విశేషమేమిటంటే, పెద్ద పెద్ద ఇళ్ళున్న subdivision లలో, కనీసం మూడు నెలలకోసారి గరాజ్ సేళ్ళు వస్తాయి, అదేమి చోద్యమోగానీ, పై స్థాయిలో ఉన్న మధ్య తరగతి కుటుంబీకులుండే పేటల్లోనే ఈ గరాజ్ సేళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఉంటాయి; — సంపాదన పెరగడం వల్ల, ఇళ్ళు పెద్దవి కావడంవల్లా, కావలసినంత తీరిక ఉండడం వల్లా కాబోలు. రంగనాధం, వీళ్ళని “పనిలేని మంగళ్ళు” అని అంటే, రుక్మిణి , “ఈ గరాజ్ సేల్స్ పెట్టుకునే ఆడంగులందరూ, రోజూ పేపర్లో సేళ్ళు చూసి, మురిసిపోతూ షాపింగుకి పోయి కావలనే నానా చెత్త కొంటారు, రాబోయే గరాజ్ సేల్ కోసమా అన్నట్టు,” అని అనేది.

కాకపోతే ఏమిటి? ప్లాస్టిక్ దువ్వెనలూ, వాడిన రంగు బ్రష్షులు, థాయిలాండులో అల్లిన వెదురు బుట్టలు, రీడర్స్ డైజెస్టు వాళ్ళు కుదించిన చచ్చు నవలలూ, పిల్లల టీ షర్టులు, అమ్మగారి డ్రెస్సులూ, అయ్య గారు వాడేసిన చొక్కాలు, సగం వాడిన షాంపూలు, కొవ్వొత్తులు పెట్టే గాజు బుడ్డీలు, పాత వంట గిన్నెలు, గీతలు పడిన నాన్ స్టిక్ బూరెల మూకుళ్ళు, మొక్కలు ఎండిపోయి ఉసూరు మంటూన్న పూల కుండీలూ, రకరకాల సైజుల్లో లంబాడీ పూసల దండలు, అరిగిపోయిన మెల్మాక్ ప్లేట్లూ, కప్పులూ సాసర్లూ, గాజు గ్లాసులూ….ఒకటేమిటి, అన్ని రకాల సరంజామా డ్రైవ్ వేలో పెట్టుకొని రోజంతా పడగాపులు పడతారు, ఈ ముష్టి సామాన్లు అమ్ముకోటానికి. ఇంకో విశేషం ఏమిటంటే, ఈ సామాన్లు ఆ పేటలోనే ఒక ఇంటినుంచి మరోఇంటికి మారుతూ ఉంటాయి, అని రుక్మిణి చేసిన థీసిస్. అప్పుడప్పుడు, రంగనాధాన్ని ఏడిపించటానికో యేమో, “ఏమండోయ్ మీరు పోగుచేస్తున్న తుక్కంతా కూడా ఎప్పుడో గరాజ్ సేల్ పెట్టి అమ్మేస్తా! పీడ విరగడయి పోతుంది,” అని నవ్వుతూ బెదిరిస్తూనే ఉండేది. రుక్మిణి ఏమిచెప్పినా రంగనాధం “మీరజాలగలడా,” అన్నట్టు జవదాటకుండా ఉండే వాడేకానీ గరాజ్ సేల్ మాత్రం సాగనియ్యలేదు. ఆవిషయం రుక్మిణికి కూడా తెలుసు.

4.

“మన neighborhood లో పిల్లలందరూ సాయంకాలం పూట సైకిల్ తొక్కు కుంటున్నారు; పాపాయికి కూడా ఒక సైకిల్ కొనితేవాలి,” అని ముచ్చట పడిపోయేది. “దానికి నాలుగేళ్ళు కూడా లేవు; ఇప్పుడు సైకిల్ తొక్కడం చాలా ప్రమాదం. ఏ కాలో చెయ్యో విరిగితే, మధ్య మనం చావాలి,” అని చాలా సార్లు గసురుకున్నాడు, రంగనాధం. అంతేకాదు. “ నేను సైకిలు పదిహేనోయేడు వచ్చేవరకూ నేర్చుకోలేదు. మన అమ్మాయికూడా, అంతే. That’s it,” అనే వాడు. అలా అన్నాడే కానీ, తనూ చూస్తున్నాడుగా, చుట్టుపక్కల పిల్లలందరూ పాపాయి ఈడు వాళ్ళే! “Keeping up with the Joneses! అమ్మాయికి సైకిల్ కొనాలి,” అని తనకీ మనసులో వుంది.

ఒక శనివారం రంగనాధం ఆడపిల్ల సైకిలు కోనటానికి ముహూర్తం పెట్టుకున్నాడు. దోవలో లక్ష్మి, ప్రసాదరావులని చూసి చాలారోజులయ్యిందని వాళ్ళ డ్రైక్లీనింగ్ కొట్టు దగ్గిర ఆగాడు. ఆప్యాయంగా లక్ష్మి పీజ్జా తెప్పించిపెట్టింది. ఆవిడతో, మాటవరసకి అన్నాడు; “ పాపాయికి సైకిలు కొనమని రుక్మిణి చంపేస్తోంది. ఇవాళ సియర్స్ కెళ్ళి సైకిల్కొందామనుకుంటున్నా,” అని. వెంటనే లక్ష్మి, “ కొనడం ఎందుకండీ! మా ఇంట్లో ఆడపిల్ల సైకిలు ఊరికే గరాజ్ లో పడి ఉన్నది, దుమ్ము కొట్టుకుంటూ. దాన్ని తీసుకో పొండి,” అన్నది. గరాజ్ అన్న మాట వినంగానే, రంగనాధానికి వాళ్ళ పేటలో గరాజ్ సేళ్ళే గుర్తుకొచ్చాయి. “అయితే లక్ష్మి గారూ! మీ ఇంటిముందు గరాజ్ సేల్ పెట్టి అమ్మెయ్యక పోయారా?” అన్నాడు, నవ్వుతూ. “ఇంకా నయం! అదొక్కటే తక్కువయ్యింది, మన దౌర్భాగ్యానికి,” అన్నది లక్ష్మి. వెంటనే కొట్లో పనిచేసే నల్ల కుర్రాడిని పంపించి సైకిలు తెప్పించింది. కానీ కర్చు లేకండా అమ్మాయికి సైకిలు దొరికినందుకు ఉబ్బిపోయాడు, రంగనాధం. వెంటనే, “ Thanks Lakshmi gaaru. నాకు కర్చు తగ్గించారు, అంతకన్నా ముఖ్యం శ్రమ తగ్గించారు,” అని, మిగిలిన పీజ్జా పూర్తిగా తినేసి బయల్దేరాడు.

సైకిలు చూడటానికి చక్కగా వుంది. గులాబిరంగు ఫ్రేము, బరువుగా రబ్బరు చక్రాలు, వెనక చక్రానికి అటూ ఇటూ రెండు బుల్లి చక్రాలు; ఊదా రంగు సీటు, బంగారం రంగు హేండిల్బార్ కవర్లు, వాటి చివర రెండువైపులా కొరడా చివర వుండే తోలు పటకా జూళ్ళు, ముందు చక్రంపైన హేండిల్ బార్ కి తగిలించి ఒక చిన్న ప్లాస్టిక్ బుట్ట…. రంగు కొంచెం మాసినట్టున్నది కానీ, అన్నీ సవ్యంగానే ఉన్నట్టు కనిపించాయి. కారు ట్రంకులో సైకిలు పెట్టుకొని, ఆల్బర్ట్ ఇంటికెళ్ళాడు. ఆల్బర్ట్ పాత వస్తువులన్నీ చక్కగా బాగు చేసి కొత్తగా కనిపించేట్టు చెయ్యగలడు. వాడి గరాజ్ అంతా ఒక పెద్ద వర్క్ షాపే!

సైకిలు దింపి, ఆల్బర్ట్ కి విషయమంతా విప్పి చెప్పాడు. వాడు, సైకిల్ని, శుభ్రంగా వాటర్ జట్ తో కడిగి, సీటుకింద, వెనకా గులాబీ రంగు పూసి, తోలు జూలు పటకాలని అదేదో నూనె పులిమి శుభ్రం చేసి, సీటు వెనకాల తెల్లటి పూసలదండ కట్టి, బ్రహ్మాండంగా తయారుచేశాడు, మా పాపాయి సైకిలుని.

ఇంటికి రాంగానే రుక్మిణి ఖస్సు మంది; చెప్పా చెయ్యకండా బజారుకి పోయినందుకు. విజయోత్సాహంతో, ట్రంకులోంచి, సైకిలు చూపించాడు, రంగనాధం. “ఈ పాత సైకిలు ఎక్కడనుంచి పట్టుకొచ్చారు? కొంపదీసి ఎక్కడో గరాజ్ సేల్ లో కొనలేదుకదా?” అని కసురుకుంది. “ఇది పాతదంటావేమిటి? నాకు కొత్తగానే కనిపిస్తోంది,” అని సర్దుకున్నాడు, రంగనాధం. “దాని మొహం చూడగానే తెలియటల్లా? పాతదని,” అన్నది రుక్మిణి. డ్రైక్లీనింగు లక్ష్మి గారిచ్చారు అని చెప్పంగానే, “పోనీలే! మూణ్ణెల్ల తర్వాత ఈ సైకిలు పాపాయికి ఎల్లాగో పనికే రాదు. దానికి సైకిలు బాగా తొక్కడం వచ్చిన తరువాత, మరొ పెద్ద సైకిలు, కొత్తది కొనిపెడదాం లెండి,” అని సర్దుకుంది. ఎంతయినా లక్ష్మి తన జట్టు కదా!

