Friday, September 21, 2018

ది టర్న్


ది టర్న్




సాహితీమిత్రులారా!


ఈ కథను ఆస్వాదించండి............

“వెడ్డింగ్ బెల్స్ తొందరలోనే మోగబోతున్నాయా?” పియానో స్టూడియోలోకి నిసి అడుగుపెట్టగానే ఆలెక్స్ రూబెన్.

“వాట్ డు యూ మీన్!” అంది నిసి తాపీగా.

“నువ్వూ, విక్టర్, మీ వెకేషన్ సెలబ్రేషన్స్, మీ రొమాన్స్ వార్తలన్నీ గ్రేప్ వైన్ ద్వారా అందుతూనే ఉన్నయ్యి. ఈ ఏడాది జాల్జ్‌బర్గ్ మ్యూజిక్ ఫెస్టివల్ న్యూస్ లెటర్‌లో మీ మీది రైటప్ చదివాను. బెర్నెట్టీ పంపించాడు. ఇక మీ ప్రేమ పెళ్లీ, అక్కడే యూరప్‌లో ఉండిపోయి ఈ ఫ్లోరిడాకి రావేమో అనుకున్నా.”

“ప్రపంచం అంతా పెళ్లి పెటాకుల చుట్టూనే తిరగదులే ప్రొఫెసర్. నాకతన్ని చూడాలనిపిస్తుంది. వెళతాను. అతడికీ అంతే. ఉయ్ హేవ్ బ్యూటిఫుల్ టైమ్ టుగెదర్. ఇప్పుడు నా ఫ్లోరిడా ఇంట్లో నేనున్నా. అతని ఉద్యోగం పనులు అతడివి. నా పియానో పాఠాలు కాని నువ్వు కేన్సిల్ చెయ్యలేదు కదా! ఇంకెవరికైనా ఇచ్చేశావా నా స్లాట్?”

“నీకదేగా కావలసింది. యూ వాంట్ మీ టు. డోంట్ యు! నా నుంచి, నా సంగీతం పాఠాల నుండేగా నువ్వు వెకేషన్ తీసుకునేది.”

“నో, నాటెటాల్.”

“నువ్వింకా నా దగ్గర సంగీతం నేర్చుకుంటావా, నిసీ! ఎందుకీ స్టూడెంట్‌గా టైమ్ వేస్ట్! గో రొమాన్స్ సమ్ మోర్.”

“రెండూ చేస్తా, ఎవరికేం నష్టం? యూ నో, ఆలెక్స్! ప్రపంచంలో నీలాటి వాళ్లతో వేగలేం. చాలా విసుగు. ఇదివరలో ఇలాగే, నేను ఇండియాలో మెడికల్ స్కూల్‌లో ఉన్నప్పుడు, నా కజిన్ ఒకామెకు పెళ్లి కుదిరింది. ఆ వార్త తెలిసి, అప్పటి మెడికల్ స్కూల్ వైస్ ప్రిన్సిపల్, మేమంతా ఆమెను ‘ఆంటీగారు’ అనేవాళ్లం. ఆంటీ, గారు. గారు అనేది ఆనరిఫిక్ వర్డ్ మా తెలుగులో. తెలిసిందిగా?”

“అంతమటుకు నీ తెలుగు అంటిందిలే నిసి గారు! నీకు ఈ-మెయిల్‌లో నేను ‘ఆలెక్స్ గారు’ అని సంతకం చేస్తున్నా చూడలేదా?” అన్నాడు.

‘సుద్దమొద్దు. వేల సంవత్సరాల విశిష్టమైన, రిచ్ తెలుగు కల్చర్, ఆ గౌరవ మర్యాదలు, ఈ లాక్స్ అండ్ బేగల్స్ జ్యూయిష్ సన్నాసికి అందేనా?’ మనసులో విసుక్కుంది నిసి.

“ఆలెక్స్ గారూ! నీల అంటే నా కజిన్‌కి, పెళ్లి కానుకగా ఆ ఆంటీగారు ఒక ముత్యాల నెక్లెస్ కానుకగా పంపించింది. పెళ్లికూతురు నీలకు, మా అంకుల్ ముకుందరావుగారి చాలామంది డాక్టర్ స్నేహితులూ, ఊళ్లో బంధువులనుండీ విరివిగా పట్టు చీరలు, రవ్వల ఉంగరాలు, ముత్యాల గాజులు, రేడియోగ్రామ్‌లు, బీరువాలు, ఒమేగా వాచీలూ, రవ్వల లోలకులూ, ఇలా ఎన్నో బహుమతులు వచ్చాయి. నీల తండ్రి అంటే, ఆయన నివసించిన బెజవాడ అనే ఆ ఊళ్లో చాలామందికి స్నేహం, అభిమానం ఉండేవి. ఆ ఊళ్లో అప్పటి రోజుల్లో ఏలూర్ రోడ్ మీద ఆయన ఎక్స్‌రే క్లినిక్ ఒక లాండ్ మార్క్. గూగుల్ మేప్స్, జిపియస్ గాని అప్పుడు ఉంటే, రోడ్ మేప్‌లో ఆయన క్లినిక్‌కి తప్పకుండా జెండా పిన్ చేసి ఉండేది.

సరే, పెళ్లయ్యాక కొన్నాళ్లకు, నీల మొగుడు ఆమెను మెడ్రాస్ తీసుకు వెళ్లిపోయాడు. ఇంతలో ఒక చమత్కారం జరిగింది. ఈ లోపల, పెళ్లికి ముందే మా కుటుంబంతో ఎంతో బాగుండి, మా తండ్రులతో బ్రిడ్జ్ టోర్నమెంట్స్‌లో పాల్గొనే ఆ ఊళ్లోని ఒక లాజిక్ లెక్చరర్, ఆమె అంటే ఆదరంతో, మెడికల్ కాలేజ్ సీట్‌కి అప్లికేషన్ ఆయనే పూర్తిచేసి, ఆమెతో సంతకం పెట్టించి పంపేశాడు. పెళ్లి సందడిలో అందరూ ఆ విషయమే మర్చిపోయారు.

నీలకు పెళ్లయ్యాక కొన్ని నెలలకు ఓ శుభదినాన ఆమెకు మెడికల్ స్కూల్‌లో సీటొచ్చినట్టు తెలిసింది. ఆమె ఫామిలీలో, అత్తింట్లో ఒక చిన్న సైజ్ కల్లోలం రేగింది. ‘డాక్టర్ చదివించదలిస్తే పెళ్లెందుకు చేశారు? అసలు ఆ ఉద్దేశం ఉన్నట్టయినా ఒక్కసారీ చెప్పలేదు!’ అని, కొంత వాళ్ల కుటుంబాల మధ్య రభస జరిగింది.”

“ఐ బెట్ దట్ గై డివోర్స్‌డ్ హర్!”

“ఓ! ఆలెక్స్! యూ ఆర్ సో ప్రో డివోర్స్!”

“నీల మెడికల్ స్కూల్ అడ్మిషన్ ముందు ఇంటర్‌వ్యూకి వెళ్లింది. తీరా చూస్తే ఆ ఆఫీస్‌లో ఆంటీగారు కూర్చుని ఉన్నారు. ఇంటర్వ్యూలో ఆంటీగారు–నీలా! నిన్ను కేవలం ఆనవాయితీకి పిలిచాను. రికార్డ్స్‌లో నిన్ను ఇంటర్‌వ్యూకి పిలిచినట్టూ, నువ్వు పెళ్లి చేసుకున్నందున స్కూల్లో జేరలేవనీ, నీ సీట్ మరొకరికి ఇచ్చివెయ్యొచ్చు అని ఒక ఉత్తరం నా ఆఫీసుకి పంపిస్తే, చాలు–అందిట.

నీల–ఆంటీగారూ! నేను మెడికల్ కాలేజ్‌లో చేరుతున్నానండీ!- అంటే, ఆవిడ తెల్లబోయి–మరెందుకు పెళ్లి చేసుకున్నావ్! యూ నో మెడికల్ స్టడీస్ ఎంత కష్టమో! నీ హస్బెండ్ రామ్, అతను నీలాగా మెరిట్ స్టూడెంట్ కానే కాడనీ, ఆ షావుకారు కుర్రాడు సినిమాలు తియ్యటంలో ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు, అందుకే మద్రాసులో ఉండేది అనీ విన్నాను. అతను మద్రాసులో ఉంటే, నువ్వీ ఊళ్లో కాలేజ్‌లో ఎలా చదువుతావు? ఇంతకీ నువ్వు ఎలాగూ జేరవనుకుని, నీ సీట్ మరో ఊళ్లో పడేసి, ఇక్కడి మెడికల్ స్కూల్లో సీట్, వేరే తెలిసిన వాళ్ల స్టూడెంట్‌కి ఎసైన్ చెయ్యమన్నా–అందిట. వైస్ ప్రిన్సిపల్! కెన్ యూ బిలీవ్ దట్! ఆలెక్స్!” అంది నిసి.

“ఆ తర్వాత? నీల మెడిసిన్ చదివిందా లేదా, నిసీ! వాట్ హాపెన్‌డ్ టు హర్ మేరేజ్?” అడిగాడు ఆత్రుతగా ఆలెక్స్.

“ఆలెక్స్! నీకు మా ఇంట్లో వాళ్ల పెళ్లిళ్ల కథలు చెప్పటానికి, నీ లెసన్‌కు వస్తున్నానా? ఇంతకీ, నేనూ విక్టర్ పెళ్లి చేసుకుంటామని నువ్వనుకుంటే, మాకు ఏం బహుమానం కొని ఉంచావ్? ఏదీ బయటకు తియ్యి కాస్త.”

“మీ చర్చ్ వెడ్డింగ్‌లో, నేను నా నెత్తిన యామకా పెట్టుకుని పియానో మీద ‘హియర్ కమ్స్ ది బ్రైడ్’ వాయిస్తానుగా. మా మ్యూజిక్ ఫీల్డ్‌లో వాళ్ల కానుకలు అవే. పెళ్లి, ఉత్సవాల్లో పాటలు పాడటం, లేకుంటే మేము రాసిన కాంపొజిషన్స్ ఒకరికొకరు అంకితమిచ్చుకోటం. మే బి! విక్టర్ నన్ను బెస్ట్ మాన్‌గా ఎంచుకుంటాడేమో! ఎంతైనా నీ మ్యూజిక్ గురువును నేను.”

“నువ్వు నా బ్రైడ్స్ మెయిడ్‌గా ఉందువుగాని. మనం ట్రెండ్ మారుద్దాం. నువ్వూ నేనూ మంచి స్నేహితులమేగా ఇప్పుడు. మా కాబోయే ఊహాగానపు పెళ్లికి, నువ్వు నా వైపు గెస్ట్‌గా రావాలి.” అంది నిసి నవ్వుతూ.

అని, తన చెయ్యి చాపి చూపిస్తూ, “విక్టర్, నే నక్కడ యూరప్‌లో ఉన్నప్పుడు చక్కని కాంపొజిషన్ ఒకటి చేశాడు. సోలో రికార్డింగ్ జరిగింది. నే విన్నాను. ప్రస్తుతం ఎడిటింగ్‌లో ఉంది. ఆ సందర్భంలో నాకీ చక్కని బుల్గారి బేంగిల్ ఇచ్చాడు. లైక్ ఇట్? రికార్డ్ రిలీజ్ అవ్వగానే, నీకు పంపిస్తాడు. వచ్చే నా పుట్టినరోజు సమయంలో మాత్రం అతనూ నేనూ కలవొచ్చు, బహుశా అమెరికాలో,” అంది నిసి.

“ఎక్కడా! ఏ ఫోర్ సీజన్స్‌లో?” అన్నాడు ఆలెక్స్ గొంతు కామ్‌గా ఉంచటానికి ప్రయత్నిస్తూ.

నిసి అతని ముఖంలో రంగుల మార్పులు గమనించింది. ‘ఏమిటి ఆలెక్స్ ప్రాబ్లమ్? హి ఈజ్ ఏక్టింగ్ వియర్డ్!’ అనుకుంది లోపల.

“డోంట్ బి సిల్లీ! ఆలెక్స్! ఇంకా నేను నిర్ణయించుకోలేదు. యూ వాంట్ టు బి దేర్? వెన్ ఐ ఆమ్ విత్ విక్టర్?”

“నో, థాంక్ యు. నాకింకా సెక్స్ ఆర్జీలు చేతకావులే. యూ గో వేర్ యూ వాంట్. వెన్ యూ వాంట్. ఐ డోంట్ హావ్ టైమ్ టు జాయిన్. ఈ సీజన్ మ్యూజిక్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసి, ఆర్టిస్ట్స్‌ని ఎప్రూవ్ చేసి, డేట్స్ ఫైనలజ్ చేసి, చచ్చేంత పనుంది. స్టూడెంట్ వీసాస్, నా టీచింగ్ స్కెడ్యూల్, అదింకో తలకాయ నొప్పి.”

“కానీ, వారానికి నాకో గంట తప్పకుండా పియానో నేర్పుతారు కదా. ఆలెక్స్! నాకు చాలా నచ్చే పనుల్లో నీ దగ్గర పియానో నేర్చుకోటం ఒకటి.”

ఆమె గొంతులోని సిన్సియారిటీకి, అతని మనసులో అతనికే అర్థంకాకుండా చెలరేగుతున్న చిన్న చిన్న ఈర్ష్యలు చెదిరిపోయి, “అఫ్‌కోర్స్! ఐ విల్ మేక్ టైమ్ ఫర్ యూ, డియర్ నిసీ!” అని ఆమెకు కొత్త పాఠం నేర్పటం ప్రారంభించాడు.

పియానో పాఠం చెప్పించుకుని ఇంటికి వచ్చేసరికి, విచిత్రంగా, నిసికి ఆమె కజిన్ నీల దగ్గర్నుండి ఈ-మెయిల్ ఉంది. అరే, ఇవ్వాళ తలిచానో లేదో ఈ ఉత్తరం! చాలా బద్ధకిస్ట్ కదా! ఏమిటబ్బా విశేషం! అనుకుని ఓపెన్ చేసింది.

ఆంటీగారు పోయారు. ఐ వాంట్ యు టు నో. సంస్మరణ పుస్తకం వేస్తున్నారు అక్క, బావయ్య. మన ఇంట్లోంచి చాలామంది ఆర్టికల్స్ రాస్తున్నారు. నీ ఆర్టికల్ ఈ తేదీ లోపల ఈ ఈ-మెయిల్ అడ్రస్‌కి పంపు. హోప్ ఆల్ ఈజ్ వెల్ విత్ యూ! లవ్, నీల.

‘తొంబయ్యేళ్లుంటయ్యా? ఆమెకు బహుశా. సో సారీ టు హియర్ ఇట్! మళ్లీ ఇంకోసారి నీకు రాస్తా. తీరిగ్గా. లవ్ యూ కజ్!’ అని వెంటనే ఈ-మెయిల్ చేసి, కుర్చీలో చేరగిలబడి, విచిత్రం. ఇందాకే వారిద్దరి గురించి మాట్లాడితే ఇప్పుడీ వార్త రావటం అనుకుంది నిసి.

వెంటనే ఆ ఈ-మెయిల్ డిలీట్ చేసేసి, ఐ హేట్ డామ్ మెమోరియల్స్. ఆబిట్యుయరీస్. ఓవర్ మై డెడ్ బాడీ! లైక్ హెల్ ఐ విల్ కాంట్రిబ్యూట్ సచ్ ఏన్ ఆర్టికల్! ఇంకేం పని లేనట్టు! అనుకుంది.

ఆమెకు తల్లీ, తండ్రీ సంభాషణలు ఆ మధ్యవి గుర్తొచ్చాయ్.

“ఆంటీగారు రిటైర్ అయ్యాక, ఆమె పిల్లలు బలవంతాన ఆమెకు హైదరాబాద్‌లో ఒక ఎపార్ట్‌మెంట్ కొని అక్కడకు మార్చారు. నీకు గుర్తుందా ఆమె ఆఖరు ఉద్యోగం మద్రాస్‌లోనేగా… క్లినిక్ ప్రసిడెంట్‌గా. నువ్వు 1990లోనేనా ఇండియాలో కాన్ఫరెన్స్‌లో మాట్లాడటానికి వచ్చావు?” అని అమ్మ అంది. నాన్నగారు మాత్రం, “అబ్బో, ఆవిడ ఈ మధ్య ఇంకా లావయింది. ఏనుగంత ఉంది. ఇద్దరు ముగ్గురు కాని కదల్చలేరు. డయాబిటీస్. ఐనా బాగా వండించుకుని, ఇద్దరిముగ్గురి తిండి తింటుంది. ఇదివరకటిలాగానే పిల్లల్నీ పనివాళ్లనీ ముండా, దున్నపోతా, లంజకొడుకు, దొంగలంజ, ఇలాగే… ఏమీ తగ్గలేదు రెడ్డి ధాష్టీకం. కట్టమంచి రామలింగారెడ్డి అని ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్‌గా చేశాడు. ఆ వంశరత్నాలు సిస్టర్స్ అంతా. వెరీ పవర్‌ఫుల్ లేడీస్!” అని నవ్వారు.

మామూలు ప్రకారమే అమ్మ, ‘మీరు మాత్రం శుద్ధంగా మాట్లాడేట్టు!’ అంది. ఆ తర్వాత జననీజనకులు, వారిద్దరే ఒకళ్లను గురించి ఒకరు ఆడిపోసుకుంటూ, మాట్లాడుకోటం మొదలెట్టారు. నిసి ఫోన్ పక్కనే పెట్టేసి, టెన్నిస్ డ్రెస్‌లోకి ఛేంజ్ చేసుకుని, రిట్జ్ క్లబ్‌కి వెళ్లింది. ఆమెకు అలవాటే, వాళ్ల పోట్లాటలో అసలు తను ఫోన్ ఈ చివర లేదని గమనించటానికి వారికి చాలా టైమ్ పడుతుంది. అప్పుడు వాళ్లే ఫోన్ డిస్కనెక్ట్ చేస్తారు. దే రియల్లీ డోంట్ నీడ్ హర్.

ఆ రాత్రి ఆంటీగారి విషయం గుర్తొచ్చి నిసి ఆమెను ఎప్పుడు చూసిందా ఆఖరుసారి అనుకుంటూ ఆలోచనలోకి జారిపోయింది. తను 1980ల ఆఖర్లోనో, 1990ల మొదట్లోనో ఏమో, కాన్ఫరెన్స్ కోసం ఇండియా వెళ్లింది.

నిసి అప్పడు న్యూయార్క్‌లో ఒక హాస్పిటల్‌లో, రేడియేషన్ ఆంకాలజీ డిపార్ట్‌మెంట్ ఛీఫ్‌గా ఉంది. ఆమెను ఇండియాలో మద్రాసు నగరంలో మొదటిసారిగా జరుగుతున్న ఇంటర్నేషనల్ కాన్సర్ కాన్ఫరెన్స్‌లో ఒక స్పీకర్‌గా ఆర్గనైజింగ్ కమిటీ ఆహ్వానించింది. స్లోన్ కెటరింగ్‌లో ఛెయిర్మన్‌గా ఉన్న ఫ్లారెన్స్ చూ, బ్రెస్ట్ కేన్సర్ కన్సర్వేటివ్ మేనేజ్‌మెంట్ గురించి మాట్లాడేటట్టూ, ఆ తర్వాత నిసి, పోస్ట్ మేస్టెక్టమీ ఛెస్ట్ వాల్ రికరెన్స్ గురించి మాట్లాడేట్టు నిర్ణయించుకున్నారు. వారిద్దరికీ, ఒకరి పద్ధతులతో ఒకరికి పరిచయం ఉన్నందున, నిసి తన ఫెలోషిప్ ఆమె దగ్గర చేసి ఉన్నందున, ఇండియాలో కాన్ఫరెన్స్‌లో నిసి, తన గురువు తర్వాత మాట్లాడటం బాగుంటుందనీ, బ్రెస్ట్ కాన్సర్ మీద ఇద్దరు విమెన్ ఫిజీషియన్లు, ఛీఫ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్స్–రెండు ప్రజెంటేషన్లు కాంప్లిమెంటరీగా ఉండి, ఆడియన్స్‌కి నచ్చుతాయని ఆ కమిటీ వారి ఉద్దేశంగా వారు చెప్పారు. ఆ ఉపన్యాసాలు ముగిసిన తర్వాత రోజు, అపోలో హాస్పిటల్ వారి కొత్త కేన్సర్ డివిజన్ చూడటం, స్పీకర్లందరికీ వారిచ్చే విందు, ఆ ట్రిప్ కార్యక్రమంలో భాగాలనీ చెప్పారు. నిసి ఇండియాకి వెళ్లటానికి, సభలో మాట్లాడటానికీ సంతోషంగా ఒప్పుకుంది. వివిధ కేన్సర్‌ల గురించిన డిస్కషన్స్ ఉన్న ఈ ప్రథమ సమావేశం, బాగా జరిగింది. దక్షిణ భారతంలోని క్లినిక్స్ నుండి, గవర్నమెంట్ హాస్పిటల్స్ నుండి, వైద్యులు, అనుబంధ శాఖలలో వాళ్లు, ఇతరులు చాలామంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆ సభలో, తనకు తెలిసి ఉన్న బెజవాడలోని క్లినిక్‌ల డాక్టర్లను, వారి పేర్లతో సహా నిసి తన ఉపన్యాసమప్పుడు ప్రత్యేకంగా పేర్కొన్నది.

నిసికి గుర్తు ఉన్న ఒక విశేషం ఏమంటే, ఆంటీగారు గైనకాలజిస్ట్ అయివుండి, ఒక ప్రముఖ హాస్పిటల్ ప్రసిడెంట్‌గా ఉండి, ఆ సమావేశానికిగాని, అందునా బ్రెస్ట్ కేన్సర్ మీద తన ప్రజెంటేషన్ వింటానికిగాని రాకపోవటం, అమ్మ తన కోసం మద్రాసు వచ్చి, తను కాన్ఫరెన్స్ ఇస్తున్నప్పుడు ఆ సమయంలో ఆంటీగారింటికి వెళ్లి, ఆవిడకిష్టమని కోడిగుడ్ల పులుసు, బంగాళాదుంపల వేపుడు చేసిపెట్టటం. అందువల్ల ఆంటీగారిని ఆఖరుసారి ఎప్పుడు చూడలేదో నిసికి గుర్తుంది కాని, ఎప్పుడు చూసిందో ఎంతకీ గుర్తు రాలేదు.

ఏ నాటి సంగతులు ఇవన్నీ! ఈ మధ్య ఈ మధ్య సంగతులే తనకు గుర్తు లేవు. నీల రాస్తుందిలే నివాళి ఆర్టికల్, ఆమెకు ఇంకొంచెం ఎక్కువ సంబంధ బాంధవ్యాలు ఉన్నయ్ నాకన్నా ఇండియాతో, చుట్టాలతో అనుకుని సుఖంగా నిదరపోయింది నిసి.

నిసి ఈసారి పారిస్ ట్రిప్ నుంచి వచ్చాక, ఆమె అందం ఎందుకో ఎక్కువయినట్టు అనిపించసాగింది ఆలెక్స్‌కు. ఆమె దుస్తుల పద్ధతి మరీ ఫార్మల్‌గా కాకుండా, కాజుయల్ అండ్ సెక్సీగా మార్చినట్టు అతనికి అనిపించింది. నిసి పారిస్ నుంచి డిజైనర్ క్లోత్స్, నగలు తెచ్చుకుంది. వైద్యవృత్తిలో ఉండేలాగా కాక, కళాకారుల స్నేహంతో విశృంఖలత్వం కొంత అబ్బినట్టు ఉంది. క్లాసికల్ మ్యూజిక్ విభాగంవాళ్లు చాలామంది కాన్సర్ట్‌ల సమయంలో ఇంకా పాత పంథాలోనే ఉంటారు. ఫార్మల్‌గా డ్రెస్ అవుతారు. నిసి అక్కడ ఆ సమయాల్లో వాళ్ల పద్ధతి అనుసరించినా, ఇతర సమయాల్లో ఆమె కదలికల్లో ఒక వేరే రకమైన చురుకు వచ్చింది. మరి నిసి మధ్యమధ్యలో ఆర్ట్ క్లాసులకు కూడా వెడుతూనే ఉంది కదా. అక్కడ ఆర్టిస్టులు కొందరు ఆఫ్రికన్స్. కొందరు స్పానిష్. వారి ఇళ్లకు వెళ్లి కూడా, వారితో కలిసి మోడల్స్ బొమ్మలు వెయ్యటం చేస్తుంది. ఒక సోహో బొహీమియన్ తరహాగా, బొమ్మలు వేసే వాళ్ల ఇళ్లలో ఉండిపోయి, వాళ్ల దేశాల సంగీతానికి వాళ్లతో డాన్స్ చేస్తుంది. అది కాక అప్పుడప్పుడూ లోకల్ డాన్స్ స్టూడియోలో వాల్జ్, రుంబా, చాచాచా డాన్స్ లెసన్స్ తీసుకుంటుంది.

ఆలెక్స్‌కు ఆమెలో కొత్త అందాలు కనిపించసాగాయి. ఆమెలో కొత్తరకమైన ఆసక్తి మొదలయింది అతనికి. ఆమెను తన కాన్సర్ట్‌లకు ఎక్కువగా ఆహ్వానించటం, డిన్నర్లలో తనకు పక్కపక్కనే ఉంచుకోటం, మధ్య మధ్య ఆమెకు ఈ-మెయిల్స్, ప్రోగ్రామ్‌ల గురించి ఆమె ఒపీనియన్స్ కనుక్కుని, అవి ఇతర సంగీతకారులకు పంపించటం, ఎక్కువగా చెయ్యసాగాడు.

