Sunday, January 7, 2018

పరోపకారులకు సహజగుణాలు


పరోపకారులకు సహజగుణాలు 




సాహితీమిత్రులారా!



పరోపకారం మిదం శరీరం అని ఆర్యోక్తి
మరి పరోపకారులకు సహజంగా వచ్చే
గుణాలను భర్తృహరి తన నీతిశతకంలో
వివరించారు. దాన్ని ఏనుగు లక్ష్మణకవి
ఈ విధంగా అనువదించారు చూడండి-

తరువు లతిరసఫలభార గురుతఁగాంచు
నింగి వ్రేలుచు నమృత మొసంగు మేఘుఁ
డుద్ధతులు గారు బుధులు సమృద్ధిచేత
జగతి నుపకర్తలకు నిది సహజగుణము

చెట్లు ఆమనిలో వంగి ఉంటాయి.
నీళ్ళతో నిండిన మేఘం బరువుతో
క్తిందికి వ్రేలాడుతూ ఉంటుంది.
మంచివాళ్ళు సంపదలు వచ్చినపుడు
గర్వం వహించరు. ఇది పరోపకారుల
స్వభావం. దీనిలో నమ్రత, క్రిందుగా
ఉండటం, గర్వంగా లేకుండటం - అనే ఇవే
పరోపకారుల సహజగుణాలు.

Saturday, January 6, 2018

నవ వధువు


నవ వధువు




సాహితీమిత్రులారా!



నేడు తెలుగు పద్యం దాదాపు మృతప్రాయమైందని
అనుకోవాల్యిన తరుణంలో శంకరాభరణం అనే పేరున
ఒక బ్లాగు నెలకొల్పి పద్యంకవిత్వంపై అనేక మందికి
మక్కువ కలిగించి సమస్యాపూరణం ద్వారా ఇప్పటికి
దాదాపు 3000లకు సమస్యాపూరణలు చేసిన చేయించిన
నవ పద్యకవితా భగీరథుడు కందిశంకరయ్యగారు
ఆయన వ్రాసిన తొలితరం పద్యంఖండిక "నవవధువు"
ఇది చూడండి-

కం.
నునుసిగ్గు దొంతరలు మో
మున దాగుడుమూత లాడ, ముత్తైదువ లె
త్తిన తలను వంచు నెపమున
మనమున నున్నట్టి భావమాలిక దాచెన్.

కం. 
ఎక్కడను లేని భావము
లొక్కుమ్మడి నాక్రమించెనో? యామె ముఖం
బొక్కొక్క రంగు మారుచు
చక్కఁగ నెఱుపెక్కె; సిగ్గె జయమును పొందెన్.

చం.
చెలులు ముదంబునన్ పరిహసింపగఁ గోపముఁ జూపు; వారితో
పలుకక మోముఁ ద్రిప్పుకొను; బంధువు లెందరొ వచ్చి చూడ, చూ
పుల నొకమారు వారియెడఁ బోవగనిచ్చి మరల్చు; పెండ్లిపీ
టల తలపోసినంతనె తటాలున నామె మనమ్ము భీతిలున్. 

సీ.
పెళ్ళిపందిరిలోన కళ్ళింతలుగఁ జేసి
          కొని బంధువుల్ దనన్ గనుగొనంగ
బ్రాహ్మణుండు చదువు పావనమంత్రమ్ము
          లలనల్ల శ్రుతిపేయమై చెలంగ
ఆహ్వానితులు సేయునట్టి ప్రశంసల
          నందుకొనంగ సిగ్గడ్డురాగ
అప్పుడప్పుడు వరుం డప్పగించెడి దొంగ
          చూపులం జూడగా నోపలేక
తే.గీ.
భయము నయమును బిడియముల్ పల్లవించి
పూచి సుఖదుఃఖభావముల్ పొందఁజేయ
నెటులొ యన్నింటి దిగమ్రింగి యింతొ యంతొ
యందఱకు మోదమును గూర్చె సుందరాంగి. 

కం.
తలిదండ్రుల నెడబాసెడి
కలకంఠికి కంటినుండి కన్నీ రొలికెన్
చెలులను విడనొల్లకఁ దా
విలపించెను నవవధువు సభీతిన్ ప్రీతిన్. 

ఆయన తెలుగుసాహితీ చరిత్రలో
ఒక ధృవతారగా వెలుగొందాలని
వెలుగొందుతారని నా భావన
- ఏ.వి.రమణరాజు

రుబాయీ


రుబాయీ




సాహితీమిత్రులారా!