ఆరునెల్లు తిరక్కుండానే, పాపాయికి అసలు సైకిలంటేనే మొహం మొత్తిపోయింది. రుక్మిణికీ ఆ కాస్త మోజూ తీరిపోయినట్టుంది. మళ్ళీ సైకిలు మాట ఎత్తలేదు, ఏ ఒక్కరూనూ!

5.

వాళ్ళ వీధి చివర ఇల్లు మరియా, రాయ్ అనే మళయాళీలు కొనుక్కున్నారని తెలిసి, వాళ్ళని చూడటానికి వెళ్ళారు, రుక్మిణి రంగనాధం. రాయ్ సాఫ్ట్ వేర్ ఇంజనీరు, మరియా ఐ.సీ. నర్సు. వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు. పెద్దదానికి, నాలుగేళ్ళు రెండోదానికి రెండేళ్ళు. చూడటానికి ఇద్దరూ ముచ్చటగా ఉన్నారు. రుక్మిణి వెంటనే వాళ్ళ పెద్ద అమ్మాయిని చేరదీసింది. మిగిలిన వాళ్ళనందరినీ వదిలిపెట్టి వాళ్ళిద్దరూ ఏవిటేవిటో మాట్లాడుకున్నారు. “ మా ఇంటికి రా! నీకు సైకిలిస్తా,” అనేసింది రుక్మిణి. ఆపిల్ల, “Thank you Auntie! అంటూ కావలించేసుకుంది. అంతే! లక్ష్మిగారి దగ్గిరనుంచి ఊరికే వచ్చిన సైకిలు, పాపాయి సైకిలు తొక్కడం నేర్చుకున్న ముద్దుల సైకిలు, దాని మొదటి సైకిలు, రుక్మిణి దానం చేసేసింది. రంగనాధానికి చచ్చే కోపం వచ్చింది; ఇదే తనైతే, ఆ సైకిలుని గరాజ్ లోనో, బేస్మెంట్ లోనో భద్రంగా దాచి ఉంచేవాడు. ఎంతయినా అది వాడి కూతురి సైకిలు కదా!

మరో నాలుగేళ్ళు గడిచాయి, రంగనాధానికి, రుక్మిణికి. అమ్మాయి పెద్దదవుతున్న కొద్దీ, రంగనాధానికి దాచే సరంజామా పెరగడం మొదలెట్టింది. పాపాయి వేసిన బొమ్మలు, చేసిన లక్క పిడతలు, దాని పుస్తకాలు, లంచ్ డబ్బాలూ, అన్ని అతిజాగ్రత్తగా పోగు పెడుతున్నాడు. ఇప్పుడు ఈ పోగుపెట్టడం అతనికి హాబీ కాదు; ఒక వ్యసనంగా తయారయ్యింది. ఏ వస్తువూ తనకి అడ్డు రానంతవరకూ, రుక్మిణి జోక్యం చేసుకోదు. మనకెందుకులే అని, చూసీ చూడనట్టు ఊరుకునేది. ఇది నిజంగా పెద్ద compromise అనే చెప్పాలి!

ఇలా రోజులు గడుస్తూ వుండగా, రుక్మిణి మేనల్లుడు, వాడి భార్య, ఐదేళ్ళ కొడుకూ, వెరసి ముగ్గురూ ఇండియానుంచి దిగుమతయ్యారు. వాళ్ళిద్దరూ ఇంజనీర్లే! వాడికి ఇక్కడే సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం వచ్చిందిట; వాడి భార్య కడుపుతోఉన్నది. అంచేత, ఇంటిపట్టునే ఉంటుంది. వాళ్ళ పిల్లడు పొట్టిగా బొద్దుగా ఉంటాడు. బుద్ధిమంతుడే కాని, సైజు చూస్తే పదేళ్ళవాడిలా ఉంటాడు. వాడు, ఇరుగుపొరుగు పిల్లలందరి తోటీ మచ్చికగా చేసుకోవాలంటే, వాళ్ళలాగా సాయంత్రం వాళ్ళతోటి పేవ్మెంట్లమీద సైకిలు తొక్కాలసిందే నని రుక్మిణి హుకుం జారీ చేసింది.

“ఏమండీ! మా మేమల్లుడి కొడుక్కి ఒక సైకిలు కొనిపెడదాం. ఏమంటారు?” అని అంది, రంగనాధంతో. “చూద్దాంలే! ఇప్పుడేంతొందర?” అన్నాడు రంగనాధం. “అల్ల అంటారేవిటి? ఆ అబ్బిగాడు మా పెద్దన్నయ్య మనవడు. మా పెద్ద అన్నయ్య అంటే నాకు ఎంత ప్రాణమో మీకు తెలుసు గా. పైగా, ఆయనంటే మీకూ ఇష్టమేగా,” అని పాట పాడింది, రుక్మిణి. “సరే! సరే! చూద్దామన్నాగా!,” అంటూ తప్పుకున్నాడు రంగనాధం.

ఓ వారం తర్వాత, ఓ శనివారం నాడు, మరియా ఇంటిముందు డ్రైవ్ వే లో కారు కడుగుతూ రాయ్ కనిపించాడు. ఆగి, “హై” అంటూ, రాయ్ తో పిచ్చాపాటీ మొదలెట్టాడు. ఏదో సడెన్గా గుర్తుకొచ్చినట్టు ముఖం పెట్టి, “ హే రాయ్ మీఅమ్మాయికిచ్చిన సైకిలు ఎక్కడ పెట్టావ్?” అని అడిగాడు. “ ఓ! నాధ్! అదా. ఆ సైకిలు ఎప్పుడో గరాజ్ సేల్లో అమ్మేశా,” అన్నాడు, రాయ్. రంగనాధానికి రాయ్ గాడిని గొంతుపిసికి చంపేద్దామన్నంత కోపం వచ్చింది. తన దగ్గిర ఊరికే సైకిలు దొబ్బేసి, దాన్ని గరాజ్ సేల్ లో అమ్ముకుంటాడా? వీడికి ఎంత ధైర్యం? ఎంత కండ కావరం? అని అనుకుంటూ, వెర్రి మొహం పెట్టుకోని కోపంగా ఇంటికొచ్చాడు.

6.

మరో మూడు వారాలు గడిచాయి. రంగనాధం ఓ శుక్రవారం మధ్యాన్నం, ఆఫీసునుంచి కొంచెం తొందరగా వస్తూ, వాళ్ళ subdivision లోకి తిరిగాడు. మొట్టమొదటి వీధిలో గరాజ్ సేల్! ఆ వీధిలో రెండోఇంటి దగ్గిర డ్రైవ్వే లో ముందుగా గులాబిరంగు సైకిలు కనిపించింది, రంగనాధానికి. “ఈ సైకిలు మనదే! పాపాయి మొట్టమొదటి సైకిలు!” అని అనుకుంటూ, కారు ఆపి, ఇంటిముందు కూర్చున్న తెల్లావిడతో పరిచయం చేసుకొని, “ ఈ సైకిలు ఎంతకిస్తారు?” అని అడిగాడు. “పదిహేను డాలర్లు,” అన్నది ఆవిడ ముఖం ఎత్తకండానే. ఎండకి ఆవిడ ముఖం కందగడ్డలా తయారయ్యింది. “ఐదు డాలరిస్తా,” అన్నాడు రంగనాధం. ఆవిడ, ముఖం ఎత్తకండానే “O.K. Take it.” అన్నది. వెంటనే సైకిలు ట్రంకులోపెట్టుకొని, ఐదు డాలర్ల ముడుపూ చెల్లించి, తిన్నగా ఆల్బర్ట్ ఇంటికి బయలుదేరాడు.

“అనుమానం లేదు, ఈ సైకిలు పాపాయిదే! అది సీట్ వెనకాల దాని పేరు పి.ఆర్. అని బ్లేడుతో చెక్కింది. కావాలంటే చూడు,” అని ఆల్బర్ట్ తో జరిగిన కథ అంతా చెప్పుకున్నాడు. “ ఇదిగో, ఆల్బర్ట్ ఇటు చూడు. ఈ సైకిల్ కాస్త బాగుచేసి మా ఆవిడ మేనల్లుడి కొడుక్కి ఇద్దామనుకుంటున్నా. కాస్త నీ హెల్ప్ కావాలి,” అన్నాడు. “ఇది ఆడపిల్లల సైకిలు. దీని రంగు చూసి ఆ కుర్రాడు నాకొద్దు, ఈ పాడు ఆడపిల్లల సైకిలు, అంటాడు. రుక్కి సిస్టర్కి కోపం వస్తుంది, ఆ తరువాత నీ ఇష్టం,” అన్నాడు, ఆల్బర్ట్.

