సాహిత్యంలో శబ్ధము - నిశ్శబ్ధము
సాహితీమిత్రులారా!
శబ్ధశక్తి అనంతం.
ఈ ప్రపంచమే శబ్ధమయం.
కొన్ని ప్రత్యేక శబ్ధాలకు,వాటి ఉచ్చారణకు ఉన్న శక్తి గురించి మన ప్రాచీనులు చెప్పిన విషయాలు మనకి తెలియనివి కావు.
శబ్ధాలకు ఉన్న అధిదేవతలను గురించిన నమ్మకం మనకు ఎరుకే.
ఈ శబ్ధాలు,అక్షరాలై,వాటి సముదాయం పదాలై,పదాల సముదాయం వాక్యాలై,ఇదంతా ఒక ప్రత్యేక మానవ సమూహం వారిలో వారు ఒకరి భావాలు ఒకరితో పంచుకోవడానికి ఒక భాష అయ్యి భాసిల్లుతోంది.
ఈ భాష పరిణితి చెంది,ఉన్నత స్థాయిలో కళగా,సాహిత్యంగా రూపొందుతోంది.పాటలు,నాటకాలు,ప్రసంగాలు,కధలు,కవిత్వం ఇలా వివిధరూపాల్లో భాష కళకు వాహకం అవుతోంది.
అయితే ఈ భావాలు పంచుకోవడం శబ్దంతోనూ,నిశ్శబ్దంతోనూ చేయవచ్చు. Verbal and Non-verbal communication అన్న మాట. భావాలు పంచుకోవడమే కాదు,ఎదుటి వాడిని హేళన చెయ్యడానికి,కించపరచడానికి,అధికారం,కోపం,ధిక్కారం మొదలైనవి ప్రదర్శించడానికి ఈ భాష,సంకేతాలు,హావభావాలూ పనికొస్తాయి.
ఈ మాటల్లోని అర్ధాలు చెప్పే వ్యక్తి వయసుని,స్థాయిని,ఆడ,మగ వీటిని బట్టి, ఎదుటివాళ్ళు అంచనా వేసుకుని అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తారు.
ఆకలేస్తే అన్నం పెడతానంటుంది అమ్మ. ఆకలేస్తే అన్నం పెడతా. అని పాడుతుంది కథానాయిక.
ఒకే మాటకు రకరకాల అర్ధాలు. నానార్థాలు.
ఆకలి వేస్తే ఏడుస్తాడు పసివాడు. ఇది non-verbal communication.
నాటకాలు,సినిమాలు,నృత్యం వంటి దృశ్య రూపమైన కళల్లో కోపం,తిరస్కారం,ద్వేషం,ప్రేమ అన్నీ మాటలతో అవసరం లేకుండా అభినయించి చూపవచ్చు.తెలియజేయవచ్చు.
‘పుష్పక విమానం’ సినిమాలో సంభాషణలు లేకపోయినా సినిమా చక్కగా అర్ధం అవుతుంది దృశ్యం వల్ల.
సాహిత్యమే శబ్ధ ప్రపంచం. అనుభూతులు నిశ్శబ్ధ ప్రపంచానివి.
మరి ఈ నిశ్శబ్ధమైన అనుభూతులని మాటల్లోకి మార్చి చెప్పడం ఎలా?
ఒకసారి నసీరుద్దీన్ సంతకు వెళ్ళాడట. అక్కడ మాటలు నేర్చిన చిలకని అమ్ముతున్నాడట ఒకడు. మాటల చిలక! యాభై దీనార్లు! యాభై దీనార్లు! అంటూ.నసీరుద్దీన్ వెంటనే ఇంటికి వెళ్ళి తన టర్కీని తీసుకొచ్చి ఆ చిలక అమ్ముతున్న వాడి పక్కన కూచుని టర్కీ వంద దీనార్లు! వంద దీనార్లు! అని అరవడం మొదలు పెట్టాడట. నీ టర్కీ కూడా మాట్లాడుతుందా? అని అడిగాట్ట కొనుక్కోవడానికి వచ్చిన వాడు.ఒక్క ముక్క కూడా మాట్లాడదు అన్నాట్ట నసీరుద్దీన్. మాట్లాడకపోవడం కూడా గొప్పేనా? అని అడిగాట్ట వాడు ఆశ్చర్యపోతూ."మాట వెండి మౌనం బంగారం" అని మదరసాలో చెప్పలేదుట య్యా! అన్నాట్ట నసీరుద్దీన్ వంద దీనార్లు! వంద దీనార్లు అని ఇంకా పెద్దగా అరుస్తూ.
