Tuesday, March 13, 2018

డిండిమ కవిసార్వభౌముడు ఒకరుకాదా?


డిండిమ కవిసార్వభౌముడు ఒకరుకాదా?




సాహితీమిత్రులారా!


ప్రౌఢదేవరాయల ఆస్థానంలో ఉండి
శ్రీనాథునిచే వాదంలో ఓడింపబడిన
"డిండిమ భట్టు" ఒకరుకాదని వారివంశ
వివరాల్లోకెళితే తెలుస్తుంది. 

విజయనగరరాజుల ఆస్థానం అలంకరించిన 
సంస్కృత కవులు డిండిమ కవులు.
వీరి చరిత్ర విభాగరత్నమాల అనే గ్రంథంలో
వివరింపబడింది. గంగాతీరంలో మందార 
గ్రామంలో నివసించే ఎనిమిదిమంది శైవ
బ్రాహ్మణులను ఒక చోళరాజు కాశీనుండి 
దక్షిణానికి తీసుకొచ్చాడని, వారికి ఉత్తర
ఆర్కాడు జిల్లాలోని మెట్టుపడిని(తల్పగిరి)
అగ్రహారాన్ని ఇచ్చారని, అఇక్కడే ఆ 
వంశంవారు క్రమంగా 70 కుటుంబాలుగా
వృద్ధిచెందారని ఆ గ్రంథంలో చెప్పబడింది.
ఆ వంశంలోని అరుణగిరినాథుడు అనే
పండితుని ప్రౌఢదేవరాయలు(1422-48)
ఒక ఆరామాన్ని అగ్రహారంగా ఇచ్చాడు.
అప్పటి నుండి ఆ వంశం వారు విజయ
నగరరాజుల కొలువులో ఆస్థానపండితులుగా
కవులుగా ఉన్నారని ఈ గ్రంథం ద్వారా
తెలుస్తుంది.
మొదటి అరుణగిరినాథుడు మొదటి రాజనాధుని
కుమారుడు. ఇతని మాతామహుడైన అభిరాముడు
శ్రీకంఠాగమమున పండితుడై డిండిమ ప్రభువు
(డిండిమ - 1) అనే పేరుతో వ్యాప్తిచెందాడు.
అరుణగిరినాథుని యశస్సు డిండిమవాద్య ధ్వనిచే
ఘోషించబడుతున్నందువల్ల ఇతనికి డిండిమ 
కవిసార్వభౌముడు (డిండిమ - 2) అనే బిరుదు 
కలిగింది. ఇతడు ప్రౌఢదేవరాయల కొలువులో 
ఉండి ప్రతివాది భయంకరుడై విలసిల్లాడు.
శ్రీనాథుడు వాదంలో ఇతనిని ఓడించి, ఇతని
కంచు ఢక్కను పగులగొట్టించి, ఇతని 
కవిసార్వభౌమబిరుదాన్ని తాను గ్రహించాడు.
ఇతడు యోగానంద ప్రహసనం అనే ప్రహసనాన్ని
వ్రాశాడు. అరుణగిరినాథుని కుమారుడైన రెండవ
రాజనాథునికి కూడ డిండిమకవి సార్వభౌముడు
(డిండిమ - 3) అమే బిరుదు ఉంది. ఇతడు 
నాట్య, తత్త్వశాస్త్రాల్లోనూ, పలు భాషల్లోనూ
పండితుడై తండ్రికంటే కూడా ఎక్కువ కీర్తిని 
గడించాడు. ఇతడు విజయనగరరాజుల సేనాని
అయిన సాళ్వనరసింగుని ఆదరాన్ని సంపాదించి
సాళువాభ్యుదయం(1480) అనే 13 ఆశ్వాశాల 
కావ్యాన్ని, దండయాత్రలను, పరాక్రమాన్ని 
వర్ణించాడు.