ఈ తతంగాలతో నిసికి తన ఇతర ఆసక్తులలో టైమ్ సరిపోవటం లేదు. ఆమె అతని కొన్ని కొన్ని ప్రోగ్రామ్‌లు ఎగరకొట్టసాగింది. ఆలెక్స్ ఆమెను మ్యూజిక్ కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొనవలసిందిగా ఒత్తిడి పెట్టసాగాడు.

“నీకసలు మర్యాదా మంచీ లేదా?” అన్నాడామెతో ఆలెక్స్.

“ఏం చేశాను నేను? కాన్సర్ట్‌కి వచ్చాను, వెన్వెంటనే ఈ-మెయిల్ ఫీడ్‌బేక్ ఇచ్చాను; బాగుందని చెప్పాను కానా!” అందామె.

“నువ్వొచ్చావో లేదో నాకేం తెలుసు?”

“భలే! ప్రోగ్రామ్ మొదలు పెట్టకముందే వచ్చి, నువ్వు స్టేజ్ మీదికి రాగానే చప్పట్లు కొట్టి, దగ్గు రాకుండా, విక్స్ కాఫ్ డ్రాప్ బుగ్గన పెట్టుకుని, ఊపిరి దాదాపూ స్తంభింపచేసి, నువ్వు పియానో మీద ఆర్గాస్మిక్ క్లైమాక్స్‌కి వచ్చినప్పుడు, మళ్లీ హాల్ దద్దరిల్లేలా చప్పట్లుకొట్టి, ఆ తర్వాతేగా నేనింటికెళ్లింది. హాల్లో నేను ఉన్నానయ్యా బాబూ!”

“స్టేజ్ మీద ఉన్న ఆర్టిస్ట్‌కి కచేరీ హాల్లో ఉన్నవాళ్లను గమనించే వీలు లేదు. అసలు, అంతసేపు నేను పియానో మోగిస్తే, ఇతరులు వారి పాటలు వినిపిస్తే, మేము స్టేజ్ దిగి, లాబీలో శ్రోతలను కలవటానికి వచ్చినప్పుడు, నువ్వు వారిలో లేవే?” ఆలెక్స్.

“ఐ యామ్ సారీ! నాకు ప్రోటోకాల్ తెలీదు. ప్రోగ్రామ్ అయిపోగానే అయిపోయిందనుకున్నాను. నే బైట గాలిలో గట్టిగా ఊపిరి పోసుకోటానికి వెళ్లాను. దట్సాల్.”

ఆ తర్వాతసారి సంగీత కళాశాలలో, ఆలెక్స్ కచేరీ ఐనాక, ఆమె లాబీలో అందరితోపాటు కదిలి, తన వంతు వచ్చినప్పుడు ఆలెక్స్ రూబెన్ ముందు నిల్చుంది.

“సంగీతం బాగున్నదని తలుస్తాను.” అన్నాడు గురువుగారు.

ఆమె వెంటనే ఆలెక్స్ కౌగిలిలోకి సుతారంగా జారి, ఏవో అవ్యక్తమైన మెచ్చుకోలు మాటలు అంది. చక్కగా వక్షోజాలు, అతని కోటులోకి వత్తింది. ఆహ్వానితులు అందరూ ఆమె మెచ్చుకోలు, ఆమె కౌగిలి, ప్రత్యక్షంగా చూశారు.

తర్వాతసారి పాఠం చెప్పించుకోటానికి వెళ్లినపుడు నిసి అడిగింది, “ఈసారి నేను కచేరీకి వచ్చినట్టు నీకు ఖచ్చితంగా తెలిసింది కదా? యూ హేపీ నౌ?”

“ఏ, ఏ అంశాలు నచ్చాయి?”

“మై గాడ్! నీ స్టూడెంట్ అవటంకన్నా, నే పోయి ఫుల్ టైమ్ జాబ్ చేసుకోటం మెరుగు. ఈ ఆరాధన నావల్ల కాదయ్యా! నా సంగీతం పాఠం మీద నీకు శ్రద్ధ లేదు. నన్ను నీ ఫాన్ బాజా భజంత్రీ బేండ్‌లో పెడుతున్నావ్. నేనిలా రోబోలా ప్రొటోకాల్స్, ఫార్మాలిటీస్ పాటిస్తూ బతకలేను, ఓకే. ఐ ఆమ్ ఎ ఫ్రీ స్పిరిట్! లెట్ మీ బీ! అసలు మన మొదటి ఒప్పందం ఏమిటి? లెసన్స్‌కి కూడా రెగ్యులర్‌గా ఒకే టైముకు రానని, నాకు దేనికీ నిర్బంధం ఉండదని. వాట్ ఆర్ యూ డూయింగ్ టు మీ. ఐ కాన్‌ట్ బి ఎ మ్యూజిక్ స్టూడెంట్ ఆన్ దీజ్ టర్మ్‌స్. ఇరవైనాలుగ్గంటలూ నీ స్తోత్రం చేస్తూ, నీకు మంగళారతులు నేనెత్తలేను.”

“నిసీ! స్టాపిట్! నువ్వు గమనిస్తే నీ ఇండియా దేశం నుండి ఒక్క చెప్పుకోదగ్గ పియనిస్ట్ లేడు. నువ్వు ఈ వయసులో నేర్చుకోటం మొదలెట్టి, నన్నూ పియానో మ్యూజిక్‌ని ఉద్ధరిస్తావా? నిన్ను మ్యుజీషియన్ చెయ్యటంలా. ముందు మనిషిని చెయ్యటానికి ప్రయత్నిస్తున్నా. మర్యాదలు, ఆప్యాయతలు ఇచ్చిపుచ్చుకునేవి. అవి వన్ వే స్ట్రీట్ కావు. యూ ఆర్ ఫ్రోజెన్ లైక్ ఆన్ ఐస్ క్వీన్. ముందు కరిగి మనిషివికా, ఆ తర్వాత మాట్లాడుకుందాం మ్యూజిక్ గురించి, యూ లిటిల్ ష్రింప్!” అన్నాడు ఆలెక్స్.

“స్క్రూ యూ! ఇంకెప్పుడు నాతో మాట్లాడ్డానికి ప్రయత్నించకు!” అనేసి బేగ్ తీసుకుని బైటికి నడిచిందామె.

టకటక వెళ్లిపోయే హీల్స్ ధ్వనులు హాల్‌వేలో వినిపించాయి.

కొంచెం సేపట్లో ఆ ధ్వనులు, వెనుతిరిగాయి.

“ఐ లైక్ దట్ రిథమ్! నైస్ టర్న్. గోయింగ్ ఎవే అండ్ కమింగ్ బేక్. అంత రిథమిక్‌గా నడుస్తావు. అలాగే వాయించరాదూ పియానో?”

“ఐ ఫర్‌గాట్ టు టేక్ మై మ్యూజిక్ బుక్! టీచర్! అందుకూ నేను తిరిగి వచ్చింది.”

“ఐ ఫర్‌గాట్ ఇట్ టూ. నువ్వున్నప్పుడు ఊపిరాడదూ. ఏం గుర్తుండదూ. సో యూ ఆర్ నాట్ కమింగ్ బేక్! ఎగెయిన్. రైట్ నిసీ!”

“ఐ గాట్ టు! ఐ సీ ద క్లియర్ సైన్స్ ఆఫ్ ఎడిక్షన్ ఇన్ యూ. నెమ్మదిగా నిన్ను డీ-టాక్సిఫై చేసి, అప్పుడు మానేస్తా. నిన్ను ఈ స్థితిలో వదిలి పోలేను. నువ్వు ఎందుకూ కాకుండా పోతావు. యూ ఆర్ టూ డామ్ గుడ్ ఎ పియనిస్ట్. సీ యూ నెక్స్ట్ వీక్!” అనేసి వెళ్లిపోయింది నిసి.
                                  (నిసి షామల్ డైరీ, 2016.)
-----------------------------------------------------------
రచన: లైలా యెర్నేని, 
ఈమాట సౌజన్యంతో

Wednesday, September 19, 2018

సాహిత్యంలో వేశ్యా వృత్తి


సాహిత్యంలో వేశ్యా వృత్తి





సాహితీమిత్రులారా!
ఈ వ్యాసంలోని విషయాన్ని నిశితంగా గమనించగలరు.
నళినీ జమీలా అనే సెక్స్ వర్కర్ వేశ్యల సమస్యలపై సమాజపు దృష్టి ప్రసరించే నిమిత్తం, తమకు న్యాయం కావాలంటూ కొన్నేళ్ళ క్రితం తన ఆత్మ కథను ప్రచురించారు. సమకాలీన సమాజంలో ఆమె ఎదుర్కొన్న కష్టనష్టాలు, సాగించిన పోరాటాలు కేవలం ఆమె ఒక్కరివే కావు. వేశ్యా వ్యవస్థలో భాగాలైన అనేక మంది స్త్రీలు ఆమె కథలోని చేదు అనుభవాలకు ప్రత్యక్ష సాక్షులు. వ్యక్తిగత అనుభవాల నేపధ్యంతో ఆమె తన ఆత్మకథలో వెలిబుచ్చిన అభిప్రాయాలపై చర్చగా కాక, వేశ్యావృత్తి సమస్య సామాజిక సమస్య అని భావించి, వారి జీవిత చిత్రణ మన సాహిత్యంలో ఏవిధంగా జరుగుతూ వచ్చిందో జరిపే విశ్లేషణ దిశగా ఈ వ్యాసరచనకు పూనుకుంటున్నాను.

ఇందుకు కారణం ఏమిటంటే, ఎవరి కథ వారే చెప్పుకోవడం స్వాగతించవలసిన పరిణామమే కానీ అదే అత్యంత ప్రామాణికం అని పూర్తిగా నమ్మలేం. ఈ సందర్భంలో కుటుంబరావుగారి ముడి సరుకు అనే కథ లోని ఒక వాక్యం గుర్తొస్తోంది. ఒక పాత్ర, ‘నన్నుగురించి నేను చెప్పుకోగలిగితే నువ్వు దేనికి!’ అని రచయితతో అంటుంది. అంటే సమస్యలో చిక్కుకుని ఉన్న వారు, తమ పరిస్థితి గురించి వస్తునిష్టతతో విశ్లేషించుకోడం పూర్తిగా సాధ్యం కాదు అని కొ.కు. అభిప్రాయం కావచ్చు. దానికి కళ సహయకారి కాగలదు. జీవితం కన్నా కళలు ఒక మెట్టు ముందుండి, భావికి సంకేతాలుగా ఉంటాయి. కళాకారులు సామాన్యుల జీవితాలను వారి కంటే లోతుగా గమనించి కళాసృష్టి చెయ్యగలరని ప్రజల నమ్మకం. అందుకే తన ఆత్మకథలో నళినీ లేవనెత్తిన ప్రశ్నల మూలాలను, మన ఆధునిక తెలుగు సాహిత్యపు పుటల్లో పరిశీలన చేసేందుకూ, ఆ రచయితల సామాజిక దృక్పథాల వెలుగులో చర్చించేందుకూ ప్రయత్నించాలన్నది ఈ వ్యాసానికి సంకల్పం అయ్యింది.

సమాజాన్ని చూసే విధానం, సమాజాన్ని గురించి ఉండే అవగాహన – వీటిని మనం సామాజిక దృక్పథం అని నిర్వచించుకుని, ఆ నిర్వచనంతో వేర్వేరు కాలాలకు చెందిన రచయితల సామాజిక దృక్పథాలను ఆ సమాజ పరిస్థితుల నేపధ్యంలో విశ్లేషణ చేసుకోవచ్చు. తటస్థ చరిత్ర లాగే తటస్థ సాహిత్యం కూడా ఉండదు. జీవితం లోని ప్రతీ సంఘటన, చూసేవారిని బట్టి వేరు వేరు అంతరార్ధంతో కనిపిస్తుంది. ఈ వైవిధ్యాన్ని – సాహిత్యకారుడు కాచి, వడపోసి, నిగ్గు దేల్చి ఏ దృక్పథం లోంచి ఆ సంఘటనల్లోని సత్యాన్ని లోకానికి వ్యక్తం చెయ్యాలో నిర్ణయించుకుంటాడు. అది అతని సామాజిక దృక్పథం ఔతుంది. ఆధునిక నవలకూ, నాటకానికీ, కథకూ, కవితకూ మూలపురుషులైన వీరేశలింగం, గురజాడలు ఒక నిశ్చితమైన సామాజిక దృక్పథం తోనే కలం పట్టారు. అలాగే తరువాతి తరాలలోనూ రచయితలు, సమాజపు నమ్మకాలకూ, జీవిత సత్యాలకూ ఉండే అంతరాలను వారి సాహిత్యంలో ఎత్తి చూపించారు, వారి దృక్పథాలు వారు జీవించిన సమాజాల విశ్వాసాలకంటే ఎంత భిన్నంగా ఉన్నవో గమనిస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అన్ని తరాల లోనూ, సమాజంలో వేశ్యల స్థానం పట్ల ఒక స్పష్టమైన అవగాహన కలిగి, ఒక విలక్షణకోణంలో వేశ్యలను దర్శించి వారి పాత్రపోషణ కావించిన రచయిత లున్నారు. వారి రచనలలో వెల్లడయ్యే వారి దృక్పథాన్ని పరిశీలిస్తే వేశ్యావ్యవస్థను మరింత వివరంగా అర్ధం చేసుకోవచ్చు.

ప్రాచీన సాహిత్యంలో, వేశ్యలతో సహవాసం దోషమనీ, ధర్మార్ధాలకు హాని కలుగుతుందనీ, అది మనిషిని పతనం చేస్తుందనీ మన పూర్వులు ఏకకంఠంతో చెప్తూ వచ్చారు. ‘మనుధర్మ శాస్త్రకర్తలు, వేశ్యాప్రియులు పంక్తి బాహ్యులనీ, వారికి రాజసభ లందు కొలువు లీయరాదనీ విధించి యున్నారు,’ అని వీరేశలింగం మనకు గుర్తు చేస్తారు. 1890ల తర్వాత భారతీయ సమాజంలో దేవదాసీలను నిషేధించాలంటూ ఏంటి నాచ్ ఉద్యమం మొదలయ్యింది. దాని ఆవశ్యకతను, తెలుగు సమాజపు నేపధ్యంలో కందుకూరి తన ప్రహసనాల్లో చిత్రించారు. ‘పూర్వకాలంలో ముసుగు వేసుకుని రెండో కంటి వాడికి తెలియకుండా వేశ్య ఇంటికి వెళ్ళేవారూ, ఈ కాలంలో అందరూ చూస్తే మరింత గౌరవమని భావించి, బాహాటంగా పట్టపగలే పదిమందిని వెంటపెట్టుకుని మరీ వేశ్యల ఇంటికి వెళ్తున్నారు. వేశ్యా సాంగత్యం సమాజంలో ప్రతిష్టాకారణమౌతోంది’ అంటూ గ్రంధాలలో రాసి ఉన్న ఆదర్శాలకూ, వాస్తవంగా సమాజం లో ప్రచారమౌతున్న భావాలకూ కనిపిస్తున్న ఈ వ్యత్యాసాన్ని వీరేశలింగం తీవ్రంగా ఖండించారు. ఆనాటి సమాజం పాటిస్తున్న – కన్యాశుల్కం, వృద్ధులకు చిన్నపిల్లలను కట్టబెట్టడం వంటి అనేక దురాచారాలతో బాటు, వేశ్యలనూ, వారి పోషకులనూ, వేశ్యావృత్తి సమర్ధకులనూ ఆయన చీల్చి చెండాడారు.

కందుకూరి వీరేశలింగం ఏంటీ నాచ్. కానీ వారిని వేశ్యల శ్రేయస్సుకు విరోధిగా కాక వారికి మెరుగైన జీవితం కోరిన సంస్కర్తగా మనం అర్ధం చేసుకోవాలి. ‘వివాహమాడి పతివ్రతలు కాదగిన వేశ్యలను జారిణులనుగా చెయ్యడమౌట చేత అది వేశ్యలకు కూడా ద్రోహమే,’ అని ఆ వృత్తి లోని దోషాన్ని ఆయన సరిగ్గా గుర్తించారు; వేశ్య దయనీయ జీవితాన్ని సానుభూతితో పరిశీలించారు. ‘కొంచెము వయసు జారిన తోడనే విటపురుషులు తమ్ము విడిచి యవలకు జారగా, గడించిన సొమ్ము వ్యాధుల కింద వ్యయపడగా, వెనుకటి సంగీతనాద మిప్పుడు రోదననినాదముగా మారగా, ముప్పది సంవత్సరముల ప్రాయముననే దేహము చెడిపోయి తిండికి లేక తమ పాపఫలమ నుభవించుచూ, రోగముల చేత బాధ పడుచూ – ఇట్టి కులవృత్తి నంగీకరించిన యీ దేశము యొక్క యపకీర్తి మూర్తీభవించి యీ రీతిని బహురూపముల మెలుగుచున్నదో యన అభాగ్యదేవతల వలె నెల్లెడ దిరుగుచుందురు.’ అని వారి దుస్థితిని కళ్ళకు కట్టినట్టు సమాజానికి చూపించారు.

వేశ్యలను వినోద సాధనాలుగా ఆమోదించే రివాజు సమాజంలో అనాదిగా ఉండేది. రూపకాల లోని స్త్రీ పాత్రలను పోషించడానికి బ్రహ్మదేవుడు అప్సరసలను సృష్టించినట్లు నాట్యశాస్త్రంలో (200BC -200AD) భరతుడు పేర్కొంటాడు. అలాటి తరతరాల సమాజపు నమ్మకాలను ఎదిరించి, వీరేశలింగం తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి సారి వేశ్యజాతిని భగవంతుడి సృష్టిలో భాగంగా కాక, సమాజంలోని ఒక జాడ్యానికి రూపంగా చూపారు. ఆయన దృక్పథం సమకాలీన సమాజస్వభావానికి భిన్నంగా, ప్రగతిశీలకంగా ఉండడం గమనించాల్సిన విషయం. అది తరువాత వారందరికీ కొత్త వెలుగు చూపింది.

1910లో గురజాడ అప్పారావు కన్యాశుల్కం లోని మధురవాణి పాత్ర వేశ్య అయి ఉండీ తాను ఏంటీ నాచ్ నని చెప్పుకోవడం ఒక విశేషం. వీరేశలింగంగారి భావజాలాన్ని అనుభవసారంగా గ్రహించి, ఆమోదించిన వ్యక్తిగా మధురవాణి పాత్రను అర్ధం చేసుకోవచ్చు. ‘నేను అక్షరాలా యాంటీ నాచ్‌నే, వివేకలేశం వున్నవారు ఎవరు యాంటీ నాచ్ కారండి?’ అని మధురవాణి అనడమే దానికి సాక్ష్యం. కానీ గురజాడకు వేశ్యల పట్ల ఉండే దృక్పథాన్ని మరింత తరచి చూడవలసిన అవసరముంది. సంస్కరణ వాదమంటే గౌరవమున్నా, ‘వేశ్యలను చూడమనీ, మాట్లాడమనీ, తాకమనీ’ ప్రకటించే సంస్కర్తల పట్ల గురజాడకు అభ్యంతరాలున్నట్టు మనకు ఆయన రచనల్లో తెలియవస్తుంది. వేశ్యలను పెళ్లి పేరంటాలకు పిలవకుంటే వారెట్లా బతకాలనీ, వారు గిరీశం వంటి కుక్కల పొత్తుకే తగుదురా, సౌజన్యారావు వంటి సత్పురుషులను చూడడానికి కూడా వీలవదా అనీ, వారు విద్యాబుద్ధులు నేరిస్తే సౌజన్యారావు వంటి వారు వారిని పెళ్లాడుదురా, అనీ మధురవాణి అనేక సందేహాలు వ్యక్తం చెయ్యడం దీనికి తార్కాణం.

వేశ్యల ధనదాహాన్నీ, వారి వల్ల కలిగిన కుటుంబ సంతాపాలనూ చిత్రించిన చింతామణి వంటి అనేక నాటకాలు తెలుగు వారికి చిర పరిచితాలే. వేశ్యలనే కాదు, వేశ్యామాతలను కసిదీరా తిట్టి ప్రేక్షకులకు ఆనందం కలిగించిన సన్నివేశాలు ఆ నాటకాలలో ఉండేవి. కానీ ఆ దుర్మార్గం వృత్తిలో ఉందనీ, వ్యక్తుల్లో కాదనీ గుర్తించి, వేశ్యలలో ఆరాధ్యులున్నారని చెప్పగలిగిన క్రాంతదర్శి గురజాడ. వృత్తి ధర్మానికీ, తన ప్రవృత్తికీ ఉన్న వైరుధ్యం కరటకశాస్త్రి స్నేహితుడై ఉండి కూడా గుర్తించనందుకు మధురవాణి నొచ్చుకుంటుంది. ‘వృత్తి చేత వేశ్యని గనక చెయ్యవలసిన చోట్ల ద్రవ్యాకర్షణ చేస్తాను గానీ, మధురవాణికి దయాదాక్షిణ్యాలు సున్న అని తలచారా? మీ తోడబుట్టుకి ప్రమాదం వచ్చినప్పుడు నేను డబ్బుకి ఆశిస్తానా?’ అని ఆమె అంటుంది.

స్వార్ధవర్తనం మరింతగా సమాజంలో పెరిగి, అన్ని రంగాల్లోనూ వచ్చిన నైతిక పతనమై, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కలుపుమొక్కలు (1935) కథలో దుర్గంధంగా మనకు పడుతుంది. ఆ కథలో, సబ్ కలెక్టరూ, ప్రెసిడెంటూ, ప్రెసిడెంటు గుమస్తా, బ్రాహ్మడూ మొదలైన మర్యాదస్తుల పాత్రలందరూ కలుపు మొక్కలే. బహుశా అందరూ కలుపుమొక్క అని భావించే వేశ్య శేషాచలం మాత్రమే ఈ కథలో కలుపుమొక్క కాని పాత్ర.

శ్రీపాద వారిదే మరొక రచన వడ్లగింజలు అనే కథ. చదరంగం ఆటలో అసమానప్రతిభావంతుడు శంకరప్ప రాజుగారితో ఆడి గెలవడం కథాంశం. దాని రచనాకాలం 1941 అయినా కథా కాలం మరింత వెనక్కి జరిగినట్టు ఆయన నేపధ్యం ద్వారా సూచిస్తారు. ఈ కథలో శాస్త్రిగారి చిన్నచిన్న వ్యాఖ్యానాలతో వేశ్యల జీవితాలలోని కళా వైదగ్ధ్యాన్ని ఊహించే ప్రయత్నం చెయ్యవచ్చు. తన గతాన్ని రాజు వద్ద ప్రస్తావిస్తూ స్వయంగా శంకరప్ప ఇలా చెప్పుకుంటాడు. చంద్రవదన అని మా వూళ్ళో వొక వేశ్య, ఆమె మా నాయనగారి దగ్గిర కావ్య నాటకాలంకార గ్రంధాలు నాతో పాటూ క్షుణ్ణంగా చదివింది. భ్రాతృ ప్రేమతో పెంచి నన్నామె చదరంగంలో ప్రవేశపెట్టి దిద్దింది, అని తన చెల్లెలు అంటూ చంద్రవదనకు కృతజ్ఞత చెప్పుకుంటాడు.

తరవాతి పాత్ర అలివేణిది. ఆమె తన నృత్య పాటవంతో పెద్దాపురపు సంస్థానానికి ప్రతిష్ట చేకూర్చిన కళాకారిణి. శంకరప్ప ప్రజ్ఞ అన్నా, అతని వ్యక్తిత్వమన్నా ఆమెకు అంతులేని ఆరాధన. రాజసభలో, శంకరప్ప సమక్షంలో అలివేణి అద్భుత నాట్య ప్రదర్శనకు అందరూ స్థాణువులైపోతారు. ‘ఎదుట కూచుని మహా విద్వాంసుడు చూస్తున్నాడన్న ఉత్సాహంతో అలివేణి ఇవాళ వొళ్ళు మరిచిపోయింది’ అని ఒకరంటే, ‘అదీ సంగతి, కోట్లిచ్చినా కళాశీలిక లాంటి ఆవేశం కలగదు మరి!’ అని మరొక రనుకుంటారు. ‘వేశ్యల కళకు ప్రేరణ డబ్బే’ అన్న లోకపు నమ్మకపు నేపధ్యంలో, కళాకారులకు మాత్రమే అర్ధమయ్యే ఆ కళావేశాన్ని, మైమరుపునూ వేశ్య అలివేణిలో దర్శించిన రచయిత చూపు మనకు కొత్త కోణాలను పరిచయం చేస్తుంది.

