Wednesday, June 5, 2019

హంపి నుండి నూనేపల్లె…


హంపి నుండి నూనేపల్లె…




సాహితీమిత్రులారా!

నడినెత్తి మీద హంపి ఎండ! అరికాలిని చుట్టుముట్టిన రాతి ఎండ! విరూపాక్ష దేవాలయం వెళ్ళేదారిలో అమ్మాయిల అబ్బాయిల నవ్వుల మధ్య, బోలెడన్ని సెల్ఫీల వెలుగులకి కాస్త ఇటుగా, బిడియంగా బొత్తిగా మెరుపు లేని జీవితంలా నిలబడి ఉన్నాడు హనుమంతు. నిన్నట్నుండి హనుమంతు వంటి బోలెడుమంది కుర్రాళ్ళు చంకల్లో ‘హంపీ చరిత్ర – కథలూ గాథలూ’ పుస్తకాలు ఇరికించుకుని “అన్నా ఒక్క బుక్కు! టూ హండ్రెడ్ ఒన్లీ!” అని చుట్టుముడుతున్నారు. ఈ దిక్కుమాలిన శిథిల నగరం చూడకపోయినా నష్టంలేదు కానీ ఇలా ఈ పిల్లల్ని చూడాలంటే కష్టంగా ఉంది. పుస్తకాల దరిద్రం ఏం మోసుకుతిరుగుతాం? ఇంట్లో అలమారల్లో, తల బుర్రల్లో ఇరికించుకున్న వెధవ జ్ఞానం, ప్రమాదకర ఎంగిలి జ్ఞానం! నాయనల్లారా! మీరు ఇలా పనిచెయ్యడం పట్లా నాకు గౌరవమే! కానీ ఈ కాగితాల బదులు కనీసం మంచినీళ్ళ బాటిళ్ళు అమ్ముకోరాదా? బ్లాకు రేటు అయినా కొనేవాణ్ణి, అరగంట అయ్యాకా ఏ చెట్టు మాటునో బరువు సమస్తం దించుకునేవాణ్నయితిని. ఈ దిక్కుమాలిన పుస్తకాలు ఏం జేసుకోను? గిల్టీని జేబులోని నోట్ల మధ్య దాచుకోలేక తగిలివచ్చిన ప్రతి పిల్లవాడిని క్షమాపణ చెప్పుకుంటూ బుజ్జగిస్తూనే ఉన్నా. అయితే హనుమంతు విషయంలోని దిసకాళ్ళు నా అడుగులు ముందుకు పడనివ్వలేదు. “ఎందుకు హనుమంతు, చెప్పులు వేసుకోలేదు?” “లేవు సార్.” “మరి కాళ్ళు కాలవా!” “అలవాటు అయిపోయింది సార్.” “పుస్తకం అమ్మితే ఎంత వస్తుంది హనుమంతు?” “వంద రూపాయలు సార్.” “డబ్బులు ఏం చేస్తావు హనుమంతు?” “అమ్మకు ఇస్తాను సార్.” “హనుమంతూ, నాకు పుస్తకం వద్దు కానీ డబ్బులు ఇస్తాను, చెప్పులు కొనుక్కుంటావా? ఊరికే ఇస్తున్నావని తప్పుగా అనుకోవద్దు, నాకూ నీ మాదిరి కొడుకు ఉన్నాడు. వాడు చెప్పులు లేకుండా తిరిగితే నాకు బాధ అనిపించదా?” (గాడ్దె కొడకా! నిజంగా నీ కొడుక్కు చెప్పులు లేకపోతే నీ కాలికి ఉన్నవి గబగబా విప్పి వాడి కాలికి తొడగవా? వంద రూపాయలతో వదిలించుకుంటావా? పైగా బతుక్కు కరుణారస మాస్క్ ఒకటా! హరామ్‌ఖోర్!) హనుమంతు చెప్పులు కొంటాడా కొనడా! ఏ విషయం చెప్పడం లేదు, ‘ఒక పుస్తకం కొనండి సార్’ అని మాత్రం గొణుగుతూనే ఉన్నాడు…

