Tuesday, June 11, 2019

తలుపుల రసీదు


తలుపుల రసీదు




సాహితీమిత్రులారా!


ఈ కథను ఆస్వాదించండి.......................

బొబ్బిలిలో యూనివర్సిటీ పెట్టే విషయంలో పెద్దగొడవ జరిగింది. గొడవ బొబ్బిలి వాళ్ళకి విజయనగరం వాళ్ళకి మధ్య కాదు. బొబ్బిల్లో ఉన్న బొబ్బిలి వాళ్ళ మధ్యే. యూనివర్సిటీ పేరు పెట్టడంలో పేచి వచ్చింది. కొందరు వీరబొబ్బిలి యూనివర్సిటి అనాలని, కొందరు “కాదహే…. రెండొందల ఏబైమంది ఇక్కడ మిగలకుండా చచ్చిపోతే ఈరత్వం ఏడంటుంది? ఉప్పుడు మనం అంతా కేవిస్ కాబట్టి వి బిల్ కాదు కెవిబిల్ ఊనివర్సిటి అని పేరు పెట్టాలి” అని. ఇదీ గొడవ. కేవి అని పెడితే కులం తీసుకొచ్చినట్లవుతుందని కొందరు వాదించారు. యూనివర్సిటీ అత్యున్నత అధికారులను కులపతి, ఉపకులపతి అని అంటారు కదా అని వెంఠనే మరొకరన్నారు. కులపతి అంటే ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్ అని బోధపరిచి ఎలాగో ఒకలాగా అందరిని ఒక కొలిక్కి తీసుకొచ్చాను.

బోష్టన్ యూనివర్సిటిని బియు అంటారు. బ్రౌన్ యూనివర్సిటి ఉంది. బర్మింగ్ హమ్ యూనివర్సిటీ ఉంది. ఇలా చాలా బితో మొదలయ్యే యూనివర్సిటీలు ఉన్నాయి. మనం కూడా బొబ్బిలి యూనివర్సిటి అని పేరు పెడితే బియు ఆఫ్ ఇండియా అంటారు. వాళ్ళంతా మనతో కలిసి బొబ్బిలి యూనివర్సిటీని అభివృద్ధి చేస్తారు అని రాత్రి పగలు కష్టపడి అందరిని బొబ్బిలి యూనివర్సిటీ అన్న పేరుకు ఒప్పించాను.

అందరిని ఒప్పించేను కాబట్టి వీళ్ళతో కలిసి పనిచేసి యూనివర్సిటిని నిలిపి నాలుగు డిగ్రీలు ఇచ్చి పదిమందికీ పనికి వచ్చేలా ఓ రూపకల్పన చెయ్యమన్నారు. దేశంలో వేల వందల యూనివర్సిటీలు కావాలని అందరూ అంటున్నారు. కాని వాటిని నడపడానికి, పాఠాలు చెప్పడానికి, మంచి రిసెర్చి చెయ్యడానికి కావల్సినంత మంది మనుషులు లేరు. ఇంజినీరింగ్ కాలేజీలకే దిక్కు లేకుండాపోతున్నాది మరి యూనివర్సిటీ అంటే మాటలా. మీరు ఇక్కడ ఉండి ముఖ్యమైన వాళ్ళని ఉద్యోగాల్లోకి తీసుకొని అప్పుడు కాని మీరు వెళ్ళండి అన్నారు.

బొబ్బిలి యూనివర్సిటి నడపడానికి అర్హులైన వాళ్ళు అన్ని రకాల ఉద్యోగాలకి కావలెను అని ప్రపంచవ్యాప్తంగా నెట్ ప్రకటన ఒకటి ఇచ్చాం. వచ్చినవాళ్ళకి ఇవాళ ఇంటర్వ్యూలు చేస్తున్నాం. ఇప్పటికే ఓ ఇరవై మందిని ఎడ్మినిస్ట్రేషన్ లో ఒక ముఖ్యమైన ఉద్యోగానికి ఇంటర్వ్యూ చేసాం. దేశదేశాల నుండి వచ్చిన తెలుగు వాళ్ళున్నారు. ఇంకా మరో పది మందిని ఇంటర్వ్యూచెయ్యాలి. ఒక్క పదినిముషాల విరామం తరువాత మొదలుపెడ్తాం అని అనుకొన్నాం.

నేను ఎలక్ట్రానిక్ పేపరు రెండు చేతుల మధ్య పట్టుకొని చదువుతున్నాను. ఈ ‘ఈ-పేపరు’ పూర్వం అచ్చం పేపరు చదివినట్లే విప్పి రెండు చేతులతో పట్టుకొని చదువుకోవచ్చు. పూర్వం లేప్‌టాప్ లాంటి స్క్రీన్ లో చక్కగా అన్ని రంగులు అచ్చం కాగితం మీద కనిపించినట్లు కనిపిస్తాయి. సేటిలైట్ ద్వారా వచ్చే సంకేతాలతో మొత్తం పేపరంతా చదవచ్చు. ఈ పరికరంలో ఏ పేపర్ కావాలంటే ఆ పేపరు, ఇంగ్లీషు, తెలుగు ఏభాష కావాలంటే ఆ భాషలో చదవచ్చు. తెలుగు పేపరుని ఇంగ్లీషులో, లేమాంద్ అన్న ఫ్రెంచి పేపరుని తెలుగులో చదవచ్చు. అంతా గూగుల్ టెక్నాలజీ మహిమ.

సరిగ్గా అలాంటపుడు ‘మే ఐ కమిన్… నేను రావచ్చా?’ అని రెండు భాషలలో అంటూ పొడవైన ఒక అభ్యర్థి లోపలికి వచ్చాడు. అంటే విరామ సమయం అయిపోయిందన్నమాట అని అనుకొన్నాను, ఈపేపర్ ని చుట్టి జేబులో పెన్నులా పెట్టుకొంటూ!

అతన్ని ఎక్కడో చూసాను సుమా అని అనుకొన్నాను. అచ్చం మా కనకప్రసాద్ లాంటి మొహం. కళ్ళద్దాలు కూడా అలాగే అనిపించాయి. వయస్సు 55 దాటి ఉంటుంది. ఈ రోజుల్లో కుర్రాళ్ళు ఎవరూ కళ్ళద్దాలు పెట్టుకోవడం లేదు. కళ్ళకి కావలసిన సర్జరీలు చేయించేసుకొంటున్నారు. ఇదుగో ఇలా ఏభైలు దాటిన వాళ్ళే అలవాటు కొద్ది కళ్ళజోళ్ళు పెట్టుకొంటున్నారు.

“మీపేరు” అని అడిగాను.

“తలుపుల రసీదు” అన్నాడు తెలుగు కొత్తగా నేర్చుకున్నవాడిలా.

“తలుపుల ఇంటిపేరు అయ్యుండాలి, రైట్!” అన్నాను నవ్వుతూ.

“అవునండి. మాదికూడా బొబ్బిలే” అదో క్వాలిఫికేషన్ లా అన్నాడు.

“కాని ఈ రసీదు అన్న పేరే ఆశ్చర్యంగా…”

“నా అసలు పేరు రషీద్ అండీ. చాలామంది సరిగ్గా పిలవలేక చివరికి రసీద్, రసీదు అయిపోయిందండి” అన్నాడు కొద్దిగా సిగ్గుపడుతూ.

“సరే. మీరేం చదువుకొన్నారు…” అని బటన్ నొక్కి నా అరచేతిలో ఉన్న గూగుల్ ఆర్గనైజర్లో అతని పేరుతో ఉన్న బయోడేటాని వెతుక్కోవలసి వచ్చింది. ఎక్కడా డిగ్రీ కనిపించలేదు. మిస్సయ్యేనేమోనని మరొకసారి చూసాను. లేదు. మీకు ఏ డిగ్రీ లేదా? అన్నాను ఆశ్చర్యంగా.

“లేదండి…” అన్నాడు వినయంగా

“మరి ఇంటర్వ్యూలోకి ఎవరు రానిచ్చేరు” అని గట్టిగా అరిచాడు ఇంటర్వ్యూ చేసే మరో కమిటి సభ్యుడు.

“నన్ను పిలవలేదండి. కానీ ఉద్యోగం తప్పక ఇస్తారన్న ఆశతో నా అంతట నేనే లోపలికి తలుపు తోసుకొచ్చానండి” అని ఓ క్షణం ఆగి “క్షమించండి” అన్నాడు.

“క్షమించేం. వెళ్ళండి. పెద్ద పెద్ద క్వాలిఫికేషన్లతో ఎంతోమంది బయట వెయిట్ చేస్తున్నారు” అన్నాను చిరాగ్గా.

“నా బేక్ గ్రౌండ్…”

“రిజర్వేషన్లంటే లాభం లేదండి. రిజర్వేషన్లు పోయి చాలా ఏళ్ళు అయ్యింది. మీరు ముస్లిం అయినా మరేదయినా నో యూజ్” అన్నాను వెళ్ళమని చెయ్యి చూపిస్తూ.

