Thursday, August 2, 2018

కృష్ణశాస్త్రి సాహిత్యం – సౌందర్యతత్వం


కృష్ణశాస్త్రి సాహిత్యం – సౌందర్యతత్వం






సాహితీమిత్రులారా!



కృష్ణశాస్త్రి కవిత్వంలో దుఃఖం కొత్త తరహాలో రూపుదిద్దుకుంది. భావకవులు బాధని వరంగా భావించారు. రొమాంటిక్ కవులూ, ఫ్రెంచి కవులూ తమ తమ కవితాప్రస్థానంలో దుఃఖానికి తగిన స్థానాన్నిచ్చారు. ఆంగ్ల సాహిత్యంలో ఈ రకమైన దుఃఖాన్ని రొమాంటిక్ మెలంకలీ అంటారు. దీని తత్వం ఇలా ఉంటుంది.

‘Longing for the unattainable ideal; and the feeling that the sensitive artistic genius is bound to be destroyed by the material crowd’

ప్రపంచం నిర్జీవంగా కనిపించి, కృష్ణశాస్త్రి సంధ్యా సమీరాన్ని ఉద్దేశించి ఇలా అంటారు.

‘ఓయి సంధ్యా సమీరణా, రేయి తోడ
కారు చీకటి తోడ దుఃఖమ్ము కూడ
పరువు పరువున నాకొరకరుగు దెంచు
నీదు నునులేత రెక్కలమీద వడిగ
నెత్తికొన పోవరాదె నన్నెచటి కేని
నిత్య తేజోమయానంద నిలయమునకు’

ఆదర్శ సౌందర్యం కోసం అన్వేషించే కవి దుఃఖాన్ని ఆహ్వానిస్తున్నాడు. అసలు ఈ దుఃఖం స్వభావమేమిటో పరిశీలిస్తే కాని, కవి దుఃఖించటానికి కారణం తెలీదు.

కవి భార్య విషయంలో పాపం చేశాననే బాధతో, బాధని అనుభవించి తీరాలనే దృఢ నిశ్చయంతో జీవించి ఉన్నాడు. ఫ్రెంచి కవి బోదెలైర్ బాధ గురించి ఇలా అంటాడు. ‘Suffering was a new lyric theme in 19th century French Poetry’. మనిషి తను చేసిన పాపాన్ని గుర్తించి, బాధతో, కన్నీళ్లతో హృదయాన్ని పరిశుభ్రపరచుకోవాలని అంటాడు.

బాధ కవికి అంతర్దృష్టిని ఇస్తుంది. అంతర్దృష్టి భావనని మేల్కొలుపుతుంది. అంతే కాదు, సృజనకి పదును పెడుతుంది. సత్య దర్శనానికి మార్గాలు విచ్చుకునేలా చేస్తుంది. బాధపడేవాడు లోపలికి కూడా చూసుకుంటాడు. అక్కడి అసమగ్రతనీ, అజ్ఞానాన్నీ అంధకారాన్నీ చూసి, ఇతరులతో తనకుగల సామ్యాన్ని గ్రహిస్తాడు. అణకువతో కుంగిపోతాడు. దీనివలన ప్రేమ వికసిస్తుందన్నది కృష్ణశాస్త్రి తాత్వికత. ఆయన దార్శనికత ఏమిటంటే, ప్రేమ, వేదన రెండూ లోకానికి రెండు కళ్లు. ప్రేమార్హులైన ప్రేయసీప్రియులకు దుఃఖమే కిరీటమంటాడు.

కృష్ణశాస్త్రి విరహానిదో ప్రత్యేక తరహా. అది ప్రబంధాల విరహం లాంటిది కాదు. అక్కడ విరహానికి ఉపశమనం ఉంది. ఇక్కడ విరహాగ్నిని వృద్ధి చేయడం ఉంది. దీనివలన దుఃఖం పెరుగుతుంది. దుఃఖం ఆనందస్థాయికి చేరుకుంటుంది. ‘ప్రాణకాంత’ ఖండికలో మలయ పవనాలనీ, హిమకణాలనీ, తేనేచినుకులనీ, తుమ్మెదలనీ, కోయిలనీ పిలిచి మరీ విరహాన్ని వృద్ధి చేసుకుంటున్నాడు కవి.

