Saturday, September 9, 2017

ప్రేయసి


ప్రేయసి




సాహితీమిత్రులారా!


ఆరుద్రగారి కవిత ఇది
ఇది 1945లో వ్రాయబడింది-


తల్లిగర్భంలోని జీవకణం
మొదట చీలిపోగా
ఏర్పడ్డ కణాలు
కొన్ని వారాలకి
మళ్ళా శరీరాకృతిలో
కలుసుకున్నట్టు
మన కలయిక ఎప్పుడు
పంపర పనస తొనల్లాంటి
నీ ఊపిరి తిత్తులని
తినడం చేతే
నాలో
కర్బూజా పళ్ళలాంటి
నీ కళ్ళు నవ్వుతాయి
నన్నెవరేనా
ఒక సూదిమందు గొట్టంలోకి
ఎక్కించి 
నీకు ఇంజెక్షను ఇస్తే
బావుణ్ణు
నీ రక్తనాళాల్లో పడి
ఈదుకుంటూ
నీ గుండెలిని చేరుకోవాలని
ఉంది

Thursday, September 7, 2017

సీత హనుమంతునితో రామునికి ఏమిచెప్పమన్నది?


సీత హనుమంతునితో రామునికి ఏమిచెప్పమన్నది?




సాహితీమిత్రులారా!


శ్రీమద్రామాయణంలో హనుమంతుడు సీతను
సందర్శించిన సమయంలో హనుమంతునితో
సీత ఈ శ్లోకం చెప్పింది-

మత్కృతే కాకమాత్రే తు
బ్రహ్మాస్త్రం సముదీరితం
కస్మా ద్యో మాం హరేత్ తత్త్వః
క్షమసే త్వం మహీపతే
(నా కోసం కాకిమీదనే బ్రహ్మాస్త్రాన్ని వేసిన నీవు
నీ నుండి నన్ను హరించినవాడిని(రావణున్ని)
ఎందుకు వూరుకున్నవు మహానుభావా! ఓ రామచంద్రా!)

సీత రామునికి నమ్మకంకోసం అంతవరకూ తనకూ రామునకూ
తప్ప మరెవరికీ తెలియని కాకాసుర వృత్తాంతాన్ని గుర్తు చేయవలసిందిగా
హనుమంతునికి చెప్పింది సీతాదేవి.

ఎంత భావగర్భితమైన విషయమోకదా


Tuesday, September 5, 2017

ఉపాధ్యాయదినోత్సవ శుభాకాంక్షలు


ఉపాధ్యాయదినోత్సవ శుభాకాంక్షలు




సాహితీమిత్రులకు,
శ్రేయోభిలాషులకు,
ఉపాధ్యాయమిత్రులకు
భారతరత్న డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి, 
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు



Monday, September 4, 2017

కుందుర్తిగారి సముద్రవర్ణన


కుందుర్తిగారి సముద్రవర్ణన




సాహితీమిత్రులారా!



గాంధీజీ ఉప్పు సత్యాగ్రహ సమయంలో
సముద్రాన్ని సమీపిస్తున్నపుడు,
కుందుర్తిగారు దండియాత్రా కావ్యంలో
చేసిన సముద్ర వర్ణన-

మహోన్నత హిమగిరి శిఖరాల హర్షాశ్రుబిందువులు కారి
గంగై పారాయి కాబోలు బంగాళాఖాతానికి కబురెళ్ళింది
అక్కడినుండి అలలు వెళ్ళి అరేబియా సముద్రానికి చెప్పాయి
అది తక్షణం తయారైంది అవతారమూర్తిని ఆహ్వానించడానికి
ఒడ్డులొరసి దూకుతున్న అలలు అర్ఘ్యపాద్యాలు యివ్వాలి
సముద్రపు చల్లగాలి ఎదురెళ్ళి స్వాగతం యివ్వాలి
అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి, ఆయన రావడమే తడవు
ఆనందంతో తను పెరిగింది ఆకాశమంత పొడవు

దీనిలోని సుదీర్ఘపాదాల శైలి కూడా ప్రవాహాలు జాలువారిన
స్ఫురణ కలిగించాయని విమర్శకులంటారు

Sunday, September 3, 2017

తప్పొప్పుల పట్టిక


తప్పొప్పుల పట్టిక




సాహితీమిత్రులారా!