“నా ఎక్స్పీరియన్స్…”

“ఏంటి మీ ఎక్స్పీరియన్స్…” ఒక కమిటీ సభ్యుడు మర్యాదగా అడిగాడు.

“అమెరికాలో…”

“అమెరికాలో ఎక్స్పీరియన్స్ ఎవడికి కావాలండి…” అన్నాడు ఇంకో కమిటీ మెంబరు.

“అమెరికాలో నేను ఒక పెద్ద సంస్థ నడిపానండి.” అన్నాడు ఒక పెద్ద ఫైల్ తీసి టేబుల్ మీద పెడుతూ.

“ఆ సంస్థ ఏం చేసేది.”

“కంప్యూటర్ల ఆపరేషన్ సిస్టమ్స్, ప్రోగ్రామ్ లు…”

“సరే మరి అవన్ని మీరు మాకు పంపారా?”

“పంపానండి”

“మరి మా గూగుల్ ఫోన్ ఆర్గనైజర్ డేటాబేస్ లో లేవే!” అన్నాం అందరం గబగబ మరోసారి వెతికి.

“బహుశా ఫార్మాట్ ప్రాబ్లమ్ అయింటుందండి… నేను మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2010లో పంపానండి.”

“అలా చెప్పండి గూగుల్ డాక్స్ లోనే గత పదేళ్ళుగా ప్రపంచం ఉంటే మీరు ఇంకా ఎప్పుడో పాత మైక్రోసాఫ్ట్ పట్టుకు వేలాడితే ఎలా?” అతను చెప్తున్న ప్రతి మాటని నేను గూగుల్ ‘బ్రెయిన్’ లోకి పంపుతున్నాను. కంప్యూటర్లు పోయి లేప్‌టాప్‌లు, లేప్‌టాప్‌లు పోయి గూగుల్ బ్రెయిన్‌లు వచ్చేసాయి. నానో టెక్నాలజీ, బయోమెటీరియల్ సైన్సులు బాగా డెవలప్ అయి టెరాబైట్ కంప్యూటర్లు చిన్న క్రెడిట్ కార్డు సైజుకి దిగిపోయాయి. దాన్ని కూడా అతి పల్చగా తయారు చేస్తున్నారు. దాన్ని విడిగా పట్టుకొని తిరగడం కష్టం కాబట్టి కావాలనుకొన్న కొంతమంది తలపై భాగంలో ఓ చిన్న సర్జరీతో అమరుస్తారు. దానిని మనుషులు ఆలోచనతో నడుపుతారు. ఆలోచనల తీరు, జోరు, ఆ గూగుల్ బ్రెయిన్ కనిపెట్టి అడిగిన వివరాలను అందిస్తుంది. దానికి కావలసిన విషయాల కొన్ని దానిలో పొందు పరిచినా అపారమైన విజ్ఞానాన్ని, విశేషాలని, వివరాలని సేటిలైట్ ద్వారా నానో సెకన్ల లో తీసుకొంటుంది. మౌఖికం పోయి తాళపత్రాలు, తాళపత్రాలు పోయి అచ్చుపుస్తకాలు, అచ్చుపుస్తకాలు పోయి కంప్యూటర్లు, కంప్యూటర్లు పోయి గూగుల్ బ్రెయిన్ వచ్చేసింది.

సాధారణంగా మాలాంటి వాళ్ళంతా గూగుల్ బ్రెయిన్ తో పని చేస్తున్నాం చాలా మట్టుకి. అప్పుడప్పుడు మాత్రమే స్వంత బ్రెయిన్ వాడేది. అది కూడా ఏదో అమ్మాయితో, ప్రేమగా కబుర్లు చెప్పడానికి మాత్రమే. అనుభూతులు ఇంకా గూగుల్ బ్రెయిన్ పరిధిలోకి రాలేదు. అనుభవాలని మాత్రం దాస్తున్నది.

మిగిలిన కమిటీ సభ్యులు అతనిని రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. అతను తాపీగా సమాధానాలు చెప్తున్నారు. నేను కళ్ళు మూసుకొని అతని సమాధానాలని నా గూగుల్ బ్రెయిన్ లోకి పంపుతున్నాను. గూగుల్ బ్రెయిన్‌ని ఈ సమాధానాలని అన్నింటి శోధించి అతని గురించిన అసలు వివరాలని ఇమ్మని ఆజ్ఞ ఇచ్చాను. అది ఇచ్చిన సమాధానం విని ఆశ్చర్యంతో లేచి నిలుచున్నాను. నోటమాట రాలేదు. ఏమైయిందో తెలియక నాతో పాటే అందరూ నిలుచున్నారు. నేను కొద్దిసేపటికి తేరుకొని…

“మీరు బిల్ గేట్సా?” అన్నాను ఒక్కొక్క అక్షరం వత్తి పలుకుతూ.

“అవును. చిన్నప్పుడే అమెరికా వెళ్ళిపోయాను మా కుటుంబంతో. అసలు పేరు మీద మమకారంతో తలుపుల రసీదు పేరుని బిల్ గేట్స్ గా మార్చుకొన్నాను”, అన్నాడు చిర్నవ్వుతో!

(అక్షరాలతో ఆటలాడుకోవడం అలవాటున్న అప్పారావుకి అభిమానంతో)
--------------------------------------------------------
రచన: కలశపూడి శ్రీనివాసరావు, 
ఈమాట సౌజన్యంతో

Sunday, June 9, 2019

ఎవడూకానివాడు బతికేడు ఏ చింతాడో ఓ ఊరు


ఎవడూకానివాడు బతికేడు ఏ చింతాడో ఓ ఊరు



సాహితీమిత్రులారా!


ఈ కవితను ఆస్వాదించండి.............

ఎవడూకానివాడు బతికేడు ఏ చింతాడో ఓ ఊరు
కాయకష్టం కానీ అన్నాడు కలిగినంతలో తిన్నాడు
ఎండా ముసురు గాలీ వాన చలికాలం
ఎవడి కష్టం వాడిది ఎవడు చూడొచ్చేడు

పది గడపల వాసమ్మా గడప నాలుగిళ్ళు
ఇందమ్మంటే అందమ్మంటే ఇంటిల్లిపాదీ ఓ జట్టు
ఎవడి మాను వాడు నాన్నా ఎవడు ఎవడిక్కావాలి
ఫెళఫెళ్ళాడి ఎండా గాలీ వలవల్లాడి వాన

ఏదీకాన్దాన్ని చూసి నవ్వేరు ఎవడిమీదనమ్మా దీని రోకు
పసిపిల్ల బాలాదీ పడివాట్లు పచ్చి దోసపాదు దీన్నట్టిల్లు
ఊరూపేరూలేన్దానికేనుటేనే అమ్మా ఎవడూకానివాడి ఆను
ఊరికే ఏం వెర్రోనమ్మా వాడి గాలీ వానా దాని ఎండ

ఎవడి చింతకి దాని గాలి ఎవడి ఎండకే దాని గొడుగు
ఏ ఏడుపే అదేడిచింది విన్నావా ఏ నవ్వుకే దాని నవుతాలు
ఏదీకాన్దాని కన్నీళ్ళు ఎవడో ఒహడమ్మా వాడి వేణ్ణీళ్ళు
చలికాలం పెందరాళే మబ్బూ వణ్ణం చారూ గాలీ నొవ్వా ముసురు

ఎవరో ఒకళ్ళని చేసీసుకుని ఎక్కడో ఓక్కడ వాళ్ళవాళ్ళు
అక్కడివాళ్ళకిందే లెఖ్ఖటమ్మా ఇక్కడిదిక్కడే ఏదీ ఎవడూ
ఇరుగూ పొరుగూ ఇటుతెన్న అటుతెన్న గొడుగూ చిరగా వడగళ్ళు
ఒచ్చేం ఒచ్చేం అమ్మా నాన్నా చూసేం వెళ్ళేం వెళ్ళేం

ఉక్కా గొల్లూ చీకటమ్మా వేసాకాలం ఎండ
బిడ్డల్నాటి అడ్డాలు కాదు ఎవడి దేనిమీదనా మరిలేదు
ఎవడూకానివాడి దీవి దానిమీదేనే ఏమీకాన్దాని దీని మీద
దూరానున్నారు చుక్కలమ్మా పిల్లలంటే ఆకాశ పంట

కాగా పోగా ఎవడు వాడిమానాన్న వెఱ్ఱినవ్వుల నిద్దట్లో పోయేడు
ఏమీకాన్దాని చెయ్యి ఎవడి చేతిలోనే ఎవడివేపోనమ్మా దాని చూపు
అయిపోయిందమ్మా ఇద్దర్నీ దింపి నీళ్ళు ఎవళ మానూ రాళ్ళు వాళ్ళు మన్నాడు
ఆ ఊరికీ ఊరు కర్రా నిప్పూ ఎంతోనమ్మా ఈ ఊరికీ వానా మన్నూ ఆ ఊరు

దోనె పక్కన దొప్పమ్మా వత్తిని తడిపితే వత్తి
ఏట్లో దీపం వెలగా ఆరా వెర్రి నిద్దట్లో భ్రాంతి
ఏమీకాన్దీ ఎవడోవాడూ ఎండలో వానా ఏమిట్ల పెళ్ళి
కనీ కనపణ్ణట్టు మెరుపమ్మా కొసాకి వినీ వినపణ్ణట్టు గాలి.

