భాషాసవ్యతకు బాటలు వేద్దాం – 2
సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........
ఆచారాలను పాటించక తాగుడు వంటి దురలవాట్లకు బానిస అయినవాణ్ని కొందరు భ్రష్ఠుడు అనడం కద్దు. కాని ఆ పదం తప్పు. భ్రష్టుడు అన్నదే సరైన పదం. కాని కుటుంబంలోని పెద్ద కొడుకును జ్యేష్ఠుడు, మేలిమి పొందినవాణ్ని శ్రేష్ఠుడు అనటమే రైటు. జ్యేష్టుడు, శ్రేష్టుడు అనేవి తప్పు పదాలు. “కొడవటిగంటి కుటుంబరావు గారి వాక్య నిర్మాణంలో నిర్దిష్ఠత ఉంటుంది” అని ఒక సాహిత్యసభలో ఎవరైనా చదివారనుకోండి. ఆ వాక్యంలో భాషాదోషం ఉన్న విషయాన్ని గుర్తు పట్టాలి మనం. నిర్దిష్టతకు బదులు నిర్దిష్ఠత అని రాయటం మరి భాషాదోషమే కదా. కొందరు నిర్దుష్టత అని రాస్తారు. అది కూడా తప్పే అని గ్రహించాలి.
‘ఠ’ వత్తుకు బదులు ‘ట’ వత్తును ప్రయోగించడం మరొక రకమైన భాషాదోషం. “మనం మన తెలుగు భాష ప్రతిష్టను కాపాడుదాం” అని రాస్తే మన తెలుగు భాషా ప్రతిష్ఠ ఏమై పోను! ప్రతిష్ట తప్పు, ప్రతిష్ఠ ఒప్పు.“తెలుగు భాషను పటిష్టం చెయ్యాలి” అన్నప్పుడు అలా వాక్రుచ్చినవారి తెలుగు భాష పటిష్ఠంగా లేదని తాత్పర్యం! పటిష్టం తప్పు. గోష్ఠి అంటే చిన్న సభ వంటిది. పండితుల గోష్ఠి ఉంటుంది. (మందు కొట్టేవాళ్లది కూడా ఉంటుంది బహుశా!). అయితే ఈ పదాన్ని గోష్టి అని తప్పుగా రాయటం అరుదేం కాదు. పరమేష్టి , పరాకాష్ట అన్నవి కూడా అటువంటి భాషాదోషాలే. పరమేష్ఠి , పరాకాష్ఠ అన్నవి సరైన పదాలు. “అలా నిష్టూరాలాడుతావేం వదినా” అని ఒక ఇల్లాలు మరొక ఇల్లాలు దగ్గర బాధ పడిపోవటం మనం గమనిస్తుంటాం. ఇక్కడ నిష్టూరము అనే పదం తప్పు. నిష్ఠురము అనేదే రైటు. కొన్ని నిఘంటువుల్లో నిష్టురము అనే పదం కూడా ఇవ్వబడిన మాట వాస్తవమే. నిష్ఠురము అంటే కఠినము లేక పరుషము అని అర్థం. “సమాసభూయిష్టమైన కవిత్వాన్ని ఈ కాలంలో ఇష్టపడరు” అనే వాక్యం దోషభూయిష్ఠమైనది. అంటే భూయిష్టము తప్పన్న మాట. భూయిష్ఠము సరైన పదం. అధిష్టానము, కనిష్ట , గరిష్ట , సౌష్టవం ఈ పదాలు కూడా తప్పే. అధిష్ఠానము, కనిష్ఠ , గరిష్ఠ , సౌష్ఠవం ఇవి సరైన పదాలు. ఇక శవాన్ని పడుకోబెట్టే కట్టెల కుప్పకు కాష్టము అనే పదాన్ని వాడుతారు చాలా మంది. కాని నిజానికి కాష్ఠము అనేది రైటు. అయితే కొన్ని నిఘంటువుల్లో కాష్టము అన్న పదం కూడా ఇవ్వబడింది.
