Wednesday, February 7, 2018

తాను తెలుగువాడినని చెప్పిన జగన్నాథుడు


తాను తెలుగువాడినని చెప్పిన జగన్నాథుడు




సాహితీమిత్రులారా!


పండిత జగన్నాథుని పేరు సుపరిచితమేకదా
ఆయన తన "ప్రాణాభరణ" కావ్యంలో
తాను తెలుగువాడినని సగర్వంగా
చాటాడు. ఆ శ్లోకం చూడండి-

త్రైలింగాన్వయ మంగళాలయ మహాలక్ష్మీదయాలాలితః
శ్రీమత్పేరమభట్టసూను రనిశం విద్వల్లలాటంతపః
సంతుష్టః కమతాధిపస్య కవితామాకర్ణ్య తద్వర్ణనం
శ్రీమత్పండితరాజ పండితజగన్నాథోవ్యధాసీ దిదం

నేను తెలుగువాడిని. లక్ష్మీకృపాలాలితుడను
శ్రీమంతుడగు పేరు భట్టారకుని కుమారుడను
విద్వల్లలాటంతపుడను, పండితరాయ బిరుదాంకితుడను.
కామరూపాధీశ్వరుని కవిత్వం విని సంతుష్టుడనై
అతని గుణాలను వర్ణిస్తూ నేనీ కావ్యాన్ని రచించాను-
అని భావం.
మన రాయప్రోలు సుబ్బారావు చెప్పినట్లు -
ఏదేశమేగినా, ఎందుకాలిడినా, ఏపీఠమెక్కినా, ఎవ్వరేమనినా
పొగడరా నీతల్లి భూమిభారతిని, నిలుపరా నీజాతినిండుగౌరవము
అవమానమేలరా, అనుమానమెల, భరతపుత్రుండనంచు భక్తి తొబలుక.
- అని దేశభక్తి కలవానిగా ఈ కవిగూడ తనదేశం తన భాషనుగురించి
చాటుకోవడం ఈ తరంవారు మరువకూడదనే విషయాన్ని
ఈ శ్లోకం చెబుతున్నదికదా!

Tuesday, February 6, 2018

వృత్తములు వాటి పేర్లు


వృత్తములు వాటి పేర్లు




సాహితీమిత్రులారా!


మనం పద్యాలలో వృత్తాలను చూస్తున్నాముకదా
వాటి పేర్లు వివరాలను చూద్దామా-

వృత్తముల పేర్లు ఎక్కువభాగం స్త్రీ పరములయినవిగా ఉన్నవి.
ఇవికాక మరికొన్ని పద్య నైసర్గిక ప్రవృత్తి, గతి లయలను
సూచిస్తున్నాయి.

మంద్రాకాంత - మందమైన ఆక్రమణము లేక గతి కలది
ద్రుతవిలంబిత - త్వర, అలస గమనము కలది
వేగవతి, త్వరితగతి - వేగ గమనము గలది
మయూరసారి - నెమలివంటి సుకుమార గతి కలది
రథోద్ధత   - రథమువలె ఉద్ధత గతి కలది.
జలోద్ధత గతి - ప్రవాహమువలె ఉద్ధత గతి కలది
హంసయాన - హంసవంటి మనోజ్ఞ గతి కలది
అశ్వగతి - అశ్వపు నడక గలది
హరిణప్లుత - లేడి దూకుడువంటి గతి గలది
అలసగతి - నెమ్మదైన గతి గలది

ప్రకృతిలోని మార్పులను, పూవులను
గూర్చినవి కొన్ని వున్నాయి -
వసంతతిలక, కుసుమితలతావేల్లిత, మాలా, స్రజ, 
చంచరీక, కుసుమ విచిత్ర, వనమాలిని, జలద, 
అంబురుహ, పాలాశదళ మొదలైనవి.

మొత్తం మీద స్త్రీ నామములు కలవి అధికమైనవి-
మానిని, ప్రియకాంతా, సావిత్రి, మధుమతి, కాంతా, 
సుముఖి, ప్రియంవద, స్రగ్ధర, స్రగ్విణి, మంజుభాషిణి, 
మత్తహాసిని, రుచిర, తన్వీ, సుమంగలి, సువదన, 
చంచలాక్షికా, గౌరీ, అపరాజితా, తనుమధ్యా, చిత్రరేఖ, 
కామదత్తా, పద్మిని, చంద్రలేఖా, చంద్రికా
మొదలైనవి.

