Tuesday, September 19, 2017

పెద్దనగారి ప్రవరుడు - 3


పెద్దనగారి ప్రవరుడు - 3



సాహితీమిత్రులారా!

ఆ సిద్ధునికి ఎదురు వెళ్ళి నమస్కరించి
కాళ్ళుచేతులు కడుక్కోడానికి నీళ్ళిచ్చి
మొదలైన విచ్చుపూజను చేసి
ఇష్టమైన అన్నాన్ని వడ్డించి
సంతృప్తిపరచి
విద్వత్వందితా ఎక్కడనుండి ఎక్కడికి పోవుచున్నావు
ఇక్కడికి వచ్చి నాయిల్లు పావనము చేశావు
ఇప్పుడుకదా నేను ధన్యుడనైనది
మీ మాటలే వేదవాక్యములు, మీరు తొక్కిన చోటే
పవిత్ర పుణ్యక్షేత్రము మీకాళ్ళు కడిగిన నీళ్ళు
గంగోదకము వంటిది.
యోగీశ్వరా మీవంటివారు ఎవరి ఇంటివద్ద
ఎటువంటి భేదభావము లేక ఇష్టము వచ్చినట్లు
స్నానపానముల తృప్తి పొందుదురో
వారిదే అదృష్టము వారి జీవితమే సఫలము
వాడే పుణ్యాత్ముడు. ఓ మునీంద్రా సంసారమను
బురదలో కూరుక పోయిన మావంటివారిని ఉద్ధరించుటకు
మీ వంటివారి పాదధూళి తప్ప వేరే ఔషధములేదు
అనగా ఆ సిద్ధుడు మీవంటివారలు మిక్కిలిగా మర్యాదలు
చేయడం వల్లనే మావంటి వారు సుఖంగా తీర్థయాత్రము చేస్తున్నారు
అని గృహస్థులను గురించి పెద్దగా పొగిడాడు. తరువాత ప్రవరుడు
సిద్ధునితో ఈ విధంగా అన్నాడు-

ఏయే దేశములన్ జరించితిరి మీ రేయే గిరుల్ చూచినా
రేయే తీర్థములందుఁ గ్రుంకిడితి రేయే ద్వీపముల్ మెట్టినా
రేయే పుణ్యవనాళిఁ ద్రిమ్మరితి రేయే తోయధుల్ డాసినా
రాయా చోటులఁ గల్గువింతలు మహాత్మా నా కెఱింగింపరే

ఓ మహాత్మా మీరు ఏయే కొండలు తిరిగారో, ఏయేనదుల్లో స్నానంచేశారో, ఏయే సముద్రాల్లో స్నానంచేశారో, అక్కడక్కడ ఉన్న వింతలను చెప్పండి.

పోయి సేవింపలేకున్నఁ బుణ్యతీర్థ
మహిమ వినుటయు నఖిలకల్మషహరంబ
కాన వేఁడెద ననిన నమ్మౌని వర్యుఁ
డాదరాయత్తచిత్తుఁడై యతని కనియె

నేరుగా పోయి సేవించకపోయినా పుణ్యతీర్థాల
మహిమ విన్నా పాపాలు పోతాయి కాబట్టి
మిమ్ములను ఇంతగా వేడుకొంటున్నాను- అని సిద్ధుని అడగ్గా
ఈ విధంగా చెప్పాడు-

ఓ చతురాస్యవంశ కలశోదధిపూర్ణశశాంక తీర్థయా
త్రాచణశీలినై జనపదంబులు పుణ్యనదీనదంబులున్
జూచితి నందు నందుఁగల చోద్యములున్ గనుగొంటి నా పటీ
రాచలపశ్చిమాచల హిమాచలపూర్వదిశాచలంబుగన్

కేదారేశు భజించితిన్, శిరమునన్ గీలించితిన్ హింగుళా
పాదాంభోరుహముల్, ప్రయాగనిలయుం బద్మాక్షు సేవించి తిన్
యాదోనాథసుతాకళత్రు బదరీనారాయణున్ గంటి, నీ
యాదేశంబననేల చూచితి సమస్తాశావకాశంబులన్