ఫది గడపల చింతాడ పసిపిల్ల బాలాది
గడప నాలుగిళ్ళమ్మా మానిందే ఊరు
ఎంత చెట్టుకా గొడుగు ఏ ఎండకా గాలి
ఏదీ ఎవడూ కాని పొగ మంచు చెదిరిపోతే ఆ యింతా మరిపింత.
---------------------------------------------------
రచన: కనకప్రసాద్, 
[ఆంగ్ల మూలం: Anyone lived in a pretty how town – e. e. Cummings]
ఈమాట సౌజన్యంతో

Friday, June 7, 2019

పెట్టని మొక్కు ఫలితం


పెట్టని మొక్కు ఫలితం




సాహితీమిత్రులారా!

నాలుగేళ్ల క్రితం, సాక్షి పత్రిక ఫన్డే ఫీచర్‌లో కొన్ని వారాలపాటు జీవిత కథనాలే కవర్ స్టోరీలుగా వచ్చాయి. అందులో భాగంగా నేను కూడా కొన్ని ఇంటర్‌వ్యూలకు వెళ్లాల్సివచ్చింది. టీడీపీ మైసూరారెడ్డి, జగడం సుకుమార్, ఆయుర్వేద ఏల్చూరి, పూర్ణోదయా నాగేశ్వరరావు, లీడర్ మిక్కీ జె. మేయర్, న్యూస్‌రీడర్ శాంతిస్వరూప్, ప్రతాప్ రాఘవ, ఎముకల గురవారెడ్డి… ఇట్లా కొందరిని ఇంటర్‌వ్యూ చేశాను. అవన్నీ వేటికవే భిన్నమైన అనుభవాలు! అయితే వాటి గురించి నేనేమీ చెప్పబోవడంలేదు.

అయితే, ఈ సీరిస్‌లో ఒకసారి మల్లాది చన్ద్రశేఖర శాస్త్రిని పేజీల్లోకి తేవాల్సివచ్చింది! ఏదో పండుగ సందర్భం అనుకుంటాను. అయితే, ఆయన గురించి నాకు పెద్దగా తెలీదు. ఆయన చన్ద్రశేఖర అని సున్నా వాడకుండా తన పేరును రాసుకునే పట్టింపు వున్నాయన అని మాత్రం ఎక్కడో చదివాను. అందుకే, ఎందుకైనా మంచిదని, వెంట మా బాచిని పట్టుకెళ్లాను, తనైతే ఇలాంటి పెద్దవాళ్లను బాగా హ్యాండిల్ చేస్తాడని! చెప్పాలంటే, తనే ఇంటర్‌వ్యూ చేస్తాడు; నేను పక్కన కూర్చుని కొన్ని ఉపప్రశ్నలు అడుగుతానంతే! అదీ మేమనుకున్నది.

దానికి అనుగుణంగానే అపాయింట్‌మెంట్ తీసుకున్నాం. గాంధీనగర్‌లోని ఆయన ఇంటికి వెళ్లాం. నిజంగానే ఇంటిముందరి నేమ్‌ప్లేట్ పైన చెప్పినట్టే ఉంది. వెళ్లేసరికి, ఇంట్లో ఆ దంపతులిద్దరే ఉన్నారు. బాగా పెద్దవాళ్లయ్యారు. అయినా మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. మా పేర్లు, ఊర్లు అడిగారు. చెప్పాం. బాచి దోర్బల వాడు కాబట్టి, రెండు ప్రశ్నలు అదనంగా పడ్డాయి. మాట్లాడుతుండగానే, అమ్మ నెమ్మదిగా వచ్చి ఏవో పళ్లరసం గ్లాసులు మా ముందట పెట్టింది. తాగాం. ప్రశ్నలేవో అడిగాం. ఆయన రికార్డు చేయడానికి ససేమిరా ఒప్పుకోలేదు కాబట్టి, వెంటవెంటనే రాసుకున్నాం. మళ్లీ ఆ పెద్దావిడ అంతే నెమ్మదిగా వచ్చి, మేము ఖాళీ చేసిన గ్లాసుల్ని పట్టుకెళ్లింది. అటో ఇటో ప్రశ్నావళి ముగిసింది. ఇక లేచి, సెలవు తీసుకుంటూ నమస్కారాలు చెప్పుకోవడం మిగిలివుంది…

ఇద్దరమూ లేచాం. వెంటనే బాచి ఏం చేశాడంటే… ఇలా చేస్తాడని నేను ఊహించలేదు! ఠక్కున పాదాభివందనం చేశాడు. మరి పక్కనేవున్న నేనేం చేయాలి? అలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి నేను ముందు సిద్ధపడి లేను. నేను వెంటనే ఏదోలా స్పందించాలి! అంటే, నేను ఎలా నమస్కరిస్తానో ‘తేల్చబోయే’ సన్నివేశంలోకి నెట్టిన బాచి మీద నాకు కోపమొచ్చింది. కానీ అది అతడి పద్ధతి! మరి నాకేమిటి దారి? నేను ఇక నా పద్ధతిలోనే బుద్ధిగా రెండు చేతులు జోడించి, నమస్కరించి, బయటికి వచ్చేశాను.

అది జరిగిన తర్వాత, చాలా నెలల పాటు, ఆ సన్నివేశం నాకు మళ్లీ మళ్లీ గుర్తొచ్చేది. నేనా పెద్దాయనను చిన్నబుచ్చి వుంటానా? పక్కవాడు పాదాభివందనం చేసినప్పుడు, నా నుంచి కూడా ఆయన అదే ఆశించి వుంటాడా? అసలు ఆయన పట్టించుకున్నాడా? కానీ ఇద్దరి మర్యాదలోనూ స్పష్టమైన తేడా కనబడినప్పుడు, లిప్తమాత్రంగానైనా గమనించకుండా ఉంటాడా?

నేను, మా అమ్మ బాపు, పెద్దమ్మ పెద్దబాపు లాంటి అతి సన్నిహిత సంబంధాల్లో నలుగురైదుగురికి తప్ప ఎవరి కాళ్లూ పెద్దగా మొక్కి ఎరగను. ఎందుకంటే, అది నా అహానికి సంబంధించిన అంశం! అలాగని, పెద్దవాళ్లను గౌరవించడానికి చేసే పాదాభివందనాల పట్ల నాకేమీ వ్యతిరేకత లేదు. కానీ ఈ పెద్దాయన నాకు పరిచయం లేడే! ఆయన దానికి అర్హుడే అనదగినంతటిదేదో ఆయన నుంచి నా జీవితంలోకి ఏదీ వచ్చివుండిలేదే! అయితే, నా పిల్లతనానికి ఆయన గొప్పతనం గురించిన తెలివిడి లేకపోయుండవచ్చు! అయినా, ఆయన వయోవృద్ధుడు అన్న ఒక్క కారణంగానైనా నేనా మొక్కేదో మొక్కితే పోయేదా? గృహిణిగా తన బాధ్యతలో భాగంగానే కావొచ్చు, అయినాసరే, ఆ పెద్దావిడ మా ఎంగిలి గ్లాసులు కూడా తీసిందాయె! దానికైనా ఇది పరిహారం అయ్యేదా! నా పక్కవాడు చేయకపోతే వేరే సంగతి! కానీ చేశాడు కదా! అంటే, ‘ఇతడు నాకు మొక్కలే’దని తెలియవచ్చే చిన్నపాటి ఇబ్బందికి ఆ పెద్దాయనను ఎందుకు గురిచేశాను? ఒకవేళ, అలా చేసివుంటే, నేను ఫార్మాలిటీకైనా తలవంచానని అది మళ్లీ లేనిపోని న్యూనతకు దారి తీసేదా? నేను ఏ పని చేసినా, ఒకవేళ చేయకపోయినా కూడా, దాని ఫలితం కచ్చితంగా పశ్చాత్తాపం దగ్గరే ఆగుతుంది.

