సుధా వృష్టి
సాహితీమిత్రులారా!
క్రీస్తుశకం 1828 ప్రాంతాలు. సర్వధారి నామ సంవత్సరం.
శ్రావణం అయిపోయింది. భాద్రపదమూ సగపడింది. ఎక్కడా తడిగాలి పొడ కూడా లేదు. అప్పుడే సూర్యుడు బాగా నెత్తి మీదికి వచ్చేశాడు, అంతటి ఆకాశం లో ఆయనొక్కడే. మొగమాటానికి కూడా ఒక్క మబ్బు పింజ లేదు.
ఆ పూటకి అక్కడి గంజికేంద్రాన్ని మూశాక, ఒక్కొక్క మెట్టే ఎక్కి వెళుతున్నాడు ఎట్టయాపురం ప్రభువు. ఆపూట ఎక్కడా నిలుచోబుద్ధి కావటం లేదు. సరాసరి మూడంతస్తులూ ఎక్కి చంద్రశాల అనబడే మేడ మీది ఆరుబయటికి వెళ్ళి ఆగాడు. తలెత్తి ఒక్కడే ఆ ఎర్రటి ఎండలోకి చూస్తూ కొద్ది ఘడియల సేపు.
వెళ్ళి నిలదీయాలని ఉంది – అంతకన్నా దేవతలకు దగ్గరగా ఎట్లా వెళ్ళటం?
“ఏమిటి చేయాలి ???”
ఆయన శ్రీ జగవీర రామ వెంకటేశ్వర ఎట్టప్ప నాయకర్. గద్దె ఎక్కి దాదాపు పదేళ్ళవుతోంది. మొదట మొదట గమనించుకోలేదుగాని ఆ ఏటికాయేడు రాజ్యం లో దుర్భిక్షం పెరుగుతూనే ఉంది. తాను చేసిన తప్పేమా అని మనసు కెలకబారుతూ ఉంది. చుట్టుపక్కలి రాజ్యాలన్నీ బాగానే ఉన్నట్లున్నాయి – ఒక్క మనియాచ్చి సంస్థానం తప్ప. కాకపోతే అక్కడ మరీ ఇంత గండకత్తెర లేదు.
వరుణయాగాలను ప్రతియేటా జరిపిస్తూనే ఉన్నాడు. ఫలితం అంతంతే. నాలుగు చినుకులు రాలిపోయేవి.
ఆ ఏడు మరిక ఏమి చేసేందుకూ ధనం లేదు.
తండ్రి పోగు చేసినదంతా ఆవాళ్టివరకూ ఖర్చు పెట్టి గడుపుకొచ్చాడు. తన ప్రజలు – అంటే తన సంతతి , జనమంతా . ఒక్కడి డొక్క మాడినా ఆ పూటకి ముద్ద ఎత్తలేని మెత్తని వాడు ప్రభువు. ఎంత పెద్ద బొక్కసమైతే మటుకు ఎన్నేళ్ళు పోషిస్తుంది ఇంతమందినీ ? ధాన్యం అమ్మేవారు ఇక్కడి అవసరం కనిపెట్టి చెట్టెక్కి కూచుంటున్నారు. ఇక అంతఃపురపు జవహరీ మిగిలింది – అప్రతిష్ట రాకుండా దాన్ని ఊరు దాటి అమ్మిస్తే ఈ ఏడు గడుస్తుందేమో.
రాణివాసపు నగకట్టు అంతా పెద్దరాణీ గారి అధీనం లో ఉంటుంది – అంత చెయ్యెత్తు మనిషీ వంగిపోయి వెళ్ళాడు తల్లి దగ్గరికి. ఆవిడ ఎనభయి ఏళ్ళు దాటుతున్న వృద్ధ . తెల్లని జరీ చీరె లో , తిలకం లేని నుదుట తీర్చిన విభూతి తో మెడలో రుద్రాక్ష తావళాలతో సాధారణ వితంతువు వలె ఉన్నది కాని రాజ చిహ్నాలేమీ ఒంటి మీద లేవు.
ఒక్కచూపుతోనే గ్రహించి అక్కడ ఉన్నవారినందరినీ పంపించివేసింది.
