Saturday, January 13, 2018

తెనాలి రామకృష్ణుని శరదృతు వర్ణన


తెనాలి రామకృష్ణుని శరదృతు వర్ణన



సాహితీమిత్రులారా!



తెనాలిరామకృష్ణుని పాండురంగమాహత్మ్యంలోని
నాలుగవ ఆశ్వాసంలో మనకు శరదృతువర్ణన
కనిపిస్తుంది అందులోని ఒక పద్యం-
వర్షఋతువులో ఉండే అందాలు పోయినవి.
వాటి స్థానే శరదృతువులో కొన్ని కొత్త అంశాలు
చోటుచేసుకున్నాయి. ఆ విషయం ఎంత చమత్కారంగా
వర్ణించాడో ఈ పద్యం చెబుతుంది-

కలుగకుండిన నేమి కడిమి పువ్వులతావి
         ననిచిన మరువమెంతటికి నోప?
దొదవకుండిన నేమి మదకేకి నటనంబు
         చాలదె యంచల సంభ్రమంబు?
మెరవకుండిననేమి మెరుగుల పొలప మే
         తన్మాత్రములె శాలిధళధళములు?
సుడియకుండిననేమి సోనవానల పెల్లు
         గజదాన వృష్టికి గడమ కలదె?
కారుకాలాన గలిగిన గౌరవంబు
చౌకయై తోచె శరదృతు సౌష్ఠవమున
నురిలి తొల్లిటి యధికారి యోసరిలిన
వెనుక యధికారి యవికావె విభవకళలు?
          (పాండురంగ మాహత్మ్యం 4 - 42)



కలుగకుండిన నేమి కడిమి పువ్వులతావి
         ననిచిన మరువమెంతటికి నోప?
 వర్ష ఋతువులో కడిమి పువ్వులు పూచేవి. ఇపుడు శరత్తులో
కడిమిపువ్వుల వాసన రావడంలేదు. సరే కడిమిపూల వాసన 
లేకపోతేనేమి? చిగిరించిన ( ననిచిన) మరువము వాసనలు
న్నాయి కదా. (ఎంతటికైనా సరిపోతుందనడం.)

దొదవకుండిన నేమి మదకేకి నటనంబు
         చాలదె యంచల సంభ్రమంబు?
మదించిన నెమలి నాట్యము (మదకేకి నటనంబు) 
ఇప్పుడు లేకపోతే ఏమి?. హంసల సంభ్రమము చాలదా?

మెరవకుండిననేమి మెరుగుల పొలప మే
         తన్మాత్రములె శాలిధళధళములు?

మెరుపులు మెరవకపోతేయేం? శాలిధాన్యపు
( మేలిరకం ధాన్యం)  తళతళలు తక్కువా యేం?

సుడియకుండిననేమి సోనవానల పెల్లు
         గజదాన వృష్టికి గడమ కలదె?
చక్కని చిరుజల్లులు పడకపోతే మాత్రమేమి తక్కువ? 
ఏనుగులుమదజలమును వర్షిస్తున్నవికదా?

కారుకాలాన గలిగిన గౌరవంబు
చౌకయై తోచె శరదృతు సౌష్ఠవమున
వర్షాకాలమునకు గల గొప్పదనము సరిగ్గా ఆలోచిస్తే శరత్తులో
ఇంకా చౌకగా లభిస్తున్నది. అంటే వర్షాకాలంలో దొరికేవన్నీ
ఈ శరత్తులోనూ వానికన్న శ్రేష్ఠమైనవి ఇంకొంచెం చౌకగానే
దొరుకుతున్నాయి. అనగా శరత్తు తనధర్మములు చూపుతూ
వర్షాకాల ధర్మములనూ చూపగలుగుతున్నది

నురిలి తొల్లిటి యధికారి యోసరిలిన
వెనుక యధికారి యవికావె విభవకళలు?
ఒక అధికారి తాను ఉద్యోగమునుండి తప్పుకున్నా. 
వాని అధికారములన్నీ ఆ తరువాత వచ్చే అధికారికి
దొరుకుతాయితాయి కదా. ఆ వైభవాలన్నీ తరువాత
వచ్చేవాడికి దక్కినట్టే వర్షాకాల విభవము శరత్తుకు దక్కింది-
అని భావం

Friday, January 12, 2018

సత్యభామాకృష్ణుల సంవాదం - 1


సత్యభామాకృష్ణుల సంవాదం - 1




సాహితీమిత్రులారా!