కానీ ఒక్కోసారి అనిపిస్తుంది… ఇదే ఇంటర్‌వ్యూ ఏ కొలకలూరి ఇనాక్‌తోనో అయివుండి, అప్పుడు కూడా నా పక్కవాడు ఉన్నట్టుండి ఇలాగే పాదాభివందనం చేసివుంటే, నేను మామూలుగానే చేతులు జోడించి వచ్చివుంటే, అప్పుడు కూడా నేను ఇలాగే మథనపడి వుండేవాడినా! అది తెలిస్తేగానీ, ఈ మొత్తం అంకంలో ఏ మూలనో దాగివున్న కుల స్పృహ సంగతి కచ్చితంగా తెలియదు!
--------------------------------------------------------
రచన: పూడూరి రాజిరెడ్డి, 
ఈమాట సౌజన్యంతో

Wednesday, June 5, 2019

హంపి నుండి నూనేపల్లె…


హంపి నుండి నూనేపల్లె…




సాహితీమిత్రులారా!

నడినెత్తి మీద హంపి ఎండ! అరికాలిని చుట్టుముట్టిన రాతి ఎండ! విరూపాక్ష దేవాలయం వెళ్ళేదారిలో అమ్మాయిల అబ్బాయిల నవ్వుల మధ్య, బోలెడన్ని సెల్ఫీల వెలుగులకి కాస్త ఇటుగా, బిడియంగా బొత్తిగా మెరుపు లేని జీవితంలా నిలబడి ఉన్నాడు హనుమంతు. నిన్నట్నుండి హనుమంతు వంటి బోలెడుమంది కుర్రాళ్ళు చంకల్లో ‘హంపీ చరిత్ర – కథలూ గాథలూ’ పుస్తకాలు ఇరికించుకుని “అన్నా ఒక్క బుక్కు! టూ హండ్రెడ్ ఒన్లీ!” అని చుట్టుముడుతున్నారు. ఈ దిక్కుమాలిన శిథిల నగరం చూడకపోయినా నష్టంలేదు కానీ ఇలా ఈ పిల్లల్ని చూడాలంటే కష్టంగా ఉంది. పుస్తకాల దరిద్రం ఏం మోసుకుతిరుగుతాం? ఇంట్లో అలమారల్లో, తల బుర్రల్లో ఇరికించుకున్న వెధవ జ్ఞానం, ప్రమాదకర ఎంగిలి జ్ఞానం! నాయనల్లారా! మీరు ఇలా పనిచెయ్యడం పట్లా నాకు గౌరవమే! కానీ ఈ కాగితాల బదులు కనీసం మంచినీళ్ళ బాటిళ్ళు అమ్ముకోరాదా? బ్లాకు రేటు అయినా కొనేవాణ్ణి, అరగంట అయ్యాకా ఏ చెట్టు మాటునో బరువు సమస్తం దించుకునేవాణ్నయితిని. ఈ దిక్కుమాలిన పుస్తకాలు ఏం జేసుకోను? గిల్టీని జేబులోని నోట్ల మధ్య దాచుకోలేక తగిలివచ్చిన ప్రతి పిల్లవాడిని క్షమాపణ చెప్పుకుంటూ బుజ్జగిస్తూనే ఉన్నా. అయితే హనుమంతు విషయంలోని దిసకాళ్ళు నా అడుగులు ముందుకు పడనివ్వలేదు. “ఎందుకు హనుమంతు, చెప్పులు వేసుకోలేదు?” “లేవు సార్.” “మరి కాళ్ళు కాలవా!” “అలవాటు అయిపోయింది సార్.” “పుస్తకం అమ్మితే ఎంత వస్తుంది హనుమంతు?” “వంద రూపాయలు సార్.” “డబ్బులు ఏం చేస్తావు హనుమంతు?” “అమ్మకు ఇస్తాను సార్.” “హనుమంతూ, నాకు పుస్తకం వద్దు కానీ డబ్బులు ఇస్తాను, చెప్పులు కొనుక్కుంటావా? ఊరికే ఇస్తున్నావని తప్పుగా అనుకోవద్దు, నాకూ నీ మాదిరి కొడుకు ఉన్నాడు. వాడు చెప్పులు లేకుండా తిరిగితే నాకు బాధ అనిపించదా?” (గాడ్దె కొడకా! నిజంగా నీ కొడుక్కు చెప్పులు లేకపోతే నీ కాలికి ఉన్నవి గబగబా విప్పి వాడి కాలికి తొడగవా? వంద రూపాయలతో వదిలించుకుంటావా? పైగా బతుక్కు కరుణారస మాస్క్ ఒకటా! హరామ్‌ఖోర్!) హనుమంతు చెప్పులు కొంటాడా కొనడా! ఏ విషయం చెప్పడం లేదు, ‘ఒక పుస్తకం కొనండి సార్’ అని మాత్రం గొణుగుతూనే ఉన్నాడు…

కర్ణాటక పల్లెల మధ్యలోంచి మా కారు ప్రయాణం నడుస్తూనే ఉంది. దారిలో ఎదురువచ్చిన గ్రామాల్లో బడి వదిలిన సమయపు పిల్లల కాళ్ళు బోలెడు నాకు ఎదురు అవుతూనే ఉన్నాయి. దాదాపుగా అన్నీ వట్టి కాళ్లు, మట్టి కాళ్లు, దుమ్ము కాళ్లు, ముళ్ళు విరిగిన కాళ్లు… ఇప్పుడు ఇన్నేళ్ల తరువాత కూడా రోటీ, కపడా, మకాన్‌ల మధ్యలో కాలిజోడు ఇరికించుకోలేని ఈ బ్రతుకుల మీద ఆంత్రోపాలజీ చూపులు ఎవరు సారిస్తారు? ఇవన్నీ నన్ను మా చిన్నప్పటి కాలి ముద్రల వైపు, హవాయి చెప్పులు మాత్రమే ఎరిగిన కాళ్ళ దారుల్లోకి నడిపించాయి. ఈ రోజు చదువుల గురించి, ఆ తరగతి గదుల సంస్కారం గురించి నాకు అవగాహన లేదు కానీ చెప్పులు అనగానే మా ఖలీల్ సిద్దిఖీ క్లాసు రూముల ముందు ఒక దానిపై ఒకటొకటిగా కలిసివుండి కొన్ని, చెల్లా చెదురుగానుండిన మరికొన్ని, చెప్పులే మెదలుతాయి. గదిలో సరస్వతీదేవి కలదో లేదో కానీ, చెప్పులు ధరించి పుస్తకం తెరవరాదు. అక్కడే ఆగిపోయిన ఆ పాతకాలపు పిల్లవాడిగా నేను కాలికి జోడు తొడుక్కుని బొమ్మ వేసే పని చెయ్యను. గట్టి జ్ఞాపకం ఉన్నంతలో ఏనాడు ఫోన్లో బాపుగారితో మాట్లాడినప్పుడు కూడా వేసుకుని ఉన్న చెప్పులు వదిలి, సౌలభ్యం కుదిరితే మోకాళ్ళ మీద కూచుని మాట్లాడేవాణ్ణి.

పిల్లలు తమలో తాము గొడవపడినప్పుడు చెప్పులతో కొట్టుకోడం చాలా కామన్. చిన్నప్పుడు బాల్‌తో ఆడుకునే ‘ఈపుల్ సాపుల్’ ఆటలో బంతి దొరకనపుడు చెప్పులతో ఆడుకోడం జరిగేది. మా చిన్నాయనతో చెప్పుదెబ్బలు తిన్న అనుభవాలు బుగ్గల మీదుగా జారిన కన్నీటి చారికలుగా నిలిచే వున్నాయి. అసంకల్పితంగా చెంపని తడిమితే ఆ జ్ఞాపకాల మంట తడిగా మండుతుంది. చిన్ననాట చెప్పులు అంటే హవాయి చెప్పులు తప్పా మరేవీ చెప్పులు కావు. నిజానికి లేని జ్ఞానం కుప్పకూలేవరకు కూడా హవాయి అంటే చెప్పుల కంపెనీ పేరు అనుకునేవాళ్లం.

కాసిన్ని రూపాయిలు ఎక్కువ పెడితే బాటా, తక్కువ డబ్బులకయితే పాపులర్ కంపెనీ చెప్పులు వస్తాయి. చెప్పు ఏ కంపెనీదయినా, ఎంత నెంబరుదయినా మా ఊరి తుమ్మ ముళ్లకు మాత్రం బహు లోకువ. ఏదయినా పీరియడ్‌లో లీజర్ దొరికితే మా పిల్లలు చేసే పని ఏవిటంటే జామెట్రి బాక్స్ తెరిచి కోణమాని ఇస్టీలు ముల్లుతో తుమ్మ ముల్లుని పీకడం. ఏ చెప్పు తిప్పి చూసినా ఏవుంది గర్వకారణం! చెప్పుల కింది సమస్త మొత్తం ఓంపురికి కవల సోదరుడిలా కన్నాల మొహం వేసుకుని వుండేది. ఉన్న ముల్లు పీకకపోతే వేసే ప్రతి అడుగు అడుగుకు ముల్లు చురుక్కు చురుక్కున ప్రాణం తీసేది. ముల్లు పీకిన కన్నం లోంచి కొత్త ముల్లు యథేచ్ఛగా దూసుకుపోయేది. ముల్లును ముల్లుతోనే తీయాలి అంటారు కానీ అలా చేస్తే కొత్త ముల్లు కూడా కాల్లో విరిగి పాదానికి తగిన శాస్తి చేస్తాది. ముల్లుని పిన్నీసుతో కసాబిసా గెలికి తీస్తారు. ముల్లు పీకిన కన్నంపై ఉప్పు రాయి ఉంచి అగ్గిపుల్లతో కాలుస్తారు. అప్పుడు ఒక్క సెకను దేవుడు కనబడతాడు.

