Monday, August 6, 2018

నారికేళపాకము(కథ)


నారికేళపాకము(కథ)
సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి-

సాయంకాలం. ప్రకృతిలో సంధ్య పుట్టీపుట్టగానే కళ్లు తెరిచి, పగలంతా అలిసిపోయిన జీవజాలాన్ని గమనించి, ప్రేమగా నిద్రదుప్పటి కప్పుదామని మెల్లిగా నేయటం మొదలుపెట్టింది. ఆ నేతలోని నైపుణ్యానికి చెట్లు, మొక్కలు ఆచ్చెరువుతో ఊగటం మానేశాయి. పొలాల గట్లనుంచి ఇళ్లవైపుకి గంగడోలు మీదుగా వేలాడుతున్న దుండుకర్రతో ఇబ్బంది పడుతూ వస్తున్న ఆవులు తమ దూడల ఆకలిని తల్చుకొని బాధని మర్చిపోతూ గబగబా నడుస్తున్నాయి. వాటి కాలిగిట్టల నుండి రేగిన దుమ్ము అంటించుకొని, గాలి దేవుడు స్వార్ధపరుల నిశ్వాసతో అంటిన పాపాన్ని కడుక్కుంటున్నాడు. పాకలలో అమ్మ పాలకోసం ఎదురుచూస్తూ న్న దూడలు పెద్దవిగా చేసిన గుండ్రటి కళ్లని చూసి, అంత అందంగా అవ్వటం ఈరోజు కూడా కుదరలేదనుకుంటూ ఆకాశంలో సూర్యుడు అవమానభారంతో ఎర్రబడి కిందికి దిగుతున్నాడు.

పొలాల మధ్యలో ఊరు. ఊరి మధ్యలో కూడలి. కూడలికి ఆనుకుని గ్రామదేవత గుడి. గుడికి ఎదురుగా స్థలం. స్థలంలో ఒక కొబ్బరిచెట్టు ఉంది.

***

కొబ్బరి చెట్టు పొట్టిది, కాయలు చిన్నగా ఉంటవి, ఊరిలోని చెట్లతో పోలిస్తే. కానీ అది తన బ్రతుకుని భారం అనుకోదు, తనని తాను తక్కువగా అనుకుని విశ్వాసాన్ని కోల్పోయి నీలగదు. తను చిన్నప్పుడు తాగిన నీళ్లలోని చప్పదనానికి వెగటు చెంది, వాటినే తనకి ప్రాణంపోసిన వాడు కూడా తాగుతాడు కాబోలు అని అనుకుని నొచ్చుకుని, తన తలమీద ఉన్న ప్రతీ కాయ లోకీ శాశ్వతంగా తీయదనాన్ని నింపాలనే సంకల్పంతో గాలి వీచినప్పుడల్లా తనకన్నా గొప్ప చెట్లతో కలిసి కనుబొమ్మల్లా ఉన్న తన మట్టల్ని పైకీ , కిందికీ, పక్కలకీ అభినయిస్తూ , వివిధ భంగిమలు రూపందుకోగా తన నైపుణ్యానికి తానే మురిసిపోతూ తీయగా నవ్వుతుంది. ఆ నవ్వు ఎవరికీ అర్ధమవదు. తీపి మాత్రం తెలుస్తుంది.

ఆరోజు గ్రామదేవత జాతర. జనులందరూ గుంపులుగా రావడం మొదలు పెట్టారు. గరగలు తలమీద ఉంచుకుని గజ్జెలు కట్టుకున్న వాళ్ల నాట్యం అందమూ, సన్నాయి మేళము వాళ్ల వాద్యాల ధ్వని అందమూ జనాలకి ఒకేసారి ప్రత్యక్షమయి, ప్రేమలో మైమరిచిపోయిన తాచుపాముల జంటలా తమ కళ్ల ఆనందం ఏదో, చెవుల ఆనందం ఏదో విడదీయడానికి లేనంతగా పెనవేసుకుపొయ్యాయి. ఈ అనుభూతి ఒకరి నుంచి ఒకరిని ఆక్రమించింది, తెలియకుండానే. క్రమంగా గ్రామస్తులంతా గుడిదగ్గర పోగయ్యారు.అమ్మవారికి హారతులు, పూజలు మొదలయ్యాయి.

