Wednesday, August 1, 2018

దూతకావ్యాలు


దూతకావ్యాలు

సాహితీమిత్రులారా!1813లో మేఘ సందేశం కావ్యం ‘హోరేస్ హేమాన్ విల్సన్’ (హొరచె హయ్మన్ విల్సొన్) చే ఆంగ్లంలోనికి అనువదింపబడింది. మేఘ సందేశం కావ్యంలో కాళిదాసు వర్ణనా నైపుణ్యము, అలంకార పటిమ, పాత్ర చిత్రణ, శృంగార ప్రస్తావన అద్భుతంగా కనిపిస్తాయి. ఇంకా వివిధ భౌగోళిక అంశాలు చెప్పబడ్డాయి. సంక్షిప్తంగా కావ్యంలో ఉన్న విషయం ఇది. అసలు మేఘ సందేశమే ఒక కల్పన. ఈ కల్పనకు దారి తీసిన పరిస్థితుల నేపథ్యంగా విశ్వనాథ సత్యనారాయణ ఒక అందమైన కల్పనతో వ్రాసిన నవల “దూతమేఘము” నేపాల రాజవంశాలను పూర్వరంగంగా తీసికొని అతడు వ్రాసిన ఆరు నవలలలో ఒకటి. కాళిదాసు మందాక్రాంత వృత్తాల లో మేఘ సందేశం వ్రాయడానికి గల కారణానికి అతడు చేసిన కల్పన పరమ రమణీయంగా ఉంటుంది. ఎడబాటు కలిగిన ప్రేయసీ ప్రియులు దూతల ద్వారా సందేశములు పంపుట ఇతర పురాణాలలో కానవస్తుంది. నలదమయంతుల హంసరాయబారము, రుక్మిణీ కృష్ణుల బ్రాహ్మణరాయబారము, రామాయణమున హనుమంతుని దౌత్యము. సుందర కాండములో రామదూతగా హనుమంతుడు శ్రీరాముని అభిజ్ఞానమును సీతమ్మకు అందజేసే వృత్తాంతానికి, మేఘదూతంలోని కథాను గమనానికి పోలికలున్నాయి. కాని ఇలా మేఘమును రాయబారిగా ఎంచుకొనే కల్పనలో కాళిదాసే ప్రథముడు. చైనీయ కవి నూకాంగ్ తన కావ్యములో మేఘమును దూతగా పంపెనని బహుభాషా కోవిదుడు, వంగ దేశీయుడు అగు హరనాథ పండితుడు వ్రాసెను. కాని నూకాంగ్ క్రీ.శ. ద్వితీయ శతాబ్దమువాడు. కాళిదాసు క్రీ.పూ. మొదటి శతాబ్దమువాడు. మేఘ సందేశం కావ్యాన్ని అనుసరిస్తూ అనేక రచనలు వచ్చాయి. ఈ కావ్యంలోని ఊహాగానానికి ఉన్న అందం అలాంటిది. వాటిలో సాంగణ కుమారుడైన విక్రమ కవి రచించిన ‘నేమి సందేశము’ను ప్రత్యేకంగా పేర్కొనాలి. 12వ శతాబ్దికి చెందిన ధోయి కవి ‘పవనదూతము’, 13వ శతాబ్దికి చెందిన వేదాంత దేశికకవి ‘హంస సందేశము’, 15వ శతాబ్దికి చెందిన కృష్ణానంద సార్వభౌముని ‘పదాంక దూతము’, 14వ శతాబ్దికి చెందిన ఉద్దండుని ‘కోకిల సందేశము’, జైన పండితుడు మేరుతుంగ కవి ‘జైన మేఘ దూతము’, 17వ శతాబ్దివాడు దేవీ చంద్రుని ‘పవన దూతము’, 18వ శతాబ్దినాటి వైద్యనాథ సూరి ‘తులసీ దూతము’ వాటిలో కొన్ని. 18వ శతాబ్దమున జర్మను కవి శీలరు మేఘదూత కావ్యము ననుసరించుచు రాసిన ‘మారియా స్టూవర్టు’ అనే కావ్యంలో నిర్బంధంలో ఉన్న ఒక రాణి మేఘం ద్వారా ఫ్రాన్సు దేశానికి కృతజ్ఞతలు తెలియజేసింది. క్రీ.శ.1083 లో నలందా విశ్వవిద్యాలయానికి అధ్యక్షుడైన ద్వీపాంకర అతీశుడు టిబెట్కి వెళ్ళి అక్కడ బౌద్ధాన్ని ఉత్తేజపరిచే క్రమంలో భారతీయ సాహిత్యాన్ని అనువర్తింపజేసేందుకు ప్రోత్సహించారు. ఆ క్రమంలోనే “మేఘదూతం” సహా అనేక సంస్కృత గ్రంథాలను టిబెటిక్ భాషలోకి కూడా అనువర్తింపజేశారు. అంతటి మహత్తరమైన ప్రభావాన్ని అనువర్తింపజేసిన ప్రధమ కవి – కవి కుల గురువు కాళిదాసు.
-----------------------------------------------------------
– టేకుమళ్ళ వెంకటప్పయ్య, 
విహంగం మహిళా సాహిత్య పత్రిక సౌజన్యంతో

No comments:

Post a Comment