కర్ణాటక పల్లెల మధ్యలోంచి మా కారు ప్రయాణం నడుస్తూనే ఉంది. దారిలో ఎదురువచ్చిన గ్రామాల్లో బడి వదిలిన సమయపు పిల్లల కాళ్ళు బోలెడు నాకు ఎదురు అవుతూనే ఉన్నాయి. దాదాపుగా అన్నీ వట్టి కాళ్లు, మట్టి కాళ్లు, దుమ్ము కాళ్లు, ముళ్ళు విరిగిన కాళ్లు… ఇప్పుడు ఇన్నేళ్ల తరువాత కూడా రోటీ, కపడా, మకాన్‌ల మధ్యలో కాలిజోడు ఇరికించుకోలేని ఈ బ్రతుకుల మీద ఆంత్రోపాలజీ చూపులు ఎవరు సారిస్తారు? ఇవన్నీ నన్ను మా చిన్నప్పటి కాలి ముద్రల వైపు, హవాయి చెప్పులు మాత్రమే ఎరిగిన కాళ్ళ దారుల్లోకి నడిపించాయి. ఈ రోజు చదువుల గురించి, ఆ తరగతి గదుల సంస్కారం గురించి నాకు అవగాహన లేదు కానీ చెప్పులు అనగానే మా ఖలీల్ సిద్దిఖీ క్లాసు రూముల ముందు ఒక దానిపై ఒకటొకటిగా కలిసివుండి కొన్ని, చెల్లా చెదురుగానుండిన మరికొన్ని, చెప్పులే మెదలుతాయి. గదిలో సరస్వతీదేవి కలదో లేదో కానీ, చెప్పులు ధరించి పుస్తకం తెరవరాదు. అక్కడే ఆగిపోయిన ఆ పాతకాలపు పిల్లవాడిగా నేను కాలికి జోడు తొడుక్కుని బొమ్మ వేసే పని చెయ్యను. గట్టి జ్ఞాపకం ఉన్నంతలో ఏనాడు ఫోన్లో బాపుగారితో మాట్లాడినప్పుడు కూడా వేసుకుని ఉన్న చెప్పులు వదిలి, సౌలభ్యం కుదిరితే మోకాళ్ళ మీద కూచుని మాట్లాడేవాణ్ణి.

పిల్లలు తమలో తాము గొడవపడినప్పుడు చెప్పులతో కొట్టుకోడం చాలా కామన్. చిన్నప్పుడు బాల్‌తో ఆడుకునే ‘ఈపుల్ సాపుల్’ ఆటలో బంతి దొరకనపుడు చెప్పులతో ఆడుకోడం జరిగేది. మా చిన్నాయనతో చెప్పుదెబ్బలు తిన్న అనుభవాలు బుగ్గల మీదుగా జారిన కన్నీటి చారికలుగా నిలిచే వున్నాయి. అసంకల్పితంగా చెంపని తడిమితే ఆ జ్ఞాపకాల మంట తడిగా మండుతుంది. చిన్ననాట చెప్పులు అంటే హవాయి చెప్పులు తప్పా మరేవీ చెప్పులు కావు. నిజానికి లేని జ్ఞానం కుప్పకూలేవరకు కూడా హవాయి అంటే చెప్పుల కంపెనీ పేరు అనుకునేవాళ్లం.