కాకపర్తి తిరుపతి పాత్రయ్య కృత
సత్యభామా కృష్ణుల సంవాదం లోని
సంవాదం ఇది చూడండి-

ఒకనాడు ఎంత రాత్రయినా సత్యభామాదేవి
ఇంటికి శ్రీకృష్ణమూర్తి రాలేదు. ఆమె విరహంలో
పడి దూతికను పంపింది. ఆయన వచ్చాడు.
అయితే ఆమె అన్యవధూ పరిభోగ చిహ్నాలను
కనుగొని రోషవహ్నిశిఖ వలె కన్నులు కెంపుల
నింపుతూ తలుపువేసుకుంది. భార్యాభర్తల మధ్య
సంవాదం నడిచింది.
ఇంకొకరికి సొమ్మయినాడని సత్యభామ ఇలా
ఎత్తిపొడిచింది-

తళుకు పసిడి గాజుల నొక్కుల గళంబు
       స్తన మృగనాభి పత్రమూనిన యురంబు
గంబురా విడియంపు కావిని కనుదోయి
       లాక్షారసమున ఫాలస్థలంబు
పలుమొన సోకున కళుకు లేజెక్కిళు
       లసదుగాటుక చిన్నె నలతి మోవి
రమణీయతర నఖాంకముల బాహుయుగము
       పలుచని జిగి కదంబమున మేను
ముద్రలెట్టుచు తనదు సొమ్ముగ  దలంచి
యెవతె నిను నమ్మి యున్నదో యిపుడు తగవు
మాలి నిన్నంట దగునె మా జోలి రాకు
యొకరి సొమ్మొకరు గనంగ నుచితమగునె

(బంగారుగాజుల నొక్కులు గొంతుపైన,
కస్తూరి గుర్తులు రొమ్ముపైన,
కర్పూరతాంబూలపు రంగులో ఎర్రని కళ్లు,
లత్తుక నుదుటిన, దంతక్షతాలు బుగ్గలమీద,
కాటుక చిన్నపెదవి మీద, రెండు చేతుల మీద
ఖక్షతాలు, పలుచని కాంతి మిశ్రమముతో శరీరం
తన సొమ్మని తలచి ఎవతె ఇలా ముద్రలన్నీ
చేసిందో నిను నమ్మి, ఇపుడు నీతో కట్లాట దేనికి
నిన్ను అంటవచ్చునా ఒకరి సొమ్ము మరొకరు
చూడవచ్చునా మాజోలికి రాక వెళ్ళు - అని భావం.)

స్వామి వివేకానంద జన్మదిన శుభాకాంక్షలు


స్వామి వివేకానంద జన్మదిన శుభాకాంక్షలు




సాహితీమిత్రులకు
శ్రేయోభిలాషులకు
స్వామి వివేకానంద జన్మదిన శుభాకాంక్షలు

Thursday, January 11, 2018

భ్రాతృ గృహవాస మింతికి భారమగునె


భ్రాతృ గృహవాస మింతికి భారమగునె




సాహితీమిత్రులారా!