” నాయన గారూ ! మా దగ్గరి వస్తువులూ నిండుకున్నాయండీ. ఆరు మాసాలైంది ”
ప్రభువు మరీ కుంచించుకుపోయాడు. తెలియనివ్వకుండానే ఆదుకుందన్నమాట అమ్మ.
” చిన్న రాణి గారి వస్తువులు ” – అడగలేక అడిగాడు.
ఆ ఇంట మెట్టిన మహాలక్ష్మి సొత్తు అది, తాకేందుకు తమకు అధికారం లేనిది. కాని -
లోపల అందెల సవ్వడి వినబడింది. పల్చటి తెర వెనకన గాజుల చేతులు నిలువునా దూసి ఇచ్చాయి.
కాశ్మీరపు శాలువ లో మూటగట్టి తెచ్చి ముందు పెట్టింది పెద్ద రాణి కమలాంబికా దేవి.
ప్రభువు అందుకోలేకపోయినాడు. పుక్కిలింతలు గా దుఃఖం.
కొడుకు శిరస్సు మీద చేయి వేసి నిలిచింది తల్లి. రాజ కుటుంబాలలో ఎన్నడో గాని జరగని చర్య అది. ఆ క్షణాన బరువులన్నీ మరచి ఆయనా పిల్లవాడయినాడు- అడిగాడు .
” మీరు ఎరగరా నాయనా ? ”
ఊహూ. ఎరగడు కద.
” అంతా గుస గుసగా అనుకుంటూనే ఉంటున్నారు కాదా అప్పటినుండీ ? ”
” ఎప్పటి నుండి అమ్మా ? ” – గౌరవ వాచకాన్ని మరచాడు.
” మీ తండ్రి గారు ‘ ద్రోహి ‘ అయినప్పటినుంచీ ” – ఒక్క ఊపున చెప్పివేసి కూలబడిపోయింది.
***
ద్రోహం.
అవును. విన్నాడు.
ఆ అలజళ్ళలో – ముప్ఫై ఏళ్ళు వస్తూ ఉండిన తనను , పసివాడివలే మేనమామల ఇంటికి , తిరువారూరు పంపివేశాడు తండ్రి. ఆయన బ్రతికి ఉన్నంతవరకూ ఎదురు చెప్పే ప్రశ్నే లేదు.
కట్టబ్రహ్మన్న తన కన్న ఏడాదే పెద్దవాడు, కాని ఎంతో పెద్ద గుండెవాడు.
చూస్తే ధైర్యం పుట్టేటట్లుండేవాడు .
బంధుత్వం లేదు గాని బ్రహ్మన్న తండ్రి ని చిన్నాయనా అని పిలవటం అలవాటు. ఆయనా అంతే. పెద్ద నవ్వు తో ఎత్తుకొని బుజాన ఎక్కించుకొనేవాడు. ఏ మాత్రమూ రాచరికపు బిగింపులు లేకుండేవి.
” ఎక్కడ తెలుస్తాయి మర్యాదలు ” అని చాటున ఈసడించేవాడు తన తండ్రి. ఎప్పుడో ఎన్నో తరాల నాడు కట్ట బ్రహ్మన్న పూర్వుడు రాజ సేవకుడట. బిడ్డలు లేని రాజు అతన్ని దత్తత చేసుకొని పట్టం కట్టాడట. తాము, ఎట్టయాపురం పాలకులు కాక మునుపు విజయనగర రాజబంధువులట . చంద్రగిరి నుండి వచ్చి సరాసరి ప్రభువులైనారట.
అందుకని తండ్రికి ఆ లోకువ. కానీ , కట్టబ్రహ్మన్న సంస్థానం పాంచాలంకురిచి లోనే జనం ఎక్కువ సుఖం గా ఉండేవారు – తనకు తెలుసు.