Monday, February 5, 2018

భ్రమరగీత


భ్రమరగీత




సాహితీమిత్రులారా!


శాంతిలోంచి అశాంతి
అశాంతిలోనే శాంతిని
అనుభవించగలడు శ్రీశ్రీ

ఈ భ్రమరగీతిని చూడండి-
ఇది "ఖడ్గసృష్టి"నుండి-

గిరగిరగిరాం
భ్రమరం
గిరాం
భ్రమణం
భ్రమం
'భ్రమరణం'
భ్రమణ భ్రమరం
భ్రమర భ్రమణం
గిరగిర గిరాగిరా గిరాం భ్రమణం
రణం మరణం
రణమరణం దారుణహననం
ధిషణానిధనం
వృథామధనం
అది నా చెవిలో కథనం
లోకధనం 
కదనం
కదన కథాకథనం
అది నాయెదలో రణనం
ఝణ ఝణ ఝంఝణ ఝణాఝణా నిక్వణనం
అది నా పయనంలో ప్రథ మారుణ కిరణం
రణ నిస్సహణం
వధా విధా నాచరణం
నాలో లోలోపల భ్రమా భ్రమర సంచరణం
రణద్రణ నిస్సహన ప్రణవం
అది నా హృదయంలో రుథిరజ్వలనం గీతాజననం

(ధిషణానిధనం = మనీష(బుద్ధి)నాశనము
దారుణహననం = దారుణ హత్య
నిస్సహణం = A large double drum.)

Sunday, February 4, 2018

నిత్యానంద ఘోషు


నిత్యానంద ఘోషు




సాహితీమిత్రులారా!

మన తెలుగులో భారతాన్ని
నన్నయ తిక్కన ఎఱ్ఱన(కవిత్రయం)
సంస్కృతం నుండి అనువదించారు
అలాగే నిత్యానందఘోషు బాంగ్లలో
వ్యాసభారతాన్ని 18 పర్వాలుగా
రచించాడు. అయితే దీన్ని
విజయ పాండవ కథ అని పిలుస్తారు.

"విజయ పాండవ కథా అమృతలహరీ
సునిలె అధర్మఖండె పరలోకె తరి
సున సున అరె భాయి హయె ఏకమన
నిత్యానంద ఘోష బలె భారత కథన"
(విజయ పాండవ కథామృతలహరి వింటే అధర్మం
ఖండనదిమవుతుంది. పరలోకం లభిస్తుంది. వినండి
వినండి సోదరులారా ఏకాగ్రచిత్తంతో వినండి.
నిత్యానంద ఘోషు చెబుతున్నాడు.)

నిత్యానందఘోషు అశ్వమేధపర్వం మాత్రం
వ్యాసుని రచననే కాకుండా జైమిని రచనను
కూడ తీసుకొని అనువదించాడు. అతని రచన
సరళమైంది. ఆబాల వృద్ఝుల వరకు అవగతమౌతుంది.
కురుక్షేత్రం రణరంగంలో దుర్యోధనుడి
మృతదేహాన్ని చూచిన గాంధారి అన్న మాటలు చూడండి-

"దేఖ కృష్ణ! మరి ఆఛె రాజా దుర్యోధన,.
సంగేతె నాదెఖి కెన కర్ణదుశ్శాసన?
శకుని సంగెతె కెన నా దేఖి రాజన?
కథాభీష్మ మహాశయ, గాంధార నందన?
ఏకాదశ అక్షౌహినీ యార సంగె జాయ్,
హేన దుర్యోధన రాజా ధులాయ్ లుటాయ్,
సువర్ణేర ఖాటై జారీ సతత శయన,
ధూలాయ్ ధూపర తను హయ్యాఛె ఏఖన."
(చూడు కృష్ణ దుర్యోధనరాజు చచ్చి పడున్నాడు.
దగ్గర కర్ణ దుశ్శాసనులు కనబడరేమీ రాజరాజుతో శకుని లేడేమి
భీష్మమహాశయుడేడీ పదకొండు అక్షోహిణుల సేన వెంట
నడిచే మహారాజు ధూళిలో ఎలా పొర్లాడుతున్నాడో
బంగారు మంచంమీద ఎల్లప్పుడూ శయనించే రాజు ఇప్పుడు
ధూళిధూసర దేహంతో పడున్నాడు)

Saturday, February 3, 2018

శతకవాఙ్మయంలో పాము - 1


శతకవాఙ్మయంలో పాము - 1




సాహితీమిత్రులారా!