‘థ’ కు బదులు ‘ధ’ అని తప్పుగా రాస్తారు కొంత మంది. ఉదాహరణకు కధ, అనాధ అనేవి. కథకు బదులు కత అని రాస్తే ఒప్పుకోవచ్చు. ఎందుకంటే అది కథకు వికృతి. కాని కధను ఒప్పుగా ఒప్పుకోరు మరి. ‘ధ’ కు బదులు ‘థ’ రాయటం కూడా అరుదైన విషయమేం కాదు. వీథి, వ్యథ, శీథువు అనేవి కొన్ని ఉదాహరణలు. ఇక్కడ వీధి, వ్యధ, శీధువు అన్నవి కరెక్టు పదాలు. నాధుడుకు బదులు నాథుడు రాయటం కూడా ఇటువంటిదే. దీటైన అనే మాటకు బదులు ధీటైన అన్న పదాన్ని ఉపయోగిస్తారు కొందరు. కాని ‘ధీటైన’ తప్పు. దీటైన, దీటుగా అనేవే సరైన మాటలు.
“లబ్దిదారులకు ప్రభుత్వం పట్టాలను ప్రదానం చేసింది” అని వార్తాపత్రికల్లో చదువుతుంటాం మనం. ఇక్కడ లబ్ధిదారులు అనేదే సరైన పదం. కాబట్టి లబ్దప్రతిష్టులులో రెండు తప్పులున్నాయి. లబ్ధప్రతిష్ఠులు అని సరిగ్గా రాయటం మనం దాదాపు ఎక్కడా చూడం.
ఉజ్వలము, తత్వము, సత్వము అనే పదాలు ఇప్పుడు సరైనవిగా చలామణి అవుతున్నాయి కాని, అవి పూర్తి కచ్చితత్వం ఉన్న పదాలు కావు. నిజానికి గ్రాంథికభాష ప్రకారం చూస్తే ఉజ్జ్వలము, తత్త్వము, సత్త్వము అనేవి సరైనవి. అయినా ఉజ్వలము, తత్వము, సత్వము అని రాస్తే అత్యంత శుద్ధతావాదులైన పండితులు తప్ప ఇతరులు ఆక్షేపణ తెలుపరు.
ఆఫీసుకు వెళ్తున్నాను అనే అర్థంలో కచేరీకి వెళ్తున్నాను అనడం పూర్వకాలంలో అత్యంత సాధారణంగా జరిగేది. కచేరీ అనే పదానికి నిఘంటువులో కొలువుకూటము, ఉద్యోగశాల, దర్బారు, దివాణము అని అర్థాలున్నవి. అయితే కచేరీ అంటే సంగీత సభ కూడా. కచ్చేరీ అన్నా కూడా అదే అర్థం.
దవము అన్నా , దావము అన్నా అడవి కనుక, కార్చిచ్చును దవానలం లేక దావానలం అనవచ్చు. సతతము, సతము అనేవి కొంచెం దందరగోళాన్ని కలుగజేసే పదాలు. సతతము = ఎల్లప్పుడు. సతము = శాశ్వతము. ఈ భేదాన్ని గమనించాలి (బేధము తప్పు భేదము అన్నదే రైటు).
ఉగాది రాగానే కొత్త సంవత్సరం వచ్చిందని చెప్పటానికి “నవాబ్ధి అరుదెంచింది” అంటూ కవిత్వం రాసి ఆర్భాటం చేయవచ్చు ఎవరైనా. కాని అలా చేస్తే సునామీ ఫలితంగా సముద్రాన్నే మీదకు తెచ్చుకున్నవాళ్లం అవుతాము! ఎందుకంటే అబ్ధి నే పదానికి సముద్రం అని అర్థం. నవాబ్ది అని రాసినా తప్పే. తెలుగు భాషలో అబ్ది అనే పదమే లేదు. అయినా మనం దశాబ్ది, శతాబ్ది అని రాస్తుంటాం. మరి సంవత్సరం అనే అర్థాన్నిచ్చే కచ్చితమైన పదమేది? ఈ ప్రశ్నకు జవాబు అబ్దము. కాబట్టి ఉగాది రోజున నవాబ్దము వస్తుందన్న మాట. అలాగే దశాబ్దము, శతాబ్దము అన్నవి సరైన పదాలు.