“అందుకేగా నీ సాయం కావాలనేది. దీని గులాబి రంగు గీకేసి, నల్ల రంగు వేద్దాం. దీన్ని, మొగపిల్లల సైకిలు గ తయారు చేద్దాం. ఏమంటవ్”? అన్నాడు రంగనాధం. “రేపు శనివారం. పొద్దున్నే రా. దీని పని పడదాం,” అన్నాడు ఆల్బర్ట్. రంగనాధానికి, ఎగిరిగంతేసి “యురేకా” అని అరుద్దామనిపించింది. ఇంటికొచ్చి, రెండు బీర్లు పట్టించి, టీ.వీ. లో మునిగిపోయాడు.

మర్నాడు, పొద్దున్నే పదిగంటలకి ఆల్బర్ట్ ఇంటికెళ్ళి, పాపాయి సైకిలు మీద గులాబీ రంగంతా గీకి, ఎమరీ పేపర్తో శుభ్రంచేశాడు. ఆల్బర్ట్ నల్ల రంగు స్ప్రే చేశాడు, సీటుకి ప్లాస్టిక్ అంటించి. తోలు జూలు పటకాలు కత్తిరించి, హేండెల్ బార్ మీదున్న బుట్ట పీకేసి, ఒక సైకిలు బెల్లు తగిలించాడు. “ఆల్బర్ట్ నువ్వు గొప్ప ఆర్టిస్ట్ విరా,” అని రంగనాధం మెచ్చుకుంటూనే వున్నాడు. సరిగ్గ ఈ పని పూర్తయి, నల్ల రంగు ఆరడానికి అంతా వెరసి ఆరు గంటలు పట్టింది; చెరో ఆరు బీర్లు పట్టించారు, ఈ పేరుతో!

సాయత్రం ఐదు గంటలకి రంగనాధం ఇంటికి చేరాడు. ఇంటిముందు పోర్చ్లో రుక్మిణి, మేనల్లూడు, వాడి భార్య చాలా ఉత్సాహంగా రోడ్డుకి అటు ఇటు చూస్తూ, అబ్బిగాడితో “జాగర్త, జాగర్త,” అని ఉద్రేకంగా అరుస్తున్నారు. అబ్బిగాడు సరికొత్త సైకిలు పక్కకి వంచి, కుడికాలు యెగరేసి సైకిలెక్కి, తూటాలా దూసుకొ పోతున్నాడు, పేవ్మెంట్ మీద.

“ Honey! మేమంతా అబ్బిగాడిని సియర్స్ తీసికెళ్ళాం. అక్కడ వాడికి నచ్చిన ఈ సైకిలు కొన్నా. వచ్చే వారం వాడి పుట్టింరోజు. Advance గా అబ్బిగాడికి మన gift! పెద్ద ఖరీదేం కాదు; సైకిలు ఎనభై. దాన్ని బిగించి ఇవ్వడానికి పాతిక; Taxతో కలిపి మొత్తం నూట పదకొండు డాలర్లు,” అన్న ది రుక్మిణి.

గరాజ్లో కారు పెడుతూ, రంగనాధం తనుతెచ్చిన సైకిలు ట్రంకులోనే వదిలేశాడు. “రేపో మాపో, రుక్మిణి చూడకండా, గరాజ్ గోడకి మేకు కొట్టి ‘పాపాయి సైకిలు’ ఆ మెకుకి తగిలించాలి,” అని అనుకుంటూ ఇంట్లోకి చేరాడు, పిల్లిలా.
--------------------------------------------------------
రచన: వేలూరి వేంకటేశ్వర రావు, 
ఈమాట సౌజన్యంతో

Wednesday, March 20, 2019

సగమే పూర్తయిన ఓ కవిత


సగమే పూర్తయిన ఓ కవిత




సాహితీమిత్రులారా!

ఈ కవితను ఆస్వాదించండి................

సమయం వుదయం 6:10
ఇంకా బద్ధకంగా పడకలోనే!
దిగి పగటి గడియారంలోకి
పరుగెత్తి ఏమీ చేయాలనిపించట్లేదు

పొద్దు తేరకుండానే
పడకగది బయట వేపచెట్టుమీద చేరి
అల్లరి చేసే పిట్టలు
గోలచేసీ చేసీ విసుగెత్తి వెళ్ళిపోయాయి.

సమయం 7:20
లేవాలనే అనిపించట్లేదు.
నన్ను తలుచుకునేవారూ
‘అన’వసరంగా నా కోసమే వచ్చేవారూ
కూడా ఎవరూ లేరు.

సగమే పూర్తయిన ఓ కవిత
అదుగో అలా నన్నే చూస్తూ అక్కడ,
రాత్రి కథ చెప్పమని అడిగి
చెప్పలేని స్థితికి అర్థంగాక
అలిగి
బుంగమూతితోనే నిద్రపోతున్న
బుజ్జితల్లీ,
నిర్విరామంగా ఎవరూ
పట్టించుకోకున్నా
అవసరపడి
తిరుగుతున్న పంఖా తప్ప
నన్నూ నామనసునూ
కదిలిస్తున్నవేవీ లేవిక్కడ!

సమయం ఎనిమిది కావస్తున్నట్లుంది
పరుచుకుంటున్న తెల్లటి ఎండా
వెచ్చనౌతున్న ఎండాకాలపు గాలీ
గుచ్చుకునీ గుచ్చుకోకుండా వుండే
రాత్రి నీవు కురిపించిన
మౌనమో మాటలో కన్నీరో నవ్వులో-
ఏదో లీలగా ఒక అలికిడి చేస్తూ…
---------------------------------------------------------
రచన: విజయ్ కోగంటి, 
ఈమాట సౌజన్యంతో

Tuesday, March 19, 2019

మునులేం చేస్తారు నాన్నా?


మునులేం చేస్తారు నాన్నా?




సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి....................

“మునులేం చేస్తారు నాన్నా?”

మా అమ్మాయి హైస్కూల్లో చదువుకునే రోజుల్లో తెలుగు వాచకం కూడా కొంత ఆసక్తి తోనే చదివేది. తెలుగు పాఠాల్లో ఋషులూ, మునులూ, వాళ్ల కథలూ వస్తూ ఉండేవి. ఇంట్లో అందరమూ చదివే చందమామ కథల్లోనూ అవే. ఆ రోజుల్లో తను ఒక ఆదివారం పొద్దున వాళ్ళమ్మ అల్పాహార పర్వం నడిపిస్తుండగా నన్ను ఇదుగో, ఈ ప్రశ్న అడిగింది. నిజానికి నాకూ తెలీదు.

“తపస్సు చేస్తారమ్మా!” అనేశాను.

“అలా తపస్సు చేస్తునే ఉంటారా?”

“ఆఁ! అరణ్యాలకు పోయి చాలా సంవత్సరాల పాటు తపస్సు చేస్తారు.”

“చాలా సంవత్సరాలే! చేసి…?”

చిట్టీతకాయంత నా తలకాయలో ఒక కథ లాంటిది మెదిలింది. ఆ కథ చెప్పాలనిపించింది.

“చేసి ఇంటికి వస్తారు.”

“వచ్చి?”

“వచ్చింతర్వాత యేమవుతుందో చిన్నకథ చెబుతాను.”

నా గురించి మా అమ్మాయికీ, మా అమ్మాయి గురించి నాకూ, మా ఇద్దరి గురించి మా ఆవిడకీ బాగానే తెలుసు. తనూ టేబుల్ దగ్గర కూర్చుండిపోయింది. మా అమ్మాయి, రామారావే రాముడు గానూ రావణాసురుడు గానూ వేసిన సినిమా ట్రయలర్ ఈ-టీవీలో ఒక నిమిషం పాటు చూసి, ‘రాముడూ, రావణుడూ ఒకరేనా! ఇక సీత యెక్కడుంటే యేం?’ అనేసిన పిల్ల. తఃతః ఈమాటలో రాసిన ఇటునేనే – అటునేనేలో ‘అమ్మా! నువ్వు జుట్టుకు రంగేసుకోవాలి,’ అన్నది యీ పిల్లే. కథ మొదలు పెట్టాను.

“ముని తపస్సు చేసి ఇంటికి వచ్చాడు.”

“ముని పేరేమిటి, నాన్నా?”

“కుచ్చు తల్లీ! మునికి పేరు పెట్టాననుకో, అప్పుడు ఈ కథ ఆ పేరు గల ఒక మునికి మాత్రమే చెందుతుంది, మతంగుడి కథ, భరద్వాజుడి కథ లాగా. నువ్వు మునులేం చేస్తారు? అన్నావు కదా! ఏ పేరూ పెట్టకపోతే మునులు సాధారణంగా ఈ రకంగా ఉంటారు అన్నది చెప్పినట్టవుతుంది. ఈ విషయం అర్థమయింది కదా? ఇప్పుడు ముని పేరు అచ్చయ్య అనుకుందాం. ముని పత్ని పేరు పిచ్చమ్మ. తన భర్త అన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసి ఇంటికి వచ్చాడు గదా అని పిచ్చమ్మ మునికి ఇష్టమైన చేగోడీలు చేసింది.”