రెండవ రాజనాథుని కుమారుడు రెండవ అరుణగిరినాథుడు.
ఇతడు వారేంద్ర అగ్రహార నివాసి. ఇతడు వీరనరసింహ, 
శ్రీకృష్ణదేవరాయ కాలంలో ఉండి, వారిచే పోషించబడిన
వాడు. ఇతనికి పలుభాషలలో పాండిత్యం ఉంది. 
ఇతడు వీరభద్రవిజయం అనే డిమ రూపకాన్ని రచించాడు.
ఇది రాజనాథదేవుని ఉత్సవ సందర్భంలో ప్రదర్శించబడింది.
ఇతనికి కవిరాజరాజు, డిండిమ కవిసార్వభౌముడు, కుమార
డిండిముడు(డిండిమ - 4) అనే బిరుదులున్నాయి.

కుమార డిండిముని తరువాత ఆ వంశంవారు గొప్ప పండితులై,
ఆ వంశగౌరవాన్ని నిలబెట్టారు. ఇతని కుమారుడు మూడవ
రాజనాథుడు భాగవతచంపువును, అచ్యుతరామాభ్యుదయం రచించి
పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.

(ఆధారం - విజ్ఞాన సర్వస్వం - 6(భారతభారతి))

Monday, March 12, 2018

జాషువా - "శ్మశానవాటి" - 2


జాషువా - "శ్మశానవాటి" - 2




సాహితీమిత్రులారా!

నిన్నటి తరువాయి..........

ఆకాశంబును కాఱుమబ్బుగము లాహారించె, దయ్యాలతో
ఘూకంబుల్ చెరలాడసాఁగినవి వ్యాఘోషించె నల్దిక్కు లన్
గాకోలంబులు గుండె ఝల్లుమనుచున్నంగాని యిక్కాటి యం
దా కల్లాడిన జాడ లేదిచట సౌఖ్యం బెంత క్రీడించునో


ఇచ్చోట నేసత్కవీంద్రుని కమ్మని 
           కలము, నిప్పులలోనఁ గఱఁగిపోయె
యిచ్చోట నేభూములేలు రాజన్యుని
           యధికారముద్రిక లంతరించె
యిచ్చోటనే లేఁత యిల్లాలి నల్లపూ
           సలసౌరు గంగలోఁ గలసిపోయె
యిచ్చోట నెట్టిపే రెన్నికం గనుఁగొన్న
           చిత్రలేఖకుని కుంచియె నశించె
ఇది పిశాచులతో నిటలేక్షణుండు
గజ్జె గదలించి యాడు రంగస్థలంబు
ఇది సరణదూత తీక్ష్ణమౌ దృష్టు లొలయ
నవనిఁ బాలించు భస్మసింహాసనంబు

ఈ పద్యాన్ని పాడుతాతీయగా
కార్యక్రమంలో పాడిన తీరు గమనించండి-



Sunday, March 11, 2018

జాషువా - "శ్మశానవాటి" - 1


జాషువా - "శ్మశానవాటి" - 1




సాహితీమిత్రులారా!

జాషువా వారి ఖండకావ్యంలోని
"శ్మశానవాటి" పద్యాలు
నాటకరంగంలో పడి దిగంతాలకు చేరినాయనటం
తప్పుకాదేమో. అవి నాటకరంగంలో పడినవా
లేక నాటకరంగమే ఈ పద్యాల్లో పడినయో
గాని వాటిని విన్నవారు ఎవరైనా వాటిలోని
సాహితికి, వాటిలోని వాస్తవిక తత్త్వానికి
సంగీత ప్రియులు వాటిని వారిసొంతం
చేసుకున్నారనవచ్చు.