‘ప్రాణమునకును ప్రాణమౌ ప్రాణకాంత
యెడద శోధించి యశ్రులై పడిరె యిచట’

అని అనడంలో దుఃఖం పట్ల కవికి ఎంత ఆసక్తి ఉందో తెలుస్తుంది.

ఆంగ్లకవులలో కీట్స్ ‘Ode on Melancholy’ అనే ఖండికలో

‘But when the Melancholy fit shall fall
Sudden from heaven like a weeping cloud’

అని రచిస్తే, కృష్ణశాస్త్రి

‘ఎంత బరువయ్యెనో గాని యెడద వెలికి
తొలగి పారని దుఃఖాశ్రు జలమువలన
ప్రావృడంభోధరస్వామి! నీవు కూడ
నావలెనె జాలి వొడమ వాపోవుచుంటి’

అని అంటూ, ‘ జీవనంపు భారము తొలంగి పోవ నెవ్వారికేని కోరి నీ సొదలను చెప్పికొందువేమొ -’ అని అంటారు.

దుఃఖం కళాకారుని మనస్సుని నిశితం చేస్తుంది. ప్రకృతితో తాదాత్మ్యం చెంది, మానవ దుఃఖాలకి శాశ్వతమైన అనుకంప కోసం వెతికే తపన కలిగిస్తుంది.

Keats రచించిన ‘Ode on Melancholy’ గురించి William H. Marshall ఇలా అంటాడు.

‘Here the speaker, by contemplating the paradox that for man melancholy is at the heart of his brief vision of Beauty, creates the self absorbing poem, a work of art and thus a form of beauty, that will defy time, from the joylessness of his first recognition he derives joy in art and a moment of truth, at the heart of which perception he again finds his melancholy recognition of his own human impermanence.’

ఆనందంలేని స్థితిలోంచి సత్య దర్శనం కోసం కళలో పొందే ఆనందం . ఇదే విషాద సుఖం.

కృష్ణశాస్త్రి ‘దుఃఖము’ అనే ఖండికలో రోజంతా సూర్యుని వేడి కిరణాలకి వేగి, చీకటి పడగానే చల్లగా కనుమోడ్చిన నా హృదయకుసుమం నీకు జాలి కలిగించడం లేదా?

……………………..నీవేల స్వప్న
మటుల లోలోన కలచి, చీకటి ముసుంగు
నొత్తిగిలద్రోసి, వదలని పొత్తు గోరి
తొంగి తొంగి చూచెదవయ్యో! దుఃఖమా! యొ
కించుకైనను జాలి వహించవేమి? అంటారు.

ఆయన హృదయసుమము ఆయన ప్రియురాలు.

‘ఎవ్వరని యెంతురో నన్ను? ఏననంత
శోకభీకర తిమిర లోకైక పతిని!
నాకు నిశ్వాస తాళవృంతాలు కలవు
నాకు కన్నీటి సరుల దొంతరలు కలవు
నాకమూల్య మపూర్వ మానంద మొసగు
నిరుపమ నితాంత దుఃఖంపు నిధులు కలవు’

కవి సమాజం నుంచి వేరుపడి, దుఃఖ సామ్రాజ్యానికి తనని తాను అధిపతిగా ప్రకటించుకుంటున్నాడు. ఈ పద్యంలో paradox ఏమిటంటే , ఆనందాన్ని కలిగించే దుఃఖ నిధులు తనకి కలవని కవి చెప్పటం. ఇదే రొమాంటిక్ మెలంకలి. తనని చూసి ఎవరూ జాలిపడనవసరం లేదనీ, తనకి నిట్టూర్పుల విసనకర్రలున్నాయనీ, కన్నీటి ముత్యాల హారాలున్నాయనీ, గొప్ప విలువైన అపూర్వమైన ఆనందాన్ని కలిగించే సాటిలేని దుఃఖంపు నిధులు తనకి ఉన్నాయని కవి అంటాడు.