సొంత దర్జా ఉండిన తెలుగు పాలెగాళ్ళు తామంతా. ఆర్కాటు నవాబు కు
పేరుకు సామంతులు . అప్పుడప్పుడు ఉడుగర లు పంపుతుండేవారు. నవాబు ది అసలే ఖర్చు చెయ్యి. తెల్లవాడు మరిన్ని సరదాలు మప్పాడు. ఎంత డబ్బూ ఆ విలాసాలకు చాలక తెల్లవాడి దగ్గర అప్పు చేశాడు .తీర్చలేక పాలెగాళ్ళ దగ్గర శిస్తు వసూలు చేసుకొమ్మన్నాడు. తెల్లవాడికి కావలసింది సరిగ్గా అదే.
బ్రహ్మన్న ఆవాళ ఎట్టయాపురం వచ్చాడు. విశాలమైన కన్నుల నిండుగా ఎర్రని జీరలు. అంత కోపంగా అతన్ని ఎన్నడూ చూడలేదు.
” పెదనాయనా , ఇది ఎక్కడి తీరువా ? వాడెవడు ? ఎక్కడివాడు ? ఈ నేల వాడిది కాదు, నీరు వాడు ఇవ్వలేదు, నారు పోయలేదు, కోత కోయ లేదు, కుప్ప నూర్చలేదు – శిస్తు దేనికి కట్టాలి ? ”
తన తండ్రి చెవిన పెట్టనేలేదు. కడితే ఏం పోతుందనేశాడు.
బ్రహ్మన్న ఆ శిస్తును చాలా అన్యాయపు లెక్కన్నాడు. అది అంతతో ఆగదన్నాడు. తల్లిని తాకట్టు పెట్టరాదన్నాడు
.తెల్లవాడికి పాపం పుణ్యం ఉండవన్నాడు.
తండ్రి సరేలెమ్మన్నాడు- కాని మాట తప్పాడు.
ఆ తరువాత చాలా జరిగిపోయినాయి. తాను నోరెత్తి అడిగాడని ఊరు దాటించి పంపారు. భార్య నీలోత్పలాంబ మేనమామ కూతురే. తిరువారూరు శివుడు త్యాగరాజ స్వామి అర్థాంగి పేరు ఆమె కి పెట్టారు.
అక్కడే , ఒక్కతే విడిగా కొలువున్న అమ్మవారు కమలాంబికా దేవిది తన తల్లి పేరు.
ఇక్కడ తన తండ్రి కలెక్టర్ జాక్ సన్ కు మహా దగ్గరి చుట్టమైనాడు. ఆ పైన వచ్చిన అధికారు లందరికీ విశ్వాసపాత్రుడైనాడు. సైన్యాన్ని అరువిచ్చాడు. బ్రహ్మన్న గుట్టుమట్టులన్నీ తెలిసినవాడుగా వాటిని బయటపెట్టి – చేయగలిగినదంతా చేశాడు.
ఆఖరికి, యుద్ధం లో ఓడిన బ్రహ్మన్న తిరుకాలంపురం అడవులలో ఆశ్రయం పొంది ఉంటే – పుదుక్కోట రాజా అతని ఆచూకీ ఇచ్చాడు. ఆ పాపం మటుకు తన తండ్రిది కాదు.
కాని – బ్రహ్మన్నను ఉరితీసినాక పాంచాలం కురిచి కోట ను నేలమట్టం చేసి అక్కడ ఆముదాలు విత్తించినవారు తన తండ్రి బంటు లేనట . ఆ రాజ్యాన్ని విడగొట్టి తమకూ మనియాచ్చి వారికీ చెరి సగం పంచాడు తెల్లవాడు. ఎట్టయాపురం ప్రభువు ను రాజు నుంచి దిగజార్చి జమిందారు ను చేసిపెట్టాడు.
తండ్రి మరణించినాక గాని ఎట్టయాపురానికి వచ్చే అవకాశం రాలేదు. వయసు దాటుతుండగా , వచ్చి సరాసరి ప్రభువయినాడు. ఇవాళ్టికి అశక్తుడు కూడా అయినాడు.
ఆ ఘాతుకానికే ఫలితమా ?
పరిహారం ??