మొగుడూ, మొగుడికి ఇష్టమైనవి పెళ్ళాం చేసి పెట్టడమూ కొంతయినా అర్థమై ఉంటాయి. మా అమ్మాయి ప్రశ్నలు వేయటం ఆపి నేను చెప్పబోయేది వినడానికి తయారైనట్టుగా చూసింది.

“పిచ్చమ్మ గబగబా చేగోడీలు అరిటాకులో జాగ్రత్తగా తీసుకుని వచ్చి, మఠం వేసుకుని కూచుని దేని గురించో గాఢంగా ఆలోచిస్తున్నట్టుగా ఉన్న ముని ముందు పెట్టి, అంతే తొందరతో మంచినీళ్ళు కూడా తీసుకుని వచ్చి ఆకు పక్కగా పెట్టి, ఎంతో సంతోషంతో ఆయన యెదురుగా నిలబడి ఆతృతతో చూసింది. ముని ముందు చేగోడీల వంకా తర్వాత తన భార్య వంకా చూసి, అలవాటుగా తన ఇష్టదేవతను తలుచుకుని అరిటాకులో ఉన్న చేగోడీలు తదేకంగా అన్నీ తినేశాడు. తిని చాలా బావున్నాయన్నట్టుగా భార్య వంక చూసి ఇందాకటి కన్నా ఒఖ్ఖ పిసరు ఎక్కువైన చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వు చూసి పిచ్చమ్మ పట్టలేనంత ఆనందంతో పరుగు పరుగున లోపలికి వెళ్ళి మరిన్ని చేగోడీలు ఆఘమేఘాల మీద ఇందాకటికన్నా జాగ్రత్తగా తెచ్చి తన భర్తకు, మహామునికి, వడ్డించి కొంచం వెనక్కి తగ్గి ఆయననే చూస్తూ ఒద్దికగా నిలబడింది. తన భర్తకు – ఆకలీ దప్పికా తెలీకుండా గాలిలో, నిప్పులో, నీళ్ళల్లో సంవత్సరాల పాటు ఘోరమైన తపస్సు చేసి తపస్సిద్ధుడై ఇంటికి వచ్చిన మునీశ్వరుడైన తన భర్తకు – ఎంతో ఇష్టమైన చేగోడీలు ఇన్నేళ్ళ తర్వాత చేసి పెట్టగలిగానని ఆమె ముఖం వెలిగిపోయింది.

రెండోసారి పెట్టిన చేగోడీలు కూడా ముని ఒక్కొక్కటీ మంత్రం చదువుతున్నంత మంచినీళ్ళ ప్రాయంగా తినేశాడు. ముని భార్య ముని చేగోడీలు తింటున్నంతసేపూ తను నుంచున్న చోటు నుంచి కదలకుండా భర్త వంకే చూస్తూ ఆయన ఎప్పుడు ఏమి కావాలంటాడో అని కొంత కంగారు గానే అక్కడే నిలబడి ఉంది. ఇంతలో ఎక్కణ్ణించి వచ్చారో పిల్లలు బిలబిలమంటూ ఇంట్లోకి వచ్చారు. ఈ మునుల పిల్లలు ఆ ఆశ్రమాల్లో ఎప్పుడు బయటికి పోతారో ఎక్కడ ఉంటారో ఎన్నాళ్ళ తర్వాత ఎప్పుడు తిరిగి వస్తారో ఎవరికీ తెలీదు. రాగానే తలెత్తకుండా చేగోడీలు తింటున్న తండ్రి వంక చూసి పరుగున ఇంటి వెనక్కి ఆవుదూడలతో ఆడుకోవటానికి వెళ్లి పోయారు.”

టిఫిన్లు పూర్తయ్యాయి. ఇంతలో ఫోన్ మోగింది. మొబైళ్ళు ఇంకా మాయింటికి రాని రోజులవి. ఫోన్ మోగుతూనే మా అమ్మాయి ఫోన్ దగ్గరికి పరిగెత్తి వెళ్ళింది.

“ఈ పూట వంకాయ కూర చేయనా?” అన్నది కథ వింటూనే టేబుల్ సర్దేయటం కూడా పూర్తి చేసిన ఈవిడ, మా ఆవిడ.

కథకు ఆటంకం వచ్చిందే ఎలాగా! అన్న ఆలోచనలో సరేనన్నట్టుగా ఆవిడ వంక చూశాను.

“ఎలా చేయను? కూరపొడి వేసి అమ్మ చేసినట్టు చేయనా, పచ్చిమిరపకాయలూ అల్లం ముక్కలతో అత్తయ్య చేసినట్టు చేయనా?”

నాకు చిన్న నవ్వు. ఇటువంటి ప్రశ్న ఈవిడ ఎప్పుడడిగినా నాకు ఈ నవ్వు వస్తుంది.

“ఇదుగో అల్లా నవ్వకూడదు. నాకు అమ్మ వంటా అత్తయ్య వంటా రెండూ ఇష్టమే. అయినా ఇలా ఎప్పుడడిగినా ఎందుకలా నవ్వుతారు!”

“నువ్విలా ఎప్పుడడిగినా నాకు చప్పున నా పిల్లలు మనసు లోకి వస్తారు.”

“నా పిల్లలకేం? వాళ్ళు వాళ్ళమ్మ వంట ఇష్టంగానే తింటారు.”

“మన పిల్లలు కాదు. బళ్ళో నా పిల్లలు.”

“మన ఇంట్లో విషయానికి మధ్యలో వాళ్ళెందుకూ గుర్తు రావటం?”

“ఐన్‌స్టయిన్ థియరీ ఆఫ్ రెలెటివిటీ అయినా, న్యుటోనియన్ మెకానిక్స్ అయినా వాళ్ళకు చెప్పేది నేను గదా అని!”

“ఆహా! అలాగా! అయితే పైథాగరస్ సిద్ధాంతం పైథాగరస్‌నీ పాస్కల్ సూత్రాలు పాస్కల్‌నీ పిలిపించి చెప్పిస్తుంది లెండి యూనివర్సిటీ!”

“అయ్యబాబోయ్! అలా అయితే నా ఉద్యోగం ఉండదు! ఇక నీ వంట…”

“అందుకే అనుకుంటాను అన్నారు, ‘అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం’ అని. మీరు పిచ్చమ్మ గురించి చెప్పండి.”

ఈవిడ కళ్ళలో నవ్వుతో నా పక్కనే కూచుంది.

“నాన్నా! శ్వేత రమ్మంటోంది. ఒక పావుగంటలో వచ్చేస్తాను. అమ్మకు కథ చెప్పేయకండి. అంతగా అయితే అన్నకు ఫోన్ చేసి చెప్పండి. అన్న ఇప్పుడు మేలుకొనే ఉంటాడు.”

అంటూ ఇంతసేపూ ఫోన్లో మాట్లాడుతూ ఉన్న పిల్ల ఒక్క దూకులో సైకిలెక్కేసింది. నేను ఇరకాటంలో పడ్డాను. కథ ఇంక ఎంతో లేదు. మహామునులందరికీ మనసు లోనే దండం పెట్టుకుని కథ చెప్పేయాలనే నిశ్చయించాను. లేచి కొంచెం దూరంగా ఉన్న కుర్చీలో కూర్చున్నాను.

“మునికి చేగోడీలు చాలా ఇష్టం. ఇంకా కావాలన్నట్టుగా పిచ్చమ్మ వంక చూశాడు. పిచ్చమ్మ ముఖం వెలవెల బోయింది. దాదాపుగా చేసిన చేగోడీలన్నీ తెచ్చి పెట్టేసింది రెండు విడతల్లోనూ. ఇహ, మహా ఉంటే ఓ పదిహేనో ఇరవయ్యో ఉంటాయేమో! తను పిల్లలను చూసీ చాలా రోజులయింది. తల్లి మనసు పిల్లలను చూడంగానే కరిగిపోయింది. పిల్లలకు ఆ మిగిలిన కాసిని చేగోడీలూ పెడదామనుకుంది. ఈ సారి భర్త మరి కాసిని కావాలన్నట్టుగా చూసినా కాళ్ళు కదలలేదు. ముని తనకు ఇంకా కాసిని చేగోడీలు కావాలని తన భార్యకు అర్థమయినట్లుగా లేదనిపించి కొంచెం తీవ్రంగా భార్య వంక చూశాడు. ఎంత అన్యాయం! భార్య మనసు భర్తకు తెలియదేమో గానీ, భర్త మనసులో ఏముందో భార్యకు తెలియదా! తనకు పిల్లలు ఉన్నారనీ, తన భార్య తన పిల్లలకి తల్లి అనీ గూడా తట్టనంత ఇష్టం చేగోడీ లంటే అచ్చయ్య మునికి. పిచ్చమ్మకు మాట్లాడక తప్పలేదు.

‘కాసిని… పి… పిల్లలకు… ఉమ్… ఉంచానండీ.’