కాసిన్ని రూపాయిలు ఎక్కువ పెడితే బాటా, తక్కువ డబ్బులకయితే పాపులర్ కంపెనీ చెప్పులు వస్తాయి. చెప్పు ఏ కంపెనీదయినా, ఎంత నెంబరుదయినా మా ఊరి తుమ్మ ముళ్లకు మాత్రం బహు లోకువ. ఏదయినా పీరియడ్‌లో లీజర్ దొరికితే మా పిల్లలు చేసే పని ఏవిటంటే జామెట్రి బాక్స్ తెరిచి కోణమాని ఇస్టీలు ముల్లుతో తుమ్మ ముల్లుని పీకడం. ఏ చెప్పు తిప్పి చూసినా ఏవుంది గర్వకారణం! చెప్పుల కింది సమస్త మొత్తం ఓంపురికి కవల సోదరుడిలా కన్నాల మొహం వేసుకుని వుండేది. ఉన్న ముల్లు పీకకపోతే వేసే ప్రతి అడుగు అడుగుకు ముల్లు చురుక్కు చురుక్కున ప్రాణం తీసేది. ముల్లు పీకిన కన్నం లోంచి కొత్త ముల్లు యథేచ్ఛగా దూసుకుపోయేది. ముల్లును ముల్లుతోనే తీయాలి అంటారు కానీ అలా చేస్తే కొత్త ముల్లు కూడా కాల్లో విరిగి పాదానికి తగిన శాస్తి చేస్తాది. ముల్లుని పిన్నీసుతో కసాబిసా గెలికి తీస్తారు. ముల్లు పీకిన కన్నంపై ఉప్పు రాయి ఉంచి అగ్గిపుల్లతో కాలుస్తారు. అప్పుడు ఒక్క సెకను దేవుడు కనబడతాడు.

ఇందాకా అనుకున్నాం కదా పిన్నీసు అని; చెప్పులు, పిన్నీసు రెండూ జంట కవులు. ఆ రోజుల్లో పిన్నీసుల హారం లేని ఆడ మెడ ఉండేది కాదు. పిన్నీసుకు జాత్యంతరం అంటదు. హిందూ, ముస్లిం, కిరస్తానీ అందరి మెడల గొలుసుల్లో పిన్నీసులు తళుకుమనేవి. అంగళ్ళల్లో పిన్నీసులు కొనడం డబ్బు దండగ, రోడ్ల మీద మొలతాడు దారాలు అమ్ముకునేవారి దగ్గర పిన్నీసు ప్యాకెట్లు కాస్త అగ్గువ. చొక్కాకు గుండీలు లేవా? పిన్నీసు ఉందిగా! చిట్టచివరి దారపు పోగు ఊడిపోయి నిక్కరు గుండీ మాయం అయినపుడు మానం కాపాడుకోడానికి దారిలో కనబడిన ఏ ఆడమనిషిని అడిగినా, విసుక్కుంటూనయినా రొమ్ముల మధ్య ఇరుక్కుపోయిన దండ నుంచి పిన్నీసు పెరికి చేతిలో పెట్టేవారు. ఆ నునుపెక్కిన పిన్నీస్‌ని అందుకోడానికి బోలెడంత సిగ్గు అయ్యేది. చెవిలో బలపం ఇరుక్కుపోయిందా, పిన్నీసుని వెనక్కి తిప్పి నైసుగా బలపం లాగెయ్యి. పిన్నీసు అంటే భోజానానంతర దేశీ టూత్ పిక్. ఇయర్ బడ్‌కు మాతృక పిన్నీసు, గుబిలిని చక్కగా తీసేస్తుంది. చెప్పు స్ట్రాప్ తెగిపోయిందా ఫికర్ నహీ! పిన్నీసుతో లంకె కుదర్చవచ్చు. ముందు చెప్పినట్లు చెప్పులోని ముళ్లు, చెవిలో జోరీగ పిన్నీసు ముందు బలాదూర్. కాగితం క్రింద అయస్కాంతం ఉంచి పైన పిన్నీసులతో బాలే ఆడిపించవచ్చు. అయస్కాంతం ఆకర్షణకు పిన్నీసు నాగస్వరం విన్న నాగినిలా ఆడుతుంది. కాలమ్ము మారింది. పిన్నీసు కంటపడ్డంలేదు. గుండీ దారం తెగక మునుపే బట్టలు పారవేయబడుతున్నాయి. గుమ్మం ముందు జబాంగ్ వాడో మిన్ట్రా వాడో బెల్ కొడుతున్నాడు. రబ్బరు చెప్పులు వేసుకోడం నేడు నామర్దా! వాటికి వాష్ రూమ్ ఘోషా పట్టింది. మా ఊళ్లో కేరళవాళ్ళు టీ షాపులు నడిపేవారు. అత్యంత శుభ్రమయిన చిన్ని స్టాళ్ళు, చిక్కని రుచి. స్నేహపాత్రమయిన మొహాలు. భుజాలదాక మడిచిన చొక్కా, పూల లుంగీ, కాళ్ళకు కేరళవారి స్పెషల్ హవాయ్ చెప్పల్. సంవత్సరానికో ఆర్నెల్లకో ఊళ్ళకు మరలి వచ్చేవారితో మా ఊరి పిలగాళ్లు చెప్పులు లుంగీలు తెప్పించుకునేవారు. ఇళ్ళల్లో చెప్పు అరిగి అరిగి కన్నం పడేదాకా కొత్త చెప్పు కొనిచ్చేవారు కాదు. సైకిల్ మీద కాలేజీకీ వెడుతూ వస్తూ ప్రతీసారి డౌన్ వచ్చినపుడల్లా కాళ్ళు నేలకు ఆన్చి యథాశక్తి చెప్పు అరగ్గొట్టేవాణ్ణి. తొక్కేవాడికి ప్రాణ సంకటం, ఆయాసం. క్యారియర్ మీద కూచున్నవాడి కడుపులో చల్ల కదలకుండానే చెప్పులు అరిగేవి.

