Thursday, August 16, 2018

స్కూలుకెళ్ళే ఆ పొద్దు


స్కూలుకెళ్ళే ఆ పొద్దు




సాహితీమిత్రులారా!

వాకిలి సాహిత్య పత్రికలో "డైరీ" శీర్షికలోని ఒక అంశం ఇది
ఆస్వాదించండి-

పిట్టగోడనానుకుని వున్న గన్నేరు చెట్టు మీద పిచుకలు తెగ అల్లరి చేస్తున్నాయి. బాయిలర్‌లోని వేడి నీళ్ళతో బాల్చీ నిండుతోంది.  రెండు చేతులూ పైకి చాచి ఓ సారి ఒళ్ళు విరుచుకుంది చిన్ని. పూలచెట్లని, నీళ్ళ కుండీలని రాసుకుంటూ చిట్టిదూడ గంతులు వేస్తూ పరిగెడుతోంది. దాన్నో కంట కనిపెడుతూ బుజాల మీద వాలిన రెండు జడలని పైకెత్తి వెనుకకి ముడివేసింది.

నిండిన వేడి నీళ్ళ బాల్చీని తీసుకెళ్ళేముందు తన వంతు న్యాయంగా బాయిలర్ గొట్టంలో వేసిన రెండు చెక్కముక్కలు చిటపటామంటూ వెలుగందుకున్నాయి. స్నానం కానిచ్చి – ఆవుదూడని తల్లి దగ్గరికి చేర్చే ప్రయత్నంలో పరుగులు పెడుతుంటే – అమ్మ వేసిన మూడో కేక ఇంటి లోపలికి నడిపించింది. వెళ్తూ వెళ్తూ తుంపుకెళ్ళిన ఒంటి రెక్క ఎర్ర మందారం అమ్మ జడలోకి చేరింది. పెద్దయ్యాక ఎవరేం చేస్తారు, ఏం చదువుతారు వంటి కబుర్లు నడుస్తున్నాయి చిన్నక్క చిన్నన్న నాన్నల మధ్య.

తడి ఒంటి మీద గౌను వేసుకోవద్దన్నానా అంటూ కాస్త చిరాకుపడి – ఇటుతిప్పి బొట్టూ కాటుక దిద్ది – అటుతిప్పి రెండు జడలు అల్లి పైకి కట్టి, ఆ పైన పెరుగన్నం పెట్టి వెళ్ళమంది అమ్మ. బ్యాగు బుజానికి తగిలించి “నాన్న! నేనైతే పెద్దయ్యాక చందమామకి బొమ్మలు వేస్తా” అంటూ బయటకి పరుగుతీసింది. రోజుకోటి చెబుతుంది అంటూ ఇంటిల్లిపాది నవ్వే నవ్వులు వెనకాలే వచ్చాయి కాసింత దూరం.

ఎడమవైపు ఆట మైదానం దాటి ఆ దిగువన పంట కాలువ పక్కనుండి  ఎడ్ల బండ్లు రెండు ఊర్లోకి వెళ్తున్నాయి. రెండో బండిలో ఎవరూ లేరు. ముందు బండి వెనకాలే అలా వెళ్ళిపోతోంది. నా వెనకే రా! – అంటూ ఎద్దులు కూడా మాట్లాడుకుంటాయా? ! కాస్సేపు ఆగి చూసి కదిలింది.

కొద్ది వాలులో వున్న మైసూరు రామస్వామిగారి ఇంటికెళ్ళే దారిలో రంగురాళ్ళు పైకొచ్చి మెరుస్తున్నాయి. నిన్నా, మొన్నా చూడలేదే అక్కడ? నాలుగు రాళ్ళని ఏరి గౌనుకి తుడిచి బ్యాగులో వేసుకుంది. ఇంతకు ముందు కష్టపడి ఏరి దాచుకున్న రాళ్ళని అమ్మ ఇల్లు సద్దుతూ చెత్తలోకి విసిరేసింది. వీటినెక్కడ దాచాలో!

మొక్కలకి నీళ్ళు పెడుతున్న రాచకొండ రమణ ఆంటీ  పలకరింపుగా చెయ్యి ఊపింది. కాలువ పక్కగా వున్న దర్జీ వాళ్ళ ఇంట్లోంచి బయటకి వచ్చిన ఆమె నీళ్ళ కోసం బిందె తీసుకుని కాలువలోకి దిగింది. ఆమె వెనకే వెళ్ళిన ఓ బుడ్డోడు పారే నీళ్ళ పక్కగా వున్న ఇసుక మేట పైన వాలి హాయిగా పడుకున్నాడు. వీడెప్పుడు స్కూలికోస్తాడో?

ఒకరినొకరు తరుముకుంటూ హెడ్మాస్టర్‌గారింటిలోనుండి వచ్చి కలిసారు చంటి, మోహన్. మైదానంలో ఉయ్యాల బల్లలు, జారుడుబండ సాయంత్రం కోసం ఎదురు చూస్తున్నాయి. పొడుగైన జండా కర్రకి ఆ చివరనున్న చక్రం గాలికి దానంతటదే గిరగిరా తిరుగుతోంది.

ముందు వెళ్తున్న కాంపౌండర్ ముత్యాలు వాళ్ళ రాణి వెనక్కి తిరిగి చూసి ఆగింది. “నీతానింకో పెన్సిలుందా? నాదేడ్నోబోయింది”. తలూపి బ్యాగ్ లోంచి కంపాస్ బాక్స్ తీసి తెరిచింది. పెన్సిల్ తీసుకుని బాక్స్ లోకి చూస్తూ అడిగింది రాణి “ఎందుకిన్ని గాలిబుగ్గలు (బెలూన్లు) ? ” . “ఉత్తినే!  ఊదుకోడానికి”.