ఆరుద్రగారి సినీవాలి లోని
ఈ తప్పొప్పుల పట్టిక
కావ్యం చివరలో ఉన్నది
అదేమిటో గమనించండి-

భగవంతుని అచ్చాఫీసు
ప్రచురించిన మానవ ప్రకృతి కావ్యంలో
లెక్కలేని అచ్చు తప్పుల్ని
ఇక్కడ మానవుడే దిద్దుకోవాలి

సాంఘిక గ్రంథాన్ని సనాతనులు
చాదస్తపు నియమాలతో బైండు చేశారు
ఆ కుట్లూ కట్లూ సడలించి మళ్ళా
ఆధునికంగా క్యాలికోబైండు చేద్దాము

అలాచేయడానికి ముందుగానే
అడ్డదిడ్డంగా నున్న బ్రతుకుల ఫారాలను
యథాస్థానాలలో సర్ది సామాజిక
కధాక్రమాని కడ్డులేకుండా చేద్దాము

యుగపురుషులు ప్రూఫ్ రీడర్లు
జగత్ కావ్యాన్ని సరిదిద్దినా
పరిస్థితుల కంపోజిటర్లు
కరక్షన్లు చేయడానికి టైపులు లేవు 

కొత్తటైపులు సృష్టించుకొందాం
మొత్తం కావ్యం పునర్ముద్రిద్దాం
అంతదాకా ఈ తప్పొప్పుల పట్టిక
అందరం తయారుచేద్దాం గట్టిగ

ఈ కావ్యం విషాదాంత మనుకోవడం తప్పు
అసలు అంతమవుతుం దనుకోడమే తప్పు
ఇది అనంతం సౌఖ్యవంతం అనడం ఒప్పు
ఈ నిరాశలోంచి ఆశ జనించడం ఒప్పు

సమకాలిక జీవన విభావరిలో
తమస్సులు ఘనీభవించా యనుకోవడం తప్పు
అతి సన్నని వెలుగురేక లేదనుకోవడం తప్పు
ఆశాచంద్రకళ గల ఇది సినీవాలీ అనడం ఒప్పు


Saturday, September 2, 2017

అయోధ్య అంటే నగరం కాదా?


అయోధ్య అంటే నగరం కాదా?




సాహితీమిత్రులారా!



మనం సర్వసాధారణంగా అయోధ్య అనేది
ఒక నగరంగానే అనుకుంటూంటాం. కానీ
దాన్నిగురించి అధర్వణవేదం(10-2-30 తై ఆ1-27-2-3)
లోని ఈ శ్లోకం చూడండి-

అష్టాచక్రా నవద్వారా దేవానాం పూ రయోధ్యా
తస్యాగ్ం హిరణ్మయః స్వర్గో లోకో జ్యోతిషాऽ ऽ వృత్తః
యో వై తాం బ్రహ్మణోవేద, అమృతే నాऽ ऽ వృతాం పురీం
తస్మై బ్రహ్మ చ బ్రహ్మ చ ఆయుః కీర్తిం ప్రజాం దదుః


త్వగా ద్యష్ట(చర్మ, మాంస, రక్త, మజ్జ, అస్థి మొదలైన)
ధాతు రూపములైన 8చక్రములతో
కన్ను మొదలైన 9 ద్వారములతో అయోధ్య అనే
సార్థక నామంతో దేవతా నిలయమైన శరీరం అనే
పట్టణం ఉంది. (శరీరం పుడతూ, చస్తూ జనన మరణ
చక్రపరిభ్రమణం కలది ఈ జననమరణాలతో యుద్ధం
చెయ్యడం అసాధ్యం కాన శరీరానికి అయోధ్య అంటే
గెలువ శక్యంకానిది అనే పేరు ఏర్పడింది.)
ఈ శరీరం అనే పట్టణంలోని జ్యోతిర్మయకోశానికి
స్వర్గమనిపేరు.  అది జీవచైతన్యస్వరూపమైన
జ్యోతిస్సుచే ఆవరించబడి ఉంది. ఈ పట్టణాన్ని
ఎవడు బ్రహ్మసంబంధమైనదిగా తెలిసికొంటాడో
వానికి బ్రహ్మ, ప్రజాపతి, ఆయువు, కీర్తి, సంతానం
మొదలైనవానిని ఇస్తారు- అని పై వాక్యముల అర్థం.
దీన్ని బట్టి అయోధ్య అంటే మామూలు పట్టణం కాదని,
శరీరానికే అయోధ్య అని పేరు అని తెలుస్తున్నది.

Friday, September 1, 2017

అదికాక మరేమిటి?


అదికాక మరేమిటి?




సాహితీమిత్రులారా!

అడవిని మహానగరంగా
శత్రువును ఆత్మీయునిగా
ఎవరికి కనిపిస్తుందో
ఈ పద్యంలో చూడండి-
ఇది భర్తృహరి సుభాషితాలలోనిది-

భువనమునఁ బూర్వసంభృత పుణ్యరాశి
యగుచు నుదయంబు గావించిన సుగుణనిధికి
వనము పురమగుఁ, బరులాత్మజనము లగుదు,
రవని నిధిరత్నపరిపూర్ణ యయి ఫలించు

ఎవనికి పూర్వజన్మలో సంపాదిచుకున్న సుకృత
సంపద సమృద్ధిగా ఉంటుందో అలాంటి సుగుణశాలికి-
అడవి నగరంగాను, శత్రువులు ఆత్మీయులుగాను,
భూమి అంతా నిధులతోను, రత్నాలతోను నిండినదిగా
అగును - అని భావం.