Friday, June 7, 2019

పెట్టని మొక్కు ఫలితం


పెట్టని మొక్కు ఫలితం




సాహితీమిత్రులారా!

నాలుగేళ్ల క్రితం, సాక్షి పత్రిక ఫన్డే ఫీచర్‌లో కొన్ని వారాలపాటు జీవిత కథనాలే కవర్ స్టోరీలుగా వచ్చాయి. అందులో భాగంగా నేను కూడా కొన్ని ఇంటర్‌వ్యూలకు వెళ్లాల్సివచ్చింది. టీడీపీ మైసూరారెడ్డి, జగడం సుకుమార్, ఆయుర్వేద ఏల్చూరి, పూర్ణోదయా నాగేశ్వరరావు, లీడర్ మిక్కీ జె. మేయర్, న్యూస్‌రీడర్ శాంతిస్వరూప్, ప్రతాప్ రాఘవ, ఎముకల గురవారెడ్డి… ఇట్లా కొందరిని ఇంటర్‌వ్యూ చేశాను. అవన్నీ వేటికవే భిన్నమైన అనుభవాలు! అయితే వాటి గురించి నేనేమీ చెప్పబోవడంలేదు.

అయితే, ఈ సీరిస్‌లో ఒకసారి మల్లాది చన్ద్రశేఖర శాస్త్రిని పేజీల్లోకి తేవాల్సివచ్చింది! ఏదో పండుగ సందర్భం అనుకుంటాను. అయితే, ఆయన గురించి నాకు పెద్దగా తెలీదు. ఆయన చన్ద్రశేఖర అని సున్నా వాడకుండా తన పేరును రాసుకునే పట్టింపు వున్నాయన అని మాత్రం ఎక్కడో చదివాను. అందుకే, ఎందుకైనా మంచిదని, వెంట మా బాచిని పట్టుకెళ్లాను, తనైతే ఇలాంటి పెద్దవాళ్లను బాగా హ్యాండిల్ చేస్తాడని! చెప్పాలంటే, తనే ఇంటర్‌వ్యూ చేస్తాడు; నేను పక్కన కూర్చుని కొన్ని ఉపప్రశ్నలు అడుగుతానంతే! అదీ మేమనుకున్నది.

దానికి అనుగుణంగానే అపాయింట్‌మెంట్ తీసుకున్నాం. గాంధీనగర్‌లోని ఆయన ఇంటికి వెళ్లాం. నిజంగానే ఇంటిముందరి నేమ్‌ప్లేట్ పైన చెప్పినట్టే ఉంది. వెళ్లేసరికి, ఇంట్లో ఆ దంపతులిద్దరే ఉన్నారు. బాగా పెద్దవాళ్లయ్యారు. అయినా మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. మా పేర్లు, ఊర్లు అడిగారు. చెప్పాం. బాచి దోర్బల వాడు కాబట్టి, రెండు ప్రశ్నలు అదనంగా పడ్డాయి. మాట్లాడుతుండగానే, అమ్మ నెమ్మదిగా వచ్చి ఏవో పళ్లరసం గ్లాసులు మా ముందట పెట్టింది. తాగాం. ప్రశ్నలేవో అడిగాం. ఆయన రికార్డు చేయడానికి ససేమిరా ఒప్పుకోలేదు కాబట్టి, వెంటవెంటనే రాసుకున్నాం. మళ్లీ ఆ పెద్దావిడ అంతే నెమ్మదిగా వచ్చి, మేము ఖాళీ చేసిన గ్లాసుల్ని పట్టుకెళ్లింది. అటో ఇటో ప్రశ్నావళి ముగిసింది. ఇక లేచి, సెలవు తీసుకుంటూ నమస్కారాలు చెప్పుకోవడం మిగిలివుంది…

ఇద్దరమూ లేచాం. వెంటనే బాచి ఏం చేశాడంటే… ఇలా చేస్తాడని నేను ఊహించలేదు! ఠక్కున పాదాభివందనం చేశాడు. మరి పక్కనేవున్న నేనేం చేయాలి? అలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి నేను ముందు సిద్ధపడి లేను. నేను వెంటనే ఏదోలా స్పందించాలి! అంటే, నేను ఎలా నమస్కరిస్తానో ‘తేల్చబోయే’ సన్నివేశంలోకి నెట్టిన బాచి మీద నాకు కోపమొచ్చింది. కానీ అది అతడి పద్ధతి! మరి నాకేమిటి దారి? నేను ఇక నా పద్ధతిలోనే బుద్ధిగా రెండు చేతులు జోడించి, నమస్కరించి, బయటికి వచ్చేశాను.