సూర్యుడు ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య (ధృవాల మధ్యకాదు) ప్రయాణించే మార్గాన్ని అయనము అంటాము. దక్షిణాయనము అంటే ఈ మార్గంలో సగమైన దక్షిణభాగం. కాని ఉత్తరదిశలో ఉండే సగభాగాన్ని ఉత్తరాయణము అనాలి, ఉత్తరాయనము అనకూడదు. కారణం తెలియదు. అయణము అనే పదం ఉందో లేదో, ఒకవేళ ఉంటే దాని అర్థమేమిటో తెలియదు. అసలు ఆ పదమే నిఘంటువుల్లో లేదు. అయినా ఉత్తరాయణము అనే రాయాలి. శక్తివంతుడు అనే పదం మనకు అచ్చులో తరచుగా కనబడుతుంది. ఉదా: ‘హనుమంతుడు మహా శక్తివంతుడు’, ‘మా సిమెటు చాలా శక్తివంతమైనది’ ఇలాంటి వాక్యాలను చూస్తాము. కాని శక్తివంతుడు అనేది సరైన పదం కాదు. శక్తిమంతుడు అనేదే సరైన పదం. బలశాలి అయినవాణ్ని బలవంతుడు అనే అనాలి. కాని ఐశ్వర్యం ఉన్నవాళ్లు శ్రీమంతులు అవుతారు తప్ప శ్రీవంతులు కారు.
‘ల’ కు బదులు ‘ళ’ రాస్తారు/పలుకుతారు కొంత మంది. ఉదా: కళ్యాణము. కళ్యాణ మండపము అనే మాటను పుస్తకాల్లో, బోర్డులమీదా, ఆఖరుకు సినిమా టైటిల్స్ లో కూడా చూస్తాము. కళ్యాణ్ అని పేరు కూడా పెట్టుకుంటారు కొందరు. అలానే రాసుకుంటారు కూడా. కాని ప్రమాణిక నిఘంటువుల ప్రకారం తెలుగు భాషలో కళ్యాణము అనే పదం అసలు లేనే లేదు. కల్యాణము అనేదే ఉంది. కాబట్టి కల్యాణ్ అనే పేరే సవ్యమైనది. అలాగే మౌలికమైన అనటానికి బదులు మౌళికమైన అని రాస్తారు/పలుకుతారు. మూలము అంటే వేరు (Root). మూలము నుండి వచ్చిందే మౌలికము.
ఊరట (ఊఱట), ఉపశమనము అనే అర్థాన్నిచ్చే పదం సాంత్వనము. దీన్ని చాలా మంది స్వాంతనము అని తప్పుగా రాస్తారు/పలుకుతారు. రాధికా సాంత్వనము ముద్దు పళని రాసిన గ్రంథం పేరు అని సాహితీపరులకు తెలుసు. “రాజుగారి భండాగారము నిండుకున్నది” అంటూ ఆవేదన చెందేవారు తమ భాషలోని దోషాన్ని ఎప్పుడు గ్రహించి ఆవేదన చెందుతారు? భండారము అనేదే సరైన మాట అని తెలుసుకున్నప్పుడే కదా! భండారంలోని ద్రవ్యం రహస్యం కనుక “నీ బండారం బయట పెడతాను” అనే వాక్య ప్రయోగం వచ్చి ఉంటుంది. అయితే భాండాగారము అన్నది కూడా సరైన పదమే.
బ్రహ్మ గురించిన అపోహలు మనకు రెండు ఉన్నట్టు గ్రహించాలి. అందులో మొదటిది బ్రహ్మాండము అంటే జగత్తు అని భావించటం. ‘పెద్ద’ అని అర్థం వచ్చేలా ఆ పదాన్ని వాడుతున్నాం. కాని బాగా పరిశీలించి చూస్తే దానికి బ్రహ్మగుడ్డు అనే అర్థం వస్తుంది! ప్రమాణిక నిఘంటువుల్లో బ్రహ్మాండము అనే పదమే లేదు. ఒకటి రెండు ఇతర నిఘంటువుల్లో ఉన్న మాట నిజమే. ఇక రెండవది బాగా పొగడటానికి బ్రహ్మరథము అనే పదాన్ని వాడుతాము. ఈ పదానికి ‘మృతి పొందిన సన్యాసులను తీసికొని పోయెడి వాహనము’ అనే అర్థం ఉంది నిఘంటువులో. ఒకవేళ ఇది జాతీయం అందామనుకున్నా ఏ విధంగా చూసినా పొగడటం అనే అర్థసమన్వయం కుదరదు. బ్రాహ్మణ్యము అనే పదం కూడా తప్పే. బ్రహ్మణ్యము అనేదే రైటు.