మొదటి పద్యం -
ఎన్నోయేండ్లు గతించిపోయినవి గానీ యీ శ్మశానస్థలిన్
గన్నుల్ మోడ్చిన మందభాగ్యు డొకఁడైనన్ లేచిరాఁడక్కటా
యెన్నాళ్ళీ చలనంబులేని శయనం బేతల్లు లల్లాడిరో
కన్నీటంబడి క్రాఁగిపోయినవి నిక్కంబిందు పాషాణముల్

ఇక్కడ ఒక పద్యాన్ని దాన్ని పాడుతాతీయగాలో
పాడిన విధానాన్ని చూడండి-



Saturday, March 10, 2018

పురాణాలంటే ఏమిటి దాన్లో ఏముంటాయి


పురాణాలంటే ఏమిటి దాన్లో ఏముంటాయి




సాహితీమిత్రులారా!



పురాణం అంటే ప్రాచీన కథాగుచ్ఛం అనే అర్థం స్ఫురిస్తుంది.
వేదవాఙ్మయంలోో ఇతిహాసం, ఆఖ్యానం మొదలైన శబ్దాలతోపాటు
పురాణశబ్దం కూడ కనిపిస్తుంది.  ప్రపంచోత్పత్తి, వీరుల, ఋషుల 
జీవితాలు మొదలైన వృత్తాంతాలు వేదయుగంలోనే రచించి ఉండవచ్చు. 
వాటికే పురాణాలని పేరు. సాధారణంగా వాటిని రచించినవారి పేర్లు తెలియవు. 
హరివంశంలో పురాణాల సంఖ్య  గురించిన ప్రస్తావన ఉంది. గౌతమ, ఆపస్తంబుల 
ధర్మశాస్త్రాలు (క్రీ.పూ.500) కూడా పురాణాలను పేరొంటున్నాయి. పురాణాల 
కాలం ఇది అని తేల్చడానికి వీలు లేదు. వీటిలో అతిప్రాచీనమై
నవి, ప్రాచీనము కాని కూడ ఉన్నాయి. రాజవంశాలను వివరించే
పురాణాలలో హర్షుడు మొదలైన వారి వంశవివరణం లేనందువల్ల
పురాణాలు క్రీ.పూ. 500 సంవత్సరాలకు పూర్వమే వ్రాయబడినట్లు
విమర్శకుల అభిప్రాయం.
          పురాణాలలో సర్గ, ప్రతిసర్గ, వంశం, మన్వంతరం, వంశావతారవర్ణన 
అనే అయిదు లక్షణాలు అన్నిటిలో కనిపించటం
వల్ల వీటికి పంచలక్షణాలు అనే పేరు వచ్చింది. వేదాల్లో చెప్పబడిన
నీతి ధర్మతత్త్వాది విషయాలను పురాణాలు కథలు, ఉపాఖ్యానాల 
ద్వారా వివరిస్తున్నాయి. లాక్షిణికులు వీటిని మిత్ర సమ్మతములుగా 
పరిగణించారు. చారిత్రకంగా కూడా పురాణాలకు ప్రాముఖ్యత ఉంది.
వీటిలో శుంగ, నంద, మౌర్య, గుప్త, ఆంధ్ర మొదలైన రాజవంశా చరిత్రలు 
సమగ్రంగా ఉన్నాయి. విమర్శ దృష్టితో వీటిని కొంచెం సవరించి చూస్తే 
ఇవి చారిత్రక వృత్తాంతాలతో  కూడ సరిపోతున్నాయి. 18 మహాపురాణాలను, 
18 ఉపపురాణాలను వ్యాసుడే రచించాడని ప్రతీతి. కానీ వ్యాసుడు 
ఒక్క బ్రహ్మపురాణం మాత్రమే వ్రాశాడని, మగిలినవి అతని శిష్యులు 
రచించారనీ మరొక అభిప్రాయం. వ్యాసునికి ముందే పురాణాలున్నాయని 
వాటి సారాంశం వివరించి వాటికి ప్రచారం కలిగించాడని మరొక అభిప్రాయం.


హిమగిరిపతాకే కరుణయా


హిమగిరిపతాకే కరుణయా



సాహితీమిత్రులారా!