బడికి వెళ్ళినా, గుడికి వెళ్ళినా, దర్గాకి వెళ్ళినా, పెళ్ళిలో పాల్గొన్నా, క్రికెట్ మ్యాచుల్లో వికెట్ల మధ్య పరుగులు పెట్టినా అవే హవాయి చెప్పులు. ఒక్కోసారి బౌలర్ వేసిన గుడ్ లెన్త్ బాల్ గురితప్పి కాలి బొటనవేలి మీద వాలేది. చితికిన వేలు రక్తం తెల్లని చెప్పు మీద. ఇంటికి వెళ్ళేవరకు, కాలు కడిగేవరకు వేలు చెప్పుకు అతుక్కుపోయి ఉండేది. ఆ క్రికెట్ సీజన్లో ఎన్నిసార్లు ఊడిన గోళ్లు మొలిచేవో! బస్సులో నాలుగు సీట్లు ముందుగానే బుక్ చేసుకోవాలంటే ఒక సంచి, ఒక కర్చీఫ్. ఒక ఎడంకాలి చెప్పు, ఒక కుడికాలి చెప్పు. సీటు దొరకని వాళ్ళు చేత్తో కర్చీఫ్‌నయినా తొలిగించేవాళ్ళు కానీ చెప్పుని ముట్టేవారు కాదు. రెండు సీట్లు మాత్రం గ్యారంటీ. ఒకరి బట్టలు మరొకరు వేసుకోడం దరిద్రం అంటారు. ఒకరి చెప్పులు మరొకరు వేసుకోడం అయితే మహా దరిద్రం. కాలేజీ రోజుల్లో రూముల్లో బ్రతికే మిత్రులందరూ నీచాతి నీచ దరిద్రులే! కాలికి సరిపోయిందా లేదా? ఇంతకూ ఇదెవడి చెప్పు చెప్మా! అని మీమాంస ఉండేదే కాదు. కొంతమమంది ఘనులు చెప్పులు కొనాలంటే టవును పక్కకు కాక, గుడి సైడుకు నడిచేవారు.