రుబాయీ అంటే అరబ్బీలో నాలుగని అర్థం
అలాగే రుబాయీలో నాలుగు పంక్తులుంటాయి.
వీటి ఛందస్సు ఉండదని కాదు
దానికో ఛందస్సు, ప్రాస, అనుప్రాస
వగైరా సరంజామా వుంటుది.
ఇక్కడ దాశరథిగారి రుబాయీ లను గమనించండి

శిలనే ఒక అప్సరసగా మలిచే వారు
చెలినే ఒక దేవతగా కొలిచే వారు
ఉన్నారు కొల్లలుగా ఈ లోకంలో
సతినే ఒక దయ్యంగా తలిచే వారు

నిప్పులోంచి అప్పుడప్పుడు పొగ పుడుతుంది
నీళ్ల లోంచి విద్యుత్తను సెగ పుడుతుంది
ఈ దానవ లోకంలో ఎన్నటికైనా
మానవులని పిలువదగిన తెగ పుడుతుంది

దాహానికి కావాలి నీరో మోరో
ప్రతి వారికి కావాలి ఊరో పేరో;
ప్రాచీనులు వ్రాశారు నీళ్లే త్రాగి
నవ కవులకు కావాలి బీరో! బారో!

గుస గుసలే సరిగమలై వినిపిస్తాయి
అమవసలే పున్నమలై కనిపిస్తాయి
తొలి రాతిరి చెలి చెంతకు చేరిందంటే
చీకటిలో స్వర్గాలే కనిపిస్తాయి

చిరునవ్వులు చిందిస్తూ చీట్లాడేను
అరమరికలు లేకుండా మాట్లాడేను
ఆ నవ్వులు, ఆ మాటలు వలపని తలచీ
అసలు విషయమెత్తగానే పోట్లాడేను!

జన్మదినోత్సవ సంరంభం చేస్తున్నారు
బంధువులూ మిత్రులూ నవ్వేస్తున్నారు
జీవితమున ఒక వర్షం గడచిన వేళ
దుఃఖించా లన్నది మరిచేస్తున్నారు

సకాలానికే సూర్యుడు ఉదయిస్తాడు
అందుకొరకె అతని నెవడు గుర్తిస్తాడు?
చలి కాలం రవి ఆలస్యంగా వస్తే
ఎండకొరకు మానవుడు పడి చస్తాడు!

చచ్చి బ్రతికి యున్నవారు కొందరు కలరు
బ్రతికి చచ్చినట్టి వారు ఎందరో కలరు
ఎంతెంతో వేదాంతం వల్లించేరు
మృతికి జడియబోని వారు ఎందరు కలరు?

Friday, January 5, 2018

బహ్వారంభో లఘుక్రియా


బహ్వారంభో లఘుక్రియా




సాహితీమిత్రులారా!



సమాజంలో అనేకరకాలైన విషయాలను
వ్యక్తులను చూస్తుంటాం
వాటిలో మొదట్లో చాల భయంకరంగా ఉండి
చివరకు అదంతా మాయమై ప్రశాంతంగా
కనిపిస్తుంటాయి. ఇలాంటివాటికి సంబంధించిన
కొన్నిటిని కలిపి చెప్పిన ఈ శ్లోకం చూడండి-

అజాయుద్ధే, ఋషిశ్రాద్ధే
ప్రభాతే మేఘాడంబ రే,
దంపత్యోః కలహేచైవ
బహ్వారంభో లఘుక్రియా

ఇందులో మనం గమనించాల్సిన విషయాలు కొన్ని
వివరించారు కవిగారు-
చూచేవారికి ఇంకేం జరుగుతుందో అనిపించే విధంగా
ఉండి చివరకి సాధారణ స్థితికి చేరేవాటిలో ఇవి-
1. మేకపోతుల యుద్ధం
2. ఋషిశ్రాద్ధం
3. భార్యభర్తల మధ్య పోరు(కొట్లాట)
ఇవి మొదట్లో చాల ఉధృతంగా
అనిపించినా చివరికేమీ జరగక
సాధారణంగా ఉండిపోతాయని
శ్లోక భావం.

Thursday, January 4, 2018

మృత్తికా గంధం


మృత్తికా గంధం




సాహితీమిత్రులారా!