రామలక్ష్మీ టీచర్ ఇంటి గుమ్మంలోనుండి తొంగి చూసిన ప్రమీల ఆగొద్దని, వెళ్ళిపోమ్మని సైగ చేసింది. తమ్ముడితో  కలిసి వస్తుంది కాబోలు.

ఇంటిముందు కనిపించని చంద్రకళ కోసం లోపలికి తొంగి చూస్తే – ఎదురొచ్చిన అయ్య  గంగారం “దోస్తులిద్దరు కల్సిపోతరా!” అంటూ నవ్వి బయటకెళ్ళిపోయాడు. “రా! రొట్టె తిందువు” అంటూ ఆప్యాయంగా పిలిచింది లక్ష్మీబాయి. పీట మీద కూర్చున్న ఆమె రెండు చేతుల మధ్య గిరగిరా తిరుగుతోందో పచ్చి జొన్న రొట్టె. ముందు పెనం మీద దోరగా కాలుతూ మరోటి. పక్కన  పింగాణీ పాత్రలో ఎర్రని పండు మిరపకాయ కారం. నోటిలో ఊరుతున్న నీటిని అణుచుకుంటూ “వద్దిప్పుడు, సాయంత్రం వస్తా”  అంటూ మాటిచ్చింది.

చంద్రకళ చెల్లెళ్ళు మున్నీ, రాజీ, తమ్ముడు శంకర్లతో కలిసి వచ్చేలోపు ముందేళ్తున్న గ్రేసు వెనక్కి వచ్చి -  ఆ రోజు సాయంత్రం ఆటలకి కొండ పైకి వెళ్ళడమా లేక మైదానంలోకా అని తేల్చుకుని వెళ్ళింది.

కాలువనానుకుని వున్న చెరుకు పంట మధ్యగా వున్న మట్టి రోడ్డు పైన ఎవరో సైకిల్ మీద వెళ్తున్నారు. ఆ పంట, మరింక ఆ దారి  అలా వెళ్ళి వెళ్ళి  – ఆ చివరన మబ్బుల్లో కలిసి పోయిన కొండల దాకా వున్నాయి. మరెంత దూరం వెళ్తాడతడు?

అలా అటుకేసి చూస్తుండగానే – వెనుకనుండి  ప్రమీల, సుబ్రమణ్యం వచ్చి కలిసారు. రఘునాధన్ మామి ఇల్లు కూడా దాటి – ఇంకో నలుగురు స్నేహితులని పోగేసుకుని కదిలిపోతుంటే – “ఆపా ఆరహై క్యా?” అంటూ ఆపింది జుబేద. “హా! వస్తోంది. పీచే” అంటూ వెళ్తుంటే జుబేద చెల్లెలు, ఇద్దరు  తమ్ముళ్ళు వచ్చి కలిసారు.

ఇల్లు మాయమై కొండ దారి మిగిలాకా – గుంపంతా కలిసి కొండ అంచునే ఈదరి నుండి ఆదరిన వున్న స్కూలుకి నడుస్తున్నారు. సరిగ్గా కొండ మధ్యకి వచ్చేటప్పటికి ప్రతి రోజులానే ప్రమీల తల పైకెత్తి ‘హచ్!’ అంటూ మూడు సార్లు తుమ్మింది. సీతాకోకచిలుకల గుంపోకటి వాళ్ళ తలల మీదుగా ఎగిరెళ్ళిపోయింది. ఇటునుంచి వెళ్తున్నవీళ్ళని అటునుంచి ఊర్లోకి వెళ్తున్నవాళ్ళు ఆగి మరీ చూస్తున్నారు.

కొండ మలుపు తిరిగింది. దూరంగా వెళుతున్న రామలక్ష్మీ టీచర్ని చూడాగానే కలిసి నడుస్తున్న గుంపునంతా వదిలి ఆమె కోసం పరిగెట్టింది. ఊ అన్నా , ఆ అన్నా కథలు చెప్పే ఆమె పక్కన నడవడం ఇష్టం మరి. వగరుస్తూ దగ్గరికి వెళ్ళి “నిన్నటి కథ… అదే… సగంలో…  ఆపేసారే…” అంటుండగానే – “ఏంటా పరుగు ఆ!” అంటూ మందలిస్తూనే చెప్పింది “కథ పూర్తి చేసేంత సమయం లేదమ్మాయ్! చూసావా! అదిగో స్కూల్ దగ్గరపడింది”.

“అయినా ఈరోజో కొత్త కథ ఎదురు చూస్తోందిలే” అందామె తిరిగి నవ్వుతూ. ఏ కథో అడగక ముందే “చూసావా?! ఈ చీర కొంగు. ఎంత పెద్దగా వేసుకున్నానో?”  అంటూ ఎదురు ప్రశ్న వేసింది.

“ఎందుకూ?”.

“పోయినసారి మూడు నెలల జీతాలు ఒకేసారి ఇచ్చారుగా. ఈసారి నాలుగు నెలలవి మరి! మూట కట్టుకుపోదామని”. ఓ సారి మొహంలోకి తొంగి చూసి ఆ నవ్వులో వంతకలిపిందే కానీ – ఈ కథ కానీ కథేదో నిజంగా కలవరపెట్టింది. ఆ కొంగుని తాకుతూ ఆమెకి మరింత దగ్గరగా నడుస్తుండగానే స్కూలోచ్చింది.
---------------------------------------------------------
రచన - విజయ కర్రా, 
వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో

No comments:

Post a Comment