అంతే అచ్చయ్య మహాముని ఆగ్రహోదగ్రుడయినాడు.

‘అసలు నీకు చేగోడీలు చేయడం వచ్చా? చేగోడీల్లో ఉప్పు ఎంత ఎక్కువయిందో తెలుసా? అంత ఉప్పు వేస్తావా! ఇప్పటినుంచీ నీ జీవితంలో నువ్వు చేసిన చేగోడీలు నీ పిల్లలు ముట్టకుందురు గాక!’

తపశ్శాలి యైన ముని శాపానికి తిరుగు లేదు. పిచ్చమ్మ కూలబడి పోయింది. దుఃఖంతో కన్నీళ్ళ జల. అయినా తృటిలో తేరుకుని భర్తను క్షమించమనీ, శాపాన్ని వెనక్కు తీసుకోమనీ వేడుకుందామని ఆయన కూచున్న వేపు ఆ కన్నీళ్ళతో తల వంచుకునే చూసింది.

కానీ మహాముని అక్కడ లేరు. తపస్సుకు వెళ్లి పోయారు!”

ఈవిడ నాకు దగ్గరగా వచ్చి నా తల నిమిరి తిరిగి తన కుర్చీలో కూర్చుంది.

“ఏంటీ అమ్మ అలా ఉంది! కథ చెప్పేశారా?!”

మా అమ్మాయి శ్వేతతో లోపలికి వస్తూనే అడుగుతోంది.

“మామా! ఎల్లుండి మా స్కూల్లో మదర్స్ డేకి చిన్న నాటిక రాశాను. కుచ్చుకి చూపిద్దామని పిలిచాను. మాకిద్దరికీ నాటికకి పేరేం పెట్టాలో తెలియలేదు. నాటిక ఒకసారి చదివి పేరు సజెస్ట్ చెయ్యండి మామా!” అంతలోనే శ్వేత.

“నువ్వు రాసింది తప్పకుండా చదువుతాను కానీ, మదర్స్ డే నాటికకి పేరు పెట్టడానికే అయితే చదవక్కర లేదు తల్లీ! ‘వన్ డే మాతరం!'”
----------------------------------------------------
రచన: తఃతః, 
ఈమాట సౌజన్యంతో

Monday, March 18, 2019

పగటి వాన


పగటి వాన




సాహితీమిత్రులారా!

ఈ కవితను ఆస్వాదించండి....................

ఆకాశం పురివిప్పుకుని
సూర్యుడిని దాచేసినప్పుడు..

ఓ ఆహ్లాదం
మేలిముసుగులా ప్రపంచాన్ని కప్పుతుంది.

ఎన్నో శిశిరాల విరహం తరువాత
ప్రియురాలిని చూసిన ప్రియుడిలా
చూపులు దాహంతో బయటికి పరుగెడతాయ్.

వాన చినుకు పెట్టిన ముద్దు లోంచి
మంచు ఆవిరులు..
నాలోకి…

బలవంతపు నిద్రలో ఉన్న మనసు
సంకెల తెగిన సైనికుడవుతుంది.

చినుకు చినుకూ పెట్టే ముద్దులకి
సిగ్గుతో తలొంచుకుంటూనే
సౌందర్యాన్ని ప్రసవిస్తూ
ప్రకృతి…

అప్పుడు…
మెదడునధిగమించి
మనసే శరీరాన్నేలుతుంది.
---------------------------------------------------------
రచన: ప్రసూన రవీంద్రన్, 
ఈమాట సౌజన్యంతో

Sunday, March 17, 2019

నాక్కొంచెం నమ్మకమివ్వు


నాక్కొంచెం నమ్మకమివ్వు




సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి..................

కాళ్ళ మధ్యలో ఉన్న బ్రీఫ్‌కేస్‌ని మరింత గట్టిగా బిగించి మరోసారి పేపర్లోంచి తల బయటపెట్టి చూశాను. క్రితం సారి నేను చుట్టూ చూసినప్పట్నించి ఇప్పటికి రెండు నిమిషాలయ్యుంటుంది.కానీ ఈ రెండు నిమిషాల్లో ఈ ప్లాట్‌ఫాం మీద పది రెట్లు జనాలు పెరిగారు. బహుశా మరో నిమిషంలో ట్రైన్‌వస్తుంది. సెల్‌ ఫోన్‌పైకి తీసి టైం చూశాను, కరెక్ట్‌ మరొక్క నిమిషం.

పేపర్‌ముడుస్తూ తెలిసిన మొహాలకోసం చూశాను. ప్రశాంత్‌, రామారావు మెట్లెక్కి వస్తూ కనపడ్డారు. వాళ్ళు నేరుగా నేనున్న దగ్గరికే వస్తారని తెలుసు నాకు.

కొంచెం దూరంలో మా సర్దార్జీ ఫ్రెండ్స్‌కనపడ్డారు. అప్రయత్నంగా గాలిలో చెయ్యి ఊపాను. వెంటనే వాళ్ళనించి జవాబు. నాకు కొంచెం దూరంలో తెల్లమ్మాయి ట్రేసీ.
“హాయ్‌ట్రేసీ” అన్నాను. ఆమె పుస్తకంలోంచి తలెత్తి “హాయ్‌సత్యా” అనేసి, ఓ ప్రశాంతమైన నవ్వు పడేసి తిరిగి పుస్తకంలోకి వెళ్ళిపోయింది. ఈ ట్రేసీ లాంటి ఫ్రెండ్స్‌నాకు ఈ ప్లాట్‌ఫాం మీద ఓ పాతికమంది దాకా ఉంటారు. ఒకే కంపార్మ్టెంట్లో ఒకే చోట కూర్చున్నప్పుడు, లేదా నుంచున్నప్పుడు మాత్రం మాట్లాడుకుంటాం. ఆ స్నేహం అంతకు మించదు. కానీ ఓ రోజు ప్లాట్ఫాం మీద కనపడకపోతే వెంటనే తెలిసిపోతుంది, ఆలోచించకుండా ఉండలేం. అమెరికాలో అన్నింటికన్నా నాకు బాగా నచ్చింది ఇదే. పెద్దగా పరిచయం లేకున్నా హాయిగా ఓ నవ్వు, ఆప్యాయంగా ఓ “హాయ్‌”, ఎంతో హాయిగా ఉంటుంది. మధు మాత్రం ఇవ్వన్నీ దొంగ వేషాలు, నువ్వు మాత్రమే పడేది వీటికి అంటాడు. నాకు రుచించదు. ఇంతవరకూ దీనివల్ల నే కోల్పోయిందేమిటోతను మిగుల్చుకున్నదేమిటో నాకు తెలీదు.

సుమారు రెండు గంటల ప్రయాణం. మెటుచెన్‌నించి NJ Transit లో నువార్క్‌ దాకా వెళ్ళి, అక్కణ్ణించి PATH ట్రెయిన్లోకి మారి WTC (World Trade Center) న్యూ యార్క్‌దాకా వెళ్ళాలి. ఈ రెండు గంటల తర్వాత ఓ ఎనిమిది గంటలు ఏ ప్రశాంతతా దొరకని ఉద్యోగం. మళ్ళీ తిరిగి మరో రెండుగంటల తిరుగు ప్రయాణం. ఈ పరుగో పరుగో బతుకులో ఈ ప్లాట్ఫారాలమీదా రైల్లోనూ మాత్రమే గుర్తొచ్చేది, ఇంకా చుట్టూ ప్రపంచం ఉందనీ, అందరూ ఇలాగే పరిగెడుతున్నారనీను. అందరూ అలా హాయ్‌చెప్పడంతో నా అస్థిత్వాన్ని అందరూ గుర్తించినట్టు, ఒప్పుకున్నట్టు అనిపిస్తుంది నాకు. అదికూడా లేకపోతే బతుకు మరింత యాంత్రికమవుతుందనిపిస్తుంది.

అలా ఆలోచిస్తూనే అన్ని “హాయిల్నీ” నవ్వుల్నీ ఏరుకుని లెక్కపెట్టుకునే లోగానే ట్రెయిన్‌వస్తూ కనపడింది. ఆ ట్రెయిన్‌రావడం, ఆగడం, డోర్లు తెరుచుకోవడం, దిగాల్సిన వాళ్ళు దిగడం అంతా రెండు నిమిషాల్లో జరిగిపోయింది. నా ముందున్న వాళ్ళు ట్రెయిన్‌ఎక్కడం మొదలు పెట్టారు. నాకు అకస్మాత్తుగా గుర్తొచ్చింది నా హాయిల లెక్కలో ఓ ముఖ్యమైన హాయి తక్కువయిందని. అక్రమ్‌ ఇంతవరకూ కనపళ్ళేదు. ట్రెయిన్‌మిస్సవుతున్నాడా? ఆలోచిస్తూ ఎక్కాను. ఇంకా కొన్ని ఖాళీ సీట్లు ఉన్నాయి. సాధారణంగా ట్రెయిన్‌ఇక్కడే ఫుల్‌అవుతుంది. నే వెళ్ళి కిటికీ పక్కనే కూర్చున్నాను. ఓ అరనిమిషం తర్వాత ప్రశాంత్‌, రామారావు వచ్చి ముందర కూర్చున్నారు.