ఓ బ్రాహ్మణోత్తమా! నేను నాలుదిక్కులున్న వింతలన్నిటిని
చూచాను. ఎన్నో పుణ్యనదీ నదాల చూచాను.
కేదారనాథుని పూజించాను. హింగుళాదేవి పాదపద్మాలను
సేవించాను. ప్రయాగలో విష్ణుమూర్తిని, లక్ష్మీదేవి భర్త అయిన
బదరీనారాయణుని చూచాను ఇది అది చెప్పడమెందుకు
అన్ని దిక్కుల మధ్యగల అన్నిటిని చూచాను.
అని చెప్పాడు.

Monday, September 18, 2017

పెద్దనగారి ప్రవరుడు - 2


పెద్దనగారి ప్రవరుడు - 2




సాహితీమిత్రులారా!


వరుణానదికి వెళ్ళి స్నానము చేసి సంధ్యావందనము
చేసికొని ఆ ఇసుక తిన్నెలపై సూర్యునికి నమస్కరించి
బ్రాహ్మణవటువులు వెంటరాగ ప్రవరుని ప్రజలందరు
మెచ్చికొనగా ఇంటికి వచ్చెడివాడు.

శీలంబున్ గులమున్ శమంబు దమమున్ జెల్వంబు లేఁబ్రా యమున్
బోలన్ జూచి యతండె పాత్రుఁడని యేభూపాలుఁడీ వచ్చి నన్
సాలగ్రావము మున్నుగాఁ గొనఁడు మాన్యక్షేత్రముల్ పెక్కు చం
దాలన్ బండు నొకప్పుడుం దఱుఁగ దింటన్ బాఁడియున్ బంటయున్

మంచి శీలాన్ని, వంశాన్ని, బహిరింద్రియ నిగ్రహాన్ని,
అందము పడుచుదనము చూచి ఏ రాజైనా దానమివ్వటానికి తగిన పాత్రుడని
ఇవ్వబోయినా ఏదోషములేని సాలగ్రామము ఇవ్వబోయినా
పరిగ్రహింపడు. అనేక విధాలుగా మాన్యాలు పండుచున్నవి
ఇంటిలో పాడి సమృద్ధిగా ఉన్నది.

ఇక అతని భార్యను చూద్దామంటే

వండ నలయదు వేవురు వచ్చిరేని
నన్నపూర్ణకు నుద్ది యౌనతనిగృహిణి
యతిథు లేతేర నడిరేయైనఁ బెట్టు
వలయుభోజ్యంబు లింట నవ్వారి గాఁగ

వండి వడ్డించడంలో అతిథులను తృప్తిపరచడంలో
అన్నపూర్ణకేమాత్రం తీసిపోదు. ఎంతమంది వచ్చినా
అపరాత్రి వచ్చినా విసుగుకొనక వంటి వడ్డించి వారిని
తృప్తి పరుస్తుంది ఆ యిల్లాలు.

మరి ఈ ప్రవరుడు ఇంకా ఎలాంటివాడంటే

తీర్థసంవాసు లేతెంచినా రని విన్న
         నెదురుగా నేఁగు దవ్వెంత యైన
నేఁగి తత్పదముల కెఱఁగి యింటికిఁ దెచ్చుఁ
         దెచ్చి సద్భక్తి నాతిథ్య మిచ్చు
నిచ్చి యిష్టాన్న సంతృప్తులఁగాఁ జేయుఁ
         జేసి కూర్చున్నచోఁ జేర వచ్చు
వచ్చి యిద్దరఁ గల్గువనధిపర్వతసరి
         త్తార్థమాహాత్మ్యముల్ దెలియ నడుగు
నడిగి యోజనపరిమాణ మరయు నరసి
పోవలయుఁ జూడ ననుచు నూర్పులు నిగుడ్చు
ననుదినము తీర్థసందర్శనాభిలాష
మాత్మ నుప్పొంగ నత్తరుణాగ్నిహోత్రి