ఈ రకమైన భావంతో పద్యరచన తెలుగు సారస్వతంలో పూర్వమెపుడూ లేదు. కృష్ణశాస్త్రి మాటల్లోనే చెప్పాలంటే, ‘ బాధంతా ఘనీభవించి దుఃఖమైపోయి బ్రతుకంతా నిండిపోయింది.’ ఇది ప్రాయశ్చిత్తమని కవి గ్రహించాడు. ‘కంటక కిరీటధారినై’, ‘ఏకాంత గోష్ఠి’ జరుపుతానంటాడు. ‘దుఃఖమే తోడునీడగా’ రాత్రులు గడుపుతానంటాడు. లేకపోతే ఎడతెగని యాత్రనిట్లు సాగింపలేక యేడ్వగాలేక కృశియింతు నేనొకండ!’ అని అంటాడు. మానవ హృదయం ఉన్నతమైన స్థితికి చేరుకొనే ప్రయత్నమిది.

ఒంటరి తనాన్ని కోరుకోవడం కూడా భావకవిత్వంలో ప్రాధాన్యాన్ని కలిగి ఉంది. అమితమైన దుఃఖాన్ని భరించలేని కవి

‘మీరు మనసారగా నేడ్వనీరు నన్ను -
నన్ను విడువుడు! ఒకసారి నన్ను విడిచి
నంత నేకాంత యవనికాభ్యంతరమున
వెక్కి వెక్కి రోదింతును – ‘

అంటాడు. కళాకారుడు స్వతహాగా ప్రేమికుడు. అంతేకాదు, భావుకుడు కూడా. యౌవనంలో విఫల ప్రేమికుడయ్యాడు. దానికి స్వయంకృతాపరాధమే కారణమని గుర్తించాడు. అందుకే కన్నీళ్లతో హృదయాన్ని శుభ్రం చేసి, కొత్త చూపుకోసం ఆరాటపడుతున్నాడు. ఇది గుర్తించని లోకం ఆయనని హింసించింది. అందుకే చలంగారు ఇలా అంటారు.

‘ఎవరో రాస్తున్నారు. కృష్ణశాస్త్రి కవిత్వం వెనుక చూపని. నీకూ, నీ చీమలపుట్టకీ, గింజలకోసం వెతికీ, రాసే నీ రెండంగుళాల దృష్టికీ శాస్త్రిగారి కవిత్వం వెనకచూపు. కాదు. అసలు చూపే లేదు. శాస్త్రి ఎందుకు ‘యేడ్వగనీరు’ అంటున్నాడో చెప్పాలిట. ఎందుకు ఏడుస్తున్నాడు? నీకోసం,నాకోసం, లోకంకోసం, ఇట్లా ఇంత బాగా తనని అర్ధం చేసుకొనే విమర్శకుల కోసం.’

వ్యక్తిగతమైన ప్రేమానుభవం నుండి విశ్వజనీనమైన ప్రేమ కోసం పరితపించే కృష్ణశాస్త్రి హృదయాన్ని అర్థం చేసుకున్నవారిలో చలం ముఖ్యులు. బాధ అనంతమైన ప్రేమకి దారి తీస్తుంది.

‘ Pain on that scale has its harmony in great love; for by hurting love it reveals the infinity of love in all its truth and beauty’ అని టాగూర్ అంటారు.

ఎప్పుడైతే ప్రేమ ఆఘాతానికి గురవుతుందో, ఆ బాధ ప్రేమ యొక్క అనంతత్వాన్ని విశదీకరిస్తుందని టాగూర్ అభిప్రాయపడుతున్నారు. ఆ సందర్భంలో ప్రేమలో ఉండే సత్యమూ, సౌందర్యమూ విశ్వవ్యాపితమౌతాయి.

విశ్వనాథ సత్యనారాయణగారిని ఎంతగానో కదిలించిన పద్యం కృష్ణశాస్త్రి రచించిన ‘అబ్బ’! అనేది. కవితా ప్రసంగాలు చేస్తూ బందరులో విశ్వనాథవారికి వినిపించిన పద్యమిది.

‘హృదయ వనజాత సుమ
మృదు మనోహర దళము
లదయతను ద్రుంచినారే
పెంధూళి
చిదిమి వెదజల్లినారే!
హృదయ శోణిత ధార
నెదుగు జీవిత వల్లి
మొదలంట దూల్చినారే
భయదాన్ని
కీలలను వ్రేల్చినారే!’

