Sunday, July 3, 2016
వాక్తామ్రపర్ణి కవితా మౌక్తిక.......
వాక్తామ్రపర్ణి కవితా మౌక్తిక.......
సాహితీమిత్రులారా!
ఈ పద్యం కవిస్తుతికి సంబంధించినది చూడండి
ఎలావుందో!
వాక్తామ్రపర్ణి కవితా
మౌక్తికమయకావ్య హేమమండనులగు త
త్ప్రాక్తనసుకవుల నియమా
త్యక్తుల వాల్మీకికాళిదాసులఁ గొలుతున్
(దశకుమార చరిత్ర, 1-9)
వాక్ (భాష) అనే తామ్రపర్ణి నదిలో పుట్టిన ముత్యాలు(మౌక్తిక)
వాల్మీకీ, కాళిదాసుల కవితలు. అలాంటి కవితా ముత్యాలు పొదిగిన
బంగారునగలు (హేమమండన) వారి కావ్యాలు.
ఆ కావ్యాలు వారికి బంగారు ఆభరణాలై శోభిస్తున్నాయి.
కావ్యరచనలో నియమాలను విడిచి పెట్టనివారై(అత్యక్తులు) అంటే
నియమబద్ధులై ఉత్తమసాహితీప్రమాణాలను నెలకొల్పిన ప్రాచీన
(ప్రాక్తన) సత్కవులువారు. సంస్కృతసాహిత్యంలో "ఆదికవి"గా ప్రఖ్యాతులైన
వాల్మీకిమహర్షిని, "కవికులగురువు"గా పేరు పొందిన కాళిదాసమహాకవిని
కేతన ప్రశంసాత్మకంగా సేవిస్తున్నాడు - అని భావం.
అక్షౌహిణి అంటే ఏమిటి?
అక్షౌహిణి అంటే ఏమిటి?
సాహితీమిత్రులారా!
అక్షౌహిణి అనే పదం మనకు సుపరిచితమే.
ఇది మహాభారత యుద్ధంలో పాల్గొన్న సంఖ్యను చెప్పే
సమయంలో వినవస్తుంది. భారతయుద్ధంలో ఇరుపక్షాలకు కలిపి
18 అక్షౌహిణుల సైన్యం పాల్గొన్నది.
అంటే ఎంత మంది అవి తెలియాలంటే
ఈ విధంగా చేసిన తెలుసుకోవచ్చు.
మొదట ఈ సేనాసమూహ పదాలకు
వివరణ తెలుసుకుందాము.
పత్తి - 1 రధములు - 1 ఏనుగు - 3 గుర్రాలు - 5 మంది కాల్బంట్లు
సేనాముఖము - 3రధములు- 3ఏనుగులు - 9గుర్రాలు - 15 మంది కాల్బంట్లు
గుల్మము - 9రధములు. - 9ఏనుగులు. - 27గుర్రాలు - 45 మంది కాల్బంట్లు
గణము- 27రధములు. - 27ఏనుగులు- 81గుర్రాలు - 135మంది కాల్బంట్లు
వాహిని - 81రధములు - 81 ఏనుగులు - 243గుర్రాలు . - 405 మంది కాల్బంట్లు
పృతన - 243రధములు. - 243ఏనుగులు - 729 గుర్రాలు . - 1215 మంది కాల్బంట్లు
చమువు - 729 రధములు. - 729ఏనుగులు 2187 గుర్రాలు . - 3645 మంది కాల్బంట్లు
అనీకిని - 2117రధములు.- 2117ఏనుగులు. - 6561 గుర్రాలు - 10135మంది కాల్బంట్లు
అక్షౌహిణి - 21875రధములు- 21875ఏనుగులు- 65610గుర్రాలు . - 109350మంది కాల్బంట్లు
3పత్తులు - 1సేనాసముఖము
3సేనాముఖములు - 1 గుల్మము
3గుల్మములు - 1గణము
3గణములు - 1వాహిని
3 వాహినులు - 1పృతన
3పృతనలు - 1చమువు
3 చమువులు - 1 అనీకిని
5 అనీకినిలు - 1అక్షౌహిణి
అక్షౌహిణికి ఒక్కొక పుస్తకంలో ఒక్కొక్క రకంగా వివరించడం జరిగింది.
ఇందులో అనేక అభిప్రాయాలున్నాయి.
అందువల్ల దీనికి ప్రామాణికత లేకుండా పోయింది.