గుడిలో చెప్పులు సంగతి ఏమో కానీ మా తిక్కస్వామి దర్గాకు ప్రతి శుక్రవారం వెళ్ళి కొబ్బరికాయ కొట్టి సమాధి చుట్టూ ప్రదక్షిణ చేస్తాం కదా! గోడ గూళ్ళల్లో లెక్కకు మించి పాంకోళ్ళు ఉండేవి. వాటి చరిత్ర ఏంటో అప్పుడు తెలుసుకోలేకపోతినే! దర్గా దాక ఎందుకు మా ఇంట్లోనే దేవుని గూట్లో రెండు చెక్క పాంకోళ్ళు ఉండేవి. ఎవరూ ఇంట్లో లేని ఒక సమయాన వాటిని వేసుకుని నడవ యత్నించిన గుర్తు. మా దేవుడు గూడు బలేటిది. ఆ గూట్లో మక్కా మసీదు పటాలతో పాటు పుర్రెల హారం వేసుకుని నగ్నంగా ఉన్న కాళికమ్మ పటం కూడా ఉండేది. కాళికాదేవి మా జేజి నేస్తురాలు. వారానికి ఒకసారి ఆమె వంటిపైకి పూనకమై వాలేది. అప్పుడు ఆ సమయంలో మా జేజి నా వంక క్రూరంగా చూసేది. నేను కాళికామాత వంక నవ్వుతూ చూసేవాణ్ణి. మా జేజి చనిపోగానే కాళికమ్మ పటాన్ని అనాథలా అంటరానిదానిలా మునివేళ్లతో పట్టుకెళ్ళి చెత్తలోకి పడేశారు. షేక్ బీబీ జాన్, కాళికమ్మ, ఇద్దరూ మా దరిద్రానికి మమ్మల్ని వదిలేసి వారి దావ వారు కులాసాగా ఎగిరిపోయారు.

మా నాన్నకూ నాకూ కుదిరేది కాదు. గుమ్మం దగ్గర నాన్న చెప్పులు ఉంటే ఆపాటునే వెనక్కి తిరిగి వెళ్ళిపోయి ఆ చెప్పులు గుమ్మం ఖాళీ చేసిన తరువాతే ఇంట్లో అడుగు పెట్టేవాణ్ణి. ఇంటికి ఎవరు వచ్చినా ఎన్ని ఆడ కాళ్ళు ఎన్ని మగ కాళ్ళు అనేది బయట ఉన్న చెప్పులని బట్టే పసిగట్టేవాణ్ణి! వచ్చిన మనుషుల హోదా కూడా చెప్పులే చెబుతాయి. పదవతరగతి ఫెయిలయ్యాకా తెల్లవారుఝాము నాలుగు గంటల ట్యూషన్ ఒకటి శిక్షగా విధించబడింది. ఆ నిదుర మత్తులో చెరో రకం చెప్పు తొడుక్కుని మూడు కిలోమీటర్ల నడక దూరంలోని రవిసారు ట్యూషన్‌కి వెళ్ళా. తిరుగు టపాలో మత్తు వదిలి చూసుకుంటే ఏవుంది! కుడి ఎడమల పొరపాటు. ఆ రోజు నడకలో సమస్త మానవ జాతి మొత్తం తమ పనులన్నీ మానేసి నా కాళ్ల వంకే గుచ్చి గుచ్చి చూసినంత అవమానం. బహుశా ఆ అనుభవం వల్లే కాబోలు సంవత్సరన్నర, రెండు సంవత్సరాల క్రితం సాక్షి ఫన్డేకి ఒక ఇంటర్మీడియట్ అమ్మాయి వ్రాసిన తొలి కథలో తను మోజుపడి కొనుక్కున్న కొత్త చెప్పులు తెగిపోతే వాటిని వదలలేక, వేసుకుని నడవలేక ఇబ్బందిపడే ముగింపుని కాస్త సరిచేసి ఏది ఏమైనా ఎవడినీ లెక్కచేయనక్కరలేదని కాస్త మార్చి పెట్టాము.