భావకవిత్వ జీవలక్షణం ఈ ఖండికలో ఉంది. కవి హృదయం చాలా సున్నితం. సృజనలో ఉన్నతం. ప్రేమ వంటి మృదువైన భావాలకి కాణాచి. ప్రకృతినీ, మానవ ప్రపంచాన్నీ సమన్వయం చేసే దార్శనికతకి కేంద్రం. అటువంటి హృదయం లోకనిందలకి గురయింది. దయలేని వారి క్రూరత్వానికీ, దుర్మార్గానికీ హృదయం ఛిన్నాభిన్నమైన తీరుని కృష్ణశాస్త్రి చిత్రించారు. అనుభూతికీ, భావనకీ నెలవైన హృదయ ప్రాధాన్యాన్ని వివరించిన పద్ధతి కృష్ణశాస్త్రి కవితా శిల్పానికి మచ్చుతునక.

దుఃఖంతో కవి హృదయం ‘అంతు లేని దారిలేని శోకంపు టెడారి’ గా మారిపోయింది. కవికి పాడాలని ఉంది. బాధతో ఘనీభవించిన గొంతులో మాట పెగలడంలేదు. ఆ స్థితిని కృష్ణశాస్త్రి

‘మూగవోయిన నాగళమ్మునను గూడ
నిదురవోయిన సెలయేటి రొదలు కలవు -
ఐన నేమాయె ‘-

‘ఐననేమాయె’ అనడంలో మించిపోయింది లేదు అనే అర్థం స్పురిస్తుంది. ఎప్పటికైనా ఆయన గళంలోని పాట, నిదరోయే సెలయేరు లోకం దాహం తీరుస్తాయన్న ఆశ కలిగిస్తున్నాయి. కృష్ణపక్షం రాస్తున్న రోజుల్లో గళం మూగవోతుందని అనడం , ఆయన జీవితంలో గొంతు మూగవోవడం చిత్రమైన పరిస్థితి. ‘ఐననేమాయె’ అని ఆయనే అన్నట్లుగా గొంతు మూగవోయినా, ఆయన ఎన్నో మంచి పాటలు రాసి, తెలుగు కవితాప్రియుల హృదయాలని రంజింపజేశారు.

కృష్ణశాస్త్రి యౌవనదశలో రాసిన ఈ కావ్యాలలో ఇంత దుఃఖం ఉండటానికి కారణం ఏమిటి? యౌవనంలో ఉత్సాహం, ఉద్వేగం, ఆశ, ఆనందం, జీవితం పట్ల పరిపూర్ణ విశ్వాసం, మనోధైర్యం వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దుతాయి. అయినా కృష్ణశాస్త్రి కవిత్వం బాధ, దుఃఖం, నిరాశలలో నిండి ఉంది. దీనికి కారణాలు చెబుతూ నవలా రచయిత బుచ్చిబాబు (శివరాజు వెంకటసుబ్బారావు) ఇలా అంటారు.

‘ఆనాడు దేశానికింకా స్వరాజ్యం రాలేదు. తనకి స్వేచ్ఛ లేదు. భావ స్వాతంత్ర్యం లేదు . అనువైన ఉద్యోగం లేదు. తను ప్రేమించిన స్త్రీకి తను అక్కరలేదు; ఆదర్శమూర్తిని తనదిగా చెసుకొనే పరిస్థితి లేదు. పరిసరాలలో సౌందర్యం లేదు. సమాజంలో వైజ్ఞానిక తృష్ణ, దానితో వచ్చే నిజాయితీ లేవు. ఇవి ఆతని బాధకి కారణాలు కావచ్చు.’

బుచ్చిబాబు చెప్పిన కారణాలన్నీ భౌతికమైనవి. కృష్ణశాస్త్రి ప్రధానంగా రొమాంటిసిస్టు.

తన ప్రియురాలు లేకుండా కవి ఉండలేకపోతున్నాడు. ‘ఇదె వచ్చుచున్నాను’ ఖండికలో కృష్ణశాస్త్రి

‘శూన్యలోకము దాటి శుష్కదేహము దాటి
యన్యోన్య నిబిడ నిత్యాశ్లేష కాంక్షతో
ఇదె…’ అంటారు.

