Tuesday, May 3, 2016

పోతన పద్యానికి మూలం?


పోతన పద్యానికి మూలం?


సాహితీమిత్రులారా!

నీలంరాజు వెంకటశేషయ్యగారు రాసిన "నడిచే దేవుడు" పుస్తకంలోని విషయం ఇది.
జగద్గురు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ శంకరాచార్య స్వాములవారి
దగ్గరకు మహాకవి పుట్టపర్తి నారాయణాచార్యులు గారు,
పోతన భాగవతాన్ని హిందీలోకి అనువదిస్తున్న
శ్రీ వారణాశి రామమూర్తి(రేణు)గారు వెళ్ళి మాట్లాడు
సందర్భంలో రేణుగారు
గజేంద్రమోక్షణం ఘట్టంలోని-

"తన వెంటన్ సిరి లచ్చివెంట నవరోధ వ్రాతము న్దాని వె
న్కను పక్షీంద్రుడు వాని పొంతను ధనుకౌమోదకీ శంఖచ
క్రనికాయంబును నారదుండు ధ్వజినీకాంతుండు దావొచ్చిరొ
య్యన వైకుంఠ పురంబునం గలుగు వారాబాల గోపాలమున్"

అనే పద్యాన్ని చదవగానే,
దానిని విని స్వామి,
ఇదే మోస్తరుగా సంస్కృతంలో ఒక ఆభాణకం ఉన్నదనీ
అది పోతన కాలానికి పూర్వపుదే అయితే
బహుశా పోతన దానిని ఉండవచ్చునని అన్నారు.

ఆ ఆభాణకం గురించి తాము విననే లేదని,
దానిని శ్రుతిపరచండనీ పుట్టపర్తివారు అభ్యర్ధించారు స్వామిని.
ఒకటి రెండునిమిషాలు ఆగి, స్వామి ఇలా చదివారు-

"లీలాలోలతమాం రమా మగణయన్ నీల మనాలోకయన్
ముంచన్ కించ మహీం, అహీశ్వర మయం ముంచన్ హఠాద్వంచయన్
ఆకర్షన్ ద్విజరాజమప్యతిజవాత్ గ్రాహాచ్చ సంరక్షితుం
శ్రీదోవింద ఉది త్వరత్వర ఉదైత్ గ్రాహగ్రహార్తం గజమ్"

ఈ శ్లోకం ఒకటి ఉన్నట్లు పుట్టపర్తి వారికీ,
రేణుగారికి తెలియదు.
తెలియని వారింకెందరో!

పిల్లలవాణ్ణి కనికరించి కనికరించండి


పిల్లలవాణ్ణి కనికరించి కనికరించండి


సాహితీమిత్రులారా!

"సినీవాలి"లో "ఆరుద్ర"గారు "మృత్యువుతో మాట్లాడుతున్నట్లు"
 రాసిన కవిత(పుట.85-86) చూడండి.

"అయ్యా మృత్యువుగారూ!
పిల్లవాణ్ణి దయచేసి కనికరించండి
అద్దకుంటున్న ఈ జీవితం వాటాకి
నిజమే ఆదినుంచి బాడుగ బాకీ
అయ్యా వృత్యువుగారూ!
పండక్కి కోర్కెల గోడలకి వెల్ల వేయించండి
పడిపోయిన యౌవనం పెరటిగోడలు
ఈ ఏడైనా మరమ్మత్తు చేయించండి
ఇకమీదట సెక్సుపాపాల పిడకలతో
గోడలు ఖరాబు చెయ్యను ఖరారు
నిత్యనైమిత్తికాల వంటింట్లో
చూరునుంచి లేమికారుతూంది చూడండి
కలలపంచనుండికారే సంతృప్తిధార
నిద్దుర నిందెలలో పట్టుకోనీండి
అయ్యా మృత్యువుగారూ!
పరిస్థితుల పెంకులు తిరగ వేయించండి
ఆశయాల ధరలు మండిపోతున్నాయి
అద్దె కొద్దిగా తగ్గించండి
దయచేసి తక్కిన వాటాలవాళ్ళని
త్యాగాల ముగ్గులు పెట్టంమనండి
నుయ్యి కొంచెం లోతు చేయించండి
పోనీ బురదైనా తీయించండి
ఆ భయం మీకఖ్కర్లేదు
అందులో మట్టుకు పడి చావను
జ్ఢాపకాల సందుగులు అనుభవాల పరువులు
రోడ్డుమీద పారేయకండి
బాబ్బాబూ వచ్చేజన్మలో చూసుకుందాం
ఈసారికి ఊరుకోండి
అయ్యా మృత్యవుగారూ!
పిల్లలవాణ్ణి కనికరించి కనికరించండి"

Monday, May 2, 2016

కుక్షిచింత


కుక్షిచింత


సాహితీమిత్రులారా!