డబ్బుతో కొనలేని అంశాలను చిత్రించే అటువంటిదే మరో ప్రయత్నం 1940లలో వచ్చిన కుటుంబరావుగారి కథ, నీకేం కావాలి? లోని కస్తూరి పాత్ర. వేశ్య అయి ఉండీ, డబ్బుకు ఆశ పడని ఆమెలో ఒక మంచితనాన్ని ఊహిస్తాడు కథకుడు. ఆమెను, ఆ గాట్లోంచి ఎత్తి ఇంకో గాట్లో వేసి, సంస్కరించాలనీ, ప్రేమ మీదా, నీతి మీదా అభిమానం పుట్టించాలనీ అతని ప్రయత్నం. మధురవాణి చర్చించిన వేశ్యా వివాహపు సాధ్యాసాధ్యాలను మనం ఈ కథలో చూడవచ్చు. ఎటువంటి ఆడదైనా, తన ఆర్ధిక సమస్యల భారం మోసే మగవాణ్ని – ఎటువంటి వాడైనా సరే, ప్రేమించకుండా ఉండలేదు అని కథకుడి ధైర్యం. అది సమాజం లోని చాలా మంది నమ్మకం కూడా. కానీ కస్తూరి ప్రేమ అమ్మకానికి దొరకనిదని రచయిత మనకు స్పష్టం చేస్తారు. తనను అదుపు చేసే వారిని, బంగారమిచ్చినా కస్తూరి తన గడప తొక్కనీదు. తోటి స్త్రీ లతో పోల్చుకుని తనను తాను తక్కువ చేసుకోదు. ‘ఎవరి గొప్ప వారిదీ’ అంటుంది. తనని గాని, తన వృత్తిని గాని హేళన చేస్తే సహిస్తుంది నిందిస్తే సహించదు – ఆమె ఆత్మాభిమానం అటువంటిది. ఆమెతో సాన్నిహిత్యం పెరిగాక, అతని దురభిమానం పటాపంచలై పోతుంది. ఎట్టకేలకు ఆమె ప్రేమను సంపాదించుకుంటాడు. తన యింటికి వచ్చి ఉండమని ఆహ్వానిస్తాడు. ఆమె తిరస్కరిస్తుంది. ప్రేమబంధానికి కట్టుపడుతుంది కానీ దాని కోసం తన ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టదు. వృత్తి మానేసేటందుకు మనస్ఫూర్తి గా సమ్మతిస్తుంది. తన ఇంట్లో తానుంటాననీ, అతన్నే వచ్చి తన ఇంట్లో ఉండమనీ కోరుతుంది. నీకేం కావాలి? అన్న ప్రశ్నకు సమాధానంగా, ‘నీ మీద ప్రేమ ఉండి, నేనంటే ఇష్టం లేనివాళ్ళను తెచ్చి పెట్టకు, అంత కంటే నా కింకేమీ అక్కర్లేదు,’ అని చెప్తుంది. ధన ప్రలోభాలకీ, సంస్కరణ వాదాలకీ ప్రేమ అతీతమైనదనీ, ఆ ప్రేమ కంటే కూడా అపురూపమైనది ఆత్మగౌరవమనీ ఈ కధలో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆదర్శాలు మనసును మొద్దు బార్చడం బహుశా గురజాడ లాగే కొ.కు. కూడా తన కాలపు సమాజంలో గమనించారనుకోవచ్చు.

సంస్కారాల్లో మౌలికమైన మార్పు రాని వారికి ఆదర్శం వట్టి నోటి మాటగా మిగులుతుందనీ, అటువంటి వారి మనసు సమాజపు ద్వంద్వనీతినే అనుసరిస్తుందనీ, వారు పేరుకే విశాల హృదయులనీ మనకు చూపించే కథ పతితులు (1949.) సంస్కరణ వాదం వేళ్ళూనిందని నమ్మే కాలంలో వచ్చిన గోపీచంద్‌గారి ఈ కథ, ఆరంభశూరులు వేశ్యాకులంలో జన్మించిన వారిని వివాహమాడి వారికి చేసే మేలు కంటే కీడే ఎక్కువని హెచ్చరిస్తుంది. ఇందులో నాయిక, ‘ఒకరి కోసం నీతిగా ఉండం, మన కోసం మనమే ఉండాల’ని నమ్మే వివేకం గలిగిన స్త్రీ. భోగం కులంలో జన్మించిన కారణం చేత సంఘం ఆమె పట్ల అవలంబించిన భేదభావమూ, నడిసముద్రంలో వదిలేసిన భర్త మోసమూ, దానికి కుంగిపోక కుట్టుపని చేసుకుని తన కాళ్ళ మీద తాను నిలబడాలనుకున్న ఆమె ధీరగుణమూ మనకు ఈ కథలో ఆనాటి సమాజపు వాస్తవాలుగా గోపీచంద్ చిత్రించారు. కథానాయిక అక్క పాత్ర నీకేం కావాలి? కథ లోని కస్తూరి పాత్ర లాగానే సంసార స్త్రీల అతిశయానికి చిరాకు పడుతుంది, సమాజం పట్ల ధిక్కారస్వరాన్ని వినిపిస్తుంది.

ఆర్ధిక స్వాతంత్ర్యం స్త్రీకి లేకపోవడాన్ని కుటుంబరావు, గోపీచందుల కంటే ముందే కలం పట్టిన చలం గుర్తించారు. పైగా ఆ అస్వతంత్రతనూ, దాస్య భావాలనూ చూసి మురిసే వారిని ఆయన గర్హించాడు. 1925 లోనే చలం తన స్త్రీ అన్న పుస్తకంలో ఇలా అంటారు: ‘తను ప్రతి దినమూ, నాల్గణాలు సంపాయించుకునే స్త్రీ, దేహమమ్ముకునే వేశ్య – సమస్తాభరణాలతో బనారసు చీరెలతో, కులుకుతూ ధర్మ భర్త పక్కన పదిమంది బిడ్డలతో, గుర్రపు బండిలో పోయే పుణ్యస్త్రీ కన్న పవిత్రురాలూ, స్వతంత్రురాలూ.’ లోకం ఆమోదించనిదీ, లోకం జాగ్రత్తగా కప్పిపెట్టుకున్నదీ బయట పెట్టడం ఆయన రచనల లక్ష్యం.

సంసార స్త్రీ కంటే నయమనే మాట కొంత వరకూ నిజమే కానీ చలం ఊహించినంత స్వతంత్రత వేశ్యా వృత్తిలో కూడా లేదేమో అనిపిస్తుంది. వేశ్యల జీవనాలనూ, నిర్వహణనూ సమాజంలో పెద్దమనుషులుగా చెలామణీ అయ్యే కొందరు నడుపుతూ ఉండేవారు. కందుకూరి కాలంలో సమాజం ప్రోనాచ్, ఏంటి నాచ్ లుగా చీలి పోయింది. ప్రోనాచ్ లని మనం గుర్తించే వారిలో కొన్ని వాదాలను క్లుప్తంగా ఇలా చెప్పుకోవచ్చు.

దేవదాసీలు దేవుని సేవకు అంకితమైన కళాకారులనీ, వారి జీవనోపాధిని తొలగించి వారిని వ్యభిచారులుగా మార్చవద్దనీ వాదించి, వీరేశలింగం గారిని ప్రతిఘటించిన వారిని ప్రోనాచ్ లలో ముందు పేర్కొనాల్సి ఉంటుంది. వారిలో కర్నాటక సంగీత విద్వాంసురాలైన బెంగుళూరు నాగరత్నమ్మ వంటి ప్రసిద్ధులు కూడా ఉన్నారు. కానీ ఏంటి నాచ్ ఉద్యమానికి రాజ్య సహకారం కూడా తోడవడం చేత ప్రోనాచ్ వారి ఈ వాదం నిలదొక్కుకో లేకపోయింది అని మనకు తెలుస్తోంది. మల్లాది రామకృష్ణశాస్త్రిగారి కథల్లో దేవదాసీల గురించీ, వేశ్యావృత్తి గురించీ ఒక భిన్నమైన దృక్పథం కనిపిస్తుంది. శంకరమంచి సత్యం తమ అమరావతి కథలలో దేవదాసీల ప్రాభవాలనూ, జీవితాలనూ మన కళ్ళ ముందుంచారు. పందిరిపట్టిమంచం కథలో చిన ముత్తెం నిస్వార్ధ ప్రణయం కథాంశం.

వేశ్యల జాతి అనాదిగా నృత్యగానాలతో అలరించడానికే ఉన్నదనీ, అది కులవృత్తిగా కలవారు దానినే అవలంబించాలనీ, పెళ్లిపేరంటాలలో వేశ్యలు తిరుగాడితే శుభమనీ, వారిని ఆదరించడం కళాపోషణ అనీ కొందరు అభిప్రాయ పడేవారు. ఇంకొందరు ‘బోగం వారు లేకపోతే సంసార్లు అందరూ చెడిపోతారు’ అంటారని కందుకూరి వారి వేశ్యాభిమానపు బండారం తమ ప్రహసనాల్లో బయటపెట్టారు. వేశ్యా వృత్తిని అంటి పెట్టుకుని బ్రతకడం – వేశ్యలతో మేజువాణీ లను చేయించడం, ఆ బృందాలను నడపడం వంటి పనులు చేసే వారి గురించిన చిత్రణ కూడా కందుకూరి సాహిత్యంలో మనకు లభిస్తుంది. ‘వేశ్యలకు యెంత జనవశ్యం ఉన్నదో వేశ్యల మూలంగా ఆయనకూ అంత జనవశ్యం ఉన్నది,’ అని అటువంటి వారికి సమాజంలో ఉండే పలుకుబడికి కారణాలను విశదీకరిస్తారు. వేశ్యావృత్తి సమర్ధకులకు ఒక ఉదాహరణ మనకు కరటక శాస్త్రి వంటి వారి రూపంలో కన్యాశుల్కంలో కూడా కనిపిస్తుంది. కాపు మనిషినై పుట్టినా బాగుండునని అనుకుంటున్న మధురవాణి విరక్తి అర్ధం కాని కరటక శాస్త్రి ఆమె వంటి ‘వేశ్యా శిఖామణి లేకపోతే భగవంతుడి సృష్టికే లోప’మంటూ మెరమెచ్చు మాటలు చెప్తాడు. అలాటి మాటలు విని విని ప్రాణం విసిగి ఉంటుంది, సృష్టి సంగతికేం గానీ చిక్కులలో మీకు లోపం వస్తుంది లెమ్మని అతని స్వార్ధ ప్రయోజనాలను మధురవాణి బయట పెడుతుంది.

కన్యాశుల్కం నాటకంలో గురజాడ మధురవాణిని స్త్రీజాతికి మకుటాయమానంగా తీర్చిదిద్దినది ఎంత వాస్తవమో, ఆ పాత్రలో అంతర్లీనంగా వృత్తి పట్ల ఆమెకు కలుగుతున్న విరక్తీ, కుటుంబ జీవనం సాగించాలన్న ఆమె కాంక్షనూ అంతే ఆర్తితో చిత్రించారన్నది వాస్తవం. శ్రీపాద వారి వడ్లగింజలు కథలో కళాకోవిదుల జీవితాలతో పాటూ, శంకరప్ప మనసు కలిచేసి అతని ఆటను పాడు జేయడానికి ముగ్గురు వేశ్యలు నియామకం కావడం మనం చూడవలసిన చేదు వాస్తవం. వేశ్యల పాటి స్వతంత్రత కుటుంబ స్త్రీలకు లేదని చలం, కుటుంబరావు ఆవేదన వ్యక్తం చేసిన మాట నిజమే కానీ ప్రేమ బంధమే స్త్రీ పురుష శరీర సంపర్కానికి ప్రాతిపదిక కావాలని వారు కూడా స్పష్టం చేసి ఉన్నారు. ‘భార్యలూ ఉండాలి, వేశ్యలూ ఉండాలి’ అని కోరే పురుషుల సంస్కారాన్ని అసహ్యించుకుంటారు గోపీచంద్.

1947లో దేవదాసి ఆక్ట్ వచ్చి ఆ కులవృత్తి రద్దయిన తర్వాత, పేదరికంతో పాటూ, తోటి స్త్రీల అసూయా ద్వేషాలకూ, పోలీసుల జులుంకీ, ఊరి పెద్దల నిరసనకూ గురై దేవదాసీల జీవితాలెలా అస్తవ్యస్తమయ్యాయో తెలియజేసే ఉమామహేశ్వరరావు గారి కథ – నోరు గల్ల ఆడది (2010) ప్రోనాచ్ వారు హెచ్చరించిన విధంగానే ఆనాడు దేవదాసీల పునరావాసాల్లో అన్యాయం జరిగిందని మనకు తెలియజేస్తుంది.

ఈనాటికీ సమాజపు అంచుల లోని కొందరు స్త్రీలు వ్యభిచారం చేసి పొట్ట పోసుకుంటున్నారన్నది వాస్తవం. సంస్కరణ వాదం ఆ కాలపు సమాజం లో చైతన్యం తెచ్చిన మాట నిజమే అయినా సమస్య లోతుల్లోకి అది వెళ్ళలేకపోయింది. ప్రస్తుతం ఆవృత్తి వారసత్వంగా అందకపోయినా, వారసత్వంగా అందే పేదరికం ఆ స్త్రీలను చాలా సులభంగా అటు వైపు తోస్తుంది. ‘కమర్షియల్ సివిలైజేషను’ అని రావిశాస్త్రిగారు పిలిచిన స్వాతంత్ర్యానంతరపు భారతంలో వేశ్యావ్యవస్థ కొత్త రూపం తెచ్చుకుంది. కులవృత్తి అనే ఆచ్చాదన తొలిగిపోయాక, నియమిత వెల లేని వస్తువూ, తనని తానే అమ్ముకోవాల్సిన వస్తువుగా శరీరసౌఖ్యం అందించే పరికరంగా స్త్రీ శరీరం మారిన విధానం నగ్నంగా మన కళ్ళ ముందుకొచ్చింది. అలా ‘అమూల్యమైన దానికి మూల్యం నిర్ణయించే’ పాపానికి ఆవేదన చెందుతూ 1949లో వచ్చిన కథ, రావిశాస్త్రి గారి విలువలు.

స్త్రీ తన శరీరాన్ని గతిలేక అమ్ముకుంటుంటే, చట్టం ఆమెకు రక్షణ కల్పించక పోగా, ‘టేరిబుల్ న్యూసెన్సు అనీ, కమ్చీతో కొట్టాలనీ’ పోలీసులు సాగించే జులుం, 1961లో రావిశాస్త్రి గారిని ఆరు సారా కథల్లో ఒకటైన న్యాయం అనే కథ రాసేందుకు ప్రేరేపించింది. నూకరాజు కంపెనీ నుంచి ఆమెను కొందరు షిప్పు లోంచి దిగిన ముష్కరులు ఒక రాత్రికని కొనుక్కుంటారు. తాగించి, క్రూర జంతువుల్లా హింసించి, పోలీసు స్టేషను ముందు ఒళ్ళు తెలియని ఆమెను నగ్నంగా పడేసి పోతారు. పోలీసులు కబురు పెడితే కంపెనీ ఓనరు బట్టలు మాత్రం పంపి ఊరుకుంటాడు. పోలీసులు ఆమెపై న్యూసెన్సు కేసు పెడతారు. జడ్జీ ఆమెను నేరం చేసేవా? అని అడిగితే కేసు ఒప్పేసుకుంటానండీ అని జవాబు ఇస్తుంది. ‘ఈ పన్లు చేసుకోడం వారి బతుకు, వారిని పట్టుకోడం మా బతుకు, ఏ బతుకు బతికే వారు ఆ బతుకు బతకాలి కదా’ అని వేదాంతం చెప్పే హెడ్డు మాటలకు గుండెలు పగిలి ఆ స్త్రీ మెజిస్ట్రేటు ముందు ‘నా కొద్దీ బతుకు, నన్ను చంపేయండి’ అంటూ విలపించే సన్నివేశం ఆ వృత్తి లోని ఘోరాన్ని ఎలుగెత్తి చాటుతోంది.

1969లో వచ్చిన కాళీపట్నం రామారావుగారి కథ, హింస – పదేళ్లకు మించని సంగి కోణం నుండి వ్యభిచారుల కుటుంబాల వ్యధనూ, నిస్సహాయతనూ చిత్రిస్తుంది. సంగి తల్లి ఆవాల జగ్గమ్మ, తన పెద్ద కూతురు పైడమ్మకు పాతూరి గొల్లల సంబంధం చేసింది. అత్త వారు ఆమెను పొగాకు పనులకు పంపేరు. పొగాకు పందిళ్ళలో చెడిపోయి, కాపురమూ చెడి, భయపడి పైడమ్మ పట్నం పోయింది. మొదట మోసానికి లొంగిన మనిషి బలవంతానికి పడిపోయింది. ఆ పడ్డం, పడ్డం దిగజారి దిగజారి సబ్బారపు సంజీవమ్మ కంపెనీలో తేలింది. వ్యభిచారంలో దిగబడిపోయిన అప్పను ఇక పైకి లాగలేమని తీర్పునిస్తుంది బంధుగణం. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోతుంది తల్లి, కనబడని శత్రువు మీద యుద్ధం ప్రకటిస్తుంది చెల్లి. జరగవలసిన దానికీ, జరిగిన దానికీ మధ్య ఉన్న అగాధాన్ని చూపించడం కారా గారి శిల్పం. కులవృత్తిని రూపుమాపామని ఒక వైపు చెబుతూ, మరోవైపు కుటుంబపు తోడూ నీడా లేకుండా ఒక అమానవీయమైన వాతావరణాన్ని కృత్రిమంగా తయారు చేసి, దురదృష్టం కొద్దీ దానిలో చిక్కుకున్నవారిని దానిలోనే మగ్గమని చేతులు దులుపుకుంటున్న సమాజానికి, అది సాగిస్తున్న హింసను అద్దం లో చూపించడం – రామారావు గారి దృక్పథంగా మనకు కనిపిస్తుంది. అటువంటి దురదృష్టవంతులను తిరగబడమని ఉద్బోధించడమే ఆయన ఆశయం.

పైడమ్మ జీవితమే కథాంశం అయినా నోరులేని పాత్రలా ఆమె కేవలం సాక్షిగా మిగిలి ఉంటుంది. ఆ మూగ బాధకు ప్రతిస్పందన యిదా అన్నట్టూ నోరు గల్ల ఆడది కథ లోని స్వర్ణ ఏటికి ఎదురీదుతుంది. ‘ఆ నోరు బెట్టుకోకపోతే యీ వూళ్ళో నిలవనీడుణ్ణా ఆ యమ్మికి? యీ పొద్దుటికి గూడా ఆయమ్మి మానంగా బతకతా వుండాదంటే ఆ నోటివల్లనే గదా నాయినా…’ అంటూ అవ్వ స్వర్ణక్క గురించి చెప్పిన మాటలు సమాజాన్ని ఎదుర్కునే తరుణోపాయం లాగా కనిపిస్తాయి.

1969లో వచ్చిన రంగనాయకమ్మ గారి అంధకారంలో అనే నవల వేశ్యల దుర్భర జీవితాలను వివరంగా చిత్రీకరించింది. అప్ప చెల్లెళ్ళ నిస్సహాయత హింస కథలో మనకు కారా వారు చూపిస్తే, ఈ నవలలో, అక్కా తమ్ముళ్ళ మధ్య తలవని తలంపుగా జరిగిన ముఖాముఖీ మనను నిశ్చేష్టులను చేస్తుంది. రాజేశ్వరి తల్లిపోయాక, సవతి తండ్రి తనపై చేసిన దురాగతం వల్ల పట్నం వచ్చి వ్యభిచారం పాలౌతుంది. పద్దెనిమిదేళ్ళ సవతి తమ్ముడు రమణ బ్రోతల్ హౌస్ లోకి వస్తాడు. అక్కడ అక్కను గుర్తించి తల ఎత్తలేకపోతాడు. ‘ఎంత పాపం తప్పిందక్కా’ అని ఏడుస్తున్న తమ్ముడికి బుద్ధి చెప్తూ ‘నేనేనా అక్కని? ఇక్కడి ఆడవాళ్ళందరూ అక్కలూ చెల్లెళ్ళూ కారా? అదంతా పాపం కాదా?’ అని అడిగే రాజేశ్వరి ప్రశ్నకు సమాజమే సమాధానం చెప్పాలి. వారి జీవన స్థితి గతులపై రచయిత ఆవేదననూ, దృక్పధాన్నీ ఈ వాక్యంలో మనం అర్ధం చేసుకోవచ్చు: ‘రోడ్డు పక్క కంపుకొట్టే యూరిన్ దొడ్డిలా, శారీరక కామాన్ని నివారించుకునే మరుగు దొడ్డి ఆ బ్రోతల్ హౌస్!’

1975-78 మధ్య వచ్చిన పెద్దిభొట్ల సుబ్బరామయ్యగారి కథల్లో కటిక పేదరికం కారణంగా ఆ వృత్తికి చిక్కుకున్న స్త్రీలు మనకి తెలియని వారి చరిత్రలు వివరిస్తారు. చీకటి అనే కథలో కనీసం ఒక పావలా అప్పు దొరికితే కాసిని టీనీళ్లు తాగుదామని ఆరాటపడుతున్న సావిత్రి జీవితం కంటిక్కడుతుంది. తల్లి కాయకష్టం చేసి ఆమెను పెంచింది కానీ సావిత్రికి ఈ శాపగ్రస్త జీవితం తప్పించలేకపోయింది. రెక్కాడితే కానీ డొక్కాడని జీవితం కనుక కర్ఫ్యూ రోజుల్లో పైసా సంపాదన దొరక్క ఆకలికి మలమల మాడి పది రూపాయలు అప్పు తీసుకుంటుంది. వడ్డీగా ఆమె శరీరం శిథిలమైపోతున్నా ఆ అప్పు మాత్రం అలాగే ఉండడమనేది, ఆ వృత్తిలో ఉండేవారి జీవితాలకు ప్రతీకగా తోస్తుంది. ‘తనకు పాపపు బ్రతుకిచ్చిన దేవుడు పైనుండి వసూలు చేస్తున్న వడ్డీ లాంటి చీకటి’ అనే వాక్యం సమాజం వీరి నుండి అనాదిగా వసూలు చేస్తున్న అధర్మ వడ్డీని మనకు గుర్తు చేస్తుంది. మరో కథ, సతీ సావిత్రి, వేశ్యల వృత్తి లోని పరాధీనతకు చరమ సీమలను చూపిస్తుంది. ఏ ‘కంపెనీ’ లోనూ చేరకుండా తన ఒళ్లమ్ముకున్న డబ్బు తాను తిందామనుకోవడమే పేరాశ ఔతుంది ఈ సావిత్రికి. ఒక పసిబిడ్డ తల్లిగా కనిపిస్తే, కాస్త సులభంగా వృత్తి చేసుకోవచ్చని ఊహిస్తుంది. ఐదు నెలల పసికందు తల్లికి తనింటిలో ఆశ్రయమిస్తుంది. ఆ బిడ్డను రాత్రిపూట ఎత్తుకుని రోడ్డెక్కుతూ ఉంటుంది. దురదృష్టం! ఒకనాడు ఆ పసిగుడ్డుతో సహా దొరికిపోతుంది. లాకప్‌లో బిడ్డ ఆకలితో రాత్రంతా గగ్గోలు పెడుతుంది, కన్నతల్లి కాదు కనక పాలివ్వలేని అసహాయతతో సావిత్రి కుమిలిపోతుంది. ఓడిపోయి మాణిక్యం కింద వృత్తి చేసుకు బ్రతికేందుకు ఒప్పుకుంటుంది, అప్పుడు మాణిక్యం జరిమానా చెల్లించి ఆమెను బయట పడేస్తుంది. అతి కష్టం మీద పసిబిడ్డను ప్రాణాలతో తల్లికి ఒప్పచెప్పిన సావిత్రికి తన దురదృష్టం తలుచుకుని ఏడుపు పొంగుకొస్తుంది.

వేశ్యల దుస్థితి ఇలా దిగజారుతూనే ఉండగా, ఈ శతాబ్దారంభంలో ఎయిడ్స్ మహమ్మారి వీరి జీవితాలను అతలాకుతలం చేసింది. ఈ పరిణామాన్ని, దాని పర్యవసానాలనూ 2001లో కుప్పిలి పద్మ, కొత్తచావు అనే కథలో వర్ణించారు. వేశ్యల దుస్థితికి అసలు కారణాలు – అవకాశవాదుల దురాశ, ఆకలి, దరిద్రం, చట్టం పేరుతో జరిగే హింస; వీటితో – మందు లేని ఎయిడ్స్ వ్యాధిని పోల్చడం చాలా సరైన ఉపమానమనిపిస్తుంది. దారిద్ర్యం కొందరికి ఆ వృత్తిని తప్పనిసరిగా చేస్తే, వారితో బిజినెస్ నడిపే కంపెనీలు దాని నుండి బయట పడాలనుకునే వారిని అడ్డుకోడం ఈ కథలో మనం చూస్తాం. సమాజం మీది తిరుగుబాటు ధోరణీ, అంతటి వ్యాధి పైబడినా బ్రతుకు మీది తీపితో వేశ్యాగృహం లోంచి బయటపడాలని వారి ప్రయత్నం లోని ఆశావాదమూ – ఈ కథలోని ప్రత్యేకతలు.

మానవ సమాజంలో – ఆకలి కన్నా, అధిక శ్రమ కన్నా, నిరుద్యోగం కన్నా, కులం కన్నా, అన్నిరకాల దురంతాల కన్నా – అతి క్రూరమైన, అతి నీచమైన దురంతం వ్యభిచారం. వేశ్యావృత్తి అలాగే కలకాలం వర్ధిల్లాలనే కోరుకునేవారు సమాజంలో ఈనాటికీ ఉండనే ఉన్నారు. వ్యభిచరించడమనేది ప్రజల స్వంత విషయమని వీరి వాదం. దానికి వీలు కల్పించే వేశ్యా వృత్తి కూడా అన్ని వృత్తుల వంటిదేనని వీరి నమ్మకం. కొందరు సమ్మతించి ఆ వృత్తిలో ప్రవేశిస్తే సమాజం వారిని నీచంగా చూడడం అన్యాయమనీ, దానికి మిగిలిన వృత్తులతో సమానమైన గౌరవం కల్పించాలనేది ఆధునికమైన వేశ్యావృత్తి సానుభూతిపరుల లక్షణమని చెప్పుకోవచ్చు.