ట్రెయిన్‌బయలు దేరింది. ప్లాట్‌ఫాం మీదకి వచ్చే మెట్లమీద వేగంగా ఎక్కి వస్తూ, కదిలిపోతున్న ట్రెయిన్ని చూస్తూ ఒక్కసారిగా సడెన్‌బ్రేక్‌వేసి, దీర్ఘంగా నిట్టూరుస్తున్నారు. అదో సరదాగా ఉంటుంది. ఒక్కసారిగా ఆ మొహాల్లో ఓ నిరాశ, ఓ చిరాకు ఓ కెరటంలా వచ్చి, అర సెకనులో మళ్ళీ అంతా నెమ్మదిస్తుంది. ఆ భావాలకి రంగు, వయసు, లింగ భేదాలుండవు. ప్రతిరోజూ ఉండే తంతే ఇది. కనీసం పది మందిని చూస్తాను ఈ మెట్లమీద రోజూ, కదిలిపోతున్న రైల్లోంచి. తర్వాతి ట్రెయిన్‌ మరో 12 నిమిషాలకి గాని రాదు. ఆ మొహాల్లో కూడా అక్రమ్‌ కనపళ్ళేదు. కొంచెమాగి ఇతగాడికి ఫోన్‌చెయ్యాలి. పదిగంటాలకల్లా నా ఆఫీస్‌కి వచ్చి కలుస్తానన్నాడు. ఇప్పటిదాకా బయల్దేరకపోతే … రాడేమో, వచ్చి కలవడేమో?

అక్రమ్‌ పని చేసేది WTC టవర్‌లో. తనో మానేజ్మెంట్‌కన్సల్టింగ్‌ కంపెనీలో పనిచేస్తాడు. బోల్డెన్ని కంపెనీలలో పరిచయాలుండటంతో కాంట్త్ల్రాకూ గట్రా చూపించగల సమర్థుడు. నామట్టుకు నాకైతే అక్రంతో కూర్చుని సాయంత్రాలు మాట్లాడ్డం ఇష్టం. అక్రమ్‌ నాకెప్పుడూ మిస్టరీయే. ఎంతో ఖచ్చితమైన అభిప్రాయాలున్నా, ఏ మాత్రం ఆవేశపడకుండా, రాజీ పడకుండా మాట్లాడగల్గటం ఎలానో నాకెప్పుడూ అర్థం కాదు.

ఇక్కడి పాకిస్తానీ గాంగ్‌కీ దేశీ గాంగ్‌కీ మధ్య మే మిద్దరం లింకు లాంటి వాళ్ళం. మా స్నేహం పెరిగిన కొద్దీ మ రెండు గ్రూపులూ కలవటం ఎక్కువయింది. స్నేహాలు కూడా ఎక్కువయ్యాయి. క్రికెట్‌మ్యాచ్లున్నప్పుడయితే మొత్తం మిత్రబృందమంతా అక్రమ్‌ పేరే జపిస్తుంటుంది. అపార్మ్టెంటుల్లో బతికే మాకెవ్వరికీ శాటిలైట్‌ డిష్లు పెట్టుకునే అవకాశం లేదు. అదుంటేతప్పా అమెరికాలో క్రికెట్‌చూసే భాగ్యం ఉండదు. పాపం, అక్రమ్‌ ఇంటిమీద క్రికెట్‌చూడ్డం కోసం ఎంతమంది పడ్డా విసుక్కోడు. కానీ నిజం చెప్పాలి. ఇండియా, పాకిస్తాన్‌మాచ్‌ఉన్నప్పుడయితే నాకూ అక్రం కీ కూడా పరీక్షే! మా ఒళ్ళూ, మా బుర్రే అదుపు తప్పుతుంటుంది, ఇంక అక్రమ్‌ స్నేహితులవంకా, నా స్నేహితులవంకా భయం భయంగా చూస్తుంటాం. నా అనుమానం, ఎవరికివారే మిగతా వాళ్ళందర్నీ అలాగే చూస్తుంటారేమోనని! అదృష్టవశాత్తూ ఇంతవరకూ ఏమీ జరగలేదు. నాతో పాటే వస్తాడనుకున్నాను ఇవ్వాళ. ఇంతవరకూ కనపడని వాడు పదింటికల్లా నా ఆఫీస్‌కి రాగలడా అనేది అనుమానమే. మొత్తానికి రైలు WTC కి మామూలు సమయానికే చేరింది. అక్రమ్‌ ఆఫీస్‌ WTC లోనే 83వ అంతస్తులో. నా ఆఫీసుకి జచఈ లోంచి బయటి వెళ్ళి, ఓ రెండు బ్లాకులు నడవాల్సి వుంటుంది. బ్రీఫ్కేస్‌చేత్తో పట్టుకుని ఎస్కలేటర్ల మీదుగా ఎక్కి బయటకు నడిచాను.

ఆఫీస్‌చేరి కొంచెం సేపు మెయిల్‌చెక్‌చేసి, తర్వాత సగం రాసిన డాక్యుమెంట్‌ తీసి ఎడిట్‌చెయ్యడం మొదలు పెట్టాను. అలా ఎంతసేపు గడిచిందో తెలీదు. రాబర్ట్‌ నా అఫీస్‌తలుపు తెరిచి… రొప్పుకుంటూ అన్నాడు… WTC మీద ఏక్సిడెంట్‌ అయ్యింది తెలుసా అని. ఏదో పెద్ద జెట్‌వచ్చి టవర్ని గుద్దిందిట అన్నాడు. నాకు అర్థం అవడానికి టైం పట్టింది.

వెంటనే ఫోన్‌అందుకుని అక్రమ్‌ ఆఫీస్‌నంబర్‌కి చేశాను. లైన్‌ దొరకలేదు. ఎందుకయినా మంచిదని ఇంటికి ఫోన్‌చేశాను. లక్ష్మి… WTC మీద ఏదో ఏక్సిడెంట్‌ అయ్యిందిట, భయపడద్దు, నేను రైలు దిగి క్షేమంగానే బయట పడ్డానని చెప్పాను. అక్రమ్‌ సంగతే తెలియట్లేదు, ఫోన్‌చేసి కనుక్కుంటానని చెప్పాను. ఫోన్‌పెట్టేసి, మళ్ళీ అక్రమ్‌ సెల్‌కి చేశాను. ఆన్సరింగ్‌సిస్టంకి వెళ్ళింది. సీట్లోంచి లేచి బయటికి నడిచాను. WTC వైపు చూడగానే గుండె గుభేలు మంది. కాళ్ళు వణికాయి. అంత పెద్ద ఏక్సిడెంట్‌అనుకోలేదు నేను. రెండు టవర్లూ భగ్గున మంటల్లో మండి పోతున్నాయి. అసలట్లా ఎట్లా ఏక్సిడెంట్‌అవగలదు? ఓ మనిషి జారిపోతున్న జాకెట్‌లాక్కుంటూ పరిగెడుతున్నాడు… మొహంలో భయం, ఆతురత, దుఖం…
“ఏమిటది, ఏం జరిగింది” అన్నాను. నా గొంతెలా పలికిందో నాకు తెలీదు.
“టెర్రరిస్టులు… ఇక్కడా, వాషింగ్టన్లోనూ విమానాలతో విరుచుకుపడ్డారు” అన్నాడు. అంటూనే పరిగెట్టాడు. సాధ్యమయినంత త్వరగా సిటీ నించి బయటపడమని కూడా అరిచాడు… పరిగెడుతూనే!

నా నోట మాట లేదు. అర్థమయీ కానట్టుగా వుంది నాకు. ఇంతలో అక్రమ్‌ గుర్తొచ్చాడు. వెంటనే సెల్‌ఫోన్‌తీసి కాల్‌చేశాను. ఆఫీస్‌కి, తర్వాత తన సెల్‌కి. రెండూ దొరకట్లేదు. కనుచూపు మేరలో అందరి చేతుల్లోనూ ఫోన్లు… అందరూ డయల్‌చేస్తూనే ఉన్నారు. ఇప్పట్లో ఏ లైనూ దొరకదని అర్థమయింది నాకు. ముందుగానే ఇంటికి ఫోన్‌చేసి మంచిపని చేశాననుకున్నాను. వడివడిగా అడుగులు వేస్తూ WTC వైపు నడిచాను. ఇంకో బ్లాక్‌వుందనగా ఓ ఇద్దరు పోలీసులు నిలబడి అటువైపు వెళ్ళద్దన్నారు. మా ఫ్రెండ్‌లోపల వున్నాడన్నాన్నేను. అయినాసరే ఇక్కడే వెయిట్‌చెయ్యండి అన్నారు. అని, వాళ్ళు మాత్రం టవర్ల వైపు వెళ్ళి పోయారు. నాలాగే చాలామంది అక్కడే తచ్చట్లాడుతున్నారు. కొందరప్పటికే ఏడుస్తున్నారు. వాళ్ళ వాళ్ళెవరో లోపల వుండివుంటారు. చాలామంది అప్పటికే టవర్ల లోంచి బయటపడ్డారని చెప్పారు. చుట్టు పక్కల చూశాను. ఎక్కడా కనపడ్డు అక్రమ్‌ అసలీ రోజు రానే లేదేమో? అలా వెతుకుతూనే వున్నాను. ఇంతలో అకస్మాత్తుగా ఓ పెద్ద నల్లటి మేఘం కమ్ముకు వస్తూ కనపడ్డది.