మద్దుపల్లి వేంకటసుబ్రమణ్యశాస్త్రిగారు తమ కవితావినోదము
(సంపుటము-1)లోనిది ఈవిషయం.

కుక్షిని గురించిన ఒక చక్కటి సుభాషితం
తమిళంలో అవ్వయ్యార్ అనే భక్తురాలు
తను ఒకమారు అరణ్యంలో పోతూ ఉన్నపుడు
ఆకలిగొన్న సమయంలో చెప్పినదట. సుభాషితం
ఇది.

ఒరునా ళుణవై యొడి యెండ్రా లొడియాయ్
ఇరునాళై క్కే లెండ్రా లేలాయ్
ఒరునాళు మేన్నో వరియాయ్
ఇడుం బైకూ రేన్ వయిరే
ఉన్నోడు వాడిద లగిదు

దీని భావం-
ఒక దినము  ఆహారమును విడిచిపెట్టమంటే విడిచిపెట్టవు.
రెండు దినములకు ఆహారం తీసుకోమంటే తీసుకోవు.
ఒక్కదినమైనా నా సంకటమును తెలిసికొనవు.
సంకటకారిణియైన ఓ కడుపా నీతో జీవనం చేయటం కష్టం.

ఇంత కమ్మని భావం మద్దుపల్లిగారికి తెలిసినంతలో
సంస్కృతంలో కనిపించలేదట. అందుకని
వారు తనే కవితావినోదచాపలంచేత 1-9-1947న
సంస్కృతీకరించారట.
ఆ శ్లోకం ఇది.

హేకుక్షే! తవ కిం బ్రవీమి చరితం? సర్వం విలక్షం, యథా
హ్యేకస్మిన్ జహి వాసరే2న్నమితిచే దేవం నహి త్యక్ష్యసి,
యద్వాప్రాప్తమితి ద్వివాసరమితం భుంక్ష్వేతి వా నో తథా
జానీషే న హి మే శ్రమం వద కథం జీవామి సాకంత్వయా?

పరదేశము వెళ్ళిన నాభర్త తిరిగి ఎప్పుడు వచ్చును?


పరదేశము వెళ్ళిన నాభర్త తిరిగి ఎప్పుడు వచ్చును?


సాహితీమిత్రులారా!

ధ్వని - వక్రోక్తి - వ్యంగ్యములతో యువతులు ప్రకటించే తీరు వివరించే
శ్లోకాలు, పద్యాలు అనేకం ఉన్నాయి.
వాటిలో ఈరోజు ఒకటి.

చంకన పుస్తకం పెట్టుకొని ఒక యువకుడు వెళుతున్నాడు.
అతన్ని ఒక కామిని సాభిప్రాయంగా ఈవిధంగా ప్రశ్నించింది.

హే పాంథ!పుస్తకధర! క్షణ మత్ర తిష్ఠ!
వైద్యోసికిం? గణితశాస్త్ర విశారదోవా?
కేనైషధేన మను పశ్యతి భర్తురంబా?
కింవా గమిష్యతి పతి: పరదేశవాసీ?

(పుస్తకం పట్టుకొని వెళ్ళే ఓ పాంథుడా కొంచము ఆగుము
నీవు వైద్యుడవా? జ్యోతిష్యుడవా?
వైద్యుడవైతే, ఏమందు వలన వా అత్తకు కన్నులు కనిపిస్తాయి?
జ్యోతిష్యుడవైతే పరదేశం వెళ్ళిన నా భర్త ఎప్పరుడు వస్తాడు?
- అని రెండు ప్రశ్నలు అడిగింది.