మూక శంకర విరచిత
మూకపంచశతిలోని
స్తుతిశతకంలోని
54వ పద్యం ఇది చూడండి-

ఘనశ్యామాన్కామాంతకమహిషి కామాక్షి మధురాన్
దృశాం పాతానేతానమృతజలశీతాననుపమాన్
భవౌత్పాతే గీతే మయి విరత నాథే దృఢభవ
న్మనశ్శోకే మూకే హిమగిరిపతాకే కరుణయా

కామాంతకుడైన శివుని యజమానురాలివై,
ఇల్లాలివైన ఓ కామాక్షీ
మేఘములవలె నల్లనైన కురులతో,
చల్లనైన అమృత జలముతో
మధురమైన వాక్కులతో కలిగిన నీవు
దృష్టి పాతములతో భయాందోళనలతో
నున్న భక్తుల కష్టములను చూచి కరిగి
అప్పుడప్పుడు ఆమె కన్నులు చెమ్మగిల్లును.
ఆమె కన్నులలో
శీతలామృతమును కురింపించుచూ
భక్తుల భయాందోళనలను
కరుడు గట్టిన శోకమును హరించును - అని భావం.


Friday, March 9, 2018

ఒకించుక భాగ్యము గల్గియుండినన్


ఒకించుక భాగ్యము గల్గియుండినన్




సాహితీమిత్రులారా!


మన శతకాల్లో చెప్పిన విషయాలను
మనం మరువకూడదు ఎందుకంటే
వారు జీవితానుభవాన్ని కాచి వడపోసి
చెప్పిన విషయాలవి ఇక్కడ
మారద వెంకయ్యగారి భాస్కర శతకంలోని
ఈ పద్యం చూడండి-

ఏల సమస్తవిద్యల? నొకించుక భాగ్యము గల్గియుండినన్
జాలు ననేక మార్గముల సన్నుతి కెక్కు నదెట్లొకో యనన్
ఱాలకు నేడ విద్యలు తిరంబుగ దేవరరూపు చేసినన్
వ్రాలి నమస్కరించి ప్రసవంబులు పెట్టరె మీఁద? భాస్కరా!

భాస్కరా! సకలవిద్యలు రావలసిన పనియేమిగలదు
అదృష్టము ఉంటే అనేక విధముల కీర్తి రాగలదు.
శిలలకు విద్యవస్తుందా కాని వాటిని దేవతారూపం
లో చెక్కినట్లయిన అందరూ వాటిదగ్గర చేరి
సాష్టాంగనమస్కారాలు పెట్టి పువ్వులు పెట్టి
పూజింపకుందురా అంటే పూజచేస్తారని భావం.
అంటే ఎన్ని విద్యలున్నా
అదృష్టం ఏకొంచెమైనా ఉంటే
ఆ విద్యల్నీ క్రిందే కదా అంటాడు కవి
నిజమో కాదో ప్రతి ఒక్కరికి తెలుసుకదా!

Thursday, March 8, 2018

బెంగుళూరు నాగరత్నమ్మ


బెంగుళూరు నాగరత్నమ్మ




సాహితీమిత్రులారా!

భారతదేశంలో అత్యంత పేరుపొందిన
నారీమణుల్లో బెంగుళూరు నాగరత్నమ్మగారు ఒకరు.
ఆమె పాండిత్యంలోనే కాదు సంగీతంలోనూ
నాట్యంలోనూ పేరు పొందినవారు. విద్యాసుందరి
అనే బిరుదు పొందినవారు త్యాగరాజస్వామి
ఆలయంలో ఆయన ఎదురుగా ఈయమ
విగ్రం ఉంచారంటే ఆమె ఎలాంటిదో చెప్పవలసిన
అవసరంలేదు. అటువంటి ఆమెను గురించిన
యస్.వి.బి . ఛానల్ వారు కూర్చిన
ఈ డాక్యుమెంటరీ చూడండి-