కానీ దీనిలో ఉన్నవారు అత్యధిక శాతం నిరుపేదలనీ, మరొక దారి దొరక్క కొందరూ, ఎదురు తిరగడానికి ధైర్యం చాలక ఆ వృత్తిని మోస్తున్నవారు మరికొందరూ, పారిపోయే ప్రయత్నాలు ఫలించక అణచివేతకు గురౌతూ ఇంకొందరూ – ఈ వృత్తిని సాగిస్తున్నారనీ, తమ ఇష్టంతో వారక్కడ జీవించడం లేదనీ ఈ సాహిత్య కారులు భావిస్తున్నట్టు అనిపిస్తోంది. ఆకలికి ఆగలేని పసివాడు ఎంగిలాకుల్లోంచి అన్నం ఏరుకోబోతూ ఉంటే, ఒక కుక్క అతని చేతిలో నుండి ఆ అన్నం లాక్కోబోయే చందంగా పోలీసులూ, గూండాలూ వేశ్యలను వేధిస్తున్నారన్నది అందరూ ఏకగ్రీవంగా అంగీకరించే వాస్తవం. కానీ ఎంగిలాకులు ఏరుకునే దుస్థితిలో తమను ఉంచుతున్నందుకు సమాజం బాధ్యత వహించాలని పోరాటం సాగించే బదులు, కుక్కలు లేకుండా పోతే మాకంతకంటే ఇంకేమీ అక్కరలేదనే వాదం ఎంత తెలివి మాలినదో, ఈ ఆధునిక సానుభూతి ధోరణులు అంత ప్రమాదకరం.

వాస్తవంగా ఎదురయ్యే సమస్యలను పుస్తకాలు ఏం తీరుస్తాయన్న సంశయం కొంతమందికి కలగవచ్చు. మనుషుల జీవితాల లోని వాస్తవ సంఘర్షణ వెనుక నైతిక, ధార్మిక సమస్యలు విధిగా ఉంటాయి. అవి ఎంత ఎక్కువగా చర్చ లోకి వస్తే సమస్యా పరిష్కారానికి అంత దగ్గరౌతాం. ‘వ్యభిచారం అనేది కుట్టు పనీ, నేతపనీ, వడ్రంగం వంటి వృత్తే ఐతే, ఆ వృత్తుల్లాగే ఇది కూడా సమాజానికి ఎప్పుడూ కావాలి. కానీ సెక్స్ అనేది శరీర ధర్మం. శరీర ధర్మాలేవీ శ్రమలు కావు, వృత్తిగా కనపడే ప్రతీదీ వృత్తి కాదు,’ అని ఈ సమస్య పై రంగనాయకమ్మ తమ అభిప్రాయం చెప్తారు.

వేశ్యావృత్తిలో ఉన్న వారి పట్ల సానుభూతినీ, వారి వ్యక్తిత్వం పట్ల గౌరవాన్నీ ప్రకటించిన రచయితలు తమ కాలం లోని ప్రజా బాహుళ్యపు విశ్వాసాలకు భిన్నమైన దృక్పథాలతో రచనలు సాగించారు. వీరందరూ ఇటువంటి ప్రత్యేక వ్యక్తిత్వంతో సృష్టించిన వేశ్యల పాత్రల ద్వారా మనకు తెలిసేది ఏమిటంటే అసహజమైన వృత్తిని సమాజం వారిపై రుద్దింది కానీ సహజసిద్ధమైన వారి విలక్షణతలను రూపు మాపలేకపోయింది అని. మానవత్వానికీ, న్యాయవర్తనానికీ, ఆత్మగౌరవానికీ, కళాభిమానానికీ ప్రతీకలుగా వేశ్యలను కొందరు దర్శిస్తే, ఆ చీకటిరాజ్యంలో చిక్కుకుని వెలుగు లోకి వచ్చే అవకాశం కోసం వారి ఆరాటాన్నీ, పోరాటాన్నీ మరి కొందరు చిత్రించారు. ఈనాడు వ్యభిచారం మునుపటి కంటే మరింత భయంకరమైన పరిస్థితులను కల్పిస్తూ ఉంటే, సమస్య మరింత క్లిష్టమైపోయి, వేశ్యలు వారి కథ వారే చెప్పుకున్న సందర్భంలో ఈ రచయితల స్పందనను మరొక్కసారి పరామర్శించవలసిన అవసరం ఉంది.

సెక్స్‌ని అమ్మే, కొనే పరిస్థితులు సమాజంలో పోతేగానీ ఈ సమస్య పూర్తిగా సమసిపోదు. ముందు ముందు అలాటి స్వప్నం సిద్ధించిన నాడు ఈ వృత్తిని తప్పనిసరై చేసుకునేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోవచ్చు. కానీ అంతవరకూ ఆ వలయంలో చిక్కుకుని బయట పడాలనుకునే వారికి తగిన పునరావాసమూ, వృత్తిని తప్పనిసరియై సాగిస్తున్నవారికి తగిన సామాజికన్యాయమూ అందాలనేదే ఈ సాహిత్యకారుల ఆకాంక్ష అని మనం అర్ధం చేసుకోవాలి.
[ఈ వ్యాసపు సంక్షిప్త రూపం డిసెంబర్ 7, 2015 ఆంధ్రజ్యోతి వివిధలో ప్రచురించబడింది -సం.]
-----------------------------------------------------------
రచన: ఎస్. జె. కల్యాణి, 
ఈమాట సౌజన్యంతో 

Tuesday, September 18, 2018

ఒక వెచ్చని హెచ్చరిక


 ఒక వెచ్చని హెచ్చరిక





సాహితీమిత్రులారా!



వెచ్చని హెచ్చరికేమిటో చూడండి.....

ఉ. “ఒక్కొకరోజు తక్కువగుచున్నది మీ బ్రతుకంచెరుంగలే
      రొక్కొరొకో! యిదేటి కునుకో!” యని వెచ్చని హెచ్చరింపుగా
      కొక్కొరొకో యటం చదిగొ కూయుచునున్నది కోడి పాకపై
      కెక్కి, లతాంగి మేలుకొనవే! కొనవే మధుపూర్ణపాత్రమున్

ఏడాదికి మనకి రెండు కొత్త సంవత్సరాలు! ఒకటి ఉగాదికి మొదలయ్యే తెలుగు సంవత్సరమయితే, మరొకటి యీ జనవరి ఒకటిన మొదలయ్యే న్యూ ఇయర్. ఒకో రోజూ ఒకో రకమైన ఆలోచనలూ అనుభూతులూ మోసుకు వస్తుంది! ఉగాది అనగానే లేత మావిడి చిగురులూ, వేపపూతలూ, కోకిల పాటలూ, కవిసమ్మేళనాలూ, తెలుగు లోగిళ్ళలో తొలి పండగ సంబరాలు. కాలచక్రం మరో ఆవృత్తిని పూర్తి చేసిన భావన. అదే జనవరి ఒకటైతే, గడచిన ఏడాది విశేషాల తలపోతలూ, కొత్త సంవత్సరపు సంకల్పాలూ, స్నేహితులకి యిచ్చిపుచ్చుకొనే శుభాకాంక్షలూను. కాలప్రయాణంలో ఒక మైలురాయి దాటి మరొక దాని దిశగా ముందుకు సాగుతున్న భావన. జనవరి ఒకటి అనగానే కాలప్రవాహాన్ని గురించిన ఆలోచనలే నా మనసులో ఎప్పుడూ సుడులు తిరుగుతాయి. ఉమర్ ఖయామ్ గుర్తుకు వస్తాడు. అతని రుబాయీలు గుర్తుకు వస్తాయి.

ఖయామ్ రుబాయీలకు తెలుగులో దాదాపు పాతిక పైగా అనువాదాలున్నాయి. ఆదిభట్ల నారాయణదాసు, ఉమర్ ఆలీషా, దువ్వూరి రామిరెడ్డి, కరుణశ్రీ, బుచ్చి సుందరరామశాస్త్రి – వీరి అనువాదాలను మాత్రం నేను చదివాను. ఇందులో మొదటి ముగ్గురూ నేరుగా పారసీ రుబాయీల ఆధారంగా అనువాదాలు చేశారు. మిగతా అందరికీ Fitzgerald చేసిన ఇంగ్లీషు అనువాదమే ఆధారం. వీటన్నిటిలో ఏది గొప్పదని చెప్పడం సాధ్యం కాదు, దాని అవసరమూ లేదు. ప్రతి అనువాదంలోనూ కొన్ని ఆణిముత్యాలున్నాయి. కరుణశ్రీ గారంటే కాస్తంత ఎక్కువ అభిమానం కాబట్టి ఆయన పద్యాన్ని ఇవాళ ఎంచుకున్నాను.

ఈ పద్యానికి అర్థాన్ని విడమరచి చెప్పాల్సిన అవసరం లేదు. కరుణశ్రీ పద్యాలు ఒలిచిపెట్టిన పనసతొనల్లా ఉంటాయి. నోటికానుతూనే కమ్మగా కరిగిపోతాయి. భావం కూడా సుగమమే. కోడి కూత నెపంతో, కరిగిపోయే కాలాన్ని గురించి హెచ్చరిస్తున్నాడు కవి. కాలం క్షణక్షణం గడచిపోతోందనీ, అలా గడచిన కాలం తిరిగి రాదనీ మనందరికీ తెలుసు. అయినా చాలాసార్లు ఆ సంగతి మరిచిపోతూ ఉంటాం. అనవసరమైన ఝంఝాటాలలో యిరుక్కుపోయి, మనం బాధపడుతూ పక్కవాళ్ళని బాధపెడుతూ ఉంటాం. ఇది తెలివిమాలినతనం కాక మరేమిటి! అందులోంచి బయటపడి, తెలివి తెచ్చుకొని, జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని పిలుపునిస్తున్నాడు కవి. అయితే ఆ ఆనందమయపాత్రని ఎవరికి వాళ్ళు వెతుక్కోవలసిందే!

కోడి కూతకి భాష్యాన్ని మాత్రమే చెప్పాడు ఖయామ్. కరుణశ్రీ తన పద్యంలో ఆ కూతని వినిపించారు కూడా! తెలుగు పద్యంలో కోడి కదా, అంచేత అది ‘కొక్కొరోకో’ అని కూసింది. పైగా ఒక్కసారి కాదు మూడుసార్లు! పద్యం మొదలుపెడుతూనే ఒక్కొకరోజు అన్న పదబంధంలోని కకార రకారాలు మనకా కూతని వినిపిస్తాయి. అలాగే రెండో పాదంలో లేరు + ఒక్కరు + ఒకో అన్న పదాల కలయికలో రెండో సారి, మూడో పాదంలో నేరుగా కొక్కొరొకో అని మూడోసారి వినిపిస్తుంది. ఇలా, చెపుతున్న భావాన్ని శబ్దాలతో పలికించడాన్ని ఇంగ్లీషులో onomatopoeia అంటారు. సంస్కృతాలంకారికులు దీనినే వికటత్వము అనే గుణంగా గుర్తించారని ‘కవిత్వము – వికటకవిత్వము’ వ్యాసంలో శ్రీ ఉపాధ్యాయుల అప్పలనరసింహంగారు వివరిస్తారు. ‘శబ్దం అర్థానికి ఊడిగం చెయ్యాలి,’ లాంటి మాటలు వట్టి వైపరీత్యపు మాటలు. ‘శబ్దార్థౌ సహితౌ కావ్యం’ అని లక్షణ పద్ధతిలో భామహుడు చెప్పినా, ‘వాగర్థావివ సంపృక్తౌ’ అని కవితాత్మకంగా కాళిదాసు చెప్పినా, మన కవిత్వ సంప్రదాయంలో శబ్దార్థాలకి సమప్రాధాన్యం ఉంది. వికటకవిత్వం అన్న పదానికి కాలక్రమంలో నిందార్థం వచ్చింది కానీ ప్రాచీన ఆలంకారికుల దృష్టిలో వికటాక్షరబంధం ఒక కవిత్వ గుణం. భావాన్ని మింగేయనంత వరకూ శబ్ద చమత్కారం కవిత్వానికి సౌందర్యాన్ని అందిస్తుంది. ఈ పద్యంలో అది అనువాదానికి ఒక కొత్త అందాన్ని తీసుకువచ్చింది. ‘మేలుకొనవే, కొనవే’ అనడంలోని యమకం కూడా పద్యానికి సొగసునిచ్చింది. ‘వెచ్చని హెచ్చరింపు’ అన్న పదబంధంలోని శబ్దార్థాల సంయోగం మనసుని పట్టేస్తుంది.

ఇక్కడ కవిత్వానువాదం గురించి కొంచెం ముచ్చటించుకోవాలి. ఒక అనువాదం మంచి అనువాదం కావాలంటే ముందుగా అది అనువదింపబడిన భాషలో మంచి కవిత్వం అయి ఉండాలి. అనువదింపబడిన భాషలో అది మంచి కవిత్వమా కాదా అని నిర్ణయించడానికి మూలంతో పనిలేదు. అసలలాంటి విచారం చేసేటప్పుడు మూల ప్రసక్తి తీసుకురాడం సమంజసం కాదని నా అభిప్రాయం. అనువాదం మంచి కవిత్వమని నిర్ధారించుకున్నాక, అది మంచి అనువాదమా కాదా అన్న విశ్లేషణ మొదలవుతుంది. మూలంలోని భావం స్పష్టంగా ఉన్నప్పుడు, అది అనువాదంలో కూడా పూర్తిగా ప్రతిబింబించాలి. ఒకవేళ మూలంలో అస్పష్టతకి అవకాశం ఉన్నట్లయితే, అనువాదం మరికాస్త మెళకువగా చేయాల్సి ఉంటుంది. దాని గురించి ప్రస్తుతం వివరాల్లోకి పోదల్చుకోలేదు. మంచి అనువాదంలో ముఖ్యంగా ఉండాల్సిన మరో గుణం – మూల కవిత్వంలో ఉండే ధ్వనిని అనువాదంలో కూడా పొందుపరచగలగడం. అలా పూర్తిగా పొందుపరచ లేకపోయినా, దాన్ని వాచ్యం చేయకుండా ఉండాలి. నా దృష్టిలో మంచి అనువాదానికి ఉండాల్సిన లక్షణాలివి. మూలంలో లేని అంశాలు అనువాదంలో అదనంగా ఏమైనా వస్తే, అవి మూల భావాన్ని చెడగొట్టకుండా మరికాస్త కాంతివంతం చేసేలా ఉండడం ముఖ్యం. అంతేకాని మూలభావాన్ని మక్కీకి మక్కీగానే అనువదించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి – ఈ పద్యంలో కనిపించే ‘మేలుకొనవే, కొనవే మధుపూర్ణపాత్రమున్’ అనే భావం మూల పారసీ రుబాయీలో కాని, Fitzgerald ఆంగ్లీకరణలో కానీ లేదు. ఇది కరుణశ్రీ చేసిన కొనసాగింపు. ఇతర ఖయాము రుబాయీలలో ఈ భావం కనిపిస్తుంది కాబట్టి ఇందులో కూడా దాన్ని చేర్చడంలో అనౌచిత్యం లేదు. అలాగే ‘హెచ్చరింపు’కి వాడిన వెచ్చదనపు విశేషణం కూడా కరుణశ్రీ చేర్చినదే. ఇది కూడా అనువాదానికి అందాన్ని తెచ్చిన చేర్పే. కరుణశ్రీ చేసిన అనువాదాలన్నీ మేలైనవని నేను అనను కాని యీ పద్యం మాత్రం నా దృష్టిలో చక్కని అనువాదమే.

ఖయామ్ కవిగా కన్నా తన కాలంలో ఖగోళ జ్యోతిష్య శాస్త్రవేత్తగానే చాలా ప్రసిద్ధుడు. అల్‌జబర్ (మనకిప్పుడు తెలిసిన ఆల్‌జీబ్రాకి మూలం ఇదే!) అనే గణితగ్రంథాన్ని రచించిన గొప్ప గణితశాస్త్రజ్ఞుడు కూడా. ఖయామ్‌ది వైవిధ్యభరిత వ్యక్తిత్వం. అతడొక శాస్త్రవేత్త, తత్త్వవేత్త, కవి. అందుకే తార్కికత, తాత్వికత, మార్మికతల విశిష్ట సంగమం అతని రుబాయీలు. అతని రుబాయీలలో కాలాన్ని గురించిన ప్రస్తావన ఎక్కువగానే కనిపిస్తుంది. కాలం, పగలు రాత్రి అనే కత్తెరతో మనిషి ఆయువు అనే వస్త్రాన్ని నిరంతరం కత్తిరించేస్తుందని అంటాడు ఒక చోట. ‘గతము గతంబె యెన్నటికి కన్నుల గట్టదు, సంశయాంధ సంవృతము భవిష్యదర్థము’ – కాబట్టి వర్తమానం ఒక్కటే నిజమైనదీ, అనుభవించ దగినదీ అంటాడు. ‘అయయో! యెందఱి మానవోత్తముల కంఠారావుముల్ ద్రుంచె నిర్దయమౌ కాలము,’ అన్న ఖయాము మాటలకు, ‘కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిన్ బొంగరే! వారేరీ సిరి మూటగట్టుకొని పోవన్ జాలిరే,’ అన్న పోతన పలుకులు ప్రతిధ్వనుల్లా వినిపిస్తాయి. కొన్నిచోట్ల కాలంపై తన నిరసన ఘాటుగా వ్యక్తపరుస్తాడు. ‘కాలమ! నీవు నీ కపట కారణమున్ బ్రకటించి యీ జగజ్జాలము మ్రింగుచుంటివి,’ అంటాడు. మరికొన్ని చోట్ల, ‘ఆది మధ్యాంత రహితమై అలరుచుండు కాలయవనిక భేదింపగలమె మనము!’, ‘సమయపుపాత్ర లోతు గన శక్యముగాదు’ – అంటూ కాల మహత్వాన్ని గురించి తలచి ఆశ్చర్యపడతాడు. మొత్తమ్మీద చూస్తే, కాలగతిని ఖయాము సరళరేఖగానే దర్శించినట్టుగా నాకు అనిపిస్తుంది.

గతించే కాలాన్ని గురించి ఖయాము చేసిన హెచ్చరిక, వ్యక్తిగా ప్రతి మనిషికే కాకుండా, మొత్తంగా మానవజాతికి కూడా అన్వయించుకోవచ్చు. మొత్తం సృష్టిలో ఒకానొక జీవిగా మన మానవజాతి ఆయుఃప్రమాణమెంత? దాన్ని మనం ఎంతవరకూ సద్వినియోగం చేసుకుంటున్నాం? బుద్ధిజీవులమైన మనం ఆ బుద్ధిని దేనికోసం ఉపయోగిస్తున్నాం? జారిపోయే కాలం విలువని తెలుసుకోనీయకుండా ఏయే ఉన్మాదాలు మన బుద్ధిని ఆక్రమించేస్తున్నాయి? మతోన్మాదం, మదోన్మాదం, ధనోన్మాదం, అధికారోన్మాదం – ఎన్నెన్నో ఉన్మాదాలు! క్యాన్సరు కణాలు ఒక జీవిలోని మిగతా కణాలను మాత్రమే నశింపజేస్తాయి. మనిషి తన సాటి మనుషులనే కాకుండా ప్రకృతిని కూడా నాశనం చేస్తున్నాడే, తన మితిమీరిన స్వార్థానికి. గతించిపోతున్న ఒక్కొక్క సంవత్సరంలో కాలశరీరం మీద ఎన్నెన్ని దురాగతాల మచ్చలని వదలివెడుతున్నాడు మనిషి! మనసుపెడితే, ఈ విషయాలన్నీ ఆలోచించమనే వెచ్చని హెచ్చరిక, ప్రతి కోడికూతలోనూ వినిపిస్తుంది. కనీసం కొత్త ఏటి మొదటిరోజైనా మనం దాన్ని విందాం. వ్యక్తులుగా మన మన ఆనందం కోసం చేసే వెదుకులాట వ్యష్టిగా సాగినా, ఒక జాతిగా, మానవమనుగడలోని ఆనందం కోసం, దాన్ని అందిచ్చే మధుపాత్ర కోసం, మనమందరం సమష్టిగా అన్వేషించాల్సిన అవసరం ఉందేమో అని నాకనిపిస్తుంది. ఆ అన్వేషణలో ఒక అడుగైనా ముందుకు వేస్తామన్న శుభాకాంక్షతో యీ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం!
--------------------------------------------------------
రచన: భైరవభట్ల కామేశ్వరరావు, 
ఈమాట సౌజన్యంతో 

Monday, September 17, 2018

అద్దెకిచ్చి చూడు(కథ)


అద్దెకిచ్చి చూడు(కథ)




సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి............

“వెళ్ళండి. ఇకమీదట నా ఇంటికి రావాలంటే అపాయింట్‌మెంట్ తీసుకోండి.” మెత్తగానే చెప్పినా, కర్ణకఠోరంగా వినిపించింది నీనా కపూర్ కంఠం.

రుద్ర మొహం చూస్తే భయం వేసింది–ఎక్కడ ఆమె పీక పిసుకుతాడేమోనని.

“పద పోదాం,” తెలుగులో మెల్లిగా అన్నాను.

మాట్లాడకుండా నా వెనకాలే మెట్లు దిగాడు. కారెక్కేటంతవరకూ ఇద్దరి మధ్యా మౌనం. అప్పటివరకూ అదుపులో పెట్టుకున్న ఫ్రస్ట్రేషన్, కోపం కారు గేర్లు మార్చడంలో చూపించాడు.

“మానసీ, ఎందుకాపేవు నన్ను? ‘తన ఇల్లా!’ ఎంత ధైర్యం? ముందువైపు బాల్కనీ చూశావా? పైకెళ్ళే మెట్లకి ఇనుపతీగలు చుట్టించింది. మెట్లెక్కుతుంటే చెయ్యి అడ్డం పెటింది. అక్కడేం కట్టించిందో ఏమో!”

అవి ప్రశ్నలు కావనీ తనలో ఉప్పొంగుతున్న ఆవేశం బయటపడుతోందనీ తెలుస్తూనే ఉంది.

ఆ తరువాత ఢిల్లీలో ఆ పశ్చిమ్ విహార్ నుంచి చాణక్యపురిలో ఉన్న మా గవర్నమెంట్ క్వార్టర్స్‌కి చేరుకునేవరకూ మాటల్లేకుండానే ఎవరి ఆలోచనల్లో వాళ్ళం పడ్డాం.

ఐదేళ్ళ కిందట ఇండియన్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లందరూ కలిపి కట్టుకున్న హౌసింగ్ సొసైటీలో మాకు పై అంతస్తు అలాట్ అయింది. చెప్పకేం! సంతోషంగానే అనిపించింది. వంటింటి పక్కనుంచి డాబామీదకి వెళ్తే, చిన్నదే అయినా, పనివాళ్ళకోసం కట్టించిన ఒక గది, బాత్రూమ్ అదనంగా దొరికాయి. మేమున్న గవర్నమెంటు ఇల్లు ఎంత విశాలంగా, ఎన్ని వసతులతో ఉన్నప్పటికీ ఇది స్వార్జితంతో కట్టుకున్నది. అలాట్మెంట్ లెటర్ పుచ్చుకున్న వెంటనే రుద్రకి ఫుల్‌బ్రైట్ ఫెలోషిప్ వచ్చి, యు.ఎస్. వెళ్ళాల్సి వచ్చింది.

అప్పుడే కొత్తింటి గురించి మామగారితో మాట్లాడితే, ఆయనిచ్చిన సలహా: “అసలే కాలం బాగాలేదు. మీరేమో నాలుగేళ్ళు దేశం వదిలి పోతున్నారు. ఎవరైనా ఆక్రమించుకుని కూర్చున్నారంటే కష్టం. ఎవరికైనా అద్దికిచ్చేస్తే నయం. నాకు మిగిలినదే మూడేళ్ళ సర్వీస్. కావాలని మరీ ఆఖరి పోస్టింగ్ మాస్కోలో ఎంచుకున్నాను. మరి నేనూ ఉండను చూసుకోడానికి.” ఆయన పని చేసేది ఆల్ ఇండియా రేడియోలో.

నాన్నగారెలాగూ మెతకే. తన ఉద్యోగమూ, సాయంకాలాలు స్నేహితులతో చదరంగమూ తప్ప ఈ గొడవలు ఆయనకి పట్టవు.

ప్రాపర్టీ డీలర్ల మీద నమ్మకం లేక న్యూస్ పేపర్లో అడ్వర్టయిజ్ చేస్తే, అద్దెకోసం వచ్చిన వాళ్ళల్లోకల్లా ఈ నీనా కపూరయితే భద్రం అనుకున్నాం. ముప్పయిల్లో ఉన్న వొంటరి స్త్రీ. మృదువైన మాటలు. గౌరవనీయమైన ప్రవర్తన. ఏదో ఉద్యోగం అని చెప్పింది కానీ అప్పుడు పట్టించుకోలేదు. కానీ, ఒక్కతే ఉంటుంది కాబట్టి ఎప్పుడు చెప్తే అప్పుడు ఖాళీ చేస్తుందనే ధీమాతో తాళాలప్పజెప్పేం. 11 నెల్ల లీజ్ మీద సంతకం పెట్టింది.

మామగారటు మాస్కో, మేం ఇటు ఆస్టిన్ బయల్దేరేం కొన్నాళ్ళ తేడాతో. మొబైల్ ఫోన్ల కాలం కాదది.

మొదటి నెల యూనివర్సిటీ కాంపస్‌లో ఉన్న ఇంటికి కావలిసిన అదనపు సామాను కొనడం, రుద్ర పనిలో చేరడంతోటే సరిపోయి కపూర్ గురించి పట్టించుకోలేదు. నెల నెలా బాంకులో అద్దె డిపాజిట్ చేస్తానన్న మనిషి ఒక్క పైసా కట్టలేదని బ్యాంకుకి ఫోన్ చేస్తే తెలిసింది. ఆమెకి ఫోన్ చేస్తే–ఫాన్లు పెట్టించాను. వంటింటి షెల్వ్‌స్ కట్టించాను. బాల్కనీ రెయిలింగ్ ఎత్తు చేయించాను. టైల్స్ మార్పించాను. వార్డ్ రోబ్స్ చేయించాను– అన్న సమాధానాలేవో వచ్చేవి రెండు, మూడు నెల్లు. ఆ తరువాత ఫోనెప్పుడూ మోగేదే తప్ప ఎవరూ ఎత్తినది లేదు. చూస్తుండగానే లీజ్ గడువు దాటేపోయింది.