ఏమిటది? నిజమే? ఆ టవర్‌.. ఆ టవర్‌.. కూలిపోతోంది…. పరిగెట్టండి.. పరిగెట్టండి… అదెంత దూరం దాకా పడుతుందో తెలీదు… పరిగెట్టండి…. అయ్యో ఇప్పటిదాకా ఎంతోమంది అటువైపుగా వెళ్ళారు నా కళ్ళముందే…. ఆ పోలీసులు… ఆ అంబులెన్సులూ, ఫైర్‌ డిపార్మ్టెంట్‌ వాళ్ళూ… అయ్యో అందర్నీ వదిలి పరిగెట్టాల్సిందేనా…. ఏవిటది… పరిగెట్టండి పరిగెట్టండి… ఈ భూతాన్నించి పారిపోండి… ఇదో కమ్ముకు వస్తున్న ప్రళయం… ఇదో విలయం…. ఇదో ఛండాలం… విరిగి బద్దలయి పేలిపోతున్న మానవత్వం…. మనిషిని మనిషే బలిచ్చే క్షుద్ర పూజ.. నిలువెత్తున కూల్తున్న నాగరికత… పరిగెట్టండి.. పరిగెట్టండి… మనిషిగా పుట్టినందుకు సిగ్గుపడుతూ, మనుషుల్లో, సమాజంలో బతకాల్సొచ్చినందుకు భయపడుతూ, బాధ పడుతూ, ప్రాణాలు చేతుల్లో పెట్టుకుని పరిగెట్టండి… ఏడవకండి… కన్నీళ్ళని వృథాచేయకండి… ఇది మనిషిని చేసుకుంటున్న ఆత్మహత్య…. వాడి ఖర్మకి వాణ్ణి వదిలేసి అడవుల్లోకి పోయి హాయిగా మృగాల్లా బతుకుదాం పదండి…. పరిగెట్టండి.

……………………………

అబ్బా… ఎవరిదో కాలడ్డం పడ్డట్టుంది. స్పృహలేకుండా పరిగెడుతున్న నేను వెల్లకిలా రోడ్డు మీద పడ్డాను. ఈ లోకంలోకి వచ్చాను. నుదురు రోడ్డుకు కొట్టుకుంది. లేచి వళ్ళుదులుపుకున్నాను. ఒక టవర్‌పూర్తిగా కూలిపోయింది. వళ్ళు జలదరించింది, అందులోనే అక్రమ్‌ పని చేసేది. అయినా ఇంతసేపు అందులో వుండడేమోలే అనిపించింది.

అంతా యుద్ధరంగంలా ఉంది. టవర్‌కూలినప్పుడు లేచిన దుమ్ము, మేఘంలా అంతా పరుచుకుని వుంది. అంతా గందర గోళంగా వుంది. దుమ్ము కొట్టుకు పోయిన వాళ్ళు, దెబ్బలు తగిలినవాళ్ళు…. దిక్కు తోచక పరిగెట్టే వాళ్ళు… వీళ్ళకి సహాయం చెయ్యాలని తాపత్రయ పడేవాళ్ళూ… అంతా అయోమయంగా వుంది. నేను నా మనసుని కూడ గట్టుకుని అనుకున్నాను… అక్రమ్‌ కోసం ఇంకాసేపు చూసిగానీ ఇంటికి వెళ్ళేది లేదని. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అక్రమ్‌ ఫోన్‌ కలవట్లేదు. అలాగే ప్రయత్నం చేయగా చేయగా ఇంటికి కలిసింది…. లక్ష్మి భయపడుతోంది. త్వరగా వచ్చెయ్యండి అంది. అక్రమ్‌ వాళ్ళింటికి ఫోన్‌ చేశావా అని అడిగాను. ముంతాజే చేసింది అంది. అక్రమ్‌ చాలా పొద్దున్నే వెళ్ళిపోయాట్ట, ఇప్పుడెక్కడున్నాడో తెలీట్లేదుట అంది. నేను చూసొస్తాను, భయం లేదు… వాళ్ళింటికి ఫోన్‌చేసి చెప్పు అన్నాను. ఫోన్‌ పెట్టేశాను. అన్నానేగానీ… నిజానికి అక్రమ్‌ అసలు రానేలేదేమోలే అన్న నా ఆశ అడుగంటిపోయింది.
అక్రమ్‌ కిందికి రాగలిగాడో లేదో అనేదే ప్రస్తుతం తెలియాల్సింది.
అమ్మో… అదేంటి… రెండో టవర్‌.. అదీ కూలిపోతోంది…. భగవంతుడా…. ఏమిటీ దారుణం… ఈ ఘోరం ఇంకా ఎంత దూరం పోబోతోంది? పక్కనే ఉన్న పెద్ద హోటల్‌లోపలికి పరిగెట్టాను. పాపం వాళ్ళు వచ్చిన వాళ్ళందరినీ విసుక్కోకుండా రానిస్తున్నారు. మంచినీళ్ళూ అవీ కుడా అందిస్తున్నారు… ఒరే మనిషీ.. నీకెన్ని రూపాలురా అనుకున్నాను!
అక్కడే ఓ అరగంటో, ఇంకా ఎక్కువో కూర్చుని బయట పడ్డాను. ఎన్ని చోట్ల వీలయితే అన్ని చోట్ల వెతికాను. అలా ఓ రెండు మూడు గంటలయుంటుంది. నా సెల్‌ ఫోన్‌మోగింది… లక్ష్మి!
“ఎప్పట్నించి, ఎన్నిసార్లు చేశానో లెక్కలేదు… మీ ఫోన్‌లైన్‌దొరకట్లేదు. ఇంక మీరు ఎవరికోసం వెతక్కుండా ఇంటికి వచ్చేయండి” అంది. గొంతులో దుఖం. పిల్లలేడుస్తున్నారు అంది. నాక్కూడా చెయ్యగల్గింది పెద్దగా కనపళ్ళేదు. “ఇప్పుడింటికెలా రావాలో తెలీదు…. ఎలాగోలా బయల్దేరి వచ్చేస్తాను… వెంటనే బయల్దేరుతున్నాను” అని చెప్పి పెట్టేశాను.

* * *

అతికష్టం మీద సిటీ బయట పడగల్గాను. ఇంటికి చేరేటప్పటికి దాదాపు సాయంత్రం అయింది. లక్ష్మి చిన్నపిల్లలా కావులించుకుని బావురుమంది. పిల్లలు సరేసరి. నాకూ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. మాకెవ్వరికీ సరిగ్గా తెలీదు… మేమెందుకు ఏడుస్తున్నామో.
ఇంట్లో అప్పటికే ప్రశాంత్‌, రామారావు, మధులు కుటుంబాలతో సహా వచ్చి వున్నారని అర్థమయింది.
“హమ్మయ్య మీరంతా క్షేమంగా వచ్చారు గదా” అన్నాన్నేను. వాళ్ళు రెండో టవర్‌మీద ఎటాక్‌చూడగానే బయల్దేరి వచ్చేశార్ట.
“నాకు చాలాసేపటిదాకా ఆ సంగతే తెలీదు, ఆ తర్వాత అక్రమ్‌ కోసం చూస్తూ ఇంతసేపూ తిరుగుతున్నాను” అని చెప్పాను.
ప్రశాంత్‌, రామారావులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.
“ఏం జరిగింది” అన్నాన్నేను
“ఆ అక్రమ్‌ సంగతి మర్చే పోలేవా?” అన్నాడు మధు కొంచెం చిరాకుగా.
“ఏంటీ ?” అన్నాన్నేను అంతే చిరాకుగా, అసహనంగా.
“ఆ పాకీ గాళ్ళందరి మీదా కన్నేసి వుంచారు పోలీసులు. ఎవడో ఒకడి మీద అనుమానంట. మధ్యాహ్నం నించీ అందర్తోటీ, అక్రమ్‌ ఫ్రెండ్స్‌అందరితోటీ మాట్లాడుతున్నారు పోలీసులు. పెద్దగా ఏమీ మర్యాదగా సాగట్లేదుట ఆ సంభాషణ”
ఆఖరి వాక్యం చెప్పడంలో కాస్త వెటకారం ధ్వనించింది.
” ఆ వరల్డ్‌ట్రేడ్‌సెంటర్‌మీద జరిగిన దాడి కీ, మన చుట్టూ వుండే ఈ అర్భకులకీ ఏమిటిట సంబంధం” అన్నాన్నేను.
“అదే వాళ్ళు తేల్చుకుంటార్ట. నువ్వు పొద్దుణ్ణించీ టీ.వీ చూడట్లేదుకదా. వాతావరణమేమంత బాగాలేదు. పోలీసులూ మామూలు వాళ్ళు కూడా మన బోటి సౌత్‌ ఏషియా మొహాలు కనపడితే చాలు అనుమానంగా చూస్తున్నార్ట” అన్నాడు ప్రశాంత్‌
“అవునా ?” అన్నాన్నేను ఆశ్చర్యంగా.
“అందుకే చెప్పేది. ఆ అక్రమ్‌ గిక్రం అని వాళ్ళింటి చుట్టూ తిరక్కు.” మళ్ళీ మధు
నాకు తిక్కరేగింది. “మిగతావాళ్ళ సంగతి సరే, మనకి అక్రమ్‌ సంగతి తెలీదా? మనిషేమయిపోయాడో తెలీకుండా వుంటే పట్టించుకోకుండా వదిలేస్తామా?” అన్నాన్నేను, నాకు తెలీకుండానే నా గొంతు లేచింది.
“అందుకే వద్దంటున్నాను. అక్రమ్‌ రిజ్వి ఇద్దరూ లెక్క తేలలేదుట. పైగా ముంతాజ్‌నడిగితే, ప్రతిరోజులా కాకుండా ఈ రోజు ఇంకా ముందే వెళ్ళిపోయాడు అనిచెప్పిందిట. పొద్దుట్నించీ అక్రమ్‌ సెల్‌ఫోన్‌కి ట్రై చేసినా దొరకట్లేదుట. వాళ్ళ ఆఫీసు వాళ్ళు కూడా మేం చూశాం అని చెప్పిన వాళ్ళు లేరుట ఇంతవరకూ” అన్నాడు మధు.
“నన్ను పదింటికి కలుస్తానన్నాడు నా ఆఫీసులో. ఏవో ఇమ్మిగ్రేషన్‌ఫామ్స్‌ కావాలంటే ఇస్తానన్నాను. ఆ పని వుంది కదాని ముందుగా ఆఫీస్‌కి వెళ్ళుంటాడు. సెల్‌ఫోన్‌ తియ్యట్లేదంటే ఏమయ్యిందోనని భయపడాల్సింది పోయి అనుమానిస్తారా?” అన్నాన్నేను