***
నాలుగు మెతుకులు తిన్నాననిపించుకొని, నడుము వాల్చినా విశ్రాంతి లేక అటూ ఇటూ మెసలి మెసలి , చీకటి పడుతూండగా – ప్రదోష అర్చన కు అమ్మవారి గుడికి బయల్దేరాడు. నూలు ధోవతి కట్టుకొని నూలుదే ఉత్తరీయాన్ని పైన కప్పుకొని , ఒక్కడే- కాలినడకన . ఆభరణాలు ధరించటం మానివేసి చాలాకాలమయింది.
దర్శనమయినాక వెంటనే దేవిడీ కి వెళ్ళాలనిపించక రంగమంటపం మెట్ల మీద కూర్చుండిపోయాడు. ఎన్ని ఆమడల అవతల ఎక్కడ వాన కురుస్తోందోగాని – కొంచెం కొంచెం గా చల్లగాలి తిరిగింది . తెమ్మెరలు ఏవో వింత నాదాలనూ మోసుకు తెచ్చాయి. ధ్వని ని అనుసరిస్తూ వెళితే – ప్రాకారానికి చేరబడి కూర్చుని ఒక పద్దెనిమిదేళ్ళ కుర్రవాడు. ఆ మ్రోగించే వాద్యమేదో – ఎప్పుడూ చూడనిది.
తొలినాటి నుంచి వంశస్థులందరూ సంగీత సారస్వతాల లో ఏ మాత్రమో అభిరుచి ఉన్నవారే , తానూ ఎరుగును – కొంత. కేదార గౌళ నా అది ?
గాలితోబాటు గా ఎవరిదో దయ వచ్చి తాకినట్లయింది. క్షమిస్తున్నారా ?
కుర్రవాడు గొంతు విప్పి పాడుతున్నాడు. ” నీలోత్పలాంబికాయై నమస్తే ”
ఏమి ప్రతిభ , ఎంత నిండు !
అతనికీ తనకూ ఒళ్ళు తెలిసేప్పటికి ఎంత కాలమయిందో !
ప్రభువు తానే వెళ్ళి పలకరించాడు. కుర్రవాడి లో అమాయకత్వమూ జ్ఞానమూ సమం గా ఉన్నట్లున్నాయి. పేరు వడివేలు పిళ్ళై అట. ఆ వాద్యాన్ని వయొలిన్ అంటారట. తెల్లవాళ్ళు తెచ్చినదట. తన గురువు గారు దాన్ని మన్నిస్తారట. గురువుగారి తమ్ముడు అందులో నిధి అట. గురువు గారి మాట చెబుతూంటే అతనికి ఒళ్ళూ పై తెలియలేదు. తనకూ తన అన్నలు ముగ్గురికీ ఆయన గురువేనట. ఆయన పాట తప్ప మరొకటి తాను పాడడట. ఆయన అపర కార్తికేయుడట. అమ్మవారు పిలిస్తే పలుకుతుందట.మహావైణికుడూ వాగ్గేయకారుడూ మాత్రమే కాదు – వేదం చదువుకున్నాడట. కౌముది ఆయన మునివేళ్ళ పైన ఆడుతుందట. మంత్ర తంత్ర జ్యోతిష్య శాస్త్రాలలో పారం ముట్టిన వాడట.
” ఏ ఊరు నాయనా వారిది ? ”
” ఆయనకొక ఊరెక్కడుందయ్యా ? పైరు పచ్చలకు కాపు గదా సుబ్రహ్మణ్యుడు – ఈయనా అంతే. ఒక చోట నిలవడు , తిరుగాడుతూనే ఉంటాడు. వాళ్ళ అమ్మ చెబుతుంటుంది గా , ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ”
ప్రభువు కు కొంత నిరాశ.
కుర్రవాడిని దగ్గర ఉంచుకొని దినమ్మూ అతని పాటలు వినాలనిపించింది. వాటిలోని కారుణ్యాన్ని దోసిళ్ళతో ఎత్తి తాగుతుండాలనిపించింది.కాని ఆ ఊరటను పొందే హక్కు తనకు లేదని కూడా అనిపించింది.
ఏమీ అనకుండానే వెనుదిరిగి వెళ్ళిపోయాడు.