రెండేళ్ళ తరువాత ‘మా అమ్మాయిని స్కూల్లో చేర్పిద్దాం, అమ్మా వాళ్ళింట్లో ఉంటుంది మేం తిరిగి వచ్చేదాకా’ అనుకుని ఢిల్లీ వచ్చినప్పుడు, అడ్మిషన్స్ కోసం తిరగడంతోనే టైమ్ గడిచిపోయింది. ఆఖరి రోజు ఇల్లెలా ఉందో, ఈవిడ ఎప్పుడు ఖాళీ చేస్తుందో అని చూసి పోదామని వస్తే, తలుపులకి పెద్ద తాళం కప్పలు వేళ్ళాడుతున్నాయి. హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్ పంత్ గారి ఇంటికి వెళ్ళి అడిగితే, “అదేమిటమ్మా! మీరు ఆవిడకి ఇల్లమ్మేశారట కదా? సొసైటీ అనుమతి లేకుండా అలా ఎలా చేశారు?” ఎదురు ప్రశ్న వేశారు. గుండె గుభిల్లుమంది. నిర్ఘాంతపోయి “అదేమిటి అంకుల్! ఇల్లెందుకు అమ్ముతాం? పేపర్లేమైనా చూపించిందా?” అడిగాను.

“అవేవీ చూపలేదు కానీ ఒక సర్దార్ వస్తూ పోతూ ఉంటాడు. ఇప్పుడావిడకి నాలుగు నెల్ల పాప కూడా. ఇంట్లో చేరింది మొదలు కార్పెంటర్లూ, మేసన్లూ రాని రోజు లేదు. చుట్టుపక్కలవారిని ఇంట్లోకి రానియ్యదు. ఎవరెవరో చాలామంది వాచ్‌మన్ రెజిస్టర్లో సంతకం పెట్టి తన వద్దకి వస్తూ ఉంటారు. వారంగా ఇంట్లో లేదనుకుంటాను. సొసైటీ మెయింటెనెన్స్ మాత్రం కడుతోంది.” అన్నారాయన.

శంకిస్తున్న మనస్సుతోనే విమానం ఎక్కాను. రుద్రతో చెప్తే, “ఆ ముసలాయన పంత్‌కి అనుమాన రోగం లెద్దూ. ఏదో కారణం ఉండే ఉంటుంది. వెనక్కెళ్ళాక చూసుకుందాం. ఇల్లు మింగెయ్యదు కదా?” అన్నాడు.

గత్యంతరం లేక నోరు మూసుకున్నాను.

రుద్ర ఫెలోషిప్ పూర్తయి, ఎబిసి న్యూస్‌లో అప్రెంటిస్ షిప్ పూర్తి అయేటప్పటికి నాలుగేళ్ళు దాటింది. మామగారికి ఎక్స్‌టెన్షన్ దొరికి ఇంకా రష్యాలోనే ఉన్నారు. తిరిగి ఇంటికి వెళ్ళాక, మొదటి ఆదివారమే కొత్తింటికి వెళ్ళాం. కపూర్ ఆహ్వానించింది. టీ ఇచ్చింది. లివింగ్ రూమ్‌కీ డైనింగ్ స్పేసుకీ మధ్య గ్లాస్ పార్టీషనేదో కట్టించినట్టుంది. రుద్ర లీజ్ గురించీ, ఇన్నేళ్ళూ కట్టకపోయిన అద్దె గురించీ అడుగుతుంటే, నేనే లేచి ఇంటి లోపలికి వెళ్ళాను. మూడు బెడ్రూముల్లో రెండిట్లో చెక్క పార్టిషన్లూ, బల్లలూ, రెజిస్టర్లూ కంప్యూటర్లూ, వాటిముందు పని చేస్తున్న ఐదారుగురు మనుష్యులూ కనిపించారు. ఏదైనా ఆఫీస్‌లో అడుగుపెట్టానా అన్నంత అనుమానం వేసింది. “రుద్రా, ఒకసారి ఇటు రా!” అని పిలవడంతో వచ్చాడు. అదంతా గమనించి, “ఏమిటిదంతా? ఇదేమైనా కమర్షియల్ స్పేస్ అనుకున్నారా, ఇల్లనుకున్నారా? అద్దెకిచ్చినది ఇందుకా?” కేకలు మొదలుపెట్టాడు.

“శాంతం, శాంతం. బి.పి. పెరుగుతుంది. మరీ ఎక్కువ ఆవేశపడితే నష్టం జరిగేది మీకే!” తాపీగా చెప్తూ, నిద్రకళ్ళతో ఉన్న ఒక చిన్నపిల్లని గదిలోనుంచి ఎత్తుకుని తీసుకొచ్చింది. “పంత్ అంకుల్ చెప్పినది నిజమేనన్నమాట. సరే, ఇది మీ వ్యక్తిగతం. కానీ ఈ టైపిస్టులూ, ఈ వ్యవహారం ఏమిటి? ఇన్నేళ్ళ అద్దె కట్టి, ఖాళీ చేయండి. వారం టైమిస్తున్నాను.” చరచరా బయటకి నడుస్తూ నన్నూ లాగాడు.

మళ్ళీ నాలుగు రోజుల తరువాత ఒక ఆదివారం వచ్చి చూస్తే, ఫ్లాట్ బయటకి ఉన్న రెండు తలుపుల మధ్యా, కపూర్ నియమించిన స్వంత వాచ్‌మన్ కుర్చీమీద కూర్చుని కనిపించాడు. కిందకి దిగి, సొసైటీ మీటింగ్స్ జరిగే గదిలోకొచ్చాం. అక్కడున్న ఆరుగురికీ సంగతంతా ముందే తెలిసినట్టుంది.

“రుద్రా, నెమ్మది పడు. ఆ వస్తూ పోతూ ఉండే సర్దార్‌కి ముందే పెళ్ళయిందిట. ఎక్సటర్నల్ ఎఫైర్స్ మినిస్ట్రీలో యుడిసి. తన విజిటింగ్ కార్డిచ్చాడు. వివరాలివిగో. ఇంకో సంగతి. గమనించావో లేదో కానీ, పేదవాళ్ళకి మట్టితో పక్కా ఇళ్ళు రూ.50,000లో కట్టిస్తామని ఈమె మడ్ హౌసింగ్ అన్న ప్రాజెక్టేదో మొదలుపెట్టిందని చాలా చోట్ల గోడల మీద పోస్టర్లు అంటించున్నాయి. ఈమె ఇంట్లోనే ఆఫీసేదో తెరిచిందని అనుమానం వచ్చి, ఇళ్ళ కోసం వచ్చేవాళ్ళని లోపలకి రానివ్వద్దని వాచ్‌మన్లందరికీ చెప్పే ఉంచాం. ఈవిడకి ప్రైవేట్ వాచ్‌మన్‌ను పెట్టుకునే అనుమతి లేదని నోటిఫికేషన్ పంపాం. ఎందుకైనా మంచిది. నువ్వూ, మీ ఆవిడా ఈ చుట్టుపక్కలే ఇల్లేదైనా అద్దెకి తీసుకుని ఉండండి. రోజూ వత్తిడి తెస్తే తట్టుకోలేక ఖాళీ చేస్తుందేమో. కోర్టుల గొడవ పడలేం.” అన్నారు పంత్.

సరే, చేసేదేం ఉంది? అద్దె పోతే పోనీ, కనీసం ఇల్లయినా దక్కితే అదే మహా భాగ్యం. ఇంకా హౌసింగ్ లోన్ కూడా పూరిగా తీర్చలేదు అనుకుంటూ, ఎదురుగా ఉన్న సందులో ప్రైవేట్ ఇల్లొకటి అద్దెకి తీసుకున్నాం. అదృష్టం కొద్దీ సొసైటీ గేటుకి సరిగ్గా ఎదురుగా ఉందది. పాపని అమ్మ ఇంటినుంచి మా దగ్గిరకే తెచ్చుకుని ఇక్కడి స్కూల్ బస్సులోనే పంపడం మొదలెట్టేం.

బాల్కనీనుంచి చూస్తే ఒక ఎర్రటి మారుతీ కార్లో కపూర్ వస్తూ, పోతూ కనిపించేది. మా ఇంట్లో మేము అడుగు పెట్టడానికి తిరిగి ప్రయత్నించలేదు. చుట్టుపక్కలే అద్దెకి ఉన్నాం అని కపూరుకి తెలియకపోయే అవకాశం లేదు. నిమ్మకి నీరెత్తినట్టు ‘ఏం చేస్తారో చేసుకోండి!’ అన్న చూపులు విసిరేది కింద కూరల బళ్ళ వద్దా, దుకాణాల్లోనూ కనిపిస్తూ.

మూడు నెలలు గడిచాయి. ఒక సాయంత్రం రుద్ర ఇంటికి వస్తూనే చెప్పాడు, “స్కూల్లో నా క్లాస్‌మేట్ ఈశ్వర్, కైరోలో పోస్టింగని వెళ్ళాడని చెప్పాను గుర్తుందా? ఇవ్వాళ క్లబ్‌లో కనిపించాడు. ఈ కపూర్ బాయ్ ఫ్రెండ్ సంగతి తెలిసినప్పుడు ఈశ్వర్ ఎందుకు గుర్తు రాలేదో మనకి! ఎంతయినా అదే మినిస్ట్రీలో అండర్ సెక్రెటరీ కదా? సర్దార్ ప్రస్తావన రాగానే, ‘ఇంక నాకొదులు. చూస్తానుగా ఎలా ఖాళీ చేయదో!’ అన్నాడు.”

చాలా రోజుల తరువాత రుద్ర నుదిటిమీద అడ్డగీతలు లేకపోవడం చూశాను.

వారం తిరగలేదు. పంత్ అంకుల్ ఫోన్ చేసి, “మానసీ, రుద్రకి చెప్పు. ఇంక మీ ఇల్లు మీదే. ఆమెకి వారం కావాలిట సామాన్లు సర్దుకోడానికి. ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడు వచ్చి తాళాలు తీసుకొమ్మని మీకు చెప్పమంది. మీకు ఫోన్ చేయదట.” అన్నారు. మాకు ఫోన్ చేయకపోతే వచ్చిన నష్టం ఏమీలేదు. ముందు ఇల్లంటూ ఖాళీ చేస్తోంది. అదే చాలు.

నాలుగు రోజుల తరువాత ట్రక్కులు రావడం మొదలవగానే, రుద్రా నేనూ పైకెక్కుతుంటే, మంచాలూ, సోఫాలూ కిందకి దిగడం కనబడ్డాయి. తలుపు వద్దకి చేరినప్పుడు, మొక్కల గోలేలని ఎత్తుతున్నవారితో కపూర్, ‘బాబూ, వాటికీ ప్రాణం ఉంది. జాగ్రత్త. గోలేలు విరిగాయంటే నిష్కారణంగా ఎండిపోతాయి’ అంటోంది. నవ్వాలో, ఏడవాలో తెలియలేదు. మెయిన్ చెక్క తలుపుకి భాగంగా సన్నటి గ్లాస్ ఉంది. మరి సెక్యూరిటీ అనవసరం అనుకుందో ఏమిటో కానీ దానికి గ్రిల్ కూడా లేదు. పెద్ద అల్మారా ఒకదాన్ని ఆ తలుపునుండి బయటకి తీసుకురావడానికి వీలుపడటంలేదు. ‘ఫరవాలేదు. గాజుకేమిటి? పగలనీయండి. అల్మారా ఖరీదయినది.’ అంటోంది సామానెత్తుతున్న వాళ్ళతో. హఠాత్తుగా ఢమ్మన్న శబ్దంతో పగలనే పగిలింది గ్లాస్ డోర్! ప్రాణం ఉసూరుమంది. మొత్తానికి ట్రక్కులు బయల్దేరాయి. సర్దార్ ఎక్కడా కానరాలేదు.

మొత్తానికి ఆ పార్టిషన్లూ అవీ తీయించి, ఇంటిని ఇల్లుగా బాగు చేయించుకున్నాం. ప్రభుత్వపు ఇల్లు సరెండర్ చేసి, మా సామాను ఇక్కడికి మార్చుకొని, ‘దరిద్రం వదిలింది’ అనుకుని ఊరటపడ్డాం.

పట్టుమని రెండు వారాలు కాలేదు. మధ్యాహ్నం భోజనం చేసి కూర్చున్నానో లేదో, ‘ఒక్కసారిగా చాలామంది వచ్చారు మాడమ్, మీ ఇంట్లో అద్దెకున్నావిడకి వీళ్ళేవో డబ్బిచ్చారట…’ ఇంటర్‌కమ్‌లో వాచ్‌మన్ ఫోను. విషయం అర్థమై, నీరసంగా ‘పంపండి’ అన్నాను.

పదిహేనుమందో ఎంతో ఉంటారు. ‘కపూర్ మాడమ్ ఏమయింది?’ అనడుగుతూ ఇంట్లో కాలు పెట్టారు. కాయకష్టం చేసుకుని బతికేవారిలా కనిపిస్తున్నారు. యుపి యాసతో ఒకళ్ళగొంతు మరొకరు దించేస్తూ ఉంటే, ‘కూర్చోండి ముందు. మంచినీళ్ళిమ్మంటారా?’ అడిగితే, అందరూ కలిపి కూడబలుక్కున్నట్టు, ‘ఊ, ఊ’ అంటూ తలలూపారు.

“ఇప్పుడు ఒకళ్ళు చెప్పండి. సంగతేమిటి?” అడిగాను.

యాబైల్లో ఉన్న ఒకాయన మిగతావారిని ఊరుకొమ్మని సైగ చేసి “అమ్మా, వీళ్ళందరూ మా తమ్ముళ్ళ, చెల్లెళ్ళ కుటుంబాలు. వీళ్ళు నా భార్యా కొడుకూ. మొత్తం ఆరిళ్ళకీ మూడు లక్షలిచ్చాం. మాటలా మావంటివాళ్ళకి? తలమ్ముకుని కట్టాం ఆవిడకి, ఇల్లుంటుందన్న ఆశతో. ఆ మాడమ్ వెళ్ళిపోయిందని తెలిసి అడ్రెస్ అడగడానికొచ్చాం. ఆవిడని ఎక్కడ కలుసుకోవాలి?” దిగాలుగా వచ్చింది ప్రశ్న.

కపూర్ ఖాళీ చేయడమే మహాభాగ్యం అనుకున్న మేము, మా సమస్య తీరిందనుకున్నామే తప్ప ఆమెక్కడికి వెళ్తోందో పట్టించుకోలేదు. ‘ఆచూకీ తెలిసినప్పుడు నాకు ఫోన్ చేస్తే తప్పకుండా అడ్రెస్ చెప్తాను.’ అన్న వాగ్దానం తీసుకుని వాళ్ళు కదిలారు.

ఆ సాయంత్రమే ఈశ్వర్‌కి ఫోన్ చేసి చెప్తే, సర్దారుకి ఫోన్ చేసి కనుక్కుంటానని చెప్పాడు. అరగంట తరువాత తిరిగి ఫోన్ చేసి, ‘అతనేమో… కపూర్‌ తనతో తెగతెంపులు చేసుకుందనీ, ఆవిడెక్కడికి వెళ్ళిందో తనకి తెలియదనీ అంటున్నాడు. నిజమో అబద్ధమో దేవుడికే తెలియాలి.’ అన్నాడు.

కొన్ని వారాలపాటు ఇలాగే ఎంతమంది ఆశతో వచ్చి నిరాశతో తిరిగిపోయారో లెక్కే లేదు.

ఈ లోపల మారుతీ కంపెనీ నుంచి ఫోన్ల పరంపర. కపూర్ కారు లోన్ కట్టడం లేదట. ఆవిడ ఇక్కడ లేదు మొర్రో! అంటున్నా వినకుండా వాళ్ళ సేల్స్ రెప్రెజెంటెటివ్స్ ఇంటికే రావడం ప్రారంభించారు. దేని భరోసాతో లోన్ ఇచ్చారు? అని అడిగితే, తన పేరు మీద ఉన్న ఇంటి పేపర్లని బట్టి ఇచ్చారట. సాయంత్రం రుద్రతో చెప్తే, “అలా ఎలా చూపించగలిగింది? ఏవో నకిలీ కాగితాలు తయారుచేయించినట్టుంది. గుండెలు తీసిన బంటులా ఉందే! బతికిపోయాం. ఎందుకైనా మంచిది. మీ పిన్ని కొడుకు జయకర్ లాయరు కదా, ఒక ముక్క తన చెవిన వేసి ఉంచు. ఎటు తిరిగి ఏమవుతుందో!” అని హెచ్చరిక పారేశాడు.

రెండు నెల్లయింది. ఈసారి వాచ్‌మనూ, ఇంటర్‌కమూ ఏదీ లేకుండానే కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసి చూస్తే ఎదురుగా ఇద్దరు పోలీసులు. అయోమయంగా చూస్తూ లోపలికి రమ్మని అంటూ కుర్చీలు చూపించాను.

“నీనా కపూర్ కారు లోన్ వాయిదాలు చెల్లించడం లేదని మారుతీ కంపెనీ నుండి ఫిర్యాదు వచ్చింది. ఇంటి దస్తావేజులూ అవీ చూపించండి. ఇల్లు మీదే అని సాక్ష్యం చెప్పేవాళ్ళెవరైనా ఉంటే, వాళ్ళనీ పిలవండి,” అన్నాడు ఒకతను. వాళ్ళకి టీ పెడుతూ, రుద్రకి ఫోన్ చేసి ‘అర్జెంటుగా ఇంటికి రమ్మని కారణం’ చెప్పి పంతునీ, జయకర్‌నీ కూడా పిలిచాను. గంట లోపల ఇల్లంతా నిండింది. రుద్ర తనతో పాటు డిడిఏ అధికారి ఒకతన్ని తెచ్చాడు. మొత్తానికి పోలీసులకి నమ్మకం కలిగి బయల్దేరారు.

ఒకరోజు పేపర్లో– ‘లక్ష్మీ నగర్ నివాసినైన (ఫలానా చిరునామా) నీనా కపూర్ అను నేను, అఫిడవిట్ (ఫలానా తేదీ) ద్వారా గ్లోరియా థామస్‌గా నోటరీ వెంకటేశన్ సాక్ష్యంగా పేరు మార్చుకున్నాను’– న్యూస్ పేపర్ రెండో పేజీలో ఉన్న చిన్న ఏడ్ మీద నా దృష్టి పడింది.

ఆ పేరేమీ అసాధారణమైనది కాకపోయినా నా ఇన్‌స్టింక్ట్ మాత్రం ఏదో చెప్తోంది. 197 డైరెక్టరీకి ఫోన్ చేస్తే, ఆ చిరునామా ఎవరో థామస్‌కి చెందినదంటూ, ఫోన్ నంబర్ ఇచ్చారు. ఫోన్ ఎత్తి, ‘హలో’ అన్న స్వరం, ‘మొక్కలకీ ప్రాణాలుంటాయి!’ అన్న అదే గొంతు!
-----------------------------------------------------------
రచన: కృష్ణవేణి, 
ఈమాట సౌజన్యంతో

Sunday, September 16, 2018

నీళ్ళు(కథ)


నీళ్ళు(కథ)



సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి..............
“దీన్నిండా తప్పులే… మళ్ళీ వ్రాసుకురా… నీకు తెలియకపోతే నీ సీనియర్‌ని కన్సల్టు చెయ్యి. మరో అరగంటలో ఇది కావాలి… ” అన్నాడు ఆఫీసరు, జోగినాధం అంతకుముందు తయారుచేసిన డ్రాఫ్టు మళ్ళీ అతని చేతికి అందిస్తూ.

జోగినాధం వినయంగా “అలాగేనండీ” అంటూ ఆ కాయితం అందుకున్నాడు. గది దాటి యివతలకి వచ్చేసరికి అక్కడే లోపలికి వెళ్లేందుకు కాబోలు నిరీక్షిస్తూ నిలబడి ఉన్న కుసుమ అతనికి కనిపించింది. ఆమె ఆఫీసరుగారి మాటలు వినే ఉండాలి, అందుకు నిదర్శనం ఆమె అతని వంక చూసి నవ్విన నవ్వు.

ఉమాపతి తన సీట్లో తీరికగా కూర్చుని ఉండి కళ్ళెగరేసి “ఆ కాయితం మళ్ళీ నీ చేతుల్లోకే వచ్చిందేమిటయ్యా మహానుభావా?” అని అడిగాడు.

జోగినాధం మొహం తుడుచుకుని సిగ్గుపడుతూ “దీన్నిండా తప్పులున్నాయిట… మళ్ళీ రాసుకు రమ్మన్నారు.” అని చెప్పాడు.

ప్రక్కనే కూర్చుని ఏదో ఫైలు తిరగేస్తున్న లక్ష్మీపతి తల ఎత్తి చూసి “ఉద్యోగంలో చేరి నెల పదిహేను రోజులే కదా అయింది? ఏవో చిన్న చిన్న తప్పులుంటే తాను దిద్ది టైపిస్టు కివ్వగూడదూ? అంతా హోషులే బ్రదర్… ఆ కుర్చీ అటువంటిది” అన్నాడు.

ఉమాపతి “సరే… ఇకనేం? ఆ కాయితం యిలా తీసుకురా… గబగబా ఏదో గిలికి యిచ్చి పెందలాడి బయట పడిపోదాం… అన్నట్టు యివాళ సినిమా ప్రొగ్రాం కూడా ఉంది.” అన్నాడు.

జోగినాధం ఆ కాయితం ఉమాపతికి అందించి అతని ముందు కుర్చీలో కూర్చుని “మీ యిద్దరూ సినిమాకు వెడుతున్నారా?” అని అడిగాడు.

ఉమాపతి, లక్ష్మీపతి వంక చూశాడు. లక్ష్మీపతి కూడా ఆ ప్రశ్న విని జోగినాధం వైపు చూశాడు. అతడు విసుగుతో జోగినాధాన్ని ఉద్దేశించి “నీ ప్రవర్తన నాకేం నచ్చడం లేదోయ్… మనం ముగ్గురం ఒకే రూములో ఉంటూ ఒకే హోటల్లో భోజనం చేస్తున్నాము… అయినా నువ్వు అదేమిటో అంటీ అంటనట్టు ప్రవర్తిస్తూ ఉంటావు. మొన్న నొకసారి కూడా యిలాగే సినిమాకు పోదాం రమ్మంటే, రానంటే రాను పొమ్మన్నావు. అలా స్నేహపూర్వకంగా అడిగినప్పుడు మొహంమీద కొట్టినట్టు రాను పొమ్మంటే ఎలా ఉంటుందో ఆలోచించావా?” అన్నాడు.

ఉమాపతి “ఎందుకులే బ్రదర్! అతని తీరు తెలిసి వచ్చింది కదా! ఇక ఏమీ మాట్లాడక వూరుకో!” అని తాను పనిలో మునిగిపోయాడు.

జోగినాధం యిరుకున పడ్డాడు. అతి కష్టం మీద గొంతు పెగుల్చుకుని “క్షమించండి” అనగలిగాడు. ఉమాపతి వినిపించుకున్నట్టు లేదు.

మరో అయిదు నిమిషాల్లో ఉమాపతి తాను తయారు చేసిన కొత్త డ్రాఫ్టు జోగినాధం ముందు పడేసి లేచి నుంచుని జేబులు సర్ధుకుని లక్ష్మీపతి నుద్దేశించి “త్వరగా తెమలవోయ్” అన్నాడు. లక్ష్మీపతి ఫైలు మడిచి అవతల పడేసి “నేను సిద్ధమే” అంటూ లేచి మళ్ళీ జోగినాధం వంక చూసి “మరి ఈయనగారి మాటేమిటి?” అని అడిగాడు. ఉమాపతి జేబుల్లో చేతులుంచుకుని జోగినాధం వంక తిరిగి “ఏమంటావు?” అని అడిగాడు.

అతడు కాయితం మడతపెడుతూ లేచి నుంచుని “నేనెందుకు లెండి బాబూ! మిరిద్దరూ వెళ్లిరండి. నేను రూములోనే వుంటాను.” అన్నాడు.

ఉమాపతి కొద్దిగా కోపం తెచ్చుకుని అడుగులు ముందుకు వేశాడు. లక్ష్మీపతి సీటులోనుంచి లేచి యివతలకి వస్తూ “ఏం? మాతో రావడం యిష్టం లేదా నీకు?” అని అడిగాడు.

జోగినాధం నీళ్ళు నవులుతూ “పతీ! నా దగ్గర డబ్బు…” అంటూ ఆగిపోయాడు.

అంతలోనే అందుకుని లక్ష్మీపతి “భలేవాడివే జోగినాధం! నీ దగ్గర డబ్బు వుంటేమటుకు నిన్ను టిక్కెట్లు కొననిస్తామా? మరేమిటో అనుకున్నాను. అదా నీ సందేహం? ఊఁ! ఇకనైనా బయలుదేరు. డబ్బు మా దగ్గర వుందిలే…” అన్నాడు.

జోగినాధం “అది కాదండీ బాబూ! మీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. నేను రానుగాని, నన్ను విసిగించక మీరు వెళ్లిరండి…” అన్నాడు విసుగుతో.

ఉమాపతి నిష్ఠూరపడుతూ “అదయ్యా! సంగతి… డబ్బును గురించి ఎంతమాత్రం కాదు. కేవలం ‘యీ జులాయి వెధవలతో ఎందుకు తిరగాలీ’… అని అతని బాధ. అతను బుద్ధిమంతుడు. జాగ్రత్తపరుడు… సినిమాలూ షికార్లూ అతనికి గిట్టవు. కాబట్టి యికమీదటనైనా మనం అతన్ని పిలిచి అవమానం చెందక్కరలేదు. అర్థమయిందా? పోదాంపద…” అన్నాడు.