దాశరథిగారి "నేత్రపర్వం" నుండి
ఈ కవిత ......
మట్టివాసన ముందు అత్తరువాసనలు
ఎందుకూ పనికిరావంటున్నాడు
చూడండి-

యెండా కాలంలో  దండిగా కొట్టిన వాన
గుండెల్లో కురిసిన అమృతపు సోన

కాలిన నేలమీద నవ వర్షబిందు
జాలం రాలుతున్నప్పటి సౌరభం ముందు
పనికిరాని పరదేశి అత్తరులు
అవి కంపుగొట్టే గాడిద గత్తరలు

అత్తరు అమ్ముతున్నారు వీధిలో అహమ్మదాలీ
కేవ్దా(మొగలి), ఖస్(వట్టివేరు), చంబేలీ(మల్లె)

మదనకదనంలో అలసిన మగువ స్వేదం
మల్లె అత్తరుకంటే మరింత ఆమోదం

యెండలో వానలో కాయకష్టం చేస్తూ
కండలు కరిగిస్తున్నాడు కార్మికుడు
గాయపడిన గుండెలతో కవీశ్వరుడు
గాండీవం లాంటి కలం చేతపడుతున్నాడు

గ్రీష్మంలో కురిసిన వాన జల్లు
కించిత్ సమయం తరువాత చెల్లు
అయితేనేం ఆ మృత్తికా గంధం
అగరు గత్తరల కంటే యెంతో సుగంధం

Wednesday, January 3, 2018

వృద్ధాదిత్యుడు


వృద్ధాదిత్యుడు




సాహితీమిత్రులారా!



కాశీలోని 12మంది ఆదిత్యులలో
వృద్ధాదిత్యుడు ఒకరు. 
హారీతుడనే పేరుగల ఒక వృద్ధుడు
కాశీకి వచ్చి, తపస్సు ఇంకా ఎక్కువగా
చెయ్యాలనీ, దానితో దివ్యమహిమలూ,
శక్తులు సాధించాలనీ, దావోనికి శారీరకంగా
జవసత్త్వాలు కావాలనే కోరికతో
ఆదిత్యుని సమధికశ్రద్ధాసక్తులతో ఆరాధించాడు.
అతని తపోదీక్షకు మెచ్చి, సూర్యుడు 
ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు.
వృద్ధహారీతుడు భాస్కరునికి మ్రొక్కి,
ప్రభూ నాయందు ప్రసన్నుడవైతే తిరిగి
నాకు యౌవనం అనుగ్రహించు. 
ఈ ముసలితనం తపశ్చర్యను
సహించలేకుండా ఉంది. ఇంకా 
తపస్సు చెయ్యాలని నాకోరిక
తపస్సే పురుషార్థ చతుష్టయం-
ధ్రువుడూ మొదలైనవారు
తపస్సుచేసే కదా ఉత్తమపదాలను పొందారు.
అన్నిటిపైనా విరక్తి కలిగించే ఈ వార్థక్యం
ఎంత అసహ్యం కట్టుకున్న భార్యా,
కన్నపిల్లలూ కూడా ముదిసిన ఇంటి 
యజమానుణ్ణి ఏవగించుకుంటారు. 
ముసలితనంతో జీవించడం మంచిదికాదు.
జితేంద్రియులు చిరకాలం తపస్సు చెయ్యాలని 
కోరుకుంటారు. చిరకాలం తపస్సు చెయ్యాలంటే 
శరీరపటుత్వం ఆవశ్యకంకదా కాబట్టి ఈ వృద్ధప్యం 
పోగొట్టి, సర్వసమర్థమైన యౌవనం ప్రసాదించు - అని కోరగా,
భాస్కరుడు అతని మనసెరిగి వెంటనే యౌవనం 
కలిగేట్టు వరమిచ్చాడు. తరువాత హరీశుడు 
భాస్కరుణ్ణి ఇష్టదైవంగా భావించి
చిరకాలం తపశ్చర్యతో గడిపి కృతార్థుడైనాడు.
వారణాసిలోని వృద్ధహారీశునిచే ఆరాధించబడిన
ఆదిత్యుడు, వృద్ధాదిత్యుడనే పేరుతో ప్రసిద్ధి 
పొందాడు వృద్ధాదిత్యుని సేవించిన వారు
నిత్యమూ యౌవనశక్తితో శుభఫలాలు పొందుతారు.

Tuesday, January 2, 2018

సుభాషిత త్రిశతి ఆంధ్రీకరణ


సుభాషిత త్రిశతి ఆంధ్రీకరణ


సాహితీమిత్రులారా!