ఆడవాళ్ళ విషయంలో మగవాడు ఆడినమాట
తప్పినా భర్తలేని స్త్రీలు మాత్రం గడమనప్పుడు
తోడబుట్టినవాళ్ళ ఇంటిలో ఉండకూడదు -
అనే విషయాన్ని మదినె సుభద్రయ్యమ్మగారు
శతకంలో వివరించారు.
ఆ పద్యం చూడండి-

కాంతుడు లేకున్న గడుపేదయై యున్న
       బుత్రులు బాలత బొందియున్న
మిత్రులు శత్రులై మేలెరుంగక యున్న
       తిరిపెమే యూరను దొరకకున్న
దీన పోషకుడైన దేవ రక్షామణి
        కనికరం బెదపూని కావ కున్న
తన సహోదరులకు ధన ధాన్య సంపదల్
        కరము ప్రభుత్వంబు కలిగియున్న
భ్రాతృ గృహవాస మింతికి భార మగునె
వారి కుటిల వచశ్మర వ్రజమునాటి
బాధపడు కంటె దేహంబు బాయుటొప్పు
హీనమైయున్న బ్రదుకేల మానినులకు
వర విశాఖ పురాధీశ హరి! రమేశ!

విశాఖపురపాలకా!  ఒ హరీ! రమేశా!
భర్తలేకున్నా, చాలపేదరాలైనా, కుమారులు చిన్నపిల్లలైనా,
మిత్రులే శత్రువులై మంచి చేయకున్న, ఏ ఊర్లో బిక్షం
దొరకకపోయినా, దీనులను పోషించే దేవుడే కనికరించకపోయినా,
తన సోదరులకు ఎంత సంపదకలిగిఉన్నా, చేతిలో పాలనవున్నా,
సోదరుల ఇంటిలో నివసించడం స్త్రీకి భారమే అవుతుంది.
వారి కుటిలమైన మాటల వల్ల బాధ పడటం కంటే
శరీరాన్ని వదలడమే సరైంది. హీనమై వున్న స్త్రీల
బ్రతకులు బ్తకడం దేనికి అంటోంది సుభద్రయ్యమ్మగారు.

ఇందులో స్త్రీ ఎటువంటి పరిస్థితులలో ఉన్నా
సోదరుని ఇంటిలో ఉండకూడదనే విషయాన్ని
నొక్కి చెబుతున్నది కవయిత్రి.

Wednesday, January 10, 2018

పురాణాల్లోని పేర్లు - వాటి అర్థాలు - 2


పురాణాల్లోని పేర్లు - వాటి అర్థాలు - 2




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి............



సాంబశివుడు - (స + అంబ = సాంబ)అంబతో కూడుకున్న శివుడు

శ్రీకంఠుడు - కంఠమునందు విషము కలవాడు - శివుడు

కృష్ణడు - నలుపు వర్ణము కలవాడు

జిష్ణుడు - జయశీలం కలవాడు - ఇంద్రుడు

గౌరి - గౌరవర్ణము కలది - పార్వతి

భవ్య - పూజించువారి కోరికలను తీర్చునది - పార్వతి

చతుర్దంతము - నాలుగు దంతాలుకలది - ఐరావతం

వాల్మీకి -పుట్టనుండి పుట్టినవాడు

వ్యాసుడు -వేదాల్ని వ్యాసం (విభజించి వ్యాప్తి చేయుట) చేసినవాడు.

విదురుడు - బుద్ధిమంతుడు , తెలివిగలవాడు

విభీషణుడు - దుష్టులకు విశేష భీతిని కలిగించువాడు

శంతనుడు - శం = సుఖము/శుభము; తను = విస్తరింపజేయుట ,
                       సుఖమును, శుభమును విస్తరింపజేయువాడు

శకుంతల - శకుంతలములచే (పక్షులచే) రక్షింపబడినది.

శూర్పణఖ - చేటల వంటి గోరులుకలది (శూర్పమనగా చేట, నఖ మనగా గోరు)

సగరుడు - విషముతో పుట్టినవాడు 
                  (గర/గరళ శబ్దాలకు విషమని అర్ధము) (గర్భములో ఉండగా 
                   విష ప్రయోగానికిగురై ఆ విషంతోనే పుట్టినవాడు)

సత్యభామ - నిజమైన కోపము కలది ( భామ - క్రోధే)

సీత - నాగటి చాలు (జనక చక్రవర్తి) భూమి దున్నుతుండగా నాగటి చాలులో 
          దొరికిన శిశువు కనుక సీత అయినది

ప్రద్యుమ్నుడు - ప్రకృష్టమైన (అధికమైన) బలము కలవాడు  
                                            (ధ్యుమ్నము :బలము)

ప్రభావతి - ప్రభ (వెలుగు)కలది.