లక్ష్మీపతి “అదీ నిజమే. ఇవాళ మనం సినిమాకు తీసుకువెడతామంటే వెంటనే వస్తే, మళ్ళీ తనెప్పుడైనా ఆ మాట అనవలసి వస్తుందేమోనని దిగులు కూడా ననుకుంటాను.” అంటూ జేబులోనుంచి తాళంచెవులు తీసి బల్లమీదికి విసిరి “అయ్యా! జోగినాధంగారూ, ఇవిగో రూము తాళాలు. మేము వెళ్ళొస్తాం…” అన్నాడు.

మరుక్షణంలో వారిద్దరూ చేతులు కలుపుకుని బయటకి వెళ్లిపోయారు. జోగినాధం మనస్సు చివుక్కుమన్నది. లక్ష్మీపతి ఎంత మాట అన్నాడు! తమతో కలసి సినిమాలకూ షికార్లకూ రానంత మాత్రంలో అంత మాట అనడమేనా?

అతడు చుట్టూ చూశాడు. అప్పటికే అంతవరకూ అక్కడవున్న యితర గుమాస్తాలు కూడా వెళ్లిపోయారు. మూలగా కుసుమ ఒక్కతే మాత్రం తన సీటులో కూర్చుని ఏదో కాయితం టైపు చేస్తున్నది. జోగినాధం వుండి వుండి ఆమెవైపు చూస్తూ ఆఫీసరు గదిలోనుంచి పిలుపుకోసం ఎదురు చూస్తున్నాడు.

అంతలో అతనికి దూరంగా కిటికీలో ఎత్తుగా ఉంచబడిన నీళ్ళ కూజా కనిపించింది. నీళ్లు మరింత చల్లగా వుండటం కోసం దాని చుట్టూ జనపనార తాడు అల్లివుంచారు. దాని పక్కనే రెండు గాజు గ్లాసులున్నాయి.

జోగినాధం నెమ్మదిగా లేచి వెళ్లి శుభ్రంగా తళతళలాడుతున్న గ్లాసును చేతిలోకి తీసుకుని దాన్ని నీళ్ళతో నింపి చెయ్యి పైకెత్తి ఒక్క నిముషం సేపు దానివంక కన్నార్పకుండా చూశాడు. గ్లాసులో నీళ్లు తెల్లగా మిలమిల లాడుతున్నాయి. అటువైపునుంచి ప్రసర్తిస్తున్న వెలుగు కిరణాలవల్ల అవి క్షణక్షణానికీ మరింత మెరిసిపోతున్నాయి. అతడు నెమ్మదిగా ఆ గ్లాసు నోటిదగ్గర వుంచుకుని గుక్క తర్వాత గుక్కగా నింపాదిగా తాగాడు. తర్వాత గ్లాసు అక్కడ వుంచి మూతి తుడుచుకుంటూ తలతిప్పి చూసేసరికి తన వంకనే కన్నార్పకుండా చూస్తున్న కుసుమ కనిపించింది. అతడు సిగ్గుపడిపోయి త్వరత్వరగా తన సీటులోకి వెళ్లి కూర్చున్నాడు. కుసుమ అంతవరకూ యీ తంతు అంతా తన పని ఆపుకుని మరీ చూసింది కాబోలు. అతడు కుర్చీలో కూర్చోగానే మళ్లీ టైపు శబ్దం ప్రారంభమైంది.

కొద్ది నిమిషాల తర్వాత ఆఫీసరుగారి గదిలో బెల్ మ్రోగింది. కుసుమ గబగబా లేచి లోపలికి వెళ్లి మళ్లీ వెంటనే తిరిగి వచ్చి జోగినాధంతో “మిమ్మల్ని పిలుస్తున్నారు…” అన్నది.

జోగినాధం కాయితం చేతిలోకి తీసుకుని ఒక్క ఉదుటున లేచి వెళ్లి ఆఫీసరుగారి ముందు నిలబడ్డాడు. ఆయన అతని చేతిలో కాయితం అందుకుని చూసి తలయెత్తి “ఊఁ! ఎవరిని కన్సల్టు చేశావు?” అని అడిగాడు.

జోగినాధం నెమ్మదిగా “ఉమాపతి వ్రాసి యిచ్చాడండీ…” అని చెప్పాడు.

ఆయన చురుకుగా చూసి “అలాగా! చూడు జోగినాధం! నువ్వు అలా ఉన్న విషయం చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కాని ఒక్క సంగతి గుర్తుపెట్టుకో. అతను గ్రాడ్యుయేటు. పైగా అనుభవం ఉన్నవాడు. అత నీనాడు నీకు స్నేహితుడు కాబట్టి సహాయం చెయ్యడం బాగానే ఉంది. కానీ ఎన్నాళ్లిలా? నువ్వు కొత్తవాడివి. పైగా నీకు చదువు తక్కువే. అయినా నువ్వు కొంచెం చొరవ తీసుకుని పనిలో అభివృద్ధి చూపించాలి. వారిమీదా వీరిమీదా కొత్తల్లో ఆధారపడటం తప్పేమీ కాదు. వాళ్లు సహాయం చెయ్యటమూ తప్పు కాదు. కాని నువ్వుకూడా స్వతంత్రించి కొంచెం యింప్రువ్‌మెంట్ సాధించాలి. నాలుగు వాక్యాలు స్వంతంగా తప్పులులేకుండా వ్రాయడం బ్రహ్మ విద్యేమీ కాదు. సరే… నువ్విక వెళ్ళు… ఆ టైపిస్టును రమ్మని చెప్పు… ఈ కాయితం యివాళ వెళ్లిపోవాలి…” అన్నాడు.

జోగినాధం తలవూపి యివతలికి వచ్చి కుసుమ నుద్దేశించి “మిమ్మల్ని పిలుస్తున్నారండీ…” అని చెప్పాడు. ఆమె లేచి ఆఫీసరు గదిలోకి వెళ్లింది.

జోగినాధం టైపుమెషిను దగ్గర నిలబడ్డాడు. కన్నార్పకుండా దానివంకకే చూశాడు. కుసుమ లోపల ఆఫీసరుగారి గదిలో “అలాగేనండీ… యిప్పుడే చేసియిస్తాను.” అంటున్నది. అతడు టైపుమిషను దగ్గరగా జరిగి ఒకవిధమైన చాపల్యంతో వ్రేలు కదిపి ఒక మీట నొక్కాడు. లోపల కాయితం చుట్టివున్న సిలిండరు ‘ధన్’మని పెద్ద శబ్దం చేస్తూ మరో వైపుకు కదిలింది. అతడు అదిరిపడ్డాడు.

అంతలో కుసుమ చేతిలో కాయితంతో వచ్చి “అదేమిటి? టాట్యులేటర్ నొక్కారా? అలాచేస్తే మెషిను పాడైపోతుంది. మీరిలా కూర్చోండి… మీ కాయితమే యిది. ఇప్పుడే ఆఫీసరుగారికి అందించాలి… ఆ తర్వాత యిద్దరం కలిసే వెడదాం…” అంటూ కూర్చుని తనపనిలో నిమగ్నురాలయింది. జోగినాధం “అలాగే నండీ” అంటూ తలవూపి ఒక కుర్చీలో కూర్చున్నాడు. అతనితో కుసుమ యిదే మొదటిసారి మాట్లాడటం.

జోగినాధం కనురెప్పపాటు అయినా లేకుండా చూస్తూ కూర్చున్నాడు. అతనికి కుసుమ నైపుణ్యం అబ్బురం కలిగించింది. ఆమె పలుచని బంగారు రంగు వేళ్లు టైపుమెషిను మీద వేగంగా అందంగా కదులుతున్నాయి. ఆ కళ్ళలో ఏదో మంత్రశక్తి ఉన్నట్టు అనిపించిందతనికి. తాను పుట్టినప్పటినుంచీ పద్దేనిమిదేళ్ళ వరకూ – అంటే స్కూల్ ఫైనల్ పాసయ్యే వరకూ – ఉన్నది గుంటూరు జిల్లాలో ఒకమారుమూల పల్లెటూళ్ళో. తాను ఎనిమిదవ తరగతి వరకూ చదువుకున్నది పక్కవూరిలోని మిడిల్ స్కూల్లో. ఆ వూరు కూడా పెద్దదేమీ కాదు. తన మిడిల్ స్కూల్ చదువు పూర్తికాగానే తన తల్లి యింక చదువు మానుకోమన్నది. కాని, ఆ సంవత్సరంనుంచి స్కూల్ ఫైనల్ వరకూ పై తరగతులు కూడా ఏర్పాటు చేసి ఆ స్కూల్‌ను హైస్కూలుగా మార్చారు. ఆ సదుపాయం రావడంతో అతని తల్లి మనసు మార్చుకుని ఊరు విడిచి ఎక్కడికీ పోనక్కర లేదుకదా అనే ఆలోచనతో మళ్లీ ఫోర్తుఫారంలో చేరమన్నది. ఆ విధంగా అతడు, రెండు నెలల క్రిందట యీ ఉద్యోగం వచ్చేవరకూ, రైలు ప్రయాణం కూడా ఎన్నడూ చేయలేదు. ఇప్పుడు మెషిను ముందు కూర్చుని ‘చకచక’ టైపు చేస్తున్న కుసుమను చూస్తూవుంటే ఎంతో గొప్పగా వింతగా వుంది.

ఆమె ఆ కాయితం పూర్తి చేసి ఆఫీసరు గదిలోకి వెళ్లింది. జోగినాధం లేచి మంచినీళ్ళ కూజా దగ్గరికి వెళ్లి మూతతీసి లోపలి నీటివంక ఒక్కక్షణం చూశాడు. అలా చూస్తూ వుండగానే – తనవూరిలో… తన చినచెల్లెలు దాహంతో బాధపడుతూ కూర్చునివుంది. ఎండ నిప్పులు చెరుగుతున్నది. వెచ్చని గాలి రివ్వున వీస్తున్నది. యింటి ముందు బయట ప్రదేశంలో దూరంగా సుడిగాలి గిర్రున తిరుగుతున్నది. తన తల్లి సగం మాత్రమే నిండిన బిందెను బుజాన పెట్టుకుని ఎండలో యింటికి నడిచి వస్తున్నది. అన్నం తింటూ కూడా నీళ్ళను పొదుపుగా వాడుకోవాలి అక్కడ… స్నానం చేసేందుకు సరేసరి… ఆ ఉప్పు నీళ్ళకు కూడా రేషనింగే… అతని కళ్ళు చెమర్చాయి. వెంటనే గ్లాసు నీళ్ళతో నింపుకుని గడగడ త్రాగాడు.

తర్వాత వెనుదిరిగి చూసేసరికి ఎంతసేపటి నుంచీ తనను గమనిస్తున్నదో కుసుమ… అక్కడే చేతులు కట్టుకుని నిలబడి వుంది. ఆమె హఠాత్తుగా అతని చేతివంక చూసి “అరె! మీ చేతికి ఆరు వ్రేళ్ళున్నాయే!” అన్నది ఆశ్చర్యంగా.

జోగినాధం తన ఎడమచేతిని చూసుకుని నవ్వాడు.

కుసుమ “రండి… అయిదున్నర దాటింది… ఇళ్ళకు చేరుకుందాం…” అంటూ దారితీసింది.

జోగినాధం ఆమె ననుసరించి మెట్లు దిగుతూవుండగా ఆమె మళ్లీ “చేతికి ఆరు వ్రేళ్ళుంటే అదృష్టం అని అంటారే… నిజమేనా అండీ?” అని అడిగింది. అతడు నిట్టూర్చి “ఆఁ! ఏం అదృష్టమో!” అన్నాడు.

ఇద్దరూ మెట్లు దిగి వీధిలోకి వచ్చి నడవటం ప్రారంభించారు. పేవ్‌మెంట్ మీద జోగినాధం కుసుమ పక్కగా నడుస్తున్నాడు. అతనికిది పూర్తిగా కొత్త అనుభవం. అతనికిప్పుడు పందొమ్మిదోయేడు. ఇంతవరకూ అతడు పధ్నాలుగేళ్ళ తన చెల్లిలితో తప్ప పరాయి ఆడపిల్లతో ఎన్నడూ మాట్లాడి ఎరుగడు. ఇప్పుడు కుసుమవంటి అందమయినదీ, నాగరికురాలూ అయిన పడుచు వెంట నడవటం అతనికి చాలా యిబ్బందిగానే వున్నా ఒక వింత ఆనందాన్ని కూడా యిస్తున్నాదని చెప్పక తప్పదు.

ఆమె నడుస్తూనే “ఏమండీ! ఇందాక పతిద్వయం మీమీద అలిగి వెళ్లినట్టున్నారే!…” అన్నది.

“అవునండీ! పోయినవారంలో కూడా ఒకసారి యిలాగే జరిగింది. వాళ్లిద్దరూ సినిమాలకూ, సర్కసులకూ పోతూ నన్నుకూడా రమ్మంటారు. నా దగ్గర వాటన్నిటికీ డబ్బెక్కడ వుంటుంది చెప్పండి… మా వూళ్ళో యింటిదగ్గర మా అమ్మా, యిద్దరు చెల్లెళ్ళూ వున్నారు. పెద్ద చెల్లెలికి పధ్నాలుగేళ్ళు… దానికి పెళ్లి కావలసి వుంది… చిన్న చెల్లెలు ఆరేళ్ళది… మాకు ఆస్తిపాస్తులేవీ లేవు. పైగా మా వూళ్ళ సంగతి తెలుసుగా మీకు? అక్కడ మంచినీళ్ళు కూడా ‘బిందె యింత’ అని కొనుక్కోవాలి. అందువల్ల నేను జీతం అందుకోగానే నాకోసం అతి తక్కువ డబ్బు వుంచుకుని మిగిలినదంతా అక్కడికి పంపుతాను. అలాంటప్పుడు నాకు వీళ్ళతో తిరగడం ఎలా సాధ్యపడుతుంది చెప్పండి…” అంటూ ఆగాడు జోగినాధం. కుసుమ జాలిగా అతని వంక చూసింది.

అతడు మళ్లీ “నా దగ్గర డబ్బు ఉండదని తెలిసి కూడా నన్ను తమతో రమ్మని బలవంతం చేస్తారు. అన్నిటికీ తమ డబ్బు పెట్టుకుంటామంటారు. అది నాకు బొత్తిగా యిష్టం వుండదు. అలా అని చెబితే వాళ్ళకు కోపం పొడుచుకొచ్చేస్తుంది…” అన్నాడు.

కుసుమ నవ్వి “బాగానేవుంది…” అన్నది.

జోగినాధం “మీ రెప్పుడూ మా ప్రాంతాలకు రాలేదు కదండీ. అక్కడ నీటిచుక్క కనిపించదు. అన్ని కాలాల్లోనూ ఒకటే కరువు. బావులన్నీ ఎక్కడో పాతాళంలోకి వెళ్ళే సొరంగాల్లాగా వుంటాయి. తొంగి చూస్తే అడుగున ఏమీ కనిపించదు. పెద్ద తాడు బొక్కెనకు కట్టి లోపలికి వొదులుతూ వుంటే ఎంతకూ నీళ్ళు తగలవు. చివరకు బొక్కెన రాళ్ళ మీదపడి శబ్దం వినిపిస్తుంది. ఇక నీళ్ళు ఎక్కడో చిన్నిగుంటలా కొద్దిగా వుంటాయి. బొక్కెనను అక్కడికి జరిపి నీళ్ళు రాబట్టుకోవాలి… మా ప్రాంతాలలో బొక్కెనలెలా వుంటాయో తెలుసా మీకు? కిరసనాయిలు డబ్బాలుంటాయి చూశారూ. వాటిని సగానికి తెగగొట్టి అతుకు వేసి నీళ్ళను ఈడ్చుకు వచ్చేందుకు వీలుగా తయారుచేస్తారు. మధ్యాహ్నం పూట సూర్యుడు నడినెత్తి మీద వున్నప్పుడు మాత్రం బావిలోపల ఎక్కడో నీళ్ళు తళతళా లాడుతూ కొంచెంగా కనిపిస్తాయి. అందరూ రాత్రి వేళల్లో వెళ్లి మరునాటికి కావలసిన నీళ్ళు తెచ్చుకోవలసిందే. తెల్లవారితే జల ఉండదు… చుక్కగూడా మిగలదన్న మాట…” అంటూ ఆగి మళ్లీ నిట్టూర్చి “అందుకే నాకు మా వూరంటే బొత్తిగా యిష్టంలేదు… మా వాళ్ళను కూడా యిక్కడికి తీసుకువొచ్చేద్దా మనిపిస్తూవుంటుంది అప్పుడప్పుడు… అయినా నాకిక్కడ వొచ్చేది చాలవొద్దూ…” అన్నాడు.

కుసుమ అతడు చెప్పినదంతా కళ్ళు పెద్దవి చేసుకుని ఆశ్చర్యంగా విన్నది. అతడు మళ్లీ “రెణ్ణెల్ల క్రిందట నేను ఉద్యోగంలో జాయినయేందుకు వచ్చేటప్పుడు రైలు కృష్ణానది మీదినుంచి పరుగెత్తుతూ వుండగా చూసి ఆశ్చర్యంతో బొమ్మలా అయిపోయాను. మీరు నమ్మరేమో! అన్ని నీళ్ళు ఒక్కచోట చూడటం అదే నాకు మొదటిసారి. చిన్నప్పుడెప్పుడో సముద్రం చూశానుగాని అది ఉప్పునీళ్ళు కదా! ఇంత నదీ, యిన్ని నీళ్ళూ వున్న ప్రాంతం సంపన్నం కాకుండా ఎలా వుంటుంది చెప్పండి? నీళ్ళు పుష్కలంగా ఉన్న చోటే నాగరకత… మా ప్రాంతాలలో మనుషులు వొంటినిండా పోసుకునేందుకూ, కడుపునిండా తాగేందుకూ పుష్కలంగా నీళ్ళూ లేకనే చిక్కిపోతున్నారని నాకప్పుడప్పుడు అనిపిస్తూ వుంటుంది. ఇక్కడ నాకు చాలా హాయిగావుంది. రోజూ ఉదయం లేచీలేవగానే కృష్ణకు వెళ్లి స్నానం చేస్తాను. సాయంకాలం ఆఫీసు నుంచి వెళ్లీవెళ్ళగానే బావి దగ్గర మళ్లీ స్నానం చేస్తాను. ఇప్పుడెంతో హాయిగా ఆరోగ్యంగా వున్నాను… అంతా నీళ్ళలోనే వుంది సుమండీ…” అని ఒక్కక్షణం ఆగి “నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తి అయితే మాకూ నీళ్ళకరువు తప్పుతుందనీ, మెట్ట పొలాలన్నీ మాగాణి భూములవుతాయనీ అనుకుంటున్నారు. అది ఎప్పటికో…” అన్నాడు నిట్టూర్చి.

కుసుమ నవ్వి “అయితే మీ నిర్వచనం ప్రకారం నీళ్ళే నాగరికతకూ సౌభాగ్యానికీ మూలకారణం అన్నమాట…” అన్నది.

జోగినాధం తలూపుతూ “అంతేనండీ… నిస్సందేహంగా అందులో మీకేమీ అనుమానం అక్కర్లేదు. అది కరెక్టు.” అన్నాడు. కుసుమ ఆ మాటలు విని మళ్లీ నవ్వింది.

అప్పటికి వారు చాలాదూరం నడచివచ్చారు. కుసుమ ఒకచోట ఆగి “ఇదే మాయిల్లు… రండి… ఒక్క నిముషం కూర్చుని పోదురుగాని…” అన్నది.

జోగినాధం “ఎందుకులెండి… యిప్పుడు…” అంటూ ఏదో చెప్పబోయి ఆమెవంక చూసి ఆగి “సరే పదండి…” అన్నాడు. ఆమె నవ్వుతూ మెట్లెక్కి తలుపుతట్టి “మా అన్నయ్య యింట్లోనే వున్నాడనుకుంటాను… మిమ్మల్ని పరిచయం చేస్తాను.” అన్నది.

ఆరేళ్ళ పలుచని ఎర్రతేలువంటి పిల్ల తలుపు తెరిచి లోపలికి వెడుతూ “అక్కయ్య వొచ్చింది.” అంటూ రాగం తీసింది. కుసుమా, జోగినాధం గుమ్మం లోపలికి వెళ్ళేసరికి కిటికీ పక్కగా వున్న కుర్చీలో ఒకదాన్లో ఎవరో కూర్చుని పేపరు చూస్తున్నారు. కుసుమ అటుతిరిగి “అన్నయ్యా! నువ్వెంతసేపయింది వచ్చి?” అని అడిగింది. ఆ వ్యక్తి పేపరు తప్పించి “ఇప్పుడే, పది నిముషాలయి వుంటుందేమో…” అంటూ జోగినాధం వంక చూశాడు. కుసుమ “వీరు మా ఆఫీసులో పనిచేస్తున్నారు. మిస్టర్ నాధ్ గారు. ఈయన మా అన్నయ్య కామేశం. ఇక్కడ కాలేజీలో లెక్చరరు.” అని ఒకరినొకరికి పరిచయం చేసి “మీరు కూర్చుని మాట్లాడుకుంటూ ఉండండి. నేనిప్పుడే అయిదు నిముషాల్లో కాఫీలు పట్టుకొచ్చేస్తాను” అంటూ లోపలికి వెళ్లింది.

ఆ యిద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు. ఆయనకు యిరవై అయిదేళ్ళకు మించి వుండదు వయస్సు. సన్నగా, ఎర్రగా వున్నాడు. కళ్ళకొక రిమ్‌లెస్ జోడు ఉంది. ధరించిన దుస్తులు చాలా నాగరికమైనవీ, ఖరీదైనవీనూ. ఆయన పేపరు పక్కన వుంచి జోగినాధం ఉద్యోగాన్ని గురించీ, అతని చదువును గురించీ ఏవేవో ప్రశ్నలు వేశాడు.

కొద్ది నిముషాల్లో కుసుమ దుస్తులు మార్చుకుని చేతుల్లో కాఫీ కప్పులతో వచ్చింది. తానొక కుర్చీలో కూర్చుని ఆ యిద్దరికీ కాఫీలు అందించి అన్నగారి వంక తిరిగి “వీరు యివాళ చాలా చిత్రమైన విషయం చెప్పారన్నయ్యా. అది మీ ఎకానమిస్టు లెవరూ యింతవరకూ కనిపెట్టలేదని బల్ల గుద్ది మరీ చెప్పగలను” అన్నది.

ఆయన తల ఎత్తి చూసి నవ్వుతూ “ఏమిటో అది…” అన్నాడు. కుసుమ జోగినాధం వంక తిరిగి “చెప్పనా?” అని అడిగింది. జోగినాధం బిడియపడుతూ “ఎందుకు లెండి…? నాదంతా ఏదో పిచ్చివాగుడు…” అన్నాడు.

ఆమె “అలా కాదు… చెప్పితీరాలి… అన్నయ్యా! వీరంటారు కదా, నీళ్ళే సర్వ నాగరికతకూ, సౌభాగ్యానికీ కారణంట… నీళ్ళు దొరకని చోట్లా లేక తక్కువగా ఉన్నచోట్లా నాగరికత అభివృద్ధి చెందదనీ, ప్రజలు సంపన్నంగా ఉండరనీ కూడా వారి సిద్ధాంతం… ఇప్పుడు చెప్పు… మీ ఎకనమిక్స్‌లో ఈ విషయం యింతకుముందు ఎవరైనా చెప్పారా?” అన్నది.

ఆయన నవ్వాడు. కాఫీ కప్పు ఎదురుగా టీపాయ్ మీద ఉంచి “అది మంచి పాయింటే… మీరు చెప్పింది సబబుగానే ఉంది. కాదనను…” అన్నాడు.

కుసుమ జోగినాధం వైపు “చూశారా? మీరు గెలిచారు” అన్నట్టు చూసింది.

కామేశం మళ్లీ తల పంకించి “కాని యిందులో ఒక తమాషా ఉంది… మీరు చెప్పినట్టు నదులెక్కువగా ఉన్న చోట్లా, వర్షాలు ఎక్కువగా కురిసే చోట్లా తప్పకుండా అభ్యుదయం ఉంటుంది. కాని అవి విపరీతంగా ఉన్నా బాధే. ఉదాహరణకు చూడండి. ఇప్పుడు నదులకు వరదలు వొస్తున్నాయి. పంటలన్నీ గంగపాలై పోతాయి. లెక్కలేనంత మంది ప్రజలు నిర్వాసితులైపోతారు. అకాలంలో వర్షాలు కురిశాయనుకోండి… అప్పుడూ పంటలు ధ్వంసమే. కాబట్టి ఎటూ గట్టిగా రూలింగ్ యిచ్చేందుకు వీలులేదు…” అంటూ ఆగి, “అన్నట్టు మీ వూరేది?” అని అడిగాడు.

జోగినాధం చెప్పాడు. కుసుమ అందుకుని “వాళ్ళ వూరును గురించి యిప్పుడు నాకు చెప్పారన్నాయ్యా! అటువంటి వూళ్ళు కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోయాను. నీళ్ళుకూడా కొనుక్కుంటే గాని దొరకవుట అక్కడ. తాగేందుకూ, వొంటికి పోసుకునేందుకూ అన్నిటికీ నీటి కరువట” అన్నది.