వెన్నెలకు మాత్రం కరువు లేదు కదా రాజ్యం లో. ఆ రాత్రి చంద్రశాలలో కూర్చున్నప్పుడు అప్రయత్నం గా ఆ కీర్తనే నోట్లో ఆడింది ప్రభువుకు. మనసుకు హాయనిపించింది. ‘ నీలోత్పలాంబికాయై ‘ అని , నమస్తే అని అనలేక దీర్ఘం తీసుకుంటున్నాడు పైకే. అప్పుడే అక్కడికి అడుగు పెడుతూన్న రాణి నీలోత్పలాంబ , ఆ నడివయస్సులో బిడియ పడింది.
***
శాంతంగా తెల్లవారింది. రాజ పురోహితుడు ఎవరినో వెంటబెట్టుకొని దర్శనానికి వచ్చాడని వర్తమానం.
కొలువుకూటం లోకి ప్రమథులు దిగి వచ్చారని తోచింది ప్రభువు కు .
ఆయన బాలస్వామి దీక్షితులు , వెంట కొందరు శిష్యులు. వాళ్ళ అన్నగారు ముత్తు కుమారస్వామి దీక్షితులు , ఇంకొక తమ్ముడితో కలిసి సంచారం చేస్తున్నారట. ఎట్టయాపురం లో కొన్నాళ్ళు ఆగాలని సంకల్పించారట. సాయంత్రానికి చేరుకుంటారట.
ఆ వెనకాల నిలుచుని బెదురు చూపులు చూస్తూ నిన్నటి కుర్రవాడు కనిపించాడు .
ఓహో . వీరేనన్నమాట.
***
పదహారేళ్ళ వయసు లో మదరాసు కోట లో తెల్లవాళ్ళ సంగీతం విన్నాడు ముత్తుస్వామి. ఐరిష్ బాండ్ ల సెల్టిక్ సంగీతం అది. ఒక తెల్ల దొరగారు అడిగాడు , వాటికి సాహిత్యం కూర్చగలవా అని. కూర్చాడు- తెలుగు లోనూ సంస్కృతం లోనూ. ఆ వరసలను మృదువు చేసి శుద్ధి చేశాడు. జగదంబ తనలో నింపిన శబ్ద శక్తి ని వాటిలో నిక్షేపించటమయిందని తర్వాత గురువుగారు చిదంబరనాథ యోగి చెప్పారు. ఆయన వెంట వెళ్ళి ఏడేళ్ళు వారణాసి లో ఉన్నాడు. తురుష్కుల ధ్వనులు కలగలిసిన ఔత్తరాహ సంగీతాన్ని వెంటతెచ్చి పుటం పెట్టి కర్ణాటకం తో అతికాడు. నూట యాభై కి పైన దేవాలయాలు తిరిగి పేరు పేరునా కీర్తనలు కట్టి పాడి దేవతలకు పులికాపు పెట్టి స్నపన చేయించి సాంబ్రాణి ధూపం వేశాడు. వాగర్థాల తో స్వరాన్ని సమన్వయించిన ఆ మంత్రమాలికలు వెలికి వచ్చేందుకు తన నొక ఉపాధి గా అమ్మ పంపిందనే స్ఫురణ అన్ని వేళలా ఉంటుండేది. నాలుగు నాళ్ళు ఒక చోట ఆగకుండా యాభై మూడేళ్ళ జీవనం. ఇక్కడికి రావాలి, బహుశా ఇక్కడే ఆగాలి – కొంతకాలం.
అమ్మ పిలుచుకునే దాకా.
***
ఎట్టయాపురపు రాజ్యం పొలిమేరల్లోకి వస్తూనే ఆవరించి ఉన్న ధూమమేదో అగుపించింది దీక్షితులకు. నేల ఎండి బీటలు విచ్చింది. ఎక్కడా పచ్చని చిగురన్నది లేదు. పశువుల డొక్కలు ఎండిపోయినాయి. జనాల మొహాలలో కళ లేదు.
పాతకాలు ఎన్నో చోట్ల, ఎంతమంది వల్లనో జరుగుతుంటాయి. ఏ కారణం చేతనో అది ఈ చోట ముద్ద కట్టుకుపోయి ఉంది. ఏమో, ఇక్కడిది వ్రణమై ఛిన్నం కావలసి ఉందేమో – ఆరోగ్యం రావలసి ఉందేమో.