ప్రహ్లాదుడు - భగవంతుని దర్శనముచే అధికమైన ఆహ్లాదము పొందువాడు

బలరాముడు - బలముచే జనులను రమింపచేయువాడు.

బృహస్పతి - బృహత్తులకు (వేదమంత్రాలకు) ప్రభువు (బృహస్పతి)

భరతుడు - అశేషమైన భూమిని భరించిన (పోషించిన) వాడు.

భీముడు - భయమును కలిగించువాడు

భీష్ముడు - భీషణమైన ప్రతిజ్ఞ చేసినవాడు

మండోదరి - పలుచని ఉదరము కలది (మండ-పలుచని)

మన్మధుడు - మనస్సు కలత పెట్టువాడు.

మహిషాసురుడు 1. రంభుడు మహిషంతో (గేదే) రమించగా పుట్టినవాడు
                               2. 'మహిష్మతి' అనే ఆమె శాపం వలన మహిషమై   
                                   (గేదె) ఉండి సింధు ధ్వీపుడనే రాజు రేతస్సును  
                                   మింగి గర్భాన్నిధరించి ఇతనికి జన్మనిస్తుంది.

యముడు - యమము (లయ)నుపొందించువాడు.

యశోద యశస్సును (కీర్తి) కలిగించునది.

రాముడు - రమంతే యోగినః అస్మెన్ = రామ(రమ్ -క్రీడించుట)

యోగులందరూ ఈ పరమాత్మునియందు విహరించెదరు/ఆనందించెదరు.

రావణాసురుడు - కైలాసమును రావణుడు ఎత్తగా దానిని శివుడు 
                               బొటనవేలితో నొక్కినప్పుడు గొప్ప రవము (ధ్వని) చేసినవాడు

రుక్మిణి - రుక్మము(బంగారము) కలది


Tuesday, January 9, 2018

పురాణాల్లోని పేర్లు - వాటి అర్థాలు - 1


పురాణాల్లోని పేర్లు - వాటి అర్థాలు - 1



సాహితీమిత్రులారా!



ప్రతి వ్యక్తికి పేరుంటుంది దానికో అర్థం కూడా ఉంటుంది.
అర్థంలేని పేర్లను సాధారణంగా ఎవరూ పెట్టుకోరు కదా
అలాగే పురాణాల్లోని వ్యక్తులకు ఆ పేర్లు ఎందు అలా వచ్చాయో
ఇక్కడ కొన్నిటిని తెలుసుకుందాము-

పేరు              అర్థం
విష్ణువు -  అంతటా వ్యాపించినవాడు

లక్ష్మి - అన్నిటిని చూచేది

శివుడు - శుభం కలిగించేవాడు

స్థాణువు - ప్రళయకాలమున ఉండువాడు - శివుడు

పార్వతి - పర్వతరాజ పుత్రిక

భవాని - భవుని భార్య (పార్వతి)

హైమవతి - హిమవంతుని కూతురు - పార్వతి/గంగ

ధాత - సమస్తమును ధరించినవాడు - బ్రహ్మ

సరస్వతి - అంతటావ్యాపించి ఉండునది

బ్రాహ్మి - బ్రహ్మ యొక్క భార్య

అనసూయ - అసూయ లేనిది

అర్జునుడు - స్వచ్చమైన చాయ కలవాడు

అశ్వత్థామ - గుర్రము వలె సామర్ధ్యము/బలము కలవాడు, 
           ఇతను పుట్టగానే అశ్వము వలె పెద్ద ధ్వని 
           రావడం వలన అశ్వత్థామ అని పేరు

ఆంజనేయుడు - 'అంజన'కు పుట్టినవాడు.