భక్తితో అందరూ మొక్కుతున్నారు. చెట్టు హాయిగా వీస్తున్న గాలికి ఊగుతూ ఉంది.

గడుసు కుర్రాళ్లు ఉత్సాహంతో రాత్రిని తామే వెలిగిస్తున్నామని విర్రవీగే నక్షత్రాలు, చంద్రుడు సిగ్గుపడేలాగ అంబరపథాన్ని మిరుమిట్లుగొల్పుతూ తారాజువ్వలు వేయటం మొదలుపెట్టారు. ఒకవైపు కోలాహలాన్ని గమనిస్తూ, మరొకవైపు జువ్వలు వెయ్యాలనే కోరికని చంపుకోలేకపోతూ ఇబ్బందులు పడుతున్నారు. వంతులు వేసుకుంటున్నారు. ఒక కుర్రాడి వంతు వచ్చింది. ప్రదర్శనవైపు కళ్లప్పగించి, జువ్వ వెలిగిస్తున్న ఒక కుర్రాడి చేతికి జువ్వతో పాటు నిప్పు తాకింది. అది జువ్వనిప్పుతో జతకట్టింది. కుర్రాడు ఉలిక్కిపడి బాధనుండి తప్పించుకోవాలని ఏం చెయ్యలేక జువ్వని పైకి వదిలేశాడు. అది సర్రుమంటూ గుడి ఎదురుగా ఉన్న కొబ్బరిచెట్టు కేంద్రస్థానాన్ని తాకి, ఆకాశంలో స్వేచ్ఛగా వదలాల్సిన తళుకులని ఆ చెట్టు తలమధ్యలో విదిల్చింది.

కుర్రాడు బిగ్గరగా అరిచాడు. చెట్టునుండి నిప్పురవ్వలు ఒక్కసారిగా ఎగిశాయి.

కొంతమంది కుర్రాడిని దూరంగా తీసుకుపోయి, మందు వ్రాశారు. చెట్టు కేసి చూసి ‘అమ్మో’ అని, ‘అయ్యో’ అని అనుకున్నారు. కొంతమంది మంట ఆర్పుదామని ప్రయత్నించారు. సాధ్యపడలేదు. పూజ ముగిసింది. గరగనాట్యమూ అయిపోయింది. భక్తులు ప్రసాదం పుచ్చుకుని ఇళ్లదారి పట్టారు. ఊరిచివర సారాకొట్టు నుంచి తీర్థం పుచ్చుకుని, ప్రచ్ఛన్నస్వేచ్ఛాలోకాలలో విహరిస్తూ కొంతమంది తాగుబోతులు సైకిళ్లమీద మేళం శబ్దం విన్న ఉత్సాహంతో గుడిదగ్గరకి గుంపులుగా రావడం మొదలు పెట్టారు. వారి రాకతో సమాంతరంగా పక్కఊరినుంచి కొంతమంది అమ్మాయిలతో ఉన్న ఒక ట్రాక్టరు, వెనకాలే మనిషి అంత ఎత్తు ఉన్న స్పీకర్లూ, ఒక పాటగాడూ, ఒక పాటగత్తె, సినిమా పాటల టేప్ రికార్డరు సెట్టూ వచ్చినవి. గుడి పక్కనే ఆగినవి. చూసిన వాళ్లంతా బిగ్గరగా కేకలు వేశారు. పాటలు పెట్టారు.

పాటల శబ్దం పెద్దదైంది. చెట్టుమీది మంట పెద్దదైంది.