మన శతకవాఙ్మయంలో పామునుగురించిన చిత్రణలు
అనేకం వున్నాయి. వాటికి సంబంధించిన గాధలూ అనేకం
వున్నాయి. ఇక్కడ మనం సుమతి శతకకారుడు బద్దెన
కూర్చిన సర్పసంబంధమైన పద్యాలను చూద్దాం-

ఉడుముండదె నూరేండ్లును
బడియుండదె పేర్మి బాము బదినూరేండ్లున్
మడువున కొక్కెర యుండదె
కడునిల పురుషార్థపరుడు కావలె సుమతీ!

ఉడుము నూరేండ్లుంటుంది. పాము వేయేండ్లుంటుది.
మడుగున కొంగ కలకాలం వుంటుంది. వాటివాటి
వయసులను బట్టి ఉదహరిస్తున్నాడు కాని వాటివలన
ప్రయోజనం ఏమిటి - మానవజన్మ ఎత్తినందుకు ఫలంగా
పురుషుడు ధర్మార్థకామమోక్షాలను సాధించాలిగాని-
అంటున్నాడు కవి.

ఎప్పుడూ తప్పులే వెదికే వానిదగ్గర చేసే నౌకరీ ఎలాంటిదంటే
పాము పడగ నీడన నివసించే కప్పవంటిదని పోల్చాడు కవి
ఇక్కడ పామును దొరగానూ, కప్పను నౌకరుగానూ పోల్చాడు.
ఆ పద్యంలో-

ఎప్పుడు తప్పులు వెదకెడు 
నప్పురుషుని కొల్వకూడదది యెట్లన్నన్
సప్పంబు పడగనీడన
కప్పవసించిన విధంబు గదరా సుమతీ!

జీవితంలో తప్పించుకోవటానికి వీలులేని
దుఃఖకరమైన అంశాలను కొన్నింటిని వివరిస్తూ
చెప్పిన పద్యం-

కప్పకు నొరగాలైనను
సప్పమునకు రోగమైన, సతి తులువైనన్
ముప్పున దరిద్రుడైనను
దప్పదు మరి దుఃఖమగుట తథ్యము సుమతీ!

కప్పకు కాలు విరిగినా, పాముకు రోగమైనా,
భార్యగయ్యాళయినా, ముసలితనంలో దరిద్రం
వచ్చినా - దుఃఖము తప్పదట -
నిజమేకదా!

ఇదొక యదార్థపద్యం -

కరణము సాదైయున్నను
కరి మదముడిగినను బాము కరవకయున్నన్
ధర తేలు మీటకున్నను
గరమరుదుగ లెక్కగొనరు గదరా సుమతీ!

బాధకలిగింరలేని కరణాన్ని, మదములేని ఏనుగును,
కరవకుండా ఉన్న పామును, కుట్టని తేలును
లోకంలో ఎవర లక్ష్యపెడతారు - అంటే
లెక్కచేయరనిభావం.



Friday, February 2, 2018

సుశీలమ దెవ్వనియందు శోభిలున్


సుశీలమ దెవ్వనియందు శోభిలున్




సాహితీమిత్రులారా!


ఈ పద్యం చూడండి-
జనసమ్మతమైన సుశీలము ఎవరియందు ఉంటుందో
వానికి ఏవి సాధ్యమౌతాయో కవి వివరిస్తున్నాడు.
ఇది ఏనుగు లక్ష్మణకవి కృత భర్తృహరి నీతిశతకంలోనిది.

