Thursday, February 1, 2018

200 సంవత్సరాలు పట్టిన శరత్కాల వర్ణన


200 సంవత్సరాలు పట్టిన శరత్కాల వర్ణన




సాహితీమిత్రులారా!


నన్నయ భారతం అరణ్యపర్వంలో
శరదృతు వర్ణన ప్రారంభించాడు.
కాని అదిపూర్తి కాకుండగానే
భారతం అరణ్యపర్వం నిలిచిపోయింది.
అక్కడికి చేరిన పద్యం లేదా నన్నయగారి
చివరి పద్యాలు ఈ వర్ణనే చూద్దాం-

భూసతికిం దివంబునకుఁ బొల్వెసఁగంగ శరత్సమాగమం
బాసకల ప్రమోదకర మై విలసిల్లె మహర్షిమండలో
పాసిత రాజహంస గతి భాతి ప్రసన్న సరస్వతీక మ
బ్జాసనశోభితం బగుచు నబ్జజుయానముతో సమానమై
(శ్రీమదాంధ్రమహాభారతము - అరణ్య - 4-140)

సర్వజనులకు సంతోషాన్ని కలిగిస్తూ శకత్తు భూదేవికీ స్వర్గానికీ
అందం చిందిస్తూ విలసిల్లింది. శరత్తు,  మహర్షుల సమూహంచేత
ఆరాధించబడిన రాజహంసల గమనాన్ని స్ఫురింపచేసింది.
స్వచ్ఛమైన సరస్వతితో కూడిన బ్రహ్మదేవుడితో, బ్రహ్మవాహనమైన
రాజహంసతో సమానమై ఒప్పారింది.

శారదరాత్రు లుజ్జ్వలలసత్తరతారకహారపంక్తులం
జారుతరంబు లయ్యె వికసన్నవ కైరవ గంధబంధురో
దారసమీర సౌరభము తాల్చి సుధాంశువికీర్యమాణ క
కర్పూరపరాగపాండురుచిపూరము లంబరపూరితంబు లై

అవి శరత్కాలంలోని రాత్రులు. మిక్కిలి ప్రకాశమానాలైన నక్షత్ర
మాలికలతో కూడి వికసించిన క్రొంగొత్త తెల్లకలువల దట్టమైన
సుగంధంతో కూడిన గొప్పగాలి యొక్క పరిమళాన్ని వహించాయి,
అంతటా వెదజల్లబడిన కప్పురపు పుప్పొడివలె ఆకసాన్ని ఆవరించిన
చంద్రుడి వెన్నెలవెల్లువలు కలిగి ఆకాశాన్ని నిండుకొని మిక్కిలి
సొగసుగా ఉన్నాయి.

ఈ పద్యంతో నన్నయ ఆగిపోయాడు తరువాత
200 సంవత్సరాలకుగాని ఎఱ్ఱాప్రెగ్గడ ఈ మిగిలిన
దాన్ని పూర్తి చేయడానికి పూనుకొనలేదు కావున
ఈ వర్ణననకు 200 సంవత్సరాలు పట్టిందనవచ్చు.

స్ఫురదరుణాంశురాగరుచిఁబొంపిరివోయి నిరస్తనీరదా
వరణము లై దళత్కమలవైభవజృంభణ ముల్లసిల్ల ను
ద్ధురతరహంససారసమధువ్రతనిస్వనముల్ సెలంగఁగాఁ
గరము లెలింగె వాసరముఖంబులు శారదవేళఁ జూడఁగన్

శరత్కాలంలో సూర్యోదయ సమయాలు కనులపండువుగా శోభిల్లాయి.
అప్పుడు మబ్బలు క్రమ్మటాలు తొలగిపోయాయి, బాలభానుడి
అరుణకిరణాలు విస్తరించాయి. పద్మాలు వికసించి, శోభాయమానంగా
వెలుగొందాయి. హంసలు బెగ్గురుపిట్టలు, తుమ్మెదలు చేసే కలరవాలు
వెల్లివిరిశాయి.

దానాంభఃపటలంబునం బృథుపయోధారావళిం దాల్చి గ
ర్జానిర్ఘోషము బృంహితచ్ఛలనఁ బ్రచ్ఛాదించి ప్రావృట్పయో
దానీకంబు శరద్భయంబున నిగూఢాకారతన్ డిగ్గె నాఁ
గా నొప్పారె మదోత్కటద్విరదసంఘంబుల్ వనాంతంబునన్

అడవిలో మదించిన ఏనుగుల గుంపులు వులసిల్లాయి.
శరత్కాలానికి భయపడి, వానాకాలంలోని మబ్బుల
గుంపులు మారువేషాలలో భూమికి దిగివచ్చాయా
అన్నట్లు అవి కనిపించాయి. మదించిన ఏనుగులు కాబట్టి
వాటికి మదజలం స్రవించటం కద్దు. అవి మబ్బులకుండే
నీటిజల్లులో అన్నట్లున్నాయి. అట్లే ఏనుగులు చేసే
బృంహిత ధ్వనులు మేఘాలగర్జనలో అన్నట్లున్నాయి.

కలనీలకంఠకోలా
హలలీలలు సెలఁగె, రాజహంసకులంబుల్
విలసించె, సప్తపర్ణా
వలి విగళిత కుసుమ కుటజ వాటిక లడరన్

నెమళ్ళ కలరావాలతో కూడిన ఆటలు విలసిల్లాయి.
అంటే నెమళులు అవ్యక్తమధురాలైన ధ్వనులు చేస్తూ
నృత్యం చేశాయి. రాజహంసలగుంపులు శోభిల్లాయి.
ఏడాకుల అరటి చెట్లు గుంపులు మరియు పూలురాలిన
కొండమల్లెల పొదలు విలసిల్లాయి.

అతి గాంభీర్యవిభూతి నేకచుళుకాహంకారనిశ్శేషశో
షితపాథోధిపయస్కుఁడైన ముని దోఁచెం బుణ్యతేజోమయా
కృతి నయ్యామ్యదిగంతవీథిఁ బ్రకటక్రీడాకళాగర్వ గ
ర్జితమండూకకళంకితాంబుశుచితాసిద్ధిప్రదాచార్యుఁడై

శరత్కాలంలో ఆకసాన దక్షిణదిశలో అస్త్యనక్షత్రం కనిపించింది.
ఆ అగస్త్యుడు మిక్కుటమైన నిండు వ్యక్తిత్వంగల మహర్షి. ఆయన
సమస్త సముద్రజలాన్ని తన దోసిలిపట్టి ఒక్కచుక్కకూడా
మిగలకుండా త్రాగేశాడు. అంతవరకు బెకబెకమనే సవ్వడి చేస్తూ
ఆడుకునే కప్పలవలన బురదగా చేయబడిన నీళ్ళకు నిర్మలత్వాన్ని
ప్రసాదించే గురువు ఆ అగస్త్యుడు.

విశదశారదాంబుద పరివేష్టనమునఁ
బొలుచు గగనంబు ప్రతిబింబములొయనంగ
వికచకాశవనీ పరివేష్టనమున
నతిశయిల్లె నిర్మలకమలాకరములు

తెల్లని శరత్కాల మేఘాలు చుట్టుముట్టి ఉన్న ఆకసానికి ప్రిరూపాలో
అన్నట్లుతెల్లని పూలు పూచిన రెల్లుమొక్కలచేత చుట్టుకొనబడిన
నిర్మలసరస్సులు శోభిల్లాయి.

ఈ విధంగా సాగింది ఎఱ్ఱాప్రెగ్గడగారి వర్ణన.

No comments:

Post a Comment