(దీనిలోనీ ధ్వని యేమిటంటే - భర్త యింట్లోలేడు.
ఇంట్లో ఉండే అత్తకు కళ్ళు కనిపించవు మనకు అడ్డు లేదని
చెప్పకనే చెప్పడం)

Sunday, May 1, 2016

"ఆకలిదప్పులు లేని వేంటేశ్వరునికి మంగమ్మ విందు"


"ఆకలిదప్పులు లేని వేంటేశ్వరునికి మంగమ్మ విందు"


సాహితీమిత్రులారా!
ప్రతివ్యక్తికి ఉండవలసింది కూడు, గూడు, గడ్డ. ఇంపైన గుడ్డ ఉండి,
మధురమైన కూడు ఉండి, అందమైన గూడు కూడ ఉంటే
అప్పుడు కావాలి అందరికి శృంగారం. కడుపు నిండితేనే కదా శృంగారం.
అలవేలుమంగా శ్రీనివాసుల శృంగార లీలల్ని అద్దంపట్టే వేంకటేశ్వర శతకంలో
ఆకలిదప్పులు లేని వేంకటేశ్వరునికి మంగమ్మ ఎలాంటి విందును
ఆరగింప చేసిందో నోరూరించే అందమైన పదాలతో అన్నమయ్య ఎలా రాశాడో
శతకంలోని 50వ పద్యం చెబుతుంది చూడండి.

అరిసెలు, నూనె బూరియలు, నౌగులు, చక్కెర చుండిగల్, వడల్,
పురుడలు, పాలమండిగల, పూపములయ్యలమేలుమంగనీ
కరుదుగా విందు వెట్టు పరమాన్నచయంబులు సూపకోటియున్
నిరతి వినిర్మలాన్నములు నేతులు సోనలు వేంకటేశ్వరా!

ఈ పదార్థాలల్లో ఇప్పుడు
కొన్ని పేర్లే వింటున్నాం.
కొన్నే తింటున్నాం.
ఇంకొన్నాళ్ళకు
ఇప్పుడు వినేవి ఉండవు
తినేవి ఉండవు
ఇప్పుడంతా నవీనం
తెలియని పేర్లతో తినడమే ఎంజాయ్మెంట్-

తెలుగులో మొదటి కందపద్యం


తెలుగులో మొదటి కందపద్యం


సాహితీమిత్రులారా!

తెలుగులో నన్నయ శ్రీమదాంధ్రమహాభారతం మొదటి కావ్యం
ఇందులో రాయబడిన కందమే మొదటి కందం.
అది ఆదిపర్వం ప్రథమాశ్వాసం నాలుగవ పద్యం.

విమలాదిత్య తనూజుఁడు
విమల విచారుడు గుమార విద్యాధరుఁడు
త్తమ చాళుక్యుఁడు వివిధా
గమ విహితశ్రముఁడు తుహినకరుఁడురుకాంతిన్

(విమలాదిత్యునకు, రాజరాజచోళుని కూతురైన కుందవాంబకు జన్మించిన పుత్రుడు,
నిర్మలమైన ఆలోచనకలవాడు, కుమారస్వామివలె అస్త్రవిద్యలో నేర్పరి శ్రేష్ఠుడైన
చాళుక్యవంశపురాజుఅనేక శాస్త్రాలలో పరిశ్రమచేసినవాడు
దేహకాంతిలో  చంద్రుడు అయిన రాజరాజనరేంద్రుడు.)

Saturday, April 30, 2016

"విప్పి చెప్పేవాడు విమర్శకుడు"


"విప్పి చెప్పేవాడు విమర్శకుడు"


సాహితీమిత్రులారా!
"కప్పిచెప్పేవాడు కవి - విప్పి చెప్పేవాడు విమర్శకుడు" -  అనేది నానుడి.

నన్నయ రాజరాజును సంబోధిస్తూ రాసిన పద్యం ఇది.

శ్రీరమణీప్రియ, ధర్మవి
శారద, వీరావతార. సౌజన్య గుణా
ధార భువనైక సుందర
వీర శ్రీరమ్య బుధ వివేక నిధానా (సభా-2-1)

నన్నయ సామాన్యంగా శ్లేషనుగాని, చమత్కారాన్నిగాని పాటించడు.
మరి ఈపద్యంలో నన్నయ వాడిన విశేషణాలు రాజరాజు గుణగణాలను
కీర్తించినవే కానీ ఓప్రతిభా విమర్శకుడు చేసిన విమర్శను చూడండి.

శ్రీరమణీప్రియ - శ్రీకృష్ణుడు,
ధర్మవిశారదుడు - ధర్మరాజు,
వీరావతారుడు - భీముడు,
సౌజన్యగుణాధారుడు - అర్జునుడు,
భువనైకసుందరుడు - నకులుడు,
బుధవివేకనిదానుడు - సహదేవుడు - అని వివరించాడు.
కవి భావనలోని విశేషాలను చమత్కారాలను విమర్శకులు చాతుర్యంగా
విపులీకరించగలరని దీన్ని బట్టి అర్థమౌతుంది.