అది జరిగిన తర్వాత, చాలా నెలల పాటు, ఆ సన్నివేశం నాకు మళ్లీ మళ్లీ గుర్తొచ్చేది. నేనా పెద్దాయనను చిన్నబుచ్చి వుంటానా? పక్కవాడు పాదాభివందనం చేసినప్పుడు, నా నుంచి కూడా ఆయన అదే ఆశించి వుంటాడా? అసలు ఆయన పట్టించుకున్నాడా? కానీ ఇద్దరి మర్యాదలోనూ స్పష్టమైన తేడా కనబడినప్పుడు, లిప్తమాత్రంగానైనా గమనించకుండా ఉంటాడా?

నేను, మా అమ్మ బాపు, పెద్దమ్మ పెద్దబాపు లాంటి అతి సన్నిహిత సంబంధాల్లో నలుగురైదుగురికి తప్ప ఎవరి కాళ్లూ పెద్దగా మొక్కి ఎరగను. ఎందుకంటే, అది నా అహానికి సంబంధించిన అంశం! అలాగని, పెద్దవాళ్లను గౌరవించడానికి చేసే పాదాభివందనాల పట్ల నాకేమీ వ్యతిరేకత లేదు. కానీ ఈ పెద్దాయన నాకు పరిచయం లేడే! ఆయన దానికి అర్హుడే అనదగినంతటిదేదో ఆయన నుంచి నా జీవితంలోకి ఏదీ వచ్చివుండిలేదే! అయితే, నా పిల్లతనానికి ఆయన గొప్పతనం గురించిన తెలివిడి లేకపోయుండవచ్చు! అయినా, ఆయన వయోవృద్ధుడు అన్న ఒక్క కారణంగానైనా నేనా మొక్కేదో మొక్కితే పోయేదా? గృహిణిగా తన బాధ్యతలో భాగంగానే కావొచ్చు, అయినాసరే, ఆ పెద్దావిడ మా ఎంగిలి గ్లాసులు కూడా తీసిందాయె! దానికైనా ఇది పరిహారం అయ్యేదా! నా పక్కవాడు చేయకపోతే వేరే సంగతి! కానీ చేశాడు కదా! అంటే, ‘ఇతడు నాకు మొక్కలే’దని తెలియవచ్చే చిన్నపాటి ఇబ్బందికి ఆ పెద్దాయనను ఎందుకు గురిచేశాను? ఒకవేళ, అలా చేసివుంటే, నేను ఫార్మాలిటీకైనా తలవంచానని అది మళ్లీ లేనిపోని న్యూనతకు దారి తీసేదా? నేను ఏ పని చేసినా, ఒకవేళ చేయకపోయినా కూడా, దాని ఫలితం కచ్చితంగా పశ్చాత్తాపం దగ్గరే ఆగుతుంది.

కానీ ఒక్కోసారి అనిపిస్తుంది… ఇదే ఇంటర్‌వ్యూ ఏ కొలకలూరి ఇనాక్‌తోనో అయివుండి, అప్పుడు కూడా నా పక్కవాడు ఉన్నట్టుండి ఇలాగే పాదాభివందనం చేసివుంటే, నేను మామూలుగానే చేతులు జోడించి వచ్చివుంటే, అప్పుడు కూడా నేను ఇలాగే మథనపడి వుండేవాడినా! అది తెలిస్తేగానీ, ఈ మొత్తం అంకంలో ఏ మూలనో దాగివున్న కుల స్పృహ సంగతి కచ్చితంగా తెలియదు!
--------------------------------------------------------
రచన: పూడూరి రాజిరెడ్డి, 
ఈమాట సౌజన్యంతో

1 comment:

  1. అనవసరమైన విషయం.

    ReplyDelete