అతనికి వార్ధి కుల్య, నగ్ని జలం బగు, మేరుశైల మం 
చితశిలలీల నుండు, మదసింహము జింక తెఱంగుఁ దాల్చుఁ, గో
పితఫణి పూలదండ యగు, భీష్మవిషంబు సుధారసం బగున్
క్షితి జనసమ్మతంబగు సుశీల మదెవ్వనియందు శోభిలున్

ఎవనిలో మంచి స్వభావం శోభిస్తూ ఉంటుందో
వానికి సముద్రం ఒక చిన్న కాలువలాగా,
నిప్పు నీటిలాగా, మేరుపర్వతం చిన్న రాయిలాగా,
మదించిన సింహం లేడిలాగా, కోపించిన సర్పం
పూలదండలాగా, భయంకరమైన విషం అమృతంలాగా
ఔతాయి - అని భావం.

Thursday, February 1, 2018

200 సంవత్సరాలు పట్టిన శరత్కాల వర్ణన


200 సంవత్సరాలు పట్టిన శరత్కాల వర్ణన




సాహితీమిత్రులారా!


నన్నయ భారతం అరణ్యపర్వంలో
శరదృతు వర్ణన ప్రారంభించాడు.
కాని అదిపూర్తి కాకుండగానే
భారతం అరణ్యపర్వం నిలిచిపోయింది.
అక్కడికి చేరిన పద్యం లేదా నన్నయగారి
చివరి పద్యాలు ఈ వర్ణనే చూద్దాం-

భూసతికిం దివంబునకుఁ బొల్వెసఁగంగ శరత్సమాగమం
బాసకల ప్రమోదకర మై విలసిల్లె మహర్షిమండలో
పాసిత రాజహంస గతి భాతి ప్రసన్న సరస్వతీక మ
బ్జాసనశోభితం బగుచు నబ్జజుయానముతో సమానమై
(శ్రీమదాంధ్రమహాభారతము - అరణ్య - 4-140)

సర్వజనులకు సంతోషాన్ని కలిగిస్తూ శకత్తు భూదేవికీ స్వర్గానికీ
అందం చిందిస్తూ విలసిల్లింది. శరత్తు,  మహర్షుల సమూహంచేత
ఆరాధించబడిన రాజహంసల గమనాన్ని స్ఫురింపచేసింది.
స్వచ్ఛమైన సరస్వతితో కూడిన బ్రహ్మదేవుడితో, బ్రహ్మవాహనమైన
రాజహంసతో సమానమై ఒప్పారింది.

శారదరాత్రు లుజ్జ్వలలసత్తరతారకహారపంక్తులం
జారుతరంబు లయ్యె వికసన్నవ కైరవ గంధబంధురో
దారసమీర సౌరభము తాల్చి సుధాంశువికీర్యమాణ క
కర్పూరపరాగపాండురుచిపూరము లంబరపూరితంబు లై

అవి శరత్కాలంలోని రాత్రులు. మిక్కిలి ప్రకాశమానాలైన నక్షత్ర
మాలికలతో కూడి వికసించిన క్రొంగొత్త తెల్లకలువల దట్టమైన
సుగంధంతో కూడిన గొప్పగాలి యొక్క పరిమళాన్ని వహించాయి,
అంతటా వెదజల్లబడిన కప్పురపు పుప్పొడివలె ఆకసాన్ని ఆవరించిన
చంద్రుడి వెన్నెలవెల్లువలు కలిగి ఆకాశాన్ని నిండుకొని మిక్కిలి
సొగసుగా ఉన్నాయి.

ఈ పద్యంతో నన్నయ ఆగిపోయాడు తరువాత
200 సంవత్సరాలకుగాని ఎఱ్ఱాప్రెగ్గడ ఈ మిగిలిన
దాన్ని పూర్తి చేయడానికి పూనుకొనలేదు కావున
ఈ వర్ణననకు 200 సంవత్సరాలు పట్టిందనవచ్చు.