లోకం కంటే, దేహం కంటే శాశ్వతమైన సత్యాన్వేషణలో అలమటిస్తున్న కవి హృదయం ప్రియురాలి హృదయంతో ఐక్యాన్ని కోరుకుంటోంది. దుఃఖంతో శరీరాన్ని నాశనం చేసి హృదయాన్ని స్ఫురింపజేయడమే కవి ఉద్దేశ్యం. అందుకే భగవంతుని ధ్యానంలో పడతాడు కవి. యౌవనంలో అహంకారంతో దైవాన్ని నిరాకరించిన కవి ‘ఎట్లు నిన్నూహ సేయుటో యెరుగలేక వంగి వంగి శిరము వొంచి కుంగిపోతు’ నంటాడు. ‘మనసారా, వలపూర, కలత తీర కాన్కగా ఏమొసంగగా గలను’ ‘గాఢ లజ్జానుతాప సంకలిత హృదయ నీరజదళాల రాలు కన్నీటిచుక్క తప్ప’ అని అంటాడు. భక్తి రవళించిన ఆత్మానుభవం దుఃఖం లక్ష్యం నెరవేర్చింది. ‘కన్నీరు’ ఖండికలో ఇంకా ఇలా అంటాడు.

‘కలుష దుర్దాంత పంక సంకలిత కుహర
ముల జనించు మదీయాశ్రు మలిన ధార
స్వామి భవదీయ పాద దేశమున పారి
పరమ పావన జాహ్నవీ ప్రతిభ గాంచు’

పశ్చాత్తాపం కవిని భగవంతుని సాన్నిధ్యాన్ని కోరేలా చేస్తోంది. క్షణికమైన ఆనందాన్ని కోరి, ఎండమావుల వెంట పరుగెత్తిన కవి బ్రహ్మసమాజ భావాలలో హృదయ పరివర్తనం తెచ్చుకొని, పాత అనుభవాలకి వీడ్కోలు పలుకుతూ – ‘నిర్యాణము’ ఖండికలో,

‘చల్లగా నున్నదీ సుప్రశాంత వేళ
చల్లగా సాగునీ సుప్రశాంత పథము
బయలు దేరుము దూరంపు బయనమునకు
వలదు తడయగు, దవ్వేగ వలయునేడు’

‘పరమపద శాంతి పూర్ణ నిర్వాణగీతి’ ఆలపిస్తున్నాడు.

కృష్ణశాస్త్రి దుఃఖ గీతాలలో అలౌకికమైన ప్రేమ, భావ ఔన్నత్యం ఉన్నాయి. అసలు ఈ గీతాలు కవి తన హృదయభారాన్ని దింపుకోవడానికేననిపిస్తుంది. కవికి ప్రాణమిత్రుని వంటి ప్రకృతి, సర్వాధికారి ఈశ్వరుడు ఉన్నాడు.
కృష్ణశాస్త్రిగారు ఇలా అంటారు.

‘నా ప్రేమగీతాలలో, నా శోకగీతాలలో నాకు ఈ సామాన్య లోకం లేదు. వాటిని నాకో, నాలాగే స్వచ్ఛందమైన మూర్తి యైన ప్రకృతికో ఆలపించేవాణ్ణి. పరమేశ్వరుని పాదరేణువునో ప్రార్థించేవాణ్ణి, అనుకంప కొరకు’

ప్రేమకు బదులు రాకపోతే హృదయం ఎంత దహించుకు పోతుందో కవి గ్రహించాడు.

‘కృష్ణపక్షం’ అని పేరు పెట్టడంలోనే ఔచిత్యం ఉంది. ఇందులో కవే కథానాయకుడు. స్వేచ్ఛకీ, ప్రేమకీ సంబంధించిన అనుభవాలతో, ఆత్మీయుల మరణంతో కవి కృష్ణపక్షంలో పడిపోయాడు. ‘కృష్ణ భక్తి తత్వం’ ఆసరా దొరికింది. అన్వేషణకి మార్గం సుగమమైంది. రొమాంటిక్ కవితలో దుఃఖం హృదయాన్ని ఎలా క్షాళన చేస్తుందో గ్రహించాం. అదే దుఃఖం కవిని ప్రవాసిని చేసింది.
-----------------------------------------------------------
రచన - డా. సీతారామయ్య (రామసూరి), 
వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో

No comments:

Post a Comment