ఆయన “అందులో విచిత్రమేముంది? అలా ఎన్నో వూళ్ళున్నాయి మన దేశంలో. అన్నట్టు ఈ సందర్భంలో మా స్నేహితుడొకాయన చెప్పిన విషయం ఒకటి గుర్తు వస్తున్నది. ఆయనను అటువంటి వూళ్ళో ఎవరో భోజనానికి పిలిచారట. అదే మొదటిసారి ఆయన ఆ వూరికి వెళ్ళడం. భోజనం చేస్తూ వుండగా ‘మంచినీళ్లీరేమిట’ని ప్రక్కవారిని అడిగాడట. వాళ్ళు ఆయన విస్తరి ముందున్న ఒక చిన్న గాజుగ్లాసును చూపించి ‘అదిగో అవే మంచినీళ్ళు’ అన్నారట. ఆయన గ్లాసులో తెల్లగా తేనె కలిపినట్టున్న ఆ ద్రవం చూసి అంతవరకూ ఏదో డ్రింక్ అనుకున్నాట్ట. తీరా చూస్తే అవే మంచినీళ్ళు” అన్నాడు.

కుసుమా, జోగినాధం ఒక్కసారిగా నవ్వారు. తర్వాత జోగినాధం లేచి “ఇక వెళ్లి వస్తానండీ…” అన్నాడు. అన్నా చెల్లెళ్లిద్దరూ అతన్ని గుమ్మందాకా సాగనంపి ఉండిపోయారు.

అతడు నెమ్మదిగా నడిచి రూము చేరుకుని తాళం తీశాడు. లోపలికి వెళ్లి చీకటిపడుతున్నందున లైటువేసి స్నానానికి సిద్ధమైనాడు. చిన్న కొల్లాయి గుడ్డ ఒకటి కట్టుకుని భుజం మీద మరో టవల్ వేసుకుని బావి దగ్గరికి చేరుకున్నాడు. మొదట ఒక పెద్ద బాల్చీ నిండా నీళ్ళు తోడుకుని నూతి పళ్ళెం మీద కూర్చున్నాడు. హాయిగా, ప్రశాంతంగా ఒకదాని తర్వాత ఒకటిగా మూడు పెద్ద బొక్కెనల నీళ్ళు పోసుకున్నాడు.

ఇంట్లో మరో భాగంలో అద్దెకున్న ఒక గుమాస్తా భార్య నీళ్ళకోసం చేతిలో బిందెతో తమ వాటా గుమ్మంలో నిరీక్షిస్తూ నిలబడి ఉంది. అతడామెను చూడనే లేదు. ఆమె లోలోపల “అతడు తనను చూసికూడా త్వరగా తెమలక బాధపెడుతున్నాడ”ని అనుకుంటున్నది.

జోగినాధం నెమ్మదిగా అరగంట తర్వాత నూతి పళ్ళెం దిగి యివతలికి వచ్చాడు. ఇంటి యజమానురాలు అంతసేపటినుంచీ యీ తంతు అంతా చూస్తూనే ఉంది. ఆమె నెమ్మదిగా అతన్ని మందలిస్తూ “అలా పనివేళా గంటల తరబడి నూతిపళ్ళెం మీద కూర్చుండిపోతే ఎలా చెప్పు నాయనా? ఆవిడ యిందాకటినుంచి నీళ్ళకోసం తొందర పడుతూ నీ కారణంగా అక్కడే నిలబడి ఉంది… చూడలేదూ?” అన్నది. జోగినాధం నాలిక కరుచుకుని ప్రక్కకు తిరిగిచూసి “పొరపాటయి పోయిందండీ…” అన్నాడు.

అతడు తర్వాత రూములో కొద్దిసేపు విశ్రాంతిగా కూర్చున్నాడు. ఆవేళ జరిగిందంతా మననం చేసుకున్నాడు. తన రూమ్ మేట్స్ యిద్దరితోనూ తాను అలా వ్యవహరించడంలోని ఉచితానుచితాలు బేరీజు వేసుకుని ఆలోచించాడు. చివరకు తానేమీ తప్పు చెయ్యలేదని నిర్ణయించుకున్నాడు. అయినా ఆ యిద్దరూ తనకు మంచి మిత్రులు. అటు ఆఫీసులోనూ వాళ్ళు చేస్తున్న సహాయం అమూల్యమైనది. ఇద్దరూ చక్కగా చదువుకున్నవాళ్ళు, డబ్బున్నవాళ్ళు. వాళ్ళకు తనమీద అంత అభిమానం ఉండటం తనకెంతో మంచిది. దాన్ని తాను పోగొట్టుకోకూడదు.

ఉమాపతి గోదావరిజిల్లావాడు. మంచి సంపన్న కుటుంబంలో పుట్టినవాడు. అతని తండ్రికి పిత్రార్జితమైన తోటలూ, పొలాలూ, దొడ్లూ పుష్కలంగా ఉన్నాయి. అతను బుద్ధిగా చదువుకున్నాడు. ఏ క్లాసులోనూ తప్పలేదు. డిగ్రీ రాగానే చిన్నదే అయినా దొరికిన ఉద్యోగంలో వెంటనే చేరాడు. అతడు యింటికి నయాపైసా కూడా పంపనక్కర లేదు. ఇక లక్ష్మీపతి ఉన్నాడంటే అతని తండ్రి మొదట్లో బాగా కష్టాలు పడ్డవాడు. అయితేనేం ఆయనకు డబ్బు విలువ, తత్వమూ బాగా తెలుసు. కొంత డబ్బు సంపాదించిన తర్వాత యిక మన తెలివితేటలూ ప్రమేయమూ లేకుండానే ఆ డబ్బు అతిగా పెరిగిపోతుందనీ అందులో అతిశయోక్తి ఏమాత్రమూ లేదనీ ఆయన దృఢ విశ్వాసం. కావలసిందల్లా కొంచెం లౌక్యమనీ, డబ్బు మదుపు పెడితే అది పెరిగే చోట్లూ, తరిగే చోట్లూ ఉన్నాయనీ, పెరిగేచోట్లు గమనించి మదుపుపెట్టే మాత్రపు తెలివితేటలు చాలుననీ, యిక ఆవైపు కూడా అప్పుడప్పుడు తప్ప చూడనక్కరలేదనీ ఆయన అంటూ ఉంటాడు. ఆయన అలాగే చేసి ఆస్తులు అలాగే పెంచాడు కూడా. లక్ష్మీపతి ఆయనకు ఒక్కడే కొడుకు. ఇంట్లో అతని మాటకు ఎదురన్నది లేదు.

జోగినాధం మనస్సులో కుసుమ మెదిలింది. ఆ అమ్మాయి ఎంతో అందంగా ఉంటుంది. దబ్బపండు వంటి శరీరచ్ఛాయ ఆమెది. ఆమె నాజూకైన సన్నని బంగారపు పుల్లలవంటి వ్రేళ్ళు టైపు మెషిను మీద చకచక కదలుతూ ఉంటే చూసేందుకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆమె కన్నులు చెంపకు చేరడేసి ఉండి తళతళ లాడుతున్న నీళ్ళను గుర్తుకు తెస్తాయి. ఆమె అన్న కామేశం అంత చిన్న వయస్సులో కాలేజీ లెక్చరరు అయినాడంటే ఎంతో తెలివిగలవాడయి ఉండాలి. ఆయన కూడా స్ఫురద్రూపి.

జోగినాధానికి తన చెల్లెలు గుర్తుకు వచ్చింది. ఆ అమ్మాయి కూడా ఒక వన్నె తక్కువగా కుసుమ రంగే. అయినా నీళ్ళ కరువు మూలంగానూ, తగిన పోషణ లేకనూ ఆ పిల్ల జబ్బుపడి లేచిన దానిలా ఉంటుందెప్పుడూ. కాని ఆ అమ్మాయి తెలివితేటలూ, వోర్పూ పనిపాటలలో నేర్పూ చెప్పుకోదగ్గవి. దానికి పెళ్లి చేసి ఒక యింటిదాన్ని చేస్తే తమ బాధ్యత సగం తగ్గుతుంది. దానికి ఎక్కడ వ్రాసిపెట్టి ఉందో మరి… అది కాస్తా అయితే తన తల్లినీ, చిన్న చెల్లెలినీ తీసుకుని యిక్కడికి మకాం మార్చేయవచ్చు. అప్పటికి తన శని తప్పినట్టవుతుంది. అయినా ఆడపిల్ల పెళ్లి మాటలతో, ఆలోచనలతో అవుతుందా? దానికెంత కష్టపడాలి? కట్నం పేచీ లేకుండా ఎక్కడైనా సంబంధం కుదిరితే బాగుండిపోను… అయినా తన పిచ్చిగాని, కట్నం లేకుండా ఎవడు పెళ్లికి ఒప్పుకుంటున్నాడీ రోజుల్లో!

అతడు లేచాడు. రూముకు తాళం వేసి వీధిలోకి వచ్చి నడవటం ప్రారంభించాడు. అక్కడొకటీ, అక్కడొకటీ వీధి దీపాలు వెలుగుతున్నాయి. దూరంగా ఎక్కడో రైలు ‘గుప్పు గుప్పు’మని పొగ వొదులుతూ పరుగెత్తి పోతున్నది.

జోగినాధం కామేశాన్ని గురించే ఆలోచిస్తున్నాడు. అతన్నీ, తన చెల్లెలినీ మనసులో పక్కపక్కనే నిలబెట్టుకుని మాటిమాటికీ ఆలోచనలో మునిగిపోతున్నాడు. చివరకు హోటలు ముందుకు వచ్చేసరికి తలవూపి ఏదో నిశ్చయానికి వచ్చాడు.

అతడు హోటల్లో ఒక బల్లముందు కూర్చుని అరిటాకు కడుగుతూ ఉండగా పక్కనే ఉన్న యిద్దరు సర్వర్లు “మంచినీళ్ళ పంతులుగా రొచ్చారు…” అనుకుని నవ్వుకున్నారు. తర్వాత వారిలో ఒకడు ఏకంగా ఒక జార్ నిండా నీళ్ళు తెచ్చి జోగినాధం పక్కనే బల్లమీద ఉంచి వడ్దన ప్రారంభించాడు. అతడు భోజనం చేసినంతసేపూ వారిద్దరూ ప్రతి పూటా చేసినట్టే ఆపూట కూడా అతడెన్ని గ్లాసుల నీళ్ళు తాగాడో లెక్కపెట్టారు. చివరకు లెక్క ఎక్కడో తప్పింది. ఒకడు పదిహేను గ్లాసులనీ, మరొకడు పధ్నాలుగు గ్లాసులు మాత్రమేననీ కొంచెంసేపు తమలో తాము తర్కించుకుని తర్వాత సర్దుకున్నారు.

జోగినాధం భోజనం ముగించి చెయ్యి కడుక్కుని రూము చేరుకున్నాడు. లైటువేసి పక్క మీద వాలి కాయితమూ కలమూ తీసుకుని ఇంటికి ఉత్తరం రాశాడు. మామూలు యోగక్షేమాలతో బాటు అతడు కుసుమ అన్నగారి విషయం కూడా అందులో ప్రస్తావించి “కులగోత్రాలవంటి చిక్కులు రాకుండా ఉంటే, ఆయన ఒప్పుకుంటే నిజంగా మన చెల్లాయి అంత అదృష్టవంతురాలు ఎక్కడా ఉండదనే నా విశ్వాసం. నేను రేపే అన్ని వివరాలూ తెలుసుకుని మళ్లీ నీకు వ్రాస్తాను” అని వ్రాశాడు.

తర్వాత కాయితం, కలం ప్రక్కనే ఉంచి ఆవులించి చిటికవేసి వెల్లకిలా పడుకుని పైకప్పువంక చూస్తూ ఉండిపోయాడు. అంతలోనే అతని కళ్ళు మూతలుపడ్డాయి.

పది గంటలు దాటిన తర్వాత సినిమానుంచి వచ్చిన యిద్దరు మిత్రులూ గాఢంగా నిద్రపోతున్న జోగినాధం వంక చూసి నవ్వుకున్నారు. ఉమాపతి మెల్లిగా “తలుపు బార్లాగా తీసిపెట్టి ఎలా దిట్టంగా నిద్రపోతున్నాడో చూడు…” అన్నాడు లక్ష్మీపతితో.

లక్ష్మీపతి కిటికీ పక్కగా పడివున్న కార్డును చేతిలోకి తీసుకుని చూసి “ఇది నీదేనయ్యా… ఇవాళే వచ్చినట్టున్నది” అన్నాడు. ఉమాపతి దాని అందుకుని చదివి అవతల పడేస్తూ “నాన్నగారు వ్రాశారు. మళ్లీ వరద లొస్తున్నాయట. ఈ ఏడుకూడా పంటల రాబడి తక్కువగా ఉంటుందేమోనని వ్రాశారు. అది ప్రతి రెండు మూడేళ్ళకూ మామూలే. వరద రావడం నిండు పంటను తుడిచిపెట్టి పోవడం… మా పొలాలు కొన్నిటికి పరవాలేదు కాని, కొన్ని మాత్రం బాగా దెబ్బతింటాయి” అంటూ నిద్రపోతున్న జోగినాధం వంక చూసి మళ్లీ, “ఈ గురువుగారికేమో నీళ్ళ కరువు. త్రాగేందుకూ నీళ్ళుచుక్క కూడా లేక వీళ్ళు అవస్థపడుతూ ఉంటారు. మాకేమో వరదలు… ఎంత తమాషాగా ఉందో చూడు” అన్నాడు.

లక్ష్మీపతి ఏమీ మాట్లాడలేదు. నిశ్శబ్దంగా దుస్తులు మార్చుకుని జోగినాధం వైపు చూస్తూ ఉమాపతితో “ఉత్తరం రాస్తున్నాడయ్యా యింటికి…” అని మళ్లీ ఏదో రహస్యం చెబుతున్నట్టు నెమ్మదిగా “పోయిన నెలలో అనుకుంటాను… అంటే యిక్కడికి వచ్చిన పది పదిహేను రోజులకు అతను యింటికి వ్రాసిన ఉత్తరం ఒకటి నేను చదివాను. తప్పే అనుకో. అయినా ఎంత తమాషాగా ఉందో తెలుసా! అబ్బ! దారుణం. ఒక మతి చలించినవాడు రాసినట్టున్నది ఆ ఉత్తరం… ఇక్కడ ఒంటినిండా పుష్కలంగా కావలసినన్ని నీళ్ళు పోసుకుంటూన్నాననీ, కరువుతీరా నీళ్ళు తాగుతున్నాననీ, తన వొంటి రంగు మారి ఆరోగ్యం కూడా పూర్వం కంటె ఎంతో బాగున్నదనీ వ్రాశాడు. పైగా నీళ్లు తాగేటప్పుడు తల్లినీ, చెల్లెళ్ళనూ తలుచుకుని తలుచుకుని మరీ తాగుతాట్ట. అదీగాక అంతకు ముందెప్పుడో వాళ్ళ వూళ్ళో చిన్న చెల్లెలు నీళ్ళబిందె దొర్లించి కష్టపడి తెచ్చుకున్న నీళ్ళన్నిటినీ నేలపాలు చేసిందని తల్లి ఆ చిన్నపిల్లను చావబాదిన వృత్తాంతం అతను నాకు చెప్పాడు. ఉమాపతీ! అది నువ్వు విన్నట్టయితే నిలువునా వొణికిపోయి ఉండేవాడివి…” అన్నాడు.

జోగినాధం నిద్రలో మరోవైపుకు తిరిగి పడుకున్నాడు. ఉమాపతి మెల్లిగా ఆ ఉత్తరం అందుకుని మడత విప్పాడు. ఇద్దరూ మోకాళ్ళ మీద కూర్చుని ఆ ఉత్తరాన్ని చివరివరకూ చదివి మొహాలు చూసుకున్నారు. తర్వాత దాన్ని యథాపూర్వకంగా మడిచి యథాస్థానంలో ఉంచి ఇవతలికి వచ్చారు.

ఉమాపతి నెమ్మదిగా గొంతు తగ్గించి “అంటే మనం వెళ్లిన తర్వాత కుసుమ వెంట వాళ్ళ యింటికి వెళ్ళాడన్నమాట.” అన్నాడొక విధంగా చూస్తూ. లక్ష్మీపతి “అంతే అయు ఉండాలి మరి…” అని బదులు పలికాడు.

మరునాడు ఆఫీసులో జోగినాధం సాయంకాలం నాలుగుగంటలు దాటేవరకూ కుసుమను పలకరిద్దామని ఎంతగానో ప్రయత్నం చేశాడు. కాని, వీలుపడలేదు. నలుగురూ అక్కడే ఉండటమూ, పైగా కుసుమ చాలా హడావిడిగా పనిలో మునిగి ఉండటమూ అందుకు ముఖ్యకారణాలు.

నాలుగున్నరకే అతడు తన పని పూర్తిచేసుకుని తీరికగా కూర్చున్నాడు. ఉమాపతికి ఆ రోజున అసలు పని లేనట్టే లెక్క. అతని సీటు తీరే అంత. పని బహు కొద్దిగా మాత్రమే ఉంటుంది. లక్ష్మీపతి మాత్రం ఏవేవో ఫైళ్ళు తిరగవేస్తూ రిఫరెన్సులకోసం తంటాలు పడుతున్నాడు.

జోగినాధం నీళ్ళ కూజా వంక చూశాడు. మళ్లీ అటూయిటూ చూశాడు. నెమ్మదిగా లేచి కూజా దగ్గరికి వెళ్లి నీళ్ళు గ్లాసులోకి వంచుకున్నాడు. చేతితో గ్లాసు పైకెత్తి పట్టుకుని ఒక్క క్షణం చూసి తర్వాత గడగడ త్రాగాడు.

అది గమనించి శర్మ అనే మరో గుమాస్తా ఏమీ పనిలేక తీరికగా కూర్చుని ఉండి, నవ్వి, “మన కూజాలో నీళ్ళన్నీ ఒక్క జోగినాధంగారే కాజేస్తున్నారండీ… అదేమి చిత్రమో ప్రతి అరగంటకూ ఆయనకు దాహమవుతూ ఉంటుంది” అన్నాడు.

వైనతేయరావు అనే మరో గుమాస్తా ఫైలులోనుంచి తలపైకెత్తి చూసి “బహుశా అదేదో జబ్బయి ఉంటుంది” అని మళ్లీ తల దించుకున్నాడు.

జోగినాధం నవ్వేందుకు ప్రయత్నించాడు. ఉమాపతీ, లక్ష్మీపతీ, ఒకరివంక ఒకరు చూసుకున్నారు.

ఇంతలో టైపు మెషిను చప్పుడు ఒక్క నిముషం ఆగినట్టు కాగా జోగినాధం తల ఎత్తి చూశాడు. కుసుమ బల్లమీద చెయ్యి ఉంచుకుని తీరికగా, విశ్రాంతిగా కూర్చుని ఉంది. జోగినాధం నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్లి గొంతు తగ్గించి “ఏమండీ… మీతో కొంచెం మాట్లాడాలి…” అన్నాడు.

ఆమె నవ్వి “మాట్లాడండి…” అన్నది.

అతడామె ముందు కుర్చీలో కూర్చుని ఏదో చెబుదామని నోరు తెరిచేసరికి తన కొంప ఏదో మునిగినట్టు ఆఫీసరు గదిలో బెల్ ‘గర్’మని మ్రోగింది. ఆమె హడావిడిగా లేచి “తర్వాత మాట్లాడుకుందాం… ఆఫీసరు పిలుస్తున్నారు. అన్నట్టు యివాళ మేము సినిమాకు వెడదామనుకున్నాం. మీరూ రండి, మా అన్నయ్య సంతోషిస్తాడు. పైగా మీరు మాట్లాడనూ వచ్చు…” అంటూ హడావిడిగా ఆఫీసరు గదిలోకి వెళ్లింది.

జోగినాధం కొద్ది క్షణాలు అలాగే కూర్చుండిపోయాడు. ఇవాళ ఏది ఏమయినా సరే వారితో యీ విషయం ప్రస్తావించి వివరాలు తేల్చుకుని ఉత్తరం వ్రాయాలి. నిజంగా యీ సంబంధం కుదిరితే అమ్మ ఎంతగా సంబరపడిపోతుందో!

కుసుమ మరో అయిదు నిమిషాలకు గాని యివతలికి రాలేదు. వస్తూనే ఒక కాయితం చూపించి జోగినాధంతో “ఇదుగో యీ ఒక్కటీ అందజేస్తే వెంటనే మనం వెళ్లిపోవచ్చు…” అంటూ చకచక పనిచెయ్యసాగింది.

జోగినాధం ‘అలాగే’ అని తలవూపి లేచి నెమ్మదిగా నడిచి యివతలి వరాండాలో నిలబడి జేబులో చేతులుపెట్టి వెదికాడు. రెండు రూపాయ నోట్లు కనిపించాయి. అతడు తేలికగా నిట్టూర్చి మళ్లీ తన సీటులోకి వచ్చి కూర్చున్నాడు. ఉమాపతి లక్ష్మీపతితో ఏదో రహస్యం మాట్లాడుతున్నాడు.

ఉన్నట్టుండి ఉమాపతి శర్మ అనే గుమాస్తాతో “మీ రిందాక జోగినాధం నీళ్ళు తాగడం గురించి మాట్టాడారు చూశారూ! మీరా విషయంలో మరికొంత తెలుసుకోవడం అవసరం… వాళ్ళ ప్రాంతంలో వూళ్ళన్నీ ఎప్పుడూ కరువుతో కొట్టుకుపోతూ ఉంటాయి. ఎక్కడా నీళ్ళు చుక్కకూడా దొరకదు. కడుపునిండా తాగేందుకు, వొంటినిండా పోసుకునేందుకూ నీళ్ళుండవు. తాగేందుకు బిందెడు నీళ్ళు మూడణాలు పెట్టి మరీ కొనుక్కోవాలి. అటువంటి వూరినుంచి వొచ్చినవాడికి ఇక్కడ పుష్కలంగా నీళ్ళు దొరికేసరికి కోతికి కొబ్బరికాయ దొరికినట్టే కదా” అన్నాడు.

జోగినాధం “అవును. భగవంతుడి దయ అలా ఉంది. మాకు నీళ్ళు లేవు. మీరేమో వరదల్లో మునిగిపోతున్నారు” అన్నాడు.

ఉమాపతి “భగవంతుడి దయ అనకు… అధర్మం పెరిగిపోతే అంతే… నీటిచుక్క దొరకదు…” అన్నాడు.

లక్ష్మీపతి అందుకుని “అలా కాదు. మీది మరీ దారుణం. నువ్వే చెప్పావు ఒకసారి గుర్తుందా? మీ చిన్న చెల్లాయి నీళ్ళబిందె దొర్లించడం సంగతి” అన్నాడు.

శర్మా, వైనతేయరావూ ఒక్కసారిగా “ఎవరా చెల్లాయి? ఏమా కథ? అది చెప్పండి ముందు” అన్నారు.

లక్ష్మీపతి జోగినాధం వంక తిరిగి “చెప్పనా?” అని అడిగి తర్వాత అతని సమాధానం కోసం ఎదురు చూడకుండానే ప్రారంభించాడు. “అతనే చెప్పాడు వొచ్చిన కొత్తల్లో. ఒకసారి వాళ్ళ యింట్లో జరిగిన విషయమే. రాత్రి అంతా కష్టపడి బావికీ యింటికీ తిరిగి ఒక బిందెడు మంచినీళ్ళు సంపాయించుకున్నారట. మర్నాడు ఉదయం వాళ్ళ చెల్లెలు – చిన్నపిల్ల – గ్లాసు ముంచుకోబోగా ప్రమాదవశాత్తూ బిందె దొర్లిపోయింది. నీళ్ళన్నీ నేలపాలై పోయాయి. ఆడపిల్ల భయంతో బిగుసుకుపోయి నిలబడిపోయింది. తల్లివచ్చి రెక్క పుచ్చుకుని గొడ్డును బాదినట్టు చావగొట్టిందట… ఇలా అని అతనే చెప్పాడు నాకు. కావలిస్తే అడగండి…”.

జోగినాధం వంచిన తల ఎత్తలేదు. ఉమాపతి “ఇక ఇతను స్నానం ప్రారంభించాడా… అది గంటల తరబడి సాగుతుంది!… ఒక్కొక్క బొక్కెనే తోడుకుని ‘యిది చెల్లాయికి’, ‘యిది అమ్మకు’, ‘యిది చిన్నచెల్లాయికి’ అని గొణుక్కుంటూ వొంటిమీద పోసుకుంటాడండీ… తాగేటప్పుడూ అంతే..గ్లాసు పైకెత్తి పట్టుకుని చూస్తాడు మీరు గమనించారో లేదో. ఆ చూడటం నలక లున్నాయేమోనని మాత్రం కాదు… కళ్ళు మూసుకుని ఏమిటో గొణుక్కుని మరీ తాగుతాడు. రోజూ తెల్లవారుతుండగానే కృష్ణకు బయలుదేరి పోతాడు. సాయంకాలంపూట యింట్లో బావి ఉండనే ఉంది. ఇక హోటల్లో సర్వర్లందరూ యితని కేం బిరుదు యిచ్చారో తెలుసా! ‘మంచినీళ్ళ పంతులుగారు’. మొన్న నేను విన్నాను.” అన్నాడు.

శర్మ “ఇది వింత కేసే” అన్నాడు. వైనతేయరావు వంకరగా నవ్వి గంభీరంగా “ఇదొక మానసిక వ్యాధి అయి ఉంటుంది” అన్నాడు.

జోగినాధానికి కోపం ముంచుకు వచ్చింది. వీళ్ళందరూ తనను గేలిచేసి ఏడిపించేందుకు ప్రయత్నిస్తున్నారనే విషయం స్పష్టంగా తెలిసిపోయింది. ఆ క్రౌర్యం అతడు భరించలేకపోయాడు. అందర్నీ నిప్పులు చెరిగే కళ్ళతో చూశాడు. కుసుమ అన్నీ విన్నది కాబోలు సానుభూతితో చూస్తున్నది.