స్ఫురదరుణాంశురాగరుచిఁబొంపిరివోయి నిరస్తనీరదా
వరణము లై దళత్కమలవైభవజృంభణ ముల్లసిల్ల ను
ద్ధురతరహంససారసమధువ్రతనిస్వనముల్ సెలంగఁగాఁ
గరము లెలింగె వాసరముఖంబులు శారదవేళఁ జూడఁగన్

శరత్కాలంలో సూర్యోదయ సమయాలు కనులపండువుగా శోభిల్లాయి.
అప్పుడు మబ్బలు క్రమ్మటాలు తొలగిపోయాయి, బాలభానుడి
అరుణకిరణాలు విస్తరించాయి. పద్మాలు వికసించి, శోభాయమానంగా
వెలుగొందాయి. హంసలు బెగ్గురుపిట్టలు, తుమ్మెదలు చేసే కలరవాలు
వెల్లివిరిశాయి.

దానాంభఃపటలంబునం బృథుపయోధారావళిం దాల్చి గ
ర్జానిర్ఘోషము బృంహితచ్ఛలనఁ బ్రచ్ఛాదించి ప్రావృట్పయో
దానీకంబు శరద్భయంబున నిగూఢాకారతన్ డిగ్గె నాఁ
గా నొప్పారె మదోత్కటద్విరదసంఘంబుల్ వనాంతంబునన్

అడవిలో మదించిన ఏనుగుల గుంపులు వులసిల్లాయి.
శరత్కాలానికి భయపడి, వానాకాలంలోని మబ్బుల
గుంపులు మారువేషాలలో భూమికి దిగివచ్చాయా
అన్నట్లు అవి కనిపించాయి. మదించిన ఏనుగులు కాబట్టి
వాటికి మదజలం స్రవించటం కద్దు. అవి మబ్బులకుండే
నీటిజల్లులో అన్నట్లున్నాయి. అట్లే ఏనుగులు చేసే
బృంహిత ధ్వనులు మేఘాలగర్జనలో అన్నట్లున్నాయి.

కలనీలకంఠకోలా
హలలీలలు సెలఁగె, రాజహంసకులంబుల్
విలసించె, సప్తపర్ణా
వలి విగళిత కుసుమ కుటజ వాటిక లడరన్

నెమళ్ళ కలరావాలతో కూడిన ఆటలు విలసిల్లాయి.
అంటే నెమళులు అవ్యక్తమధురాలైన ధ్వనులు చేస్తూ
నృత్యం చేశాయి. రాజహంసలగుంపులు శోభిల్లాయి.
ఏడాకుల అరటి చెట్లు గుంపులు మరియు పూలురాలిన
కొండమల్లెల పొదలు విలసిల్లాయి.

అతి గాంభీర్యవిభూతి నేకచుళుకాహంకారనిశ్శేషశో
షితపాథోధిపయస్కుఁడైన ముని దోఁచెం బుణ్యతేజోమయా
కృతి నయ్యామ్యదిగంతవీథిఁ బ్రకటక్రీడాకళాగర్వ గ
ర్జితమండూకకళంకితాంబుశుచితాసిద్ధిప్రదాచార్యుఁడై

శరత్కాలంలో ఆకసాన దక్షిణదిశలో అస్త్యనక్షత్రం కనిపించింది.
ఆ అగస్త్యుడు మిక్కుటమైన నిండు వ్యక్తిత్వంగల మహర్షి. ఆయన
సమస్త సముద్రజలాన్ని తన దోసిలిపట్టి ఒక్కచుక్కకూడా
మిగలకుండా త్రాగేశాడు. అంతవరకు బెకబెకమనే సవ్వడి చేస్తూ
ఆడుకునే కప్పలవలన బురదగా చేయబడిన నీళ్ళకు నిర్మలత్వాన్ని
ప్రసాదించే గురువు ఆ అగస్త్యుడు.

విశదశారదాంబుద పరివేష్టనమునఁ
బొలుచు గగనంబు ప్రతిబింబములొయనంగ
వికచకాశవనీ పరివేష్టనమున
నతిశయిల్లె నిర్మలకమలాకరములు

తెల్లని శరత్కాల మేఘాలు చుట్టుముట్టి ఉన్న ఆకసానికి ప్రిరూపాలో
అన్నట్లుతెల్లని పూలు పూచిన రెల్లుమొక్కలచేత చుట్టుకొనబడిన
నిర్మలసరస్సులు శోభిల్లాయి.

ఈ విధంగా సాగింది ఎఱ్ఱాప్రెగ్గడగారి వర్ణన.