మేధోవంతులు, మేధోమథనం, మేధోసంపత్తి, మేధోశక్తి అని చదువుతుంటాం చాలా సార్లు అచ్చులో. ముఖ్యంగా వార్తాపత్రికల్లో ఈ మాటలు ఎక్కువగా కనపడతాయి. తెలుగు భాషలో మేధస్సు అనే పదమే లేదు. మేధ అన్నది మాత్రమే ఉంది కాబట్టి, విసర్గ సంధి కుదిరే ప్రశ్నే లేదు. తపస్సు ఉంది కనుక తపః+వనము = తపోవనము, శిరస్సు ఉంది కనుక శిరః + రత్నము = శిరోరత్నము ఇలా విసర్గ సంధులు కుదురుతాయి. మేధోమథనం పదం ఏర్పడటానికి వీల్లేదు. మేధామథనం, మేధాశక్తి , మేధాసంపత్తి ఇలాంటి సమాసాలు మాత్రమే ఏర్పడుతాయి. కనుక ఆ పదాలే కరెక్టు.
ప్రేత భూముల దగ్గర ఫలానా స్మశాన వాటిక అని పెద్దపెద్ద అక్షరాలతో బోర్డుల మీద రాసి ఉండటం మనం గమనించవచ్చు. కాని స్మశానము తప్పు. సరైన పదం ‘శ్మశానము’ అని గ్రహించాలి. శాలీనత అంటే ఒక నిఘంటువులో దిట్టతనము అనీ, మరొక నిఘంటువులో బిడియము అనీ అర్థాలు ఉన్నాయి. రూపంలో దీనికి దగ్గరగా ఉండే శాలిత అనే మరో పదంతో తారుమారు చేయకూడదు దీన్ని. శాలిత అంటే శాలిత్వము. ఊహాశక్తి ఎక్కువగా ఉండటాన్ని ఊహాశాలిత అనవచ్చు. ప్రొమోషన్లను (ప్రమోషన్లను అనకూడదు) పదోన్నతులు అని పత్రికల్లో రాయటం మనం సాధారణంగా గమనించే విషయం. దీని సంధి విచ్ఛేదం పదవి + ఉన్నతి కాదు. పదవి + ఉన్నతి = పదవ్యున్నతి (యణాదేశ సంధి) అవుతుంది. పదము + ఉన్నతి = పదోన్నతి (గుణ సంధి) అవుతుంది నిజమే. కాని, ప్రొమోషన్ అంటే పదములో పెంపుదలా? పదము అంటే స్థానము అని వేరొక అర్థం ఉంది కాబట్టి, స్థానంలో పెరుగుదల అనుకోవాలి. ‘ఫలానా ఉద్యోగానికి అర్హత కోసం వయోపరిమితి….’ అంటూ ప్రకటనల్లో చాలా తరచుగా చూస్తుంటాం మనం. కాని అది భాషాదోషమే. పయః + పరిమితి = వయఃపరిమితి అవుతుంది. అదేవిధంగా తపః + ఫలము = తపఃఫలము (తపోఫలము కాదు). మనః + కమలము = మనఃకమలము (మనోకమలము కాదు).
----------------------------------------------------------
రచన - ఎలనాగ,
వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో
స్వాంతనము... సాంత్వన .. ఏది సరియైనది.?
ReplyDeleteసాంత్వన సరైన పదం, పద్మ గారు.
Deleteసార్!"దానశీలము"ఏ సమాసం అవుతుంది? ఇది సరియైన పద ప్రయోగమేనా?
ReplyDelete