ఇందాకా అనుకున్నాం కదా పిన్నీసు అని; చెప్పులు, పిన్నీసు రెండూ జంట కవులు. ఆ రోజుల్లో పిన్నీసుల హారం లేని ఆడ మెడ ఉండేది కాదు. పిన్నీసుకు జాత్యంతరం అంటదు. హిందూ, ముస్లిం, కిరస్తానీ అందరి మెడల గొలుసుల్లో పిన్నీసులు తళుకుమనేవి. అంగళ్ళల్లో పిన్నీసులు కొనడం డబ్బు దండగ, రోడ్ల మీద మొలతాడు దారాలు అమ్ముకునేవారి దగ్గర పిన్నీసు ప్యాకెట్లు కాస్త అగ్గువ. చొక్కాకు గుండీలు లేవా? పిన్నీసు ఉందిగా! చిట్టచివరి దారపు పోగు ఊడిపోయి నిక్కరు గుండీ మాయం అయినపుడు మానం కాపాడుకోడానికి దారిలో కనబడిన ఏ ఆడమనిషిని అడిగినా, విసుక్కుంటూనయినా రొమ్ముల మధ్య ఇరుక్కుపోయిన దండ నుంచి పిన్నీసు పెరికి చేతిలో పెట్టేవారు. ఆ నునుపెక్కిన పిన్నీస్‌ని అందుకోడానికి బోలెడంత సిగ్గు అయ్యేది. చెవిలో బలపం ఇరుక్కుపోయిందా, పిన్నీసుని వెనక్కి తిప్పి నైసుగా బలపం లాగెయ్యి. పిన్నీసు అంటే భోజానానంతర దేశీ టూత్ పిక్. ఇయర్ బడ్‌కు మాతృక పిన్నీసు, గుబిలిని చక్కగా తీసేస్తుంది. చెప్పు స్ట్రాప్ తెగిపోయిందా ఫికర్ నహీ! పిన్నీసుతో లంకె కుదర్చవచ్చు. ముందు చెప్పినట్లు చెప్పులోని ముళ్లు, చెవిలో జోరీగ పిన్నీసు ముందు బలాదూర్. కాగితం క్రింద అయస్కాంతం ఉంచి పైన పిన్నీసులతో బాలే ఆడిపించవచ్చు. అయస్కాంతం ఆకర్షణకు పిన్నీసు నాగస్వరం విన్న నాగినిలా ఆడుతుంది. కాలమ్ము మారింది. పిన్నీసు కంటపడ్డంలేదు. గుండీ దారం తెగక మునుపే బట్టలు పారవేయబడుతున్నాయి. గుమ్మం ముందు జబాంగ్ వాడో మిన్ట్రా వాడో బెల్ కొడుతున్నాడు. రబ్బరు చెప్పులు వేసుకోడం నేడు నామర్దా! వాటికి వాష్ రూమ్ ఘోషా పట్టింది. మా ఊళ్లో కేరళవాళ్ళు టీ షాపులు నడిపేవారు. అత్యంత శుభ్రమయిన చిన్ని స్టాళ్ళు, చిక్కని రుచి. స్నేహపాత్రమయిన మొహాలు. భుజాలదాక మడిచిన చొక్కా, పూల లుంగీ, కాళ్ళకు కేరళవారి స్పెషల్ హవాయ్ చెప్పల్. సంవత్సరానికో ఆర్నెల్లకో ఊళ్ళకు మరలి వచ్చేవారితో మా ఊరి పిలగాళ్లు చెప్పులు లుంగీలు తెప్పించుకునేవారు. ఇళ్ళల్లో చెప్పు అరిగి అరిగి కన్నం పడేదాకా కొత్త చెప్పు కొనిచ్చేవారు కాదు. సైకిల్ మీద కాలేజీకీ వెడుతూ వస్తూ ప్రతీసారి డౌన్ వచ్చినపుడల్లా కాళ్ళు నేలకు ఆన్చి యథాశక్తి చెప్పు అరగ్గొట్టేవాణ్ణి. తొక్కేవాడికి ప్రాణ సంకటం, ఆయాసం. క్యారియర్ మీద కూచున్నవాడి కడుపులో చల్ల కదలకుండానే చెప్పులు అరిగేవి.

బడికి వెళ్ళినా, గుడికి వెళ్ళినా, దర్గాకి వెళ్ళినా, పెళ్ళిలో పాల్గొన్నా, క్రికెట్ మ్యాచుల్లో వికెట్ల మధ్య పరుగులు పెట్టినా అవే హవాయి చెప్పులు. ఒక్కోసారి బౌలర్ వేసిన గుడ్ లెన్త్ బాల్ గురితప్పి కాలి బొటనవేలి మీద వాలేది. చితికిన వేలు రక్తం తెల్లని చెప్పు మీద. ఇంటికి వెళ్ళేవరకు, కాలు కడిగేవరకు వేలు చెప్పుకు అతుక్కుపోయి ఉండేది. ఆ క్రికెట్ సీజన్లో ఎన్నిసార్లు ఊడిన గోళ్లు మొలిచేవో! బస్సులో నాలుగు సీట్లు ముందుగానే బుక్ చేసుకోవాలంటే ఒక సంచి, ఒక కర్చీఫ్. ఒక ఎడంకాలి చెప్పు, ఒక కుడికాలి చెప్పు. సీటు దొరకని వాళ్ళు చేత్తో కర్చీఫ్‌నయినా తొలిగించేవాళ్ళు కానీ చెప్పుని ముట్టేవారు కాదు. రెండు సీట్లు మాత్రం గ్యారంటీ. ఒకరి బట్టలు మరొకరు వేసుకోడం దరిద్రం అంటారు. ఒకరి చెప్పులు మరొకరు వేసుకోడం అయితే మహా దరిద్రం. కాలేజీ రోజుల్లో రూముల్లో బ్రతికే మిత్రులందరూ నీచాతి నీచ దరిద్రులే! కాలికి సరిపోయిందా లేదా? ఇంతకూ ఇదెవడి చెప్పు చెప్మా! అని మీమాంస ఉండేదే కాదు. కొంతమమంది ఘనులు చెప్పులు కొనాలంటే టవును పక్కకు కాక, గుడి సైడుకు నడిచేవారు.

గుడిలో చెప్పులు సంగతి ఏమో కానీ మా తిక్కస్వామి దర్గాకు ప్రతి శుక్రవారం వెళ్ళి కొబ్బరికాయ కొట్టి సమాధి చుట్టూ ప్రదక్షిణ చేస్తాం కదా! గోడ గూళ్ళల్లో లెక్కకు మించి పాంకోళ్ళు ఉండేవి. వాటి చరిత్ర ఏంటో అప్పుడు తెలుసుకోలేకపోతినే! దర్గా దాక ఎందుకు మా ఇంట్లోనే దేవుని గూట్లో రెండు చెక్క పాంకోళ్ళు ఉండేవి. ఎవరూ ఇంట్లో లేని ఒక సమయాన వాటిని వేసుకుని నడవ యత్నించిన గుర్తు. మా దేవుడు గూడు బలేటిది. ఆ గూట్లో మక్కా మసీదు పటాలతో పాటు పుర్రెల హారం వేసుకుని నగ్నంగా ఉన్న కాళికమ్మ పటం కూడా ఉండేది. కాళికాదేవి మా జేజి నేస్తురాలు. వారానికి ఒకసారి ఆమె వంటిపైకి పూనకమై వాలేది. అప్పుడు ఆ సమయంలో మా జేజి నా వంక క్రూరంగా చూసేది. నేను కాళికామాత వంక నవ్వుతూ చూసేవాణ్ణి. మా జేజి చనిపోగానే కాళికమ్మ పటాన్ని అనాథలా అంటరానిదానిలా మునివేళ్లతో పట్టుకెళ్ళి చెత్తలోకి పడేశారు. షేక్ బీబీ జాన్, కాళికమ్మ, ఇద్దరూ మా దరిద్రానికి మమ్మల్ని వదిలేసి వారి దావ వారు కులాసాగా ఎగిరిపోయారు.