Saturday, July 2, 2016
శ్రీ శ్రీ - పద్యాలు - 2
శ్రీ శ్రీ - పద్యాలు - 2
సాహితీమిత్రులారా!
మనం శ్రీశ్రీ పద్యాలను ఒకసారి చూశాం.
మరి కొన్నిటిని ఇప్పుడు చూద్దాం.
"దెయ్యాలను చూపిస్తా
నయ్యా!" రమ్మనుచు నొక్క ఆసామీ నా
కయ్యో, తన కూతుళ్ళను
చెయ్యూపుచు పిలిచి చూపె సిరిసిరిమువ్వా!
నాకేమో లోకంలో
కాకవులే కానరారు, కవిదూషణ న
న్నాకర్షించదు, రచనో
త్సేకాన్నే మెచ్చుకొండు సిరిసిరిమువ్వా!
తెగకుట్టి వదలి పెట్టిన
వగణిత వైడాగు దోమలశ్వత్థామల్
పొగరెక్కిన రెక్కేన్గులు
సెగలెగసెడు తమ్మముళ్ళు సిరిసిరిమువ్వా!
బారెట్లా అయితే సాం
బారెట్లా చెయ్యగలడు? భార్య యెదుట తా
నోరెట్లా మెదలించును?
చీరెట్లా బేరమాడు? సిరిసిరిమువ్వా!
నాలాగ కందబంధ
జ్వాలా జాలాగ్ర సంవసత్ సద్గీతా
లాలపించే కవితా
శ్రీలోలుడు నహినహీతి సిరిసిరిమువ్వా!
తొందరగా చిందరగా
వందరగా పరుగులెత్తు వాళ్ళకు వేరే
గందర భూగోళంలో
చిందుల చదివింతలేల సిరిసిరిమువ్వా!
నినుఁ జెప్పి మఱియును నిన్నుఁ జెప్పి
నినుఁ జెప్పి మఱియును నిన్నుఁ జెప్పి
సాహితీమిత్రులారా!
రాయని భాస్కరునిలో ఈ గుణాలన్నీ ఉన్నాయని
ఒక కవి వర్ణించిన పద్యం
ఎంత చమత్కారంగా ఉందో
చూడండి.
నిత్యసత్య త్యాగనీతిలో శిబిఁ జెప్పి
నినుఁ జెప్పి మఱియును నిన్నుఁ జెప్పి
బహుపరాక్రమమునఁ బరశురామునిఁ జెప్పి
నినుఁ జెప్పి మఱియును నిన్నుఁ జెప్పి
రఘుకులోత్తముఁడైన రామచంద్రునిఁ జెప్పి
నినుఁ జెప్పి మఱియును నిన్నుఁ జెప్పి
సుకుమార తను సరి సురరాజసుతుఁ జెప్పి
నినుఁ జెప్పి మఱియును నిన్నుఁ జెప్పి
చెప్పదగుఁగాక యితరులఁ జెప్పఁదగునె
కలియుగంబున నీవంటి ఘనుఁడు కలఁడె
అమిత గుణసాంద్ర! మానినీ కుముద చంద్ర!
భాగ్య దేవేంద్ర! రాయని భాస్కరేంద్ర!
ఓ రాయని భాస్కరా!
నిత్యము సత్యము త్యాగము నీతిలో శిబిచక్రవర్తిని చెప్పిన తరువాత
నిన్ను చెప్పిన తరువాత మరొకరు లేరు కావున నిన్నే చెప్పాలి.
అలాగే పరాక్రమంలో పరశురాముని చెప్పిన తరువాత
నిన్ను చెప్పి మరల మరొకరు లేరు కావున నిన్నే చెప్పాలి.
సకలగుణాలలో రఘుకులంలోని రామచంద్రుని చెప్పిన తరువాత
నిన్ను చెప్పిన తరువాత మరొకరు లేరు కావున నిన్నే చెప్పాలి.
సుకుమారంలో ఇంద్రకుమారుడైన జయంతుని చెప్పిన తరువాత
నిన్ను చెప్పి తరువాత మరొకరులేరు కావున నిన్నే చెప్పాలి.
నిన్నే చెప్పాలిగాని మరొకరిని చెప్పవచ్చునా?
కలియుగంలో నీవంటి ఘనుడు మరొకరు కలరా?
- అని పై పద్యభావం.
Friday, July 1, 2016
రాయని జాబులు, రాని ఉత్తరాలు
రాయని జాబులు, రాని ఉత్తరాలు
సాహితీమిత్రులారా!
డా. ధారా రామనాథశాస్త్రిగారు ఎఱ్ఱనగారికి కొన్ని జాబులు రాశారు.