అమ్మాయిలు సినిమా పాటలకి డాన్సు చెయ్యడం మొదలుపెట్టారు. స్పీకర్ల తాకిడికి గుడి, గుడి కి ఆనుకుని ఉన్న వీధులన్నీ కంపిస్తున్నాయి, ‘గుడి ముందు ఇదేం గోల’ అన్న సణుగుడు పైకి వినపడకుండా. వాళ్లని చూస్తూ తాగుబోతులంతా ట్రాక్టరు దగ్గరగా పరిగెత్తుకుంటూ వచ్చి, వాళ్ల విన్యాసాలని మెచ్చుకుంటూ, ఈలలు వేస్తున్నారు. అరుస్తున్నారు. వాళ్లని పట్టుకుందామని పైకి ఎగురుతున్నారు. కుదరక, కిందకి దిగుతున్నారు. ఒకడు ట్రాక్టరు పైకి ఎక్కుదామని చూశాడు. ఆ ట్రూపు తో వచ్చిన వస్తాదు వాడిని పక్కకి తోసిపారేశాడు.. వాడు కిందపడి ఊగిపోతూ కేకలు వెయ్యడం మొదలుపెట్టాడు. మిగిలినవాళ్లు వాడిని పట్టించుకోలేదు. పాటలు మారుతున్నాయి.

కేకలూ, ఈలలూ ఎక్కువౌతున్నాయి. చెట్టుమీది మట్టలు ఒక్కొక్కటిగా రాలిపోతున్నాయి.

డాన్సు అయిపోయింది. ట్రాక్టర్లు వెళ్లిపొయ్యాయి. ఇంకా కావాలి అంటూ తాగుబోతులు కొంతసేపు అరిచినా, చేసేది లేక సైకిళ్ల మీద ఇంటిమొఖం పట్టారు. కొంతసేపటికి పెద్ద స్పీకర్ల నుండి వచ్చిన పాటల ప్రతిధ్వని కూడా అంతరించింది.మెల్లిమెల్లిగా ఆ ప్రదేశమంతా నిర్జనమైంది. శబ్దమంతా ఆగిపోయింది. నర్తించిన అమ్మాయిల మీద చల్లిన రంగు కాగితాలతో గుడిప్రాగణమంతా కొత్తరూపుగట్టింది. కాసేపటికి కరెంటు పోవడంతో వీధిదీపాలు ఆరిపొయ్యాయి.

కోలాహలం అణిగింది. చెట్టుమీద మంటా అణిగింది.

కాసేపటికి పెద్దగాలి ప్రవాహం వచ్చింది. చెట్టుమీంచి నిప్పురవ్వలు ముద్దలు ముద్దలుగా క్రిందకి ధారాపాతంగా రాలుతున్నాయి. ఆ కాంతిలో గ్రామదేవత ముక్కుపోగుపై ఉన్న తెల్లటి రాయి ఎర్రగా ప్రకాశించింది.

***

ప్రాతఃకాలం. ప్రకృతిలో సంధ్య పుట్టీపుట్టగానే కళ్లు తెరిచి, రాత్రంతా సొలసిపోయిన జీవజాలాన్ని గమనించి, ప్రేమగా ఉత్తేజపుదుప్పటి కప్పుదామని మెల్లిగా నేయటం మొదలుపెట్టింది. ఆ నేతలోని నైపుణ్యానికి చెట్లు, మొక్కలు ఆచ్చెరువుతో ఊగటం మానేశాయి. పొలాల గట్ల వైపుకి ఇళ్లనుంచి గంగడోలు మీదుగా వేలాడుతున్న దుండుకర్రతో ఇబ్బంది పడుతూ వస్తున్న ఆవులు తమ దూడల ఆకలిని తీర్చిన సంతృప్తితో బరువుని మర్చిపోతూ గబగబా నడుస్తున్నాయి. వాటి కాలిగిట్టల నుండి రేగిన దుమ్ము అంటించుకొని, గాలి దేవుడు స్వార్ధపరులకి ఉచ్ఛ్వాసగా మారడం తప్పక, ఉత్సాహాన్ని నింపుకుంటున్నాడు. పాకలలో అమ్మ పాలు తాగి కళ్లుమూసికొని కునుకుతీస్తూన్న దూడలమీద ఈరోజు గెలుపునాదే అనుకుంటూ ఆకాశంలో సూర్యుడు ప్రజ్వలిస్తూ పైకి ఎక్కుతున్నాడు.

పొలాల మధ్యలో ఊరు. ఊరి మధ్యలో కూడలి. కూడలికి ఆనుకుని గ్రామదేవత గుడి.గుడికి ఎదురుగా స్థలం. స్థలంలో కొబ్బరిచెట్టు లేదు.
---------------------------------------------------------
రచన - పరిమి శ్రీరామనాథ్, 
వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో

No comments:

Post a Comment