మా నాన్నకూ నాకూ కుదిరేది కాదు. గుమ్మం దగ్గర నాన్న చెప్పులు ఉంటే ఆపాటునే వెనక్కి తిరిగి వెళ్ళిపోయి ఆ చెప్పులు గుమ్మం ఖాళీ చేసిన తరువాతే ఇంట్లో అడుగు పెట్టేవాణ్ణి. ఇంటికి ఎవరు వచ్చినా ఎన్ని ఆడ కాళ్ళు ఎన్ని మగ కాళ్ళు అనేది బయట ఉన్న చెప్పులని బట్టే పసిగట్టేవాణ్ణి! వచ్చిన మనుషుల హోదా కూడా చెప్పులే చెబుతాయి. పదవతరగతి ఫెయిలయ్యాకా తెల్లవారుఝాము నాలుగు గంటల ట్యూషన్ ఒకటి శిక్షగా విధించబడింది. ఆ నిదుర మత్తులో చెరో రకం చెప్పు తొడుక్కుని మూడు కిలోమీటర్ల నడక దూరంలోని రవిసారు ట్యూషన్‌కి వెళ్ళా. తిరుగు టపాలో మత్తు వదిలి చూసుకుంటే ఏవుంది! కుడి ఎడమల పొరపాటు. ఆ రోజు నడకలో సమస్త మానవ జాతి మొత్తం తమ పనులన్నీ మానేసి నా కాళ్ల వంకే గుచ్చి గుచ్చి చూసినంత అవమానం. బహుశా ఆ అనుభవం వల్లే కాబోలు సంవత్సరన్నర, రెండు సంవత్సరాల క్రితం సాక్షి ఫన్డేకి ఒక ఇంటర్మీడియట్ అమ్మాయి వ్రాసిన తొలి కథలో తను మోజుపడి కొనుక్కున్న కొత్త చెప్పులు తెగిపోతే వాటిని వదలలేక, వేసుకుని నడవలేక ఇబ్బందిపడే ముగింపుని కాస్త సరిచేసి ఏది ఏమైనా ఎవడినీ లెక్కచేయనక్కరలేదని కాస్త మార్చి పెట్టాము.

తొంభై ఎనిమిది ప్రాంతాల్లో నేనూ మోహన్‌గారు ఒక ఆనిమేషన్ వర్క్ చేశాం కాంగ్రెస్‌వాళ్లకు. ఆ రోజుల్లో బాగా డబ్బున్న ఒక పెదరెడ్డిగారు మోహన్‌గారిని కలవడానికి వచ్చేవారు. “అరే! మీ చెప్పులు భలే ఉన్నాయండి,” అన్నారు మోహన్‌గారు. “కదాబ్బా?” అని నన్ను కూడా అడిగారు. ఆయన వాటి మీద మోజుపడ్డారు. రెడ్డిగారు వచ్చిన ప్రతిసారి ఆ చెప్పుల వైపు చూపు కలిపేవారు. ఇప్పటికీ అటువంటి చెప్పులు బంజారా హిల్స్ రుయోష్‌లో ఉంటాయి. అప్పుడప్పుడు అలా వెళ్ళి వాటివంక చూసి వస్తుంటా.

చెప్పులు అంటే అకి కౌరిస్మాకి తీసిన లె ఆవ్ర్ సినిమానే గుర్తుకు వస్తుంది. కడుపులో చేయి పెట్టి గుంజినట్లుగా కూడా! నొప్పిగా కూడా! మజీద్ మజీదీది చిల్డ్రన్ ఆఫ్ హెవెన్ సినిమా కూడా గుర్తుకు వస్తుంది. ఇప్పుడు అలీ బాగా పెద్దవాడయి ఉంటాడు. వాడికి కాలికి జోళ్ల పీడకలలు ఇక వస్తూ ఉండకపోవచ్చు. సంవత్సరం క్రితం వరకు కూడా చెప్పులంటే మక్కువ ఉండేది. నాలుగు అయిదువేల వరకు లెక్కలేకుండా కొనేసేవాణ్ణి. నాలుగు అయిదు ఆరు ఏడు ఎన్ని జతలు ఉన్నా ఇంకా మోజుకొద్ది కొత్తవి వెతికేవాణ్ణి. ప్రతి రోజూ వేసుకుబోయే చెప్పులని శుభ్రంగా తుడిచి పాలీష్ చేసుకుని మరీ కదిలేవాణ్ణి. ఇప్పుడు అది ఏమీ లేదు. నన్ను నేను వెనక్కి మళ్ళి చూస్తున్నట్లు తెలుస్తుంది. చెప్పులు అరిగిపోయి కన్నాలుపడే మళ్ళీ ఆ రోజు కొరకు చూస్తున్నట్టుగా కూడా ఆనందం అవుతుంది. మళ్ళీ ఆ ఆకుపచ్చని హవాయి చెప్పుల చల్లదనం తొడుక్కోడం కోసం వేచి వున్నా. అవీనూ వెళ్ళిపోయి వట్టి కాళ్ళ మీద, పచ్చిక మీద, ఆ హంపీ రాయి మీద, ఆ సోవియట్ భూమి పుస్తకంలో చిన్నప్పుడు నేర్చుకున్న పాఠం కొద్ది వట్టి కాళ్ళతో నడిచే రోజుల కోసం కూడా!
------------------------------------------------------
రచన: అన్వర్, 
ఈమాట సౌజన్యంతో

Tuesday, June 4, 2019

కిటికీ పక్క ఆకాశం


కిటికీ పక్క ఆకాశం



సాహితీమిత్రులారా!

ఈ కవితను ఆస్వాదించండి..............

ఈ కిటికీ పక్క ఆకాశం ఇన్నాళ్లూ నాదే!

ఆకాశం మిద్దె క్రింద అడవిలాటి ఆకుపచ్చకి
మెలకువతో ఉన్న నా క్షణాలన్నీ ఇచ్చేసేను
నిజం చెప్పేస్తున్నా
ఇటుగా ఒంగిన ఆకాశంతో ఎప్పుడో ప్రేమలో పడ్డాను.

ఆ మూలగా గడ్డి చెదిరిన పాకలో రెండు ఆవులు
విలాసంగా మేస్తున్నాయి, అరమూత కళ్లతో
ఆకాశాన్ని చూస్తూ ఆనక నెమరేస్తున్నాయి.

ఎవరెవరో వచ్చారు, ఏవో కొలతలు వేశారు!
ఇసుక లారీలొచ్చాయి
ఇనుప చువ్వలొచ్చాయి
మోడువారిన చెట్లొచ్చాయి.
కరకరమంటూ కంకర నలుగుతోంది
అడవి కరిగి ఆవిరయిపోతోంది.

ఒకటొకటిగా నిటారుగా నిలబడ్డ
అంతస్తుల వరుసలకు అందకుండా
ఆకాశం కనిపించని ఎత్తుకు ఎగిరిపోయింది!

పచ్చదనంతో దోబూచులాడే కువకువలన్నీ
ఎటో వలస పోయాయి
పాకలో ఆవులు నెమరేయటం మరిచిపోయాయి.

లోలోపల ఊపిరాడనితనం.
పున్నమి నాటి ఆకాశం పాత చుట్టరికం కలిపి
నన్ను పలకరించబోతుంది
ఇక్కడి మట్టిహృదయం మాయమైందని తెలియదు పాపం!

ఈ ఆకాశం నాది కాదు! నాది కాదు!
-------------------------------------------------------
రచన: అనూరాధ నాదెళ్ళ, 
ఈమాట సౌజన్యంతో

Sunday, June 2, 2019

వానకూడా వింతే!


వానకూడా వింతే!




సాహితీమిత్రులారా!

ఈ కవితను ఆస్వాదించండి...............

చుట్టపు చూపుగా వచ్చినవాళ్లు
చూసి పోవాలే తప్ప
ఉండి పోకూడదు
గదులు ఖాళీలుండవు
మదులూ ఖాళీలుండవు

కొంప కొల్లేరయినా
ఊరు వేగై అయినా
కొలువు తప్పదు
చెదిరిపోతుందని తెలిసినా
ముస్తాబు తప్పదు

వీధి గుమ్మంలోంచి
వెళ్ళిపోవాల్సిన వానలకి
నగరమెప్పుడూ సిద్ధం కాదు
డ్రైనేజీల్లేని నగరాలు
గొడుగుల్లేని జవరాళ్ళు

తడిసి తడిసి ప్రవహించడమేతప్ప –
వెలుతుర్లేని చీకట్లో
చెప్పకుండా వచ్చి వెళ్ళిపోతే మంచిది
ఉదయానికీ ఉద్యమానికీ
అడ్డు పడకూడదు

వానని ప్రేమించడానికి
ఆకుపచ్చని అడవిని ఊహించడానికి
స్థిమితం కావాలి

ఎప్పుడైనా వాన కురిసినరోజు
సెలవు ప్రకటిస్తే బావుణ్ణు
ఇంటిముందు కాగితప్పడవల్తో
దారాల వానలో
గెంతులేయచ్చు
ఘల్లునమోగే జల్లులో
జవరాలిలా
----------------------------------------------------------
రచన: ఇంద్రప్రసాద్, 
ఈమాట సౌజన్యంతో

Saturday, June 1, 2019

కార్బైడ్


కార్బైడ్





సాహితీమిత్రులారా!