ఇంద్రజిత్తు - ఇంద్రుని జయించినవాడు 
                         (జితమంగా విజయము)

ఊర్వశి - నారాయణుడి ఊరువు (తొడ) నుండి ఉద్భవించినది.

కర్ణుడు - పుట్టుకతో 'కర్ణ'కుండలాలు కలవాడు.

కుంభకర్ణుడు - ఏనుగు యొక్క 'కుంభస్థల' ప్రమాణముగల 
             కర్ణములు (చెవులు) కలవాడు.

కుచేలుడు - చినిగిన లేక మాసిన వస్త్రము కలవాడు 
           (చేలము అనగా వస్త్రము).

కుబేరుడు - నికృష్టమైన శరీరము కలవాడు 
                      (బేరమనగా శరీరము).

గంగ - గమన శీలము కలది .  

భాగీరధి - భగీరధునకు పుత్రికగా ప్రసిద్ధినొందినది - గంగ 

జాహ్నవి - జహ్నుమునికి పుత్రికగా ప్రసిద్ధి నొందినది - గంగ

గరుత్మంతుడు - విశిష్టమైన రెక్కలు కలవాడు

ఘటోత్కచుడు - కుండవలె గుబురైన జుట్టు కలవాడు 
                               (ఘటమనగా కుండ)

జరాసంధుడు - 'జర' అను రాక్షసి చేత శరీర భాగాలు 
                             సంధింపబడిన (అతికింపబడిన) వాడు.

తుంబురుడు - తుంబుర (వాద్య విశేషము) కలవాడు

దశరధుడు - దశ (పది) దిశలలో రధ గమనము కలవాడు.

ధృతరాష్ట్రుడు - రాష్ట్రమునంతటినీ అదుపులో ఉంచుకొనువాడు.

త్రిశంకుడు - 1. తండ్రిని ఎదిరించుట 
                        2. పరభార్యను అపహరించుట 
                        3. గోమాంసము తినుట అను మూడు
                               శంకువులు(పాపాలు) చేసినవాడు.

దమయంతి - 1. 'దమనుడు' అను ముని వరము వలన జన్మించినది.
                          2. తన అందముచే ఇతరులను దమించునది.(అణచునది).

దూర్వాసుడు - దుష్టమైన వస్త్రము కలవాడు. (వాసమనగా వస్త్రము)

దుర్యోధనుడు - (దుర్+యోధుడు) ఇతరులు సుఖముగా యుద్ధము చేయుటకు 
                                వీలుపడనివాడు.

దుశ్శాసనుడు - సుఖముగా శాసింప (అదుపు చేయ) సాధ్యము కానివాడు.

ద్రోణుడు - ద్రోణము(కుండ)నుండి పుట్టినవాడు.

ధర్మరాజు - సత్యము, అహింస మొదలగు ధర్మములను 
                      పాటించే రాజు/ 
                      (కుంతి భర్త అనుమతి పొంది ధర్ముని   
                      వలన(యమధర్మరాజు) కన్న సంతానము )

యుధిష్టరుడు -  యుద్ధమునందు స్థిరమైన పరాక్రమమును
                              ప్రదర్శించువాడు 

నారదుడు - 1.జ్ఞానమును ఇచ్చువాడు (నారమనగా జ్ఞానము) 
           2. కలహప్రియుడగుటచే నరసంధమును భేదించువాడు.

Monday, January 8, 2018

ఇలాటి దూత ఉన్నాడా?


ఇలాటి దూత ఉన్నాడా?



సాహితీమిత్రులారా!