“అదే వద్దనేది. నీ దగ్గరికి వస్తానన్నాడని చెప్పి పోలీసులకి చెప్తావా? పిచ్చెక్కిందా… అయినా ఆ పాకీ గాళ్ళు ఎంత రక్తం మరిగారో చూస్తూనే వున్నాంగా… అసలు నిజంగా అక్రమ్‌ ఎక్కడున్నాడో నాకయితే అనుమానమే… ఆ గుద్దిన విమానాల్లో లేకపోవచ్చు… వాళ్ళ నెట్వర్క్‌ఎంతపెద్దదో… ఇతగాడందులో ఎక్కడ ఏంచేస్తున్నాడో?” అన్నాడు.

నేను అవాక్కయి పోయాను. అక్రమ్‌ చూపించిన ఉద్యోగం చేస్తున్న మనిషి. అతని కుటుంబం గురించీ, ఉద్యోగం గురించీ దాదాపు పూర్తిగా తెలిసిన మనిషి. ఇన్నాళ్ళూ సుబ్భరంగా కలిసి తిరిగిన మనిషి. మనిషిలో ఇంత హఠాత్తుగా ఇంత మార్పు నాకు ఆశ్చర్యంగా ఉంది. పాకిస్తానీ వాడూ, తురకాడూ అవటం చాలా అంతగా అనుమానించబడటానికి? అంతగా అవమానించబడటానికి? నాకు కోపం కన్నా బాధగా వుంది.
గట్టిగా కళ్ళు మూసుకుని ఓ క్షణం కూర్చున్నాను. మెల్లిగా కళ్ళు తెరిచి నచ్చచెప్తున్నట్టుగా అన్నాను.
“మధూ! ఆలోచించు. అక్రమ్‌ ద్వారా ఒక్క అపకారమన్నా జరిగిందా మనకింతవరకూ? మనకి అవసరమయినప్పుడల్లా సహాయమేగా చేశాడూ…. ఇది అన్యాయం మధూ… తోటి మనిషిని ఇంతలా అవమానించకూడదు”
“సత్యా! నువ్వు బాధ పడ్తావని తెలుసు. కానీ పై పై రూపాలు వేరుగా వుంటాయి. అయినా అడిగావు కాబట్టి చెపుతున్నాను. కాశ్మీర్‌ని మనం అన్యాయంగా ఆక్రమించుకున్నామని అన్నాడు గుర్తులేదా?” అన్నాడు మధు.
“అందుకని, కాశ్మీర్లో పేలిన ప్రతి బాంబుకీ, పోయిన ప్రతి ప్రాణానికీ అక్రమ్‌ బాధ్యుడా? ఇప్పుడీ దారుణానికి కూడా? మనకి నచ్చని విషయం నమ్మినందుకు నిర్దోషి అనితెలిసినా మనం సహాయం చెయ్యకూడదా?” ఆశ్చర్యంగా అడిగాను.

“నేనామాటనలేదు. ఏ పుట్టలో ఏ పాముందో మన జాగ్రత్తలో మనం వుందామంటున్నాను” అన్నాడు

నేను అందరి మొహాలూ చూశాను. ఇంట్లో సుమారు 10 మంది మనుషులున్నారు. మాట్లాడుతున్నది మాత్రం ఇద్దరమే. అందరి మొహాల్లోనూ అదో బాధ, దుఖం… ఈ సంభాషణ వినాల్సొచ్చినందుకు. ఎటూ మాట్లాడాలని లేదు ఎవరికీ. కళ్ళు కూడా ఎవరితోనూ కలిపే ధైర్యం లేదు, అందరూ తలా ఓ దిక్కూ చూస్తున్నారు.

ఓ రెండు నిమిషాలలాగే కూర్చున్నాను. అంతా నిశ్శబ్దంగా ఉంది. పిల్లలు కూడా,ఇంతమంది పెద్దవాళ్ళు ఇలా నిశ్శబ్దంగా వుండటం ఎప్పుడూ చూసి వుండలేదేమో, ఆశ్చర్యంగా చూస్తున్నారు.

నేను మెల్లిగా దీర్ఘంగా నిట్టూర్చి, కుర్చీలోంచి లేచాను. లేస్తూ ఇలా అన్నాను…

“నాకు తెలుసు. ఇక్కడెవరూ చెడ్డవాళ్ళు లేరని. అక్రం కీ చెడు జరగాలని కూడా ఎవరూ కోరుకోవట్లేదు. నిజానికి ఇక్కడ చాలామందికి అక్రమ్‌ ని నమ్మాలని కూడా ఉందని నా అనుమానం. మనకి ధైర్యం సరిపోవట్లేదంతే. నేను దగ్గర్నించి చూశాను. మనిషిమీద మనిషికి నమ్మకం పోతే ఏం జరగ్గలదో. ఇప్పుడు నేను అక్రమ్‌ ని నమ్మటం మానేస్తే… అమ్మో నాకు భయమేస్తోంది. నా పిల్లలు చూస్తున్నారు. అంత సాహసం చెయ్యలేను. అక్రమ్‌ ని నేను నమ్ముతున్నాను. అక్రమ్‌ ని నమ్ముతున్న నా నమ్మకాన్ని ఇంకా ఎక్కువగా నమ్ముతున్నాను. అక్రమ్‌ ని నమ్మక పోవడం అంటే నన్ను నేనే నమ్మకపోవటం. FBI, CNN లకి నా కన్నా ఎక్కువగా అక్రమ్ల గురించి తెలిసే అవకాశం లేదు.వాళ్ళనించి నేను వినను… నేనే వాళ్ళకి చెప్తాను. మీలో ఇష్టం ఉన్నవాళ్ళు నాతో రండి. లక్ష్మీ నువ్వుకూడా… నీ ఇష్టమయితేనే” అన్నాను… ఖచ్చితంగా, ఆవేశంగా.

అందరూ ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నారు. లక్ష్మి మాత్రం నోరు విప్పి అంది ” అక్రమ్‌ మీద వున్న నమ్మకం నా మీద లేక పోయింది. నేనెప్పుడో చెప్పేశాను ముంతాజ్‌కి… ధైర్యంగా వుండమనీ, మీర్రాంగానే అందరం వాళ్ళింటికి వచ్చేస్తామనీను. వాళ్ళక్కూడా వంట చేసి పాక్‌చేసేసి వుంచాను. పదండి చూద్దాం ఏమయిందో అక్రమ్‌ భాయ్‌కి” అంది లక్ష్మి.

అందరూ లేచారు…. వాళ్ళ సహాయం నా కవసరం లేకపోయినా… కనీసం కొందరయినా నాతో నడిస్తే బావుండుననే ఆశని చంపుకోలేక పోతున్నాను… ఆశగా వాళ్ళవైపు చూస్తూ “పద” అన్నాను లక్ష్మితో.
-------------------------------------------------------
రచన: అక్కిరాజు భట్టిప్రోలు, 
ఈమాట సౌజన్యంతో