ఇస్మాయిల్ గారి మాటల్లో చెప్పాలంటే-
"మన చుట్టూ ఉన్న అనుభవిక ప్రపంచాన్ని ఆవిష్కరించటమే కవిత్వ లక్ష్యం. దీనికై సాధనాలు శబ్ధాలు లేక మాటలు. మాటలు మన మనస్సు సృష్టించినవి. అనుభవాలు పంచేంద్రియాలకు సంబంధించినవి. మాటలు అనుభవాన్ని యథాతధంగా అనుసరిస్తున్నాయని గ్యారంటీ ఏమిటి? సామాన్య భాష అనుభవాన్ని ఆవిష్కరించక పోగా, ఆచ్ఛాదించటం తరచూ చూస్తుంటాం. అనుభవాన్ని అనుభవంగానే ప్రత్యక్షం గా అందించటం కవిత్వం పని. అంటే, మనం సృష్టించుకున్న కొన్ని శబ్ధాలలోకి మనల్ని ఆవరించి ఉన్న మహా నిశ్శబ్ధాన్ని, అనుభవిక మహా ప్రపంచాన్ని, ప్రవేశ పెట్టటం కవిత్వ లక్ష్యమన్న మాట. ఈ పని కవిత్వం ఎలా నిర్వహిస్తోంది? మాటలు మనస్సు కల్పించుకున్నవి. అనుభవాలు ఇంద్రియాలకు సంబంధించినవి. మనకు ఐదు ఇంద్రియాలున్నాయి. ఇవే మన అనుభవ జ్ఞానానికి మూలాలు. దీన్ని ప్రత్యక్ష జ్ఞానమంటారు. మనస్సు వల్ల కలిగేది పరోక్ష జ్ఞానం. ప్రత్యక్ష జ్ఞానాన్ని పరోక్ష మైన శబ్ధాల్లోకి ఎలా దించటమన్నది ప్రశ్న. శబ్ధాల్లోకి నిశ్శబ్ధాన్ని ప్రవేశపెట్టటమెలా?
జటిలమైన అనుభూతి సామాన్య భాషకు అందదు. దాని పరిధి కావలి నిశ్శబ్ధ, ఆనుభవిక ప్రపంచంలోనిదిది. ఈ అనిర్వచనీయాన్నీ, నిశ్శబ్ధాన్నీ కావ్యంలోకి ప్రవేశపెట్టాలంటే కిటికీలూ, గుమ్మాలూ అవసరం. ఇవే పదచిత్రాలు. ఇవి లేకపోతే కావ్యం మూసుకుపోయి, చదువరికి ఊపిరాడదు. సున్నితమైన అనుభూతులు శబ్ధ ప్రపంచానికి చెందినవి కావు. ఈ నిశ్శబ్ధాన్ని శబ్దంలోకి ప్రవేశపెట్టటమే కవిత్వం విశిష్ట లక్షణం. కవిత్వానికి శబ్ధమెంత ముఖ్యమో నిశ్శబ్దం కూడా అంతే."
తాదాత్మ్యతకు మాటలు లేవు. మౌనమే. పథేర్ పాంచాలి సినిమాలో రైలు దృశ్యం ఒకటి ఉంటుంది.రైలు శబ్దం ప్రతిధ్వని రావడం,గాలి రొద,రెల్లు పూలు,పొగలు కక్కుతూ రైలు రావడం,రైలు శబ్దం,పిల్లలు పరిగెత్తడం వీటన్నిటి వెనకాల ఒక గాఢమైన నిశ్శబ్దం ఉంటుంది.
ఈ అనుభూతుల్లోని గాఢతని మాటల్లోకి ఒంపాలని రచయితలు,కవులు ప్రయత్నిస్తుంటారు.వర్ణించడం ద్వారా.పోల్చడం ద్వారా.
ఉదాహరణకి, మొదటిది:
అతడు వికటాట్టహాసం చేసాడు.సముద్రం పొంగినట్టు.భూకంపం వచ్చినట్టు.పర్వతాలు కదిలినట్టు.
అతడు పెద్దగా నవ్వాడు.గది గోడలు వణికాయి.సీలింగ్ ఫాన్ ఊడి కిందపడింది.
ఏది బావుంది?
నేను ఒక వింత రంగుల పువ్వుని చూసాను.నా మనసు సంభ్రమాశ్చర్యాలకు గురి అయింది.కనివిని ఎరుగని వస్తువుని చూసినప్పుడు కలిగే వింత అనుభూతి నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది.
నేను ఒక వింత రంగుల పువ్వుని చూసాను.మాటరాక కూచుండిపోయాను.
ఇది ఎలా ఉంది?
అనుభూతిని మాటలు కాక మాటల మధ్యలోని ఖాళీ చెప్పగలిగితే,అంటే పాఠకుడు స్వయంగా అనుభూతి చెందడానికి సమయం ఇవ్వగలిగితే అది మరింత ఉత్తమ స్థాయి సాహిత్యం అవుతుంది.
శబ్ధం- నిశ్శబ్ధానికి పట్టం కట్టడం అన్న మాట.
-----------------------------------------------------------
రచన - ఇంద్రాణి పాలపర్తి
మధురవాణి అంతర్జాల పత్రిక సౌజన్యంతో
No comments:
Post a Comment