నిషధదేశాధీశుడైన నలుడు దమయంతి స్వయంవరం
వెళుతున్న సమయంలో అతనికి ఇంద్రుడు, వరుణుడు,
అగ్ని, యముడు కనిపించి వారి పనుపున దమయంతి
వద్దకు దూతగా పంపారు. ఇంద్రవరుణాగ్నియములలో
ఒకరిని చేసుకునే విధంగా దమయంతిని ఒప్పించటానికి.
నలుడు మొదట మాటఇవ్వడంతో చిక్కుపడ్డాడు. చివరకు
వారి మాయాశక్తితో దమయంతి వద్గకు వెళ్ళి అక్కడ నలుని
దౌత్యం ఇక్కడ చర్చాంశం-

నలుని చెప్పినదంతా విన్న దమయంతి-
ఏనేడ నింద్రాదులేడ వారలకు
నెప్పుడు మ్రొక్కుదు నేను నీ ధనమ
భూనాథ నీగుణంబులు హంసచేతఁ
బొలుపుగా విని మనంబున నిల్పియున్న
దాన భవన్నిమిత్తమున నిట్లఖిల
ధారుణీనాథ సార్థంబు రావింపఁ
గా నిప్డు వలసె లోకఖ్యాత కీర్తి
కరుణించి పతిబుద్ధి గావింపుమిందు

(నే నెక్కడ దిక్పలకులెక్కడ వారికి నేనెపు మ్రొక్కుతుంటాను.
వారియందు భక్తి వుందికాని భర్తృభావం లేదు. నేను నీసొత్తే,
నీగుణాలు హంసవల్లవిని నిన్నే ప్రేమించాను. నిన్ను
రప్పించటానికే ఈ స్వయంవరం చాటించి రాజులందరిని
రప్పించాల్సివచ్చింది. కాబట్టి దూతభావం వదలి భర్తృభావం
వహించు.)

నన్ను పెళ్లిచేసుకోవటానికి ఒప్పుకోకపోతే నేను ఉరి పోసుకొనో,
విషంత్రాగో, నిప్పుల్లోదూకో, నీటిలోదుమికో ప్రాలుతీసుకుంటాను
అని అన్నది దమయంతి.
దానికి నలుడు-

భూరిసత్త్వులు సర్వలోక విభుల్ విభూతి సమృద్ధు లి
ద్ధోరుతేజులు నిన్నుఁగోరుచున్న వారమరోత్తముల్
వారి పాదరజంబుఁబోలని వాని నన్ను మనుష్యు సం
సారిఁగోరఁగఁ జన్నే నీకుఁ బ్రసన్నులై సురలుండఁగాన్

(దేవతలు చాల బలం వున్నవారు, అన్ని లోకాలేలేవారు,
అష్టసిద్ధులు కలవారు, నిరంతరం పెరిగే తేజస్సుకలవాళ్లు,
వారు నీయందు అనుగ్రహంతో వచ్చినారు. నేను వాళ్లకాలి
అంటిన దుమ్ముతో కూడ సరిపోను. మనుష్యుని, సంసారిని,
న్నుకోరుకుంటావేమి ఇది మంచిదికాదు.)

దేవతల కప్రియంబులు
గావించి మనుష్యులధమ గతులగుదు రిలం
గావున వారి కభీష్టము
గావింపుము నన్నుఁ బ్రీతిఁ గావుము తరుణీ!

(దేవతలకు ఇష్టం లేని పనులు చేసి మనుష్యులు నరకంలో
పడతారు. కాబట్టి వాళ్లకు ఇష్టమైంది చేసి నన్ను కాపాడు.)

నలుని మాటలకు దమయంతి కన్నీరు కారుస్తూ చాలసేపు
ఆలోచించి నలునితో - నీకు దోషం రాకుండా నాకు
ఒక ఉపాయం తట్టింది. ఆ దిక్పాలకులముందే నిన్ను వరిస్తాను.
అప్పుడు నీకే దోషం రాదుకదా అని చెప్పింది.

ఒక ప్రియుడు ప్రేయసి వద్దకు దూతగా వెళ్ళిన వారెవరైనా
ఉన్నారా?  ప్రేయసి ఇంత ఇదిగా ఒప్పించ ప్రయత్నిస్తాడా?
ఇలాంటి వాళ్లు ప్రపంచంలో నలుడొక్కడే ఉంటాడేమో కదా!