“రోజు రోజుకీ మానభంగాలు శృతిమించి రాగాన పడ్తున్నాయి. దేశతలమానిక నగరం హస్తినలోనే జరిగిన అత్యాచార ఉదంతంలో నేరస్థుడికి ప్రజల అలజడి కారణంగా మెడకి తాడేసి యమపురికి పంపినా, ఆ ప్రజల్లోనే భాగమైన కొంతమంది కామపిశాచులకి శిక్షాభయం లేకుండా పోతోంది. అందుకనే అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి.”

“మానభంగాలు జరగడానికి ఇదమిత్థoగా కారణమిదీ, అని చెప్పడానికి వీలు లేకుండా పోతోంది. వయసుతోవచ్చే శారీరకమైన సహజగుణం కామసహితమైన కోరిక. దీనికి జాతి, మత, కుల, ప్రసక్తి లేదు. ఉన్నవారికీ, లేనివారికీ వయసు ప్రసాదించే ప్రకృతి వరం కావొచ్చు, లేదా శాపమని కూడా అనుకోవచ్చు.”

“స్త్రీపురుష సమాగమం ద్వారా పునరోత్పత్తి కార్యక్రమానికి ప్రకృతి రూపొందించిన మహామంత్రం పరస్పరాకర్షణ లేదా వ్యామోహం. దానికి నైతికతను ప్రసాదించేది సమాజం ఏర్పరచిన వివాహం. వివాహానికి బాహ్యంగా జరిగే కామక్రీడలు ఇష్టమైతే రాసలీలలు, కాకపోతే రాక్షసలీలలు.”

“నాగరికత సమాజానికి నేర్పిన మొదటి అంశం వస్త్రధారణ. ఆధునికత పేరుతో వస్త్రధారణ రోజురోజుకి విపరీతధోరణులు పోతూండడంతో అవి కవ్వింపు చర్యలుగా మలుచుకొంటున్నాయి. చెప్పిన మాటలు ఒక్కోసారి వికటిస్తాయి. పాపం ఓ పెద్ద పోలిసాఫీసరుగారు ఈ మాటని అని కోరి తద్దినం తెచ్చుకొన్నారు. మహిళా లోకం ఆయనగారి మీద దివి సునామీలా విరుచుకు పడింది. చెన్నై కుంభవృష్టిలా ముంచెత్తింది.”

“పాపం మహిళాలోకాన్నీ నిందించి ప్రయోజనం లేదు. ఎందుకంటే వెర్రిమొర్రి వస్త్రధారణ కేవలం సినిమాలకే పరిమితం. బాహుమూలల, నడుమువంపుల, ఊరువుల, ఎదలోయల బహిర్గతాలు, చిత్రవిచిత్రమైన ఉరోజ కంచుకాలూ చలనచిత్ర నాయికలకు కోట్లు సంపాదిస్తున్నాయి. కథాబలం లేక చిత్రాలు డింకీలు కొట్టినా నిర్మాతలకు నాలుగు రాళ్ళు దొరికేవి వీరిమూలానే! ప్రేక్షకుల యావ తీరేదీ వీరిమూలానే! ముంబైలో చలనచిత్రాలకు సంబంధించిన కుడ్యచిత్రాలను పేడముద్దలతో కొట్టి మహిళలు పలుసంధర్భాలలో తమ నిరసనలు తెలియజేసినా ప్రయోజనం లేకపోయింది.”

“అవొచ్చు,కాకపోవచ్చు. కానీ నిత్యజీవితంలో కొంగు, పల్లూలు లాంటి ఆచ్ఛాదనం లేని బాహంతరాలతో, ఊరువులను అతుక్కుని ఉండే జీన్ ప్యాంట్లతో సంప్రదాయక దుస్తులకు సెలవుచీటీలు యిచ్చేస్తోంటే, దాడి చేసే మృగాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది.”

“ముంబైలోనూ, హైదరాబాబాద్ లోనూ, బెంగళూరులోనూ ఐటి ఉద్యోగినులమీద వాహనచోదకులు అత్యాచారాలు చేశారు. కేవలం వస్త్రధారణ ఒక్కటే కారణం కాకపోవచ్చు. గుర్రం మీద సవారీ చేస్తూపోయే రాజుగారికి పొలాలలో పనిచేసే పల్లెపడుచుమీద, రాజుగారి తోటలో పనిచేసే రాముడికి రాజకుమారి మీద మనసులు పోయే సంగతి మనకి తెలియంది కాదు. ఇక్కడా అదే సామ్యం చెప్పుకోవాలి. లేకపోతే వేలమీద జీతాలు సంపాదించే స్త్రీలమీద చెప్పలేని కసి కావొచ్చు. ”

“చలన చిత్రాలలో అసభ్య దృశ్యాలను కనక కత్తిరించకపోతే ఇలాంటి నేరాలు పెరిగిపోతాయి.”

“అసభ్యమా? అత్యాచారం దృశ్యాలని కూడా కళాత్మకంగా చూపించేస్తున్నారు. అమ్మడి బొమ్మ ఏడుస్తోన్నప్పుడు కూడా శృంగారం ఒలకపోయకపోతే చిత్రం అడుగు ముందుకు జరగదు. రాలుగాయితనంతో మొరటు లేక ద్వంద్వార్థపు మాటలు లేకపోతే సన్నివేశాలలో ప్రేమ ఉన్నట్టుకాదు. నృత్య సన్నివేశాలలో వంపుల ఊపులూ, నడుముల కదలికలూ లేనిదే అది నాట్యమనిపించుకోవటల్లేదు. ఇదివరలో దేశీభామలు బృందనృత్యాలలో నాయకీనాయకులకు ఆలంబనగా నిలిస్తే, ఇప్పుడు విదేశీ శ్వేతసుందరీమణులచేత రంభల్లాంటి ఊరువులతో కుర్రకారుని ఉర్రూతలూగిస్తున్నారు. సరే యిక వానలో నాయికను తడిపి చూపించే దృశ్యాలకి కొదవే లేదు. ఆరబోతలకి అమ్మళ్ళకి కోట్లలో సొమ్ములిచ్చే నిర్మాతలు తమ లాభాలు చూసుకుంటారుకాని, సమాజంలో జరిగే విపరీత పరిణామాలకి జవాబుదారీ వహించరు. కత్తెర అధికంగా వేస్తే సినిమాలు ఆడవు. చిత్ర నిర్మాణాలు తగ్గిపోతాయి. అగ్రనటులకు గోరూడకపోయినా, చలనచిత్ర సాంకేతిక కార్మిక వర్గానికి ఇక్కట్లు ప్రారంభమౌతాయి. వారిని దృష్టిలో ఉంచుకొని కత్తెరలు మొరాయిస్తాయని ఓ సెన్సార్ ఆఫీసరుగారు వివరణ యిచ్చుకున్నారు. ఆకుపచ్చ చీరమీద కాషాయిరంగు పూలుంటే అది అభ్యంతరకరమైన దృశ్యంగా కత్తిరించబద్తుంది కాని, కాలేజీకి వెళ్ళే అమ్మాయి చిరుగుల పొట్టిలాగుతో, నాభి ప్రదర్శనతో ఉంటే మట్టుకు కాదు! కాలేజీలకి విద్యార్థినులు నిజంగా అలా వెడ్తున్నారా అంటే, ఖచ్చితంగా కాదు.”

“వయసొచ్చిన అమ్మాయిల వస్త్రధారణ సంగతటుంచు. అయిదేళ్ళ పాపలుకూడా బలాత్కారాలకి గురైపోతున్నారే, దీనికేమంటావు?”