ఈ పడుచుసోమయాజి ప్రతిరోజూ తీర్థయాత్రకు వెళ్ళాలని
మనసులో అనుకొంటుంటాడు అందుకే ఆ వూరికి ఎవరైనా
తీర్థయాత్రచేసి వచ్చినవారు అని తెలియగానే వారు ఎంత
దూరంలో ఉన్నా వారివద్దకు వెళ్ళి వారిని తన ఇంటికి
తీసుకువస్తాడు. తీసుకొచ్చి వారికి చక్కటి ఆతిథ్యమిస్తాడు
ఇచ్చి వారినుండి తీర్థయాత్రా విశేషాలనడిగి మరీమరీ
చెప్పించుకొంటాడు. చెప్పించుకొని తను వెళ్ళలేక పోతున్నానని
నిట్టూరుస్తాడు.
ఇలా జరుగుతూ ఉండగా
ఒకనాడు
తలకు పులితోలు టోపీగా పెట్టుకొన్నవాడు పంచలోహ
కడియమున్నచేతితో కకపాలము, యోగదండము
నిక్కి పట్టినవాడు, నడుముకు జింకతోలు పట్కాయు కట్టి,
మెడలో యోగపట్టెయు ఉన్నవాడు, పచ్చని శరీరీనికి విభూది
పూసుకొన్నవాడు, చెవులకు రుద్రాక్ష పోగులు ఊగుతుండగా
కావిచొక్కా తొడుక్కొని, కమండలం చేతబట్టుకొని వున్న
సిద్ధుడొకడు ప్రవరుని ఇంటికి వచ్చాడు.

Wednesday, September 13, 2017

పెద్దనగారి ప్రవరుడు - 1


పెద్దనగారి ప్రవరుడు - 1




సాహితీమిత్రులారా!



అల్లసాని పెద్దనగారి పేరు వినని తెలుగువారు
సాహితీప్రియులు ఉండరన్నది అతిశయోక్తికాదేమో
ఈయన శ్రీకృష్ణదేవరాయలవారి ఆస్థానంలోని
అష్టదిగ్గజాలలో మొదటివాడుకూడా
ఈయన మనుచరిత్రలో అదేనండీ
స్వారోచిషమనుసంభవము అనే ప్రబంధంలో
సృష్టించిన ప్రవరుని గురించి ఇక్కడ చూద్దాం-
ప్రవరుఁడు అంటే నిఘంటువులో శ్రేష్ఠుడు, మేటి అని ఉన్నాయి.
అందుకే ప్రవరుని గుణాలను చాల చక్కనైన శ్రేష్ఠమైన గుణాలు
కలవానిగా తీర్చిదిద్దాడు పెద్దనగారు. ఆ గుణాలను పెద్దనగారి
పద్యాలలోనే చూద్దామా....

వరుణానదీ తీరంలో అరుణాస్పందం అనే ఊరు అందులో
నివసించే బాపడు ప్రవరుడు.

ఆపురి బాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి భా
షాపరశేషభోగి వివిధాద్వర నిర్మల ధర్మకర్మ దీ
క్షాపరతంత్రుఁడంబురుహ గర్భకులాభరణమ బనారతా
ధ్యాపనతత్పరుండు ప్రవరాఖ్యుఁడలేఖ్య తనూవిలాసుఁడై
                                                                                                 (మనుచరిత్ర 1-51)
మన్మథునివలె, చంద్రునివలె, అందమైన
శరీరంకలవాడును, భాషలో రెండవ ఆదిశేషుడునూ అయి
సమస్త యాగాల్లోను, స్వచ్ఛమైన ధర్మకార్యాల్లోను,
దీక్ష ఆసక్తికలవాడు, బ్రాహ్మణజాతికి అలంకారమైనవాడు,
నిరంతరమూ వేదాధ్యయనమునందు ఆసక్తికలవాడు,
ప్రవరాఖ్యుడను పేరుకలవాడు ఆ పట్టణం(అరుణాస్పదాన్ని)
విడువక(ఎక్కడికీ వెళ్ళకుండా) ఉండేవాడు.