సంస్కృతంలో భర్తృహరి రచించిన
సుభాషిత త్రిశతిని తెనుగులో
అనువదించిన వారి సంఖ్య
20వ శతాబ్ది వరకు ఆరుగురు
ఈ మధ్యకాలంలో అనుదించిన
వారున్నారేమో తెలియరాలేదు

మొదటివారు ఎలకూచి బాలసరస్వతి (1620)
రెండవవారు ఏనుగు లక్ష్మణకవి              (1725)
మూడవవారు పుష్పగిరి తిమ్మన             (1750)
నాలుగవవారు పోచిరాజు వీరన్న            (1790)
ఐదవవారు గురురాజ కవి                           (1810)
ఆరవవారు వెల్లాల నరసింగకవి                (1830)

వీరిలో పోచిరాజు వీరన్నస, గురురాజకవి ఆంధ్రీకరణలు
లభించలేదు. వెల్లాల నరసింగకవి ఆంధ్రీకరణ మాత్రం
ఒక్కసారిమాత్రం అచ్చైంది. ఆంధ్రపరిషత్ కార్యాలయంవారి
శతక సముచ్ఛయం మొదటి భాగంలో లభిస్తుంది.
ఎలకూచి బాలసరస్వతిగారి కంటె,
పుష్పగిరి తిమ్మనగారి కంటె
ఏనుగు లక్ష్మణకవిగారి ఆంధ్రీకరణం
బహుళ ప్రజాదరణ పొందింది.

భర్తృహరి నీతిశతకంలోని 5వ శ్లోకం చూడండి
దాన్ని ఆంధ్రీకరణలో ఎవరు ఎలా చేశారో
గమనిద్దాం-

మూలశ్లోకం-
లభేత సికతాను తైలమపి యత్నతః పీడయన్
పిబేచ్చ మృగతృష్ణి కాసు సలిలం పిపాసార్దితః
కదాచిదపి పర్యటన్ శశవిషాణమాసాదయే
న్నతు ప్రతినివిష్టమూర్ఖజనచిత్తమారాధయేత్

ఎలకూచి బాలసరస్వతిగారి ఆంధ్రీకరణ-
వసుధం గుందేటికొమ్ము తెచ్చుకొనఁగా వచ్చుం బ్రయత్నం బునం
న్వెసఁద్రావన్జల మెండమావుల నెయేనిం గాంచ వచ్చు, న్నిజం
బిసుక న్నూనియఁ బిండ వచ్చుఁ బ్రతిభాహీనాత్ముఁడౌ మూర్ఖుఁదె
ల్ప సమర్థత్వము లేదిల, స్సురభిమల్లా నీతివాచస్పతీ

ఈయన నీతిశతకానికి - "సురభిమల్లా నీతివాచస్పతీ "- అని
శృంగారశతకానికి - "సురభిమల్లా మానినీ మన్మథా "- అని
వైరాగ్యశతకానికి - "సురభిమల్లా వైదుషీ భూషణా" - అని
మకుటాలను ఉపయోగించారు.

పుష్పగిరి తిమ్మన ఆంధ్రీకరణ-
ఈయన కేవలం ఒక నీతిశతకమే ఆంధ్రీకరించాడని
అంటున్నారు. మిగిలిన శతకాలు లభించక
అలా అంటున్నరేమో

ఇసుకబ్రయత్నత న్విడిచి హెచ్చుగఁ దైలముఁగ్రాచ వచ్చుఁబె
ల్లెసఁగెడుడస్సి స్రుక్కి మృగతృష్ణజలంబులు బ్రోలవచ్చు నల్
దెసలుఁ జరించి యొక్కపుడు దే దొఱకున్ శశపున్విషాణ ము
న్బొసఁగదు దుర్వివేకి యగు మూర్ఖుని చిత్తము ద్రిప్పనేరి కిన్

ఏనుగు లక్ష్మణకవి ఆంధ్రీకరణ-

తివిరి యిసుమునఁదైలంబుఁ దీయవచ్చుఁ
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చుఁ
దిరిగి కుందేటికొమ్ము సాధించవచ్చుఁ
జేరి మూర్ఖుల మనసు రంజింపరాదు

ఈ మూడింటిలో ఎవరి ఆంధ్రీకరణ బాగున్నదో
వేరు చెప్పక్కరలేదు అందుకే లక్ష్ణణకవి ఆంధ్రీకరణ
అంతగా ప్రజాదరణ పొందింది.