ప్రభువు మొహం చూస్తూనే దీక్షితులు ద్రవించిపోయాడు. నాయకర్ ప్రవృత్తి కళ్ళకు కట్టింది. ఈ జీవుడు ఉత్తముడు. ఉన్నతుడు. అందుకు ఇదంతా.
దీక్షితులను చూ స్తే ప్రభువుకు ప్రాణాలు లేచివచ్చాయి. అమాంతం సాగిలపడ్డాడు.
మాటలు లేని సంభాషణ కొనసాగింది.
మర్నాడు ఉదయమే, శ్రీ చక్రార్చన అవుతూనే పాంచాలంకురిచి కి బయల్దేరారు. దేవిడీ నేలకూలినచోటి ఆముదాలబీడులో – దీక్షితులు ఏవో ప్రక్రియలు చేశాడు.
” ఇక్కడ అమ్మవారికి గుడి కట్టండి నాయకా ”
ఆలయం నిర్మించటం మాటలా- అన్నమే లేక పస్తులుంటుంటే ?
దీక్షితులు నవ్వాడు, గ్రహించినట్లుగా. ఏమీ అనలేదు.
పాపపు సొత్తు క్షయమయింది. ఇది కొత్త మొదలు.
***
ఆ సాయంత్రం ఎట్టయాపురం కోవెలలో.
సాయంకాలపు పూజావిధి అయింది.
ఆ మూలన, కదంబ వృక్షం కింద కూర్చొని-
దీక్షితులు గళం సవరించుకున్నాడు.
స గ మ ప ని స
స ని ప మ గ స.
ఆలాపన.
చంద్రకాంత శిలలు కరిగినట్లు
చల్ల చల్లని ఏరుగా సాగినట్లు
గండు కోయిలలు పదివేలు కూసినట్లు
నారికేళాలలో సలిలం ఊరినట్లు -
మబ్బులు పట్టినట్లు. మెరుపులు మెరిసినట్లు. ఆకాశం ప్రేమగా ఉరిమినట్లు.
మట్టి పరిమళం ముక్కుకు సోకినట్లు.
” ఆనందామృతాకర్షిణీ….
సలిలం వర్షయ వర్షయ వర్షయ …”
అమృతం .
వాన. ఎంతెంత కాలానికో వాన. ఊళ్ళన్నీ తడిపిన వాన. గూళ్ళలోకి చిమ్మిన వాన.
ఆగలేదు. కురుస్తూనే ఉంది.
ఆ రోజుకి చాలించాక మర్నాడు, ఆ మర్నాడు.
తర్వాత వారానికి రెండుసార్లు.
సమంగా , సాధువై, స్వాదువై వాన కురిసింది.
నెలకు మూడు తడవులుగా ఆ చోట కురుస్తూనే ఉంది.
***
[కర్ణాటక సంగీత త్రయం లో ఒకరైన ముత్తుస్వామి దీక్షితులు ఆ తర్వాత ఎట్టయాపురం లోనే ఉండిపోయాడు. 1835 లో దేహాన్ని వీడాడు. ఆయన సమాధి అక్కడ ఉంది.
జగవీర రామ వెంకటేశ్వర ఎట్టప్ప నాయకర్ ఆ తర్వాత మరొక నాలుగేళ్ళు బ్రతికాడు.
రాజ్యం సుభిక్షమైంది.
ఒక్క మరక - ఎట్టప్పన్ అన్న మాట తమిళం లో ద్రోహి కి పర్యాయ పదమై ఉండిపోయింది.
కాని ఆ వంశం లో మరి తొమ్మిది తరాల వారు ప్రభువులైనారు. సంగీతానికి సేవ చేశారు.
అప్పుడు కురిసిన పుణ్యం ఆ నేలకి ఇంకా మిగిలింది.
భరతమాతకు ఘనపుత్రుడు, మహాకవి సుబ్రహ్మణ్య భారతి 1882 లో ఎట్టయాపురంలో జన్మించాడు. ]
---------------------------------------------------------
రచన - మైథిలి అబ్బరాజు,
వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో
No comments:
Post a Comment