“నడివయసు తారలు కూడా పాపల్లా పొట్టిగౌనులు తొడుక్కుపోతూంటే, ఆ పెద్ద పాపలు చిటారికొమ్మన మిఠాయి పోట్లాల్లా కవ్విస్తోంటే, అభం, శుభం తెలియని చిన్న అమ్మాయిలమీద పంజాలు విసురుతున్నారు. సభ్యసమాజానికి తలవంపులు తెచ్చే ఈ పైశాచిక ప్రవృతిని ఏమనాలో తెలియట్లేదు.. కక్షసాధింపు ఓ కారణం కావొచ్చు. లేదా పసిపాపలతో సంగమిస్తే సుఖరోగనివృతి అవుతుందనే మూఢనమ్మకం కావొచ్చు. యువతీ యువకుల నీలిచిత్రాలు విశృంఖలంగా ఓ పక్కన వెలువడుతోంటే, అవి చాలవన్నట్టుగా అంతర్జాతీయంగా చిన్నపిల్లలతో చిత్రీకరించబడిన నీలిచిత్రాలు కూడా అంతర్జాలంలో విచ్చలవిడిగా ప్రసారమౌతున్నాయి. ఇదీ ఓ ఆధునిక సమాజరీతి అనుకొని గొర్రెలు కూడా తోడేళ్లై ప్రవర్తిస్తున్నాయి. ప్రత్యేకించి ఈ విషయమై కాకపోయినా ఎవరికిష్టమైన అంశాన్ని వారు యధేచ్చగా చూసుకోవడానికి అభ్యంతరాలుండకూడదని, అంతర్జాలంమీద నిబంధనలుండగూడదని యువత వెర్రికేకలు పెడ్తోంది.”

“‘ఆదికాలం నుంచి ప్రపంచ వ్యాప్తంగా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. సమాజంలో జరిగే ప్రతి మానభంగానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలంటే అది సాధ్యం కాని పని. దీనికింత రాజకీయ రాద్ధాంతం చేయడం అవసరమా?’ అని ఓ తలపండిన రాజకీయ నాయకుడు ఉద్ఘాటించి, అటుపై తగిలిన విమర్శనాస్త్రాలని తన మొద్దు చర్మంతో విరిచి పారేశాడు.”

“త్రేతాయుగంలో రావణుడు సీతని అఫహరించాడే కానీ హద్దుమీరలేదు. ద్వాపరయుగంలో కౌరవులు, ద్రౌపదిని వస్త్రహీనను చెయ్యడానికీ, కీచకుడు మానభాగం చెయ్యడానికీ ప్రయత్నించారు. మరి కలిలో ధర్మం ఒంటిపాదం మీద నడుస్తూంటే ఇలాంటి ఘోర కలిలు జరగకుండా ఎలా ఉంటాయి?”

“ ఇంద్రుడు అహల్యను చెరిచింది కృతయుగంలో కదా? గురుపత్నిని వలచిన చంద్రుని ఉదంతం ఏ యుగంలో జరిగింది? అంచేత ఈ యుగాలూ, పురాణాల మాట అటుంచి ఆలోచిస్తే, మౌలికంగా ఈ కామ పిశాచమనేది మానవుల్లోని కొన్ని పైశాచిక జన్యువుల ప్రభావం అనుకోవాలి. రాజకీయ నాయకుడు అన్న మాటలు సత్యదూరాలు కాకపోవచ్చు.”

“ ఇదివరలో కొవ్వలి, జంపన, చలం సాహిత్యాలు అశ్లీల సాహిత్యాలుగా పరిగణించబడ్డాయి. మరి యిప్పుడో...?”
“ నట్టింట్లో బుల్లితెరమీది దృశ్యకావ్యాల ముందు అవి ఏపాటి? ప్రకటనల్లో సుందరీమణుల, ప్రసార నిర్వహణలు చేసే లంగరు యువతుల ఆహార్యాలతో నిర్మాతలు యువతను రెచ్చగొడ్తున్నారు. ఇది వరకు సినిమా పత్రికలు ప్రత్యేకంగా వచ్చేవి. ఇప్పుడు దినపత్రికల్లోనూ సినిమా వార్తలకి, చిత్రాలకి ప్రత్యేకంగా ఓ పేజీ కేటాయించబడ్తోంది. వారపత్రికల ముఖపత్రాల చిత్రాలు కేవలం సినీతారలవే! లోపలి పేజీల్లో కనీసం రెండుమూడు పేజీలకొక సినిమాతార చిత్రం, దానికి జోడించి మసాలా వ్యాఖ్యలు సామాన్యమైపోయాయి.”

“నిర్మాతలే కారణమని అనకూడదు. అటువంటి ఆహార్యాలని సమ్మతిస్తున్న స్త్రీలు కూడా కారణం కాదా? చదువుతున్న పాఠకులు, చూస్తున్న ప్రేక్షకులు నిరసించకుండా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోడమూ కారణమే.”

“ఈ మాటంటే మళ్ళీ స్త్రీల ఆగ్రహానికి గురౌతాం. సంసారంలో సొగసులు చూడగలమా అనుకుంటూ పురుషులు కూడా గమ్మునుండిపోతారు. పురుషుల్లోని సౌందర్యారాధనని రెచ్చగొట్టే విధంగా తారల్ని కళ్ళు జిగేల్ మనిపించేటట్టుగా తెరమీద తీర్చిదిద్దితున్నారు. వివాహిత ప్రేక్షకుల విషయం వదిలేస్తే వారికున్న వెసులుబాటు వేరు. కానీ విద్యార్థులమీద చలన చిత్రాల ప్రభావం ఏ దారి పడ్తుందో చెప్పడం కష్టం.”

“ ముంబై లో పదోక్లాసు చదివే నలుగురు విద్యార్థులు తొమ్మిదో తరగతి చదువుతోన్న ఓ విద్యార్థినిని చెరిచారని పత్రికల్లో వార్త. పదోక్లాసు కుర్రాడు ఓ ఆంటీ వద్దకుపోయి, మూత్రం పచ్చగా వస్తోంది, ఇదేం రోగం అని పత్రికల్లో వైద్యసలహాలిచ్చే శీర్షికలకీ ప్రశ్నలు పంపడం – యివన్నీకూడా చుట్టూ విస్తరిస్తున్న కొత్త సంస్కృతి ప్రభావాలే. వయసు దానంతట అదే నెమ్మదిగా ప్రభావం చూపుతున్నంత కాలం విద్యపట్ల, బ్రతుకుతెరువుపట్ల లక్ష్యసాధన చెయ్యగలుగుతారు.”

“అదీ కాక, అర్థరాత్రివేళ మగ స్నేహితులతో తిరక్కండి, పబ్బుల్లో వెంపర్లాడకండి, రెచ్చగొట్టే విధానంగా వస్త్రధారణ చేయకండి, బలాత్కారలనుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని సలహాలిస్తారే కాని బలాత్కారాలు చెయ్యడం మంచిదికాని ఎవరూ చెప్పరే !”

“ బలాత్కారం జరిగిందని చెప్పడానికి చాలామంది గౌరవప్రతిష్టలు ఎక్కడ గంగలో కలిసిపోతాయేమోనని ముందడుగు వెయ్యరు. ఆర్నెల్లు కలిసి తిరిగో, సహజీవనం చేసో అటుపైన బలాత్కారం కేసులు బనాయించిన ఉదంతాలూ చోటు చేసుకొంటున్నాయి. అయితే వెనువెంటనే బలాత్కారాలను గురించి బహిర్గతం చేసినవారికి న్యాయస్థానాలు ఏడాది తర్వాత తీర్పునిచ్చి, దోషులకు శిక్షలు విధించడం బలాత్కారం చెయ్యడం తప్పని చెప్పడమే కదా? అలాగని బలాత్కారం చేసినవాడికి వెంటనే బడిత పూజచెసి ఎవరైనా ఎముకలు విరగ్గొడితే అది చట్టవిరుద్ధమని వాళ్లమీద కేసులు బనాయిస్తారే! తాళికట్టిన స్త్రీ అభీష్టానికి వ్యతిరేకంగా భర్త ప్రవర్తించినా అది బలాత్కారంకిందే లెక్కని ఆ మధ్య ఓ మీమాంస జరిగింది. నిర్ణయం ఏం జరిగిందో తెలియదు.?”

“ ‘పాపం పదిహేడేళ్ల (పదహారేళ్ళ) కుర్రాడు తెలియకచేసిన పాపం. కార్బైడ్ ప్రభావానికి పచ్చికాయలు మగ్గినట్లుగా, అనేకానేకమైన ఆధునిక పరిసర ప్రభావలవల్ల ముందే పెద్దవాడైపోయి, మతి చెడి పొందు కోసం పరుగులు తీశాదు, క్షమార్హుడు,’ అని చట్టసభలే నిర్ణయం తీసుకొంటే ఏమనుకోవాలి?”

“ కుర్రాళ్లనే ఎందుకనుకోవాలి? పచ్చని సమాజాన్నేకుళ్లబెట్టేస్తున్నాయి!” .

“సరే,పద! ఎండిపోయిన ఈ ఉద్యానవనంలో విరిగిపోయిన సిమెంట్ బెంచిల మీద కూర్చుని మాట్లాడుకొంటున్న మన మాటల్ని ఏ కుర్రవెధవాయిలైనా వింటే, ‘వయసుమీరిన వెధవాయిలు మనమీద పడి ఏడుస్తున్నార’ని అపహాస్యం చేస్తారు!”
--------------------------------------------------
రచన - - పి.వి.రమణ రావు( ఎలక్ట్రాన్),
సుజనరంజని సౌజన్యంతో