వైనతేయరావు ఊరుకోకుండా “ఏది ఏమయినా అలా బొత్తిగా” అని ఏదో అనబోతూ ఉండగా, జోగినాధం పెద్దగా “ఇక తమరేమీ మాట్లాడకండి సార్. ఇప్పటికే చాలా అసహ్యంగా మాట్లాడారు. మిమ్మల్ని అర్థం చేసుకోగలను లెండి. అంత బొడ్డూడని పసివాణ్ణేమీ కాదు.” అన్నాడు.

శర్మ అనే గుమాస్తా కలగజేసుకుని “అదేమిటండీ… మిమ్మల్ని యిప్పుడేమన్నామనీ మీకు అంత కోపం? ఏదో నీళ్ళు ఎక్కువగా తాగుతారనీ…” అంటూ ఉండగా ఇక జోగినాధం వూరుకోలేకపోయాడు. విసురుగా సీటులో నుంచి లేచి “ఆపండిక… మీరింకా అలాగే మాట్లాడుకుంటూ పోతే ఏం చేస్తానో నాకే తెలీదు.” అంటూ ఉద్రేకంతో ఊగిపోతూ “అవునండీ… నేను నీటిచుక్క దొరకని వూళ్ళో పుట్టి పెరిగాను. ఇక్కడ నీళ్ళు చూసేసరికి కోతికి కొబ్బరికాయ దొరికినట్టే అయింది. విపరీతంగా తాగుతున్నాను. అంతేకాదు… కావలిస్తే మూర్ఛవాడిలా పొట్ట పగిలేట్టు నీళ్ళు తాగుతాను. పిచ్చివాడిలా గంటల తరబడి స్నానం చేస్తాను. లేకపోతే ఏదన్నా మంచి ముహూర్తం చూసి కృష్ణలో పడి చస్తాను. అయితే మాత్రం? మీకెందుకు?” అన్నాడు.

తర్వాత కణతలు పట్టుకుని సీటులో కూర్చుండిపోయాడు. అంతటా నిశ్శబ్దమైపోయింది. ఎవరూ పెదవి కదపలేదు. కుసుమ టైపు చేయడంలో మునిగిపోయి ఉంది. జోగినాధం యింత జరిగిన తర్వాత ఎప్పుడో అక్కడినుంచి పారిపోయి ఉండేవాడు. కాని, యివాళ కుసుమతో, ఆమె అన్నగారితో మాట్లాడాలి. అది తప్పదు.

ఒక పావుగంట తర్వాత చాలామంది యిళ్ళకు వెళ్లిపోయారు. కుసుమ టైపుమెషిను మీద కవరువేసి సిద్ధమై జోగినాధం వంక చూసింది.

అతడు లేచి నిలబడి రుమాలుతో మొహం తుడుచుకుని ఆమె వెంట బయలుదేరాడు. ఇద్దరూ మెట్లు దిగుతూ ఉండగా ఆమె జోగినాధంతో “మీరెందుకలా యిరిటేట్ అవుతారు?” అన్నది.

జోగినాధం వెంటనే సమాధానం చెప్పలేదు. కాని, ఒక్క క్షణం ఆగి “అలా మనిషిని నిస్సహాయంగా చేసి వెర్రివాణ్ణి చేస్తుంటే ఎలా సహించడం చెప్పండి? ఏమయినా కారణం ఉందా అంటే ఏమీలేదు. నా చేతికి ఆరువేళ్ళున్నాయి కదా! అది పట్టుకుని నన్ను నలుగురిలో ఎగతాళి చేస్తుంటే ఎలా ఉంటుంది చెప్పండి? అవును నిజమే… మా వూళ్ళూ, మా ప్రాంతమూ వట్టి దౌర్భాగ్యపువే. నీళ్ళ కరువు ఉంటే దౌర్భాగ్యం కాక మరేమిటి? అయినా మధ్య నేనెందుకు వెర్రివాణ్ణవుతాను. ‘ఇదొక మానసిక వ్యాధిట’. ఆ వైనతేయరావు పిలక నా చేతిలో ఉంది. ఏమనుకుంటున్నాడో ఏమో? బోడిపేరూ వాడూనూ… ఈసారి యిలా ఏమన్నా వాగితే ఆఫీసరుతో చెప్పేస్తాను…” అన్నాడు.

కుసుమకు నవ్వు వచ్చింది. కాని ఆమె నవ్వలేదు. అతడు ఆఫీసరుకు చెబుతా నన్నప్పుడు, తోటి పిల్లవాడిమీద కోపగించి మేష్టారితో రిపోర్టు చేస్తానని బెదిరించే బడి పిల్లవాడు గుర్తుకువచ్చాడామెకు.

ఇద్దరూ కుసుమ ఇంటిముందు ఆగేసరికి లోపలినుంచి గోలగా నవ్వులు వినిపిస్తున్నాయి. కుసుమ తలుపు తట్టి అతనివైపు చూసి “ఎవరో బంధువులు దిగినట్టున్నారు” అన్నది.

తలుపు తెరిచిన చిన్నపిల్ల మామూలుగానే “అక్కయ్య వచ్చిందో” అని రాగం తీస్తూ లోపలికి వెళ్లింది.

హాల్లో చాపమీద కూర్చుని క్యారమ్సు ఆడుతున్న వ్యక్తులను చూడగానే కుసుమ ఆనందంతో పరుగెత్తుకు వెళ్లి “అరె! నువ్వెప్పుడొచ్చావ్ వసంతా?” అని అడిగింది. జోగినాధం గుమ్మం దగ్గరగా నిలబడి ఉండిపోయాడు. ఆ వసంత అనబడే అమ్మాయి “ఇప్పుడే… ఒక అరగంట అయిందేమో. లోపల అమ్మ ఉంది…” అన్నది.

జోగినాధం ఆశ్చర్యపోతూ చూశాడు. అంత అందమైన స్త్రీ నతడు ఇంతవరకూ చూడలేదు. ఆమె ఎడమ చేతికొక వాచీ, కుడిచేతికి మూడో నాలుగో బంగారు గాజులూ ఉన్నాయి. ఆ బంగరురంగు ఆమె వంటిమీద బొత్తిగా కనిపించకుండా ఉంది. నల్లని చిలిపి ముంగురులు కొన్ని నుదుటిమీద పడుతూవుంటే వాటిని ఎడమచేతి వ్రేళ్ళతో పైకి తోసుకుంటున్నదామె. నవ్వుతున్నప్పుడు బుగ్గలు ఎంతో అందంగా సొట్టలు పడుతున్నాయి. ఆమె వయస్సు పదహారేళ్ళకు మించి ఉండదు.

కుసుమ జోగినాధంతో “సారీ! యిలా రండి మీరు. కూర్చుని ఉండండి, యిప్పుడే వస్తాను” అన్నది.

కామేశం ఆ మాటలు విని తల తిప్పి చూసి “అరె! మీరూ వచ్చారా? గుడ్. ఇలా కూర్చోండి” అంటూ మళ్లీ తన ఆటలో లీనమైపోయాడు.

కుసుమ కొద్ది నిముషాల్లో యివతలికి వచ్చింది. జోగినాధం అక్కడే వారి ఆట చూస్తూ కూర్చుని ఉన్నాడు. కుసుమ ముందుకు వచ్చి “అన్నయ్యా! యివాళ మరి సినిమా ప్రోగ్రాం ఎలారా?” అని అడిగింది.

కామేశం “దానికేం?” అన్నాడు. అంతలో లోపలినుంచి ఒక ముప్ఫయి అయిదేళ్ళ స్త్రీ వచ్చి “అవును… దానికేం? మీరు సినిమా మానుకోవడమెందుకూ? అందరూ సరదాగా వెళ్లిరండి. నేను యింటిదగ్గర వంటా వగైరాలు చూసుకుంటాను” అన్నది.

కుసుమ “ఇంకా టైముందిగా. రెండాటలాడి పోదాం. నేనూ అన్నయ్యా ఒక పార్టీ” అన్నది.

వసంత కాయిన్స్ తీస్తూ “అలా వీల్లేదు. నేనూ మీ అన్నయ్యా ఒక పార్టీ” అన్నది.

కుసుమ “నెరజాణవే నువ్వు… అప్పుడే అన్నయ్యను కలిపేసుకుంటున్నావ్. ఆగవమ్మా కొంచెం గుర్రాన్ని కట్టెయ్. కోర్సు పూర్తి కానీ…” అన్నది.

జోగినాధం చిత్రమైన అవస్థలో పడ్డాడు. అంతలో మళ్లీ కుసుమ అతన్ని ఉద్దేశించి “సరే రండి… సార్.. మీరూ నేనూ ఒక పార్టీట… కూర్చోండి” అన్నది.

అతడు సిగ్గుపడుతూ “నాకు బొత్తిగా రాదండీ… ఎలా?” అన్నాడు.

కామేశం “ఫరవాలేదు. ఇక్కడ అందరూ ఇంటర్నేషనల్ ప్లేయర్స్… ఎవరికీ బాగా రాదు. ఏదో సరదాగా ఆడుకుంటాం కానీ మరొకటి కాదుగదా! రండి రండి.” అన్నాడు.

జోగినాధం బిడియపడుతూ కూర్చున్నాడు. టాస్ వేయగా కుసుమకు అనుకూలంగా పడింది. ఆమె జోగినాధానికి స్ట్రయికర్ అందించి “ఊఁ! కానివ్వండి” అన్నది.

జోగినాధం ఎడమచేతితో స్ట్రయికర్ను బలంగా కొట్టాడు. వసంత ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవిచేసి “మైగాడ్! ఈయన ఎడమచేతి వాటం… పైగా ఆరువేళ్ళున్నాయి” అన్నది.

కుసుమ “అన్నట్టు మరిచేపోయాను. వసంతా! వీరు మిస్టర్ నాధ్ అని మా ఆఫీసులో పనిచేస్తున్నారు” అని పరిచయం చేసింది. వసంత చేతులు జోడించింది.

ఆమె మళ్లీ జోగినాధంతో “ఈమె మా మేనత్త కూతురు. పేరు వసంత. సెకెండియర్ బి.ఎస్సి. వుడ్‌బి మిసెస్ కామేశం… అంటే మాకు కాబోయే వదినగారన్నమాట. వాళ్ళకు తొందరగానే ఉందిగాని మా మామయ్య అండ్ కో పెద్దవాళ్ళందరూ ‘ఆయ్! తొందర పనికిరాదు. ముందర పిల్ల చదువు పూర్తి కావల్సిందే. అందాకా అలా ఉండండి, వేరువేరుగా కలలు కంటూ’ అని మందలించారు. అదన్నమాట అసలు విషయం” అన్నది.

వసంత బుగ్గలలో గులాబులు విచ్చుకున్నాయి. కొంచెం ఎర్రబడిన మొహంతో ఆమె కుసుమను మోచేత్తో పొడిచి మెల్లగా “ఛీ వూరుకోవే!” అన్నది.

కామేశం నవ్వి జోగినాధంతో “మా వాళ్ళు మరీ రాలుగాయి పిల్లలండీ బాబూ!” అన్నాడు.

జోగినాధం దిగాలుపడిపోయాడు. ఒక్కసారిగా మనిషిలో సత్తువ సన్నగిల్లి నీరసం ఆవరించింది. ఆట ఆడుతూనే వున్నాడు కాని మనసంతా చీకాకైపోయింది. సినిమా రీలులో లాగా తన వూరూ… చెల్లాయిలూ, తల్లీ, గడ్డికూడా మొలవని చవిటి నేలా, రాళ్ళు పగిలే ఎండలూ, వెచ్చని యీదురు గాలీ, నీళ్ళులేని బావులూ, నీళ్ళకోసం పాట్లూ, ఎక్కడ చూసినా నీరసంగా నిస్తేజంగా వుండే జనమూ… మనసులో తిరిగిపోయారు.

ఒక ఆట పూర్తి అయింది. కుసుమ “కాబోయే దంపతులు గెలిచారు. సరే యిక యిది కట్టిపెడదాం… టైమవుతున్నది. అన్నయ్యా! నువ్వు తయారేనా?” అన్నది.

కామేశం లేచి “జస్ట్ వన్ మినిట్” అంటూ లోపలికి వెళ్ళాడు. జోగినాధం కూడా లేచి చొక్కా గుండీలు సర్దుకుంటూ “నేనుకూడా వెళ్లి వస్తానండీ” అన్నాడు.

కుసుమ ఆశ్చర్యపోయి “అదేమిటండీ, మీరు కూడా వస్తానన్నారుగా… పైగా మా అన్నయ్యతో ఏదో మాట్లాడాలన్నారు కదా?” అన్నది.

జోగినాధం ఏం చెప్పాలో తెలియక “ఏమీ లేదులెండి” అని వూరుకున్నాడు. కుసుమ “మరి?” అని రెట్టించి అడిగింది. జోగినాధం యిక అక్కడ నిలబడలేక పోయాడు. “ఏమీ లేదులెండి… కాలేజీ విషయాలేమైనా చెబుతారేమోనని కాసేపు తీరికగా మాట్లాడుదామనుకున్నాను. వీలైతే నైట్ కాలేజీలో చేరుదామని వుందనుకోండి. అంతకంటే మరేమీ లేదు. మరోసారి మాట్లాడుతాను లెండి. అదేమీ పెద్ద ముఖ్య విషయం కాదుగా! వెళ్లి వస్తానింక…” అంటూ వీధిలోకి వచ్చేశాడు. కుసుమ అలాగే ఆశ్వర్యంతో నిలబడిపోయింది.

అతడు నేరుగా రూముకు వచ్చేశాడు. తలుపులు తెరిచే వున్నాయి. ఉమాపతీ, లక్ష్మీపతీ, చెరొక పక్కా పడుకుని కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. వాళ్లిద్దరూ ఒకచోట చేరితే యిక కబుర్లకూ నవ్వులకూ లోటుండదు. ఏవేవో కాలేజీ కబుర్లు చెప్పుకొని విరగబడి నవ్వుకుంటూ వుంటారు.

జోగినాధం రావడం చూసి యిద్దరూ కబుర్లు ఆపేశారు. అతడు లోపలికి వెళ్లీ వెళ్ళడంతోనే పక్కమీద వాలిపోయి కళ్ళు మూసుకున్నాడు. ఉమాపతి, లక్ష్మీపతి వంక చూసి కన్నుగీటుతూ “సినిమాకు వెళ్ళలేదా గురువుగారూ?” అని అడిగాడు జోగినాధాన్ని. జోగినాధం “లేదంటూ” తల అడ్డంగా వూపాడు.

తర్వాత అతడు లేచాడు. క్రితం రాత్రి తాను యింటికి వ్రాసిన ఉత్తరం యివతలికి తీసి దాన్ని ముక్కలు ముక్కలుగా చింపి కిటికీ నుంచి విసిరివేశాడు. ఆ కాయితపు ముక్కలు గాలి విసురుకు చెల్లాచెదరై ఎటెటో ఎగిరిపోయాయి.

ఒక అరగంట దాదాపు నిశ్శబ్దంగానే గడిచింది. తర్వాత ఉమాపతి లేచి “నాకు ఆకలి వేస్తున్నది బాబూ, హోటలుకు వచ్చేవాళ్ళు రావచ్చు” అన్నాడు. జోగినాధం కదలలేదు. లక్ష్మీపతి లేచి చొక్కా తొడుక్కుని “ఊఁ! పోదాం పద…” అన్నాడు.

ఇద్దరూ గదిదాటి బయటికి వచ్చారు. ఉమాపతి ఆగి అనుమానంగా “మనం తప్పు చేస్తున్నా మనిపిస్తున్నదోయ్… అతని సంగతి మనకు తెలుసుకదా! కేవలం అమాయకుడు. ఒకసారి వెళ్లి ‘రమ్మ’ని పిలుద్దాం. రాకపోతే సరే, యిద్దరం వెళ్లిపోదాం. అప్పుడు మన తప్పేమీ వుండదు” అన్నాడు.

తర్వాత మళ్లీ యిద్దరూ లోపలికి వెళ్లి జోగినాధాన్ని తట్టి లేపారు. అతడు కళ్ళు తెరిచి చూసి “ఏమిటండీ?” అని అడిగాడు.

ఉమాపతి “మీరు వచ్చినప్పటినుంచీ ఎన్నడూ యిలా మేము వేరుగా వెళ్ళలేదు. మీరూ రండి భోజనానికి…” అన్నాడు.

జోగినాధం కళ్ళలో ఎందుకో నీటిపొర నిలిచింది. అతడు గద్గదస్వరంతో “నాకీపూట ఆకలి లేదండీ…నిజం… మీరిద్దరూ వెళ్లిరండి” అన్నాడు.

ఉమాపతి అతని నుదుట చేయి ఉంచి చూసి “ఒళ్ళు కొంచెం వేడిగానే ఉంది. అయినా అన్నం మానటం మంచిది కాదేమో!” అన్నాడు.

జోగినాధం తలవూపి “కాదులెండి. నేనీపూట ఏమీ తినలేను. మీరిద్దరూ వెళ్లిరండి” అన్నాడు. దానితో వారిద్దరూ మరేమీ మాట్లాడకుండా వీధిలోకి వెళ్లిపోయారు.

జోగినాధానికి ఎందుకో ఏడుపు పొంగి వచ్చింది. అతడింత వరకూ ఎన్నడూ తల్లినీ చెల్లెళ్ళనూ వొదిలి వున్నవాడు కాదు. ఈ రెణ్ణెల్ల నుంచీ అతడు ఎన్నో పర్యాయాలు ఏడుపును దిగమ్రింగుకున్నాడు. కాని యివాళ ఆఫీసులో జరిగిన ఉదంతం అతన్ని కలతపెట్టింది. కాని అతడు దాన్ని అట్టే లెక్కచేయలేదు. దాని తర్వాత కుసుమ యింట్లో జరిగినదంతా అతన్ని చాలా క్షోభ పెట్టింది. తాను నిన్నటినుంచీ చాలా ప్రేమగా కట్టుకున్న పేకమేడలు ఒక్కసారిగా కూలిపోయినట్టయింది. అతడు లోలోపల దుఃఖంతో దిగులుతో మెలికలు తిరిగిపోతూ అలాగే పడుకున్నాడు. ఇంతలోనే అతనికి గాఢంగా నిద్రపట్టింది.

అతడు కళ్ళు విప్పి చూసేసరికి రూములో చిన్న బల్బు వెలుగుతున్నది. ఎక్కడా ఏ అలికిడీ లేదు. ఉమాపతి, లక్ష్మీపతి, యిద్దరూ గురకలు పెడుతూ నిద్రపోతున్నారు.

అతడు లేచి బల్లమీద వున్న ఉమాపతి రిస్టువాచీ చేతిలోకి తీసుకుని చూశాడు. అయిదు గంటలకు యిరవై నిముషాలు తక్కువ. ఇక కదిలితే మంచిది. తెల్లగా తెల్లవారిన తర్వాత నదికి బయలుదేరి వెళ్ళటం యిక మానుకోవాలి. లేకపోతే వీళ్ళతో చిక్కే. త్వరగా వెళ్లి వాళ్ళు లేవకముందే రూముకు చేరుకోవడం మంచిది. క్రిందటిరోజు ఆఫీసులో జరిగిన ప్రహసనం మళ్లీ జరగదని హామీ ఎక్కడా లేదు కదా! అతడు త్వరత్వరగా రూము తలుపులు దగ్గరకు లాగి మెట్టు దిగి వీధిలోకి వచ్చాడు. క్రింది మెట్టు దిగుతూ వుండగా ఎందుకో గుండె జలదరించింది.

వీధి చివర ఒక కుక్క అరుస్తున్నది. ఏ యింటి పెరటిలోనో దాక్కునివుండి గుడ్లగూబ ఒకటి వుండి వుండి కూత పెడుతున్నది. వీధులలో అక్కడొకరూ, అక్కడొకరూగా జనం పలుచగా తిరుగుతున్నారు.

జోగినాధం మనసులో తన వూరూ, నెర్రెలు విచ్చిన పొలాలూ, రాత్రిళ్ళు నిద్రలేకుండా నీళ్ళు మోస్తూ తిరుగుతున్న తల్లీ చెల్లెలూ, నీళ్ళబిందె దొర్లించి చావు దెబ్బలుతిన్న చిన్నచెల్లెలూ, నిస్తేజంగా నీరసంగా వుండే జనమూ, వెచ్చని హోరుగాలీ, రాళ్ళు పగిలే ఎండలూ, గిర్రున సినిమారీలు లాగా తిరిగిపోయాయి. లోలోపల “నాగార్జునసాగర్ పూర్తి అయితే మాకూ యీ బాధలు తప్పి బోలెడన్ని నీళ్ళు వస్తాయి…” అనుకున్నాడతడు.

నది మెట్ల క్రింద రొద చేస్తూ ప్రవహిస్తున్నది. దూరంగా వంతెన మీద ఏదో రైలు చప్పుడు చేస్తూ పోతున్నది. చల్లని, జీవంపోసే గాలి హాయిగా తెరలుతెరలుగా వీస్తున్నది. మెట్ల దగ్గర అప్పుడే నలుగురైదుగురు మనుషులు స్నానం చేస్తున్నారు. వారిలో ఒకాయన ఏవేవో మంత్రాలు చదవుతున్నాడు. పలుచని వెలుతురు మందంగా వ్యాపిస్తున్నది.

జోగినాధం చొక్కా విప్పి తువాలు కట్టుకుని నెమ్మదిగా నీళ్ళలోకి దిగాడు. చల్లని నీళ్ళు మంచులాగా మోకాళ్ళకు పైగా తగిలేసరికి శరీరం పులకరించి నట్టయింది. మరొక అడుగు ముందుకు వేసి మెట్టు దిగాడు. హాయిగా, “ఎంత బావుంది!” అనుకున్నాడు. మరొక అడుగు ముందుకు… తానిలా హాయిగా మనసు తీరా స్నానం చేస్తూవుంటే తన వూళ్ళో తన వారెలా వున్నారో అనే బాధ అతని మనసులోకి వచ్చింది. అమ్మ రాత్రి అంతా నీళ్ళకోసం తిప్పలుపడి యిప్పుడే కొద్దిగా నడుం వాల్చి వుంటుంది.

మరొక మెట్టు క్రిందికి… అతని మనసులో తన వూరూ, తన యిల్లూ, యింటి వెనక ఎండిన పున్నాగ చెట్లూ, పొలాలూ, నీళ్ళులేని బావులూ, అన్నీ మళ్లీ సినిమారీలు లాగా తిరిగిపోయాయి. మళ్లీ “నాగార్జునసాగర్ పూర్తి అయితే మాకూ యిబ్బందులు తప్పుతాయి. అప్పుడు కావలసినన్ని నీళ్ళు…” అనుకున్నాడు. మరొక అడుగు ముందుకు వేశాడు. మెట్ల మీద నిలబడ్డవారు ఆందోళనతో అతని వంక చూస్తున్నారు.

అంతలో అతని కాళ్ళు తేలిపోయాయి. అతని గుండెలు ఝల్లుమన్నాయి. “అరె! భగవంతుడా! ఏమయిపోతున్నాడు తాను? ఎందుకలా నీళ్ళు తనను లాక్కుపోతున్నాయి? గుండ్రంగా రంగులరాట్నం తిరిగినట్టవుతున్నదేమిటి? కాళ్ళకు మెట్లు అందవేం? ఆ మనుషులు కనిపించరేం? తన కళ్ళకీ నీళ్ళు అడ్డు వస్తున్నా యెందుచేత?”

దూరంనుంచి కేకలు లీలగా వినిపించాయి. నీళ్ళు తన చుట్టూ ఒక గోడ కట్టినట్టుగా ఏర్పడి వొడ్డునున్న వారిని చూసేందుకే వీలు లేకుండా చేశాయి.

అతడు గొంతు పెద్దది చేసి అరిచాడు. వెంటనే అతని గొంతులోకి నీళ్ళుపోయాయి. రెండవసారి మళ్లీ అలతోపాటు కొంచెం పైకి వచ్చినందువల్ల కాబోలు అతనికి దూరంగా మనుషులు కనిపించారు. అతడు చేతులెత్తి నమస్కారం చేసి “బాబోయ్ రక్షించండి…!” అని అరిచాడు. దానితో మరి కాసిని గుటకలు వేశాడు. అతని మనసులో క్షణంలో సగంలో మళ్లీ సినిమా రీలులో లాగా తన వూరూ, తల్లీ చెల్లెళ్ళూ, నీళ్ళు లేని బావులూ, నెర్రెలు విచ్చిన పొలాలూ, వెచ్చని హోరుగాలీ… తన స్నేహితులిద్దరూ, కుసుమా, కామేశం… కాంతివేగంతో మనసులోకి వచ్చి వెళ్లిపోయారు.

అంతలోనే అతడు మూడవసారి పైకి లేచాడు. మళ్లీ చేతులెత్తి ఒడ్డున ఉన్నవారి నుద్దేశించి “బాబోయ్! రక్షిం…” అన్నాడు. అంతే. ఆ చేతులు నీరసంగా వాలిపోయాయి. పగబట్టిన పాముల సమూహంలా నీళ్ళు అతన్ని ‘రివ్వు’న లోపలికి లాక్కుపోయాయి. కొద్ది క్షణాల్లోనే ఒడ్డున ఉన్నవారికి అక్కడ ఏమీ కనిపించలేదు.

నది తన దోవన తాను భీకరంగా పరవళ్ళు తొక్కుతూ ప్రవహించిపోతున్నది. ఎక్కడో కొన్ని వందలమైళ్ళ దూరంలో మారుమూల పల్లెటూళ్ళో వూరియింట్లో నిద్రలోవున్న తల్లిప్రేగు కదిలింది.
(ప్రథమ ప్రచురణ: భారతి, 1965.)
----------------------------------------------------------
రచన: పెద్దిభొట్ల సుబ్బరామయ్య, 
ఈమాట సౌజన్యంతో