వానిచక్కఁదనము వైరాగ్యమునఁజేసి
కాంక్ష సేయుజారకామినులకు
భోగబాహ్య మయ్యెఁ బూచినసంపెంగ
పొలుపు మధురాంగనలకుఁబోలె  - 52

తుమ్మెద అన్ని పూవులమీదా వాలుతుంది
ఒక్క సంపెంగ పూవుపై తప్ప దానిపై వాలెనా
చచ్చి వూరుకుంటుంది. తుమ్మెదలకు సంపెంగ
పనికిరానట్లే ఎంత అందగాడైనా ప్రవరాఖ్యుడు
జారవృత్తి లేనందున ఆ ఊరిలోని జారకామినులకు
పనిరానివాడైనాడు.

యౌవనమందు యజ్వయు ధనాఢ్యుఁడు నై కమనీయ కౌతుక
శ్రీనిధిఁ గూకటుల్ గొలిచి చేసిన కూరిమి సోమిద్మ సౌ
భ్యావహ యై భజింప సఖులై తలిదండ్రులు గూడి దేవి యున్
దేవరబోలె నుండి యిలు దీర్పఁగఁ గాపుర మొప్పు వానికిన్

అతడు ధనవంతుడై, తనకు ఈడుజోడైన భార్య సేవలు
చేస్తుండగా పడుచుదనంలోనే యజ్ఞంచేసి తల్లిదండ్రులు
ఇంటిలో సుఖులై ఇంటిని సర్దుతుండగా కాపురం చేస్తూ
ఉండినాడు.

Monday, September 11, 2017

వివేకానందుని స్వస్వరం చికాగోలో మాట్లాడిన మాటలు


వివేకానందుని స్వస్వరం చికాగోలో మాట్లాడిన మాటలు




సాహితీమిత్రులారా!

1893 సెప్టెంబరు 11న చికాగోలో సర్వమత సమ్మేళనంలో
వివేకానందుడు ప్రసంగించి ప్రసంగం ఈ రోజు విందాము.



Sunday, September 10, 2017

విశ్వనాథవారి స్వరం


విశ్వనాథవారి స్వరం




సాహితీమిత్రులారా!

విశ్వనాథ సత్యనారాయణ గారి స్వరం వినండి


కవిసామ్రాట్టుని జయంతి శుభాకాంక్షలు


కవిసామ్రాట్టుని జయంతి శుభాకాంక్షలు




సాహితీమిత్రులకు
శ్రేయోభిలాషులకు
తెలుగులో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత
విశ్వనాథ సత్యనారాయణ గారి జన్మదిన శుభాకాంక్షలు
ఉక్తివైచిత్రికి నుపదయై త్రిథయై
                       భాషామతల్లికి బాసటాయె
సూక్తి సంపదకు ప్రస్తుతిపాత్రమై తెల్గు
                      తఱి తీపికిని సంస్థానమాయె
రక్తి గట్టిన కథారాజమ్ముగ సజీవ
                     పాత్రలకును తానె పాత్రమాయె
ముక్తిదాయిని యంచు ముదమార ప్రజలకు
                     దారి జూపగ మార్గదర్శియాయె
అట్టి కల్పక కావ్యంబు నాంధ్రులకిడి
హరిహరాద్వైత తత్వంబు నాంధ్రభూమి
పాదుకొల్పిన యట్టి యభ్యుదయవాది
మధుర హృదయుండు మన విశ్వనాథు కాడె
                                                                        - విశ్వనాథత్రిశతి

Saturday, September 9, 2017

వేయి పడగలు - ప్రసంగం


వేయి పడగలు - ప్రసంగం




సాహితీమిత్రులారా!

విశ్వనాథవారి వేయి పడగలు గురించిన
ప్రసంగవ్యాసం వినండి