ఎఱ్ఱన ఆయనకు జవాబులు రాశారు. ఇది కడుచిత్రం కదా!
అందుకే ఆయన రాయని జాబులు, రాని జవాబులు పేరుతో
కొన్ని లేఖలు రాశారు.
వాటిలోని ఒక లేఖ ఎఱ్ఱనకు రాసింది.
చూడండి-
మహారాజశ్రీ చెదలవాడ ఎఱ్ఱాప్రెగ్గడ గారికి,
నమస్కారములు, ఉభయకుశలోపరి. అడ్రసు వ్రాయడంలో పొరపాటువలన
ఉత్తరం ఆలస్యమైనందుకు చింతిస్తున్నాను. మీ సందేశం మా అందరికీ సంతోషాన్ని
కలిగించింది. కాగా ఎలాగూ మీతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపే అవకాశం కలిగింది.
కనుక మీతో కొంత సద్గోష్ఠి చేద్దామని క్రింది కొన్ని ప్రశ్నలు వ్రాస్తున్నాను.
మీరు కోపపడక ఓపిగగా అన్నిటికీ సమాధానం వ్రాయండి.
వీలైనంత త్వరగా వ్రాస్తే అచ్చువేయడానికి వీలవుతుంది.
1. మీరు కవిత్రయంలో చేరిన కవీంద్రులై కూడా మీకు నన్నయ తిక్కనలకు
వచ్చినంత పేరు రాలేదు. ఎందుచేత?
2. మీరు అరణ్యపర్వాన్ని పూరించారా? లేక నష్టమైతే మళ్ళీ రచించారా?
3. నన్నయగారి సరససారస్వతాంశ మీమ్మల్ని ఆవేశించినట్టు తద్రచనయకా
మీరు పూరించినట్టూ సెలవిచ్చారు. దీంట్లో ఆంతర్యమేమిటి?
దయచేసి వివరించండి.
4. మీ కవిత్వం మీద నన్నయ ప్రభావం ఎక్కువా తిక్కన ప్రభావం ఎక్కువా?
ఇలా ప్రశ్నలడుగుతున్నందుకు కోప్పడవద్దు.
ఇట్లు
విధేయుడు
ధారా రామనాథశాస్త్రి
(ఇది ఎఱ్ఱాప్రగ్గడ సాహిత్యవ్యాసాలు(సంకలనం)
ప్రచురణ- సృజన, అద్దంకి.-లోనిది.)
కుహూ అంటే ఏమని?
కుహూ అంటే ఏమని?
సాహితీమిత్రులారా!
ఒక రకంగా చెప్పాలంటే మనం మన ప్రాచీన కాలంనుండి
వస్తున్న పదజాలం మరచిపోతున్నాము.
కారణమేదైనా మనకు మన పెద్దలు అందించిన అపురూప
పదాలను విడిచేస్తున్నాము.
గతంలో ఏదికావాలన్నా సంస్కృతంలో నుండి
వివరణను అర్థాన్ని తీసుకునే మనం
ఇప్పుడు ఇంగ్లీషును వాడుకుంటున్నాము.
ఇది తప్పని కాదు మనవారు అందించిన
దాన్ని వదులుకోవడం తప్పు.
సరే మనం చేయగలిగినదేదో ఆలోచించుకోవాలి
ఎవరికివారు మనభాషా పదజాలాన్ని కాపాడుకుంటే
అది నిలుస్తుందని
నా అభిప్రాయం.
పూర్ణిమ లేక పౌర్ణిమ అనటానికి
ఇంగ్లీషులో ఫుల్ మూన్(FULL MOON) అంటారు.
మరి మనవారి విభజన చూద్దాం-
అనుమితి - ప్రకాశంలేని పూర్ణిమ
రాక - ప్రకాశవంతమైన పూర్ణిమ
సినీవాలి - చంద్రకళ అగుపడే అమావాస్య
కుహూ - చంద్రకళ కానరాని అమావాస్య
అలాగే రంగుల విభజన పదాలు-
అరుణము - తేలికపాటి ఎరుపు
పాటలము - తెలుపు ఎరుపు కలిసిన రంగు
కపిశము - నలుపు పసుపు కలిసిన రంగు
ధూమ్రము - నలుపు ఎరుపు కలిసిన రంగు
కపిలము - ఎరుపు పసుపు కలిసిన రంగు
కర్బురము - మిశ్రమ రంగులు
Subscribe to:
Posts (Atom)