తొంభై ఎనిమిది ప్రాంతాల్లో నేనూ మోహన్‌గారు ఒక ఆనిమేషన్ వర్క్ చేశాం కాంగ్రెస్‌వాళ్లకు. ఆ రోజుల్లో బాగా డబ్బున్న ఒక పెదరెడ్డిగారు మోహన్‌గారిని కలవడానికి వచ్చేవారు. “అరే! మీ చెప్పులు భలే ఉన్నాయండి,” అన్నారు మోహన్‌గారు. “కదాబ్బా?” అని నన్ను కూడా అడిగారు. ఆయన వాటి మీద మోజుపడ్డారు. రెడ్డిగారు వచ్చిన ప్రతిసారి ఆ చెప్పుల వైపు చూపు కలిపేవారు. ఇప్పటికీ అటువంటి చెప్పులు బంజారా హిల్స్ రుయోష్‌లో ఉంటాయి. అప్పుడప్పుడు అలా వెళ్ళి వాటివంక చూసి వస్తుంటా.

చెప్పులు అంటే అకి కౌరిస్మాకి తీసిన లె ఆవ్ర్ సినిమానే గుర్తుకు వస్తుంది. కడుపులో చేయి పెట్టి గుంజినట్లుగా కూడా! నొప్పిగా కూడా! మజీద్ మజీదీది చిల్డ్రన్ ఆఫ్ హెవెన్ సినిమా కూడా గుర్తుకు వస్తుంది. ఇప్పుడు అలీ బాగా పెద్దవాడయి ఉంటాడు. వాడికి కాలికి జోళ్ల పీడకలలు ఇక వస్తూ ఉండకపోవచ్చు. సంవత్సరం క్రితం వరకు కూడా చెప్పులంటే మక్కువ ఉండేది. నాలుగు అయిదువేల వరకు లెక్కలేకుండా కొనేసేవాణ్ణి. నాలుగు అయిదు ఆరు ఏడు ఎన్ని జతలు ఉన్నా ఇంకా మోజుకొద్ది కొత్తవి వెతికేవాణ్ణి. ప్రతి రోజూ వేసుకుబోయే చెప్పులని శుభ్రంగా తుడిచి పాలీష్ చేసుకుని మరీ కదిలేవాణ్ణి. ఇప్పుడు అది ఏమీ లేదు. నన్ను నేను వెనక్కి మళ్ళి చూస్తున్నట్లు తెలుస్తుంది. చెప్పులు అరిగిపోయి కన్నాలుపడే మళ్ళీ ఆ రోజు కొరకు చూస్తున్నట్టుగా కూడా ఆనందం అవుతుంది. మళ్ళీ ఆ ఆకుపచ్చని హవాయి చెప్పుల చల్లదనం తొడుక్కోడం కోసం వేచి వున్నా. అవీనూ వెళ్ళిపోయి వట్టి కాళ్ళ మీద, పచ్చిక మీద, ఆ హంపీ రాయి మీద, ఆ సోవియట్ భూమి పుస్తకంలో చిన్నప్పుడు నేర్చుకున్న పాఠం కొద్ది వట్టి కాళ్ళతో నడిచే రోజుల కోసం కూడా!
------------------------------------------------------
రచన: అన్వర్, 
ఈమాట సౌజన్యంతో

1 comment:

  1. దిక్కుమాలిన శిథిలనగరం - అందమైన శిల్పాలను దేవాలయాలను ధ్వంసం చేసినది ఎవరు చెప్పు అన్వర్. కాళికాదేవి పటం ఒక అభూతకల్పన అని చెప్పవచ్చు. అందమైన మేధో మోసం చేస్తూ ఎందుకు ఆత్మవంచన చేసుకుంటున్నావు అన్వర్.

    ReplyDelete